[dropcap]ఉ[/dropcap]దయం ఎనిమిది అవుతోంది. భవాని కాఫీ తాగి వార్తా పత్రికలు తిరగ వేస్తున్నది. ఆ రోజు ఫ్రెండ్‌షిప్ డే. తెలిసిన వారు, కొందరు స్నేహితులు, శుభాకాంక్షలు పంపేరు – వాట్సాప్ లో. కాసేపు అవన్నీ చూసుకుంది. అదో సంతోషం.
స్నేహం! దానికో ప్రత్యేకత! మనిషికి మిత్రుల అవసరం గురించి తెలియనిదేమి వున్నది? అనంత కాలంలో విశ్వవ్యాప్తంగా తన జీవన ప్రస్థానంలో మానవుడు స్నేహ బంధానికి పరవశిస్తూనే వున్నాడు. ఎన్నో కథలు, నవలలు, రచనలు – ఈ బంధం లోని మాధుర్యాన్ని చెప్తున్నాయి. కొన్ని సాంప్రదాయాలు కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాలలో ఉంటాయి. ఆధునిక కాలం వచ్చేక భావ వ్యక్తీకరణ పెరిగింది. మన దేశంలో కూడా ‘మారేజ్ డే’, ‘మదర్స్ డే’, ‘ఫాదర్స్ డే’, ‘ఫ్రెండ్షిప్ డే’ ఇలా సెలెబ్రేట్ చేసికొనడం మామూలు అయింది. ఆర్థికంగా వెసులుబాటు కూడ వీటన్నింటికి దోహదం చేస్తున్నది. పూలు, పూల గుచ్ఛాలు, కేకులు, చాకోలెట్లు, పార్టీలు – ప్రస్తుతం ధోరణి చరవాణి; అంతర్జాలం అమల్లో లేనికాలంలో మరో వెరైటీ! రక రకాల గ్రీటింగ్ కార్డులు, అద్భుత నిర్వచనాలు, కొటేషన్లు – ఆ షాపుల దగ్గర సందడే సందడి – అవో రోజులు.
భవానీ ఆలోచనలు ఇలా సాగుతూ బాల్యంలోకి వెళ్లేయి.
***
పదో తరగతిలో ఉండగా స్కూల్లో ఒక కొత్తమ్మాయి వచ్చి చేరింది. కొంచెం సన్నగా వుంది. రమణి. ఆమె తల్లిదండ్రులు దిగువ మధ్య తరగతివారు. కొద్ది రోజులలో ఆమె చొరవు తీసుకొని భావానితో మాట మంతీ కలిపింది. పరిచయం పెరిగి స్నేహానికి దారి తీసింది. పాఠాలు చదువుకోవడం, చర్చించుకోవడం, ఇంటి పని ఇలా ఇద్దరూ కలిసి సాగించేవారు. ఎప్పటికప్పుడు రమణి భవాని వ్రాసుకున్న నోట్స్ తీసుకుని చదువుకునేది.
ఇంటరు రెండేళ్లూ వాళ్లిద్దరూ కలిసి రిక్షాలో కాలేజీకి వెళ్లేవారు. ఒకే గ్రూపు. ఇంకేం? చక్కగా సాగేది విద్యా సంవత్సరం. అంతలో భవానికి వివాహం జరిగింది. బాగా తెల్సినవారు – సంబంధం కుదిరి, పెళ్లి జరిగింది. చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. రమణి బాగా బెంగ పడిపోయింది. కుడి భుజం పోయిందని బాధతో కుమిలిపోయింది. ఆ రోజుల్లో మహిళా కళాశాలలు అతి తక్కువ. అదృష్టం కలసి వచ్చి ఆ సంవత్సరం ఊరి శివారుల్లో ఓ మహిళా కళాశాల నెలకొల్పేరు. ఆడపిల్లలకు, మెరిట్ ప్రాతిపదికను సీట్లు, స్కాలర్షిప్పులు, ఫీజు రాయితీలు ఉండేవి. రమణి అక్కడ బి. ఎస్సీ (B.Sc) లో చేరింది.
