[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
ద్రావిడ విశ్వవిద్యాలయం:
[dropcap]చి[/dropcap]త్తూరు జిల్లా కుప్పంలో 1997లో ద్రవిడ విశ్వవిద్యాలయం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సంకల్పబలంతో ఆరంభమైంది. ద్రవిడ భాషల అభివృద్ధి కోసం, ఆంధ్ర ప్రభుత్వం, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సహకారంతో ఈ సంస్థ పుట్టింది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు బాషల అధ్యయనానికి ఇది పెద్ద పీట వేసి ప్రగతి పథంలో నడుస్తోంది.
క్రమ సంఖ్య | పూర్తి కాలం పని చేసిన ఉపాద్యాక్షులు | పదవీకాలం | మాతృసంస్థ |
1. | ఆచార్య పి.వి.అరుణాచలం | 1997-2001 | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గణితశాస్త్ర ఆచార్యులు |
2. | ఆచార్య రవ్వా శ్రీహరి | 2001-2005 | కేంద్రవిశ్వవిద్యాలయం, తెలుగు శాఖ |
3. | ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ | 2005-2008 | తెలుగు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ |
4. | ఆచార్య కడప రమణయ్య | 2008-2011 | తెలుగు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ |
5. | ఆచార్య కె.రత్నయ్య | 2012-2015 | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం |
6. | ఆచార్య ఈడిగ సత్యనారాయణ | 2015-2018 | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ స్టాటస్టిక్స్ విభాగం
|
7. | ఆచార్య తుమ్మల రామకృష్ణ | 2021- | కేంద్రవిశ్వవిద్యాలయం, తెలుగు శాఖ |
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన కె.యస్.చలం 2005 మే లో ఒక నెల ఇక్కడ వి.సి.గా చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెంబరు అయ్యారు. ఈడిగ సత్యనారాయణ హయాంలో ఈ రచయిత మూడు మార్లు వివిధ సదస్సులలో పాల్గొన్నారు. ఆయన క్రాంతదర్శి సంస్థను పరుగులు తీయించారు. నేను ఇంగ్లీషులో రచించిన Sankarambadi Sundarachri గ్రంథాన్ని 2018లో రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఈ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సంస్థ ప్రసారరంగం ఆ పుస్తకాన్ని డా.శ్రవణకుమార్ ఆధిపత్యంలో ప్రచురించింది. రిజిష్ట్రారు బి.తిరుపతిరావు తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలలో దిట్ట. వారి సారధ్యంలో యూనివర్శిటీలో శ్రీ కుమార్ ద్రావిడ భాషా సెమినార్లు నిర్వహించారు. తెలుగు శాఖలో బూదాటి వెంకటేశ్వర్లు, శ్రీదేవి, వేణుగోపాలరెడ్డి అధ్యాపనలు కొనసాగించారు. పులికొండ సుబ్బాచారి జానపద సాహిత్య విభాగానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు. తెలుగు శాఖకు చెందిన డా.ఎ.కె వేణుగోపాల రెడ్డి ప్రస్తుత రిజిష్ట్రారు (2021 జూలై).
తొలి ఉపకులపతి:
ద్రవిడ విశ్వవిద్యాలయ తొలి ఉపకులపతి ఆచార్య పి.విశ్వనాధ అరుణాచలం. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 1935లో జన్మించి 1955లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిగ్రీ, 1957లో గణితశాస్త్రంలో ఎం.ఏ పూర్తి చేశారు. కొంతకాలం మదరాసు, కాంచీపురాలలో కళాశాలాధ్యిపత్యం వహించారు.
వేంకటేశ్వరుని కొలువులో:
తాను చదివిన విశ్వవిద్యాలయంలో 25వ ఏట 1960లో గణితశాస్త్ర ఉపన్యాసకులుగా ప్రవేశించి 1995లో ఆచార్యులుగా శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా మే లో రిటైరయ్యారు. తెలుగు సాహిత్యంపై విశేష అభిమానంగల అరుణాచలం అనేక వ్యాసాలు గణితసంబంధంగా ప్రచురించారు.
