కావ్య-1

0
3

[box type=’note’ fontsize=’16’] డా. ఇందు ఝున్‌ఝున్‍వాలా హిందీలో రచించిన ‘కావ్య’ అనే నవలని అదే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఆర్. ఉమా శర్మ. [/box]

[dropcap]శ్రీ [/dropcap]మాత

2010 సంవత్సరం…. అర్ధరాత్రి…. చుట్టూ నిశబ్దం…. కానీ నా మనసులో మాత్రం ఎన్నెన్నో మరపురాని సంఘటనల అలలు…..

ఒక్కసారిగా మనసు బరువెక్కింది. అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆ బంధం తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి.. ఆ బంధం, సంబంధం మాట ఏమిటో గానీ, ఆ బంధం తాలూకు దుఃఖం మాత్రం ఇంకా నాలో మిగిలి ఉందనే చెప్పాలి….

డైవర్స్ కొరకు అదే విడాకుల  కొరకు అప్లై అయితే చేశాను కానీ ఇన్ని రోజులు మనసులో కూడా ఆ సంబంధం అనేది ఒకటి ఉంది అని కూడా నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఆ బంధం రెండు మనసుల కలయిక మాత్రం కానే కాదు. ఎన్నో సంవత్సరాల కిందట అతన్ని కలిసిన జ్ఞాపకం. ఇలా ఆ బంధం కేవలం సమాజానికి మరియు రెండు కుటుంబాలకు మాత్రమే పరిమితం అయింది..

అతని ఇద్దరి పిల్లలకు నేను తల్లినైతే అయ్యాను. అంటే ఇష్టమున్నా లేకున్నా అతనితో నా శారీరిక సంబంధం మాత్రం నేను ఒప్పుకోవలసిన సత్యం..

నేటి వరకు ఈ సంబంధం గురించి నా మనసులో నేను ఎటువంటి పేరు పెట్టలేదు. కానీ ఆ బంధం నేడు విడిపోతూ ఉంది అంటే మాత్రం సరిగ్గా అర్థంకాని అయోమయ స్థితి. ఏదో భయంకరమైన తుఫాను, అలజడి.  నా నుంచి యేదో కరిగి పోతున్న, అవ్యక్త భావన. ఆ తుఫాను తాలూకు బిందువులు ఎగిరి కాగితాలపైనా నేడు సంతకాల రూపంలో ఆ బంధానికి చరమ గీతం పాడుతున్నాయేమో అన్నట్టుగా ఉంది.

ఎన్నో సంవత్సరాలుగా ఆ బిందువులు నా జీవితపు ప్రతి పేజీలో వర్షిస్తూ ఉన్నా కూడా నేడు వాటికి ఒక అర్థం దొరికిన అనుభూతి నాలో కలుగుతూ ఉంది.

సముద్రపుటంచు చూడవచ్చునేమో కానీ స్త్రీ అంతరంగం తెలుసుకోవటం చాలా కస్టమైన పని అన్నట్టు, నాలో నేను తరచి చూసుకుంటూ ఉన్నాను నేడు.. అతడిని మనసారా ప్రేమించనూ లేదు, ఇస్టపడింది లేదు.   ఇది అంతా ఎలా జరిగింది? అది నిజమైన ప్రేమా? లేక నన్ను దక్కించుకోవాలనే అతని పంతం, మొండితనం  మాత్రమేనా? ఇలా ఏన్నో ప్రశ్నలు నేడు సినిమా లాగా నా కళ్ల ముందు ప్రత్యక్షం కాసాగాయి.

***

నా జీవితం లోని మధురమైన రోజులు అవి….

నేను కాలేజీలో చదివే రోజులు. నేను, నా స్నేహితురాలు అంజు ఇద్దరం కలిసి కాలేజీ వెళ్ళేవారం. ఒకనాడు కాలేజీ నుంచి బయటకు రాగానే తొలకరి జల్లులు పడుతూ ఉన్నాయి. నేను, అంజు మాట్లాడుతూ ఇంటి త్రోవ పట్టాము. మాట్లాడుతూ ఇంటికి వెళ్ళటం మాకు సరదా. మా ఇద్దరికీ మాటల్లో ఏదీ అడ్డు రాదు. వర్షపు బిందువులు మా ఒంటిపైన చిన్న చిన్న ముత్యాలవలే మెరుస్తూ ఉన్నాయి. వాటిని లెక్కించక మేము కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నాము.

