పరిత్యక్త ఎవరు?

3
3

[dropcap]రో[/dropcap]డ్డు పక్క నుంచి పసికందు ఏడుపు వినిపించి లైలా అడుగులు ఆగిపోయాయి. పక్కకి వెళ్ళి చూస్తే, పచ్చ గడ్డి మధ్య బట్టలో చుట్టి ఉన్న చిన్న పసి కందు గుక్క పట్టి ఏడుస్తున్నది. మరో ఆలోచన లేకుండా లైలా ఆ పసి పాపని ఎత్తుకుని చూసింది. బొడ్డు కూడా ఊడని నవజాత శిశువు, ఆడపిల్ల. ఏడుస్తున్న పాపని గుండెల్కి హత్తుకుని చుట్టుపక్కల చూసింది, ఎవరైనా కనపడతారేమోనని. ఎవరూ కనిపించలేదు. పాపని ఊరుకోపెడుతూ కాసేపు అక్కడే వేచి ఉంది, ఒకవేళ పాపని వెతుక్కుంటూ ఏవరైనా వస్తారేమో అని. ఎందుకో అంత చిన్న పాపని, వెను తిరిగి చూడకుండా నిర్దయగా వదిలేసి వెళిపోయారంటే లైలాకి నమ్మశక్యంగా లేదు. తాను కూడా తన కళ్ళతో చూసి ఉండక పోతే నమ్మక పోదును. ఎంత సేపటికి పాపని వెతుక్కుంటూ ఎవరూ రాకపోయేసరికి, పాపని అలాగే గుండెలకి హత్తుకుని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి బైల్దేరింది లైలా. దారిలో ఒక పాల బుడ్డి కొని పక్కనే ఉన్న చిన్న హోటల్లో కాచిన పాలు కొని పాపాకి పాలు పట్టింది. మంచి ఆకలి మీద ఉందేమో అవురావురుమంటూ పాలు తాగి పాప శాంతించింది. దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లి విషయం వివరించింది, లైలా. “మీకు అభ్యంతరం లేదంటే ఈ పాపని నేను పెంచుకుంటాను బాబు. కాదనకండి. పాపకి ఏ లోటూ లేకుండా చూసుకుంటాను బాబు” అంటూ ప్రాధేయపడింది.

తను పుట్టిన కుటుంబం తనని మనస్ఫూర్తిగా స్వీకరించక పోయినా తన బతుకు తాను బతికే విధంగా చదువు చెప్పించారు. ఎలాగో కష్టపడి రైల్వేస్‌లో ఉద్యోగం సంపాదించుకుని ఇంటికి దూరంగా వచ్చేసింది. తన వల్ల తన కన్నవారు ఇబ్బంది పడకూడదని. ఆ తరవాత మళ్లీ ఇంటికి వెళ్లలేదు. కన్నవాళకి ఏమైనా అవసరం వస్తే దూరంగా ఉండి సాయం చేస్తూ ఉంటుంది. తిండికి బట్టకి లోటు లేదు. తమకంటూ ఒక సంఘం ఏర్పర్చుకుని లైలా లాంటి వారందరూ ఒక దగ్గరే ఉంటున్నారు.

ఒక అనాథ నవజాత శిశువుని పెంచుకోవటానికి హిందూ చట్టం లైలాకి అనుమతి ఇస్తుందో లేదో ఆ ఇన్స్‌పెక్టర్‌కి తెలియదు కానీ ఆ క్షణంలో ఆ పాపకి అంతకంటే మంచి ఆశ్రయం దొరకదనిపించింది. లైలా లోని నిజాయితీని చూసి అలా అనిపించింది.

లైలా అడ్రస్ రాయించుకుని,తన వివరాలన్ని తెలుసుకుని, అడిగాడు ఆ ఇన్స్‌పెక్టర్‌.

