[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]స[/dropcap]ల్మాన్ ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించసాగింది. సత్తువ సన్నగిల్లింది. పని చేయలేకపోతున్నాడు. అలాగని పని మానేయడానికి వీల్లేని పరిస్థితి. మానేస్తే తినడానికి, తాగడానికి డబ్బులెక్కడినుంచొస్తాయి? అతను ఇన్నేళ్ళుగా పని చేస్తున్నా, అవసరంలో ఆదుకోడానికి చిల్లి గవ్వ కూడా పొదుపు చేయలేకపోయాడు. షరీఫ్‌కి అతన్ని చూస్తే జాలిగా ఉంది. అతని నాలుగు టేబుళ్ళలో రెండు టేబుళ్ళ బాధ్యత కూడా షరీఫ్ తన నెత్తిన వేసుకున్నాడు. హోటల్లో ఉన్నంతసేపు ఎడతెరపిలేని పని.. గదికొచ్చాక సల్మాన్‌కి చేసే ఉపచారాలు.. షరీఫ్ కూడా అలసిపోతున్నాడు. ఐనా సల్మాన్ మీదున్న కృతజ్ఞత కొద్దీ పని భారాన్నంతా మోస్తున్నాడు.
ఆరునెలలు భారంగా గడిచాయి. సల్మాన్ ఎక్కువ సేపు నిలబడలేక పోతున్నాడు. చాయ్ తెచ్చి పెట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడంటూ కస్టమర్ల ఫిర్యాదులు ఎక్కువైనాయి.
“నువ్వు పని మానేయి. యింకా చేయలేవు” అన్నాడో రోజు షరీఫ్.
“పని మానేస్తే నాకు తిండెవరు పెడ్తారు?” అన్నాడు సల్మాన్.
“నేను తెచ్చి పెడ్తాను. నువ్వు గదిలో విశ్రాంతి తీసుకో. వారానికో సారి ఆస్పత్రికెళ్ళి మందులు తెచ్చుకుంటే చాలు.”
“నీకైనా యజమాని ఉత్తినే ఇవ్వడుగా.”
“నేను నీ తిండి ఖర్చుని భరిస్తాను. నిన్ను పోషించుకుంటాను సల్మాన్.”
“నిజంగానా? నువ్వు చాలా మంచోడివి. నీకు అల్లా కరుణాకటాక్షాలు తప్పకుండా లభిస్తాయి. నువ్వు త్వరలోనే నీ భార్యాబిడ్డల్ని కల్సుకోవాలని నేను రోజూ దువా చేస్తాను షరీఫ్” అన్నాడు సల్మాన్. అతని కళ్ళల్లో నీళ్ళూరాయి.
సల్మాన్ పని మానేయడంతో షరీఫ్ ఒక్కడే పనంతా చేసుకోవాలి కాబట్టి యజమాని అతని జీతం పెంచాడు. అలా పెరిగిన జీతాన్ని తను హిందూస్తాన్ కెళ్ళడం కోసం దాచుకుంటున్న డబ్బుతో కలిపి దాచుకోకుండా సల్మాన్‌కి అవసరమైన తిండికోసం ఖర్చు చేస్తున్నాడు. జబ్బుతో బాధపడ్తోన్న సల్మాన్‌ని పసిపిల్లాడిని చూసుకున్నట్టు చూసుకుంటున్నాడు.
