[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]
కవిలోకవంద్య
[dropcap]క[/dropcap]నకాభిషేకంబు గారవించినయట్టి శ్రీనాథకవిరాజు చెలిమికాడు
గండ పెండరము డాకాల సమ్మానించు పెద్దన్న యన్న నీ పెద్దయన్న
తెనుగు గన్నెకు మేల్మి తీరు దియ్యము దిద్దు తిక్కనార్యుండు నీ దేశికుండు
గజరాజుపై మెట్టి కడలంటయళమందు కృష్ణరాయండు నీ కించుఱేడు
బళిర! భవదీయభాగ్యసౌభాగ్యగరిమ
కాంచినాడవు వారలఘనత లొకట
పుత్రికారత్నములనిట్టి పొలుపుగనుట
నీక చెల్లునురా కవిలోకవంద్య !
తారామార్గము నాదరించి సురకాంతా మందహాసంబు పెం
పారం గూర్చిన స్వీయజాతి విమలఖ్యాతుల్వెలారించి వ్య
ర్ధారావంబుల గాలముం గడపు నంధ్రాళిం బ్రబోధింప వే
ధారోదారత రాష్ట్రగానమున సీతారామమూర్తీ! తగన్.
గజిబిజి యల్లు పెట్టు గిజిగాడుల జూడగబోదు, పూర్తికై
గిజగిజలాడు కాకవుల గేలికి జాలిదలంచు, స్ఫూర్తికై
గుజగుజవోవు మూకలకు గూడులపోడిమి చక్కదిద్దు నే
యజనఫలాతిరేకమున నందితొ యీ కవితాకుమారికన్
యెంకీనొ గొంకినో వలచి యీరినొ పేరినొ కోరి హేమప
ల్యంకతలంబునం దిడి బళాబళులొప్ప సవారిమోతకుం
జంకలు గొట్టుకొంట జయ శబ్దములం బలుకంగ శారదం
గింకరిసేతయు న్మదికి గిట్టని సత్కవికౌను భద్రముల్.
– పండిత, శ్రీ వడ్లమూడి వేంకటరత్నం
~
చదివింపులు
గ్రామమా విశ్వ విఖ్యాతి నార్జించిన, జగదేకవీరుల జన్మభూమి
ఆహ్వానసంఘమా యాంధ్రభారతిదీప్తి జీర్ణించుకొన్నట్టి శిష్టగణము
అధ్యక్షుడా ద్రావిడాంధ్ర గీర్వాణాంగ్ల, సాహితీకవితా విశారదుండు
కవిలోకమా కళాకమనీయ రాజ్యమ్ము, శాసించు ప్రతిభా ప్రశంసితంబు.
సీమయా తిక్కనకవి ప్రసిద్ధజనన
మానితంబై న గుంటూరు మండలంబు
ధన్యయైనది నీ కవితాకుమారి
అందుకొనుమయ్య సుకవి ! సుస్వాగతంబు.
సర్వ సర్వంసహాచక్రంబుపాలించు, ప్రాజ్ఞులౌ రాజనీతిజ్ఞు లొకట
రసవత్ప్రబంధ సామ్రాజ్యాధినాథులౌ, కవిరాజరాజేంద్రగణము లొకట
విశ్వగీతిక నాలపించి ఖండాంతర, ప్రథ గన్న గాయక పటల మొకట
మధురకావ్య వసంతమకరందరసపాన, లోలమౌ ప్రేక్షకలోక మొకట
భావ ముప్పొంగ మోదబాష్పములు రాల్చి
పూలదోసిళ్ళు పట్టి నీ పూజ సేయ
జీరుచున్నారు కనకాభిషేకమునకు
గదలి రావయ్య నీ కీర్తికాంత తోడ.
భూరిగౌరవములు పొంద నన్నయభట్టు, చాళుక్యపతియాజ్ఞ సమ్మతించె
అగ్రహారంబుల నంద దిక్కనయజ్య మనుమసిద్ధి నృపాలు చనువు పెంచె
కనకాభిషేకంబు గైకొన శ్రీనాథు డన వేమభూపాలు నాశ్రయించె
గండపెండెరమును గ్రహియింప బెద్దన్న కృష్ణరాయనరేంద్రు కీర్తిపొగడె
అంతయేకాని యిట్టు లయాచితముగ
గండపెండేర మొసగి యేకవిని మెచ్చి
శీర్షములు వంచి కనకాభిషిక్తు జేసి
యారతిచ్చిరి ? ముక్కోటి యాంధ్రజనులు.
గంభీర వారాశి గర్భగోళంబులో, బడబానలజ్వాల ప్రబలురీతి
చల్లగా వీచెడి పిల్ల తెమ్మెరలలో, ఝంఝానిలము గర్జ సల్పురీతి
ప్రకృతి సొంపులుగుల్కు పర్వతశ్రేణిలోఁ, బ్రళయలావాకీల వెలయురీతి
అమృతమ్మువర్షించు నభ్రమండలములో ఘోరనిర్ఘాతమ్ము జారురీతి
కుమతియై నిన్నుదార్కొను కుకవి గనిన
విలయనాట్యంబు సేయు నీ కలము రేగి
భళిరె! అభినవతిక్కనా ! ప్రాక్కవీంద్ర
పథము నిల్పంగ నూ రేండ్లు బ్రతుకుమయ్య !
