నా జీవన గమనంలో…!-45

45
4

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

133

[dropcap]ఆం[/dropcap]ధ్రా బ్యాంకు విశాఖపట్టణం జోనల్ మేనేజర్ శ్రీ జి. వెంకటేశ్వరరావు గారు పదోన్నతిపై ప్రధాన కార్యాలయం, హైదరాబాద్‌కు; రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ వై. భాస్కరరావు గారు పదోన్నతిపై ప్రధాన కార్యాలయం, హైదరాబాదుకు బదిలీ అవ్వడం జరిగింది. అప్పుడే బదిలీపై వచ్చిన శ్రీ పి. రామకోటయ్య గారు రాజమండ్రి రీజినల్ మేనేజర్‍గా పదవీ బాధ్యతలను చేపట్టారు.

ఆ సందర్భంగా శ్రీ జి. వెంకటేశ్వరరావు గారికి, శ్రీ వై. భాస్కరరావు గారికి వీడ్కోలు చెప్పేందుకు; శ్రీ పి. రామకోటయ్య గారికి స్వాగతం పలికేందుకు, రాజమండ్రి రీజియన్‍లో పని చేసే సిబ్బంది అందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో నేను కూడా ప్రసంగించడం జరిగింది.

ఆ సభలో వేదికపై… ఎడమ నుండి కుడికి… రచయిత, శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారు, శ్రీ వై. భాస్కరరావు గారు మరియు శ్రీ పి. రామకోటయ్య గారు

***

ఆ రోజు హైదరాబాద్, ప్రధాన కార్యాలయం నుండి నాకొక ఉత్తరం వచ్చింది. పదోన్నతి కోసం హైదరాబాదులో మరో రెండు రోజుల్లో జరగబోయే ఇంటర్వ్యూకి రావలసిందిగా నాకు ఆదేశాలు అందాయి. సమయం తక్కువగా ఉన్నందువల్ల, ఇంటర్వ్యూకి పెద్దగా తయారు కాలేకపోయాను. అయినా సరే, పదోన్నతికి తప్పక ఎంపిక అవుతాననే నమ్మకంతో హైదరాబాద్ చేరుకున్నాను.

***

మొత్తానికి ఇంటర్వ్యూ బాగానే చేశాననిపించింది. ఆ రాత్రికే పదోన్నతి కోసం ఎంపిక చేయబడిన వారి జాబితాను నోటీసు బోర్డులో ఉంచడం జరిగింది. ఆ జాబితాలో నా పేరు కూడా వుందని మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. నా ఆనందానికి అవధులు లేవు.

మిడిల్ మేనేజ్‌మెంట్ స్కేల్ 3 (యమ్.యమ్.-III) నుండి సీనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్ 4 (యస్.యమ్. IV) గా పదోన్నతి పొందాను. నేను తప్పకుండా ఎంపిక అవుతాననే నా నమ్మకం వమ్ము కానందుకు చాలా సంతోషించాను. మనసులోనే ఆ దేవుణ్ణి స్మరించుకున్నాను.

***

రాజమండ్రికి తిరిగి వస్తూ, మధ్యలో గుంటూరులో ఒక రోజు ఉండి, పదోన్నతి లభించిన విషయాన్ని మా వాళ్ళందరికీ చెప్పి, నా ఆనందాన్ని వారితో పంచుకున్నాను. అప్పటికే మా ఇంటి పై మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయింది. కాబట్టి, కిందా పైనా వున్న రెండు ఇళ్ళను అద్దెకు ఇచ్చి, అందరం కలిసి ఇకపై ఒకే చోట కలిసే వుందామని నిర్ణయించుకున్నాను. అది ఎక్కడా అనేది అతి త్వరలో రాబోయే ఉత్తర్వుల ద్వారా తెలుస్తుంది.

తిరిగి రాజమండ్రి చేరుకున్న నన్ను, మా సిబ్బంది మరియు ఆంధ్రా బ్యాంకు సిబ్బంది మనస్ఫూర్తిగా అభినందించారు.

