కైంకర్యము-10

2
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]గో[/dropcap]దాదేవి రచించిన తిరుప్పావై ప్రస్తుతి తనియన్లు. తనియన్ అంటే స్తుతి. శ్రీవైష్ణవులకు ఉన్నసాహిత్యపు భక్తిసాగరంలో వెలలేని ఆణిముత్యం తిరుప్పావై. శుద్ధ తమిళంలో కూర్చిన ఈ పావన పాశుర మాలిక భగవంతుని చేర్చే సాధనంగా శ్రీవైష్ణవులచే కొలవబడుతోంది. పూర్ణ శరణాగతిని మృదుమధురంగా బోధిస్తుంది. ఈ తిరుప్పావైలలో గోదాదేవి అనుభవించే భావోద్వేగాలూ, ప్రపత్తిపథంలో ఆమె ఎదుర్కొనే తీవ్ర సంతాపం, అపరిమితానందం ఎల్లెడలా వ్యక్తమవుతాయి. ఈ తిరుప్పావై సాధకులకు దిక్సూచి కూడాను.

మాయామయం, అజ్ఞాన ధూళిదూసరితమైన నిద్రమత్తు నుంచి మేల్కొని, పరమపురుషుని కైంకర్యసేవలో పాలుపంచుకొని, అతడిలో మమేకం అవ్వాలని యావత్‌ ప్రపంచానికీ గోదాదేవి పిలుపునిచ్చింది. గోదా మరో పేరు ఆండాళ్‌. మహా భక్తురాలు ఆండాళ్‌ సాక్షాత్తూ భూదేవిగా కీర్తింపబడుతోంది.

శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఆమె వ్రతాన్ని సంకల్పించింది. భాగవతంలో ప్రస్తావించిన కాత్యాయనీ వ్రతం లాంటిదే ఈ నోము. పరమ పవిత్రం, మహావిష్ణువుకు ప్రీతికరమైన మార్గశిర మాసంలో (ధనుర్మాసం/మార్గళి) వ్రతం ఆరంభించి, నెల రోజులకు ముగించాల్సి ఉంటుంది. గోకులంలో గోపికలందరితో కలిసి మార్గశిర మాస వ్రతాన్ని ఆచరించినట్లు, ఆండాళ్‌ కూడా ఆచరించింది. భగవానుడికి నిత్య కైంకర్యం చేసింది.

ఆండాళ్ళు తల్లి ఈ పాశురాలలో ‘ఏలోరెమ్బావాయ్’ అనే మకుటాన్ని ప్రయోగించింది. అంటే ‘పాదపూర్ణార్థం’ అని అర్థం.

‘‘ఓ నా చెలులారా! ఈ నోములో ఆచరించవలసిన విధులన్నీ చెబుతాను. ఆలకించి, అర్థం చేసుకొని, మీరూ ఆచరించండి’’ అని ఆమె తన చెలులకు చెబుతుంది ఆమె. శుద్ధ తమిళంలో కూర్చిన ముప్ఫై పాశురాల ప్రబంధమే తిరుప్పావై ధనుర్మాసములో అనుసంధానిస్తారు వైష్ణవ భక్తులు.

“ఈ రోజే పాశురము పాడుకున్నావు?” అడిగింది సూర్యప్రభ అక్కగారిని తనకి తెలిసినా.

ఆమె నెలలు నిండినందున హృదయములో లోలోపల గోదాదేవిని కొలుస్తున్నది, తప్ప పూజ చెయ్యపనికిరాదు కదా.

అప్పగారు ఆ రోజు ఆరాధనలో పాడిన పాశురము పరవశంగా పాడటము మొదలుపెట్టింది. ఆనాడు ఆమె పాడినది ఐదవ పాశురము.

‘ఆండాళ్‌ తిరువడిగళే శరణం’ అంటూ మొదలుపెట్టింది…

“మాయనై మన్ను వడమదురై మైన్దనై

త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై

ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై

త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ త తామోదరనై

తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుతు

వాయినాల్ పాడిమనత్తినాల్ శిన్ధిక్క

ప్పోయపిళైయుమ్ పుగుదరువా నిన్ఱనవుమ్

తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బాబాయ్” అంటూ మధురంగా గానం చేసింది అక్కగారు.

తమిళములో ఉన్న ఈ పాశురానికి అర్థం:

‘ఎన్నో గొప్ప గుణములు ఉన్న శ్రీకృష్ణుడు మధురలో జన్మించాడు. మధురకు ప్రభువే అయినా, యమునా నదీతీరమందున్న గొల్ల కులములో జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు.

