[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
ఇచ్ఛన్నలంఘవీ యత్వమథ కక్ష్యాం విలంఘయన్।
ప్రతీహారాన్ద్విఝా దూరం వార్యానతామితి సోన్వశాత్॥
(కల్హణ రాజతరంగిణి VI 2)
[dropcap]క[/dropcap]శ్మీర రాజతరంగిణి చదువుతూంటే పలు రకాల ఆలోచనలు ముసురుకుంటాయి. గతంలో వర్తమానం కనిపిస్తూంటుంది. భవిష్యత్తు లీలగా కదలాడుతూంటుంది. వర్తమానం విస్పష్టం. భవిష్యత్తు అస్పష్టం. గతంలో జరిగిన సంఘటనలను వర్తమానంలో మనం అనుభవిస్తున్న సంఘటనలతో పోలిస్తే అప్పటికీ, ఇప్పటికీ వ్యక్తిత్వాలలో తేడాలు తెలియటంతో పాటే, ఇలాంటి పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో అన్న విషయం కూడా అవగాహనకు వస్తుంది. అంటే, చరిత్ర పఠనం వ్యక్తిత్వ వికాసానికి కూడా దారితీస్తుందన్న మాట. ఉత్తమ ప్రవర్తనకు ఉదాహరణగా నిలవటమే కాదు, ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సివస్తుందో సజీవ ఉదాహరణల ద్వారా చరిత్ర వివరిస్తుంది. ఇది కేవలం వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాదు, సమాజాన్ని, సామాజిక మనస్తత్వాన్ని అధ్యయనం చేసేవారికి, రాజకీయాలను విశ్లేషించాలనుకునేవారికి, రాజకీయాలలో పాల్గొనాలనుకునేవారికీ మార్గదర్శనంగా నిలుస్తుంది.
బ్రాహ్మణ కూటమి ‘యశస్కరుడి’ని రాజుగా నిలిపింది. సాధారణంగా ప్రపంచంలో జరిగేదేమిటంటే, ఎవరయినా ఒకడికి ఏదైనా లాభం కలిగించే పని చేస్తే, వెంటనే ఆ వ్యక్తి తమకు విధేయుడిగా ఉండాలని వాంఛిస్తారు. ఆ వ్యక్తి తన మాట కాదనటాన్ని ‘కృతఘ్నత’గా భావిస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక వ్యక్తి నుంచి సహాయం పొందిన తరువాత ఆ వ్యక్తిని గౌరవించటం అన్నది సంస్కారం. కానీ సహాయం చేశాను కదా అని సహాయం పొందిన వ్యక్తిపై అధికారం చలాయించటం, అనుచితమైన కోరికలు కోరటం చేస్తే కూడా విధేయంగా ఉండడం సహాయం పొందిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే అంశం. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, సహాయం చేసిన వ్యక్తిని కాదంటే కృతఘ్నుడన్న పేరు వస్తుంది. అలాగని అతడి మాట వింటే, తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదన్న ‘మాట’ వస్తుంది. రెండు వైపులా పదునైన కత్తి లాంటిది ఈ పరిస్థితి. రాజుగా అభిషిక్తుడైన యశస్కరుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కున్నాడు.
యశస్కరుడిని చూడగానే బ్రాహ్మణ సమూహం అతడిని రాజుగా ఎన్నుకున్నది. దాంతో యశస్కరుడు తమకు విధేయుడిగా ఉంటాడని భావించింది. యశస్కరుడిని ఎన్నుకున్నందుకు లాభం పొందాలని ఆశించింది. కానీ అధికారం చేపట్టిన యశస్కరుడు వాళ్ళ పథకాలను తల్లక్రిందులు చేశాడు. ముందరి కాళ్ళకు బంధం వేశాడు. తనని రాజుగా ఎన్నుకోవటం వాళ్ళ గొప్పతనం. కానీ తాను రాజుగా బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వారి పట్ల విధేయత ప్రతిబంధకం కాకూడదు. అందుకని ముందుగా రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే బ్రాహ్మణ సమూహాన్ని ‘దూరం’ పెట్టమని ఆజ్ఞలు జారీ చేయటం. ఒక పరిధి దాటి వారు తన దగ్గరకు రాకుండా నియమం విధించాడు యశస్కరుడు. వారందరికీ చేతులు జోడించి చెప్పాడు – “మీరు నా తలపై కిరీటం పెట్టారు. కాబట్టి మిమ్మల్ని దేవుళ్లలా పూజించాలి. మీరు నాకు అధికారం కట్టబెట్టినందుకు గర్వంతో అహంకరిస్తారు. అందుకని మీరు రాజసభలో వ్యవహారాలు చూసే సమయంలో తప్ప ఇతర సమయాల్లో నా దగ్గరకు రాకూడడు” అన్నాడు.