అప్పుడే ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం, హైదరాబాదు నుండి నాకు ఉత్తర్వులు అందాయి. నాకు పదోన్నతి కల్పిస్తూ కరీంనగర్ మెయిన్ బ్రాంచికి చీఫ్ మేనేజర్‍గా నియమించబడినట్లు తెలియజేశారు.

వెంటనే, ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ, రాజమండ్రిలో రిలీవ్ అయి కరీంనగర్‌కు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్నాను.

134

రైలు మార్గంలో రాజమండ్రి నుండి వరంగల్ చేరుకున్నాను. అక్కడి నుండి కరీంనగర్‌కు రైలు మార్గం లేనందున బస్సులో ప్రయాణం చేశాను. కరీంనగర్‍కు మరికొంతసేపటిలో చేరుకుంటామనంగా, ఎడమ వైపు తిరిగి చూస్తే, ఒక పెద్ద ఆనకట్ట కనిపించింది. ‘లోయర్ మానేర్ డామ్’ అని ఆంగ్లంలో పెద్ద అక్షరాలతో వ్రాయబడి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఆ ఆనకట్ట గురించి నాకు ఇంతకు ముందే కొంతవరకు తెలుసు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం ఒక గొప్ప అనుభూతి.

కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, అలుగునూరు గ్రామం వద్ద, మానేరు నదిపై ఈ డామ్ నిర్మించబడింది. 1974 సంవత్సరంలో మొదలుపెట్టిన నిర్మాణం పనులు 1985 సంవత్సరంలో పూర్తయ్యాయి.

హైదరాబాదుకు 163 కిలోమీటర్లు, కరీంనగర్‍కి 4 – 5 కిలోమీటర్ల దూరంలో ఈ డామ్ వుంది.

ఈ డామ్ యొక్క పరివాహక ప్రాంతం సుమారు 6,464 చదరపు కిలోమీటర్లు… (2496 చదరపు మైళ్ళు) పర్యంతం విస్తరించబడి వుంది. ఈ డామ్‌కు 20 ఫ్లడ్ గేట్లు వున్నాయి.  ఈ డామ్‌ ఇన్‍ఫ్లో 23 వేల క్యూసెక్కులు కాగా అవుట్‍ఫ్లో 6వేల క్యూసెక్కులు. ఈ డామ్ నిల్వ సామర్థ్యం సుమారు 680,137,000 క్యూబిక్ మీటర్లు. అంటే దాదాపు 24 టి.యమ్.సి.లు. ఈ డామ్ ద్వారా దాదాపు 1,63,000 హెక్టార్లు… అంటే 5,65,452 ఎకరాలు… సాగు చేయబడుతున్నాయి.

ఈ డామ్ కరీంనగర్ జిల్లాకే తలమానికంగా వుంది. ఆ జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుంది. ఇంకా చెప్పాలంటే… ఈ డామ్ కరీంనగర్, వరంగల్ పట్టణాలలో నివసించే ప్రజల తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది. ఇదొక అందమైన పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

***

మరి కాసేపట్లో కరీంనగర్ చేరుకున్న తరువాత, హోటల్‍లో దిగి, ఫ్రెష్‍గా తయారై, మెయిన్ బ్రాంచ్‍కి వెళ్ళి నా విధుల్లో చేరాను.

కరీంనగర్ పట్టణ మెయిన్ రోడ్‍లో, ఒక విశాలమైన భవనంలో బ్రాంచ్ వుంది. సుమారు పదిహేను మంది దాకా సిబ్బంది తమ తమ పనుల్లో తలమునకలై వున్నారు. సబ్ మేనేజర్ గారు తోడ్కొనిరాగా నా క్యాబిన్‍లో కూర్చున్నాను. ప్రస్తుతానికి బ్రాంచ్ ప్రొఫైల్ మరియు ఇన్‍స్పెక్షన్ రిపోర్టు ఫైల్స్ తెప్పించుకుని క్షుణ్ణంగా చదువుతూ ఆ బ్రాంచ్ వ్యాపారంపై, స్థితిగతులపైన మంచి అవగాహన పెంచుకుని ఒక అంచనాకు రాగలిగాను.