వాగనుశాసను వర్ణింపఁబూనిన, నాచనసోమన్న నడుము విరుగు
సోమనాథుని కైత సొంపులు వినుతింప, శ్రీనాథకవి మోము జేవురించు
శ్రీనాథకవిరాజు సీసముల్ నుతియింప, నలసాని పెద్దన్న యాగ్రహించు
పెద్దన్న కవితకుఁ బెద్దఱికం బీయ, రామకృష్ణుని గుండె రగిలి మండు
కవులలో నీర్ష్య్సలీరీతి గానుపింప
గణన కెక్కిన యీనాటికవులు నిన్ను
నాత్మ బంధువుగా నెంచి యాదరింతు
రెంత సౌజన్యరాశివోయీ ! కవీంద్ర!
– శ్రీ కుఱ్ఱా వేంకటసుబ్బారావు
~
రాష్ట్రగానకవి
పాడిదప్పనికవుల నెప్పటికి నైన
ప్రజలు శిరసావహింతురు భక్తితోడ
ననెడు సత్యంబు ఋజువైన దయ్య నేడు
రాష్ట్రగానకవీ ! సీతరామమూర్తి!
– శ్రీ కొడాలి చక్రపాణి
~
శకుంతాలు
విలసత్కీర్తినిధీ ! తు
మ్మల సీతారామమూర్తి ! మంజులమలయా
నిలచక్రవర్తి ! బహు కో
మలకవితావన వసంతమాధుర్యపతీ !
ఈ నాజూకు యుగాన నింత కవిమత్తేభాలు దండెత్తి సం
స్థానాలన్ని కుదించుచున్న నవవిశ్వంబందు నీరీతిగా
నానాకావ్య విమర్శనార్ణవుని చెంతం గండ పెండేర మె
ద్దానం దాల్చినవాడు లేఁడుగద సీతారామమూర్త్యాహ్వయా!
కవిభూపా ! కవితాబ్ధిలో శ్రవణసౌఖ్య శ్రీ సుధం దీసి ది
వ్యవచోవిస్ఫురణైక భావరమణీయ స్ఫూర్తి విఖ్యాతి శ
బ్ద విధాతృండయి రామలింగడు సభాధ్యక్షుండుగా వచ్చి మె
చ్చి విభూతిన్ కనకాభి షేక మొనరించెన్ నీ కమోఘంబుగాన్.
ఆంధ్ర కావ్యకళాపురంధ్రికి భంగిమం, బెంతయో గరపిన పంతులయ్య
ఆంధ్రప్రతాప శౌర్యజ్యాల లార ని వ్వని దేవదత్తమ్ము వట్టి నయ్య
ఆంధ్రజయ స్తంభ మంభోధు లేడింటి కడపటి కొండపై గాంచినయ్య
ఆంధ్రగంధర్వగానామృతవృష్టితో మన్ను మిన్నిక దుక్కి దున్నినయ్య
యావదాంధ్ర భువన హావ భావ శత స
హస్ర కోటిహిమాలయాలన్ని యెక్కి
రాష్ట్రగాన మిచ్చట ధార్తరాష్ట్రతతికి
చక్కగా ధారబోసితి చౌదరయ్య !
కమ్మని తెల్గు బాస, గిజిగాండ్రకు మే ల్నగిషీల గూండ్లకై
తుమ్మలతోపు కొండొకటి తొల్కరి కుల్కున లేచి పై డిపూ
గొమ్మలు కొప్పులో ముడుచుకొన్నది బమ్మెరపోతరాజు సే
ద్యమ్మున దుక్కిటెద్దలసి యచ్చటి తుమ్మలబీడు జొచ్చెరా !
అభినవ తిక్కయజ్యబిరుదాంకితుడై శ్రుతిపక్వమైన వా
క్కభిరుచిగా ధ్వనించెడి మహావిభ వైకమనోజ్ఞభావ దుం
దుభి దిశకెక్కజేయుచు కృతుల్ క్రతువుల్ కవితాఘృత ప్లుతుల్
శుభముగ దేల్చినందున శుచుల్ మన చౌదరి కెక్కువయ్యెనా?
అరవలు చిళ్లకంచె లయి ఆంగ్లజు లెల్లడ మంగలమ్ములై
దొరతనముం దురాక్రమణధూర్త పరాక్రమమున్ మదించి మ
చ్ఛిరముల నెంతకాల మికఁ జేతు రటంచు మఱే మహాకవీ
శ్వరుఁ డిల చౌదరయ్యవలె శౌర్యకళారణధుర్యుడయ్యెరా !
భాండము లెన్ని కోట్లయిన వల్లక చెల్లక యీ యఖండ బ్ర
హ్మాండము పట్టకుండెడి మహాత్ముని యాత్మకథాసుధాబ్ది నీ
తం డెటులుంచెనో గద సుతారముగా తన చిన్ని బొజ్జలో
పాండితి చౌదరయ్య కిటువంటిది యే సుకృతాన దక్కెనో !