“అనాథాశ్రమానికి పంపకుండా, నువ్వు అంత నమ్మకంగా అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ జాగర్త ఏనాడైనా ఏ సిగ్నల్ ముందు అయినా పాపని ఎత్తుకుని కనిపించావంటే, చితక బాదేస్తాను” అని వార్నింగ్ ఇచ్చి “ ఒరేయ్, నాగబాబు, దీని వెంట వెళ్లి చూడు, ఎక్కడ ఉంటుందో. అవసరం రావచ్చు. తను చెప్పిందంతా ఎంత వరకు నిజమో కనుక్కుని రా” అని చెప్పి, తన తోటి సిపాయిని లైలా వెంట పంపించాడు ఇన్స్‌పెక్టర్‌.

అంతే, ఆనాటి నుంచి ఆ పాప లైలా దగ్గరే పెరిగింది. లైలా తోటి వారి అందరికీ కూడా ఆ పాప ఒక ఆట బొమ్మ అయిపోయింది. అందరూ కలిసి పాపకి ‘మంజుల’ అని నామకరణం చేశారు. లైలాయే కాకుండా తన సమూహం వారంతా కూడా పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.

మంజులకి మూడో ఏడు వచ్చింది. ఏ స్కూల్‌లో ఎడ్మిషన్ కావాలన్నా పాప జన్మపత్రం అడుగుతారని తెలుసు లైలాకి. ఏ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ అనుమతితో పాపని పెంచుకోవటానికి తెచ్చుకుందో, అతన్నే అడిగింది, ‘ఏం చేయాల’ని. అతను తనకు బాగా పరిచయం ఉన్న ఒక ఎన్.జి.ఓ సాయంతో మంజులకి జన్మపత్రం తయారు చేయించి ఇచ్చాడు. తాను మంజులకి సింగల్ పేరెంట్ అని చెప్పి, మంచి గవర్నమెంట్ స్కూల్లో వేసింది. ఆ రోజు మొదలు మంజులను తిరిగి చూడవల్సిన అవసరం రాలేదు. ఏ కులమో ఎవరి రక్తమో తెలీదు కానీ మంజులకు చదువు బాగా అబ్బింది. ‘ఇంత చక్కటి సంతానం అభివృద్ధిని చూసుకోలేని ఆ తల్లి తండ్రులు ఎంత దురదృష్టవంతులోకదా’ అని బాధపడేది లైలా.

జ్ఞానం తెలిసేక తను పెరిగిన వాతావరణం, తన తోటి పిల్లల్నీ, వారి కబుర్లు వింటూ మంజుల ఎంత వరకు సమాజంలో తన వాస్తవ అస్తిత్వం అర్థం చేసుకుందో తెలీదు కానీ ఏనాడూ లైలాని మాత్రం ప్రశ్నించలేదు. లైలా తన పట్ల చూపిన ప్రేమా ఆప్యాయత, మంజుల మనసులో వేసే ప్రశ్నలను అణచి వేసాయేమో.

చూస్తూండంగానే మంజుల యుక్తవయస్కురాలైంది. నిరాటంకంగా చదువుకుంటూ ఎం.ఎస్.సి లో ప్రవేశించింది. అప్పుడే పరిచయమైంది ప్రకాష్‌తో. మొదటి చూపులోనే ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు అయ్యారు. మిగతా పిల్లలతో కలిసి ఒకనాడు మంజుల, ప్రకాష్ ఇంటికి వెళ్లింది.

వాళ్లది అసలు సిసలైన తెలుగు బ్రాహ్మణ కుటుంబం అని తెలుసుకుంది. ఆ తరవాత ప్రకాష్ ఎంత ముందుకు వచ్చినా మంజుల దూరంగానే మసులుకుంటోంది. మంజుల ఎందుకు అలా ప్రవర్తిస్తునదో తెలీక ప్రకాష్ చాలా సార్లు ప్రాధేయ పడ్డాడు, కారణం చెప్పమని. తల్లి తండ్రి అయి పెంచిన లైలాని కించపర్చటం ఇష్టం లేక మంజుల కొంత కాలం సందేహిస్తూ గడిపింది. కానీ ప్రకాష్ మరీ పట్టు పడ్తే ఇక చేసేది లేక తన విషయం అంతా వివరించింది మంజుల.

