నాయకుడవాలంటే…

38
4

[dropcap]మ[/dropcap]నలో చాలా మందికి నాయకుడిగా ఎదగాలనే కోరిక వుంటుంది. అవునా?

కాని, ఆ కోరిక తీర్చుకోవడం ఎలా?

అందుకోసం, ఏవైనా నిర్దిష్టమైన మార్గాలున్నాయా?

ఉంటే, అవి ఏమిటి?

తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే… చదవండి…!!

ప్రాథమికంగా అలవరచుకోవలసిన సద్గుణాలు:

  • పెద్దలు చెప్పినట్లు, ఎల్లప్పుడూ సత్యమైన మాటలనే మాట్లాడాలి. సత్యదూరమైన మాటలకు తావివ్వకూడదు.
  • ధర్మము, అధర్మములకు గల వ్యత్యాసాన్ని తెలుసుకుని ధర్మమార్గాల్ని అనుసరించి నడుచుకోవాలి. తమ్ముడు తన వాడైనా ధర్మాన్ననుసరించే తీర్పు చెప్పమన్నారు పెద్దలు.
  • న్యాయాన్యాయాలకున్న తేడాను గమనిస్తూ, ఎప్పుడూ న్యాయబద్ధంగా జీవనయానం కొనసాగించాలి.
  • ఏ పని చేసినా, నీతి, నిజాయితీతో కూడిన పద్ధతినే పాటించాలి.
  • ఇతరులెవరైనా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నప్పుడు, నాయకుడవాలనుకునేవారు, తమవంతు సహాయ సహకారాలను అందించి, వారిని ఆదుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో వున్నవారికి, వాళ్ళకి తోడుగా మేమున్నామనే విశ్వాసాన్ని వారిలో పెంపొందించాలి.

సాధారణంగా అనుసరించాల్సిన పద్ధతులు:

  • నాయకుడు తనతో కలిసి నడుస్తున్న వారి పేర్లను విధిగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు తారసపడినా, వారిని పేరుతో పిలిస్తే, వారెంతో సంతోషిస్తారు. మానసికంగా దగ్గరవుతారు కూడా…. అందుకే అంటారు పెద్దలు… ‘వన్స్ ఓన్ నేమ్ ఈజ్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్’ అని. అంటే ఏ వ్యక్తికైనా తన పేరు అన్నింటికంటే చాలా తియ్యగా వుంటుంది… అని అర్ధం చేసుకోవచ్చు.
  • ఎక్కడికైనా పలానా టైంకి వస్తాను అని చెప్తే, ఆ టైంకి ఓ ఐదు నిముషాలు ముందే అక్కడకు చేరుకోవాలి. నాయకులుగా ఎదగాలనుకునేవారు సమయపాలనకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి.
  • ఏదైనా ఒక పనిని చేస్తాను… అని మాట ఇస్తే, ఎలాంటి పరిస్థితులలోనైనా, ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొని, ఆ పని చేయగలగాలి. ఒక వేళ, ఏదైనా ఒక పనిని చేయడానికి వీలుకాకపోతే… ఆ పనిని చేయలేనని, చాకచక్యంగా, సున్నితంగా, సూటిగా చెప్పాలి.
  • మాట్లాడే మాటలు మృదుమధురంగా ఉండాలి. వినసొంపుగా, స్నేహపూర్వకంగా ఉండాలి. ఒక్కసారి ఒక మాట అంటే, దానిని తిరిగి వెనక్కి తీసుకోలేము. అందుకే… మాట్లాడే ముందే ఆలోచించుకుని ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే, అనర్థాలకు, అపార్థాలకు దారి తీసే అవకాశం వుంది.
  • ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో వుండాలి. సంయమనం పాటించాలి. కోపాన్ని దరికి చేరనివ్వకూడదు. ఎందుకంటే, ‘తన కోపమే తన శత్రువు’ కనుక.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ, ధైర్యాన్ని విడనాడకూడదు. మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష. నాయకుడి ధైర్యాన్ని చూస్తే, తన అనుచరులందరికి కూడా ధైర్యం కలగాలి,

తప్పనిసరిగా గుర్తుంచుకుని, ఆచరించాల్సిన విషయాలు:

  • ‘ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎ లీడర్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ’ అని చెప్తారు పెద్దలు. నాయకుడిగా ఎదగాలనుకునే వారు, బాధ్యత తీసుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండాలి… అని అర్ధం చేసుకోవచ్చు. ఏ కార్యక్రమం జరగుతున్నా, ఎవరైతే బాధ్యత తీసుకునేందుకు ముందుకొస్తారో, అలా వచ్చి, ఆ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తారో, ఆ కార్యక్రమాన్ని విజయవంతమయేటట్లు అమలు చేయగలుగుతారో, వారు తప్పక నాయకుడిగా ఎదగగలుగుతారు.
  • ‘ఎ లీడర్ ఈజ్ వన్ హూ ఐడెంటిఫైస్ ఎ ప్రాబ్లెమ్, బిఫోర్ ఇట్ బికమ్స్ యాన్ ఎమర్జెన్సీ’ అని చెప్పారు పెద్దలు. ఒక సమస్య అత్యావశ్యకమవక ముందే, ఆ సమస్యను గుర్తించగలగాలి. అలా గుర్తించిన సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలి. వెనువెంటనే పరిష్కరించాలి. అలా చేయగలిగిన వారు తప్పక నాయకుడిగా ఎదగగలుగుతారు.

మరి… తెలుసుకున్నారు కదా!

ఇంకేం… పైన తెలియజేసిన సూచనలు స్వీకరించి ఆచరించండి!

నాయకుడిగా ఎదగండి!!

ప్రజాసేవ చేయండి!!!

ఆల్ ది బెస్ట్!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here