1966-68 మధ్య మదరాసు ఐ.ఐ.టిలో ఆచార్య యస్.డి. నిగం పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. 1969-77 మధ్య రీడరు. 1977 నుండి 95 వరకు ప్రొఫెసర్. ఎందరికో పి.హెచ్.డి పర్యవేక్షకులు. యూనివర్శిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జమినేషన్స్‌గా బాధ్యతలు నిర్వహించారు. అమెరికాలోని ప్లోరిడా విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్.
వ్యవస్థాపక ఉపకులపతి:
1997లో మారుమూల కుప్పం గ్రామంలో ద్రావిడ విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు అరుణాచలం తొలి ఉపకులపతిగా ఆ సంస్థకి దిశానిర్దేశం చేశారు. కుప్పంలో క్యాంపు కార్యాలయం నుండి పనులు ప్రారంభించి తులనాత్మక ద్రవిడ సాహిత్యము, తత్వశాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌లో కోర్సులు నడిపారు. తొలి రోజుల్లో తానే స్వయంగా పాఠాలు బోధించారు. శ్రీ కృష్ణదేవరాయ, పద్మావతీ విశ్వవిద్యాలయ ఉపాద్యక్షుడి బాధ్యతలు కొంత కాలం నిర్వహించారు. పలు పాఠ్యగ్రంథాలకు రచయిత. 2001లో పదవీవిరమణ.
2001-2002 సంవత్సరాలకు ఇండియన్ మాథమెటికల్ సొసైటీ అధ్యక్షులు. విశ్రాంత జీవితంలో అనేక సభలు-సమావేశాలలో పాల్గొని ప్రతిభను చాటారు. 2020 ఆగష్టులో తనువు చాలించారు.
అరుణాచలం తర్వాత ఆచార్య రవ్వా శ్రీహరి నాలుగేళ్లు వి.సి. తర్వాత గంగిశెట్టి లక్ష్మీనారాయణ. ఆపై కడప రమణయ్య. ఆయన 2008-11 మధ్య వి.సి.గా వుంటూ వివిధ శాఖలకు మార్గదర్శనం చేశారు. స్వయంగా నటులు. తెలుగు విశ్వవిద్యాలయం (రాజమండ్రి)లో తెలుగు శాఖ ఆచార్యులుగా పని చేసి 2008లో ద్రవిడ విశ్వవిద్యాలయ బాధ్యతలు చేపట్టారు. పి.హెచ్.డి పరిశోధనల విషయంలో వివాదాలు దారితీశాయి.
సాహితీపథంలో వజ్రపురవ్వ(1943):
అతి సామాన్య చేనేత కుటుంబంలో జన్మించి సాహిత్య పరిశోధననా నేత అయినారు ఆచార్య రవ్వా శ్రీహరి. నల్గొండ జిల్లా వెల్వర్తి గ్రామంలో 1943 సెప్టెంబరు 12న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఇంటికి తానే పెద్ద. యాదగిరి లక్ష్మినరసింహ సంస్కృత విద్యాపీఠంలో చేరి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. హైదరాబాదు సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలో బి.ఓ.యల్ (వ్యాకరణం) పూర్తి చేశారు. వివేకవర్ధని కళాశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగ ప్రస్థానం మొదలెట్టారు. తెలుగు, సంస్కృత భాషల్లో ఎం.ఏ. చేసి 1967లో ఆంధ్రసారస్వత పరిషత్‌లో లెక్చరర్ అయ్యారు. శలాక రఘనాథశర్మ కూడా అప్పుడు సహాధ్యాపకులు.
ఉస్మానియా గడపలో కాలు:
తెలుగు శాఖలో 1973 ఉస్మానియా తెలుగు శాఖలో చేరడం ఆయన జీవితంలో గొప్ప మలుపు. ఆచార్య బి.రామరాజు పర్యవేక్షణలో భాస్కర రామయణంపై పరిశోధన చేసి పి.హెచ్.డి సాధించారు. క్రమంగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ప్రవేశం మరో మలుపు. 17 సంవత్సరాలు అక్కడ అధ్యయన, అధ్యాపనలు కొనసాగించారు. ఏడేళ్లు శాఖాధ్యక్షులు (1991-98). తిరుపతి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీరికి మహామహోపాధ్యాయ బిరుదు నిచ్చింది.