భవాని భర్త శంకర్ రావు ఇంజినీరు. మద్రాసులో ఓ కంపెనీలో ఉద్యోగి. అంచేత దూరం వెళ్లవలసి వచ్చింది. పండుగలకు, వేసవి శెలవులకు పుట్టింటికి వచ్చినపుడు రమణి కలుస్తూ ఉండేది. చాలా సరదాగా అనేక విషయాలు చర్చించుకొని ఆనంద పడేవారు వాళ్లిద్దరూ. మూడేళ్లు తిరిగేసరికి రమణి బి.ఎస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాసయింది. హఠాత్తుగా ఆమె తండ్రి మరణించేరు. చిన్న గుమాస్తా ఉద్యోగమే. ఆ ఆసరా కూడా పోయింది ఆ కుటుంబానికి. రమణి ఇంటికి ప్రథమ సంతానం. తనకు ఇద్దరు చెల్లెళ్లు. చివరగా ఓ తమ్ముడు. ఆ రోజుల్లో బి.ఎస్సీ పూర్తవగానే డెమోన్‌స్ట్రేటర్ ఉద్యోగాలు వచ్చేవి. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలలో లాబొరేటరీలలో పని చాలా ఉంటుంది గనుక. రమణికి ఆ వుమెన్స్ కాలేజీ లోనే వుద్యోగం దేవుడిచ్చిన వరం.
కుటుంబ బాధ్యతలు నెట్టుకొని వచ్చేది. చెల్లెళ్లకు, తమ్మునికి కాలేజీ ఫీజులు కట్టవలసి వచ్చినపుడు, పెద్ద ఖర్చులు కలిగినపుడు భవానిని సాయం చేయమని కోరుతూ ఉండేది. మంచి పనికి ఎప్పుడూ ముందుండే భవానీ సాయపడేది. శంకర్ కూడా విశాల హృదయం కల వ్యక్తి. ఇలా మరో ఎనిమిదేళ్లు గడిచి పోయేయి.
ఓసారి వేసవికి భవాని వూరు వచ్చింది. ఓ సాయంత్రం రమణి సడన్‌గా వచ్చింది. “భవానీ, బతికి పోయేను సుమా! నువ్వు మద్రాస్ నుంచి వచ్చేవని తెలిసి, నా జీవితంలో ఓ ముఖ్య నిర్ణయం తీసుకోనాల్సిన తరుణం వచ్చింది. అందుకని ఇలా వచ్చేను. నా వయస్సు 27 దాటింది. యాంత్రికంగా జీవితం సాగి పోతోంది. పెద్ద చెల్లి లత డిగ్రీ పాసయింది. చిన్న కంపెనీలో క్లర్క్‌గా చేరింది. లత స్పీడు గురించి చెప్పేను కదా ఇదివరలో చాలాసార్లు. ఓ రోజు ఓ అబ్బాయిని తీసుకొచ్చింది. “మా కంపెనీలో సీనియర్ ఇతను. గోపీ. నన్ను చేసుకుంటానన్నాడు. వాళ్ల ఇంటికి తీసికొని వెళ్ళేడు. వాళ్లందరికి ఇష్టమే. అక్కా! నీ ఆశీస్సులు కావాలి” అంది. నేను ఆశ్చర్య పోయేను. “కంగ్రాచులేషన్స్ లతా” అన్నాను. నిరాడంబరంగా పెళ్లి చేసుకొని గోపి ఇంటికి వెళ్లిపోయింది. ఆరు నెలలు గిర్రున తిరిగేయి.
ఇప్పుడు దగ్గరలో మెన్స్ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్న కృష్ణగారు నిన్న అనుకోని పనిగా మా కాలేజ్‌కు వచ్చేరు. “మీతో మాట్లాడాలి” అన్నారు. “రమణి గారూ, మీ గురించి, మీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అభ్యంతరాలున్నాయా. ఆలోచించుకోండి. మీ నిర్ణయం చెప్పండి” – ఇదీ కృష్ణగారి మాటల సారాంశం. మా కాలేజీలో సీనియర్ లెక్చరర్ హేమలత మేడమ్. ఆమె దగ్గరకు వెళ్లేను. “మేడమ్ నా పరిస్థితి మీకు తెలుసు. కృష్ణ గారు ఇలా ప్రపోజ్ చేసేరు. వారు మీకు తెలుసా? మీ సలహా ఏమిటి?” అన్నాను. “కృష్ణ కదా. మాథెమాటిక్స్ చెప్తాడు. మా వీధిలోనే వాళ్ల ఇల్లు. మంచి వాడే” అన్నారు.