“ఇప్పుడు చెప్పు, మీ కుటుంబం నన్ను తమ ఇంటి కోడలిగా స్వీకరిస్తుందా? వాళ్ల మాట సరే, ముందర నీ సంగతి చెప్పు. నీకు ఏ అభ్యంతరం లేదని ఇప్పుడు ఒప్పుకుని, పెళ్లి చేసుకుని తరవాత నీ భార్య గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే ఊరుకోగలవా? ఆలోచించుకో. ఎలాగోలా నువు సరిపెట్టుకున్నా,మీ వాళ్లు ఒప్పుకుంటారా?” అని అడిగింది మంజుల. మౌనంగా అక్కడినుంచి లేచి వచ్చేశాడు ప్రకాష్.

తల తిరిగి పోతున్నది ప్రకాష్‌కి. ఏదో తక్కువ కులం పిల్ల అనో, తనకంటే తక్కువ స్థాయి వాళ్లేమో, అందుకనే మంజుల అంత సంశయిస్తున్నది అనుకున్నాడే గాని ఇది తను అస్సలు ఊహించలేని మలుపు. ఏ అనాథ అమ్మాయి అయినా, తనూ, తన వారు సరి పెట్టుకుందురు ఏమో. కులాంతర, మతాంతరానికి కూడా మించిన సమస్య వచ్చి పడింది.

పెళ్లి అనేది రెండు కుటుంబాలకి సంబంధించినది. అసలు ఎవరూ లేక పోయినా అదో దారి, కానీ మంజుల తన పెళ్లికి, తన బంధువుల స్థానంలో తన సమూహాన్ని తెస్తే తను హర్షించగలడా? తన మనసు కానీ వివేకం కానీ అస్సలు ఒప్పుకోలేదు. మరెలా? మంజులని మర్చిపోవల్సిందేనా? అది మాత్రం ఎలా సాధ్యం?

ఈ విషయం తండ్రి దగ్గర ప్రస్తావించే ధైర్యం లేదు ప్రకాష్‌కి. తల్లి కొంచెం నెమ్మది. మాట్లాడి చూడాలి. ఇంటికి వెళ్ళాక కూడా అన్యమనస్కంగా ఉండి పోయాడు. మంజులని మర్చి పోయి సామాన్యమైన జీవితం గడపలేనంటోంది మనసు. ఈ అంతు లేని సమస్య,తీర్చలేని కోరిక కోరి తమ వారిని కష్టపెట్టవద్దని అంటోంది వివేకం.

సరైన సమయం చూసుకుని తల్లిని కూర్చోపెట్టి విషయం అంతా వివరించాడు ప్రకాష్.

కొడుకు కొన్ని రోజుల్నించి చాలా అన్యమనస్కంగా ఉండటం గమనిస్తునే ఉంది ప్రకాష్ తల్లి కావేరి. ఒకటి రెండు సార్లు అడిగితే ఏం లేదమ్మా అంటూ తప్పించుకున్నాడు. ఏదో అయి ఉంటుందిలే అని అనుకుంది కానీ,ఇంత ముప్పు తెచ్చే సమస్య నెత్తి మీదకు తెచ్చి పెడతాడు అని అనుకోలేదు కావేరి.

“అదేమిట్రా ప్రపంచంలో చక్కటి అమ్మాయిలు కరువు అయినట్టు నీకు ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా?” అంటూ గోల పెట్టింది ప్రకాష్ తల్లి. “అయినా ప్రేమా పెళ్లీ అన్న ఉద్దేశం ఉన్నప్పుడు, ఆ పిల్ల గురించి ఏమీ తెలుసుకోకుండా ఎందుకు ముందుకు వెళ్లావు రా?” అని నిలదీసింది ప్రకాష్ తల్లి.

