కలగంటినే చెలీ-20

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సీ[/dropcap]త రోజూ ఆఫీసుకు వెళ్ళి వస్తోంది. చింటూని అనసూయమ్మ చూసుకుంటోంది. సూర్య మధ్యలో చాలా సార్లు సీతతో మాట్లాడదామని ట్రై చేస్తున్నాడు కానీ ఆమె రెస్పాండ్‌ అవడం లేదు. పోనీ ఇంటికెళ్ళి మాట్లాడదామంటే అనసూయమ్మ అనబోయే మాటలు ఊహించుకుని వెళ్ళబుద్ధి కావడం లేదు అతనికి. ఇలా.. ప్రస్తుతానికి ఎవరి జీవితాన్ని వాళ్ళు.. ఎడబాటు బాధని మనసులోనే దాచుకుని వెళ్ళబుచ్చుతున్నారు. కానీ కాలం ఊరుకోదు కదా.. అది రక రకాల సిచ్యుయేషన్స్‌ని క్రియేట్‌చేస్తుంది.

ఒక రోజు… ఆఫీసులో బుద్ధిగా పని చేసుకుంటుంది సీత.

“మేడం.. మీ కోసం ఎవరో విజిటర్‌ వచ్చారు” అని ఆఫీసు బోయ్‌ చెప్పడంతో పని పక్కన పెట్టి వచ్చింది. అక్కడెవరో అపరచిత వ్యక్తి. అతను సూర్య కొలీగ్‌ శేఖర్‌.

సీతను చూసి “నేను.. మీ ఆయన సూర్యకి కొలీగ్‌ని అండీ… మీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు.

“నాతోనా.. చెప్పండి” అంది ఆశ్చర్యపోతూ సీత.

“కొంచెం అలా కూర్చొని మాట్లాడుకుందామా” అన్నాడు శేఖర్‌.

“సరే..” అని కూర్చుంది సీత.

శేఖర్‌ చెప్పసాగాడు. “సీత గారూ.. నేనూ సూర్యా చాలా క్లోజ్‌గా ఉంటాము. అయితే ఈ మధ్య తెలిసిన విషయం చాలా బాధ కలిగించింది.” నెమ్మదిగా అన్నాడు.

“ఏంటా విషయం..”

“అదేనండీ.. ఆ రవి గాడికి గ్యారంటీ సంతకం పెడితే శాలరీ కటింగ్‌ వచ్చిందని.. ఇంకా మిమ్మల్ని వదిలేసాడని…” బాధగా అన్నాడు శేఖర్‌.

“ఇవన్నీ మీకెలా తెలుసు?” ఆశ్చర్యపోయింది సీత.

“ఆఫీసులో అందరూ చెప్పుకుంటున్నారండీ…”

“ఆహా… అలాగా.. ఇంకా ఏం చెప్పుకుంటున్నారు” ఆసక్తిగా అడిగింది.

“అదీ.. అదీ.. మీకు చెప్పొచ్చో లేదో…” సందిగ్ధంగా అన్నాడు శేఖర్‌.

“పర్వాలేదు చెప్పండి… నా గుండె బండబారిపోయింది” అంది.

“అదీ…అదీ.. సూర్య మిమ్మల్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి సిద్ధపడతున్నాడని… ఆ రోహిణితో జీవితాన్ని పంచుకోబోతున్నాడని….” చివ్వున లేచింది సీత.

“ప్లీజ్‌ స్టాప్‌… ఇంకేమీ చెప్పకండి” అని అరిచి లోనికి వెల్లిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు.

వచ్చిన పని సక్సెస్‌ అయినందుకు విషపూరితంగా నవ్వుకున్నాడు శేఖర్‌.

***

ఆఫీసు నుండి ఇంటికొచ్చిన సీత ముభావంగా ఉండటం అనసూయమ్మ గమనించింది. కానీ ఏమీ అడగలేదు. సమయం చూసి అడుగుదామని ఆగింది.