మరో మూడు నెలలు గడిచాయి…
ఓ రోజు రాత్రి డ్యూటీ ముగించుకుని వచ్చిన షరీఫ్, గదిలో సల్మాన్ లేకపోవడంతో కంగారుపడ్డాడు. ఏమైందతనికి? ఎక్కడికెళ్ళాడు? జబ్బు ముదిరిపోవడం వల్ల ఆస్పత్రిలో ఎవరైనా చేర్చారా? లాంటి అనేక అనుమానాల్తో సతమతమౌతూ, గదిని పరికించి చూసి షాక్‌కి లోనయ్యాడు. గదిలో సల్మాన్ పడుకునే చాప లేదు. అతని సందూక్ కానీ, అతను విడిచిన బట్టలు కానీ లేవు. భయపడూనే తన సందూక్ పెట్టిన మూల వైపు చూశాడు. సందూక్ లేదు. నెత్తిమీద పిడుగు పడ్డట్టు కుప్పకూలిపోయాడు. ఆ ట్రంకు పెట్టెలోనే తన కష్టార్జితమంతా ఉంది. దాదాపు రెండేళ్ళ శ్రమని డబ్బుగా మార్చి దాచుకున్న పెట్టి.. అందులోనే తను దాచుకున్న కలలున్నాయి. ఎప్పటికైనా తన భార్యాబిడ్డల్ని కల్సుకోవాలన్న కోరికలున్నాయి.
తన కళ్ళు చూసిన నిజాన్ని కూడా షరీఫ్ నమ్మలేకుండా ఉన్నాడు. సల్మాన్ అలా చేసి ఉంటాడంటే నమ్మడానికి అతని మనసు ఎదురు తిరుగుతోంది. లేదు. సల్మాన్ మంచివాడు. ఎప్పటికీ అలా నమ్మక ద్రోహం చేయడు. ఎవరో సల్మాన్‌ని కొట్టి, ఎక్కడో పడేసి రెండు సందూక్‌లని దొంగిలించుకుని పోయిఉంటారు. గాయాల్తో సల్మాన్ ఎక్కడైనా పడిఉన్నాడేమోనని చుట్టుపక్కలంతా వెతికాడు. సల్మాన్ కన్పించలేదు.
ఉదయం ఇరుగుపొరుగున ఉన్నవాళ్ళని వాకబు చేస్తే నిన్న పదింటికి సల్మాన్ రెండు సందూక్‌లని చెరో చేత్తో పట్టుకుని, చాపని చంకలో పెట్టుకుని వెళ్తూ కన్పించాడని చెప్పారు. షరీఫ్ హతాశుడైనాడు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఆశ్రయమిచ్చినట్టు ఇచ్చి దగా చేసిపోయే మనుషులు.. తనిన్నాళ్ళూ పడుకుంది పడగనీడలో అని తెల్సుకోలేకపోయాడు. అవకాశం దొరగ్గానే పాము కాటేసి, జర్రున జారిపోయింది.
స్వంత తమ్ముడికి చేసినట్టు అతనికి సపర్యలు చేశాడే.. మూడు నెలలు అతడ్ని తన సంపాదనతో పోషించాడే.. జబ్బుతో ఉన్న మనిషని జాలి పడ్డాడే.. ఆ నీచుడికి విశ్వాసం లేకుండా పోయిందే.. కృతజ్ఞత లేకుండా పోయిందే..
ఆలస్యంగా డ్యూటీ ఎక్కిన షరీఫ్‌ని తిట్టబోయిన యజమాని అతని కన్నీళ్ళు చూసి ఆగిపోయాడు. తనకు జరిగిన అన్యాయం చెప్పి, వెక్కి వెక్కి ఏడ్చాడు షరీఫ్. యజమాని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. పది రోజులు దాటినా సల్మాన్ ఆచూకీ తెలియలేదు. వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి ఉంటాడేమోనని అక్కడా వెదికించారు. సల్మాన్ అక్కడికి రాలేదని తెల్సింది. అతను దొరికే అవకాశంగానీ, తను దాచుకున్న డబ్బు మళ్ళా తన చేతికొస్తుందన్న ఆశగానీ లేకపోవడంతో షరీఫ్ నిరాశలో కుంగిపోయాడు.
