[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
ప్రతిగ్రహద్ధోరాధ్యధ్దా వధ బయాద్ద్విజాః।
ప్రత్యగృహ్ణన్న గ్రహారాంస్తాస్మాదపి నృపాధమాత॥
(కల్హణ రాజతరంగిణి, V, 442)
[dropcap]పా[/dropcap]ర్థుడి తనయుడు ఉన్మత్తవంతుని రాజుగా గౌరవిస్తూనే పర్వగుప్తుడు సింహాసనంపై కన్నేశాడు. రాజు అతడినే అధికంగా నమ్మాడు. ఓ వైపు రాజు నమ్మకం నిలుపుకుంటూనే మరో వైపు శక్తిమంతులైన మంత్రులతో, వీరులతో పర్వగుప్తుడు ఒప్పందాలు చేసుకున్నాడు. వారిని తన వైపు తిప్పుకున్నాడు. ఆ పథకంలో భాగంగానే ఉన్మత్తవంతుడితో అతని వంశానికి చెందిన వారందరినీ చంపించాడు. అతడి తండ్రి పార్థుడిపై కూడా ఉన్మత్తవంతుడికి ద్వేషం కలిగించాడు. దాంతో తండ్రిని చంపించేందుకు రాజు పథకాలు వేశాడు. అతడి పథకంలో సహకరించిన వారిని గౌరవించాడు. వ్యతిరేకించిన వారికి సంకెలలు వేసి జైలుకు పంపాడు.
ఇప్పుడు నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినట్లు భావిస్తున్న సమయంలో, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతూ, ప్రజలు తమ పాలకుని ఎన్నుకుని అతను అధికార దుర్వినియోగం చేయకుండా పలు నిబంధనలు విధించిన సమయంలో కూడా అధికారంలో ఉన్నవారు అధికారాన్ని దుర్వినియోగం చేయటం, ప్రత్యర్థులను, తమని వ్యతిరేకించిన వారిని ఏదో ఒక రకంగా బాధించటం చూడవచ్చు. భారతీయ సమాజంలో ఇలాంటి వికృతులు మ్లేచ్ఛ జాతులు భారతదేశంలో వేళ్ళూనుకున్న తరువాత, భారతీయ జీవన విధానంలో ప్రవేశించాయని నిపుణుల అభిప్రాయం.
తండ్రిని, తల్లిని, సోదరుడిని దైవంలా కొలవటం, వారి మాటలను తు.చ. తప్పకుండా శిరసావహించటం భారతీయ దర్మంలో భాగం. రాజును దైవంలా భావించటం ఒక పద్ధతి. విద్యను, విజ్ఞానాన్ని దైవంలా భావించి, అవి ఉన్నవారిని గౌరవించటం సంప్రదాయం. కానీ ఒక వెల్లువలా మ్లేచ్ఛ జాతులు భారతదేశంపై దాడులు చేస్తూ, తుఫాను తాకిడి లాంటి తాకిడితో అల్లకల్లోలం చేస్తున్నప్పుడు ఒకరిని చూసి మరొకరు నేర్చినట్టు వికృతులు భారతీయులు నేర్చుకున్నారు. పెద్దలను గౌరవించటం, వారి మాటలను పాటించటం వ్యక్తిత్వరాహిత్యంగా భావించారు. మంచిపై తిరుగుబాటు చేయటం అభ్యున్నతి సాధన అనుకున్నారు. ఫలితంగా ఎలాగొలాగ అధికారం సాధించటం లక్ష్యం అయింది. అధికారం, బాధ్యత అన్న భావన స్థానాన్ని అధికారం ఎదుటివారిని హింసించేందుకు, తమ ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు సాధనం అయింది. ‘రాజు’ అన్న భావనలోని ‘పవిత్రత’ దిగజారసాగింది. ఇందుకు నిదర్శనం ఉన్మత్తవంతుడు తన వంశీయులందరినీ, తల్లిదండ్రులతో సహా నిర్మూలించాలని తలపెట్టటం, దానికి ఇతరులు మద్దతు పలికి, రాజు లక్ష్యాన్ని తామే నెరవేర్చటం!
