ఉదయ రాగం-9

1
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

కొన్ని రోజుల తరువాత ఉదయ్ శ్రీరాంకు ఫోన్ చేశాడు.

“ఉదయ్! ఏంటి ఈ మధ్య సరిగా ఫోన్లు కూడా లేవు. అంత బిజీనా?”

“అలాంటిదే అనుకో. మా ఓనరు మరో క్వారీ లీజుకు తీసుకున్నాడు. ఫ్యాక్టరీలో మిషనరీ కూడా పెంచుతున్నారు. దాదాపు నామీదే అన్నీ వదిలిపెట్టారు. ఆశ్చర్యమైన విషయమేమిటంటే నిన్న నేను పదిమందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాల్లోకి తీసుకున్నాను. వాళ్ళలో ఒకప్పటి నన్ను నేను చూసుకున్నాను”

“వావ్! ఫెంటాస్టిక్! దట్ ఈజ్ ఉదయ్. ఇక నీకు తిరుగులేదు”

“తిరుగు ఎందుకు లేదు? ఉంది నాయనా! ఉదయాన్నే మా అమ్మ ఫోన్ చేసింది. తిరిగి హైద్రాబాద్ వచ్చెయ్యమంటున్నది. మామయ్య తొందర పెడుతున్నాడట. సొంతంగా గ్రానైట్ కంపెనీ పెట్టుకోవచ్చుట”

“అర్థమైంది. సంధ్యతో పెళ్ళి, అంతేగా? నేను కూడా ఒక తండ్రి కొడుకుకి చూస్తున్నట్లుగా సంబంధాలు వెతుకుతున్నాను. ఇంకా ముమ్మరం చేస్తాలే. నువ్వు కూడా నీకు పరిచయం అయిన వాళ్ళందరి గురించి ఆలోచించు. ఎవరైనా నచ్చితే నాకు చెప్పు. నేనొచ్చి మాట్లాడుతాను”

“అలాంటివి నా వల్ల అయ్యే పనులు కావుగానీ నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఎనీవే! త్వరలో ఒక పనిమీద హైద్రాబాద్ వస్తున్నాను. మనం ఈ విషయంలో ఒక అవగాహనకు రావాలి”

“ఓకే.. బాయ్” అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీరాం.

ఒక ఆదివారం తిరుపతిస్వామిని కలవడానికి వెళ్ళిన ఉదయ్ వెళ్ళిన పని ముగించుకొని కాస్త రిలాక్స్ అవుదామని జీపును కొత్తపట్నం వైపు పోనిచ్చాడు.

ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. గతంలో వెళ్ళిన ప్రదేశానికే వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ జనం చాలా తక్కువ ఉంటారు. అటుగా వెళ్ళే ఒకతన్ని సత్యం గురించి అడిగాడు. పది నిముషాల్లో సత్యం పరిగెత్తుతూ రావడం కనిపించింది.

“చాలా రోజులైంది సార్ మీరొచ్చి.. ఇక రారేమో అనుకున్నాను”

“ఇదిగో ఈ బట్టలు తీసుకో. నీకోసమే తెచ్చాను”

“అయ్.. బ్లూ కలర్ అంటే నాకిష్టం. మీరిచ్చారంటే మా అమ్మ ఏమీ అనదులే”

“అవి అక్కడ పెట్టు. కాసేపు నీళ్లలో తిరిగొద్దాం పద”

ఇద్దరూ మోకాళ్ళ లోతులో నిలబడ్డారు

“సత్యం! సముద్రాన్ని చూస్తుంటే నీకు భయమా సంతోషమా?”

“రాత్రిళ్ళు సముద్రాన్ని చూస్తుంటే, చీకటిలో శబ్దాలు వింటుంటే భయంగా ఉంటుందండీ, తెల్లారాక వెలుగులో అలలతో అదే సముద్రాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంటుందండీ. భయమూ సంతోషం – భయమూ సంతోషం అనమాట”

“నువ్వన్నీ జీవిత సత్యాలు నీకు తెలియకుండానే చెబుతుంటావు సత్యం. నీ పేరుకు తగ్గట్లు”

“అయ్యబాబోయ్ నాకు అర్థం కాలేదండి”

“అర్థం కావలసిన అవసరం ఇప్పుడేం లేదు గానీ పద అటుకేసి నడుద్దాం”

“వారం క్రితం ఇక్కడొకటి జరిగిందండి”

“ఏం జరిగింది?”