రోజులు నిరాసక్తంగా గడిచిపోతున్నాయి. షరీఫ్ ఓ మరయంత్రంలా పని చేస్తున్నాడు. అతనికి జీవితం మీద విరక్తి కలుగుతోంది. ఏదో ఒక పని చేసి కాసిని డబ్బులు సంపాదించుకోవడం, ఆకలి తీర్చుకోడానికి కడుపుకింత తినడం, నిద్రోస్తే పడుకోవడం.. ఇదేనా జీవితం? ఇందుకేనా తను పుట్టింది? ప్రేమలూ ఆప్యాయతలూ లేని బతుకేం బతుకు? భార్యా బిడ్డలకు దూరమై ఏకాకిగా బతుకుతున్న ఈ బతుకూ ఓ బతుకేనా.. అతనికీ మధ్య చచ్చిపోతే బావుండుననిపిస్తోంది. మళ్ళా వెంటనే తను ప్రాణంలా ప్రేమించిన హసీనాని, ఆస్‌మాని చూడకుండా చచ్చిపోతే ఎలా అనిపిస్తోంది. వాళ్ళని చూడకుండా తను చనిపోయే ప్రసక్తే లేదు. ఒకవేళ చావు తరుముకొచ్చినా దాన్ని పొలిమేరల వరకు తరిమి కొడ్తాడు తప్ప దానికి లొంగిపోడు. ఇలా అనుకోగానే మళ్ళా బతుకు మీద తీపి పుడ్తోంది.
ఓ రోజు రాత్రి ఎనిమిదింటికి కస్టమర్లకు పరోటాలు, చాయ్‌లు అందిస్తూ హడావిడిగా తిరుగుతున్నప్పుడు, లోపలికొచ్చి ఓ టేబుల్ ముందు కూచుంటున్న వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూశాడు. అతను జమీల్‌లా అన్పించాడు. కానీ జమీల్ కాదు. యాపిల్ పండులాంటి రంగు కదా అతన్ది. ఇతను కమిలిపోయి కన్పిస్తున్నాడు. అతని కళ్ళు అందమైన ఆడపిల్ల కళ్ళలా విశాలంగా ఉంటాయి కదూ. ఇతని కళ్ళకింద అంగుళం మందాన నల్లటి చారలున్నాయేమిటి?
జమీల్ పుష్టిగా కదా ఉంటాడు. ఇతను నెల్రోజుల్నుంచి పస్తులున్నట్టు చిక్కిపోయి కన్పిస్తున్నాడుగా, ఐనా అనుమానం తీరక దగ్గరకెళ్ళి చూశాడు. అదే సమయంలో అతను కూడా కళ్ళెత్తి చూసి “ఏక్ ఆలూ పరోటా” అని యింకేదో అనబోయి నోట మాట రాక షరీఫ్ వైపు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.
అతను జమీలే అని నిర్ధారించుకున్న షరీఫ్ సంతోషం పట్టలేక “జమీల్.. ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి? ఇలా చిక్కిపోయావేమిటి? మన వూర్నుంచి ఎప్పుడొచ్చావు? వూళ్లో అందరూ బావున్నారా? నా బీబీ హసీనా, బేటీ ఆస్‌మా ఎలా ఉన్నారు?” అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు.
అతన్ని గుర్తు పట్టిన జమీల్ ఆశ్చర్యపోతూ “షరీఫ్ చిచ్చా.. మీరా? మీరిక్కడున్నారేమిటి” అని అడిగాడు.
“ఏం చెప్పమంటావు? నాదో విషాద గాథ. పగవాడిక్కూడా ఇలాంటి శిక్ష పడకూడదు జమీల్. మన వూరిని హిందూస్తాన్ సైనికులు వశపర్చుకున్న రోజు నేను బ్రోల్మోలో ఉండిపోయా. మరునాడు మన వూరికెళ్దామని ప్రయత్నిస్తే సరిహద్దుని కాపలా కాసే సైనికులు అడ్డుకున్నారు. నేనిక్కడ ఒంటరిగా మిగిలి పోయా. ఇంతకూ నువ్వెలా వచ్చావు? పాకిస్తాన్ రావడానికి అనుమతులెలా సంపాదించావు? ఎప్పుడు తిరిగెళ్తున్నావు? దయచేసి నన్ను కూడా నీతో తీసుకెళ్ళవా నీకు పుణ్యముంటుంది?” అన్నాడు షరీఫ్.