టీ కప్పు తీసుకుని సీత రూం లోకి వెళ్ళింది. “టీ తాగమ్మా..” అంది.

“ఇప్పుడు తాగనమ్మా.. కాసేపు నిద్రపోతాను” అంది సీత.

“సరే..” అని బయటకు వచ్చేసింది అనసూయమ్మ

డిన్నర్‌ టైముకి నిద్ర లేచింది సీత. బాగా ఏడ్చినట్టుగా కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. మొహం కడుక్కుని డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చింది. చింటూ అప్పటికే అన్నం తిని నిద్రలోకి జారుకున్నాడు.

అనసూయమ్మ “ఏమైందమ్మా…అలా ఉన్నావు..” బాధగా అడిగింది.

సీత చాలా సేపు మౌనంగా ఉంది. తర్వాత “ఆయన నాకు డైవర్స్‌ ఇస్తారటమ్మా.. వాళ్ళ ఆఫీసు వాళ్ళు చెప్పారు” నెమ్మదిగా చెప్పింది.

“ఓహో… అంతదాకా వచ్చిందా యవ్వారం.. పెళ్ళాన్ని పుట్టింటిలో వదిలేసి…ఇన్ని రోజులైనా వచ్చి తీసుకెళ్ళకుండా ఏకంగా వదిలించుకుందామని చూస్తున్నాడా..” కోపంగా అంది అనసూయమ్మ.

“ఏమోనమ్మా…ఆయనెందుకిలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు…” బాధగా అంది సీత.

“నువ్వెందుకమ్మా బాధ పడతావు.. చక్కగా జాబ్‌ చేసుకుంటున్నావు… ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు… అసలు నువ్వే ఇచ్చెయ్‌ డైవోర్స్‌.. పీడా వదిలిపోతుంది.. మేం లేమా నిన్ను చూసుకోవడానికి”

“ఏమోనమ్మా… నాకు భయంగా ఉంది..” బేలగా అంది సీత.

“నువ్వేం భయపడకమ్మా.. మేము ఉన్నాంగా…” అని నూరిపోసింది అనసూయమ్మ. సీత ఇక అన్నం తినలేక చేతులు కడిగేసుకుంది. రూములోకొచ్చి నిద్రపోతున్న చింటూ మొహం చూసి ఏడ్చేసింది. ఈ పరిస్థితిని ఎలా ఈదాలో ఆమెకి అర్థం కావడం లేదు. బెడ్‌ మీద వాలి నిద్రపోవడానికి ప్రయత్నించింది. రాత్రంతా అన్నీ పీడకలలు… ఎవరో వెంటబడి తరుముతున్నట్టు!!!

***

సీత ఆఫీసులో వర్క్‌ చేసుకుంటుండగా సెల్‌రింగ్‌అయింది. లిఫ్ట్‌చేసి “హలో” అంది.

“నేనమ్మా… మమ్మీని..” అని వినిపించింది అటునుండి.

“ఆ.. చెప్పు మమ్మీ..” అంది సీత.

“తమ్ముడు ఫోన్‌ చేసాడమ్మా… అర్జెంటుగా ఏభై వేలు కావాలంటూన్నాడు… కొంచెం చూడమ్మా..”

“ఎందుకమ్మా అంత డబ్బు వాడికి? అయినా ఇప్పుడు నా దగ్గర లేవు..”

“అలా అనకమ్మా.. ఏదో ప్రోబ్లెంలో ఉన్నాడాట…” బ్రతిమాలుతోంది.

సందిగ్ధంలో పడింది సీత. ఎంత కాదనుకున్నా ఇప్పుడు తను వాళ్ళింట్లోనే తల దాచుకుంటోంది.. పైగా వాడు తమ్ముడు…కాదనడానికి మనసులో ఏదో అడ్డుపడుతోంది.