“ఒక ముసలావిడ సముద్ర స్నానం చేసి సూర్యుడికి దండం పెడుతూ అలాగే పడిపోయిందండీ. నేనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటో తీసుకొచ్చాను. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. చాలా పుణ్యాత్మురాలు అన్నారందరు. ఆమె ఫొటో పేపర్‌లో కూడా పడింది”

“అయ్యో అలానా?”

“ఇంక ఆ చివరకు వద్దులేసార్ వెనక్కి వెళదాం”

“ఎందుకు?”

“అదిగదిగో అక్కడ మా చిన్నక్క రెండేళ్ళ క్రితం నీళ్ళలో మునిగిపోయి చనిపోయింది సార్. అటెల్తే మా అయ్య కోప్పడతాడు”

సత్యాన్ని దగ్గరకు తీసుకున్నాడు ఉదయ్. ఇద్దరూ వెనక్కి మళ్ళారు.

“ఏమిటో సత్యం, ఇవాళ నీ నోటెమ్మట భారమైన విషయాలే వినపడుతున్నాయి. చిన్న వయసులోనే చాలా చూస్తున్నావు. అసలు ఈ సముద్రమే మిమ్మల్ని ఆటుపోట్లకు తట్టుకునే నిబ్బరమైన మనుషులుగా తయారు చేస్తుందేమో.”

సత్యం ఏమీ మాట్లాడలేదు

“నాక్కూడా ఇక్కడికొస్తే ఆహ్లాదంతో పాటు ఏదో అనుభవం, అవగాహన కలుగుతాయి. మనసు గట్టిపడుతుంది. నాకు బాగా నచ్చిన ప్రదేశాల్లో ఇదొకటి, మనుషుల్లో నువ్వొకడివి. అవును మీ నాన్న ఏం చేస్తుంటాడు? మీ అమ్మా నాన్నలకు నువ్వొక్కడివేనా ఇప్పుడు?”

“లేదు సార్, పెద్దక్క ఉంది. నాన్న చేపలు ఒంగోలు మార్కెట్‌కి వేసి అక్కణ్నుంచి కొన్ని సామానులు కొనుక్కొని కొత్తపట్నం తెస్తుంటాడు”

“వెరీ గుడ్! మరి మీ పెద్దక్క ఏం చేస్తున్నది?”

“బి.కాం కంప్యూటర్ చేసింది సార్. సంవత్సరమైంది.”

“ఎక్కడైనా ఉద్యోగంలో చేరొచ్చుగా కాస్త ఇంటికి ఆర్థికంగా సాయం ఉంటుంది?”

“మా అయ్య అక్కను ఎక్కడకూ పంపడు. చిన్నక్క చనిపోయాక అయ్య అదోల అయిపోయాడు”

“అలానా? సరే! ఊర్లో సెంటర్‌కి కాస్త అవతల చిన్న గుడి ఉంది కదా అక్కడ నిన్ను దింపి వెయిట్ చేస్తాను. మీ అమ్మానాన్నలను, అక్కను పిలుచుకొస్తావా, ఒకసారి మాట్లాడుతాను”

సత్యం ప్రశ్నార్ధకంగా చూసి, “అయితే మీరిక్కడ ఇంకా కాసేపు ఉండరా?” అడిగాడు.

“లేదులే, నాకు ఒంగోలులో కాస్త పనుంది”

“ఈసారొచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు ఉండేట్లు రండి సార్! అదిగో అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి కదా, అందులో దిగండి. అక్కడ మంచి ఫుడ్ కూడా ఉంటుంది” అన్నాడు.

“వద్దులే, ప్రస్తుతానికి ఈ బీచ్, మనం కూర్చున్న ఈ దుంగ, ఇదిగో ఈ సత్యం చాలు” అన్నాడు.

సత్యం నవ్వుతూ జీపు ఎక్కాడు.

జీపు గుడి దగ్గర ఆపాడు ఉదయ్. సత్యం పరుగున వెళ్ళి కాసేపటికి వాళ్ళ వాళ్ళని పిలుచుకొచ్చాడు. వాళ్ళను చూస్తుండగానే ఉదయ్ నమస్కారం పెట్టాడు. వాళ్ళు కాస్త కంగారు పడి ప్రతి నమస్కారం పెట్టారు. “మీగురించి మావాడు చెప్పాడు బాబూ! ‘అందరూ ఒరే! సత్తిగా అని పిలుస్తారు, సారొక్కరూ నన్ను సత్యం అని పిలుస్తారు’ అని వాడు గొప్పగా చెప్పుకుంటాడు. ఇవాళ మమ్మల్ని రమ్మన్నారుట. కంగారుపడుతూ వచ్చాం బాబూ!”