నాకు అంజుకూ అపుడు అచ్చంగా పదహారేళ్ళ వయసు. అంజుతో మాట్లాడుతూ వస్తూ ఉంటే ఇంటి గేట్ రానే వచ్చేసింది. అమ్మ మేడ పైన ఉన్న కిటికీ దగ్గరే నుంచోని నా కోసమే వేచి చూస్తూ ఉంది. ఇంటి లోకి వచ్చి రాక ముందే అమ్మ మెల్లగా కసిరింది – “ఈ రోజు కూడా తడిసి వచ్చావా? త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకొని రా, నీకోసం వేడిగా టీ చేసుకొని వస్తాను. మీ నాన్న కూడా కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే సమయం అయింది” అంటూ వంట ఇంటిలోకి వెళ్లింది.

నేను కూడా త్వరగా రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని   వచ్చాను. ఎప్పటిలానే  నాన్నతో మాట్లాడేందుకు ఎదురు చూస్తూ ఉన్నాను. మా ఐదు మందిలో కెల్లా నేను అంటే మా నాన్నకు చాలా ముద్దు, గోము కూడా. నాన్నకు అన్నయ్య అంటే కూడా చాలా ప్రేమ కానీ నేను అంటే మరింత యెక్కువ ప్రేమ. అన్నయ్యకు కూడా ఆ విషయం తెలుసు కానీ అన్నయ్యకు ఈ విషయంలో నా మీద కోపం లేదు, ఎందుకు అంటే అన్నయ్యకు కూడా నేను అంటే బాగా ఇష్టం, ప్రేమ ఉండేవి.

అమ్మకు కూడా నేనంటే ప్రేమ ఉండేది కానీ నా అల్లరితనం చూసి కొంచెం భయపడేది కూడా. నేను కాలేజీకు చక్కగా ముస్తాబు అయి వెళ్తున్నానంటే అమ్మకు యేదో దిగులు, భయం కలిగేవి. రోజు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేది. కాలేజీలో అబ్బాయిలతో దూరంగా ఉండమని, సమయానికి ఇంటికి త్వరగా రమ్మని, రోజూ ఇంటి కిటికీ దగ్గరనే నుంచోని నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇవి అన్నీ యేదో వింతగా నాకు అనిపించేవి.

ఇపుడు ఒక బిడ్డకు అమ్మనైయ్యాక నాకు మా అమ్మ అపుడు యెందుకు అలా ప్రవర్తించేది అనేది అర్థం అవుతూ ఉంది. ఆమె భయపడ్డట్టే నా జీవితంలో పెను తుఫాను రేపిన ఆ సంఘటన జరిగిన తరువాత ఆమ్మ చింత , భయం పూర్తిగా అర్థం అయింది. నా నుదుటి రాతలో అలా  జరగాలి అని ఉంటే అమ్మ భయం మాత్రం దాన్ని మార్చగలదా? నా అందం కూడా అమ్మ భయానికి ఒక కారణమే అని చెప్పాలి మరి.

***

ఒక రోజు కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాను, ఇంకా సరిగా ఇంటి లోకి కాలు కూడా పెట్టలేదు, అప్పుడే ఒక గొంతు నన్ను ఆపింది. అతను మా ఇంటి ముందు నుంచోని మా ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూపుడు వేలు చూపిస్తూ చెప్పాడు.

“నన్ను క్షమించండి, నేను కొత్తగా ఈ ఊరికి వచ్చాను, ఇక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ ఎంత దూరం ఉంటుందో చెప్పగలరా?”

నేను వెంటనే తిరిగి చూశాను. ఆ యువకుడు నా కన్నా రెండు లేదా మూడు సంవత్సరాలు పెద్దవాడు అయి ఉండవచ్చు అనుకున్నా. నన్ను సహాయం అడిగారు కదా అనే ధీమాతో అన్నాను, “ఓహ్, తప్పకుండా, మా నాన్నగారు పోస్ట్ మాస్టర్. ఈ వీధి రెండవ మలుపులో పోస్ట్ ఆఫీస్ ఉంది” అంటూ నా చూపుడు వేలు ఆ వైపు చూపిస్తూ చెప్పాను. అతను ఇంకా సమాధానం చెప్పక ముందే తుర్రుమని ఇంటి లోకి వెళ్ళి పోయాను.

అమ్మ మామూలుగానే నా కోసం కిటికీ దగ్గర నుంచోని నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతే, ఇంకా నేను ఇంటి లోకి సరిగా రానే లేదు అప్పుడే అడిగింది, “ఎవరు అతను యేమి మాట్లాడావు?” అని.

