నేలవిమానం – పుస్తక పరిచయం

0
4

[dropcap]శ్రీ[/dropcap]మతి వాసరచెట్ల జయంతి రచించిన 63 కవితల సంపుటి ‘నేలవిమానం’. జీవితానుభవాలను వడబోసి సహజీవితాలను ఉత్సాహపరిచే తడి అక్షరాల తపన జయంతి కవిత్వం అని ముందుమాటలో ప్రఖ్యాత కవి నందిని సిధారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కవితల్లో జ్ఞాపకాలున్నాయి. కన్నీళ్ళున్నాయి. స్ఫూర్తి ఉంది. పట్టుదల, ప్రయత్నాలున్నాయి. ‘నేలవిమానం’ సంపుటిలో కవయిత్రి సాధనలో కుతూహలం, ఉత్సాహం, ఉద్వేగాలు కనబడతాయని మరో ముందుమాటలో కందుకూరి శ్రీరాములు రాశారు.

‘నేలవిమానం’ అంటే సైకిలు అనీ, ఒకప్పుడు అది లేకుంటే గడిచేది కాదు కానీ ఇప్పుడు దాని అవసరం లేదని మొదటి కవిత ‘నేలవిమానం’ చెప్తుంది.

మారుతున్న కాలంతో పాటుగా సాధిస్తున్న అభివృద్ధికీ, ప్రగతికీ ‘నీరు’ దర్పణం పడుతుందని నిరూపించే కవిత ‘యాది కొస్తున్నాయ్’. ఒకప్పుడు నీటి కోసం పడ్డ కష్టాలను వర్ణిస్తూ, ఇప్పుడు చెరువులను, కాలవలను కాపాడే ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇసుక పొలంతో కూడా పంటలు పండుతున్నాయని అంటూ ‘పురుడు పోసుకున్న నిండు చూలాలు/మా ఊరి చెరువు దోసిట్లకు తీసుకున్న నీటిని చూస్తే/మా భవిష్యత్తు గోచరిస్తుంది’ అంటారు రచయిత్రి.

యాద్రాది శిల్పకళా వైభవాన్ని వర్ణిస్తూ ‘తెలంగాణ నేల పునీతం చేసిన/నీ జన్మ చరితార్థం/నీ పేరు చరిత్రలో శాశ్వతం’ అంటారు.

చదువుల ప్రాధాన్యం గురించి చెప్పే కవిత ‘పరిమళాల గుత్తులు’లో ‘చీ చీ అన్న నా వాళ్ళే/నన్నో రోల్మోడల్‍గా చూస్తూ…/నా చుట్టే తిరుగుతూంటే/ఆనంద విద్యా పరిమళాలు ఆస్వాదిస్తూ…/సాహిత్య సాగరాన సాగిపోతున్నా’ అంటారు రచయిత్రి.

ఇంకా ఈ సంపుటితో ‘పడిలేచిన కెరటం’, ‘మా యింటి అరుగులు’, ‘నఖాబ్’, ‘పురిటి గీతం’, ‘ప్రకృతి నెచ్చెలి’, ‘నవ్వడం నేర్చుకో’, ‘కరుగుతున్న చందమామ’ వంటి చక్కటి కవితలున్నాయి.

***

నేలవిమానం (కవిత్వం)

రచన: వాసరచెట్ల జయంతి

పేజీలు: 136

వెల: ₹ 120/-

ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here