ఈ జీవన తరంగాలలో

0
4

[dropcap]ఉ[/dropcap]త్తర ఆంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు. రోజూ ఎందరో భక్తులు కొలుస్తూనే ఉన్నా, విజయదశమి తరువాత వచ్చే మంగళవారం సిరిమానుతో ఊరేగింపు ఉత్సవంలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. అదొక ఆనవాయితీ. ఆ రద్దీలో పాల్గొనడం కష్టం అనిపించి; విజయనగరంలో జన్మించి అమెరికాలో స్థిరపడిన శేఖర్ విశాఖపట్నం ఏదో పనిమీద వచ్చి; ముందు రోజు సోమవారం విజయనగరం వెళ్లి అమ్మవారిని దర్శించుకుందామని మద్దిలపాలెం బస్ స్టాప్‌లో బస్ కోసం ఎదురు చూస్తున్నాడు.

అంతలోనే ఒక నాన్‌స్టాప్ బస్ వచ్చింది. శేఖర్ బస్ ఎక్కుతుంటే అప్పుడే ఒక పదమూడు సంవత్సరాలు వయసు గల పాప ఆటో నుండి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి బస్ ఎక్కబోయి కాలు జారి పడిపోయింది. శేఖర్ లేవనెత్తి “ఎందుకమ్మా అంత తొందర” అని మందలించేడు. ఆ పాప కృతజ్ఞతలు చెప్పి లోపలికి వెళ్లి బస్ చివరి సేట్లో శేఖర్ ప్రక్కన కూర్చుంది. స్కూల్ యూనిఫారంలో ఉంది.

ఆమె కళ్లలో నీళ్లు సుడులుగా తిరుగుతున్నాయి. రుమాలు తీసి తుడుచుకొని సెల్ ఫోన్లో ఏదో నంబర్ రింగ్ చేసింది. అవతలనుండి ఏ సమాధానం లేదు. ఆమె ఫోన్లో చార్జ్ అయిపోయింది. దానినే గ్రహపాటు విధివిలాసం అంటారు. కొంచెసేపు అయ్యాక “అంకుల్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా! ఒక కాల్ చేసుకుంటాను. నా ఫోన్లో చార్జ్ అయిపోయింది” అని బ్రతిమాలింది. ఆ అమ్మాయిని చూస్తుంటే శేఖర్‌కి జాలి వేసింది. జేబులోనుండి తీసి ఇచ్చాడు. ఏవో రెండు నంబర్లు రింగ్ చేసింది ఆ అమ్మాయి. ఆ రెండు నంబర్లు ‘స్విచ్ ఆఫ్’ చేసి ఉన్నాయి. మరి అడగడం ఇష్టం లేక ఆ అమ్మాయి మౌనం వహించి వస్తున్న కన్నీళ్లని దాచుకోడానికి ప్రయత్నించింది.

శేఖర్ ఆమెను పలకరించడానికి ప్రయత్నించేడు. ఆమె అవకాశం ఇవ్వకుండా ముఖం అటుతిప్పి కిటికీనుండి బయటకు చూడసాగింది.

టికెట్‌కి కావలసిన చిల్లర ఇచ్చాడు శేఖర్. మళ్లీ కృతజ్ఞతలు చెప్పింది.

“మీది విజయనగరమా” అని ఆడిగేడు శేఖర్. కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి కళ్లు మూసుకుంది. ఆమెకి అర్థంకాని హిందీ భాషలో శేఖర్ స్నేహితుడు, పోలీస్ ఇనస్పెక్టర్ నవాజ్‌కి పరిస్థితి వివరించి విజయనగరం బస్ స్టాండ్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గరకి ఒక గంటలో రమ్మని చెప్పేడు శేఖర్.

తగరపువలస బ్రిడ్జి దాటేక “ఎక్కడున్నావు” అని ఫోన్ చేసేడు నవాజ్. కోరుకొండకి వెళ్లే జంక్షన్ దగ్గరకి రాగానే మరల ఫోన్ చేసేడు. బ్రిడ్జ్ దగ్గర మారు వేషంలో ఎదురు చూస్తున్నానని చెప్పేడు. అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి బ్రిడ్జ్ దగ్గర దిగి దిక్కులు చూడసాగింది. ఆమెని కొంచెము దూరము నుంచి  శేఖర్ నవాజ్ గమనించసాగేరు. అరగంట అయినా ఎవరూ రాలేదు.

