[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యం పలు కారణాల వల్ల ఒక చట్రంలో బిగుసుకుపోయింది. విభిన్నమైన కథలను కథలుగా గుర్తించేందుకు తెలుగు సాహిత్య పెద్దలు విముఖత చూపించటంతో తెలుగు కథ ఎంతెంత సేపూ అంతంత లోనే తిరుగాడుతూండిపోయింది. ఈలోగా సాహిత్య మాఫియా ముఠాల యుగం రావటంతో సాహిత్య స్వరూపం సంపూర్ణంగా రూపాంతరం చెందింది. సాహిత్యం గురించి ఓనమాలు తెలియని విమర్శకమూర్తులు కొన్ని ముఠాల పెద్దల ప్రాపుతో సాహిత్యానికి దిశానిర్దేశం చేసే స్థితికి ఎదగటం వల్ల సాహిత్యం మరింత కుంచించుకుపోయింది.
విదేశీ సైన్స్ ఫిక్షన్ కథలు, డిటెక్టివ్ కథల వంటి విభిన్నమైన కథలు చదివి వాటిని పొగిడేవారే, తెలుగులో అలాంటి కథలను ఈసడించుకుని, కథలుగా పరిగణించకపోవటం వల్ల మెప్పు కోరే రచయితలంతా ‘మెప్పు’ లభించే రచనల వైపు మళ్ళటంతో సైన్స్ ఫిక్షన్, క్రైమ్ వంటి విభిన్నమయిన సాహిత్య ప్రక్రియలు తెలుగులో ఈసడింపుకూ, నిరాదరణకూ గురయ్యాయి. అలాంటి రచయితలు వివక్షతను, తూష్ణీంభావాన్ని అనుభవిస్తూ తెలుగు సాహిత్యపు అంచులలో ఏదో ఒక మూల నక్కి విస్మృతికి గురవుతున్నారు. అయినా కొందరు రచయితలు ఎవరి మెప్పును, ప్రశంసలను, అవార్డులను, గుర్తింపులను అడగకుండా విభిన్నమైన ప్రక్రియలో రచనలు సృష్టిస్తూ పోయారు. అలా అత్యద్భుతమైన రీతిలో పాశ్చాత్య సైన్స్ ఫిక్షన్ రచనలను తలదన్నేటటువంటి నాణ్యమైన సైన్స్ ఫిక్షన్ రచనలను సృజించినవారు కె. సదాశివరావు. అయన గురించి, ఆయన రచనల వైశిష్ట్యం గురించి, ఆయన సృజన ఔన్నత్యం గురించి తెలుగు సాహిత్య ప్రపంచంలో చర్చలు జరగకపోవటం, విశ్లేషణలు రాకపోవటం – తెలుగు సాహిత్య ప్రపంచంలో విభిన్నమైన రచనలు సృజించేవారి దుస్థితిని స్పష్టం చేస్తుంది.
అయితే కె. సదాశివరావు గారు ఎవరి అభిప్రాయాన్ని ఖాతరు చేయలేదు. ఎవరినీ లెక్క చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒకరిద్దరిని తప్ప ఇంకెవరినీ సాహిత్యకారులుగా గుర్తించలేదు, మన్నించలేదు. ఎవరేమన్నా పట్టించుకోకుండా తాను చేయాలనుకున్న రచనలను, తనకు నచ్చిన రీతిలో రచిస్తూ పోయారు. తాను చెప్పాలనుకున్నది తన రచనల ద్వారా చెప్తూ పోయారు. ఇందుకు తిరుగులేని నిదర్శనం ‘సైన్స్ ఫిక్షన్ రచయితలు’ అన్న నాలుగు పుస్తకాలు. ఈ నాలుగు పుస్తకాలలో, మొదటి పుస్తకంలో 21 సైన్స్ ఫిక్షన్ రచయితలు, రెండవ పుస్తకంలో 20 సైన్స్ ఫిక్షన్ రచయితలు, మూడవ పుస్తకంలో 19 సైన్స్ ఫిక్షన్ రచయితలు, నాల్గవ పుస్తకంలో 21 సైన్స్ ఫిక్షన్ రచయితలు – అంటే నాలుగు భాగాలలో మొత్తంగా 81 సైన్స్ ఫిక్షన్ రచయితలగురించి, అత్యంత సమగ్రంగా, సవివరంగా, వారి ప్రధాన రచనల లోతయిన విశ్లేషణలతో అందించారు సదాశివరావు. ఇది తెలుగు పాఠకులకు ఒక అపురూపమైన కానుక. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి పుస్తకం తెలుగులో ఇదే ప్రథమం. తెలుగు కవుల గురించి, రచయిల గురించి పుస్తకాలు వచ్చాయి. తత్వవేత్తల గురించి, ఆధ్యాత్మిక గురువుల గురించి, క్లాసిక్ రచనల రచయితల గురించీ పుస్తకాలు వచ్చాయి. కానీ ఇలా సైన్స్ ఫిక్షన్ రచయితలను, వారి రచనలను, వారి శైలీ విన్యాసాలనూ సమగ్రంగా పరిచయం చేస్తూ, విశ్లేషించిన పుస్తకం ఇదొక్కటే!