తన బంధువులున్న భవంతులలోకి అన్నపానాలు పోకుండా అడ్డుకున్నాడు రాజు. దాంతో వారు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు విడిచారు. రాజు సమర్థకులు అర్ధరాత్రి వేళ రాజు తండ్రి పార్థుని ఇంటిని చుట్టుముట్టారు. పార్థుడి భార్య, అంటే, రాజు తల్లిని కొట్టి తిట్టి హింసించారు. బలహీనుడై, వివస్త్రుడయి ఉన్న పార్థుడిని, అంటే రాజు తండ్రిని, జుట్టు పట్టి బయటకు ఈడ్చి పశువును వధించినట్టు వధించారు.
వారంతా రాజుకు తాము ఏ ఆయుధంతో అతడి తండ్రిని ఎక్కడెక్కడ ఎలా పొడిచారో చెప్పి ఆనందపరిచారు. రాజ్యంపై కన్నేసిన పర్వగుప్తుడి ఆజ్ఞతో, అతడి కొడుకు రాజు సమక్షంలో పార్థుడి శవాన్ని పొడిచి గొప్పతనం, రాజభక్తిలను నిరూపించుకున్నాడు. ఆ తరువాత రాజు క్రౌర్యానికి, నైచ్యానికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. గర్భవతులయిన స్త్రీల గర్భాలను చీల్చి శిశు స్వరూపాలను పరిశీలించాడు. వ్యక్తుల సహనశక్తిని పరీక్షించాలని వారి శరీరాలను హింసించి, అంగాలు ఖండింపజేసి, వారెంత నొప్పిని భరించగలరో పరీక్షించాడు. ఇవన్నీ చదువుతుంటే రెండవ ప్రపంచయుద్ధంలో ‘నాజీలు’ యూదులపై కాన్సన్‌ట్రేషన్ క్యాంపులలో జరిపిన హింసాత్మక చర్యలు గుర్తుకువస్తాయి. భారతీయ ధర్మంలో వ్యక్తుల సాంగత్యం అత్యంత ప్రధానమైన అంశం. ఉప్పునీటితో కలయిక వల్ల మంచినీరు కూడా తాగరానిది అవుతుంది. మ్లేచ్ఛ మూకల క్రౌర్యం, నైచ్యం, పశుప్రవృత్తులు భారతీయులపై ఎంత ప్రభావం చూపించాయంటే, స్వలక్షణాన్ని, స్వధర్మాన్ని మరచి పశుప్రాయమైన మ్లేచ్ఛ పద్ధతులను అనుసరిస్తూ అదే ఉత్తమ నాగరికత అనుకున్నారు కొందరు.
రాజు ఇలా దుశ్చర్యలు చేస్తూ, రాక్షస కృత్యాలు నిర్వహిస్తున్నప్పుడు సమాజానికి మనస్సాక్షి లాంటి బ్రాహ్మణ సమాజం ఏం చేస్తోంది? అన్న ప్రశ్న వస్తుంది. దానికి కల్హణుడు సమాధానం ఇస్తాడు. దాన స్వీకారాలపైన అంతులేని వ్యామోహం వల్లనో, లేక, రాజు అంటే భయం వల్లనో, ఆ రాజాధముడి నుంఛి కూడా ద్విజులు అగ్రహారాలు స్వీకరించారని ఈసడిస్తాడు కల్హణుడు. ద్విజులు రాజులకు భయపడి అగ్రహారాలు స్వీకరించారన్నది అంత సమర్థనీయంగా అనిపించదు. ఎందుకంటే ఎంతటి ప్రమాదం ఉన్నా నిర్భీతితో నిజాన్ని చెప్పినవాడే బ్రాహ్మణుడు. సత్యకామ జాబాలి కథలో గురువు సత్యం నిర్భయంగా చెప్పేవాడే బ్రాహ్మణుడంటాడు. అలాగే, మన పురాణ గాథలలో పలు సందర్భాలలో రాజు అన్న వెఱపు లేకుందా బ్రాహ్మణులు సత్యం చెప్పటం కనిపిస్తుంది. పైగా భారతీయ ధర్మంలో దానం కన్నా దానంగా ఎలాంటి వాడి ధనాన్ని స్వీకరిస్తున్నామన్నది ప్రాధాన్యం వహిస్తుంది. దానం చేయటం అంటే పుణ్యం సంపాదించటం ఒక్కటే కాదు. ఆ దానాన్ని స్వీకరించినవాడు ధనంతో పాటుగా, దానం చేస్తున్నవాడి దోషాలను, పాపాలను స్వీకరిస్తున్నట్టు. కాబట్టి అలాంటి పాపాత్ముడి నుంచి అగ్రహారాలు స్వీకరిస్తున్నారని కల్హణుడు అనటంతో, విచక్షణ మరిచి బ్రాహ్మణులు రాజు పాపంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారని అంటున్నట్టవుతుంది. ఆ మాటని అనేశాడు కల్హణుడు.