జమీల్ అతని వైపు దిగులుగా చూశాడు. “బాబాయ్… మీదీ నాదీ ఒకే పరిస్థితి. నేనా రోజు ఈ వూర్లోనే ఉండిపోయాను. తిరిగెళ్ళడానికి వీల్లేదన్నారు సైనికులు. అప్పటినుంచి ఇక్కడే ఒంటరిగా వేదనలో బతుకుతున్నాను. నాకు నా భార్య అనీస్ గుర్తుకొస్తోంది. పెళ్ళయిన కొన్ని రోజులకే భార్యకు, తల్లిదండ్రులకు దూరమైన దౌర్భాగ్యుణ్ణి బాబాయ్” అంటూ జమీల్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
షరీఫ్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
జమీల్‌ని చూడగానే అతను హుందర్మో నుంచి వచ్చి ఉంటాడనుకుని సంబరపడ్డాడు. అట్నుంచిటు రావడానికి మార్గం సుగమమైంది కాబట్టి తను యిట్నుంచటు పోవడానికి ఇబ్బంది తొలగిపోయి ఉంటుందనుకున్నాడు. అతన్తో కలిసి వూరెళ్ళిపోయి తన భార్యా బిడ్డల్ని చూడొచ్చని సంతోషపడ్డాడు. ఇప్పుడు జమీల్ కూడా తనలానే ఈ వూళ్లో చిక్కుకుపోయాడని తెలియడంతో మరో విషాదం అతన్ని చుట్టుముట్టింది. తనకిష్టమైన అక్క కూతురు అనీస్ బతుకుని తల్చుకుని దుఃఖం వెల్లువలా పొంగింది. అనీస్ తన కళ్ళముందే ఉంటుందని కదా తన వూళ్లోనే జమీల్ కిచ్చి నిఖా చేశాడు. పెళ్ళయిన కొన్ని నెలల్లోనే భర్తకు దూరమై అనీస్ ఎంత బాధపడ్తోందో.. ఆమె దురదృష్టం వల్లనే తమ కొడుకు దూరమైనాడని ఆమె అత్తామామలు ఎంత హింస పెడున్నారో..
“ఇంతకూ ఈ పనెందుకు చేస్తున్నారు బాబాయ్?” అని అడిగాడు జమీల్.
“బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా” నిస్పృహగా అన్నాడు షరీఫ్.
“ఐనా రైతుగా గౌరవంగా బతికిన మీరు హోటల్లో సర్వర్ పని చేయడం ఏమిటి? మిమ్మల్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉంది బాబాయ్.”
“ఏం చేయమంటావు? నేనీ వూరికి కొత్త. నన్ను నమ్మి పనిచ్చేవాళ్ళెవరు? ఆకలితో మాడి చనిపోకుండా ఈ పనైనా యిచ్చి హోటల్ యజమాని నన్ను ఆదుకున్నాడు.”
“నా పూల దుకాణం ఈ వూళ్లోనే అని తెల్సుగా. నా దగ్గరకొచ్చిఉంటే నేనే ఏదో ఒక మార్గం చూపించి ఉండేవాడ్ని కదా.”
“నువ్వు కూడా నాలానే ఇక్కడ బందీ అయ్యావని వూహించలేదు. మన వూళ్లో అనీస్‌తో, మీ అమ్మా నాన్నల్తో హాయిగా ఉండి ఉంటావనుకున్నా. అందుకే నిన్ను వెతుక్కుంటూ రాలేదు.”
“సర్లెండి.. ఐపోయిందేదో ఐపోయింది. ఈ పని మానేసి నాతో పాటు వచ్చేయండి.”
“తప్పకుండా వస్తాను. ఇంతకూ నాకేం పని ఇప్పిస్తావు?”