కృష్ణ గారిది దెగ్గరలోని పల్లెటూరు. తండ్రికి పొలాలవీ వున్నాయి. పెద్ద సంసారం. నలుగురు అన్నదమ్ములు. ఒక అక్క. ఇద్దరు చెల్లెళ్లు. పట్నంలో వుంటే చదువులు బాగుంటాయి, ఉద్యోగాలు వెతుక్కోవడం తేలిక – అని ఇక్కడకు మకాం మార్చేరుట వాళ్ల తల్లిదండ్రులు . అయితే కృష్ణగారి తండ్రి వ్యవసాయ పర్యవేక్షణకోసం పల్లెలోనే ఎక్కువ రోజులుంటారుట. ఈ వివరాలు సేకరించకలిగేను భవానీ” అంది రమణి. “ఇప్పుడు కృష్ణ గారి ప్లాన్ ఏమంటే – నేను సరేనంటే చదువుకుని ఉద్యోగస్తురాలయిన భార్య లభిస్తుంది. ముందు ముందు పిల్లలు బాగుపడతారు, అని; కట్న కానుకలు అవసరం లేదు. మామూలుగా పెళ్లి జరిపిస్తే సరిపోతుంది” అన్నారు. ఆయనకూ ముప్ఫయి దాటి పోయేయి.
“నీ సలహా ఏమిటి భవానీ, నీవు మొదటి నుండి నా మేలు కోరే శ్రేయోభిలాషివి” అంది రమణి.
“నాకు చాల సంతోషంగా వుంది. నేడు సుదినం. ఎన్నిసార్లు నీ గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా ‘వయసు వచ్చేస్తోంది. రమణి పెద్ద బాధ్యతలు మోస్తున్నది – వివాహమైతే బాగుంటుంది’ – అని భగవంతుణ్ణి కోరుకునేదాన్ని. కృష్ణగారి గురించి విన్నాక, నువ్వు ఔననడం మంచిది అని నా అభిప్రాయం. అక్కడ సుఖపడిపోతానని పెద్ద ఆశలు పెట్టుకోకుసుమా! అతడు కూడ, తన బాధ్యతల్లో నువ్వూ కొన్ని మోస్తావనే స్వార్థంతో ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. అత్తగారు, మరుదులు, ఆడపడుచులు – ఉమ్మడి కుటుంబం నీకు పెద్ద ప్రాముఖ్యం ఉండదు. నీ ఉద్యోగంతో నీకు సమయం గడిచిపోతుంది. కనుక ఫర్వాలేదు. పైగా ఇన్నాళ్ల అనుభవంతో ఎవరితో ఎలా మసలుకోవాలి నీకు తెలుసును కదా. ఈ వయస్సులో మంచి భర్తకు భార్యగా నీ స్టేటస్ మారడం ఎన్నోవిధాలుగా నీకు మంచిది. ఆడవాళ్లు, పుట్టింటిలో ఎందరికి ఎన్ని చేసినా – కొసకు ఒంటరిగానే మిగులుతారు. లతను చూసేవు కదా. అంతా అవకాశవాదులే! అన్నీ బేరీజు వేస్తే రేపు నీకు రక్షణ, సంతానం, సంఘంలో గౌరవం ఇవన్నీ సానుకూలమైన అంశాలు. వెంటనే ఒప్పేసుకో రమణీ, నీ పెళ్లి చూసి నేను మద్రాసు వెళ్తాను” అంది భవాని.
రెండేళ్ల తరువాత రమణికి పాప పుట్టింది. జీవన విధానంలో మార్పేమీ లేదు. ఆర్థికంగా అభివృద్ధీ లేదు. వచ్చిన జీతం మరుదుల చదువులకు సరిపోతోంది. కొద్దిపాటి అదనం సంపాదన చూసీ చూడక ఆఖరి చెల్లికి, తమ్ముడికి, ఖర్చు చేస్తున్నది రమణి.
