[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
విశ్వనాథుని సేవలో విశ్వవిద్యాలయం:
[dropcap]బె[/dropcap]నారస్ హిందూ విశ్వవిద్యాలయం అతి పురాతనం. మదన మోహన మాలవ్యా దూరదృష్టితో 1916లో ఈ విద్యాసంస్థ ఆరంభించబడింది. ధర్భంగా మహారాజైన వనరాస ప్రభు నారాయణసింగ్, రామోశ్వర్ సింగ్, అనిబిసెంటుల ప్రోత్సాహంతో సెంట్రల్ హిందూ కళాశాల రూపుదిద్దుకుంది. 1300 ఎకరాల విస్తీర్ణంలో దీని మెయిన్ క్యాంపస్ విస్తరిల్లి 30 వేలమంది విద్యార్థులకు వసతి గృహాలు కల్పించి ఆసియాలోనే అతి పెద్ద వసతి సముదాయ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ప్రస్తుతం 140 విభాగాలలో విద్యాబోధన నెరపుతున్నారు. 48 దేశాల నుండి వచ్చిన విద్యార్థుల కోసం 75 వసతి గృహాలున్నాయి. 2015-16లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిపారు.
ఈ విశ్వవిద్యాలయానికి భారత రాష్ట్రపతి ‘విజిటర్’. ఛాన్సలర్‌ని ‘యూనివర్శిటీ కోర్టు’ సభ్యులు ఎన్నుకుంటారు. ఉపకులపతిని రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్ట్స్ ఫ్యాకల్టీలో వివిధ భాషావిభాగాలు బోధన చేస్తారు. అందులో తెలుగు ఒకటి. రాజ్ బహదూర్ సర్ సుందరలాల్ తొలి వి.సి. (1916-18). మదనమోహన్ మాలవ్యా 1919 నవంబరు నుండి 1938 సెప్టెంబరు వరకు దాదాపు రెండు దశాబ్దాలు దిశానిర్దేశం చేశారు. ఇద్దరు తెలుగు వారు ఈ ప్రతిష్ఠాత్మక పదవిలో వరుసగా వున్నారు. వై.సి.సిహాద్రి (1998-2002), వెంటనే పచ్చా రామచంద్రరావు(2002-2005). ప్రస్తుతం వి.కె.శుక్లా అధినేత(2021 నుండి).
తెలుగు విభాగం:
ప్రస్తుతం ఈ విభాగంలో ఆచార్య భమిడిపాటి విశ్వనాధ్, ఆచార్య చల్లా యస్. రామచంద్రమూర్తి, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, ఆచార్య భారతుల శారదసుందరి పని చేస్తున్నారు. కాశీ విశ్వవిద్యాలయం అనగానే ప్రాతః స్మరణీయులు బయ్యా సూర్యనారాయణ, వారి సతీమణి రత్నావళి గుర్తుకొస్తారు. కొంత కాలానికి జి. త్రివిక్రమయ్య చేరి పదవీ విరమణ చేశారు.
తులనాత్మక అధ్యయనము, అనువాదాలు, పరిశోధనలు, జాతీయోద్యమ సాహిత్యము, రెండో భాషగా తెలుగు బోధన – ఈ విభాగం పని. బి.ఏ, ఎం.ఏ, పి.హెచ్.డి, డిప్లొమా కోర్సులు నడుపుతున్నారు. 1960లో తొలిసారిగా తెలుగు ఉపన్యాసకుడుగా బయ్యా సూర్యనారాయణ నియమించబడ్డారు. బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ భాషల విభాగం ఏర్పడింది. సూర్యనారాయణ పలాసకు చెందినవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, పి.హెచ్.డి. చేశారు. 1985లో పదవీ విరమణ చేశారు. తెలుగు శాఖకు ఆయన మూలస్తంభం. ప్రస్తుత శాఖాధ్యక్షులు శారదసుందరి నాగార్జునలో గంగప్పగారి పర్యవేక్షణలో పి.హెచ్.డి చేశారు. 2021 డిసెంబర్ ఆఖరున రిటైరవుతున్నారు. ఆమె 1998లో తెలుగు ఉపన్యాసకురాలుగా చేరారు.