ద్రావిడ విశ్వవిద్యాలయ మార్గదర్శి:
కుప్పంలో ఏర్పడ్డ ద్రావిడ విశ్వవిద్యాలయానికి శ్రీహరి 2001-2005 మధ్య ఉపకులపతి. విశ్వవిద్యాలయంలో వివిధ శాఖల పురోగభివృద్ధికి అహరహం కృషి చేశారు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణల విభాగం సంపాదకులుగా శ్రీమదాంద్ర మహాభారతం వంటి అనేక గ్రంథాలు వెలువడటానికి కారకులయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల శాఖలను మంజూరు చేయించారు.
గ్రంథపరిశ్రమలో నైఘంటికుడు:
ఒక్క చేతిమీదుగా పలు నిఘంటువులు నిర్మించారు.
- శ్రీహరి నిఘంటువు
- అన్నమాయ్య పదకోశం
- సంకేత పదకోశం
- వ్యాకరణ పదకోశం(బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి)
ఇదిగాక తెలుగులో 50 గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు 25 ప్రచురించారు. పరిశోధన, సృజన విమర్శ, నిఘంటువు నిర్మాణం, అనువాదం – ప్రక్రియలలో సిద్ధహస్తులు.
పురస్కార పరంపర:
- సి.పి.బ్రౌన్ పురస్కారం -2013
- ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ పురస్కారం 2013
- తానా వారి గిడుగు రామ్మూర్తి పురస్కారం 2014
సరసులు, సౌజన్యమూర్తి అయిన శ్రీహరి పరిశోధనారంగంలో వజ్రాల గని. నిరంతర సాహితీ పరిశోధకులు.
గంగిగోవు పాలు:
గంగిశెట్టి లక్ష్మీనారాయణ (1947) అనంతపురం జిల్లాలో జన్మించారు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయి పితామహుల పెంపకంలో పెరిగారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1965-68 డిగ్రీ చేశారు.
‘సమగ్ర సాహిత్య అధ్యయన విధానానికి మరో పేరు’ విమర్శ అని గట్టిగా నమ్మేవారిలో గంగిశెట్టి ప్రధానులు. పట్టభద్ర స్థాయిలో ఆంగ్ల సాహిత్యాన్ని ప్రతీక ఇచ్చికంగా ఎంచుకున్నారు. నాటి ఆచార్యుల శిష్యరికంలో అధ్యయనం చేసి తెలుగు విమర్శను శాస్త్రీయంగా వ్రాసే అలవాటు పెంచుకొన్నారు. అనేక వ్యాసాలను భారతిలో ప్రచురించారు. విమర్శన శాస్త్రాన్ని సమగ్రంగా తెలుగులో మూడు సంపుటలలో ప్రకటించడం ఆయన సంకల్పం.
1971 నుంచి ద్రావిడ భాషలపై మక్కువ పెంచుకొన్నారు. బెంగుళూరు క్రైస్తవ కళాశాలలో ఉద్యోగానికి నాంది పలికారు. తెలుగు, కన్నడ, అనువాదాలు చేస్తూ తులనాత్మక సాహిత్యంలో విశేష కృషి చేశారు. ఏడు అనువాద గ్రంథాలను వ్రాశారు. 2004లో బైరప్ప కన్నడ గ్రంథానువాదం – ‘పర్వ’ కేంద్రసాహిత్య అకాడమీ వారి పురస్కారం పొందింది. విశ్వనాథ సత్యానారాయణ రచనలకు కన్నడానువాదం – కావ్యానందం ప్రముఖం. తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పని చేశారు.
ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 2005-2008 మధ్య అనేక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పని చేసిన అగిశం వీరప్పకు వ్యక్తిగత కార్యదర్శిగా కొన్నాళ్లున్నారు. ‘సాహితీ సిరికోన’ అనే అంతర్జాల వేదికకు మార్గదర్శి.
