జీవన రమణీయం-186

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]2[/dropcap]014లో రేలీలో మా రెండవ అబ్బాయి క్రిష్ణకాంత్‌ని మాస్టర్స్‌కి దింపి వచ్చాకా, వాడు మళ్ళీ కాన్వకేషన్ అయ్యేదాకా ఇండియా రాలేదు. వాడి కాన్వకేషన్‌కి నేను రావాలని వాడు మొదటినుండీ అడుగుతూనే వున్నాడు. మా అశ్విన్ కూడా “నా యూనివర్సిటీ చూడలేదు హ్యూస్టన్‍లో, కాన్వకేషన్‍కి రాలేదు. తమ్ముడి కాన్వకేషన్ మిస్ అవద్దు” అని చెప్తునే వున్నాడు. నేను సరే అని ప్లాన్ చేసుకున్నాను.

‘వెల్‍కమ్ ఒబామా’లో నటించాకా, సింగీతం గారి కోసం, ఒకరిద్దరు అడిగినా నేను ఏక్ట్ చెయ్యలేదు. జోక్‍గా “దర్శకుడికి సింగీతం గారి రేంజ్ వుంటే కాని నటించను” అనేదాన్ని! ఒక రోజు నాకు ఫేస్‍బుక్ మెసెంజర్‍లో అవసరాల శ్రీనివాస్ “మీ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడాలి” అని మెసేజ్ పెట్టాడు. అతను మొదట స్ప్రెడింగ్ లైట్ అనే రీడింగ్ క్లబ్‍లో పరిచయం. ఒకటి రెండు సార్లు మాట్లాడుకున్నాం. స్క్రిప్ట్ వర్క్ ఏమైనా ఇస్తాడేమో అనుకున్నాను. అప్పుడు అతను డైరక్టర్‌గా ‘ఊహలు గుసగుసలాడే’ తీసి, రెండవ సినిమా ‘జ్యో అచ్యుతానంద’ కథ సిద్ధం చేసుకుంటున్నాడు.

అతను ఫోన్ చేసి “మీరు నా సినిమాలో తల్లి పాత్ర వెయ్యాలి” అన్నాడు. “నేను నటిని కాదు” అన్నాను. “నేను చూసుకుంటానది” అన్నాడు. కొంత అడిగించుకున్నాకా, “భర్త వుంటాడా? ఎలాంటి సీన్స్ వుంటాయీ?” లాంటి ప్రశ్నలు అడిగాను. ఎందుకంటే, రోహిణితో ‘వెల్‍కమ్ ఒబామా’ అప్పుడు బాగా పరిచయం అయ్యాకా, ఒకరోజు ఓ సినిమా చూస్తుంటే టీవీలో, ఆమె భర్త పాత్రధారి, రోహిణిని కొట్టి కిందపడేసి, చెప్పు ఆమె చెంపకి పెట్టి, “ఇంకోసారి నా మాట కాదని, మీ అన్న దగ్గరికి వెళ్తావా?” అని అరుస్తున్నాడు. ఆమె వయసు మళ్ళిన వేషంలోనే వుంది! ‘అమ్మో! ఇలాంటి వేషాలు, నటన అయినా నేను వెయ్యను’ అనుకున్నాను. అది గుర్తొచ్చింది. అతను ఎంతో సహనంతో సినిమా కథ చెప్పి, “భర్త సి.వి.ఎల్. అనుకుంటున్నాం, ఒక సీన్ లోనే వుంటాడు” అన్నాడు.

