కరనాగభూతం కథలు -2 రత్తమ్మ అసహనం

0
4

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిబ్బటీనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! క్రమశిక్షణతో అదుపు చేస్తేనే స్వేచ్ఛకి విలువ. ఇది తెలుసుకుందుకు లోకం మీదకి కరనాగభూతాన్ని వదిలితే సరే! కానీ లోకాన్నేలాలన్న స్వార్థంతో ఆ పని చేసుంటే మాత్రం నష్టం నీకే! ఒకప్పుడు అసహనాన్ని అదుపుచెయ్యక భంగపడిన రత్తమ్మ కథ చెబుతాను. శ్రద్ధగా విని ఆత్మవిమర్శ చేసుకో” అంటూ కథ చెప్పసాగింది.

అనగనగా ఓ ఊళ్లో గోపయ్యనే భూస్వామి. ఆయనకు అనుకూలవతి ఐన భార్య రుక్మిణి. గుణవంతులైన ఇద్దరు పిల్లలు. పాడిపంటలు చూసేందుకు ఐదుగురు పాలేళ్లు. ఇల్లు తుడవడానికీ, అంట్లు తోమడానికీ, బట్టలుతకడానికీ నర్సమ్మనే పనిమనిషుంది. వయసు మీదపడ్డాక, పట్నంలో కొడుకు దగ్గరికెళ్లిపోతూ, ఇంటిపన్లకి రత్తమ్మని కుదిర్చింది నర్సమ్మ.

రత్తమ్మకిద్దరు పిల్లలు. మొగుడు కాయకష్టం చేసి సంపాదిస్తాడు. పిల్లల్లేనప్పుడు వాళ్లిద్దరికీ ఆ డబ్బు సరిపోయేది. పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యేక, మొగుడి సంపాదన చాలక, రత్తమ్మ కూడా పనికెడదామనుకుంది. నర్సమ్మ ఆమెకు రుక్మిణి ఇల్లు కుదిర్చింది.

“రత్తమ్మ మంచిది. పనిమంతురాలు. కానీ అసహనమెక్కువ. పని చేసుకుని బ్రతికేవాళ్ల అసహనాన్ని ఎవరు భరిస్తారు? అందులోనూ మొదటిసారి పన్లోకొస్తోంది. ఇంకెవరైనా ఐతే మర్నాడే పన్లోంచి తీసేస్తారు. నువ్వైతే భరించి కడుపులో పెట్టుకు చూసుకుంటావని నీకు అప్పజెబుతున్నాను” అని ఆమె గురించి ముందే అన్నీ చెప్పింది నర్సమ్మ.

రత్తమ్మ పని బాగా చేసేది. కానీ ఏంచెప్పినా ముందు విసుక్కుని, ఆ తర్వాతే పని చేసేది. నర్సమ్మ ముందే చెప్పింది కదా అని రుక్మిణి సద్దుకుపోతోంది. కానీ పిల్లలకి రత్తమ్మ తీరు నచ్చలేదు. “నువ్వే ఎప్పుడూ దేనికీ మామీద విసుక్కోలేదు. ఈ రత్తమ్మేంటమ్మా, రోజూ చేసే పనికి కూడా మళ్లీ మళ్లీ విసుక్కుంటుంది” అని ఒకరోజు వాళ్లు తల్లికి ఫిర్యాదు చేశారు.

“అది నన్నూ విసుక్కుంటుంది నాన్నలూ! పాపం, దానికేం కష్టాలున్నాయో మరి! మనమే అర్థం చేసుకోవాలి” అని రుక్మిణి పిల్లల్ని సముదాయించబోయింది.

దానికి పిల్లలు, “నిజమే కానీ, అర్థం చేసుకోవడమంటే, తను విసుక్కుంటే భరించడం కాదు. తన కష్టాలేంటో తెలుసుకుని అవి తీర్చడానికి ప్రయత్నించాలి కదా!” అన్నారు.

ఆ మాత్రం తనకి తోచనందుకు రుక్మిణి సిగ్గు పడింది. మర్నాడు అదేపనిగా గొణుక్కుంటూ ఇల్లు తుడుస్తున్న రత్తమ్మని, “ఏమిటే, అలా ఉన్నావు?” అనడిగింది.