ఆంగ్లంలో సైన్స్ ఫిక్షన్ ఆకర్షణీయమైన రచనా ప్రక్రియ. సైన్స్ ఫిక్షన్ అభిమానులు కోకొల్లలు. ప్రతి సంవత్సరం ఉత్తమ సైన్స్ ఫిక్షన్ రచనలకు అవార్డులున్నాయి. క్లబ్బులున్నాయి. ఉత్తమ సైన్స్ ఫిక్షన్ రచనల సంకలనాలు అచ్చవుతాయి. తెలుగులో అలాంటి పరిస్థితే లేదు. పైగా తమకు పరిచయం లేని వాటిని తెలుగు పాఠకులు ఆదరించరు. అయినా సరే, తాను అనుకున్న రీతిలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన 81 మంది సైన్స్ ఫిక్షన్ రచయితలను పరిచయం చేసిన సదాశివరావు గారిని అభినందించక తప్పదు. రచయితలు నిరంకుశులు. తాము రాయాలనుకున్నది రాస్తారు. ఎవరి మెప్పు, ప్రశంస, ఆదరణల కోసం వారు ఎదురు చూడరు. అలాంటి రచయితలే సాహిత్యంలో నూతన మార్గాలను ఏర్పాటు చేస్తారు. భావి తరాల వారికి మార్గదర్శకులవుతారు. సైన్స్ ఫిక్షన్ రచయితలు నాలుగు పుస్తకాలలో సైన్స్ ఫిక్షన్ రచనల పట్ల, సైన్స్ ఫిక్షన్ సృజనలోని పలుకీలకాంశాల పట్ల, రచయితల జీవితాలు, వారి శైలి, వారి సృజన లోని పలు కోణాల పట్ల సదాశివరావు గారి లోతైన అవగాహన, అధ్యయనం ఆశ్చర్యం కలిగిస్తాయి.