“సరేనమ్మా.. వాడిని నాకు ఫోన్‌ చెయ్యమను.. నేను ఎడ్జస్ట్‌ చేస్తాను” అంది సీత.

“నా తల్లే.. నా తల్లే…” అంటూ మురిసిపోయింది అనసూయమ్మ. ఆ తర్వాత ఎన్నో సార్లు ఆ కష్టమనీ ఈ అవసరమనీ సీతను అడిగి డబ్బులు తీసుకుంది అనసూయమ్మ. కానీ చిత్రంగా ఆ అవసరాలన్నీ సుశీల్‌కు సంబంధించినవే అయుండేవి. సీత కూడా తన వాళ్ళే కదా అని ఎప్పటికప్పుడు సాయం చేస్తూ ఉండేది. తనకంటూ ఏమీ మిగుల్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.

ఇలా వాళ్ళ జీవితం సీత సహకారంతో హాయిగా సాగిపోతుండగా…

అనసూయమ్మకి పెద్ద చిక్కొచ్చి పడింది.

ఒక శుభముహూర్తాన సుశీల్‌ ఎవరో అమ్మాయిని లేపుకుని హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. అనసూయమ్మ మొదట కంగారు పడింది. కానీ ఆ అమ్మాయి బాగా రిచ్‌ అని తెలియడంతో చల్లబడింది. ఆ అమ్మాయి పేరు స్వప్న. కొంచెం అమాయకురాలు. అందుకే సుశీల్‌ వలలో ఈజీగా పడింది. ఇంకో విషయం ఏంటంటే సుశీల్‌ ఆమెని ఆర్య సమాజ్‌లో ఆల్రెడీ పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. ఇక కాదని చెప్పడానికి కారణం కనబడలేదు అనసూయమ్మ దంపతులకు. తల్లిదండ్రులు అంగీకరించడంతో ఫుల్‌ హేపీగా ఫీల్‌ అయ్యాడు సుశీల్‌.

అనసూయమ్మ సుశీల్‌ని పక్కకు పిలిచి “పెళ్ళికి అంత తొందరేమొచ్చిందిరా.. అమ్మాయిని లేపుకు మరీ తీసుకొచ్చావు” అని ఆరా తీసింది. సుశీల్‌ మొదట కొంచెం తటపటాయించాడు. తర్వాత నెమ్మదిగా “ఆ అమ్మాయికి నెల తప్పిందమ్మా.. అబార్షన్‌ వద్దంది… ఇక తప్పలేదు” అని చెప్పాడు.

“ఓరి వెధవ… ఎంత పని చేసావురా” అని చెడా మడా తిట్టిపోసింది. ఆయాసం తగ్గాక “సరే.. అయిందేదో అయింది.. నోర్మూసుకుని గుట్టుగా ఉండు… ఆ అమ్మాయి తరపు వాళ్ళొస్తే మేము చూసుకుంటాము” అంది.

“చాలా థేంక్స్‌ అమ్మా..” అని తల్లిని కౌగిలించుకున్నాడు సుశీల్‌.

అప్పటిదాకా సీత కు ఇచ్చిన రూము, సుశీల్‌కి అతని భార్యకి ఇవ్వబడింది. వెనక వైపు స్టోర్‌ రూము పక్కనున్న చిన్న రూము సీతకు, చింటూకి కేటాయించబడింది.

సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికొచ్చిన సీత ఈ మార్పులన్నీ చూసి షాక్‌ అయింది.” అమ్మా.. ఎవరమ్మా ఆ కొత్త అమ్మాయి.. నా రూమెందుకు వాళ్ళకిచ్చావు” అ ని ప్రశ్నించింది తల్లిని

“అయ్యో రామా… ఆ అమ్మాయి నీ మరదలు.. స్వప్న. సుశీల్‌ పెళ్ళి చేసుకుని తీసుకొచ్చాడమ్మా..” అంది అనసూయమ్మ. విపరీతంగా ఆశ్చర్యపోయింది సీత. “అదేంటమ్మా.. మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా చేసుకున్నాడమ్మా పెళ్ళి?”

