[dropcap]సం[/dropcap]చిక వెబ్ పత్రికలో అతి త్వరలో ప్రారంభం కానున్న ధారావాహిక నవల ‘సాఫల్యం’. ఇంచుమించు ఐదు పుష్కరాల కాలాన్ని ప్రతిబింబించే బృహన్నవల ఇది. జీవితానికి నిజంగా సాఫల్యం ఏమిటి? అని మథనపడేవారికి ఒక చక్కని పరిష్కరాన్ని అందించడానికి ప్రయత్నిస్తుందీ నవల.
ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్, తన బాల్యం నుండి, వృద్ధాప్యం వరకు పడిన కష్టాలు, సాధించిన విజయాలు, వెరసి ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిత్వ వికాసపు సందేశాలుగా, అంతర్లీనంగా ధ్వనిస్తూ, వాటిని మరీ abstract గా కాకుండా ఫిక్షన్‌గా రచయిత మలచిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము.
‘కొత్తపాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా’ అని అన్నట్లుగా, ఇంచుమించు అర్ధ శతాబ్దం క్రిందట మన తెలుగు సమాజంలోని విద్యా, సాంస్కృతిక కోణాలను, ప్రస్తుత కంప్యూటర్ యుగంలోని ఆధునిక పార్శ్వాలను నిష్పక్షపాతంగా అక్షరీకరించిన నవల ‘సాఫల్యం’. నవల ఆద్యంతమూ సానుకూల దృక్పథం తొణికిసలాడుతూనే, సమాజంలోని రుగ్మతలను సున్నితంగా ఎత్తి చూపుతుంది, అదీ, ఎవ్వరినీ నొప్పించకుండా.
నవల అంతటా సాహిత్య సంగీత పరిమళపు గుబాళింపులు ఘుమఘుమలాడుతుంటాయి. మానవ సంబంధాలలోని మహత్తరమైన మెత్తని హత్తులు, కులాలకు మతాలకు అతీతంగా ఈ నవలలో మన గుండెను చెమర్పజేస్తాయి. ‘విద్యానేవ విజానాతి, విద్వజ్జన పరిశ్రమం’ అని మన పెద్దలన్నట్లుగా, ఉత్తమాభిరుచి గల పాఠకులకు సంచిక అందిస్తున్న నవలాసుమం ఇది!
శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ఈ సీరియల్ 05 డిసెంబరు 2021 సంచిక నుంచి ప్రారంభం.