నా పలుకుల్ సమస్త భువన స్తవనీయ మనీషులార ! శా
స్త్రాపగలో మునింగి మడియైనవియో పొడియైనవో వృధా
లాప కథాకలాపధనలాభవిలేపనిరూపణంబులో
లేపి పసిండిగగ్గెర బలిష్ఠుని కాలికివేసి చూడుడీ !
– శ్రీ వేదాంతకవి
~
మహాకవివతంస!
చేయించువాడాంధ్రశేముషీ సంపద్వి, భాసి విద్వత్కవివరుడు రెడ్డి
చేసెడివాడయాచితదానకర్ణుడు, నేననుచున్ గోగినేని బుధుడు
కార్యకర్తలు పేరుగల రైతుబిడ్డల, భ్యుదయకాములు తెల్లుభూమివారు
స్వీకరించెడికవి శేఖరు లభినవ, తిక్కనాభిధులు పండితులు మీరు
చేయుచున్నది స్వర్ణాభి షేక మదిర !
తెలుగులచరిత్రపుటలను ద్రిప్పితనదు
సోయగంబాంధ్రవాణి తా జూచుకొనుట
గాక ! వేరౌనె? యిది మహాకవివతంస !
బిరుదులు పెద్దవై తమకవిత్వపు టాయువు కొద్దిదై తలల్
తరుగ సహమ్ముపెంచుకవితండము బండ్లకునెత్తెచెత్త సం
కరమతి సౌష్ఠవంబని వికారము పేర్చి కృతుల్ రవంతయున్
గరువము లేని సజ్జనుని గాంచితి నిన్నొకని మహాకవీ !
కాళిదాసులకీ తెల్గు గడ్డపైన
కొదువయున్నను లేకున్న కొంపమునిగి
పోవ, దీసు సహంభావమును విసర్జ
జేసి మిముబోంట్లు సాహితీ సేవ సలుప.
కట్టమంచి సెబాసని గౌరవించి
నట్టి కృతుల కెవ్వారు జోహారు లీరు?
తప్పదని తుదకీ శ్రీశుతల్పమైన
వేయి పడగలవాడె చేదోయి మోడ్చు.
ఏనుగు నెక్కి పెద్దన కవీశుడవై కనకాభిషేక స
న్మానము రెడ్డిపండితు సమక్షమునన్ కవిసార్వభౌము చం
దానగ్రహించి, ఆంధ్రకవితా విభవోన్నతి మాకు జ్ఞప్తికిన్
రా నిడుబ్రోలు హంపి గవిరాణ్మణి! సాహితి సత్కరింపుమా
– శ్రీ ముసునూరి భాస్కరరావు
~
మిత్రమణి
నాడు నేడు తిక్కనార్యుని దెల్గులు
మేటి సుకవి యంచు మెచ్చుకొందు
రతని వోలెఁ గవిత నమరిచి యభినవ
తిక్కనాఖ్య గొన్న దిట్ట వీవు
లలిత భావపూర్ణ కలశంబులన గృతుల్
వెలయజేయు సత్కవీంద్రు నిన్ను
గవితతోడ దెలుప గడగు టసాధ్యమం
చెద దలంతు నెవ్వ రెట్టులనిన.
హృదయ మొకటి తక్క నొదవు భాగ్యంబు నా
కేమికలదు సర్వమెఱుగు దీవు
అమలభ క్తి హృదయ కమల మర్పించితి
నందికొని ముదంబు నందుకొనుమ.
హృదయ మెఱిఁగి మధుర హృదయంబు దీపింపఁ
గావ్య కన్య నొసంగి గారవించు
నీకు మిత్రమణికి నీ సువర్ణాభిషే
కోత్సవమున నిదియె యుపద సఖుఁడ !
– శ్రీ వెలగపూడి దానయ్యచౌదరి
~
మహాకవి
శ్రీ సీతారామమూర్తి చౌదరిగారితో నాకుఁ బెక్కునాళ్ల పరిచయము. ప్రతిష్ఠితులయిన నేటికవులలో, ఆయన గొప్పస్థాన మాక్రమించుకొని రనఁగా, అది వారి కలములో గల మెలకువ వెనుక వారు వాసిన రాష్ట్రగానము, ధర్మజ్యోతి ఇత్యాదు లొక సారి పంపగా జదివి ”అభినవ తిక్కన” బిరుద మీయన యెడల నన్వర్థ మనుకొంటిని.
తరువాత దరువాత వారి యితర కృతులు సమగ్రముగా జూడ జూడ నిపుడు కనకాభిషేకాదికమైన యేయుదాత్తగౌరవము నందుటకైన వారు తగిన వారని భావించుచున్నాను. యద్యపి, ఱాలు విత్తి వరాలగుత్తులు పండించు మహాకవి యుత్తమర్ణత జగత్తు ఎట్టి సత్కారముచేసియు దీర్పరానిది. శ్రీ రెడ్డిగారి దివ్యసమక్షమున జరుగు మహామహిత సన్మానము దిగ్విజయము కాగలదు.
– శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
(సశేషం)