రాజు మనసును బ్రాహ్మణులు అర్థం చేసుకున్నారు. వారు రాజకీయం మరచి తమ శాస్త్ర పఠనంలో మునిగిపోయారు. అయితే రాజు బ్రాహ్మణ సమూహాన్ని దూరంగా ఉంచడాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజుకు, రాజసభకు దూరంగా ఉండసాగారు.
ఆరంభంలో యశస్కరుడు చక్కగా పాలించాడు.
ఒక చక్కటి కవి ఎలా తన కవిత్వం ద్వారా పాత కవులను సజీవంగా నిలుపుతాడో, అలా, కశ్మీరు మరిచిపోయిన చక్కటి పాత సంప్రదాయాలను రాజు కశ్మీరులో సజీవంగా నిలిపాడు. రాజ్యం సుభిక్షమయింది. ప్రజలు నేరాలు మరిచిపోయారు. గత పాలకుల ప్రభావంతో నేరానికి, దౌష్యానికి అలవాటు పడిన రాజోద్యోగులు కూడా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. రాజు నేరస్థులను శిక్షించటంతో, దేశంలో దొంగల భయం తీరింది. రహదారులు సురక్షితమయ్యాయి. ప్రజలు, వ్యాపారులు ఇళ్ళ తలుపులు వేయడం మరచిపోయారు. బ్రాహ్మణులు మద్యం సేవించి సామవేద గానం చేయటం మానివేశారు. తాపసులు ఆస్తులు సంపాదించటం, సంసారులు కావటం మానేశారు. ‘గురుదీక్ష’ పేరిట దైవంలా నటిస్తూ అందరికీ చెడ్డపేరు తేవడం మానేశారు.
కశ్మీరులో వచ్చిన మార్పు కల్హణుడి వర్ణన ద్వారా తెలుసుకుంటుంటే, కశ్మీరు ఏయే అంశాలలో దిగజారిందో అర్థమవుతుంది. మద్యం తాగి సామవేదం గానం చేయడం మానేసి బ్రాహ్మణులు శాస్త్ర పఠనంలో మునిగిపోయారనటం – బ్రాహ్మణ సమాజం దిగజారటాన్ని చూపిస్తుంది. అలాగే పండితుల వేషంలో శాస్త్రాలకు దుర్వ్యాఖ్యానం చేయటం, విమర్శించటం మానేశారనటం కూడా ఆ కాలంలో కూడా పండితుల వేషాలలో తెలిసీ తెలియక తమ స్వంత సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, శాస్త్రాలను, తత్త్వాన్నీ దూషించేవారని తెలుస్తుంది. ఇది ఇప్పటికీ జరుగుతోంది. ఎవరో ఒకరు తన స్వకపోల కల్పితమైన దుర్వ్యాఖ్యానం చేస్తాడు. తమ స్వలాభం కోరి ఇతరులు ఆ దుర్వ్యాఖ్యానాన్ని ప్రామాణికం చేస్తారు. తరువాత తరాల వారు మూలం జోలికి పోకుండా ప్రామాణికమైన దుర్వ్యాఖ్యానాన్ని నెత్తికెక్కించుకుని అదే ‘అసలు నిజం’ అన్న భ్రమలో పడతారు. అప్పుడు జరిగింది అదే, ఇప్పుడు జరుగుతోందీ అదే.