నేను నవ్వుతూ చెప్పాను, “ఎవరో, అడ్రెస్ అడుగుతూ ఉంటే చెప్పాను., వారు ఈ ఊరికి కొత్తగా వచ్చారంట, ఎదురుగా ఉన్న ఇంటికి వచ్చినట్టు ఉన్నారు. అంతే” అని చెప్పి,  “ఇపుడు ఆ సంగతి ఎందుకు, నాకు చచ్చే ఆకలి అవుతూ ఉంది, అన్నం పెట్టు అమ్మా” అన్నాను.

ఆ క్షణంలో అమ్మ మొఖంలో ఒక ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపించింది. అమ్మ అన్నం వడ్డించింది. కానీ ఆమె ఇంకా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంది అని నేను గుర్తించలేక పోయాను. నేను మాత్రం అమ్మ చేసిన గుత్తి వంకాయ కూరను హాయిగా లొట్టలేసుకుంటూ తింటూ ఉన్నాను.

***

రెండు మూడు రోజుల తరువాత ఒకరోజు అంజు మా ఇంటికొచ్చింది. ఇద్దరం కలిసి బజారు వెళ్ళేందుకు సిద్ధం అయ్యాము. ఇంతలో ఎదురుగా అదే యువకుడు. అంజూను చూస్తూ అడిగాడు, “మీరు కూడా ఇదే ఇంటిలో ఉంటారా?” అని.

అంజూకు ఒక కొత్త మనిషి అలా అడిగేటప్పటికి కొంత తటపటాయిస్తూ నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నేను నవ్వుతూ అన్నాను – “లేదు, తాను నా ఫ్రెండ్. మీ ఇంటి పక్క ఇల్లు వీరిది.” అలా చెబుతూనే మేము ఇద్దరం అక్కడి నుంచి వెళ్లిపోయాము. అలాగే అప్పుడప్పుడూ అతను ఇక్కడ అక్కడ కలిసేవాడు. ఒకటి లేదా రెండు మాటలు మాత్రం మాట్లాడేదాన్ని, కానీ ఎప్పుడూ ఒకరి పేరు ఇంకొకరు తెలుసుకోవాలి అని నాకు అనిపించలేదు.

అమ్మ ఆందోళన రోజు రోజుకు పెరగసాగింది. ఇపుడు నేను ఇంటి నుంచి బయటకు వస్తే చాలు అమ్మ కిటికీ దగ్గరే ఉంటుంది. నేను మాత్రం అతని గురించి కానీ, అమ్మ మనసులోని భయాన్ని గురించి కానీ ఆలోచన చేసేదాన్ని కాదు. చేయాలని నాకు అనిపించలేదు కూడా.

ఒకరోజు అమ్మ అకస్మాత్తుగా అడిగిన ప్రశ్న విని నా తల తిరిగినట్టు అయింది. అమ్మ కళ్ళు సూటిగా నన్నే చూస్తూ ఉన్నాయి . అమ్మ అంది- “ఆ అబ్బాయి రోజు నీ వెంబడే రావటం నేను రోజూ గమనిస్తూ ఉన్నాను, ఇంతకూ మీరిద్దరూ ఎక్కడ కలుస్తున్నారు?”

నాకు కొంత సేపు ఏమి చెప్పాలో తెలియలేదు. నింపాదిగా బదులిచ్చాను “అపుడప్పుడూ రోడ్డు మీద తారసపడితే తప్ప నేను అతడిని కలిసింది లేదు, మాట్లాడింది లేదు, అమ్మా, అతడిని నేను ఎందుకు కలుస్తాను?” అని.

నేను అమ్మ మనసులోని ఆందోళనను గమనిస్తూ చెప్పాను, “ఎందుకు నువ్వు అంత ఆందోళన చెందుతావు? నువ్వు నిశ్చింతగా ఉండు అమ్మా” అని.

కానీ అమ్మ నా మాటలను పూర్తిగా నమ్మినట్టు నాకు అనిపించలేదు. అంటే అమ్మకు నా మీద నమ్మకం లేదు అని కాదు, నా అందం మీద ఆమెకు ఉండే భయం వల్ల కావచ్చు లేదా నా ముగ్ధత్వం వల్ల కావచ్చు, నేను ఎక్కడ అతని మాటలకు లొంగిపోతానేమో అని అమ్మ భయపడేది. నేను జీవితంలో మోసపోతానేమో అన్న భయం అమ్మలో ఎక్కువగా ఉండేది.

యవ్వనంలో ఉన్న ఆవేశం, ఆలోచన వయసు వస్తూ వస్తూ కానీ తగ్గవు అని నాకు తెలిసేటప్పటికి చాలా సమయం పట్టింది. ఆ సమయం ఒక జీవితకాలం అంత అని తెలిసి నేడు నా అవివేకానికిని నేనే నవ్వుకోవాలి అనిపిస్తుంది.