“నా పూల వ్యాపారం ఉందిగా బాబాయ్. మీ కోసం కూడా మాలలల్లిస్తాను. మీకు నాపక్కనే ఓ చోటు చూపిస్తాను. అక్కడ కూచుని పూలమ్మండి. నేనిక్కడ అద్దె గదిలో ఉంటున్నాను. మీరూ నాతో పాటే ఉండండి.”
షరీఫ్‌కి ఇప్పుడు తను చేస్తున్న సర్వర్ పని కన్నా పూలమ్మడం గౌరవంతో కూడుకున్న పని అన్పించింది. జమీల్ తనకు బంధువు కాబట్టి తనను సల్మాన్ మోసం చేస్తాడన్న భయం ఉండదు. అతను తనకు తోడుగా ఉంటే తను అనుభవిస్తున్న భయంకరమైన ఒంటరితనం నుంచి కొంతైనా వూరట లభిస్తుంది.
“వెంటనే పని మానేసి రావడం భావ్యం కాదు జమీల్. నన్నాదుకున్న మా యజమానిని ఇబ్బంది పెట్టలేను. అతనికి మరో సర్వర్ దొరికే వరకు ఇక్కడే ఉంటా. ఆ తర్వాత నీ దగ్గరకు వస్తా” అన్నాడు షరీఫ్.
జమీల్ పరోటా తిని చాయ్ తాగాక, షరీఫ్‌కి తన పూల దుకాణంతో పాటు అద్దె గది చిరునామా కూడా చెప్పి, అక్కడికి ఎలా రావాలో అర్థమయ్యేలా విశదపరచి “తప్పకుండా రండి బాబాయ్. మీ రాక కోసం ఎదురుచూస్తుంటాను” అనేసి ‘ఖుదా హాఫీజ్’ చెప్పి వెళ్ళిపోయాడు.
***
‘అమ్మకు ఆరోగ్యం బాగుండటం లేదు మామూ.. గుండెల్లో నొప్పంటూ ఏడుస్తోంది. దవాఖానాకు పిల్చుకెళ్తాం రమ్మంటే రానంటోంది. నువ్వొకసారి వచ్చి అమ్మను హకీం దగ్గర చూపిస్తే మంచిది. అమ్మ నీ మాట తప్పకుండా వింటుంది. వీలైనంత తొందరగా రా మామూ” అంటూ ఆస్‌మా నుంచి వచ్చిన కార్డుని చదువుకున్న ఫక్రుద్దీన్ కంగారుపడిపోయాడు.
“వెంటనే బయల్దేరడం మంచిది. చీకటి పడకముందే హుందర్మాన్ చేరుకోవచ్చు. రెండు రోజులకు సరిపడా బట్టలు సర్దు” అన్నాడు ఫౌజియాతో.
“నేను రాలేనండీ. ఈ మధ్య నడుంనొప్పి విపరీతంగా బాధిస్తోంది. మీరెళ్ళిరండి” అంది ఫౌజియా. ఆమె ఓ గుడ్డసంచిలో రెండు జతల బట్టలు సర్ది ఫక్రుద్దీన్ చేతికిస్తూ “దార్లో అరటిపళ్లో బత్తాయి పళ్ళో కొనుక్కుని వెళ్ళండి. మీ చెల్లెల్ని పట్నం పిల్చుకెళ్ళి డాక్టర్‌కి చూపించుకుని రండి” అంది.
ఫక్రుద్దీన్ హుందర్మాలోని తన చెల్లెలి యింటికి చేరుకునేటప్పటికి సాయంత్రం ఐదయింది. ఆస్‌మా చేతికి తన సంచితో పాటు దార్లో కొన్న డజను అరటి పళ్ళని యిచ్చి, ఆమె తెచ్చిచ్చిన చెంబుడు నీళ్ళతో కాళ్ళూ చేతులు కడుక్కుని లోపలికెళ్ళి మంచంమీద పడుకుని ఉన్న హసీనాని పలకరించాడు. ఆమె చాలా నీరసంగా కన్పించింది. నెలోజుల్నుంచి లంఖణాలు చేస్తున్నట్టు మొహం పీక్కుపోయి ఉంది.