అంతేకాదు, రాజుకు క్షయ వ్యాధి సోకి, దుర్భరమైన వేదనను అనుభవిస్తున్నప్పుడు చేసిన పాపాల ఫలితాలను అనుభవిస్తున్నాడని వ్యాఖ్యానిస్తాడు. రాజు వ్యాధితో భరించరాని బాధను అనుభవిస్తుంటే ప్రజలే కాదు, అంతఃపురంలోని రాణులు కూడా ఆనందించారంటాడు కల్హణుడు.
ఉన్మత్తవంతుడి మరణం తరువాత రాజు కొడుకు అని చెప్పి శూరవర్మ అనే బాలుడికి రాజ్యాధికారం కట్టబెడతారు. ఇది నచ్చని కమలవర్ధనుడు తన సైన్యంతో రాజధాని చేరతాడు. ఇది విని శూరవర్మను అతని తల్లి దాచిపెడుతుంది. అయితే కమలవర్ధనుడు వెంటనే తనని తాను రాజుగా ప్రకటించుకోడు. అతడికి తాను అక్రమంగా రాజ్యాన్ని హరించానన్న నేరభావన ఉన్నట్టుంది, అందుకని బ్రాహ్మణ సమాజాన్ని సమావేశపరిచి, తనను రాజుగా ఎన్నుకోమని అభ్యర్థించాడు. ఆ తరువాత జరిగినదాన్ని కల్హణుడు వర్ణించిన తీరు తెలుసుకున్న వారెవరూ కల్హణుడిని ‘బ్రాహ్మణ పక్షపాతి’ అనరు. కల్హణుడిని ‘ధర్మ పక్షపాతి’ అంటారు. అతడికి ధర్మం తప్ప మరొకటి పట్టదు. అతడిని ఎలా అయినా ‘పక్షపాతి’గా భావిస్తే అది వారి దృష్టిదోషం తప్ప మరొకటి కాదు.
అధోత్పలకులే భిన్నో స్థూలకంబలవాహినః।
అంశుగోక్షనిభా విప్రాః సమంగసత్ గోకులే॥
ధూమ నిర్ధగ్న కూర్బానామ్ రాజ్ఞస్తాంస్తాంశకీర్షతామ్।
రాజ్య వ్యవస్థా పన్యాపస్తోషామ్ చిదమ వర్ధత్॥
వైమత్యేన మధస్తేషామ్ నాన్యః కోప్యభ్యషిచ్యత।
కూర్బా భాషణ నిష్కృతైః స్వకూర్బష్టీవనైః పరమ్॥
(కల్హణ రాజతరంగిణి, V, 461, 462, 463)
కమలవర్ధనుడి విన్నపం ప్రకారం బ్రాహ్మణులంతా సమావేశమయ్యారు. వారు మోటు కంబళ్ళు కప్పుకున్న, కొమ్ములు లేని ఎద్దుల వంటి వారంటాడు కల్హణుడు. ‘కొమ్ములు లేని ఎద్దుల వంటి వార’న్నది సంస్కృతంలో ఒక చక్కటి ఉపమానం. ఎవరైతే పై అధికారికి తాము సన్నిహితులం అనుకుంటారో వారు కొమ్ములు లేని ఎద్దుల వంటి వారంటుంది ఓ సంస్కృత శ్లోకం. అంటే చూడటానికి శక్తిమంతులలా కనిపిస్తారు. కానీ వారికి కొమ్ములు లేవు. కొమ్ములు లేని ఎద్దు పొడవలేదు. అంటే దానిదంతా పైనా పటారం, లోన లొటారం వ్యవహారం అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణులకు ఎలాంటి శక్తి లేదు. కమలవర్ధనుడి ఆధీనంలో సైన్యం ఉంది. కానీ బ్రాహ్మణులు, తామే నిర్ణయం తీసుకుని, రాజుని నిర్ణయించేట్టు అతిశయంతో సమావేశమయ్యారు. ఎవరికి వారు తన మాటే చెల్లుతుందన్నట్టు వాదించారు. నిజానికి వారికి ఏమీ శక్తి లేదు.
