[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]పాం[/dropcap]డురంగం ఇంటిముందు స్కూటర్ దిగాడు. బయటే ఆడుకుంటున్న దీపు పరిగెత్తుక వచ్చాడు తండ్రి దగ్గరికి. ఆయన అందించిన టిఫిన్ క్యారియర్ బ్యాగ్ అందుకున్నాడు.
“అక్క వచ్చిందిరా దీపూ?”
“లేదు నాన్నా! ఇంకా రాలేదెందుకనో?”
“కనీసం మీ అమ్మకు ఫోనైనా చేసిందా?”
“ఆ, చేసింది నాన్నా! ఈరోజు అక్కడ కార్యక్రమం బాగా జరిగిందట. అక్కెంతో హ్యాపీగా వుందని అమ్మ చెప్పింది.”
“అవునా ?! పద… ఇంట్లోకి” సంతోషపడుతున్న తండ్రి వెంట దీపు కూడా లోపలికొచ్చాడు.
తన చేతిలోని బ్యాగ్‌ని తల్లి చేతికిచ్చాడు. “అమ్మా, నేను ఇంకాసేపు ఆడుకోనా? అక్క వచ్చేంతవరకూ”
“సరే రా, వెళ్ళు. అక్క వచ్చిన వెంటనే నీవింట్లోకీ రావాలి; చదుకోవాలి.”
మళ్ళీ వాడు రివ్వున సంధించిన బాణంలా బయటికి వెళ్ళి పోయాడు.
“అనిత ఫోన్ చేసి నీతో ఏమన్న మాట్లాడిందా సుశీలా?”
“మాట్లాడిందండీ. కలెక్టర్ గారు రావడం, ఆయన చెట్లునాటడం మున్నగు కార్యక్రమాలన్నీ ఎంతో బాగా సక్రమంగా జరిగినాయట. మన అమ్మాయికి శాలువా కప్పి సన్మానం కూడా చేశారటండీ. ఊరు ఊరంతా తిరిగి చూసి అమ్మాయిని బాగా మెచ్చుకున్నాడట” ఆనందంతో వికసించిన ముఖంతో చెప్పుతుందావిడ.
“అవునా! సంతోషం…”పాండురంగం సంతృప్తి చెందాడు.
“మొత్తం మీద అనిత పుట్టిన రోజే ఈ సన్మానం జరగడం, తన జీవితంలో శుభ పరిణామమేదో జరగబోతుందని నాకనిపిస్తుంది…” అంటూ భర్తకు టీ పెట్టడానికి వంటింట్లో కెళ్ళింది సుశీల.
ఓ అరగంట తర్వాత అనిందిత కూడా తమ్మున్ని వెంట బెట్టుకొని ఇంట్లోకి వచ్చింది. “అమ్మా, ఇంద ఈ మల్లెపూలు తీసుకో. ఊళ్ళో యిచ్చారు.” అంటూ హాల్లోని కీటికీలో వుంచి తాను బాత్‌రూమ్ లోకెళ్ళి స్నానం చేసి వచ్చింది.
తండ్రి కూతుర్లకి టీ గ్లాసులు అందిస్తూ “దీపూ! నీవు కూడా కాళ్ళుచేతులు కడుక్కొని రా! ఇందాకటి వరకూ బయటే ఆడావు. పాలు పోస్తాను” అంటూ కేకేసింది.
దీపు వచ్చాడు. వాడికి పాలలో బొర్నవిటా వేసి కల్పి బిస్కెట్స్ పాలగ్లాసిచ్చింది.
ఫ్రెష్ అయి వచ్చిన కూతురు, తండ్రి ఎదురెదురుగా కూర్చున్నారు టీ సేవిస్తూ.
“ఈరోజు మీ ఊళ్ళో కార్యక్రమాలు ఎలా జరిగాయమ్మా?” పాండురంగం అడిగిన ప్రశ్నకు జవాబు వినాలన్న కుతూహలంతో సుశీల కూడా టీ గ్లాస్ చేత పట్టుకొని వంటింట్లో నుంచి మళ్ళీ యివతలికి వచ్చింది.