శంకర్ కంపెనీ బ్రాంచ్ తమ వూళ్ళో పెట్టేరు. ఇప్పుడు భవాని పుట్టిల్లున్న ప్రదేశం చేరుకుంది. ఓ రోజు రాత్రి 8:30 గంటలకు ఇంటి బెల్లు మోగింది. “ఈ టైమ్‌లో ఎవరు వస్తారబ్బా” అంటూ వంట గదిలోంచి బయటకు వచ్చి వీధి తలుపు తీసింది. ఎదురుగా రమణి.
“అరే రమణీ! ఇంత రాత్రి! ఇలా!!!” అని దీపం వెల్తురులో ముఖం పరిశీలించింది. ఏడ్చి ఏడ్చి కంద గడ్డలా వుంది. కళ్ళు ఎర్రబడి చిన్నవయినాయి. లోపలిగదిలోకి తీసుకొని వెళ్ళింది ఆమెను భవాని.
“ఇంక నా వల్ల కాదు భవానీ భరించడం. ప్రతీ రోజూ ఇంట్లో గొడవలే. అత్తగారు, మరుదులు, ఆడపడుచు, సూటిపోటి మాటలు. ఈయన మౌనం తప్ప ఒక్క మాట అనరు. పైగా రాత్రి పది దాటే దాకా ఇల్లు చేరడు. ఇంట్లో మనశ్శాంతి కరువై పోయింది. ఇవాళ నాకు చికాకు పెరిగింది. మాటకు మాట పెరిగి జీవితంపై విరక్తి వచ్చింది. చచ్చిపోదామని చెరువు దగ్గరకు వెళ్లేను. నువ్వు ఉన్నావని గుర్తుకొచ్చి ఇలా వచ్చేను” అంది.
“తప్పు రమణీ. పాప బ్రతుకు ఏమవుతుంది? ప్రాణం తీసికొనడం అంత తేలికా! ఇంతకన్నా ఎందరు పడుతున్నారో నీకు తెలియదా? నన్నే చూడు. పెళ్లయి పదేళ్లయినా పిల్లలు లేరుకదా! గొడ్రాలు అంటూ నానా మాటలూ అన్నారు. ఆ దేవుడు నా యందు దయ చూపేడు కదా? సమస్యలు లేని ఇళ్లు వుండవు రమణీ; సరిగ్గా తిండి పెట్టక, కడుపు మాడ్చి, కట్టుకోడానికి సరైన చీరలు లేక ఎందరు వివాహితులైన ఆడవాళ్లు మౌనంగా బాధలు భరిస్తున్నారో నీకు తెలియదా!!! రానున్నది మంచి కాలమే. ముఖం చల్లని నీళ్లతో కడుక్కో. తల దువ్వుతాను. కాస్త వేడిగా భోజనం చెయ్యి. కృష్ణ ఇంటికి వచ్చే లోపుగా ఇల్లు చేరుదువుగాని” అని శంకర్‍తో “రమణిని మనం రిక్షా ఎక్కిద్దాము. మీరు వెనకాలే స్కూటర్‌పై వెళ్లి ఆమె ఇల్లు చేరే దాకా గమనించండి ప్లీజ్” అంది.
“సరే, దానికి ప్లీజ్ అక్కర్లేదు” అని స్కూటర్ బయటకు తీసేరు శంకర్.
రమణి సర్దుకుంది. మళ్లీ కనపడలేదు. అంతా బాగుంది కదా అనుకుంది భవాని. ఆమె మరుదులిద్దరూ ఉద్యోగస్తులయ్యేరు. వేరే ఊళ్లలో పోస్టింగులు. ఆఖరి ఆడపడుచు వివాహం కూడా అయ్యింది. రమణికి బాబు పుట్టేడు. కాన్పుకు, పిల్లల్ని మంచి స్కూల్సులో డొనేషన్లు కట్టి చేర్చడానికి, భవానీని సాయం అడుగుతూనే వుంది రమణి.