అక్కడ సమావేశమయిన బ్రాహ్మణుల గడ్డాలన్నీ పొగచూరి ఉన్నాయట. ఇలా వర్ణించటంలోనే కల్హణుడికి వారి పట్ల ఉన్న చులకన భావం స్పష్టం అవుతుంది. వారు ఎవరికి వారే తానే రాజుని నిర్ణయించేవాడిలా ప్రవర్తించారుట. వారి మాటలు పరుషంగా ఉన్నాయట. అలా ఆవేశంతో పరుషంగా మాట్లాడేటప్పుడు వారి నోళ్ళ నుంచి నీటి తుంపర్లు వర్షంలా వెలువడ్డాయట. ఆ నీటి తుంపరలతో వారి గడ్దాలు అభిషేకించారట కానీ ఎవరు రాజో వారు నిర్ణయించలేక పోయారట. ఏకాభిప్రాయానికి రాలేకపోయారట. వాళ్ళిలా గోల గోలగా అరుచుకుంటుంటే, అసలీ సమావేశం ఏర్పాటు చేసింది తానే అని, తనని రాజుగా ఎన్నుకోమని గుర్తు చేసేందుకు కమలవర్ధనుడు అక్కడికి వస్తే, తమ చర్చలకు అంతరాయం కలిగించినందుకు కోపంతో బ్రాహ్మణులంతా కలిసి అతడిపై ఇటుకల వర్షం కురిపించి, తరిమివేసి, మళ్ళీ చర్చలు కొనసాగించారట.
ఈ వర్ణన చాలు, కల్హణుడికి దుశ్శీలం కల బ్రాహ్మణులంటే ఉన్న అసహ్యాన్ని తెలుసుకునేందుకు. కల్హణుడు తనకు తెలిసింది తెలిసినట్టు, అర్థమయింది అర్థమయినట్టు రాశాడు. అంతే తప్ప పక్షపాతం చూపించటం, నిజం దాచిపెట్టటం, అతిశయోక్తులు వంటివేవీ చేయలేదు. వీలయినంత నిజాయితీగా, నిష్పాక్షికంగా తాను గ్రహించిన దాన్ని భావితరాలకు అందించాడు.
బ్రాహ్మణ పరిషత్తు ఇలా చర్చిస్తున్న సమయంలో, మరణించిన రాజు ఉన్మత్తవంతుడి కుమారుడు శూరవర్మకు రాజ్యం న్యాయంగా దక్కాలని మాజీ రాణి ‘యశస్కరుడు’ అనే అతడిని దూతగా పంపించింది. ఈ యశస్కరుడు, ఎవరంటే రాణి సుగంధాదేవితో అక్రమ సంబంధం నెరపిన ప్రభాకరుడి కొడుకు. అతడిని చూడగానే బ్రాహ్మణులందరిలో ఏకాభిప్రాయం కుదిరింది. ‘ఇతడే కశ్మీర రాజు’ అని ప్రకటించారు. అతడికి పట్టాభిషేకం చేసేసారు. అలా కశ్మీరుకు యశస్కరుడు రాజయ్యాడు.
యశస్కరుడు విద్వాంసుడు. కానీ బహుశా సుగంధాదేవి రాణి అయిన తరువాత ప్రభాకరవర్మను సంహరించటమో, బంధించటమో చేసి ఉంటుంది. దాంతో ఆ కుటుంబం ఇక్కట్ల పాలయి ఉంటుంది. విద్వాంసుడయి కూడా యశస్కరుడు కశ్మీరులో నిలవలేక, ఫల్గుణుడు అనే స్నేహితుడితో విదేశీ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అతడికి మంచి కలలు ఎన్నో వచ్చాయి. దేవి ఆశీర్వాదం లభించింది. దాంతో ధైర్యం తెచ్చుకుని అతడు కశ్మీరుకు ప్రయాణమయ్యాడు. ఒంటరిగా కాలి నడకన వస్తున్న యశస్కరుడిని రాణి పంపిన దూతలు చూశారు. అతని సంభాషణా చాతుర్యం గమనించి వారు ‘ఇతడయితే బ్రాహ్మణ పరిషత్తుకు తమ రాణి చెప్పిన విషయం సరిగ్గా వివరించగలడ’నిపించింది. అతడిని వెంట తీసుకుని బ్రాహ్మణ పరిషత్తుకు వెళ్లారు. కానీ అక్కడ పరిస్థితి తారుమారయింది. యశస్కరుడు నోరు విప్పకముందే, అతడిని రాజుగా నిర్ణయించేశారు బ్రాహ్మణులు.