జానపద ‘పులి’:
ద్రవిడ విశ్వవిద్యాలయంలో జానపద విభాగాధిపతిగా పని చేసి పదవీ విరమణ పొందారు డా. పులికొండ సుబ్బాచారి. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లోగడ పని చేశారు. సుబ్బాచారి (1957 జూలై) ఖమ్మం జిల్లా వారు. ఎం.ఏ, పి.హెచ్.డిలు ఉస్మానియా నుంచి చేశారు. ఆయన సిద్ధాంత వ్యాసం- ‘Caste Myths And Dependent Caste Systems’.
ద్రవిడ విశ్వవిద్యాలయ జానపద విభాగాధ్యక్షులుగా రెండు మార్లు పని చేశారు. అదే విశ్వవిద్యాలయ డీన్‌గా 2011 నుండి వ్యవహరించారు. నలుగురు విద్యార్ధులు ఎం.ఫిల్, ఒకరు పి.హెచ్.డి వీరి పర్యవేక్షణలో చేశారు. ఆయన స్వతహాగా కవి, విమర్శకుడు. జానపదసాహిత్య పరిశోధనలో ఆయన అందె వేసిన చేయి.
ద్రావిడ తుమ్మల (1957 అక్టోబరు):
కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా ఆచార్య తుమ్మల రామకృష్ణ 2020 డిసెంబరులో నియమించబడ్డారు. ఆయన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు. చిత్తూరు జిల్లాకు చెందిన వారు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పి.హెచ్.డి చేశారు. ఆధునిక సాహిత్యము, కవిత్వము, సృజనాత్మక రచనలు అభీష్టం. పాఠ్య గ్రంధాలు తయారు చేశారు.
రచనలు:
పరిశోధనాత్మక గ్రంథాలు- బారిష్టరు పార్వతీశం- ఒక పరీశీలన, 1992; పరిచయం – అధునిక తెలుగు సాహిత్యావ్యాసాలు – 2004; బహుముఖం 2009, అభినందనం 2015, అవగాహన 2016. వీరి పర్యవేక్షణలో 20 పి.హెచ్.డీలు, 34 ఎం.ఫిల్ వచ్చాయి. రష్యాలో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు.
సాహితీ శ్రీదేవి:
ద్రవిడ విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ఆచార్యులు కె.శ్రీదేవి కడప జిల్లా వారు (25.9.1964). తెలుగు, ఇంగ్లీషు, సోషియాలజీలలో మూడు ఎం.ఏలు సాధించారు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి డి.లిట్. అంశం తెలుగు సాహిత్యంలో సామాజిక దృక్పథం.
పి.హెచ్.డి సిద్ధాంత వ్యాసం ‘దశాబ్ది కథానికలు సమాజ ప్రతిబింబం’. 25 సంవత్సరాల బోధనానుభవం గల వ్యక్తి శ్రీదేవి.
ఇక్కడ తెలుగు శాఖకు చెందిన డా. ఏ.కె.వేణుగోపాలరెడ్డి (1969) అప్పప్ప కవి ‘శశిరేఖాపరిణయం’పై పరిశోధన చేశారు. 2021 జూలైలో రిజిష్ట్రారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2005 నుండి తెలుగు శాఖలో అధ్యాపకులు.
ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, ఏం.ఫిల్, పి.హెడ్.డి కోర్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు శాఖలో అధ్యాపకులు –
- శ్రీమతి డా.శ్రీదేవి – ప్రొఫెసరు
- డా. వి.పళని – అసిస్టెంట్ ఫ్రొఫెసరు
- డా. ఏ.కె వేణుగోపాలరెడ్డి – (రిజిష్ట్రారు) శాఖాధ్యాక్షులు
- డా. యస్. చిన్న రెడ్డయ్య – అసోసియేట్ ప్రొఫెసర్
- డా. బుక్యా తిరుపతి – అసోసియేట్ ప్రొఫెసర్
- ప్రచురణల విభాగం – డా. శ్రవణకుమార్.