మేరీ షెల్లీ, జూల్స్ వెర్న్, హెచ్.జి.వెల్స్, ఎడ్గార్ రైస్ బరో, అల్డస్ హక్స్‌లే, ఆర్థర్. సి. క్లార్క్, రే బ్రాడ్‌బరీ, ఐజాక్ అసిమోవ్, బ్రియాన్ ఆల్డిస్, జె.జి. బాలార్డ్, రాబర్ట్ సిల్వర్‌బర్గ్, జేమ్స్ ఎడ్విన్ గన్, టానిత్ లీ, హారుకీ మురకామీ, మార్గరెట్ అట్‌వుడ్, సి.ఎస్. లూయిస్ వంటి ప్రఖ్యాతి పొందిన రచయితలతో పాటు ఇంకా పలువురు పేరొందిన సైన్స్ ఫిక్షన్ రచయితల రచనల లోతైన విశ్లేషణ ఈ నాలుగు పుస్తకాలలో ఉన్నాయి. ప్రతి రచయిత జీవితం, అతడి రచనలు, కథలు, నవలల పరిచయం, కొన్ని ప్రఖ్యాతి పొందిన రచనల విశ్లేషణ, భాష వాడకం గురించి వ్యాఖ్యలు, అతని ప్రత్యేకతల గురించిన వివరణ, అతని తాత్వికత గురించిన అవగాహన వంటివి పొందుపరిచారీ పుస్తకంలో. ఈ పుస్తకం సైన్స్ ఫిక్షన్ రచయితల ఎన్‍సైక్లోపీడియా వంటిది. తెలుగు పాఠకులు ఎవరైనా సైన్స్ ఫిక్షన్ రచన గురించి తెలుసుకోవాలంటే రిఫరెన్స్ పుస్తకంలా పనికొస్తాయీ నాలుగు పుస్తకాలు. సైన్స్ ఫిక్షన్ రచనలు చేయాలనుకునేవారికి తప్పనిసరి పాఠ్యపుస్తకాలీ నాలుగు పుస్తకాలు. సైన్స్ ఫిక్షన్ రచయితల అతి గొప్ప రచనలతో పాటు, సైన్స్ ఫిక్షన్ రచనలో ఎన్ని రకాల విభిన్నమైన ప్రక్రియలున్నాయి, ఎన్ని అంశాలను ఎంతెంత విభిన్నంగా ప్రదర్శించవచ్చు, ఏయే రచయితలు ఎలాంటి ప్రయోగాలు చేశారు వంటి అనేక విషయాలను పరిచయం చేస్తూ సైన్స్ ఫిక్షన్ రచనకు ఒక గురువులా మార్గదర్శకత్వం చేస్తాయీ రచనలు.
రచయితల పరిచయాల్లో రచయితల వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తూ, వారికి సంబంధించిన అనేక విషయాలను పొందుపరచారు రచయిత. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, కొన్ని ఆనందం కలిగిస్తాయి. నాలుగో భాగంలో రోబోల సృష్టికర్త ‘కారెల్ కాపెల్’ గురించి రాస్తూ ‘నోబెల్ బహుమతి’ని తిరస్కరించి మరీ అతడు తాను నమ్మిన రీతిలో రచనలు చేస్తూ పోయాడన్న విషయాన్ని ప్రస్తావిస్తారు రచయిత. రోజర్ జిలాజ్నీ రచనల పరిచయాలలో అతడు భారతీయ పురాణాలు ఎన్నో చదివి, ఆ పురాణాలలోని దేవీ దేవతలను తనదైన సృజనాత్మక అభినివేశంతో విభిన్నంగా ప్రదర్శించాడని తెలుసుకుని ఆశ్చర్యం కలుగుతుంది.
ఎంతో శక్తివంతమైన ఫిలిఫ్ హోసె ఫార్మర్ – సృజనాత్మక ఊహా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ – ‘ఈయన తన రచనలను సెక్సువల్, మత సంబంధమైన థీమ్స్‌తో రాసార’ని నిర్మొహమాటంగా ప్రస్తావిస్తారు. ఎ. మెర్రిట్ అనే రచయిత బ్రద్దలవుతున్న అగ్నిపర్వతం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ రచన చేయాలని అలోచిస్తూ మరణిస్తాడు. అతడి చివరి మాటలు ‘లైబ్రరీలో అత్యద్భుతమైన అగ్నిపర్వత విస్ఫోటనాల ఛాయాచిత్రాలు వెతకండి’ అని తెలుసుకుంటే రచయితలు ఎలాంటి passion తో ఎంతగా తమ సృజనలో తన్మయులై సర్వం మరిచి రచనలను సృజిస్తారో అర్థమవుతుంది.
సైన్స్ ఫిక్షన్‍పై ఆసక్తి కలవారే కాక, సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వారందరికీ అత్యంత ఆనందాన్నీ, సంతృప్తినీ కలిగిస్తాయీ నాలుగు పుస్తకాలు. అంతే కాదు, సాహిత్య ప్రేమికులు తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకుని పదే పదే చదువుతూండాల్సిన పుస్తకాలు ఈ నాలుగూ. సదాశివరావు గారి ఇతర రచనలు ఒక ఎత్తు, ఈ రచన ఒక ఎత్తు. ఈ నాలుగు పుస్తకాల గురించి తెలుగు సాహిత్య ప్రపంచంలో దీర్ఘమైన విశ్లేషణలు రావాలి, చర్చలు జరగాలి అని ఆశించటం మాత్రం దురాశే అని ప్రస్తుత సాహిత్య ప్రపంచంలోని పరిస్థితి తెలుపుతుంది.