సాయంత్రం సిబ్బందితో కలిసి పరస్పర పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నాను. అతి తక్కువ సమయంలోనే వారందరితో కలిసిపోగలిగాను, వారి మనసులకు చేరువ కాగలిగాను. ఆ తరువాత, కరీంనగర్ రీజినల్ ఆఫీసుకు వెళ్ళి, రీజినల్ మేనేజర్ శ్రీ సురేంద్ర రెడ్ది గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నాను.

ఇక సురేంద్ర రెడ్ది గారిని గురించి చెప్పాలంటే, వారు కూడా మొదట బ్యాంకులో గ్రామీణాభివృద్ధి అధికారిగా, నాకంటే మూడు సంవత్సరాల ముందే చేరారు. అంతకు పూర్వం, ప్రభుత్వ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేసేవారు. నేను మహబూబాబాద్ మేనేజర్‍గా పని చేసేడప్పుడు, వారు వరంగల్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్‍గా వుండేవారు. చాలా మంచి వ్యక్తి. గురుతుల్యులు కూడా. అత్యంత సమర్థవంతమైన మేనేజర్‍గా గుర్తింపు పొందారు.

135

కరీంనగర్ బ్రాంచ్‍లో రోజువారీ లావాదేవీలు ఒక ప్రవాహంలా సాగిపోతుంటాయి. ఖాతాదారుల రాకపోకలతో బ్రాంచ్ ఎప్పుడూ సందడిగా వుంటుంది. సిబ్బంది అందరూ క్షణం తీరికలేకుండా పని చేస్తూ వారి విధి నిర్వహణలో నిమగ్నమై వుంటారు. బ్రాంచ్‌కి వచ్చిపోయే ఖాతాదారులను పరిశీలిస్తే, అందరూ బాగా చదువుకున్నవారిలా కనబడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఖాతాదారులు బహుతక్కువ. ఎందుకంటే, కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ శాఖలు మరియు ఇతర చిన్న పట్టణ శాఖల ద్వారా ఆయా గ్రామాల్లో నివసించే ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాలు ఎక్కడికక్కడే కల్పించబడుతున్నాయి.

ఇక కరీంనగర్ శాఖ ద్వారా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్థులకు – చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు, వృత్తి విద్యా నిపుణులకు, ఇతర వ్యక్తిగత అవసరాల నిమిత్తం విరివిగా అప్పులు ఇవ్వబడుతున్నాయి. మదుపుదారులు అధిక మొత్తాల్లోనే వివిధ పొదుపు ఖాతాల్లో దాచుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరు మరియు అప్పులు తీసుకున్నవారిలో కొందరు, స్వయంగా నా క్యాబిన్‍లోకి వచ్చి తమను తాము నాకు పరిచయం చేసుకుంటున్నారు. సాయంత్రం సమయాల్లో మా ఆఫీసు సిబ్బందిలో ఎవరో ఒకరు తోడు రాగా, కొంతమంది పొదుపుదారులను, ఋణగ్రహీతలను, వ్యక్తిగతంగా కలుసుకుంటూ, వారి యూనిట్లను సందర్శిస్తూ, వారితో నా పరిచయాలు పెంచుకుంటున్నాను.

ఇక ఇంటి కోసం ప్రయత్నాలు మొదలు పెడదామనుకుంటున్న సమయంలో, నాకంటే ముందు పని చేసిన మేనేజరుగారు ఉన్న ఇంటి యజమాని నా వద్దకు వచ్చి, ఆ ఇంటినే అద్దెకు తీసుకొనమని నన్ను కోరారు. వెళ్ళి ఆ ఇంటిని చూశాను. చాలా సౌకర్యవంతంగా వుంది.  ఆ ఇంట్లోనే వుండేందుకు నిర్ణయించుకున్నాను.