“అబ్బ..అవన్నీ నేనూ అడిగానమ్మా… నీకు వివరంగా తర్వాత చెబుతాను… కొంచెం సర్దుకుపో” అని సీత నోరు మూయించింది.

‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే కదా ‘ అనుకుని సీత మౌనంగా ఉండిపోయింది. ఎందుకో ఆమెకు సూర్య గుర్తుకు వచ్చాడు. ఆ రాత్రి కూడా సీతకి సరిగ్గా నిద్రపట్టలేదు, కొత్త రూము.. పైగా దోమలు.. అవి కాక సూర్య గురించి ఆలోచనలు!!

***

సీత ఆఫీసులో పని చేసుకుంటూ ఉంది… కానీ ఆలోచనలు జోరీగల్లా చుట్టుముడుతున్నాయి. ఆమెకు తన ప్రస్తుత పరిస్థితి నచ్చడం లేదు. తల్లిదండ్రుల మాట విని సూర్యను వదిలి వచ్చేసింది. అతను అహానికి పోయి తన దగ్గరకు రావడం మానేసాడు. పోనీ తను అతని దగ్గరికి వెళదాం అంటే… అది మరింత చులకన భావానికి దారి తియ్యొచ్చు. లేదా సూర్యను మరింత బాధ్యతా రహితంగా తయారు చెయ్యవచ్చు. ‘తన ఇల్లు వదులుకొని పుట్టింటికి వచ్చి తప్పు చేసానా’ అన్న ఫీలింగ్‌ కలిగింది సీతకు ఆ క్షణంలో. పోనీ మొగుడిని కాదనుకుని వచ్చినందుకు పుట్టింట్లో పెద్ద గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. కొత్త కోడలు వచ్చిన ఆనందంతో తల్లి తనని, చింటూని స్టోర్‌రూములోకి తోసేసింది. కేవలం డబ్బు ఇచ్చే యంత్రంలా తనని వాడుకుంటుంది. అన్నీ తనకు అర్థం అవుతున్నాయి, కానీ ఈ సమస్యల్లోంచి బయటపడడం ఎలా? ఇప్పుడు తల్లిదండ్రులను కూడా కాదనుకొని ఎక్కడకు పోవాలి ?…ఎన్నో ప్రశ్నలు !! ఆలోచించి… ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.

ఆఫీసు అవగానే… అక్కడికి వెళ్ళింది. విశాలమైన వర్కింగ్‌ విమెన్‌ హాస్టల్‌ అది. చూడటానికి శుభ్రంగా ఉంది. స్టేఫ్‌ కూడా మంచిగానే అనిపించారు. అక్కడి మేనేజర్‌ సీతను చూడగానే” రండి మేడం…చెప్పండి” అంది.

“ఈ హాస్టల్‌‌లో జాయిన్‌ అవుదామని అనుకుంటున్నాను… ఫీజు వగైరా వివరాలు చెప్పండి” అంది.

ఆ మేనేజర్‌ అన్ని వివరాలు చెప్పింది. సీత “ఓకే అండీ..” అని చెప్పి కొంచెం ఎడ్వాన్స్‌ పే చేసింది. “రేపు వచ్చి చేరతానండీ” అని చెప్పింది.

“మీరు ఎప్పుడైనా రావచ్చు మేడం” అంది మేనేజర్‌. చాలా రిలీఫ్‌గా అనిపించింది సీతకు.

ఇంటికి వచ్చేటప్పటికి చింటూ ఇంట్లో లేడు. హేండ్‌బేగ్‌ పక్కన పడేసి –

“అమ్మా… చింటూ ఏడి?” తల్లిని అడిగింది.