నవాజ్ తాను అభిమానంతో గౌరవించే డి.ఎస్.పి కరుణగారితో మాట్లాడి విషయం చెప్పేడు. కరుణగారు ఆ పాపని తన బంగళాకి తీసుకురమ్మని చెప్పేరు.

ఆమెని పోలీస్ జీప్‌లో కరుణగారి బంగళాకి తీసుకు వచ్చేరు. ఒక పోలీస్ కానిస్టేబిల్ ముగ్గురికి కూల్ డ్రింక్ తీసుకు వచ్చేడు.

కరుణగారు “నీ పేరేమిటి” అని ఆ పాపని అడిగేరు.

“మల్లిక” అని చెప్పి, “మేడం ఒకసారి ఫోన్ చార్జ్ చేసుకోవచ్చా?” అని ప్రాధేయ పడుతున్నట్టు అడిగింది.

ఆ కానిస్టేబిల్ ప్లగ్ పోయింట్ చూపించేడు.

“ఎన్నో తరగతి చదువుతున్నావు?”

“ఎనిమిదవ తరగతి.”

“ఏ స్కూల్?”

స్కూల్ పేరు చెప్పింది.

“నీవు విజయనగరం వస్తున్నట్టు మీ అమ్మగారికి కాని నాన్నగారికి గాని తెలుసా!” అని కొంచెం గట్టిగా అడిగేసరికి కళ్లంట నీళ్లు పెట్టుకుంది మల్లిక.

“నీ స్కూల్ బ్యాగ్‌లో ఏమున్నాయి?” అనడిగేరు కరుణ. మల్లిక చెప్పడానికి సంశయించింది. నవాజ్ తెరచి అందులోఉన్న చీర, పుస్తకాలు బయట పెట్టేడు.

“చీర ఎవరిది?” అనడిగేరు.

ఏడుస్తూ చెప్పింది “మా నాయనమ్మగారిది, ఆ చీరంటే నాకు చాల ఇష్టం రోజూ దానిని పట్టుకుని పడుకుంటాను.”

శేఖర్ ఫోన్లో ఎవరైన పలుకుతారేమోనని మల్లిక కాల్ చేసిన నంబర్లకి ప్రయత్నించాడు. కాని ఫలితం లేకపోయింది.

నవాజ్ శేఖర్ దగ్గర ఆ నంబర్లు తీసుకుని “మేడం ఇవి బి.ఎస్.ఎన్.ఎల్. నంబర్లు. నేను బి.ఎస్.ఎన్.ఎల్. ఆఫీస్‌కి వెళ్లి వాళ్ల ఎడ్రస్ దొరుకుంతుందేమో ప్రయత్నిస్తాను” అని నవాజ్ వెళ్లిపోయాడు.

శేఖర్ అప్పటిదాక జరిగిన విషయాలు కరుణగారికి వివరించేడు.

అరగంటలో నవాజ్ వచ్చి “మేడం, ఇందులో ఒకటి విజయనగరం ఎడ్రస్, ఇంకొకటి శ్రీకాకుళం ఎడ్రస్. విజయనగరం నంబర్ విమలగారి పేరున ఉంది. శ్రీకాకుళం ఎచ్చెర్ల నంబర్ శ్రీలత పేరున ఉంది..” అని వివరాలు చెప్పాడు.

“విజయనగరం ఎడ్రస్ మా నాయనమ్మది, శ్రీకాకుళం ఎడ్రస్ మా అత్తయ్యది” అని మల్లిక కొంచెం ధైర్యంగా చెప్పింది.

అందరికి కొంచెం నమ్మకం కలిగింది.

“నవాజ్, మీరు శేఖర్ గారు మల్లికని ఆ ఇంటికి తీసికెళ్లి వాళ్లకి అప్పచెప్పండి. ఏదైన అనుమానము వస్తే నాకు ఫోన్ చేసి మల్లికని ఇక్కడకి మళ్ళీ తీసుకురండి” అని కరుణ ఆజ్ఞాపించేరు.

“శేఖర్ గారు, ఇంకా మీలాంటి మంచివాళ్ళు ఉండబట్టే అమ్మాయిలు సుఖంగా తిరగగలుగుతున్నారు” అని కరుణగారు మెచ్చుకున్నారు.

“నేను చేసినది చాలా తక్కువ. నవాజ్ లాంటి స్నేహితులు, ఇనస్పెక్టర్లు ఉండడం మా అదృష్టం” అన్నాడు శేఖర్.