సైన్స్ ఫిక్షన్ పట్ల తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొని ఉన్న అవగాహన రాహిత్యానికి, తూష్ణీంభావానికి దర్పణం పడుతుంది ఈ పుస్తకాలలో మొదటి భాగంలో ఉన్న ముందుమాట. తెలుగు సాహిత్య పెద్దలలో సైన్స్ ఫిక్షన్‌తో సహా, ఇతర విభిన్నమైన సాహిత్య ప్రక్రియల పట్ల ఉన్న అపోహలను ఈ ముందుమాట ప్రదర్శిస్తుంది.. ఒక చక్కటి పుస్తకానికి తగని ముందుమాటలివి. ఈ పుస్తకం ముందుమాటల్లోనే తమ అభ్యుదయ భావాలను ప్రకటించేసి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై విసుర్లు విసరటం గుడిపాటి ముందుమాట ‘తెలుగు పాఠకులకు అపురూప కానుక’లో స్పష్టంగా కనిపిస్తుంది.
‘తెలుగు ప్రచురణ, సాహిత్య రంగాల్లోనూ నేలబారు ఆలోచనలే రాజ్యమేలుతున్నాయి. ఈ కారణంగా రామాయణ, మహాభారతాలు, లలితా నామ స్తోత్రాలు, జ్యోతిష గ్రంథాలే తెలుగు వారి ఇళ్ళల్లో కొలువుదీరాయి. రచయితలు సైతం రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు, బౌద్ధ గాథలనే మరల మరల తిరగ రాస్తున్నారు. రాసిందే రాయడం, చెప్పిందే చెప్పడమనే విదూషకత్వం ఇక్కడి రచయితల భావదారిద్ర్యాన్ని సృజనలేమిని తెలియ చేస్తుంది.’
ప్రపంచవ్యాప్తంగా రామాయణ, భారత, ఉపనిషదాది భారతీయ వాఙ్మయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిని విజ్ఞాన సాగరాలుగా పరిగణిస్తూ విశ్వమంతా వాటి గొప్పతనాన్ని గానం చేస్తుంటే – ఆ వాఙ్మయంలోని లోతులను పరిశోధిస్తూ, ఇంతవరకూ బహిర్గతం కాని అత్యద్భుతమైన సత్యాలను ఆవిష్కరిస్తూ స్ఫూర్తిపొందటాన్ని ‘విదూషకత్వం’ అనటంతోనే ‘అరస, విరస, కురస, నీరస, నోరస రచయితల’ రచనలను తప్ప, మరో రచనను రచనగా పరిగణించని తెలుగు సాహిత్య పెద్దల సంకుచిత అభ్యుదయ ధోరణి తెలుస్తోంది. ఎందుకని తెలుగు కథ గుప్పెడుమంది రచయితల పొగడ్తలకే పరిమితమవుతోందో తెలుస్తుంది. ఎందుకని తెలుగు సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్‌తో సహా ఇతర విభిన్నమైన ప్రక్రియలలో కథలు రావడం లేదో కూడా అర్థమవుతుంది. భారతీయ పురాణాలలో ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం వారు ఆ కాలం నాటి సమస్యలు, సందేహాలు, ఆందోళనలకు సమాధానాలు వెతుక్కుంటూ వాటిని పునర్నిర్వచించుకుంటూ తమదైన పద్ధతిలో విశ్లేషిస్తూ రచించే వీలుంది. అందుకే ప్రతి యుగానికి ఒక రామాయాణం ఉంటుంది, భారతం ఉంటుంది. భారత గాథలుంటాయి. భారతీయ సాహిత్యంలో వాల్మీకి రామాయణం నుంచి ఈనాటి విహారి రామాయణం వరకూ ఏ రామాయణం లేకున్నా ఆ లోటు పూడ్చలేనిది. దేని వైశిష్ట్యం