“ఏమోనమ్మా… నాకు తెలీదు” అంది అనసూయమ్మ

కాసేపటికి చింటూ బయటనుండి వచ్చాడు. వాడి చేతిలో సిగరెట్‌ పేకెట్‌. సీత అనుమానంగా “ఏరా. ఎక్కడికి వెళ్ళావు” అని అడిగింది.

“మామయ్య షాప్‌ నుండి సిగరెట్లు తెమ్మన్నాడమ్మా… అందుకే వెళ్ళాను” అని చెప్పాడు చింటూ.

కోపం నషాళానికి అంటింది సీతకు. వాడికి రెండు దెబ్బలు వేసింది. ఏడుపు లంకించుకున్నాడు చింటూ.

“అమ్మా..” అని గట్టిగా అరిచింది. అనసూయమ్మ గబ గబా వచ్చి “ఏమైందమ్మా…అలా అరిచావు?” అంది

“ఏంటమ్మా ఇది.. నా కొడుకుకి ఇలాంటి పనులు చెబుతారా? సిగరెట్ల కోసం షాప్‌కి వెళ్ళే వయసా వాడిది” అని ఏడుపు మొహం పెట్టింది.

“పోనీలేమ్మా.. తమ్ముడే కదా పంపింది…ఊరుకో”

“ఎందుకు ఊరుకోవాలమ్మా.. తమ్ముడు నా కొడుకుని పనోడిలా చూస్తున్నాడా… అదీ నీ కోడలి ముందు” అసహనంగా అంది సీత.

సుశీల్‌ రూములోనుండి బయటకొచ్చి సిగరెట్‌ పేకేట్‌ తీసుకుని “అక్కా.. ఏంటీ నూసెన్స్” అని విసుక్కుంటూ తన బెడ్రూములోకి వెళ్ళిపోయాడు.

సుశీల్‌ మీద ఈగ వాలనివ్వదు అనసూయమ్మ. అందుకే “అందులో తప్పేముందమ్మా… కొత్త పెళ్ళికొడుకు… భార్యతో సరదాగా గడుపుతున్నాడు.. ఏదో అవసరం పడి ఇంటి పక్క పాన్‌షాప్‌కి చింటూని పంపించాడు.. ఇప్పుడేమైంది.. అయినా నీకు మొగుడు దగ్గర లేడని.. ఆ సుఖం లేదని… అందరూ అలాగే ఉండాలని అనుకుంటున్నావా?” అంది వ్యంగ్యంగా.

దెబ్బ తిన్న పక్షిలా విలవిల్లాడిపోయింది సీత. కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. అనసూయమ్మ అసలు రూపం అర్థమైంది. ‘తన కొడుకేమీ అనాథ కాదు.. వీళ్ళ దయా దాక్షిణ్యాల మీద బ్రతకడానికి’ అనుకొంది. ఇంకొక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండాలనిపించక ఉన్న బట్టలు, వస్తువులు సర్దుకుని చింటూతో పాటూ బయటకు వచ్చేసింది. అనసూయమ్మ ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. పైగా వచ్చేస్తుంటే వెనకనుండి “వెళ్ళవే.. వెళ్ళు… మమ్మల్ని కాదనుకొని ఎక్కడికి పోతావు… ఆ పల్లెటూరి బైతు గాడితో పడలేక తిరిగి మా కాళ్ళదగ్గరకే వస్తావు” అంటూ గట్టిగా అరిచింది. ఆమె తండ్రి టీవీ చూడ్డంలో బిజీగా ఉన్నాడు. ఆపడానికి ప్రయత్నించలేదు.

‘చావనైనా చస్తాను…కానీ తిరిగి మీ దగ్గరకు రాను’ అని గట్టిగా మనసులో అనుకుని రోడ్డు మీద అటుగా వస్తున్న ఆటో ఎక్కి ఎడ్రస్‌ చెప్పి “పోనీ” అంది సీత… ఎప్పుడో గీత దాటేసిన మన సీత!!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here