రమణి జీవితానికి కష్టాలు తీరి మంచి రోజులు వచ్చేయి. ఎం.ఎస్సీ. పాసయింది. లెక్చరర్‌గా ప్రమోషన్, జీతాల స్కేళ్లు భారీగా పెరిగేయి. పిల్లల్ని బాగా గారం చేసింది. పాప లత బాగా అల్లరి పిల్ల. వరుణ్‌కు సరిగా చదువు రాలేదు. చాలా తంటాలు పడి, పాలిటెక్నిక్ – ఆ పై ఇంజనీరింగ్ చేయించి, మొత్తానికి పిల్లల్ని సెటిల్ చేసింది రమణి.
రమణి పూర్వంలా భవానిని పలకరించడం మానేసింది. ఫోన్ చేసినా, ముభావంగా, అన్యమనస్కంగా ఉంటోంది. “అన్నట్లు ఇప్పుడే ఆ ప్రముఖ రచయిత్రి మాట్లాడేరు. నా కొలీగ్ ఇప్పుడు ప్రిన్సిపాల్. నా సలహాలన్నీ పాటిస్తోంది. రోజూ రెండు సార్లయినా ఫోన్ చేస్తుందనుకో ప్రోబ్లెమ్స్ చెప్పటానికి. వైజాగ్‌లో సైన్స్ సదస్సు జరుగుతోంది తెలుసా. ముఖ్య అతిథిగా నన్ను రమ్మని తెగ బ్రతిమాలుతున్నారనుకో… “
ఇదివరలో ఉన్న ఆప్యాయత, ఆర్ద్రత లోపించేయి. స్వరం కొంచెం కఠినమైంది.
‘నేనింకా భ్రమలో వున్నాను. రమణి – తన స్టేటస్, తన విజయాలు, కొత్త స్నేహాలూ, భర్త జనాదరణతో వచ్చిన అదనపు గౌరవాలు, కొత్తగా హంగులతో కట్టుకున్న స్వంత ఇల్లు – ఇంకేమి? కాలం ఎన్ని మార్పులు తెస్తుందో’ అనుకుంది భవాని.
కాలక్రమేణ రమణి, భర్త పదవీ విరమణ చేసేరు. అంతా సీనియర్ సిటిజన్లు అయేరు.
***
శంకర్ రావు గారు మరణించేరు. వార్త అందరికీ చేరింది. రమణికి కూడా! కార్డు వేసేరు. భవానిని చూడడానికి కూడ రమణి రాలేదు. భవాని దిగ్భ్రాంతి చెందింది. చాల బాధ పడింది. మనస్సులో ఏడ్చింది.
ఆరు నెలలు గడిచేయి.
ఓ రోజు ఫోన్ చేసింది భవాని – రమణి ఇంటికి. అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్లే. “హలో, హలో, నేను రమణి – మీరెవరు చెప్పండి” అని రెండు సార్లు అంది రమణి. ఆ గొంతు గుర్తు పట్టింది. మౌనంగా ఫోన్ పెట్టేసింది భవాని.
ఉప్పొంగే భావోద్వేగాన్ని అణచుకొనే ప్రయత్నంలో విఫలమయి, కాగితం మీద తన బాధను ఇలా జాలు వార్చింది.
***
“రమణీ, ఫోన్ చేసింది నేనే. నీవు వూళ్లోనే వున్నావా? ఇంట్లోనే వున్నావా? అని confirm చేసికోడానికి ఫోన్ చేసేను.
నా భర్త మరణించినపుడు నువ్వు నన్ను ఓదార్చి ధైర్యం చెప్తావని ఎదురు చూసేను. నువ్వు రాలేదు. పదో రోజు, నెలలూ గడిచి పోయేయి. ఎప్పటి మన స్నేహం. పాత రోజులు గుర్తుకొచ్చేయి. ఎంత మార్పు! నీవు పెద్ద ఉద్యోగం చేసి డిపార్ట్మెంట్ హెడ్‌గా రిటైర్ అయ్యేవు. నీ స్టేటస్, నీ దర్జా, నీ స్నేహాలు మారేయి. నీ ప్రయారిటీస్ వేరయ్యాయి.