అందరూ బయటకి వచ్చేసారు.

నవాజ్ శేఖర్ కొందరిని అడిగి విమలగారి ఇంటికి వచ్చేరు. ఆ ఇల్లు రెండంతస్థుల మేడ.  మేడమీద పడమటి పొర్షన్లో విమలగారు ఉంటున్నారు.

నవాజ్ కాలింగ్ బెల్ నొక్కాడు. శ్రీలత తలుపు తీసింది. శ్రీలతని చూడగానే మల్లిక ఒక్కసారి కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.

“నువ్వు ఒక్కదానివి వచ్చావా! అమ్మా నాన్నా రాలేదా”! అని ఆశ్చర్యంగా అడిగింది శ్రీలత.

“మీ పేరు?” అని నవాజ్ అడిగేడు

“శ్రీలత”

“మరి విమలగారు ఎవరు!” అని మరల అడిగేడు.

“రండి చూపిస్తాను” అని ప్రక్క గదిలో నేల మీద కొన ఊపిరితో ‘కోమా’లో ఉన్న వ్యక్తిని చూపించింది.

అదేమి విచిత్రమో మల్లిక తెచ్చిన చీర, విమలగారు కట్టుకున్న చీర ఒక్కలాగే ఉన్నాయి.

విమలగారిని ఆ పరిస్థితిలో చూసి మల్లిక ఆమెను కౌగిలించుకొని “నాయనమ్మా, నేను మల్లికని ఒక్కసారి నాతో మాట్లాడవా” అని భోరున ఏడ్చింది.

విమలగారు ఏదో అనబోయి ప్రాణాన్ని నోటి ద్వారా అనంతవాయువులో కలుపుకున్నారు.

నవాజ్ బయటకు వచ్చి కరుణగారికి చూసినదంతా వివరంగా చెప్పేడు. కరుణగారు “నవాజ్ మీకు వీలైనంత సహాయం చేయండి” అని అభ్యర్ధించేరు.

***

విమలగారిది ఒక విచిత్రమైన విషాదగాధ.

విజయనగరానికి దగ్గర్లో ఉన్న ‘లోగీస’ గ్రామంలో జన్మించారు. తండ్రి వేద పండితుడు. అయితే ఆడపిల్లలకి చదువు ముఖ్యం కాదు పెళ్లి సంసారమే జీవితం అన్న దృఢ అభిప్రాయం కలిగిన కుటుంబం. విమలని ఎనిమిదవ తరగతి తరువాత చదువు ఆపించి పదహేనవ ఏటే పెళ్లి చేసేరు. విమల అత్తవారిది విజయనగరం. ఆస్తి అంతస్తుగల వ్యాపార కుటుంబం. భర్త ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. దురలవాట్లు లేవుకాని సొషలిస్ట్, ఎప్పుడూ ప్రజాసేవ, సంఘసేవా కార్యక్రమాలలో నిమగ్నుడై ఉండేవాడు.

అత్త మామగార్ల సంరక్షణ,  ఇంటి చాకిరీ అంతా విమలదే. ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో అనుమానం మీద ఆమె భర్తని జైలులో నిర్బంధించేరు. అత్తగారి సాధింపులు ఇరుగు పొరుగువారి సూటిపోటు మాటలు విమలని యవ్వనంలోనే కృంగదీసాయి.

పొరపాటని తెలిసి భర్తని ప్రభుత్వం విడుదల చేసినా పరిస్థితుల వలన ఒక ప్రాథమిక పాటశాలలో భర్త ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరాడు. విధివిలాసం వలన ఇద్దరు మొగ పిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించిన పది రోజులకే మరణించేరు. ఆరోగ్యమైన పిల్లలు కలగడం కోసం శనివారం ఉపవాసం, మౌనవ్రతం రామకోటి వ్రాయడం వంటి  చర్యలు ప్రారంబించేరు విమల. ఫలితమే శ్రీలత, శ్రీచరణ్ జననం. వారి అభివృధ్ధి కోసం ఉపవాసాలు, మౌనవ్రతాలు, రామకోటి వ్రాయడం కొనసాగించేరు. ఇంట్లోనే కొందరి పిల్లలకి సాయింత్రం పూట  ట్యూషన్స్ చెపుతూ భర్తకి ఆర్థిక సహాయం చేసేవారు విమల. శ్రీలత స్థానిక కళాశాలలలో బి.ఎస్.సి, బి.యిడి; శ్రీచరణ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదివేరు.