రత్తమ్మ వెంటనే, “అలా ఉండక ఇంకెలా ఉంటానమ్మా! పండక్కి పిల్లలకి సన్నబియ్యం వండిపెట్టాలనుంది. అడిగితే నా మొగుడు డబ్బుల్లేవంటాడు. ఇద్దరు మనుషులం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, చిన్న సరదా తీరదు. ఏం బ్రతుకమ్మా నాది” అంది.

రుక్మిణికి జాలేసి, “ఆమాత్రం సన్నబియ్యం మొగుడే కొనివ్వాలా? మాకు పండేవి సన్నాలే! ఇకమీదట ప్రతి పండక్కీ, నీకు సన్నబియ్యం నేనిస్తాలే” అంది. ఆమె అలాగంటుందని ఊహించని రత్తమ్మ, “ఎంత మంచిదానివమ్మా” అంటూ కాళ్లమీద పడిపోయింది.

రుక్మిణి ఆమెని లేవనెత్తి, “ఇలా కాళ్లట్టుకోడం కాదు. చీటికీ మాటికీ విసుక్కోవడం తగ్గించుకో. కష్టముంటే నాకు చెప్పు. తీర్చగలిగితే తీరుస్తాను. లేదా నాలుగు ఓదార్పు మాటలు చెబుతాను” అంది.

ఆ పూటకి బాగానే ఉంది కానీ మర్నాడు మళ్లీ దాని విసుగు మామూలే. పోనీ అని తన కష్టమూ చెప్పుకోదు. ఓ వారం భరించేక, తనే మళ్లీ కారణమడిగింది రుక్మిణి.

“వేసుకునేవి కాకి బంగారం గాజులు. అవీ కగ్గిపోయాయి. మెరుగు పెట్టించమంటే వినడు నా మొగుడు. బయటకా గాజుల్తో వెళ్లలేను” అంది రత్తమ్మ.

రుక్మిణి దాని గాజులకి మెరుగు పెట్టించింది. ఐనా రత్తమ్మలో మార్పు లేదు. ఆ తర్వాత అమె ఓసారి పాత పట్టుచీర ఇచ్చింది. ఓసారి దాని పిల్లలకని రెండు ఆటబొమ్మలిచ్చింది. అలా ఎన్నోసార్లు ఏదో ఒకటిచ్చినా రత్తమ్మ విసుగు పోలేదు.

“అవసరముంటే నోరిప్పి అడుగు. ఇవ్వగలిగిందిస్తాను. నా పద్ధతి నచ్చకపోతే ఆ మాట నా మొహంమీదే చెప్పు. తప్పుంటే దిద్దుకుంటాను. కానీ ఈ విసుగేమిటే, భరించడం కష్టంగా ఉంది” అని ఓసారి రుక్మిణి రత్తమ్మని మందలించింది.

“దేవతలాంటి మనిషివి. నిన్నెందుకు విసుక్కుంటానమ్మా! ఒకవేళ నీకలా అనిపిస్తే నా మాట తీరే అంతేమో! నా పన్లో ఏమైనా వంకుంటే చెప్పమ్మా, దిద్దుకుంటా!” అంది రత్తమ్మ.

రుక్మిణి నవ్వి, “పన్లో వంకుంటే ఎప్పుడో తీసేసేదాన్ని. విసుగే భరించడం కష్టంగా ఉంది. ఓ ఏడాది చూసి, అప్పటికీ తగ్గకపోతే, పన్లోంచి తీసెయ్యక తప్పదు” అని హెచ్చరించింది.

ఏడాది గడిచింది. రత్తమ్మ ప్రవర్తనలో ఏ మార్పూ లేదు. ఐనా రుక్మిణి దాన్ని పన్లోంచి తప్పించలేదు. అసహనం దాని సహజస్వభావమని సరిపెట్టుకుంది.

ఇలాఉండగా, ఆ ఏడు తుఫానొచ్చి ఊళ్లో పంటలన్నీ ధ్వంసమయ్యాయి. గ్రామాధికారి ద్వారా విషయం తెలిసిన ఆ దేశపు రాజు రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలనుకుని, నష్టాన్ని అంచనా వెయ్యడానికి మాధవయ్య అనే ఆసామీని పంపాడు. ఆయన ఆ ఊరొచ్చి వరుసకు తమ్ముడయ్యే గోపయ్యింట్లో బస చేశాడు.

