[dropcap]ఉ[/dropcap]దుటున లేచిన ఉప్పెన అది!
బతుకుల పెకలించి పారేసింది!
సర్రున పాకిన దావానల మది
కర్రిగ కాల్చి బూడిద చేసేసింది!
తట్ట, బుట్ట, పలుగు, పాఱ పట్టుకు
నెట్టుకుని పోతున్నాం సొంతూళ్ళకు!
చేతులలో బరువులు తేలికలై,
గుండెలలో దిగుళ్ళవి లాగేస్తుంటే!
ఆడ-మగ, పిల్లా-ముసలి, తేడా లేదు
నడుస్తూనే ఉన్నాం,నిట్టూర్పులే మరచి!
అంతన్నా రింతన్నారు,నీటి మూటలు!
ఇంత పల్కరించిన ఆసామి లేడు!!
కరోనా కాటేస్తుందో లేదో తెలియదు!
నరకం మాత్రం కళ్ళకు చూపించారు!
ఎవడెట్లా నలిగితే పట్టేదెవరికి?!
ఎర వేసి పడేసే ఆటిదంతా వారికి!!
మేం మనుషులం కాదు ఇటుకలం
మెట్లుగ పనికొచ్చే తొక్కుడు రాళ్ళం!!
మీరు ఏలాలంటే మేముండాలి,మీ కాళ్ళ కింద,
ఇట్లాగే,ఇంకెప్పటికీ,ఇలా అనామకంగా!
ఇది ఒక తియ్యటి విషం,తెల్లటి మోసం!
ఓటు అనే బాకుతో నన్నే పొడిచే తంత్రం!
తెలియక కాదు,తెలిసిన నిస్సహాయత
ధనం నడిపే అడవిలో మౌన ఆక్రందనం!
కల్లోల సంద్రాలు మా గుండెలు,పెనుఘోష
వినట ల్లేదెవ్వరూ! కట్ట దాటితే,ఏమిటో!!