“అమ్మా, మంజుల తన వేపు నుంచి జాగ్రత్త గానే మెలిగింది. తను ఒకసారి మన ఇంటికి వచ్చింది. మన ఇల్లూ వాతావరణం చూసిందగ్గర నుంచీ నన్ను తప్పించుకుని తిరుగుతోంది. మన కంటే తక్కువ కులమో, తక్కువ అంతస్తో, పెళ్లికి మీరు అంగీకరిస్తారో లేదో అని సందేహిస్తున్నది అనుకున్నాను అమ్మా, కానీ తను పూర్తిగా వేరే కోవకి చెందిన సమాజం నుంచి వచ్చిన పిల్ల అని ఎలా ఊహించగలను? అయినా మంజులని చూసినవారు, తన మాటా వ్యవహారం తెలిసిన వారు ఎవరూ కూడా ఊహించలేనిది. నేను చెప్పక పోతే నువు కూడా నాలాగానే పొరపడతావు, అంత పొందిగ్గా ఉంటుంది మంజుల. అమ్మా, నువ్వే ఏదైనా దారి చూపమ్మా. తనని మర్చిపొమ్మని మాత్రం అనకు అమ్మా” అని వేడుకున్నాడు ప్రకాష్.

“ఇదెక్కడి బెడద తెచ్చి పెట్టావు రా నాకు? నీకు పెళ్లి కావల్సిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారురా. ఈ విషయం మీ నాన్నగారి దగ్గర ఎత్తే ధైర్యం నాకు ఐతే లేదు. ఎలాగో తెగించి ఆయనకు చెప్పినా, ఆయన ఈ పెళ్లికి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. కొంచెం స్థిమితంగా ఆలోచించని ఏం చెయ్యాలో” అని, కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రకాష్ తల్లి, కావేరి.

“ఒక పని చేయరా, రేపు ఆ అమ్మాయిని కలిసి మాట్లాడినప్పుడు అడుగు, మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటే, తను వాళ్ల సమాజాన్ని పూర్తిగా వదిలేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మనతో ఉండిపోతుందా? ఇందుకు ఆ పిల్ల ఒప్పుకుంటే, మీ నాన్నతో, తను అనాథ అని చెప్పి ఒప్పించటానికి ప్రయత్నిస్తాను. ఈ షరతుకి ఒప్పుకున్నాక, నీ నిశ్చయానికి గానీ పెళ్లి కి గానీ, తన సమాజం వారు, ఎవరూ,ఆఖరికి ఆ పిల్లని పెంచిన ఆమె ఆ వివాహంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా పాల్గొటానికి వీల్లేదు. ఈ షరతుకి ఆ పిల్ల ఒప్పుకుంటే, నేను నాన్నని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. మీరిద్దరూ బాగా ఆలోచించుకోండి. చిన్న పిల్లలు కారు మీరు, మంచీ చెడ్డా ఆలోచించకుండా భావోద్వేగాలలో కొట్టుకు పోవటానికి.”

తల్లి చెప్పింది విన్న ప్రకాష్‌కి లేశమాత్రమైనా మంజుల ఈ షరతుకి ఒప్పుకుంటుందన్న నమ్మకం కలగ లేదు. అసలు అలాంటి షరతు పెట్టటం కూడా, తనకు చాలా అమానవీయంగా, స్వార్థంగా అనిపించింది.

చేసేది లేక పైకి మాత్రం ‘సరే’ అన్నాడు. తల్లి కనీసం కూర్చుని విషయమంతా పూర్తిగా విని ఆలోచించింది. తండ్రి దగ్గర అంత కూడా ఆశించలేడు. అయినా మంజులతో విషయం చెప్పి చూద్దామనుకున్నాడు.

మర్నాడు మంజులతో “మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో నేను మాట్లాడవచ్చా?” అని అడిగాడు.

“అమ్మతో ఏం మాట్లాడుతావు? ముందు నాతో చెప్పు. నువు మీ వాళ్లతో మన విషయం చెప్పేవా? నా వివరాలు ఏమీ దాచకుండా చెప్పేవు కదూ?”

“చెప్పేను, అందుకే మీ అమ్మతో కూడా మాట్లాడాలి అని అనటం.”

‘సరే’, అని మంజుల తమ ఇంటికి తీసుకు వెళ్లింది ప్రకాష్‌ని. ఇంటి లోపల్కి అడుగు పెట్టంగానే లైలా చాలా మర్యాదగా ఆదరించింది. తన పేరూ స్వరమూ కొంచెం అసహజం తప్పితే ఆ ఇల్లూ తీరు సామాన్యంగానే ఉంది. మొత్తం రెండు గదులే. తాము కూర్చున్న గదిలోనే ఒక మూల గొడకి ఉన్న చిన్న దేముడి మందిరం చూసి ఆశ్చర్యం వేసింది ప్రకాష్‌కి ఎందుకో. గది పొందిగ్గా సర్ది ఉంది. ఆ ఇల్లూ, వాతావరణం చూసి ప్రకాష్‌కి తాను లైలాని అడుగుదామనుకున్నది, అన్యాయంగా అనిపించింది.