మాధవయ్యకి టస్సా ఎక్కువ. సేవలు చెయ్యడానికి ప్రత్యేకంగా ఓ మనిషుండాలి. ఎవర్నీ ఓ పట్టాన మెచ్చుకోడు సరికదా, చీటికీమాటికీ కసురుతాడు. ఆపైన ముక్కోపి. నచ్చని పని చేస్తే నోటికొచ్చినట్లు తిడతాడు. అదే పనివాళ్లనైతే చేతికందిందాంతో కొడతాడు కూడా.

రుక్మిణి రత్తమ్మను పిలిచి, మాధవయ్య గురించి చెప్పి, “ఆయన ఊళ్లో మనందరికీ ఉపకారం చేస్తాడు. ఉన్నన్నాళ్లూ నువ్వాయన పనులన్నీ చూసుకోవాలి. అందాకా మా ఇంట్లో పని చెయ్యడానికి ఎల్లమ్మని పెట్టుకుంటున్నాను. ఆయనతో జాగ్రత్త! మాకులా కాదు. తేడా వస్తే చెమడాలెక్కదీస్తాడు” అని హెచ్చరించింది.

మాధవయ్య సేవలకు రుక్మిణి రత్తమ్మనే పెట్టడానికి కారణముంది. తననే విసుక్కునే రత్తమ్మ, ఆయన్ని విసుక్కోవడం ఖాయం. అందుకు కఠినశిక్ష పడడమూ ఖాయం. ఇక ఆయనకి మరీ కోపమొస్తే ఆ వంకపెట్టి దాన్ని పన్లోంచి తీసెయ్యొచ్చు.

ఐతే రుక్మిణి అనుకున్నదేం జరగలేదు. అక్కడున్న వారంలోనూ, రత్తమ్మ ఒక్కసారి కూడా ఆయనపై విసుక్కోలేదు. ఆయనేమన్నా నోరెత్తకుండా ఎంతో వినయంగా సేవలు చేసింది. ఎవర్నీ దేనికీ మెచ్చుకోని మాధవయ్య రత్తమ్మని తెగ మెచ్చుకుని, “ఈ ఊరి రైతులకి నా అంచనావల్ల సంతృప్తికరమైన నష్టపరిహారం లభించిందంటే, అందుకు ఈ రత్తమ్మ సేవలతో ప్రశాంతమైన నా మనసూ ఓ కారణం” అన్నాడు.

ఆయన వెళ్లేక రుక్మిణి రత్తమ్మను తనూ మెచ్చుకుని, “మళ్లీ ఎప్పుడైనా మాధవయ్యగారు మనూరొస్తే సేవలకి నిన్నే నియమిస్తాను. ఇంటిపన్లకి మాత్రం ఎల్లమ్మే కొనసాగుతుంది. నువ్వు వేరే ఇల్లు చూసుకో” అంది.

కొండచిలువ ఈ కథ చెప్పి, “ఉత్తపుణ్యాన తనపై విసుక్కున్నప్పుడు రత్తమ్మని ఏడాదిపైన భరించి తన మంచితనాన్ని ఋజువు చేసుకుంది రుక్మిణి. కానీ ఒక ముక్కోపిని మెప్పించి, ఊరికి ఉపకారం జరిగేలా చేసినప్పుడు పన్లోంచి తీసేసింది. తనని విసుక్కుని ఆయన్ని విసుక్కోలేదని ఉక్రోషమా? ఊరికి మంచి జరిగిందనైనా ఆమెను క్షమించలేని మంచితనం ఏం మంచితనం? ఈ సందేహాలకి సరైన సమాధానం తెలిస్తే చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నేను నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడుః “రుక్మిణి మంచిదే. అసహనం రత్తమ్మ సహజస్వభావం అనుకుని, ఆమె విసుగుని భరించింది. కానీ కఠినశిక్ష తప్పదని తెలిసినప్పుడు రత్తమ్మ అసహనం చూపలేదు. అంటే అసహనం ఆమెకు సహజ స్వభావం కాదు. సాగింది కాబట్టి రుక్మిణిని విసుక్కుందంతే! అంటే రుక్మిణి మంచితనాన్ని అలుసుగా తీసుకుందామె. అలాంటిదాన్ని ప్రోత్సహించడం తగదని రుక్మిణి ఆమెని పనిలోంచి మాన్పించింది. ఆ కాలంలో, తనింట్లో పని చేసిన ఎల్లమ్మ విసుక్కోకుండా పనిచేసుంటుంది. అది నచ్చి ఆమెను కొనసాగించిందనుకోవచ్చు”

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం మూడవ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here