అవసరాల శ్రీనివాస్ గారితో రచయిత్రి

నేను ఒప్పుకున్నాను. “మేనేజర్ ఫోన్ చేసి మిగతా విషయాలు మాట్లాడ్తాడు” అన్నాడు. డబ్బులు కూడా చెప్పేసాడు. నేను ఓకే అనుకున్నాను. 5 రోజులు అన్నాడు. బాగానే వుంది. ఇంతలో మా అబ్బాయి May 7th కి కాన్వకేషన్ అని డేట్ వచ్చిందని చెప్పాడు. నేను ఏప్రిల్ 23న నా టికెట్ బుక్ చేయించుకున్నాను. సరిగ్గా ‘వారాహి’ వాళ్ళ మేనేజర్, అది ‘జ్యో అచ్యుతానంద’ బ్యానర్, ఫోన్ చేసి మే 2 నుండి 7 వరకూ షెడ్యూల్ అని చెప్పాడు. “అయ్యో ఏప్రిల్ రెండో వారం అన్నారే…” అని నేను అవసరాలకి ఫోన్ చేసి అడిగితే, “ఔనండీ ప్రాబ్లెమ్ వచ్చింది. ఆ ఇల్లు పాతగా వున్నప్పుడు కొంతా, రెనోవేట్ చేశాక కొంతా తియ్యాలి. మిగతా ఆర్టిస్టులందరి డేట్స్ కోసం ఆ డేట్స్ పెట్టాం” అన్నాడు. అతను నా ప్రయాణం పోస్ట్‌పోన్ చేసుకోమంటే – “సినిమా కోసం, నిజ జీవితంలో తల్లి పాత్రకి అన్యాయం చెయ్యలేను, వెళ్ళాలి” అని చెప్పాను. ఆ సినిమా వేషం అలా కేన్సిల్ అయింది.

నేను వస్తున్నాను అని, నలుగురితో కలిసి స్టూడెంట్‍గా యూనివర్సిటీలో వుంటున్న క్రిష్ణ, గెస్ట్ హౌస్ బుక్ చేయించాడు. వంట సామాన్లూ, ఫర్నీచర్‍తో, ఓ రూమ్, కిచెన్, టాయ్‌లెట్. వాడికి ఇష్టమైనవి వండి పెట్టచ్చు అని, గొప్ప ఉత్సాహంగా కొన్ని పచ్చడులూ, పొడులూ, స్వీట్స్ అన్నీ తీసుకుని బయలుదేరాను. రేలీ వెళ్ళడం అదే చివరిసారి అవుతుందేమో అని నేనూ అనుకున్నాను. ఎందుకంటే, కాన్వకేషన్ అయ్యాకా, ఓ.పి.టీ. మీద వుద్యోగాల వేట మొదలవుతుంది. ఎక్కడ వస్తుందో చెప్పలేంగా అని!

అమెరికా ప్రయాణం ఎన్నిసార్లు వెళ్ళినా థ్రిల్లింగ్ గానే వుంటుంది. అందులోనూ, ఈసారి కేవలం మా అబ్బాయి దగ్గరకు వెళ్తున్నాను. వాడు కారు తీసుకొచ్చి నన్ను తీసుకెళ్తాడు అంటే ఉద్వేగం!

మా క్రిష్ణ చెయ్యి విరిగి ఆరు నెలలు మాస్టర్స్‌కి వెళ్ళడం ఆలస్యం అయింది కదా! “జిమ్ కెళ్ళినా, వెయిట్స్ ఎత్తకూ. ఆటలు జాగ్రత్తగా ఆడు” ఇవన్నీ నేను ఫోన్ చేసినప్పుడల్లా చెప్తునే వున్నాను. “అలాగే అమ్మా” అంటూనే పార్ట్ టైమ్ వుద్యోగం చూసుకున్నాడు, ‘జాజ్’  ఆర్కెస్ట్రా వారికి మేనేజర్‍గా. అందులో పార్ట్‌గా హెవీ వెహికల్ నడపడానికి లైసెన్స్ కూడా తీసుకున్నాడట! ఇవన్నీ నా దగ్గర దాచి వాళ్ళ అన్నకి చెప్పాడు. అందుకే “వాడు డ్రైవింగ్ అదీ చేస్తాడేమో, వద్దు అని చెప్పు” అన్నప్పుడల్లా, మా అశ్విన్ నవ్వుకునేవాడు. మొత్తానికి డబ్బులు సంపాదించడం అప్పటి నుండే మొదలుపెట్టాడు. ప్రొఫెసర్స్‌లో ‘మైకేల్ కే’ అనే ఆయనకి వీడంటే చాలా అభిమానం వుండేది. అలాగే ఆ పని చేసే చోట, ఓనరమ్మ గారు కూడా వీడికి రోజూ పేస్ట్రీలు, జ్యూస్‌లూ అన్నీ బాగా ఇచ్చి, మొహమాటపడ్తుంటే, దగ్గరుండి తాగించి, తినిపించేదట!