కాసేపు కూర్చుని ఆ మాటా ఈ మాటా మాట్లాడి, “మంజులని పెళ్లి చేసుకోటానికి మీ అనుమతి తీసుకుందామని వచ్చాను. మంజుల నా విషయం మీకు చెప్పే ఉంటుంది. మీరేమంటారు?” అని అడిగాడు, అసలు విషయం చెప్పకుండా.

“చెప్పింది, నాయినా, మరి మీ వాళ్ల తో మాట్లాడావా? మా సంగతి వివరంగా తెలిపావా వాళ్ళకి” అడిగింది లైలా.

“ముందు మీతో మాట్లాడి ఆ తరవాత వారికి కూడా చెపుతాను” అన్నాడు ప్రకాష్.

“మరి, మా విషయం తెలుసును అంటున్నావు, మీ కుటుంబం పరువు ప్రతిష్ఠలు గల వారేమో., మా మంజుని స్వీకరిస్తారా? ముందు సరే అని ఆ తరవాత మా అమ్మాయిని ఏ మాత్రం కష్టపెట్టినా, నేను గానీ మా సమాజం వారు గానీ అసలు ఒప్పుకోము. అందుకని బాగా ఆలోచించి నిర్ణయానికి రా బాబు” అంది కచ్చితంగా లైలా. లైలా మామూలు స్వరంలో చెప్పినా అందులో దాగి ఉన్న హెచ్చరిక ప్రకాష్‌కి అర్థం అయింది.

కాసేపు కూర్చుని, టీ తాగి మంజుల, ప్రకాష్ బయటకు నడిచారు. ప్రకాష్ తన నుంచి ఏదో దాస్తున్నాడని అనుకుని ప్రకాష్‌ని మరీ మరీ అడిగింది. “అమ్మతో ఏదో మాట్లాడాలని అన్నావు, మరి అలాగే వచ్చేశావు ఏమిటి?” అని.

ఆఖరికి చెప్పలేక చెప్పాడు ప్రకాష్. “మీ అమ్మతోపాటు మీ మొత్తం సమాజంతో తెగ తెంపులు చేసుకుంటే, ఒక అనాథ పి‌ల్లగా నిన్ను స్వీకరిస్తాను అంది అమ్మ. ఈ షరతుకు నువు ఒప్పుకుంటే, తను నాన్నని కూడా ఒప్పిస్తానంది అమ్మ.” మంజుల వైపు చూసి చెప్పే ధైర్యం లేక మరో వైపు చూస్తూ అసలు విషయం చెప్పాడు ప్రకాష్.

“వింటానికి చాలా కటువుగా ఉన్నా, ఒకసారి మా ఇంటికి, వచ్చేశాక ఇన్నాళ్లూ నువు కోల్పోయినవన్నీనీకు లభిస్తాయి మంజూ, ప్లీజ్ ఆవేశపడకుండా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయానికి రా.” అంటూ మెల్లగా వెనక్కి తిరిగి చూసేసరికి, మంజుల ఏం మాట్లాడకుండా వెళ్లిపోతున్నది.

తను ఊహించిన ప్రవర్తనే. ఒక నిట్టూర్పు విడిచి తన ఇంటికి దారి తీశాడు ప్రకాష్.

***

నాలుగు ఐదు రోజులయిన తరవాత లైలా అడిగింది మంజులని. “మళ్ళీ ఆ అబ్బాయి ఏమైనా చెప్పాడా తల్లీ?” అని.

“చెప్పాడమ్మా, మీ అందరితో తెగ తెంపులు చేసుకుని, ఒక అనాథగా వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంటే వాళ్ళకి అభ్యంతరం లేదుట.”

“మరి నువ్వేమన్నావు?” అడిగింది లైలా.