“అయ్యో.. కంగారు పడేందుకు ఏమీ లేదండి. మీ అమ్మాయి గురించి మాట్లాడాలనిపించి రమ్మన్నాను. సత్యాన్ని చూసి మీ కుటుంబాన్ని అంచనా వెయ్యొచ్చు. మీ చిన్నమ్మాయి దూరమైందని పెద్దమ్మాయిని ఇంటి పట్టునే ఉంచేశారుట. బి.కాం చదివించారు. అలా వదిలేస్తే ఆ చదువు పనికిరాకుండా పోతుంది. మీరు పెద్దవారైపోతున్నారు. సత్యం ఇంకా చదువుకోవాల్సి ఉంది. మీ అమ్మాయికి పెళ్ళి చెయ్యాలి. మీరు పదిమంది కోసం పనులు చేసి వచ్చిన దాంతో ఇల్లు గడుపుతున్నారు. పోనుపోను కష్టంగా ఉంటుంది.

మీ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు. నాకు అనిపించింది చెబుతున్నాను. మీ అమ్మాయి మంచి ఉద్యోగం సంపాదించాలి. నేను పనిచేసే ఫ్యాక్టరీకి ఆడిటర్ నరసింహ శాస్త్రిగారని ఒంగోలులో ఉన్నారు. ఆయన దగ్గర మీ అమ్మాయి ట్రైనింగ్ అయితే కావలసిన పద్ధతిలో లెక్కలు నేర్పించి ఆమెను తయారు చేస్తాడు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. గవర్నమెంటు ఆఫీసుల్లో, బ్యాంకుల్లో కూడా దొరకొచ్చు. దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూ పరీక్షలు రాస్తూ ఉండాలి. అవి ఇక్కడ కూర్చుంటే కుదరదు.

మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే నాతో మీ అమ్మాయిని పంపండి. కూడా మీరెవరైనా రండి. లేదా కనీసం సత్యంనైనా పంపండి. నరసింహ శాస్త్రిగారితో మాట్లాడి అక్కడ చేర్పించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఎప్పటినుంచి రమ్మంటే అప్పుడు రోజు బస్సులో వెళ్ళి రావచ్చు. చూస్తుండగానే మీ అమ్మాయి ప్రయోజకురాలౌతుంది.

నాకు తోచింది చెప్పాను. ఇంటికెళ్ళి కాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేనిక్కడ కాసేపు వెయిట్ చేస్తాను” అని చెప్పడం ముగించాడు.

కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు

“ఊ..వెళ్ళండి. ఇందులో ఇబ్బందేమీ లేదు. మీకు ఇష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు. వద్దనుకుంటే సత్యం చేత కబురు పంపండి. నేను ఏమీ అనుకోను.” అన్నాడు నవ్వుతూ.

నలుగురూ చిన్నగా నడుచుకుంటూ వెళ్ళారు.

కాసేపటికి తిరిగి వచ్చారు. “మా అమ్మాయి ఉద్యోగం చెయ్యాలని పట్టుదలగా ఉంది సారు! ఇంత కాలం నేనే ఆపాను. మావాడితో ఉన్న కొద్దిపాటి పరిచయంతో మీరు మాగురించి ఇంత ఆలోచించి చెబుతున్నారు. అమ్మాయితో మా సత్యం వస్తాడు. అక్కడ పనైయ్యాక బస్సులో వచ్చేస్తారు” అన్నాడు.

“మంచి నిర్ణయం తీసుకున్నారు” అంటూ జీపు ఎక్కి కూర్చున్నాడు. సత్యం, అతని అక్క కూడా జీపు ఎక్కారు. వాళ్ళ అమ్మానాన్నలకు వెళ్ళొస్తామని చెప్పి జీపు ముందుకు పోనిచ్చాడు ఉదయ్.

“నీ పేరేంటి?” అడిగాడు ఆ అమ్మాయిని.