గొల్లకులములో మాణిక్యం వంటి తల్లి యశోదాదేవి గర్భం ప్రదీప్తమొనరించాడు దామోదారుడు. వ్రతకారణంగా శ్రీకృష్ణుని చేరి, మనం కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరిద్దాము, నోరారా అతని కల్యాణ గుణాలను సంకీర్తన చేద్దాం. ధ్యానించిన మన సంచిత పాపాలను, ఇక ఆగామి పాపాలను తప్పించుకుందాం. అతని గుణకీర్తనం చేయటం వలన పాపాలన్నీ అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోతాయి! కాబట్టి స్వామియొక్క నామం పలకండి’.

పాశురం వింటూ నెమ్మదిగా కునుకుతీసింది సూర్యప్రభ.

ఆమెను చూస్తూ ‘ఇది ఈ నెల నిండుతుందా?’ అనుకున్నది అక్కగారు.

***

మధురమైన ఆ మార్గశిరము చతుర్దశి రోజున సూర్యప్రభకు ఏదో దిగులు వేసింది. గోదాతల్లిని తలుచుకుంటూ ‘ఆండాళ్‌ తిరువడిగళే శరణం’ అని పదే పదే అనుకుంది.

బయట చల్లని గాలికి తోడు వెన్నెల కూడా విప్పపూలలా విచ్చుకున్నాయి. విచ్చుకున్న వెన్నెలలో ఊరంతా మెరిసిపోతోంది. నడుములో ఏదో కదలిక ఆమెకు చాలా అశాంతిని కలగచేస్తోంది.

అమె కదలికలకు, అశాంతికీ సంబంధం లేకుండా వరదాచారి లెక్కలేసుకుంటున్నాడు. వాళ్ళ లెక్క ప్రకారము ఆమెకు కాన్పు కావటానికింకో పదిహేను రోజులు పడుతుంది.

సూర్యప్రభ అక్కగారు వరదాచారికి భోజనము వడ్డిస్తూ, “ఇంకా పదిహేనురోజులు… సంక్రాంతి గడిచిపోతుందండీ మరిదిగారు. మీరు నెమ్మదించండి. మా ప్రభకు ఎందుకో కంగారుగా ఉన్నది. మీరూ కంగారు పడితే పట్టుకునేవారెవరూ?” అన్నది మరిది కంగారుకు నవ్వుతూ.

ఆయన ఆ సాయంత్రం తను రాస్తున్న గ్రంథం గురించి ఆలోచిస్తూ భోజనం కానిచ్చి వెళ్ళిపోయాడు వసారానానుకున్న గదిలోకి.

ఆమె కూడా తన పని కానిచ్చి, సూర్యప్రభ దగ్గరకు వచ్చి కూర్చొని కబుర్లు మొదలెట్టింది.

“ఈ పెద్ద పండగకి పిల్లలు ఇంటికొస్తారటే?”

“తెలీదక్కాయి. ఆయన్ని అడగకపోయావటే…”

“సరేలే. వస్తే వస్తారు. నీకు పండగ తరువాత కాన్పు రావచ్చని అనుకుంటున్నాలే…”

“ఏమో. నాకంతా చాలా చిరాకుగా ఉంది. అప్పటి వరకూ ఆగేలా లేదే…”

“అంత హైరానా పడకు. శ్రీరంగనాథుని ధ్యానిస్తూ ఉండు. పండులాంటి బిడ్డనెత్తుకుంటావు. ఏదైనా కీర్తన పాడనా? మనసు నెమ్మదిస్తుంది…”

“ఏమోనే… అనుమానంగా ఉంది. కాస్త ఆ ఆదెమ్మను రమ్మనమనవే…”

ఆదెమ్మ ఆ ఊరిలో మంత్రసాని.

“ఇప్పుడే ఎందుకే? నీ అఘాయిత్యము కూలా… రేపు ఉదయం చెబుతాలే…”

“కాదే అక్కాయి! నా కెందుకో అనుమానంగా ఉంది. నీవు వారిని పిలువు. లేదా ఆదెమ్మకు కబురుపెట్టు…”

అప్పగారు పట్టించుకోకుండా గానం మొదలెట్టింది.

“అబ్బబ్బా… ఆయనను పిలవమంటే వినవేమిటి?”

సూర్యప్రభ చూపెడుతున్న ఆదుర్దాకు అప్పగారికి కంగారొచ్చింది.

ఆమె లేచి వెళ్ళి మరిదికి చెప్పింది. వరదాచారి గది వద్దకు వచ్చి పిలిచాడు… “ప్రభా! ఏమిటీ విషయమూ?”

“ఆదెమ్మను పిలవండి…”

“సరే వెడుతున్నా. నీవు కంగారుపడకు…” అంటూ ఆయన వసారాలోకి వెళ్ళిపోయాడు.

అటు నుంచి ఆదెమ్మకు కబురు పెట్టాడు.

అంత వరకూ అప్పగారు ఏవో మాటలు చెబుతూనే ఉంది సూర్యప్రభకు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here