అనుమానం పెద్ద రోగం అన్నట్టు, అమ్మకు ఆనాడు అనుమానం అనే రోగం పట్టింది అని నవ్వుకునే దాన్ని. అమ్మ అనుమానం అనే రోగానికి మందు ఏ డాక్టర్ దగర కూడా లేదు. మరి నేను అమ్మను ఎలా నయం చేయగలనులే అని నాకు నేను సర్ది చెప్పుకునే దాన్ని .

***

నేను అమాయకురాలిని అవునో, కాదో కానీ నాలో నాకే తెలియని ముగ్ధత్వం నాలో ఉండేది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు దాని గురించి ఆలోచిస్తే అనిపిస్తుంది ఆ ముగ్ధత్వం వల్లనే కాబోలు ఆ నాటి ఆ సంఘటన జరిగింది అని. అలా జరిగి ఉండక పోతే నా జీవితం ఇంకోలా ఉండేది ఏమో.

ఆ రోజులను గుర్తు చేసుకుంటే నవ్వు రావటం లేదు పైపెచ్చు కోపం వస్తూ ఉంది. ఆ కోపం కూడా ఇంకెవరి పైన మాత్రం కాదు నా మీదే నాకు కోపం. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ ఇపుడు జీవితం అంతా చేయి జారిపోయిన తరువాత నన్ను కూడా నేను క్షమించుకున్నాను..

చలికాలం మొదలైంది. వెచ్చని ఉన్ని బట్టలు లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. నాకు అయితే మరీనూ, సైనస్ వల్ల చలి కాలం మరింత బాధాకరంగా అనిపించేది. మా అమ్మ నాన్నలు నాకు అన్నిరకాలుగా ఇబ్బంది కలుగకుండా చూసుకునేవారు. డాక్టర్ మూడు పూట్లా వేసుకునే మందులు ఇచ్చి పంపారు. నాన్నగారు ఉదయాన్నే ఆఫీస్ పోయే ముందు “మందు వేసుకో, మరచి పోవద్దు” అని మరలా మరలా చెప్పి పోయారు.

కానీ పిల్లతనం, సోమరితనం వల్లనో ఏమో నేను మందు వేసుకోలేదు. అమ్మ కూడా ఇంటి పనులలో ఉండి అది గమనించలేదు. నాకు సాయంత్రం గుర్తు వచ్చింది . నాన్నగారు వచ్చిన వెంటనే మొదట అడిగే ప్రశ్న మందు వేసుకున్నావా? అని అనుకోని పొద్దున, మధ్యాహ్నం వేసుకోవలసిన మందులను కూడా ఒకసారి సాయంత్రం మందులతో పాటు వేసుకున్నాను.

నాన్నగారి కొరకు వాకిలి దగ్గర నుంచోని వేచి ఉన్నా. ఆన్ని మందులు ఒక్కసారిగా వేసుకున్నందుకు నాకు వాటి ప్రభావం గురించి ఆలోచన ఏ మాత్రం లేదు. మందుల ప్రభావం వల్ల నాలో ఒక రకమైన మత్తు ఆవరించింది.. మత్తులో ఏదేదో మాట్లాడటం మొదలు పెట్టాను. నాన్న వచ్చేటప్పటికి నాకు ఒంటి మీద పూర్తిగా స్పృహ లేదు.

నాన్న వచ్చినట్టు మాత్రం గుర్తు ఉంది. ఆ తరువాత నాకు యేమి అయింది అన్నది గుర్తు లేదు.

కళ్ళు తెరిచి చూసే సరికి హాస్పిటల్‍లో స్పెషల్ వార్డ్ బెడ్ మీద ఉన్నాను. నా తల  దగ్గర నాన్న నిలబడి ఉన్నారు. అమ్మ కళ్ళు వర్షించిన మేఘాల్లా  అనిపించాయి.  ‘నాకు ఏమి అయింది?’ అని అడగాలని అనుకుంటూ ఉన్నాను, కానీ గొంతు పెగలడం లేదు, నా  మాట నాలోనే మిగిలి పోతూ ఉంది.

హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఎన్ని రోజులు అయిందో కూడా తెలియలేదు. ఎదురింటి యువకుడు అపుడప్పుడూ “ఇప్పుడు యెలా ఉంది” అని హాస్పిటల్‌లో కనిపించేవాడు. నన్ను ఒకటి రెండు సార్లు పలకరించాడు! నాకు చెప్పలేనంత ఆశ్చర్యం అయింది. ఒకప్పుడు అమ్మ అతన్ని దూరం నుంచి చూస్తేనే భరించ లేకుండా ఉండేది, ఇపుడు అతనితో నవ్వుతూ మాట్లాడటం నాకు వింతగా తోచింది. ఇంతలో అమ్మ మనసు ఇలా మారటానికి కారణం నాకు అంతు చిక్కలేదు సుమా….