ఇప్పటి వరకు కరీంనగర్ శాఖ అధిపతిగా యమ్.యమ్.-III అధికారి వుండేవారు. ఇప్పుడు ఆ శాఖ స్థాయి పెరగడం వలన, యస్.యమ్. IV స్థాయి అధికారిని శాఖాధిపతిగా నియమించారు. అందుకే యస్.యమ్. IV స్థాయి అధికారిగా పదోన్నతి పొందిన నన్ను ఈ శాఖకు చీఫ్ మేనేజర్‍గా నియమించారు. చీఫ్ మేనేజర్ ప్రయాణ సౌకర్యార్థం కారును, డ్రైవరును బ్యాంకే సమకూరుస్తుంది. ఆ క్రమంలో ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ నుండి ఒక అంబాసిడర్ కారు వచ్చింది. మా శాఖలోనే అనిత్యమైన ఖాళీలో అటెండర్‍గా పని చేస్తున్న శ్రీ మొహమ్మద్ పాషాకు కారు నడపడం వచ్చు. తనకు ఏ రిమార్కులు లేని లైట్ మోటార్ వెహికల్ (యస్.యల్.వి.) డ్రైవింగ్ లైసెన్సు కూడా వుంది. ట్రయల్‍గా ఊర్లోనే రద్దీ రోడ్లపై, తన డ్రైవింగ్‍లో ఐదారు కిలోమీటర్లు తిరిగాను. పరవాలేదనిపించాడు. తననే డ్రైవరుగా నియమించుకున్నాను.

136

జాయినింగ్ టైమ్‍లో గుంటూరు వచ్చాను. మా అబ్బాయి చదువుకున్న హిందూ కళాశాల నుండి, మా అమ్మాయి చదువుకున్న సెయింట్ జాన్స్ కాన్వెంటు స్కూలు నుండి, బదిలీ మరియు అక్కడ చదువుకున్నట్లు తెలియజేసే ధ్రువపత్రాలను తీసుకున్నాను.

మా ఇంటి క్రింది మరియు పై అంతస్తులను తెలిసినవారికి అద్దెకు ఇచ్చాము. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులలో చాలామందిని కలిసి కరీంనగర్ వెళ్తున్నట్లు తెలియజేశాము. ఇంటి సామానులన్నింటిని సర్దించి ఒక లారీలో కరీంనగర్‍లో అద్దెకు తీసుకున్న ఇంటికి చేర్పించాము. ఆ ఇంట్లో సామాన్లనన్నింటిని చక్కగా సర్దించి, అవసరమైన నిత్యావసర సరుకులను సమకూర్చాను.

మా అబ్బాయిని కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో బి.యస్.సి. (ఎలెక్ట్రానిక్స్) మొదటి సంవత్సరంలో చేర్పించాము. మా అమ్మాయిని జ్యోతి కాన్వెంటులో ఎనిమిదవ తరగతిలో చేర్పించాము.

***

ఇక బ్యాంకు పనులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నాను. బ్రాంచిలో పని చేస్తున్న సిబ్బంది అందరూ కష్టపడి పనిచేయడమే కాక, ఖాతాదారులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. తరచూ జరిగే సిబ్బంది సమావేశాల్లో వివిధ పద్దుల క్రింద నిర్ధారించబడిన లక్ష్యాల గురించి అవగాహన కల్పిస్తూ, వారందరినీ లక్ష్యాల సాధనలో భాగస్వాములుగా అయ్యేందుకు సంసిద్ధులుగా చేశాను. ఇక, లక్ష్యాలను అధిగమించడం కష్టమే అయినా, అసాధ్యం కాదనిపిస్తుంది. ఎందుకంటే… అందరం కలిసికట్టుగా శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు కదా!

రోజులు సాఫీగానే నడుస్తున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లే జరుగుతున్నాయి.

