“భూమి నుంచి ప్లూటో దాకా…” అనే నవల నేను రాసిన స్పేస్ ఒపెరా నవలా త్రయంలో మూడవదీ, ఆఖరిదీ.
వైజ్ఞానిక కల్పానా సాహిత్యం (సైన్స్ ఫిక్షన్)లో స్పేస్ ఒపెరా ఒక ఉపశాఖ. దీనిలో సాధారణంగా భవిష్యత్తులో సాగే కథనం, రెండు సామ్రాజ్యాల మధ్య ఆధిపత్యం కోసం చేసే యుద్ధాలు, కొంత రొమాన్స్, కొంత మాయాశక్తులు కలిసి వుంటాయి. ఈ విధమైన నవల రాయాలని నేను “War for Mars” రాసి ప్రచురించాను. ఆ తరువాత దాని కొనసాగింపుగా “Blue and Green”, “Dark Outposts” అనే నవలలు అమెజాన్ లోనూ, సంపర్క్ కలకత్తా వారి ప్రచురణలలోనూ వచ్చాయి. ఇవి ఆంగ్లంలో అమెజాన్‌లో ఈ-బుక్స్‌గా లభ్యమవుతున్నాయి.
“కుజుడి కోసం” అనే నవల “War for Mars” కు నేను చేసిన అనువాదం. రచన మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. “నీలీ ఆకుపచ్చ” అనేది రెండవ నవల శ్రీ కొల్లూరి సోమ శంకర్ సహకారంతో అనువాదం చేసినది. కినిగె అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఈ రెండు పుస్తక రూపంలో ప్రచురింపబడ్డాయి. ఎలెక్ట్రానిక్ రూపంలో దింపుకోడానికి వీలుగా కినిగెలో ఉన్నాయి కూడా.
http://kinige.com/book/Kujudi+Kosam
http://kinige.com/book/Neeli+Akupacha
1. కుజుడి కోసం: నాలుగో సహస్రాబ్ది కథ:
భవిష్యత్తులో 3260 ADలో భూమి ఎక్కువ మేర నశించిపోయి మానవులు ఇతర గ్రహాలకి వలసపోయి గ్రహాంతర నివాసాలు, ప్రయాణాలు, అంతరగ్రహ నాగరికత విలసిల్లే కాలం.
హనీ ఆమ్రపాలి అనే యువకుడు ఇండికా సెంట్రల్‍లో ప్రొఫెసర్‌గా పని చేస్తూ వుంటాడు. తన కలలో తరచూ కనిపించే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ కోసం వెదుకుతూ కుజగ్రహంలోని మానవకాలనీకి – తన సంపాదన అంతా ఖర్చు చేసి టికెట్ కొని వెళ్తాడు. అయితే అక్కడ మానవ కాలనీ ఒక వైపు, అరుణ భూములు అనే సుదూర రాజ్యంలో మాంత్రిక చక్రవర్తి సమూరా పాలనలో వుండే కాలనీ వుంటాయి. ఆ యువతి సమూరా కుమార్తె సయోనీ. నిజానికి ఆమె ఒక ముదుసలి మంత్రగత్తె. విశ్వశక్తి అనబడే మంత్రశక్తిని ఉపయోగించి మానవులందర్నీ ప్రభావితం చేసి తమ వైపు తమ సైన్యంలో కాని ఇతర పనులకు కాని ఉపయోగించుకునే కార్యక్రమంలో అతని కలలోకి వచ్చింది. హనీ ఆమ్రపాలి, సయోనీ సమూరాల బందీఆ చిక్కుబడి వాళ్ళు చెప్పినట్టు ఒలింపస్ పర్వతం మీది ఒక అమృతత్వం కలిగించే ఔషధాన్ని తీసుకువస్తాడు. అతనికి టైటాన్‌కు చెందిన డిమిట్రీ, గ్వానిమెడ్‌కి చెందిన ఏనిమాయిడ్, కుజుడికి చెందిన మీరోస్ సాయం చేస్తారు. ఆ తర్వాత హనీ తనకి మంత్రశక్తులు ఉన్నాయని గ్రహిస్తాడు. కాని కుజుడిలోని మానవులకి మాంత్రికులకి మధ్య జరిగే యుద్ధంలొ స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలున్న మానవ కాలనీకే సాయం చేసి, సమూరాని, సయోనీని అరుణభూముల నుంచి పారిపోయేట్టు చేసి తనకి సాయం చేసిన మీరోస్ అనే మాంత్రికుడిని అరుణ భూములకి రాజుగా చేసి తిరిగి భూమికి వస్తాడు. తన తండ్రి, తల్లి మంచి మాంత్రికులనీ, వారు దుష్ట మాంత్రికుల చేత చంపబడ్డారనీ తెలుసుకుంటాడు. అది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు.