“బాగా జరిగింది నాన్నా! మా ఊళ్ళో ప్రతి ఒక్క అంశాన్ని పరికించారు కలెక్టర్ గారు. బాగా ప్రశంసించారందర్నీను. ఊరంతా తిరిగి చూశారు. నాకు సన్మానం కూడా చేశారు. చెట్లు నాటారు. చివరికెళ్ళుతూ రిజిష్టర్‌లో నా గురించి రెండు మూడు మంచి వాక్యాలు ప్రశంసాపూర్వకంగా రాసి వెరీగుడ్ అన్నారు నాన్నా! మా వాళ్ళు చాలా ఫోటోలు తీసి నా వాట్సాప్‌కి పంపారట. నేను చూడలేదింతవరకూను. ఓరే, దీపూ! నా హ్యాండ్ బ్యాగ్‌లో ఫోన్ తీసుకరా” అంటూ చెప్పింది.
దీపు క్షణంలో వెళ్ళి తెచ్చి అక్కకందించాడు.
తన వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటోలన్నీ ఒక్కొక్కటే చూడసాగారు. అన్ని ఫోటోలూ బాగున్నాయి. తండ్రికిచ్చింది చూడమని. ఫోటోలు చూస్తున్న పాండురంగానికి ఓ పక్క దీపూ, మరో పక్క సుశీల నిలబడి శ్రద్ధాసక్తులతో ఫోటోలన్ని వీక్షించసాగారు.
చెట్లు నాటేటప్పుడు, తట్టతో మట్టి పోస్తున్నప్పుడు కలెక్టర్ గారు.. కూతురు పక్క పక్కన నిల్చున్న ఫోటోలు చాలా బాగొచ్చాయి. సన్మానం చేస్తున్నప్పుడు శాలువ కప్పుతూ జన్మదిన శుభాకాంక్షలు కొంచెం వంగి చెవి దగ్గర చిరునవ్వు ముఖంతో ఏదో మాట్లాడుతున్న ఫోటో, కళ్ళెత్తి అతని వంక ఆశ్చర్యంగా చూస్తున్న అనిందిత ఫోటోలు కూడా చాలా బాగున్నాయి. అలా చూస్తుంటే తనకు తెలియకుండానే క్షణంలో ఆవిడ మదిలో మెరుపులా ఓ ఆలోచన తళుక్కున మెరిసింది
అప్పుడే అనిందిత ఖాళీ టీ గ్లాస్ లను వంటింట్లో సింక్ లో వేయడానికి లేచి వెళ్ళింది.
అక్క అక్కడ లేనిది చూసి “అక్క, ఆ కలెక్టర్ చాలా అందంగా వున్నారు కదా నాన్నా?” తండ్రి చెవిలో గుసగుసగా అన్నాడు.
దీపు అన్న మాటే ఆ తల్లి మనస్సులో కూడా మరోవిధంగా యిద్దరికీ ఈడు జోడు బాగుందని అనుకోకుండా వుండలేక పోయింది.
“అవునే, అనితా ! మీ ఊరికొచ్చినా కలెక్టర్ గారు చాలా అందగాడిలాగే వున్నట్లనిపిస్తుంది కదే!” సందిగ్ధంగా అందావిడ కూతురేమంటుందో వినాలని భావనతో.
“’వున్నట్లుగా’ కాదమ్మా.అతను నిజంగా అందగాడే. నీవేం సందేహ పడక్కరలేదు…” కూతురినుంచి వెంటనే వచ్చింది జవాబు.
“మరి ఇవాళ నీ పుట్టిన రోజన్న సంగతి ఊళ్ళో ఎవరికి తెలియదా? ఎవరూ నిన్ను విష్ చేయనే లేదా? సర్పంచమ్మ, ఉపసర్పంచ్…” అంటూ అర్థోక్తిలోనే ఆగి పోయింది.
ఆ మాట వినగానే అనిందిత మనస్సంతా అదో రకమైన చిత్రమైన మైమరుపుకు లోనైంది. ఆక్షణంలో కలెక్టర్ గారు తన చెవి దగ్గర హస్కీ వాయిస్‌తో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు కూడా వీనులవిందుగా తీయగా సరాసరి హృదయం లోకి చొచ్చుక పోయినట్లనిపించంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక పోయింది ఎందుకనో.