“ఇలా ఐపోయావేమిటి బహెన్? తిండీ తిప్పలు మానేసి బావగారెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నావా ఏమిటి” అన్నాడు ఫక్రుద్దీన్.
“నువ్వు చెప్పింది నిజమే మామూ. అమ్మ సరిగా తినడం లేదు. రాత్రంతా నిద్ర పోకుండా మేల్కొనే ఉంటోంది. ఎప్పుడు చూసినా ఈ లోకంలో లేనట్టు ఏదో ఆలోచిస్తో ఉంటుంది” అంది ఆస్మ.
“యింకా ఎన్నాళ్ళని దిగులు పడ్తూ కూచుంటావు? రెండేళ్ళకు పైగా అయింది. యింక బావ తిరిగొస్తాడన్న ఆశ నాకు లేదు. ఆయన తిరిగిరావాలన్నా దానికి అనుకూలించే పరిస్థితులు కూడా లేవు బహెన్. మనసు రాయి చేసుకోక తప్పదు. బావ రాక కోసం ఎదురుచూసింది చాలు. ఆస్‌మా పెళ్ళి గురించి ఆలోచించు.”
“ఆయన లేకుండా ఆస్మా పెళ్ళి ఎలా చేయమంటావన్నయ్యా” కన్నీళ్ళ పర్యంతమౌతూ అంది హసీనా.
“తప్పదమ్మా. ఎన్నాళ్ళని ఈడొచ్చిన ఆడపిల్లకు పెళ్ళి చేయకుండా యింట్లో ఉంచుకుంటావు? నాలుగు నెలలు ఆగమన్నావు. ఆగాను. మరో ఆర్నెల్లు ఆగమన్నావు. ఆగాను. తర్వాత మరో ఆర్నెల్లు.. వయసు ముదిరిపోతే దాన్ని పెళ్ళెవరు చేసుకుంటారు? ఆలోచించు.”
“నీ బావగారు తన దోస్త్ లతీఫ్ కిచ్చిన మాటను మర్చిపోతున్నావు. ఆయన తన స్నేహితుడి కొడుక్కి అమ్మాయినిస్తానని మాటిచ్చాక మనం వేరే సంబంధం చూస్తే రేపు నీ బావ తిరిగొచ్చాక ఆయనకు ఏం సమాధానం చెప్తాం? ఆయనిచ్చిన మాటను గౌరవించడం మన బాధ్యత కాదా?”
“అయ్యో పిచ్చి చెల్లెమ్మా.. రెండేళ్ళు దాటిపోయినా లతీఫ్ తన కొడుక్కి పెళ్ళి చేయకుండా మన అమ్మాయి కోసం ఎదురుచూస్తూ ఉంటాడనుకుంటున్నావా? వేరే అమ్మాయితో ఎప్పుడో పెళ్ళి చేసేసి ఉంటాడు. మనం కూడా ఆస్‌మా కోసం వేరే సంబంధాలు వెతకడం మంచిది.”
“నాకెందుకో లతీఫ్ భయ్యా అలా చేస్తాడనిపించడం లేదు. నీ బావగారికి లతీఫ్‌కి మధ్య ఉన్న స్నేహం అంత బలమైంది.”
“లతీఫ్‌కి అలా చేయాలన్న ఉద్దేశం లేకపోవచ్చు. కానీ ఈ రెండూళ్ళ మధ్య ప్రభుత్వాలు గీసిన సరిహద్దు రేఖ చాలా క్రూరమైంది చెల్లీ. అది స్నేహబంధాల్ని పుటుక్కున తెంపేయగలదు. అనుబంధాల్ని ఆత్మీయతల్ని చెరిపేయగలదు.”
(ఇంకా ఉంది)