“శాంత”

“పేరుకు తగ్గట్లు మహా శాంతంగా ఉన్నావు. మరీ శాంతం ఈ రోజుల్లో పనికిరాదు. కాస్త మాట్లాడాలి.”

శాంత ఇంకా శాంతంగానే ఉంది.

“నరసింహ శాస్త్రిగారు ఒప్పుకుంటారనే నా నమ్మకం. కొందరు చిన్న వ్యాపారస్తుల లెక్కలు శాస్త్రిగారి మనుషులే వ్రాస్తారు. అలా నీచేత కూడా వ్రాయిస్తారు. అలా మొదలౌతుంది నీ పని. అప్పుడప్పుడూ వాళ్ళు ఫైల్ చేసే రిటర్న్స్ విషయంలో తర్ఫీజు ఇస్తారు. ట్యాలీ, జి.యస్.టి లాంటివి అక్కడే నేర్చుకోవచ్చు. పోనుపోను ఏమి చెయ్యాలో నీకే అర్థమౌతుంది. ఎవరూ చెప్పనక్కరలేదు. ధైర్యంగా చేరిపో. శ్రధ్ధగా వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోతే చాలు”

ఆమె శ్రద్ధగా అతను చెప్పిన మాటలు విని ‘సరే’ అన్నది.

ముగ్గురూ కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు.

“డిగ్రీ చదువు కాక ఇంకేమి నేర్చుకున్నావు?”

“మా అక్క పాటలు పాడుతుంది. కొన్నిరోజులు మా వీధిలో శారదమ్మగారి దగ్గర సంగీతం నేర్చుకుంది”

“వెరీ గుడ్! ఏదీ ఒక పాట పాడి వినిపించవూ”

“నాకు కొత్తవాళ్ళముందు భయమండి! నువ్వేంట్రా!” అంటూ తమ్ముడువైపు కోపంగా చూసింది.

“ఫరవాలేదులే, వెనుక సీట్లో కూర్చున్నావుగా, కావాలంటే కళ్ళు కూడా మూసుకోవచ్చు” అన్నాడు ఉదయ్.

ఆమె చిన్నగా నవ్వుకుని కొద్దిగా సమయం తీసుకొని ‘శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా – చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా’ అంటూ పూర్తి పాట పాడేసింది.

“చాలా బాగా పాడావు. గొంతు కూడా చాలా బాగుంది”

శాంత ముఖం వికసించడం అతనికి అద్దంలో కనిపించింది.

“సార్ మీది అసలు ఏ ఊరు?” అడిగాడు సత్యం

“హైద్రాబాద్”

“మహేష్ బాబు కనిపించాడా మీకెప్పుడైనా?”

“నాకు వాళ్ళతో పనేముంటుంది. వాళ్ళు ఎక్కువ స్టూడియోల్లో ఉంటారు”

“రామోజీ ఫిలిం సిటీకి వెళితే కనపడతాడా?”

“తెలీదు. ఎప్పుడో ఒకసారి ఎవరో కనపడతారు. కానీ అక్కడ చాలా బాగుంటుంది. సినిమా సెట్టింగులు అవీ”

“మా స్కూలు వాళ్ళు తీసుకెళతామన్నారు. ఎప్పుడో తెలీదు”

“ఇదిగో నా కార్డు తీసుకో. ఇదుగో ఈ నంబరు నాది. మీ స్కూలు వాళ్ళు తీసుకెళితే సరే. లేకపోతే ఒక నెలాగి ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే మీరిద్దరు మీ అమ్మానాన్నలతో సహా అక్కడి రావడానికి, అక్కడ తిరగడానికి ఏర్పాట్లు చేయిస్తాను”

ఆనందంగా ఆ కార్డు తీసుకుని చాలా భద్రంగా జేబులో పెట్టుకున్నాడు సత్యం.

ఓ అరగంటకు జీపు జయరాం టాకీసు సెంటర్‌కి చేరింది. “ఇదే నరసింహ శాస్త్రిగారి ఆఫీసు, దిగండి” చూపిస్తూ చెప్పాడు ఉదయ్.

వాళ్ళిదరితో పాటు తనూ లోపలికి వెళ్ళాడు. “హలో ఉదయ్! ఏంటి సడన్‌గా?” అంటూ చేయి కలిపాడు శాస్త్రి.