“అనటానికి ఏముంది అమ్మా? నేను ఏం చెప్పకుండా వచ్చేశాను.” అంది మంజుల నిర్లిప్తంగా.

“అదేమిటమ్మా మా కోసం నువ్వు నీ బంగారు భవిష్యత్తు వదులుకుంటావా? మళ్లీ ఇలాంటి అవకాశం నీకు రాక పోవచ్చు. ఒప్పుకోక పోయావా తల్లీ, మాదేముంది. నువు ఎక్కడ ఉన్నా చల్లగా ఉంటే చాలమ్మా మాకు. నా మాట విని, నా పై ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకో తల్లీ” అని మరీ మరీ చెప్పింది లైలా. పాపం ఆనాడు ఆ పసి పాపను గుండెలకి హత్తుకుని తెచ్చుకున్నప్పుడు కానీ తరవాత ఏనాడూ ఆ పిల్లకి పెళ్లి చేయాలని కానీ, తనని విడిచిపెట్టి ఉండవల్సిన పరిస్థితి వస్తుందని ఊహకి కూడా రాలేదు ఎప్పుడూ లైలాకి. మంజు కోసం చూపిన ఆప్యాయత ఈనాడు తన కాళ్ళకి సంకెళ్ళు వేస్తున్నాయని గ్రహించి లైలా మనసు పరితపించింది. ఆనాడు తనూ,ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కలిసి తీసుకున్న నిర్ణయం తప్పేమో. ఆనాడు ఆ పాపని అనాథాశ్రమానికి ఇచ్చేసి ఉంటే ఈనాడు మంజు తన తోటి మిగతా అమ్మాయిల్లా సహజమైన జీవితం గడపగలిగేదేమో, అని పశ్చాతాప పడుతోంది.

“నన్నే ప్రాణంగా పెంచావు అమ్మా నువ్వు. కన్నతల్లి అంటే ఎలా ఉంటుంది అన్న ఉత్సుకత, అవసరం నాకు ఎప్పుడు కలగలేదు అమ్మా. అలాంటిది, సభ్య సమాజం లోని ఒక యువతి తన కన్నబిడ్డను పరువూ ప్రతిష్ఠల కోసం నిర్దాక్షిణ్యంగా అనాథగా వదిలేసిన నన్ను మళ్ళీ ఆ పరువు- ప్రతిష్ఠల కోసమే ఈ సభ్య సమాజం అనాథగా మారమని కోరుతున్నది. ఇంత నిర్దయంగా వ్యవహరించే సమాజం నాకు అవసరం లేదు అమ్మా. అయినా చెప్పినంత తేలిగ్గా నువు నన్ను చూడకుండా ఉండగలవా అమ్మా? నా వల్లైతే కాదు.”  అన్నది మంజుల దృఢంగా.

ప్రత్యేకంగా చెప్పక పోయినా, తనని తప్పించుకుని తిరుగుతున్న, మంజులని చూసి తన జవాబు అర్థం చేసుకున్నాడు ప్రకాష్. ఈ సంఘటన తరవాత మంజులపై ఇష్టం గౌరవం ఇంకా పెరిగాయి ప్రకాష్‌కి. తనే మొండి ధైర్యం తెచ్చుకుని మంజులని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోతే కొన్నాళ్ళకి కోపం తగ్గాక అమ్మా నాన్నా తమతో కలిసి పోవచ్చు. కానీ పెళ్లి కావల్సిన ఇద్దరు చెల్లెళ్లని చూసి ఆ ధైర్యం చేయలేకపోయాడు.

అర్ధనారీశ్వరుడిని పూజించే మన సమాజం అర్ధనారీని కనీసం తోటి మానవుడిగా అయినా గుర్తించదు.

ఒకనాడు సంఘం అనబడే మన సమాజం ఒక పసి బిడ్డని వెలి వేసింది. ఈ నాడు ఆ బిడ్డ పెద్ద అయి, వివేకవంతురాలై ఈ సమాజాన్నే వెలి వేసింది.

మరి పరిత్యక్త ఎవరు? ఆ పసి బిడ్డా? మన సమాజమా? నిర్ణయం పాఠకులదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here