1960లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భారతీయ భాషల విభాగం ప్రారంభించారు. 1968లో డా. బయ్యా వెంకట సూర్యనారాయణ తెలుగులో రీడర్‌గా వుండగా భారతీయ భాషావిభాగాల తొలి శాఖాధిపతి అయ్యారు. 1978లో ఎం.ఏ, పి.హెచ్.డి, రెండేళ్ల డిగ్రీ, డిప్లొమా కోర్సులు తెలుగులో ఆరంభించారు. 1983లో తెలుగు శాఖ ప్రత్యేకంగా ఏర్పరచారు.
దిగ్దంతులైన అధ్యాపకులు:
తెలుగు శాఖలో సూర్యనారాయణ, వారి సతీమణి రత్నావళి, జోస్యుల సూర్యప్రకాశరావు నియమితులయ్యారు. అనువాదకళను ఈ శాఖ ప్రోత్సహించింది. ఇతర భారతీయ భాషా విభాగాలకు కూడా తెలుగు శాఖను నోడల్ డిపార్డుమెంటు చేశారు. ఎందరో ప్రసిద్ధులు ఈ శాఖ ఉపన్యాస పరంపరలో పాల్గొన్నారు. ఈనాడు దేశంలోనే ఈ శాఖ అతి విశిష్టమైనది. ఆచార్య జి.త్రివిక్రమయ్య అధ్యయన అధ్యాపనాలలో విశేషంగా కృషి చేశారు. ఇప్పటి వరకు ఈ శాఖ నుండి 55 మంది పి.హెచ్.డి. పట్టాలు పొందారు. ఇక్కడి పరిశోధన విద్యార్థి డా. గార్లపాటి దామోదరనాయుడు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యాక్షులుగా పని చేసి పదవీ విరమణ పొందారు. బెనారస్ తెలుగు శాఖలో తొలి పి.హెచ్.డి. వీరికి లభించింది (1980).
జోస్యుల సూర్యప్రకాశరావు 1986లో ఫ్రొఫసర్‌గా చేరి 1991లో పదవీ విరమణ చేసి రాజమండ్రిలో స్థిరపడ్డారు. త్రివిక్రమయ్య(1949) గుంటూరు పి.జి. సెంటర్లో ఎం.ఏ చేశారు. పూనాలో లింగ్విస్టిక్స్ ఎం.ఏ, పి.హెచ్.డి లు పూర్తి చేసి నాగపూర్ కళాశాలలో లెక్చరర్‌గా ఉన్నారు. 1986లో బెనారస్‌లో రీడర్‌గా చేరి 2014లో రిటైరయ్యారు.
విశ్వనాతుని సేవలో విశ్వనాధ్:
భమిడిపాటి విశ్వనాధ్ విశ్వేశ్వరుని సన్నిధిలో తొలిగా 1979లో తెలుగు ఎం.ఏ విద్యార్ధి. 81-86 మధ్య పరిశోధనా రంగంలో కృషి చేశారు. 1986లో ఉపన్యాసకులుగా అదే విశ్వవిద్యాలయములో చేరారు. వంద సంవత్సరాల విశ్వవిద్యాలయ చరిత్రలో అదే విశ్వవిద్యాలయ విద్యార్థి డి.లిట్ పొందిన ఏకైక వ్యక్తి. 2004 నుండి అవిచ్ఛిన్నంగా నేటి వరకు ఆచార్య పదవిలో కొనసాగుతూ విభాగ పురోగమనంలో భాగస్వామి అయ్యారు. వీరి సోదరులు బి.యస్.మూర్తి ఇక్కడ పరిశోధన చేశారు. సూర్యనారాయణగారి అభిమాన శిష్యులు.
ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి లభించడం అదృష్టం. అందునా విశ్వనాథుని సేవలో దొరకడం – దొరకునా ఇటువంటి సేవ. అలాంటిది 17 సంవత్సరాలు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్య పదవి లభించడం పురాకృత సుకృతం. భమిడిపాటి విశ్వనాధ్ ఆ కోవకు చెందిన వ్యక్తి. 1958 మేలో జన్మించి వారణాసిలో కాశీ పండితుల మధ్య సుస్థిర స్థానం సంపాదించారు. ఆ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ పొందిన తొలి ఆంధ్రుడు. భాషాప్రవీణలో విద్య మొదలు పెట్టి పి.హెచ్.డి స్థాయి కెదిగారు.