“ఈ అమ్మాయి కుటుంబం నాకు కాస్త పరిచయం. కొత్తపట్నంలో ఉంటారు. బి.కాం కంప్యూటర్స్ చేసి ఖాళీగా ఉంది. మీ దగ్గర అవకాశం ఉంటే ఈమెను చేర్చుకొని కాస్త ట్రైనింగ్ ఇస్తారేమో అని తీసుకొచ్చాను. మీకు చెప్పాపెట్టకుండా పిలుచుకొచ్చేశాను. కానీ ఇందులో ఏమీ మొహమాటం లేదు. మీకు కుదిరితేనే ఆలోచించండి” అన్నాడు ఉదయ్ చిరునవ్వుతో.

“అదేంటి ఉదయ్! స్వయానా నువ్వు పరిచయం చేస్తున్నావు. అదీగాక మాకు ప్రస్తుతానికి మరో మనిషి అవసరం కూడా ఉంది. తప్పక తీసుకుంటాను.”

“ఈ అమ్మాయి మీ శిష్యరికం చేసి మంచి ఉద్యోగంలో చేరితే ఒక కుటుంబం ఇబ్బందులు పడకుండా నిలబడుతుంది”

“అలాగే ఉదయ్! తప్పకుండా”

“నమస్కారం వెళ్ళొస్తాను, మళ్ళీ కలుస్తాను” అంటూ బయటకు వచ్చాడు.

గుమ్మంలో నిలబడి ఉన్న అక్కతమ్ముళ్ళకు బాయ్ చెప్పాడు.

ఉదయ్ జీపు ఎక్కబోతూ సత్యాన్ని పిలిచి “వచ్చేప్పుడు జీపులో వచ్చారు. ఇప్పుడు బస్సులో వెళ్ళలిగా? ఇదుంచు” అంటూ వందరూపాయల నోటు జేబులో పెట్టాడు.

“అక్కదగ్గర ఉన్నయ్యి సార్”

“అయితే నీ దగ్గరే ఉంచు ఈసారొచ్చినప్పుడు జొన్నరొట్టెలు తెద్దువు”

సత్యం మాట్లాడలేకపోయాడు.

ఉదయ్ తిరుపతి స్వామి ఇంటివైపుకు బయలుదేరాడు.

***

గేటు తీసుకుని లోపలికొస్తున్న ఉదయ్‌ని చూడగానే “రా ఉదయ్! ఏంటి సడన్‌గా ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చావ్? ఏదైనా అర్జంటు పనా?” అడిగాడు తిరుపతి స్వామి.

“అదేం లేదండి! చాలా రోజులైంది కదా అని ఒకసారి కొత్తపట్నం బీచి దగ్గర కాసేపు గడిపి వస్తున్నాను. మిమ్మల్ని కలిసి వెళదామనిపించింది”

“వెరీ గుడ్, మంచి పని చేశావ్”

“మాట్లాడాల్సిన విషయం కూడా ఉందనుకోండి”

“అవునా, దేన్ని గురించి?”

“అప్పుడు మీతో అన్నాను కదా! మా నాన్న గురించి ఒకరోజు మాట్లాడుకుందామని”

“ఆ! అవును. దుర్గా ప్రసాద్ నీ విషయాలేవీ నిన్ను, తనను అడగొద్దన్నాడు. సమయం వచ్చినప్పుడు నువ్వే చెబుతావు అన్నాడు. నీ గురించి ఏ విషయంలోనైనా తనదే బాధ్యత అని కూడా భరోసా ఇచ్చాడు. దుర్గాప్రసాద్ నాకు బాగా కావలసిన మనిషి. నువ్వు కాస్తైనా చెడ్డపేరు గల వాడివైతే అతను నిన్ను నా దగ్గరకు అసలు పంపడు. పైగా నువ్వు చాలా వినయంగా, శ్రద్ధగా,నమ్మకంగా పనిచేస్తున్నావు. ఇప్పుడు నీకుగా నువ్వు చెప్తానంటే నాకూ వినాలని కుతూహలంగా ఉంది” అన్నాడు నవ్వుతూ.

ఉదయ్ “ఇది మా నాన్నగారి బిజినెస్ విజిటింగ్ కార్డ్” అంటూ తిరుపతిస్వామికి ఇచ్చాడు.