కుమారుడు క్రిష్ణ మిత్రులతో రచయిత్రి

ఉన్న నలుగురిలో వీడే వంట వచ్చినవాడు రూమ్‍లో. సౌరేష్ అనే చెన్నై అబ్బాయీ, వీరమాచనేని విష్ణు అని మా ఏరియానే, ఎ.ఎస్. రావు నగర్ అబ్బాయీ, భరద్వాజ అని వైజాగ్ అబ్బాయీ వుండేవారు రూమ్‍లో. ఇంద్రజ అనే అమ్మాయి వీళ్ళకి ఫ్రెండ్. ఆ అమ్మాయి రామానాయుడిగారి చెల్లెలి మనవరాలట (సవతి చెల్లెలు). “‘వెంకటేష్ మామా, సురేష్ మామా’ అని మాట్లాడుతుందమ్మా” అని క్రిష్ణ చెప్పేవాడు. వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్. బాగా కలిసి మెలిసి వుండేవాళ్ళు. నడుం నొప్పి వలన కాస్త ఇబ్బంది పడినా ప్రయాణం బాగానే జరిగింది. అదే చివరిసారి నేను ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేయడం! ఎయిర్‍పోర్ట్‌కి విష్ణూ, క్రిష్ణా వచ్చారు. వాడ్ని చూడగానే మొదట దుఃఖం, తర్వాత ఆనందం కలిగింది. వాడు అమెరికా వీధుల్లో డ్రైవ్ చేస్తుంటే అబ్బురంగా చూసాను.

మొదటగా సేఫ్ వే దగ్గర ఆపాడు. ఎప్పుడూ అదే అలవాటు. “నీకు కావలసిన కూరలూ, పండ్లూ అవీ కొనుక్కో” అన్నాడు. నాకు సేఫ్ వే చూస్తే – ముఖ్యంగా పువ్వులు – కన్నుల పండుగగా వుంటుంది. అందులోనే రేలీ చాలా అందమైన, ప్రశాంతమైన ప్రదేశం! కళ్ళకి ఆహ్లాదంగా వుంటుంది. అక్కడ నేను అన్నీ క్రిష్ణకి ఇష్టమైనవే కొన్నాను. “తర్వాత ఇండియన్ బజార్‍కి వెళ్దాం లే” అన్నాడు.

అమెరికాలో రచయిత్రి

ఇంక నా కోసం తీసుకున్న గెస్ట్ హౌస్, అందులో వాళ్ళిచ్చిన కిచెన్ విత్ పాత్రలూ, నాకు చాలా నచ్చేసాయి. ముందు కాఫీ పిల్టర్ తీసి, డికాషన్ వేసి, మొహం కడుక్కుని స్నానం, పూజా పూర్తి చేసుకుని వంట చేసాను. క్రిష్ణ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నన్ను కలవడానికి. సౌరేష్ వాళ్ళ అమ్మా, అమ్మమ్మా మర్నాడు వస్తున్నారని చెప్పాడు. వాళ్ళు చెన్నై నుండి వచ్చినా, తెలుగే మాట్లాడ్తారని చెప్పడంతో నా ప్రాణం లేచి వచ్చింది. మర్నాడు వాళ్ళు వచ్చారు. వాళ్ళ తెలుగు, ఒక్క మాట నాకు అర్థమైతే ఒట్టు! మళ్ళీ అది తెలుగే, తమిళం కాదు.