యశస్కరుడి గురించి రెండే గొప్ప సంఘటనలు చెప్తాడు కల్హణుడు. తన రాజ్యంలో న్యాయాన్ని ఎలా అమలుపరిచేవాడో సూచించే సంఘటనలివి. ఓ వ్యక్తి ఉపవాస నిరసన వ్రతం చేస్తాడు. ఎందుకంటే, అతడు విదేశాలకు వెళ్తూ, తన ఇంటిని ఒకడికి అమ్మేస్తూ, ఆ స్థలంలోని బావిని మాత్రం భార్యకు జీవిక కోసం వదులుతాడు. కానీ ఆ స్థలం కొన్నవాడు బావిని కూడా కలిపేసుకుని అతడి భార్యను వెళ్ళగొడతాడు. కొన్నేళ్ళ తరువాత కశ్మీరం తిరిగి వచ్చిన ఆ వ్యక్తి భార్య దుస్థితి చూసి న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. కానీ అందరూ అతనికి వ్యతిరేకంగా తీర్పు చెప్తారు. దాంతో అతడు రాజధానికి వచ్చి రాజభవనం బయట నిరసన చేపడుతాడు. రాజు సంగతి విచారిస్తాడు. అతడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పినవారంతా గత పాలకులకు విధేయులనీ, దుష్టులనీ గ్రహిస్తాడు. న్యాయం చేస్తాడు. తప్పు తీర్పు చెప్పిన వారిని శిక్షిస్తాడు. మోసం చేసిన వ్యాపారికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. ఇలాంటిదే మరో సంఘటనను వివరిస్తాడు. న్యాయాన్ని, అన్యాయాన్ని వేరు చేసి చూసి న్యాయం చేసే విచక్షణను ప్రదర్శిస్తూ కృత యుగాన్ని తలపించే రీతిలో రాజ్యాన్ని పాలించాడు యశస్కరుడు అంటాడు కల్హణుడు.
అయితే, కశ్మీరానికి మంచి రోజులు వచ్చేశాయనుకునే వీలు లేదు.
ఇతరులకు పథ్యం చెప్పి తాను మాత్రం నియంత్రణ లేకుండా వ్యవహరించే వైద్యుడు ఎలా హేళనకు గురవుతాడో, అలా, ఇతరులకు నీతులు చెప్తూ తాను మాత్రం వాటిని పాటించని యశస్కరుడు కూడా అవహేళనకు గురయ్యాడని, ప్రజల గౌరవం కోల్పోయాడని కల్హణుడు వ్యాఖ్యానిస్తాడు.
యశస్కరుడు స్వయంగా మంచివాడయినా, గతంలో దుశ్చర్యలు చేసిన వారిని వదిలించుకోలేదు. దాంతో రాజు కూడా తప్పుదారి పట్టాడు. ధనార్జన లక్ష్యంగా ప్రవర్తించాడు. అతని రాణులు పరాయివారితో సంబంధాలు నెరపుతూంటే చూసీ చూడనట్టు వదిలేసి నవ్వుల పాలయ్యాడు. స్వంత సోదరుడిని విష ప్రయోగంతో చంపించాడు. ‘లల్ల’ అనే వేశ్య మోహంలో పడ్డాడు. ఆమెను అందరికీ అధిపతిగా చేశాడు. ఆమె చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. రాజును వశపరుచుకున్న లల్ల, రాత్రివేళల్లో ఇతరులతో సంబంధాలు నెరపేది. కొన్నాళ్ళకి నిజం తెలిసిన యశస్కరుడికి తన తప్పు తెలిసి వచ్చింది. రాజ్య నిర్వహణను విస్మరించిన తన ‘పాపం’ గ్రహింపుకు వచ్చింది. లల్ల మీద ప్రేమతో ఆమెను శిక్షించలేకపోయాడు. కానీ తన దృష్టిని పాప పరిహార చర్యలపై కేంద్రీకరించాడు. రాబోయే జన్మలలో కూడా రాజుగానే పుట్టాలన్న దురాశతో బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశాడు. ఆర్యదేశం నుంచి వచ్చి విద్యాభ్యాసం చేసే వారి కోసం ఆరామాలు నిర్మించాడు. అయితే చేసిన పాపం ఊరికే పోదంటారు. రాజుకు జీర్ణకోశ వ్యాధి సంక్రమించింది. మరణం ఆసన్నమయిందని గ్రహించిన యశస్కరుడు తన సంతానం సంగ్రామదేవుడిని కాక, ‘వర్ణత’ అనే బాలుడిని రాజుగా ప్రకటించాడు. సంగ్రామదేవుడు తన సంతానంగా చలామణీ అవుతున్నా, తనకు పుట్టినవాడు కాదని యశస్కరుడికి తెలుసు.