అది చూసి ఒకటికి రెండు సార్లు చదివిన తిరుపతిస్వామి ఒకసారి ఆకాశంలోకి చూసి, రెండుమూడు రకాల హావభావాలు కనపర్చి ఆ తరువాత “ఇదేంటి ఉదయ్! నాకు ఇదేదో సినిమా కథలా అనిపిస్తున్నది. బహుశా నిన్ను నువ్వు నిరూపించుకోవాలనో లేక మరేదైనా కారణంతోనో ఇలా చేశావనిపిస్తున్నది” అన్నాడు.

“అవునండీ! మెదటిదే అసలు కారణం రెండవది కొసరు కారణం” అన్నాడు ఉదయ్ చిరునవ్వుతో.

“ఒంగోలులో ఉండమన్నా ఉండకుండా కొద్దిపాటి సౌకర్యాలు మాత్రమే ఉన్న చీమకుర్తిలో ఉంటున్నావు. మీ హైద్రాబాద్ లగ్జరీ లైఫ్ అంతా పక్కన పెట్టావు. మొదట్లో నీ మాటలు, పద్ధతులు గమనించిన నాకు ఏవో సంశయాలు కలిగినా అవి బలపడకుండా మేనేజ్ చేశావని ఇప్పుడనిపిస్తున్నది. ధనవంతుల పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు వచ్చేది చాలా అరుదు.

చాలా రోజులుగా నాకు తెలియకుండా నా కంపెనీలో రాత్రిళ్ళు కాంపౌండ్ వాల్ మీద నుంచి టైల్స్ దాటవేయడాన్ని నువ్వు పసిగట్టి అరికట్టావు. వాచ్‌మ్యాన్ మీద నమ్మకంతో అతని దగ్గర రాత్రిళ్ళు ఓవర్ టైమ్ రికార్డ్ పుస్తకం ఉంచడం వల్ల, అందులో పనిచేసిన దానికంటే ఎక్కువ సమయాలు అతన్ని వశపరుచుకొని కొందరు వ్రాయించుకోవడం లాంటివి నీవు కనిపెట్టి టూర్‌లో ఉన్న నాతో సంప్రదిస్తూ కట్టుదిట్టం చేశావు.

ఎక్కడా ఏమాత్రం ఘర్షణ లేకుండా పనులు చక్కబెట్టడంలో నీదైన శైలి నేను గమనిస్తూనే ఉన్నాను. తప్పుచేసిన పనివాళ్ళను తీసేస్తూ పోవడం కంటే వాళ్ళను తప్పులు చెయ్యనియ్యకుండా చూస్తూ వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. ఫ్యాక్టరీని చక్కగా నడిపిస్తూ నాకూ చాలా ఒత్తిడి తగ్గించావు.

నిన్ను మొదట చూసినపుడు ఈ అబ్బాయి రెండుసార్లు క్వారీకి పంపిస్తే అట్నుంచి అటే పారిపోతాడేమో అన్నట్లుండే వాడివి. నా అనుమానాలు తలక్రిందులు చేస్తూ నీ ప్రతిభా సామర్ధ్యాలతో నిన్ను నువ్వు నిరూపించుకోవడమే కాదు, నిజానికి ఈ మధ్య ‘ఒకవేళ ఉదయ్ వెళ్ళిపోతే ఎట్లా?’ అనే బెంగ కూడా నాకు కలిగేట్లు చేశావు.

ఇప్పుడు చెప్పు! ఏంటి నీ ఆంతర్యం. కొంపదీసి నా బెంగ నిజమైయ్యేట్లు వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నావా? ఇవాళ ఉన్నట్లుండి ఈ విషయాలు చెబుతుంటే నాకు అలా కూడా అనుమానం కలుగుతున్నది”

“లేదండి! అలాంటి ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. మీరన్నట్లు నన్ను నేను నిరూపించుకోవాలనే ప్రయత్నం మాత్రం నిజం. ఒకవేళ విఫలమైతే ఏదో కారణంతో వెళ్ళిపోవాలని అనుకున్నాను. అదీగాక ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళబ్బాయిని అని తెలిస్తే రకరకాల అనుమానాలతో మీరు నాకు ఉద్యోగం ఇవ్వకపోవచ్చు. అంతే కాక మన ఓనరు- వర్కరు సంబంధం ఉండాల్సిన పద్ధతిలో ఉండేది కాదు. ఇప్పుడు ఇక నాకు ఉద్యోగం పోతుందనే బెంగ లేదు. అందుకు మీ బెంగే అండ” అన్నాడు ఉదయ్ నవ్వుతూ.

