[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]వ[/dropcap]ర్కింగ్ విమెన్ హాస్టల్లో… తన రూములో కూర్చుని…. ఆలోచిస్తోంది సీత! చింటూ బెడ్‌మీద నిద్రపోతున్నాడు. టైము అర్ధరాత్రి కావస్తోంది…. చీకటి అందరినీ మత్తులో జోకొడుతోంది. సీత మనసు మాత్రం చాలా అశాంతిగా ఉంది. తాను చేసింది తప్పా.. ఒప్పా అన్న తర్జన భర్జన ఆమె మనసులో రన్ అవుతోంది. భర్తను కాదనుకొంది… మళ్ళీ జాబ్ తెచ్చుకుని స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను బ్రతుకుతోంది. తల్లిదండ్రులను కూడా దూరం పెట్టేసింది. ఇవన్నీ కరెక్టేనా..? లేక ఆవేశంలో వేసిన తప్పటడుగులా?
బాంబ్ పేలినట్టు.. నిశ్శబ్దాన్ని బద్దలుగొడుతూ అప్పుడు మోగింది ఆమె సెల్!! ‘ఈ టైములో ఎవరు’ అనుకుంటూ లిఫ్ట్ చేసి –
“హలో…” అంది సీత.
“నేనండీ… రాజుని… సూర్య ఫ్రెండ్‌ని” అటునుండి అన్నాడు రాజు.
“ఆహా.. చెప్పండి..”
“సూర్య ఒక హత్యా నేరంలో ఇరుక్కున్నాడు… పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడు…” బాధగా అన్నాడు
చాలా సేపు మౌనంగా అయిపోయింది సీత.
“నేనేం చెయ్యగలను.. ఆయన జీవితం.. ఆయన ఇష్టం..” నెమ్మదిగా అంది
“అలా అనకండి… చాలా డిప్రెస్సెడ్‌గా ఉన్నాడు… మీరే హెల్ప్ చెయ్యాలి.. వాడికి మనం కాక ఎవరున్నారండీ” బ్రతిమాలాడు రాజు. కన్విన్స్ అయింది సీత.
“సరే.. పొద్దున్నే పోలీస్ స్టేషన్‌కి వస్తాను… డీటెయిల్స్ మెసేజ్ చెయ్యండి” అంది.
“సరే అండీ… నేను కూడా వస్తాను..” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రాజు. బెడ మీద వాలిపోయింది సీత. తమ జీవితాల్లో ఈ అల్లకల్లోలం ఏమిటో అర్థం కాలేదామెకి.
***
పోలీస్ స్టేషన్‌లో.. ఎస్సైకి బెయిల్ పేపర్లు అందించింది సీత. ఆమెతో పాటూ వచ్చిన లాయర్ ఎస్సైతో మాట్లాడాడు. రాజు కళ్ళల్లో కృతజ్ఞత కనపడింది. సూర్య అయితే సీత ముందు తల ఎత్తలేకపోతున్నాడు. “సీతా… థేంక్స్” అని మాత్రం అనగలిగాడు. ముగ్గురూ స్టేషన్ బయటకి వచ్చారు.
సూర్య అన్నాడు “సీతా… నన్ను క్షమించు… నిన్ను దూరం చేసుకుని ఎంత తప్పు చేసానో బాగా అర్థం అయింది నాకు. మన ఇంటికి వెళ్దాం పద” అని.
“ఇప్పుడు నేను మా అమ్మా వాళ్ళ ఇంటిలో లేను సూర్యా.. వర్కింగ్ విమెన్ హాస్టల్‌లో ఉంటున్నాను” నెమ్మదిగా అంది సీత
అదిరిపడ్డాడు సూర్య. “వాట్..” అన్నాడు.
“అవును… నేనూ చింటూ హాస్టల్‌లో ఉంటున్నాము.”
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సూర్యకు. తను వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఇన్ని మార్పులు జరుగుతాయని ఊహించలేకపోయాడు. పసివాడు చింటూ తమ వల్ల పడ్డ బాధ అతన్ని కలిచివేసింది. అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథల్లా అయిపోయారని బాధపడ్డాడు
“సారీ సీతా.. ఇంకెప్పుడూ మిమ్మల్ని వదలను” అని గట్టిగా చెప్పాడు. సీత మనసు కరిగింది. ఎడబాటు వారి మధ్య అనురాగాన్ని పెంచింది.
అక్కడి నుండి తిన్నగా హాస్టల్‌కి వెళ్ళి ఖాళీ చేసి తమ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళతో పాటూ సహాయంగా రాజు కూడా ఉన్నాడు.
తాళం తీసి ఇంట్లోకి వెళ్ళాక… తన సొంత గూటికి చేరుకున్న పక్షిలా సంతోషపడిపోయింది సీత. ఇదీ అని చెప్పలేని సంతృప్తి.
కిచెన్‌లోకి వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చింది. ముగ్గురూ టీ సేవించసాగారు.
సీత “సూర్యా.. అసలు ఆ రోజు ఏం జరిగింది” అని అడిగింది.
సూర్య జరిగినది చెప్పాడు. తను శేఖర్ ఇంటికి వెళ్లేటప్పటికి.. మెయిన్ డోర్ ఆటోమేటిగ్గా లాక్ అయినదని… లోపల చూస్తే రాజీవ్ శవం ఉందని… తర్వాత శేఖర్ పోలీసులని తీసుకొచ్చి తనని అరెస్ట్ చెయ్యించాడని చెప్పాడు.