వాల్మీకి రామాయణము – తెలుగు రామాయణాదులపై పరిశోధనకుగా పి.హెచ్.డి, నన్నయ నుండి అన్నమయ్య వరకు భక్తి సామాజికాంశాలు అనే సిద్ధాంత గ్రంధానికి డి.లిట్ పొందారు. విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా మూడు దఫాలుగా ఒక దశాబ్ది గడిపారు. రాష్ట్రీయ సంస్కృతి విద్యా పీఠం, తిరుపతి, కాకతీయ విశవిద్యాలయం, వరంగల్ సంస్థలకు విజిటింగ్ ఫెలో. పరిశోధకులకు నిత్య పర్యవేక్షకుడిగా 25 సంవత్సరాల నుండి పది మందికి దిశానిర్దేశం చేశారు.
శ్రీనివాసుని కొలువులో:
తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆహ్వనంపై అన్నమాచార్య ప్రాజెక్టు డైరక్టరుగా రెండేళ్లు (2018-2020) వ్యవహరించారు. అనేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలందుకున్నారు. అనేక విశ్వవిద్యాలయాలకు పరీక్షాధికారిగా, కమిటీ సభ్యులుగా పని చేశారు. మూడు దశాబ్దాలుగా శాఖాపరమైన పరిశోధనా కమిటీ సభ్యులు.
విశ్వనాథుని కొలువులో శ్రీరామచంద్రుడు:
చల్లా శ్రీరామచంద్రమూర్తి (1961) బెనారస్‌లో తెలుగు శాఖ ఆచార్యులు. ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ఎం.ఏ. తెలుగు(1986), ఉస్మానియా సంస్కృత ఎం.ఏ (2000), బెనారస్ పి.హెచ్.డి (1990)లో సాధించారు. 1992-2006 మధ్య విజయవాడ లయోలా కళాశాల అధ్యాపకులు (NSS ప్రోగ్రాం ఆఫీసరు కూడా). 2016-19 మధ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులు. 2003 నుండి 20 ఎం.ఫిల్, పి.హెచ్.డి లకు పర్యవేక్షకులు. 32 సంవత్సరాల బోధానానుభవం. భారతీయ సేవా సమితి కార్యదర్శిగా (2005) సాహిత్య సేవ చేస్తున్నారు. తెలుగు ఆధ్యాత్మ రామాయణాలు వీరి గ్రంథం. తాళపత్ర పరిశోధన వీరి అభిమానాంశాం. తొమ్మిది గ్రంథాలు ప్రచురించారు. కొంతకాలం తణుకులో ప్రభుత్వ కళాశాలలో పని చేశారు. సామాజిక సేవలో అగ్రగణ్యులు.
పరిశోధనలలో మేటి బూదాటి:
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులు బూదాటి వేంకటేశ్వర్లు సుప్రసిద్ధ పరిశోధకులు. ఆయన మూడు విశ్వవిద్యాలయాలలో పని చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయం; అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం; బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 25 సంవత్సరాల పరిణత అనుభవం వారిది. అంతే కాదు ఈటీవి, దూరదర్శన్ సప్తగిరులలో అనుభంధం వుంది. మన టివి, ఆకాశవాణి వివిధ కేంద్రాలకు కార్యక్రమ రూపకల్పన చేశారు.
ఎక్కడ పని చేసినా తనదైన ముద్ర వేసే స్వభావం ఆయనది. నరసరావుపేట కళాశాల, గుంటూరు విజ్ఞాన్ డిగ్రీ కళాశాల, సత్తుపల్లి, ఖమ్మం ప్రభుత్వ కళాశాలల్లో ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపట్టారు.