ఒక రోజు నాన్నగారు చెప్పారు, నేను ఆ రోజు వాకిటి దగ్గరే మూర్ఛ పోయిన సంగతి,   నాన్న ఆందోళనతో అమ్మను పిలుస్తూ ఉన్న సమయంలో ఆ యువకుడు ఆక్కడికి రావటం, అతని సహాయంతో నన్ను హాస్పిటల్‌లో చేర్చిన సంగతి…. ఆ రోజు నుంచి అతను ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు అని నాన్న ద్వారా తెలిసింది.

అమ్మకు ఆ అబ్బాయి నచ్చాడు. అతను బ్రాహ్మణుడు అని తెలిసి కూడా అతనిని అప్పుడప్పుడూ భోజనానికి పిలిచేది. ఆ రోజు మొదటి సారిగా నాకు అతని పేరు నీరజ్ అని తెలిసింది. నాకు ఆ రోజు యేమి అయింది? అని అమ్మను చాలా సార్లు అడిగాను, కానీ నాకు సమాధానం దొరకలేదు. ఆ సంఘటన ద్వారా ఒకటి మాత్రం జరిగిందిదని తెలుస్తూ ఉంది. ఆ యువకుడు నాతో పెళ్ళి సంబంధం గురించి ప్రస్తావించినట్టు తెలిసింది.అపుడు అమ్మ మా జాతి వారి జాతి వేరు, మీ ఇంటిలో పెద్దవాళ్ళతో అడిగి చూడమని చెప్పిందట.

అపుడు నాకు సరిగా బోధపడలేదు, అమ్మ అలా యెందుకు చెప్పింది అని. అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని అని కాబోలు. నాకు మాత్రం బాగా చదివి యేదో సాధించాలని కోరిక బలంగా ఉండేది. నాన్న కోరిక కూడా  అదే, నేను బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలి అని. నేను కూడా చదువులో బాగా చురుకుగా ఉండేదాన్ని. నా స్వరం బాగా ఉండేది కూడా. అందువల్ల సంగీత సాధన కూడా చేయటం మొదలు పెట్టాను. కాలేజీలో అప్పుడప్పుడూ   నాటకాలలో పాల్గొనేదాన్ని.

నా సంగీత సాధన నా చిన్నతనం నుంచీ మొదలు అయిందనే చెప్పాలి. నా చిన్ననాటి సంగీత గురువు కాలేజీకి కూడా అప్పుడప్పుడూ వచ్చేవారు. నాకు   నా చిన్నతనంలో సంగీత సాధన చేసిన రోజులు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు గుర్తు ఉన్నాయి. ముద్దు ముద్దు మాటలతో నేను పాట పాడేదాన్ని. సరిగా పదాలు పలుకక పోయినా కూడా పాడాలి అనే నా తపన చూసి మాస్టర్ గారు నాకు నేర్పించేవారు. వారు నా పట్ల ప్రేమ, ఆపేక్ష చూపేవారు. వారు నన్ను అంతగా ఇష్టపడేదానికి కారణం కూడా నాకు అప్పుడు తెలిసేది కాదు. కాలేజీలో మొదటి రోజు నన్ను చూసి నవ్వుతూ అడిగారు, “ఇప్పటికీ నత్తి నత్తిగా మాట్లాడుతున్నావా?” అని.

నాలో  కుర్రతనం ఇంకా మిగిలి ఉంది కాబోలు, నేను చిలిపిగా బదులిచ్చాను- “నేను ఇపుడు పెద్దాదాన్ని అయ్యాను మరి”.

వారు నవ్వుతూ నన్ను ఆశీర్వదించి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.  ఇపుడు సంగీత సాధన మరలా మొదలు అయింది. మాస్టారు గారు నన్ను చాలా ప్రేమించేవారు. నేను మా నాన్న పేరు నిలబెడతానని వారు ఎప్పుడూ నాతో చెప్పేవారు.

ఇలా నా జీవితం కాలేజీ చదువు, సంగీతం, నాటకం అంటూ నడుస్తూ ఉన్న సమయం లోనే అమ్మ నా పెళ్లి ప్రసక్తి ఎందుకు తెచ్చింది అనేది నేటికీ నాకు అంతు చిక్కని ప్రశ్న. కానీ ఇపుడు కొద్ది కొద్దిగా అర్థం అవుతో ఉంది, కానీ ఇది ఎంత వరకూ నిజమో ఏమో?

నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఆ రోజు మందుల ప్రభావంతో తల తిరిగి పడిన విషయం అమ్మ వేరే విధంగా అర్థం చేసుకుంది అని…..

***

మా అమ్మ చాలా మంచిది. అంతెందుకు అమ్మలందరూ మంచివారే కదా. కానీ మా అమ్మలో నన్ను అనుమానించే గుణం మాత్రం నాకు నచ్చేది కాదు. నేను పదవ తరగతి చదివే రోజులు గుర్తు వస్తూ ఉన్నాయి. వేసవి సెలవులు వచ్చాయి. మా మేనత్త కూతురి పెళ్లి అని తెలిసి ఎగిరి గంతు వేశాను. పెళ్లి నెపంతో ఊరికి పోయి అక్కడ హాయిగా కొన్ని రోజులు ఆడుతూ, పాడుతూ, గెంతుతూ సమయాన్ని గడపవచ్చు అని సంబరపడి పోయాను.

మా అమ్మ, నాన్నల కన్నా మా మేనత్త వయసులో పెద్దది కావటంతో ఆమెను బాగా గౌరవించేవారు. ఆమె మాటను ఎవరూ జవదాటేవారు కూడా కాదు. నాకు కూడా మేనత్త అంటే ఎంతో ఇష్టం. వేసవి సెలవులలో మేనత్త ఇంటిలో గడపటం ఆనేది పెద్ద సరదా నాకు. ఇపుడు మేనత్త కూతురి పెళ్లి కూడా ఉంది. ఆమె వరుసకు వదిన అయినా మేము అక్క అనే పిలిచే వారం. మేమందరం పెళ్లి పేరుతో వెళ్ళి హాయిగా తింటూ, పాడుతూ గడిపాము. పెళ్లి అంటేనే రంగుల కలయిక అని నా భావన. పెళ్లి సందడి లోని విందు భోజనాలు ఒక ఎత్తు అయితే, మాలాంటి కుర్రకారు చేసే హడావుడి, పాటలు, డాన్స్ ఇలా అన్నిటినీ పూర్తిగా ఎంజాయ్ చేశాము.

పెళ్లి తరువాత ముఖ్య ఘట్టం అక్కను అత్తవారి ఇంటికి పంపుతూ, మా మేనత్త, అమ్మ నాన్నలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎంతైనా ఆడపిల్లను ‘ఆడ’ పిల్ల అని ఎందుకు అంటారో మొదటిసారిగా అర్థం అయింది. ఆ రోజు రాత్రి అందరం కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నాము.

మామిడికాయల సీజన్ కావటంతో మామిడి కాయ పప్పు ఘుమఘుమలాడుతూ ఉంది. దానికి తోడు నూగుల నూనెతో, ఇంగువ కలిపిన పోపు పప్పు పరిమళాన్ని మరింతగా ఎక్కువ చేస్తూ ఉంది. వాసనకే ఆకలి ఎక్కువ కాసాగింది.

మేము అందరం చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నాము. అపుడు మా మేనత్త కొడుకు అంటే నాకు బావ అయినా కూడా అతన్ని నేను అన్నయ్య అని చిన్నప్పటి నుంచీ పిలుస్తూ వచ్చాను. అతను, అతని మిత్రులు కొందరు కూడా మాతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. పప్పులో ఎవరికి పెద్ద మామిడి ముక్క వస్తుందో వారు వేరే వారికి చూపిస్తూ ఇతరులను ఏడిపిస్తూ హాయిగా తింటూ ఉన్నారు.

అపుడు నా పళ్ళెంలో నాకు ఒక మామిడి పెద్ద ముక్క దొరికింది. నేను సంతోషంతో అన్నను వాడి మిత్రులను ఏడిపిస్తూ మామిడి ముక్కను చూపసాగాను. ఇంతలో హటాత్తుగా అన్న మిత్రుడొకడు నా చేతిలోని మామిడి ముక్కను లాక్కొని తిన్నాడు. అనుకోని ఈ పరిణామానికి బొమ్మ లాగా అలా ఉండిపోయాను. నాకు కోపం వచ్చినప్పటికీ మా ఇల్లు కానందున ఊరికే బుంగ మూతి పెట్టుకొని ఉండిపోయాను. కానీ అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వసాగారు. కానీ మా అమ్మకు నేను తుమ్మినా, దగ్గినా అనుమానం పడేది అలవాటు అయింది. ఈ ఘటనను కూడా అమ్మ చాలా గంభీరంగా తీసుకుంది అనే చెప్పాలి.