సీత ఆలోచనలో పడింది. సూర్య చెప్పిన దాన్ని బట్టి అతను అక్కడకు చేరుకోకముందే హత్య జరిగింది… ఎవరు చేసారు?
కానీ తప్పకుండా ఇది ఎవరో తెలిసిన వాళ్ళు చేసినదే అని అర్థమవుతోంది.
సూర్య “సరే.. నేను రేపు ఆఫీసుకి వెళతాను… అందరినీ గమనిస్తాను… ఏదైనా క్లూ దొరకవచ్చు” సాలోచనగా అన్నాడు.
“ఓకే… అది బెస్ట్…” అని చెప్పి లంచ్ ఏర్పాట్లు చెయ్యడానికి కిచెన్‌లోకి వెళ్ళింది సీత.
చాన్నాళ్ళ తర్వాత రిలాక్సింగ్‌గా ఫీల్ అయ్యాడు సూర్య. రాజు కూడా “హమ్మయ్య.. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ కలిసారు.. అది చాలు” అనుకున్నాడు.
***
సూర్య ఆఫీసుకి వెళ్ళి తన సిస్టమ్ ఆన్‌చేసి లాగిన్ అయ్యాడు.
కొలీగ్స్ అందరూ ఏదో పని ఉన్నట్టు అటుగా వచ్చి…. అతన్ని అదోలా చూసి వెళ్ళిపోతున్నారు. సూర్య ఎవరినీ విష్ చెయ్యలేదు. అతను ఎదురు చూస్తున్నది రోహిణి కోసం. తన మనసులో గూడు కట్టుకున్న బాధను ఆమెతో పంచుకోవాలని తపిస్తున్నాడు. బాస్ రాజీవ్ హత్యకు గురి కావడం.. ఆ కేసులో తను ముద్దాయిగా గుర్తింపబడటం.. ఇవన్నీ అందరి ముందు అతన్ని దోషిగా నిలబెట్టాయి. అందుకే ఎవ్వరూ అతనితో మాట్లాడటానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. వెలివేసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టొచ్చు.. కానీ తను ఈ సాలెగూడులోంచి బయట పడటం ఎలా?
రాజీవ్ స్థానంలో ఇంకెవరినో బాస్‌గా పెట్టారు. సూర్య అది పట్టించుకోలేదు. ఎందుకంటే – ‘సూర్యా.. కొన్ని రోజులు నువ్వు ఆఫీసుకి రావద్దు’ అన్న డైలాగ్స్ తను త్వరలోనే వినాల్సి వస్తుందని అతనికి తెలుసు. అలాంటప్పుడు ఎవడు బాస్‌గా ఉంటే తనకేంటి!
రోహిణి కోసం చాలా సేపు వెయిట్ చేసాడు. కానీ ఆమె జాడ లేదు. అసలు ఆఫీసుకు వచ్చిందా? అన్న సందేహం కలిగి ఆమె సీట్ వైపు వెళ్ళాడు. ఖాళీ సీటు వెక్కిరించింది. పక్కనే ఉన్న కొలీగ్‌ని అడిగాడు. “రోహిణీ రాలేదా..?” అని.
“యా.. షి ఈజ్ ఆబ్సెంట్ టుడే” అని సమాధానం వచ్చింది. వెంటనే ఆమె సెల్‌కి ట్రై చేసాడు.. బట్ నో రిప్లై! ‘ఏం జరిగింది… ఎందుకు ఆఫీసుకి రావడం లేదు తను’ అనుకుంటూ తన సీటుకి వచ్చేసాడు. “ప్లీజ్ కాల్ మీ” అని ఆమెకి మెసేజ్ పెట్టి సాలోచనగా సీట్లో వాలిపోయాడు.
అరగంట తర్వాత సెల్ రింగ్ అయితే ఎత్తాడు. “ఏమైపోయావు రోహిణీ…” అని చాలా బాధగా అన్నాడు
“సారీ సూర్యా.. సెల్ వైబ్రేషన్‌లో ఉంది.. చూసుకోలేదు” అంది రోహిణి అటునుండి.
“నీతో మాట్లాడాలి.. తెలుసుకదా జరిగింది.. తట్టుకోలేకపోతున్నాను..”
“అవును… తెలుసు… నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను”
“అవునా.. నీకో గుడ్ న్యూస్… సీత నా దగ్గరికి వచ్చేసింది…”
“ఓహ్.. గ్రేట్… కంగ్రాచ్యులేషన్స్… పోనీలే ఒక సమస్య మిమ్మల్ని ఇద్దరినీ కలిపింది… రియల్లీ గుడ్‌న్యూస్” అని సంబరపడిపోయింది.
“అందుకే ఒకసారి వీలు చూసుకుని ఇంటికి రా.. ప్రశాంతంగా కూర్చుని అందరం మాట్లాడుకుందాం” అన్నాడు సూర్య.
“ఓకే.. డన్” అంది రోహిణి.
కాల్ కట్ చేసి సీట్లో వెనక్కు వాలి ఆలోచనలో పడ్డాడు సూర్య.
(సశేషం)