కుప్పంలో గొప్పలు:
ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో బూదాటి 2006 జనవరిలో రీడర్‌గా చేరినది మొదలు తాను శాఖాధ్యక్షత పొందే వరకు అవిశ్రాంత పరిశోధనా కార్యక్రమాలు, సెమినార్లు, సదస్సులు నిర్వహించి పండిత ప్రశంసలందుకున్నారు. 2004లో ఎం.ఏ. తెలుగు కోర్సును తులనాత్మక ద్రవిడ సాహిత్యంలో ప్రారంభించి దానిని 2006లో తెలుగు శాఖగా రూపొందించారు. ఎంపిక చేసిన సబ్జక్టులలో ఎం.ఏ. చేసే త్రీటైర్ పోస్టు గ్రాడ్యుయేట్ విధానానికి పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేశారు. ఐదేళ్ల సమీకృత ఎం.ఏ. డిగ్రీ ప్రారంభించారు. ఎం.ఏ., డిప్లొమాలు విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు.
పార్లమెంటులో జీరో అవర్ ప్రసిద్ధం. అలానే కుప్పంలో వారం వారం – గురువారం – జీరోఅవర్ ప్రవేశపెట్టి విద్యార్థల సందేహాలకు అద్యాపకులు సమాధానాలు చెప్పారు. భువనవిజయం పేర నెల నెలా కార్యక్రమాలు చేశారు. తాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు హాజరయి పత్ర సమర్పణ చేశారు. వీరి పర్యవేక్షణలో 10 ఎం.ఫిల్, 6 పి.హెచ్.డి.లు లభించాయి.
స్వయం పరిశోధన:
ఎర్రన, నాచన సోమనల హరివంశంపై పరిశోధనకుగా పి.హెచ్.డి. పొందారు. 24 పరిశోధనాత్మక గ్రంథాలు ప్రచురించారు.
కరదీపిక, మువ్వల సవ్వడి, ఆనంద శాఖి, విజయవిలాసం, సర్పయాగం, తెలుగు సాహిత్య సౌందర్య మీమాంస, ఎర్రన కవితాతత్వం, లోనారసి, అలంకార చంద్రిక, తదితర గ్రంధాలు వీరి ప్రతిభాకేతనాలు, వస్తుతః సౌజన్యమూర్తి, సహృదయశిరోమణి.
సాహితీ జోస్యుల:
ఆచార్య జోస్యుల సూర్యప్రకాశరావు (18-2-1932) నరసాపురం తాలూకాలోని కరుగోరుమిల్లిలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పని చేశారు. ఆచార్య యస్వీ జోగారావు పర్యవేక్షణలో భట్టమల్లికార్జునుని భవ్యకవితానుశీలనంపై 800 పుటల పరిశోధనా గ్రంథం వెలువరించి పి.హెచ్.డి. 1980లో పొందారు. ఆపైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యులయ్యారు. పదవీ విరమణాంతరం రాజమండ్రిలో స్థిరపడ్డారు.
ఆచార్య బయ్యా వెంకట సూర్యనారాయణ:
ఆచార్య బయ్యా వెంకట సూర్యనారాయణ (1925 జూలై 15)న విశాఖపట్టణం జిల్లా తేటిగుంటలో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ఆద్యులు. తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి అక్కడే హిందీలో సిద్ధాంత గ్రంథం వ్రాసి 1970లో పి.హెచ్.డి. పొందారు. పర్యవేక్షకులుగా ప్రొ. జగన్నాథ్ ప్రసాద్ శర్మ, డా. విజయ్ శంకర్ మల్ వ్యవహరించారు. అంశం – తెలుగు హిందీ సాహిత్యాలలో 19వ శతాబ్దాల వరకు పొందిన గద్యవికాసం – తులనాత్మక పరిశోధన. రెండు భాషలలోని గద్యశైలీ వికాసాలు విశ్లేషించారు.
ఆచార్య బయ్యా రత్నావళి:
ఆచార్య బయ్యా రత్నావళి (1933 సెప్టెంబరు 21)న విశాఖపట్టణం జిల్లా యలమంచిలిలో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకులుగా 1977-80 మధ్య పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. పర్యవేక్షకులు డా. ప్రభు శంకర్. అంశం – పంప నన్నయ్యల భారతం – తులనాత్మక పరిశీలన. రత్నావళి గారు, సూర్యనారాయణ గారలు దంపతులు. ఈ దంపతులు ఎందరో తెలుగు విద్యార్థులకు మార్గదర్శకులని ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు ప్రస్తుతించారు.