దానిదే. ఎన్నడో రచించినా ఈనాటి సమాజానికి అన్వయించి వ్యాఖ్యానించే వీలుండటం ఆ వాఙ్మయం గొప్పతనం. వాటి సృజనకారుల ఘనమైన సృజనకు నిదర్శనం. వాటిని పునః పునః రచించటమంటే – అనంతకాలం నుంచీ ఆద్యంతాలు లేకుండా ఒక అవిచ్ఛిన్న ధారలా ప్రవహిస్తున్న భారతీయ సాంస్కృతిక, ధార్మిక, సామాజిక ధారను కొనసాగించటమే! దాన్ని విదూషకత్వంలా భావించటమే అసలు విదూషకత్వం! విధ్వంసం! ఈ ముందుమాట వున్న పుస్తకంలోనే భారతీయ పురాణాలనుంచి స్ఫూర్తిపొంది సైన్స్ ఫిక్షన్ రచనలను సృజిస్తున్న రచయితలగురించి వుండటం గమనిస్తే, గుడిపాటి వ్యాఖ్యలెంత అనౌచిత్యమో, అర్ధరహితమో స్పష్టమవుతుంది.
అయితే మరో ముందుమాటలో డా. డి. చంద్రశేఖర రెడ్డి ‘సైన్స్ ఫిక్షన్‍కీ మన పురాణ సాహిత్యాలకీ ఎన్నో పోలికలుంటాయి’ అనటం గమనార్హం.
‘సైఫీ రచయితల కాల్పనిక లోకాల్లోకి’ అన్న ముందుమాటలో డా. డి. చంద్రశేఖర రెడ్డి ‘సైన్స్ ఫిక్షన్‍కు సంబంధించిన తొలి నవలాకర్త మేరీ షెల్లీ’ అని వ్యాఖ్యానించారు. రచయిత కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ ‘జాన్ క్రాలీ’ ప్రకారం ‘ది కెమికల్ వెడ్డింగ్’ అనే జోహాన్ వాలెంటిన్ ఆండ్రియా రచన తొలి సైన్స్ ఫిక్షన్ రచన. ఇది జర్మనీలో 1616లో ప్రచురితమయింది. ఈ రచన ఆ కాలం నాటి సైన్స్ ‘ఆల్కెమీ’ ఆధారంగా సృజించిన రచన. ఈ రచనను ఆధునీకరణ చేసి రచించాడు జాన్ క్రాలీ.
“I think it’s a ‘Thrilling Wonder Tale’, taking the most extreme possibilities of the alchemy of the day and deploying them in a story as though they are actual happenings. Science fiction works the same way – [to] take the farthest-out science possibilities and embody them in stories.”
అయితే కొందరు మేరీ షెల్లీ కన్నా ముందున్న సైన్స్ ఆధారిత సృజనాత్మక రచనలన్నింటినీ ‘Proto-science fiction’ గా పరిగణిస్తారు.
అయితే ఇవన్నీ సదాశివరావు గారి రచన గొప్పతనాన్ని తగ్గించలేవు. ఇదొక అద్భుతమైన రచన. రచయిత తన బాధ్యతను నిర్వహించారు. ఇక అభినందించి, ఆదరించటం సాహిత్య ప్రేమికుల బాధ్యత. ఈ పుస్తకాలను కొనండి. చదవండి. చదివించండి. దాచుకుని పదే పదే చదువుతూండండి.
***
సైన్స్ ఫిక్షన్ రచయితలు (నాలుగు భాగాలు)
రచన: కె. సదాశివరావు
పేజీలు: (304+320+328+338) 1290
వెల: ₹ 1200/- (₹ 300 + ₹ 300 + ₹ 300 +₹ 300)
ప్రచురణ: ఎమెస్కో బుక్స్,
ప్రతులకు:
1-2-7, బానూ కాలనీ,
గగన్‍మహల్ రోడ్, దోమలగుడా,
హైదరాబాద్ 500 029.
ఫోన్: 040-23264028
emescohyd@gmail.com