పెద్ద ఉద్యోగం చేయక పోయినా నేనొక టీచర్ని కదా. పదో తరగతి పాఠం ‘గోపాల్ అండ్ ద ట్రీ’ కథ గుర్తు కొచ్చింది. గోపాల్‌కు ఒక చెట్టుతో స్నేహం. బాల్యం దాని నీడలో ఆడి, దాని పళ్లు తిని ఆనందించేడు. పండుగలొస్తే చెట్టు ఆకులు తోరణాలు కట్టేడు. పెళ్ళయితే దాని కొమ్మలు నరికి పందిరి వేసుకొన్నాడు. గృహస్థయి ఇల్లు కట్టుకోడానికి దాని కొమ్మలన్నీ నరికేడు. ఆ వూళ్ళో బ్రతక లేక వలస పోడానికి నది దాటాలని ఆ చెట్టు మానుతో పడవ చేసుకొన్నాడు. అక్కడా బాగుపడలేక దరిద్రుడై వెనక్కు వస్తాడు. నదికి వరదలు. నీళ్లలో చెట్టు మోడు కనపడితే ఎక్కి దానిమీద పడుకుంటాడు. చలికి వణికి ‘సాయం చేయవా’ అంటాడు. ‘నా వేళ్ళు నరికి చలి మంట కాసుకో’ అంది చెట్టు. నేనూ అలాంటి అమాయకురాలిని కదూ రమణీ!
ఈ మధ్య స్నేహం గురించి ఓ గొప్ప పుస్తకం చదివేను. సృష్టిలో తీయనిది స్నేహమని చెప్తూ ‘నిజమైన మిత్రుడెవరు, అంటే నీవు సంపదతో తులతూగుతున్నపుడు, పండుగ చేసికొంటే, నువ్వు పిలిస్తేనే నీ ఇంటికి వచ్చేవాడు. కానీ, నీకు ఆపద కలిగినపుడు, దైన్యం ఆవహించినపుడు, నీవు నిస్సహాయ స్థితిలో దుఃఖంలో వున్నపుడు – ఎక్కడున్నా రెక్కలు కట్టుకొని నీ దగ్గర ప్రత్యక్షమై, నీ వెన్ను తట్టేవాడు’ అని.
నా జీవితంలో ఇంతకన్నా దుఃఖం ఏం కల్గుతుంది? భర్త ఆకస్మిక మరణం కుంగదీసి కలత చెందినపుడు, వూళ్ళో వుండి కూడా నువ్వు రాలేక పోయేవు రమణీ! స్నేహమా ఇది?!!!
నా ఆవేదనకు అక్షర రూపం – ఈ లేఖ.
శెలవు
భవాని
***
రెండు రోజుల తర్వాత. ఓ ఉదయం – భవాని జపంలో వుంది. బెల్లు మోగింది. తలుపు తీస్తే రమణి – ఇద్దరికీ నోట మాట రాలేదు.
ఓ నిముషం తేరుకొని “రా రమణీ – కూర్చో” అంది భవాని.
“అయామ్ సారీ”
“వారి మరణ వార్త నీకు చేరిందా?”
“ఆ… కృష్ణగారు రిటైర్ అయ్యేక బాబా భక్తులయ్యేరు. చాదస్తం పెరిగింది. నీవు అక్కడకు వెళ్ళడానికి వల్లకాదు ఈ పండుగ రోజుల్లో అన్నారు”
“మరి ఇప్పుడు… ఎలా… ఎందుకు వచ్చేవూ..”
సమాధానం లేదు… కాస్సేపు ….
“మనం మామూలుగా ఉందాం. నన్ను క్షమించు భవాని”
“అది అసంభవం” స్పష్టంగా, క్లుప్తంగా, నిర్వేదనతో చెప్పింది భవాని.
***
ఫోను మోగి గతం లోంచి బయటికి వచ్చింది భవాని.
పెద్ద అమ్మాయి “అమ్మా!!! హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ – తల్లివే కాదు నాకు మంచి ఫ్రెండ్ కూడా కదా మరి నువ్వూ…” అంది.
భవాని నవ్వింది.