‘ఇదే విధి’ అంటాడు కల్హణుడు. రాజ్యం కోసం ఉన్మత్తవంతుడు రక్త సంబంధీకులను ఘోరంగా చంపించాడు. తల్లిదంద్రులను పశువుల్లా వధింపజేశాడు. ఆ రాజ్యం కోసం పర్వగుప్తుడు కుట్రలు పన్నాడు. రాజు మెదడును విషమయం చేశాడు. రాచకుటుంబీకులెవరూ రాజ్యంపై తమ వారసత్వాన్ని ప్రకటించి తనకు అడ్డు రాకుండా రాజు ద్వారా వారసులందరినీ సమూలంగా నాశనం చేయించాడు. రాజ్యం కోసం కమలవర్ధనుడు యుద్ధం చేశాడు. అడ్డు వచ్చిన వారందరినీ హతమార్చాడు. కానీ చివరి క్షణంలో తనని తాను రాజుగా ప్రకటించుకోకుండా బ్రాహ్మణ పరిషత్తు అంగీకారం కోరాడు. రాజ్యం కమలవర్ధనుడికి దక్కకూడదని, ఉన్మత్తవంతుడి భార్య శూరవర్మ అనే బాలుడిని రాజు సంతానంగా ప్రకటించి, అతడికి రాజ్యం దక్కేట్టు చేయాలని తపనపడింది. ఈ విషయం చెప్పి, బ్రాహ్మణ పరిషత్తును ఒప్పించేందుకు దూతలను పంపింది. కానీ రాజ్యం చివరికి ఎవరికి దక్కింది? దిక్కు మొక్కు లేని, ఎవరికీ తెలియని యశస్కరుడికి! ఇది విధి లీల. అంటే యశస్కరుడు రాజు కావటంలో ఇంతమంది తమకు తెలియకుండానే తమ వంతు పాత్రను పోషించారు. వీరిలో ఏ ఒక్కరు మరో రకంగా ప్రవర్తించినా రాజ్యం యశస్కరుడికి దక్కేది కాదు. కానీ రాజ్యం అతడికి దక్కాలని రాసి ఉంది. అతడు రాజయ్యాడు. అదీ ఎలాగ, రాజ్యాధికారం నాదని ముందుకు వచ్చే రాచకుటుంబీకుడు ఒక్కడూ లేకుండా!
యశస్కరుడు పట్టాభిషేకం జరిగిన తరువాత రాజమందిరంలో ప్రవేశించటంతో అయిదవ తరంగం పూర్తవుతుంది. అయిదవ తరంగం చివరికి కశ్మీరులో నైతికంగా, ధార్మికంగా, సామాజికంగా దిగజారుడు ప్రారంభమయింది. భారతదేశానికే ప్రత్యేకమైన విలువలు, సిద్ధాంతాలు కలుషితమై భారతీయ సమాజం రూపాంతరం చెందుతోంది. తుఫాను తాకిడికి అల్లల్లాడిన వృక్షం కొత్త చిగుళ్ళు వేస్తోంది. కానీ అమృతమయమయిన ఫలాలనిచ్చే వృక్షం చుట్టూ చేదు విషం లాంటి తీగల వృక్షాలు చుట్టుకుని ఉంటే అమృతం వంటి ఫలాలు కూడా చేదు ఫలాలవుతాయి. అలా అన్ని రకాలుగా స్థిరపడుతున్న మ్లేచ్ఛ మూకల సంపర్కంతో భారతీయ సమాజం నూతన రూపం ధరిస్తోంది. ఒక ఉజ్జ్వల పరంపర, ఉన్నత జీవన విధానం, ఉత్తమ వ్యక్తిత్వాలు విస్మృతిలో పడి భారతీయ సమాజం నూతన రూపు ధరించేందుకు సిద్ధం అవుతోంది. ఇక నుంచి ఆరవ తరంగం ఆరంభమవుతుంది.
(ఇంకా ఉంది)