“ఏమోనమ్మా, నేనెవ్వరికీ చెప్పలేదీసారి. పోయిన ఏడాది అందరూ విష్ చేశారు, బహుశా మర్చిపోయి వుంటారు.” మాములుగా అంటూ సెల్ తీసుకొని తన గదిలోకెళ్ళుతూ ‘కలెక్టర్ గారికి తన బర్త్‌డే ఈ రోజని… ఎలా తెల్సింది!?’ పదే పదే ఆలోచిస్తూ వుండిపోయింది. కాని అంతు చిక్కలేదు.
***
ఉదయం టైమ్ ఏడైంది. అప్పటికే ముఖం కడుకొని హాలోకొచ్చి సోఫాలో కూర్చొని ఆవాల్టి న్యూస్ పేపర్స్ చూస్తూ కూర్చున్నాడు ప్రేమ్ సాగర్. అప్పటికే వచ్చిన వంటావిడ ట్రేలో ఓకప్పు టీతో పాటు రెండు సాల్ట్ బిస్కెట్స్ పెట్టుకొని తెచ్చి టీపాయ్ మీద పెడ్తూ “నమస్కారం సార్!” అంది.
“అమ్మా, మీరీరోజు నాకు వంటేం చేయకండి. నేను ఈరోజు కూడా బైటికెళ్ళుతున్నాను. రాత్రి వరకు వస్తానేమో! టీఫిన్ మాత్రమే చేయండిప్పుడు…” అన్నాడు ప్రేమ్ సాగర్.
టీ తాగుతూ ముందుగా ఓ తెలుగు పేపర్ విప్పి చూడసాగాడు. ఓ పేజీలో నిన్న తాను వెళ్ళిన కార్యక్రమాలను గురించి రాస్తూ, కొన్ని ఫోటోలు కూడా వేశారు. వాటిని శ్రద్ధాసక్తులతో గమనించ సాగాడు.
ముందుగా పుష్పాల గూడెంలోని వార్తా విశేషాలు చదివాడు. తను చెట్లు నాటుతున్నప్పుడు అనిందిత పక్కనవున్న ఫోటో చాలా బాగుంది. ఆ తర్వాత ఆమెకు శాలువ కప్పుతూన్న దృశ్యాన్ని తదేక దీక్షతో పదేపదే పరికిస్తూ, చిన్నదరహాసంతో ఎంతో అందంగా ముగ్ధ మనోహరంగా వుందీమ్మాయ్ రూపం… అని అనుకోకుండా వుండలేక పోయాడతను. ‘నిన్న తన పట్టిన రోజని నాకెలా తెలుసా?’ అని ఎంతగానో ఆలోచించి వుండవచ్చు అనుకుంటూ చిన్నగా లోలోన నవ్వుకున్నాడు. ఆ మైమరుపులో బిస్కెట్స్ సంగతే మర్చిపోయాడు. ఆ పేపర్సు చూస్తూ చాలా సేపక్కడే కూర్చుండి పోయాడు.
ఖాళీ టీ కప్పు తీసుకెళ్ళడానికొచ్చిన వంటావిడ “సార్! మీరు బిస్కెట్స్ తిననే లేదు” మెల్లిగా గుర్తు చేసినట్లుగా అంది.
అప్పుడతను ముఖానికున్న పేపర్ అడ్డు తీసి చూసి “అవునా! మర్చి పోయానేమో”అంటూ చిన్నగా నవ్వాడు.
అంతట్లో డ్రైవర్ రంగ రావడంతో తాను లేచి ఆ పేపర్ని ఓ చోట జాగ్రత్త పరిచి స్నానానికి బాత్ రూమ్‌లో కెళ్ళాడు.
అతను డ్రెస్ చేసుకొని తయారయి అయి హాల్లోకి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ పై ఓప్లేట్ లో నాలుగిడ్లీలు చట్నీ గ్లాస్‌తో వాటర్ అన్నీ రెడీగా వున్నాయి, అవి తినేసి షూ లేసుకొని.. అరగంటలో కార్లో కూర్చున్నాడు,
ఓవారం పది రోజులు పల్లెప్రగతి పనులను పర్యవేక్షిస్తూ, ఊరూరు తిరుగుతూ చాలా బిజీగా వున్నాడు కలెక్టర్ ప్రేమ్ సాగర్.