ఇంతకాలం తెరల మాటున ఉండి పర్వగుప్తుడు రాజ్యాధికార సాధన కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. శక్తివంతులందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. యశస్కరుడు వ్యాధితో బాధపడుతూ, అంత్యదశ సమీపించిదని గ్రహించి రాజ్యం వదిలిపోతుంటే, పర్వగుప్తుడు ‘వర్ణత’ని బంధించి సంగ్రామదేవుడిని రాజుగా చేశాడు. రాజ్యం వదిలిపోతున్న యశస్కరుడి వద్ద ఉన్న ధనం కూడా పర్వగుప్తుడు, ఇతర మంత్రులు దోచుకుని పంచుకున్నారు. చివరికి మఠం చేరిన రాజును అక్కడి సేవకులే చంపేశారు. తొమ్మిదేళ్ళు యశస్కరుడు రాజ్యం చేశాడు.
యశస్కరుడి మరణం తరువాత అతని సేవకులు, రాణులు అంతా కొత్త రాజుకు విధేయతను ప్రకటించారు. కానీ రాణి త్రైలోక్యదేవి మాత్రం రాజుకు విధేయురాలిగా ఉంది.
పర్వగుప్తుడు, తనకు సహాయం చేసిన వారందరినీ ఒకరొకరిగా సంహరించి, నామ మాత్రంగా రాజును గద్దెపై నిలిపి, సర్వాధికారాలు తానే చేపట్టాడు. సంగ్రామదేవుడు బాలుడు. పర్వగుప్తుడు అతడికి విధేయుడిగా ఉన్నట్టు నటిస్తూ, ఒక రోజు తన అనుచరులతో రాజభవనాన్ని చుట్టుముట్టాడు. సంగ్రామదేవుడిని చంపి వితస్తలో విసిరివేశాడు. క్రీ.శ. 949వ సంవత్సరంలో పర్వగుప్తుడు కశ్మీరు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు.
పర్వగుప్తుడు రాజవుతూనే ధనార్జనలో పడ్డాడు. దుష్టులందరికీ ఉన్నత స్థానాలు, పదవులు ఇచ్చాదు. యశస్కరుడి రాణి ‘గౌరి’ని మోహించాడు. ఆమె పర్వగుప్తుడికి లొంగేందుకు ఒక నియమం విధించింది. యశస్కరుడు అసంపూర్తిగా వదిలిన మందిర నిర్మాణం పూర్తయిన తరువాత అతడికి లొంగుతానంది. పర్వగుప్తుడు మందిర నిర్మాణం పూర్తి కాగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే రాజ్యాధికారం కోసం జీవితాంతం తపన పడి, ఆరాటంతో క్రూరంగా, దౌష్ట్యంగా, కుత్సితంగా ప్రవర్తిస్తూ, ద్రోహంతో అధికారం సాధించిన పర్వగుప్తుడు ఒక సంవత్సరం మాత్రమే అధికారం చేయగలిగాడు. అనారోగ్యంతో అతడు మరణించాడు. “జీవితం క్షణికమని తెలిసినా, అనవసరమైన ఆశలతో, ఆరాటాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారెందుకో” అంటూ వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు. పర్వగుప్తుడి తరువాత అతడి కొడుకు ‘క్షేమగుప్తుడు’ రాజయ్యాడు. క్షేమగుప్తుడు యువకుడు. తండ్రిని మించిన తనయుడు. అసలే దుష్టుడు, ఆ పై అధికారం చేతికి అందింది. ఎలాగయితే చిక్కటి చీకటి రాత్రి, ముసురుకున్న మేఘాలతో మరింత చీకటి అవుతుందో, అలా, అసలే దుష్టుడయిన క్షేమగుప్తుడు, అంతకన్నా దుష్టుల సాంగత్యంతో మరింత భయంకరమైన దుష్టుడయ్యాడంటాడు కల్హణుడు. ఈ దుష్టులలో ఫల్గుణుడు అన్నవాడు మరింత దుష్టుడు. వీరంతా తేనెటీగలు పువ్వును చుట్టుముట్టినట్టు రాజును చుట్టుముట్టారు. రాజు స్త్రీలోలుడు. మద్యపానానురక్తుడు. జూదంపై మోహం ఉన్నవాడు. వీరంతా కలిసి రాజును భ్రష్టుడిని చేశారు. రాజాస్థానం వేశ్యలతో, దుష్టులతో, మూర్ఖులతో, అవినీతిపరులతో నిండి మంచివారికి స్థానం లేనిదయింది.
