[dropcap]”నే[/dropcap]లపైన నదులన్నీ పారిపారి కడగా సముద్రములా కలిసినట్లే మనుషులు కూడా నేలపైన పారాడి, గూరాడి, కడగా దేవుని గుడిలా చేరతారు” అంటా అనె రామన్న.
“అనా… నదులు కనిపిస్తాయి. కడగా ఇవి చేరే సముద్రము మన కండ్లకి కనిపిస్తుంది. కాని మనిషి సచ్చినంక కనిపీకుండా పోతాడు. అట్లే వీడు కడగా దూరే దేవుని గుడి కూడా కనిపిచ్చేలే. ఆ కాలము నింకా ఈ కాలము గంటా అంద్రు అనిన మాటలే నువ్వు అంటే ఎట్లనా?” అంట్ని.
“మన పెద్దలు అన్నింది నేనూ అంట్నిరా”
“సరేనా! అది పెద్దల మాట అని అంటివి. అనిన దాంట్లా తప్పులే, కానీ నీ మాట ఏమని చెప్పనా?”
“చెప్పుతానురా… మనిషికి మించింది ఏదీ లేదు ఈ లోకంలో మరణం తప్ప! ఆ మరణాన్ని జయించిన మహాపురుషులు కూడా వున్నారు. ఈ విషయంగా నా మాట ఏమని ఏచన చేసి చెప్పతానురా”
“కానీనా… ఏచన కానీనా…” అంటా ఆడనింకా వచ్చిస్తిని.
“ఏయ్! ఏడనింకా వస్తా వుండావు? ఏడకి పోతావుండావురా” కెంచన్న వాళ్ల మునిగాడు అడిగే.
“నువ్వే చెప్పాలనా!” అంట్ని అదో మాద్రిగా…
“గుంతలానింకా వస్తివి గుంతలాకే పోతావు పోరా” అనె ఇంగో మాద్రిగా…
***
గూరాడి = వెదకి/వాసన చూసి