2. నీలి ఆకుపచ్చ: భూమికి తిరిగి రాక:
హనీ తిరిగి వచ్చాకా తనని కుజ మాంత్రికులు ఇంకా పగతో వెంటాడుతూంటారు. వాళ్ళకి సౌరగ్రహాల్లో గూఢంగా దాగి ఉన్న మంత్ర వస్తువులు కావాలి. కుజుడిలో వున్న అమృత ఔషధం కాక, భూమిలో అద్భుత శక్తులున్న వెండి కొవ్వొత్తి కావాలి. అది నిష్కల్మషమైన మంచి మాంత్రికుడికే కనబడుతుంది. హానీ తన గ్రామంలో తన రక్తసంబంధీకురాలు అయిన ప్రకృతిని చూసి ప్రేమిస్తాడు. తన తల్లిదండ్రులని ఎవరో గ్రహాంతర మాంత్రికులు ఏదో పని చేయలేదని చంపివేశారని తెలుసుకుంటాడు. శక్తులు పోయినా చిరంజీవిగా మిగిలిపోయిన సమూరా, సయోనీలు హనీ, ప్రకృతిల వెంటపడి వెండికొవ్వొత్తిని సాధించడం జరుగుతుంది. సముద్రంలోనుంచి లా టెర్ స్పేస్ ప్లాట్‌ఫాంకి స్పేస్ ఎలివేటర్‌లో పారిపోతున్న మాంత్రికుల వెంటాడి హనీ, ప్రకృతీ వాళ్ళని భస్మం చేస్తారు. ఒక్క సమూరా మాత్రం తప్పించుకుంటాడు. కానీ చనిపోయిన తన కుమార్తె సయోనీ చితాభస్మాన్ని సంచీలో వేసుకుని మరీ పారిపోతాడు. ఆ నవలలోని ఈ ఆఖరి సంఘటన తర్వాత ఏం జరిగిందో ఈ “భూమి నుంచి ప్లూటో దాకా…” అనే ఆఖరి ముగింపులో చదవవచ్చు.
ఒక పక్క సైన్స్ వర్ధిల్లినా మరొక వైపు అతీంద్రియ శక్తులు, మంత్రాలు, శాపాలు వున్న ‘యూనివర్సల్ ఫోర్స్’ కూడా భవిష్యత్తులో వుంటుందని ఊహించి రాసినది ఇది.
మనకి ఆలీబాబా “ఓపెన్ సెసెమ్”తో, మన పురాణాల్లోని మంత్రాలు, శాపాలు, శక్తుల దగ్గర్నించి ప్రస్తుతం సమాజంలో వున్న మంత్రగాళ్ళు, క్షుద్ర శక్తులు ప్రయోగించేవాళ్ళు వుండటం మనకు వున్న వాస్తవాలే. అందుకనే ఇది విలువలున్న మానవ జాతికీ, క్షుద్ర శక్తులున్న మాంత్రికులకీ… అంటే మంచికి చెడుకీ మధ్య జరిగే పోరాటంగా వర్ణించి రాశాను. హనీలో కొంత మంత్రశక్తులు, కొన్ని ఉదాత్త మానవ ఆదర్శాలు ఉంటాయి. దీనిని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా చెప్పుకోవచ్చు.
ఈ నవలలోని పాత్రలు
-
- హనీ ఆమ్రపాలి: నాయకుడు. ఆమ్రపాలి గ్రామంలో పుట్టి ఇండికా సెంట్రల్‍లో ప్రొఫెసర్.
- ప్రకృతి ఆమ్రపాలి: హనీ ప్రేమించి పెళ్ళాడిన యువతి. ఈమెకీ మంత్రశక్తులున్నాయి.
- నారా ఆమ్రపాలి: హనీ తండ్రి
- నయన ఆమ్రపాలి: హనీ తల్లి
- యు-7776 (యురేకస్): హనీ యొక్క రోబో. దీన్ని మార్స్ లోని అరుణ భూముల రాజు మీరోస్ అతనికి బహుమతిగా ఇస్తాడు.
- గ్యానీ అన్‌గారక్: కుజగ్రహంలోని మానవ కాలనీ సైన్యాధిపతి. ఇతనికి మాంత్రికులంటే పడదు.
- కాన్‌స్టాన్‌టైన్: కుజగ్రహంలోని మానవ కాలనీ అధ్యక్షుడు. ప్రజాస్వామ్యవాది.
- ఛెన్ లీ: ఎర్త్ కౌన్సిల్ అధ్యక్షుడు
- శాన్: హనీ పని చేసే ఇండికా సెంట్రల్ లోని శాఖాదిపతి.
- డిమిట్రీ: టైటాన్‌కి చెందిన మంత్రగత్తె. కుజుడి కోసంలో హనీతో బాటు ఒలింపస్ పర్వతానికి వెళ్ళింది.
- ఏనిమాయిడ్: జంతువులాంటి మాంత్రికుడు. మాటలు రావు. ఇతను గ్వానిమెడ్ అనే గురుగ్రహాపు ఉపగ్రహవాసి.
- చాంద్: చంద్రగ్రహవాసి
- వాన్ కు జాక్: కుజగ్రహవాసి. వీరిద్దరినీ హనీకి సాయంగా ఎర్త్ కౌన్సిల్ పంపుతుంది.
- సమూరా: దుష్ట మాంత్రిక చక్రవర్తి
- సయోనీ: సమూరా కుమార్తె. దుష్ట మాంత్రికురాలు.
- మహా: ఆమ్రపాలి గ్రామ పెద్ద. ప్రకృతి తండ్రి.
ఇంకా ఇతర పాత్రలు, స్థలాల పేర్లు అన్నీ కల్పితం. కానీ గ్రహాంతర కాలనీల నిర్మాణం, ఇతర విషయాలు అన్నీ ప్రస్తుతం వున్న సైన్స్ ఆధారంగానే వర్ణించబడ్డాయి. ఉదాహరణ: కుజుడిలోని డోమ్స్ వున్న కాలనీలు, చంద్రుడి క్రేటర్స్‌లోని కాలనీలు, టైటాన్ లోని భూగర్భ కాలనీలు… ఇలా.
మాంత్రికులకీ, మంత్రశక్తులకీ మాత్రం సైన్స్ ఆధారం లేదు. ఇది ఒక కల్పన. అలాగే కాలప్రయాణానికి, వార్మ్‌హోల్స్‌కీ కూడా ఆధారం లేదు. అవి కల్పనలు.
రచన: మధు చిత్తర్వు, అనువాదం: కొల్లూరి సోమ శంకర్