ఇక్కడ కల్హణుడు క్షేమగుప్తుడిని అతని చుట్టూ చేరినవారు ఎలా తప్పుదారి పట్టించారో, భ్రష్టుడిని చేసి దోచుకున్నారో విపులంగా వర్ణిస్తాడు కల్హణుడు. అంతా అయిన తరువాత ఒక్క శ్లోకంలో (VI, 167) వారి దిగజారుడుతనాన్ని, రాజు నైచ్యాన్ని వర్ణిస్తాడు. “తమ శరీరాలపై నీచమైన హాస్య వ్యాఖ్యలు చేస్తూ ఆ పరాన్నజీవులు వారి ఆత్మగౌరవాన్ని వదిలేశారు. వాళ్ళ స్త్రీల గౌరవాన్ని వదిలించారు. కుటుంబ గౌరవాన్ని వదిలేశారు. రాజు సమక్షంలో దీర్ఘకాలం ఉంటూ వారు ‘గౌరవం’ అన్న దాన్ని పూర్తిగా వదిలేశారు. ఇలా గౌరవాన్ని సంపూర్ణంగా వదిలేసి, నీచంగా, జుగుప్సాకరంగా జీవిస్తూ, ఈ పరాన్నజీవులు ఏం సాధించాలనుకుంటారో?” అంటూ వాపోతాడు కల్హణుడు.
‘సంగ్రాముడ’నే దామరుడిని చంపేందుకు రాజు కొందరు సైనికులను పంపాడు. వారి నుంచి తప్పించుకునేందుకు అతడు ‘జయేంద్ర విహారం’లో తల దాచుకున్నాడు. దాంతో రాజు ఆ విహారాన్ని కాల్చివేశాడు. అలా కాలిన విహారంలోని బుద్ధుడి కంచు విగ్రహాన్ని, రాళ్ళను తీసుకుని క్షేమగౌరీశ్వర మందిరాన్ని నిర్మించాడు క్షేమగుప్తుడు.
పలువురు చరిత్ర రచయితలు ఈ సంఘటనను ఉదాహరణగా చూపించి మహమ్మదీయులు భారతదేశంలోకి ప్రవేశించేకన్నా ముందే, భారతదేశంలో విహారాలను కాల్చి, వాటి శకలాలను ముడిసరకుగా మందిరాలను నిర్మించే ఆనవాయితీ ఉందని వ్యాఖ్యానిస్తారు. అది సత్యం కాదు. క్షేమగుప్తుడు క్రీ.శ. 950 తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. అప్పటికే భారతదేశం తురుష్క తాకిడితో అల్లకల్లోలం అవుతోంది. సమాజంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మందిరాలు ధ్వంసం అవుతున్నాయి. వాటి స్థానే మసీదులు వెలుస్తున్నాయి. కాబట్టి మహమ్మదీయులు భారతదేశంలో ప్రవేశించేకన్నా ముందే భారతదేశంలో ఆరామాలు కూలగొట్టి శకలాలతో మందిరాలు నిర్మించటం ఉంది అనటం పొరపాటు. అదీ గాక, కల్హణుడు చెప్పిన దాని ప్రకారం రాజు ఆరామాన్ని కాల్చటంలో ధర్మం పరమయిన, మతపరమయిన ద్వేషాలు లేవు. రాజు తనకు శత్రువుగా భావించినవాడు ఆరామంలో దాక్కున్నాడు. వాడిని చంపటానికి ఒకటే మార్గం, ఆరామాన్ని కాల్చేయటం.(ఆపరేషన్ బ్లూస్టార్ లాంటిది) . ఈ కథాకాలం నాటికి కశ్మీరంలో బౌద్ధం దాదాపుగా అంతరించింది. బౌద్ధానుయాయులు పరిమితం కాబట్టి ఇక్కడ జరిగింది రాజకీయం తప్ప ధార్మికం కాదు. దీనికి ధర్మం రంగు పూసి, దేవాలయాలను కూలగొట్టి, మసీదులు కట్టడాన్ని సమర్థించే ప్రయత్నం చరిత్ర రచయితలు చేశారు. అది పొరపాటు. ఇది ఒక అరుదైన సంఘటన తప్ప ఆనవాయితీ కాదు.
(ఇంకా ఉంది)