అప్పటికి అమ్మ శాంతిగా ఉన్నాట్టు కనిపించినా మరుసటి రోజు పొద్దున్నే “గుడియా, త్వరగా లేచి తయారవ్వు, మనం మన ఇంటికి వెళుతున్నాము” అంది. నా అసలు పేరు కావ్య మంజరి. కానీ నేను చూసేందుకు చక్కగా బొమ్మలా ఉంటాను కాబట్టి ఇంట్లో అందరూ నన్ను ‘గుడియా’ అని పిలిచేవారు. హిందీ భాషలో గుడియా అంటే బొమ్మ అని అర్థం ఉంది కదా. అమ్మ మాటలు విని ఒక్కసారిగా నాలో నీరసం వచ్చినట్టు అయింది. “కానీ ఇంత తొందర ఎందుకు? ఇంకా నాకు సెలవులు ఉన్నాయి కదా, నేను ఇంకా రెండు-మూడు రోజులు ఉండి వస్తాను, మీరు వెళ్ళండి” అంటూ అమ్మ వైపు చూశాను.

మా మేనత్త ఇల్లు అనేక కారణాల వల్ల నాకు ఇష్టం అయ్యేది. పంట పొలాలలో హాయిగా విహరించడం, మామిడికాయ పిందెలను, చింతకాయలను కొట్టి సంపాదించటం, వాటిని అందరికీ చూపించి నేను ఎన్ని యెక్కువ సంపాదించాను చూడు అని గర్వపడటం, ఇలా ఎన్నో చిన్న చిన్న సరదాలు అక్కడ తీరేవి నాకు. ఇక రాత్రి కరెంట్ ఉన్నా, లేకున్నా భోజనాలు అయ్యాక మేడ మీద వెళ్ళి హాయిగా చుక్కల్ని లెక్కపెట్టడం, చీకటిలో ఇతరులను భూతం లాగా భయపెట్టడం, ఇంకా అంత్యాక్షరి ఆడుతూ ఉంటే, సమయం ఇట్టే గడిచి పోయేది. మరలా తెల్లవారుజామున గంగా నదికి పోయి చల్ల నీటిలో స్నానం చేయడం, మట్టి వాసన పీల్చడం ఇలాంటి అనుభవాలు ఎన్నో మేనత్త ఇంటికి వెళ్ళినప్పుడు నేను పొందేదాన్ని.

ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మేనత్త మా కోసం వేడి వేడి పరాఠాలు, అల్లం పచ్చడి చేసి తినిపించేది. అప్పుడప్పుడూ వేడివేడి మిరపకాయ బజ్జీలు, పకోడీలు చేసి ఇచ్చేదీ. మా మేనత్తకు వండటం మాత్రమే కాదు , మాకు కొసరి కొసరి తినిపించడం కూడా ఆమెకు బాగా చాలా ఇష్టం. మా గొంతెమ్మ కోరికలన్నీ ఆమె తీర్చేది. అందుకే నాకు ఆమె అంటే ప్రత్యేక మైన గౌరవం, ప్రేమ.

అందుకే నేను అమ్మతో మొండి చేయసాగాను. “మీరు కావాలి అంటే వెళ్ళండి, నేను తరువాత ఊరికి వస్తాను” అని. ఇంతలో మా మేనత్త వచ్చి అంది – “గుడియా చెప్పేది సబబు గానే ఉంది, అది తరువాత వస్తుంది లే, మీరు కావాలి అంటే వెళ్ళండి.”

మా మేనత్త మాటకు తిరుగులేదు. మా అమ్మ మారు మాట మాట్లాడకుండా నాన్నగారితో కలిసి ఊరికి పోయింది. కానీ ఆ సంతోషం ఒక రాత్రికి మాత్రం పరిమితం అయింది. మరుసటి రోజు ఉదయాన్నే నాన్న వచ్చారు, అమ్మకు, అన్నయ్యకు కూడా ఆరోగ్యం బాగా లేదని, నన్ను వెంట బెట్టుకొని తీసుకుని వెళ్లాలి అని అన్నారు. మా మేనత్తకు ఇష్టం లేకపోయినా ఈసారి ఏమి అనలేదు. నా తల దువ్వి చక్కగా తలలో మల్లెదిండు తురిమి, నా నుదుటిన ముద్దు పెట్టి సాగనంపింది.

తప్పక నేను నాన్నతో కలిసి ఇంటి దోవ పట్టాను. అన్నయ్యకు ఆరోగ్యం కొంచెం బాగుండలేదు, కానీ అది పెద్ద కొత్త విషయం కూడా కాదు. అపుడు నాకు అర్థం అయింది అమ్మ అనుమానం వల్లనే    పిలిపించింది అని.