“సరిగ్గా చెప్పావు. ఇంకా మీ కుటుంబం గురించి చెప్పు”

“నాకొక అక్కయ్య ఉంది. తను అమెరికాలో ఉంటున్నది. మా బావ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. మా మెయిన్ ఆఫీసు అమీర్ పేటలో ఉంది. మేము ఉండేది హిమయత్ నగర్‌లో. అంతవరకూ ప్రస్తుతానికి చాలనుకుంటాను”

“మరి మరో ప్రశ్న నన్ను వేధిస్తున్నది. ఇంత తెలివితేటలు ఉన్నవాడివి మీ నాన్నగారి బిజినెస్ చూసుకోవచ్చు. లేదా నువ్వు విడిగా మరో బిజినెస్ పెట్టి ఇదే ప్రయత్నం అక్కడే చేసుకోవచ్చు కదా?”

“మీరే అన్నారొకసారి ‘నీమీద ఎవ్వరూ ఉండకపోతే, స్వేచ్ఛగా వదిలేస్తే బాగా రాణిస్తావు’ అని. ఆ మాట నిజమేనేమో. అక్కడ వేరే సొంతగా ఏమి చెయ్యాలన్నా నాకు స్వేఛ్ఛ ఉందదు. అందరూ సహాయ సహకారాలూ అందించి నన్ను కూర్చోబెడతారు. అసలు నాది మెతకతనమా, చేతకానితనమా అనేది ముందు నేను తెలుసుకోవాలనుకున్నాను. బయట అయితేనే అదీ ఉద్యోగిగా పని చేస్తేనే స్పష్టంగా తేల్చుకోగలుగుతాను. అవికాక మరికొన్ని వ్యక్తిగత కారణాలున్నాయనుకోండి. అవి మరెప్పుడైనా చెప్పడానికి ప్రయత్నిస్తాను”

“నీ స్వభావానికి తగ్గట్లు పనులు నెరవేర్చుకునే నేర్పు నీకుంది. నువ్వు ఇలా ప్రయత్నం చేద్దామనుకోవడమే నీ తెలివి తేటలకు నిదర్శనం. మీ నాన్న గారిదీ తప్పని నేను అనలేను. నాకూ కొడుకుంటే నేనూ అలానే ఉండేవాణ్ణేమో! మొత్తానికి భలేవాడివయ్యా ఉదయ్! నీ ప్రాజక్ట్ వర్కుకు నా కంపెనీ ఉపయోగపడినందుకు నాకు సంతోషంగా ఉంది. పద ఇప్పటికే ఆలస్యమైంది. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం” అంటూ లోపలికి దారితీశాడు.

భోజనాల సమయంలో “నాకు రెండు రోజులు లీవ్ కావాలండీ. చెన్నై వెళ్ళిరావాలి” అడిగాడు ఉదయ్.

“ఏంటి విషయం?”

“దుర్గాప్రసాద్ గారి అబ్బాయి మనోజ్ డిగ్రీలో నా క్లాస్‌మేట్ మంచి ఫ్రెండ్. అతను ప్రస్తుతం చెన్నైలో పనిచేస్తున్నాడు. ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. అందుబాటులో ఉన్న స్నేహితులను పిలిచి ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాడు. హైద్రాబాద్, బెంగుళూరు నుండి కూడా కొందరు వస్తున్నారు. వాళ్ళను కలిసి చాలా కాలం అయింది. సరదాగా వెళ్ళొద్దామని”

“వెరీగుడ్! అతని స్నేహితుడవని చెప్పేగా దుర్గాప్రసాద్ నిన్ను ఇక్కడికి పంపింది. తప్పకుండా వెళ్ళిరా. ఏదైనా సమాచారం కావలంటే ఫోన్ చేస్తాలే. ఆఫీసులో రమేష్‌కి, అకౌంటెంట్ మూర్తికి చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే చెప్పి వెళ్ళు. ఇంతకీ ఎలా వెళుతున్నావ్?”

“ఉదయాన్నే పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో వెళతానండి, మళ్ళీ బుధవారం ఉదయానికొచ్చేస్తాను”

“మంచిది ఉదయ్ వెళ్ళిరా”

కాసేపు కబుర్లు తరువాత తిరుపతి స్వామి దంపతుల దగ్గర శలవు తీసుకొని బయటకొచ్చాడు ఉదయ్.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here