ఓ రోజు వున్నట్లుండి తాను సివిల్స్‌కి ప్రిపేరు అవుతున్న అనిందితకు తాను మెటీరియల్ అంతా యిస్తానని చెప్పిన విషయం హటాత్తుగా గుర్తు కొచ్చింది. వెంటనే డ్రైవర్ రంగతో పైనున్న సూట్కేస్ తీయించాడు.
“రంగా! దీన్ని నీవు ఎలాగైనా పుష్పాల గూడెం వెళ్ళి మనం పోయిన వారం వెళ్ళంకదా! ఆ అనిందిత మేడానికి ఇది యిచ్చి రావాలి”
“సరే, సార్ ! తప్పక వెళ్తాను. మీరెప్పుడు వెళ్ళమంటారు?”
ఓ క్షణం ఆలోచించి “ఆ ఊరికి వద్దులే. వాళ్ళింటికే తీసికెళ్ళి యిస్తే బాగుంటుందేమో! నేనీ రోజు డి.పి.ఓ. గారితో మాట్లాడి యింటి అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకొని రేపు నీకు చెప్తాను.” అన్నాడు.
“ఓ.కె… సార్” అని చెప్పి డ్రైవర్ వెళ్ళి పోయాడు.
కలెక్టర్ గారు ఎవరికో ఫోన్ కలిపి మాట్లాడసాగారు.
***
రాత్రి టైమ్ తొమ్మిదైంది. ఇంట్లో అందరూ భోజనాలు చేసి పండుకున్నారు.
అనిందిత మాత్రం టేబుల్ ముందు చదువుతూ కూర్చొంది. ఇంతట్లో పక్కనే వున్న తన సెల్ మోగింది. ఈ రాత్రి పూట ఎవరో… సందేహంగా చూస్తూ కొత్త నెంబరులా వుందనుకుంటూ ఆన్ చేసి “హలో” అంది నెమ్మదిగా.
“………………..” అవతలి వైపు నిశ్శబ్దం.
“హలో, ఎవరండీ?”
“అనిందిత గారూ,… నేను…” అంటూ అవతలి వైపు మాట్లాడుతున్న అతను ఓ క్షణం ఆగాడు.
‘గొంతు ఎక్కడో విన్నట్లుగానే వుందే…’ అనుకోకుండా వుండలేక పోయింది అనిందిత.
“హలో, ఎవరండీ? నేను అంటే… ఎలా తెలుస్తుంది?” ఈమారు కొంచెం బిగ్గరగానే అడిగింది.
“ఓ సారీ! నేనెవర్నో చెప్పలేదు కదూ! నేను ప్రేమ్ సాగర్‌ని అనిందిత గారూ! ఎలా వున్నారు?” నవ్వుతున్నట్లుగా సౌమ్యంగా అడుగుతున్న అతనెవరో తెలిసేసరికి మనిషి నిటారైంది. కంగారుతో లేచి నిల్చుంది.
“సారీ, సార్! నమస్తే! నేను ఎవరో అనుకున్నాను, వెరీ సారీ సార్!” తడబాటుగా క్షమించమన్నట్లుగా అడిగింది.
“భలే వారే… సారీ ఎందుకండీ? చెప్పా పెట్టకుండా ఫోన్ చేసినందుకు నేనే మీకు సారీ చెప్పాలి. మీకు డి.పి.ఓ గారు ఫోన్ చేసి చెప్తారనుకున్నాను. వారి దగ్గరినుంచే మీ సెల్ నెంబర్ని తీసుకున్నాను మీతో మాట్లాడుదామని.. ప్రస్తుతం ఏం చేస్తున్నారు?”
“చదువుకుంటున్నానండీ!”
“గుడ్, మీకేమన్న డవుట్స్ వుంటే నాకు తెల్పండి. క్లియర్ చేయగలనేమో ప్రయత్నిస్తాను. నేను ఈ టైమ్ లో ఖాళీగానే వుంటాను… బుక్స్ చదువుతుంటాను. నా పర్సనల్ నెంబరిదే. నేనిప్పుడు మీకెందుకు ఫోన్ చేశానంటే…”అంటూ అర్థోక్తిలోనే ఆగిపోయాడు.