137

కరీంనగర్ బ్రాంచ్ ద్వారా చామనపల్లి గ్రామంలో పట్టు పరిశ్రమలను స్థాపించేందుకు కొంతమంది యువ రైతులకు ఒక సంవత్సరం క్రితం ఋణాలు ఇవ్వడం జరిగింది. ఒక రోజు ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి, పట్టు పరిశ్రమను నడపడంలో వారు అవలంబిస్తున్న పద్ధతులను గమనించాను. మల్బరీ తోటల సాగు, పట్టు పురుగులు గ్రుడ్లు పెట్టడం, ఆ గ్రుడ్లు లార్వాలుగా మారడం, అవి మల్బరీ ఆకులు తింటూ ప్యూపా దశకు చేరుకోవడం, ఆ ప్యూపాలు వాటి నోటి నుండి జాలువారే సన్నని దారపు పోగుల వంటి ద్రవ పదార్థంతో తమ చుట్టూ గూళ్ళు కట్టుకోవడం గురించి తెలుసుకున్నాను. ఆ గూళ్ళను ‘కకూన్’లు అని అంటారు. కకూన్‌లలో పూర్తిగా తయారైన పట్టు పురుగులు కకూన్‍లను చీల్చుకుని బయటికి వస్తాయి. అప్పుడు కకూన్‍ల రూపంలో వున్న పట్టుదారం విచ్ఛిన్నమైపోయి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అందుకే కకూన్‍లను చీల్చుకుని పట్టు పురుగులు బయటకు రాకముందే, ఆ కకూన్‍లను వేడి నీళ్ళలో వుడికించి పట్టు దారాన్ని విడదీస్తారు. అదే మనకు కావలసిన పట్టు దారం. మొత్తం క్రమంలో అడుగడుగునా అత్యంత జాగ్రత్త అవసరం.

ఆ రైతులందరికీ పట్టు పరిశ్రమ నడపడంలో మెళకువలను తెలియజేసి, అందులో వారి నైపుణ్యాన్ని పెంచగలిగితే, పట్టు దిగుబడిని గణనీయంగా పెంచుకోవచ్చు. తద్వారా వారి ఆర్థిక పురోగతికి మరింతగా దోహదపడవచ్చు.

ఆ ఆలోచనతో, కరీంనగర్ లోని ప్రభుత్వ పట్టు పరిశ్రమ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులను కలిసి, చామనపల్లి గ్రామంలో పట్టు పరిశ్రమ నడుపుతున్న రైతులకు ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేసేందుకు సహకరించవలసిందిగా కోరాను. వారు వెంటనే సానుకూలంగా స్పందించారు.

ఒకరోజు ఉదయాన్నే పట్టు పరిశ్రమ శాఖలో అందుబాటులో వున్న శిక్షకులతో చామనపల్లి గ్రామాన్ని చేరుకుని, రైతుల క్షేత్రాలను, యూనిట్లను సందర్శించి పరిశీలించడం జరిగింది. ఆ తరువాత అక్కడే ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి, రైతులకు ఆధునిక పద్ధతులతో పట్టు దారాన్ని పొందడంపై పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఆ శిక్షణా శిబిరంలో వేదికపై… ఎడమ నుండి కుడికి… ప్రభుత్వ పట్టు పరిశ్రమల శాఖ అధికారి, మరొక ప్రభుత్వ పట్టు పరిశ్రమల శాఖ అధికారి, ప్రసంగిస్తున్న రచయిత మరియు చామనపల్లి గ్రామ సర్పంచ్

ఆ శిక్షణలో భాగంగా ఆ రైతులందరితో కలిసి కరీంనగర్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో విజయవంతంగా నడపబడుతున్న పట్టు పరిశ్రమల యూనిట్లను సందర్శించాము.

విజయవంతంగా నడపబడుతున్న పట్టు పరిశ్రమల యూనిట్లను సందర్శించడానికి బయలుదేరిన వాహనము, పట్టు పరిశ్రమలను స్థాపించిన చామనపల్లి గ్రామ యువ రైతులు, ప్రభుత్వ పట్టు పరిశ్రమల శాఖ అధికారులు మరియు రచయిత
విజయవంతంగా నడపబడుతున్న ఒక పట్టు పరిశ్రమ యూనిట్‍ను పరిశీలిస్తున్న చామనపల్లి గ్రామ యువ రైతులు, ప్రభుత్వ పట్టు పరిశ్రమల శాఖ అధికారి, రచయిత మరియు యూనిట్ యజమాని (రైతు)

ఆ యూనిట్లను పత్యక్షంగా చూసిన చామనపల్లి గ్రామ యువ రైతులు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు. శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న మెళకువలను, ఇతర వినూత్న పద్ధతులను వినియోగించుకుని, అధికంగా పట్టు ఉత్పత్తి చేసుకుని, ఆర్థికంగా మరింత లబ్ధిని పొందాలనే నిర్ణయానికి వచ్చారు వారంతా.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here