నేను వెళ్ళిన పూటే మా అబ్బాయికి ఇష్టమైన టమాటా పచ్చడీ, పప్పు పులుసూ, వంకాయ కూరా చేసాను. వంకాయ కూరలో ఉల్లికారం కొట్టడానికి మిక్సీ వుండటం నాకు భలే ఆనందం వేసింది. మర్నాటి నుండీ ఆ మిక్సీకి కాంపిటీషన్ వస్తారని నాకు తెలీదు! సాయంత్రం పిల్లలు బిలియర్డ్స్ ఆడే గదికి వెళ్ళి అందరినీ పలకరించాను. “వీడు చాలా పోజులు కొడ్తున్నాడు ఆంటీ, అమ్మ చేతి వంట తింటున్నాననీ” అంది ఇంద్రజ. “మీరూ రండమ్మా” అన్నాను.

మర్నాడు సౌరేష్ ఎయిర్‍పోర్ట్‌కి వెళ్తూ వచ్చాడు. అందరికీ బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేసాను. “ఎయిర్‌పోర్ట్‌కి ఎలా వెళ్తున్నావ్?” అంటే, “లిఫ్ట్ తీసుకుంటా” అన్నాడు. హిచ్‍హైక్ చెయ్యడం అనుకున్నా, కాదు మన ఊబర్‌లా లిఫ్ట్ కూడా ఒక టాక్సీ సర్వీస్.

మొత్తానికి నా వయసే వున్న వాళ్ళమ్మా, వాళ్ళ అమ్మమ్మా వచ్చారు. వాళ్ళు పిల్లలు వున్న చోటే వున్నారు. నా గెస్ట్ హౌస్‍లో మేమిద్దరమే. వాళ్ళమ్మ పేరు శారద. ఎన్నో తరాల నుండీ తమిళనాడులో సెటిలైపోయిన తెలుగువాళ్ళు, వాళ్ళు. “అమ్మ కిచెన్‍ల వుడీదే… వూడీదు. పడికట్ల దేర సూసి పూడిస్తి… నాన్ అవళకి సొల్లమాట… నీది ఏర్ సొంతకార్ పిలిసి పూడ్సు…” వాళ్ళు ఇలా మాట్లాడుతారు.

సౌరేష్ వాళ్ళ అమ్మ, అమ్మమ్మలతో రచయిత్రి

వచ్చిన రోజే ఇంట్లో పిల్లలు నూనె తెప్పించలేదని, వాళ్ళతో తెచ్చిన రెండు కేజీల నెయ్యి పాకెట్ ఓపెన్ చేసి, పూరీలు వండి నాకూ పంపించారు! క్రిష్ణ చెప్పాడు ఒక్కొకళ్ళూ పది పూరీలు తిన్నారట.. మేం రెండు తినేటప్పటికీ, నేతి తేన్పులు వచ్చాయి.. అరిసెలు మా అత్తగారు నేతిలో వండడం చూసాను కానీ ఇలా పూరీలు వండడం చూడలేదు! అప్పటి నుండీ బెల్లం కొమ్ములూ, చక్రాలు బోలెడు చేసి నాకూ పంపించేవాళ్ళు! నేను మన దోసకాయ పచ్చడీ, వంకాయ కాల్చి చేసిన పచ్చడీ పంపాను… కానీ తర్వాత మిక్సీ తీసేసుకున్నారు, రోజూ దోశా, ఇడ్లీ కావాలి – అందులోకి చట్నీ చెయ్యాలి అని. వాళ్ళ అమ్మమ్మ కూడా మా అమ్మ లాగే 80 ఏళ్ళ వయసులో చాలా ఏక్టివ్. న్యూయార్క్‌లో ఫ్లయిట్ లేట్ అయి పది గంటలు ఆలస్యంగా వచ్చారు కూడా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here