విమలగారి సంతోషం ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. విశాఖపట్టణంలో ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తూ తనతో పని చేస్తున్న క్రిస్టియన్ అమ్మాయి మేరీని తన అక్కకి పెళ్లి కాకుండానే శ్రీచరణ్ చేసుకున్నాడు. తమ బంధువుల అబ్బాయి సురేష్‌తో శ్రీలత పెళ్లి జరిపినప్పటికీ; సురేష్ మతం మార్చుకుని ఒక ముస్లిం యువతిని హైదరాబాద్‌లో పెళ్లి చెసుకుని ఆ కుటుంబంతో దుబాయ్ వెళ్ళిపోయాడు. పోలీస్ కేస్ పెట్టమని మేరీ; వద్దని శ్రీలత వాదనలు గొడవలుగా మారి వారి మధ్య మాటలు లేకుండా చేసేయి. మానసికంగా కృంగిపోయి విమల భర్త నరసింగరావుగారు చనిపోయేరు.

శ్రీలత శ్రీకాకుళం జిల్లాలో వివిధ ఉన్నత  పాఠశాలలలో ఉపాధ్యాయినిగా పని చేయసాగిస్తూ కొందరి సూటిపోటు మాటలు భరిస్తూ కొందరి ఓదార్పులు సహిస్తూ జీవనం గడుపుతోంది. సెలవులలో అమ్మకి సహాయంగా వచ్చి వెళుతోంది.

ఒక వారం క్రితం చీకటిలో బాత్ రూం తలుపు తగిలి నేల బలంగా తలకు తగలడం వలన కోమా లోకి విమలగారు వెళ్లిపోయేరు. శ్రీలత ప్రముఖ ఆసుపత్రికి తీసికెళ్లినప్పటికి ఫలితం లేక పోయింది.

శ్రీలత శ్రీచరణ్‌కి మేరీకి ఫోన్ చేసింది. ఇద్దరూ ఫోన్ తీయలేదు. అరగంట ప్రయత్నించి మెసేజ్ పంపించి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

***

కర్మ చేసే పురోహితునికి ఫోన్ చేసి అంతిమక్రియలకి ఏర్పాట్లు తనే స్వయంగా చూసుకుంది. చుట్టుప్రక్కలవాళ్లు పరామర్శకి వచ్చేరు. చాలామంది వారించినా కర్మకాండ శ్రీలత చేసింది. విచిత్రమేమిటంటే వేరే ఉద్దేశంతో వచ్చిన శేఖర్, నవాజ్ విమలగారి శవాన్ని మోసి దగ్గరలో ఉన్న శ్మశాన వాటికకి తీసుకు వెళ్లేరు.  శ్రీలత అభ్యర్ధన మేరకు కేటరింగ్ వారు తెచ్చిన భోజనం వారితో కలిసి చేసేరు. శ్రీలత మల్లికను తిరిగి తీసుకెళ్లి ఆమె ఇంటికి చేరేలా చూడమని శేఖర్‌ని వేడుకుంది.

శేఖర్ ‘అలాగే’ అని విమలగారిలోనే ‘విజయనగరం పైడితల్లి అమ్మవారి’ని కొలిచి బయల్దేరాడు. నవాజ్ మల్లికని శేఖర్‌ని బస్ స్టాండ్ దగ్గర దించివేసి వెళ్లిపోయాడు. నాన్‌స్టాప్ ఏ.సి.బస్‌లో శేఖర్, మల్లిక విశాఖపట్టణం బయిల్దేరారు. మల్లిక “అంకుల్, ఇవిగో టికెట్ డబ్బులు” అని అంది.

“ఫరవాలేదు.”

మల్లిక ఏడుస్తూ నిద్రలోకి జారిపోయింది. విశాఖపట్టణం రాగానే చిన్న చిన్న చినుకులు ప్రారంభం అయ్యాయి. ఆటోలో మల్లికని శంకరమఠం దగ్గర దింపేసి అబిద్ నగర్‌లో తన ఇంటికి వెళ్తుంటే; ప్రక్కనున్న మరొక ఆటో నుండీ ‘ఘంటసాల’ గారు గానం చేసిన సినిమా పాట ‘ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ స్వంతము ఎంతవరికీ బంధము’ లీలగా వినపడింది.

అప్రయత్నంగానే శేఖర్ పెదవులమీద నిస్పృహతో కూడిన చిరునవ్వు మెదిలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here