ఇది ఇలా ఉండగా ఒక రోజు అకస్మాత్తుగా మా మేనత్త కొడుకు, వాడి మిత్రుడు ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. అదే ఆ రోజు నా చేతిలోనుంచి మామిడి ముక్క లాకొన్న అబ్బాయిని చూసి మా అమ్మ అగ్గి మీద గుగ్గిలం అయింది. మా మేనత్త కొడుకు వారి రాకకు కారణం చెప్పాడు. అతని ఫ్రెండ్‌కు ఒక మంచి జ్యోతిష్యుడు కావాలి అని, మా అమ్మకు తెలిసిన జ్యోతిష్యుడి గురించి అడగటానికి వారు వచ్చారు అని.

మా అమ్మకు ఆ అబ్బాయి రావటం  ఏ మాత్రం ఇష్టం లేకున్నా, కేవలం మా మేనత్త మీద గౌరవం వల్ల ఆ అబ్బాయిని జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకొని పోయింది. అది మొదలు ఆ అబ్బాయి ఏదో ఒక నెపంతో మా ఇంటికి రావటం మొదలు పెట్టాడు. అమ్మకు ఉన్న అనుమాన స్వభావం ఒక వైపు, ఆమె అనుభవం ఒక వైపు, ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు.

కానీ కేవలం మేనత్త మీద ఉండే గౌరవం వల్ల ఆమె ఏమి చెప్పలేక పోయింది. ఆ అబ్బాయి వస్తూనే  అమ్మ నన్ను ఏదో కారణం చేత మేడ మీదికి పంపి, ఆ అబ్బాయిని కూడా త్వరగా పంపించేది. కానీ ఆ అబ్బాయి రాకపోకలు ఎక్కువ కావడంతో ఒకనాడు ధైర్యం చేసి నాన్న మేనత్త ఇంటికి వెళ్ళి చెప్పారు. ఇంటిలో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి ఉంది, ఇంటికి పదే పదే అబ్బాయిలు రావటం బాగుండదు అని.

ఆ అబ్బాయి తన కొడుకు స్నేహితుడు కావడం వల్ల మేనత్తకు నాన్న మాటల వల్ల కోపం వచ్చింది. ఆమె కోపంతో అంది – “మీ ఇంటిలోనే ఆడపిల్ల ఉందా? మా ఇంటిలో కూడా ఆడపిల్ల ఉంది కదా, ఆ ఆబ్బాయి మన కులం, మన జాతి వాడు, పైగా మంచి కుటుంబం నుంచి వచ్చాడు” అని.

నాన్నకు ఏమి చెప్పాలో పాలు పోలేదు ఆ క్షణంలో. నాన్న ఈ విషయాన్ని అమ్మకు చెబుతుండగా నేను విన్నాను. మొదటిసారిగా మేనత్త మీద కోపం వచ్చింది నాకు. ఒకే జాతి అయితే మాత్రం ఏదైనా కరెక్ట్ అనే మేనత్త ధోరణి నాకు వింతగా అనిపించింది. అన్నీ కులాలలో, జాతులలో మంచివారు, చెడ్డవారు ఉంటారనే చిన్న విషయం మేనత్తకు ఎందుకు అర్థం కాలేదు అని నాకు ఇపుడు అనిపిస్తుంది.

***

నా స్కూలింగ్ అయి కాలేజీ లోకి కూడా వచ్చాను. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు పూర్తి అయి డిగ్రీ లోకి అడుగు పెట్టాను. కానీ నా తుంటరితనం మాత్రం ఏ  మాత్రం తగ్గలేదు. చదువులో చురుకుగానే ఉండేదాన్ని. కాలేజీలో లెక్చరర్లందరికీ నేను ప్రియమైనదాన్ని అయ్యాను కూడా.

 మా ఎదురింటి అబ్బాయి పేరు నీరజ్  అప్పుడప్పుడూ నన్ను కలిసేవాడు. అతనితో పరిచయం కాకుంటే బాగుండు. ఒకరోజు అకస్మాత్తుగా తను నా జీవితంలో నా పాలిటి శాపంలా మారతాడని నేను ఎన్నడూ ఊహించలేదు.

నేను కాలేజీ వేళ్ళేందుకు  ఇంటి బయటికి వచ్చాను. ఇంతలో మా మేనత్త కొడుకు ఫ్రెండ్ చాలా రోజుల తరువాత పిడుగులాగా వచ్చి నా ముందు నిలబడ్డాడు. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశాను. అతను నవ్వుతూ అన్నాడు -“నేను ఏదో పని మీద ఇప్పుడే ఇలా వచ్చాను, కాకతాళీయంగా మీరు అగుపించారు సుమా”.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here