“చెప్పండి సర్?”
“మరే, నేను సివిల్స్‌కి చదివిన మెటీరియలంతా రేపు మా డ్రైవర్ రంగతో పంపిస్తాను. మీయింటి అడ్రస్ మెసెజ్ చేయండి అనిందింత గారూ “
“సరే సర్.”
మళ్ళీ అతనే గొంతు విప్పాడు. “మీతో ఇంకో విషయం కూడా మాట్లాడాలి అనిందిత గారూ! మీ గ్రామ అభివృద్ధి నిజంగా చాలా వండర్‌ఫుల్‌గా… నూటికి నూరు శాతం అన్ని పనులూ, అన్ని విషయాల్లో జరిగాయి. అద్భుతంగా ఆదర్శవంతంగా మీరు జనాల్లో మమేకమై పని చేసి చూపించారు. ఈ వారం పదిరోజుల్లో నేను తిరిగిన గ్రామలలో మీ ఊరులా పరిశభ్రంగా పచ్చదనంతో ఏ ఒక్కటీ లేవనే చెప్పాలి. అన్ని పనులూ అసంపూర్ణంగానే వున్నాయి. ప్రతి ఊరిలోని పంచాయితీ సెక్రటరీ మీలాగుంటే… సమాజం సంపూర్ణంగా వినూత్న పద్ధతులతో ప్రగతి పథంలో ముందుకు సాగిపోతుంది అనిందితగారూ!”
“ధాంక్స్ సర్! మీరింతగా నన్ను పొగడ్తలలో ముంచకండి ఫ్లీజ్… నా వృత్తి ధర్మంగా శాయశక్తులా కృషి చేశాను. ఫలితం సాధించాను.”
ఆ మాటలకు చిన్నగా నవ్వాడు ప్రేమ్ సాగర్.
“పొగడ్తలు మీకు గిట్టవని నాకా రోజే అర్ధమైంది. సివిల్స్ పరీక్షలో కూడా మీరిసారి తప్పకుండా విజయం సాధించగలరనీ… నాలా మీరూ ఈ సమాజానికి అన్నివిధాలా ఉపయోగ పడగలరనీ ఆనందంతో మీ శ్రేయస్సు కోరే ఓ ఆత్మీయుడిగా మీకోరిక ఫలించాలని, స్వచ్ఛమైన నిండు మనస్సుతో కోరుకుంటున్నాను.”
“ధ్యాంక్స్ సర్”
“మీతో ఇంకో విషయం మాట్లాడాలి. జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే బంధాలు, అనుబంధాలలో స్నేహం చాలా ముఖ్యమైనది అనిందిత గారూ! మనిషికీ మనిషికీ మధ్య స్నేహం మాత్రమే యథాలాపంగా అత్యంత సహజంగా జరుగుతుంది. అదే విధంగా మీతో జరిగిన పరిచయం ఓపూల పరిమళంలా నన్ను ప్రేమతో చుట్టు ముడుతుంది. మీకిది ఇష్టమో కాదో నాకు తెలీదు. అదీ మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా! ఎప్పుడైనా ఇలా మీతో మాట్లాడేందుకు అనుమతించగలరా?” ఎంతో మృదు గంభీర స్వరంతో అభ్యర్ధిస్తున్నట్లుగా వున్నాయి ఆమాటలు.
ఏం మాట్లాడలేదు ఓ క్షణం అనిందిత. ఇలాంటి క్షణం వస్తుందనుకోలేదు.
“…………………..”
“ఏం మాట్లాడరేంటి? నో అబ్జెక్షన్ కదూ!? “
“ఊ,…” అంటూ సన్నగా మూలిగింది.
“ఓ కె. అనిందిత గారూ ధ్యాంక్స్. మరిక వుంటాను గుడ్ నైట్!”
“గుడ్ నైట్ సర్”
అవతలి వైపు అతను ఫోన్ పెట్టేశాక కూడా అనిందిత అలాగే కొద్ది క్షణాలు స్తబ్ధుగావుండి పోయింది.. ఏదో తెలియని ఓ అందమైన మధురమైన ఊహాతో మనస్సు చిత్రవిచిత్రమైన భావాలతో ఓలలాడసాగింది.
(ఇంకా ఉంది)