[box type=’note’ fontsize=’16’] డా. ఇందు ఝున్‌ఝున్‍వాలా హిందీలో రచించిన ‘కావ్య’ అనే నవలని అదే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఆర్. ఉమా శర్మ. [/box]
[dropcap]నే[/dropcap]ను అలా ముందుకు నడుస్తూ ఉంటే అతను నా తోడుగానే రావటం మొదలు పెట్టాడు. మా అమ్మనాన్నలను పొగుడుతూ, అవి ఇవి పనికి మాలిన మాటలు మాట్లాడుతూండేవాడు. . నేను మాత్రం కాలేజీ వెళ్ళే హడావిడిలో హ…హూ అంటూ ముందుకు నడుస్తూండేదాన్ని.
మా ఇంటి నుంచి కాలేజీ దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్ దూరాన ఉంది. నాకు అలా చక్కగా నడుస్తూ వెళ్ళటం బాగా ఇష్టం. పైగా ఆ రోజుల్లో రిక్షా లాంటివి చాలా తక్కువగా వాడేవారు. ఈ రోజు అంజు కూడా రాలేదు, తనకు ఇంటిలో ఏదో పని ఉందని ముందే నాకు చెప్పింది.. అందువల్ల నేను మాత్రమే వెళ్ళవలసి వచ్చింది.
కాలేజీకి వెళ్ళే నడిరోడ్డు మధ్యన ఉన్నప్పుడు నా కజిన్ నన్ను చూశాడు. అతను ఆ అబ్బాయిని ఇంతకు ముందు చూడనందువల్ల నేను ఎవరితోనో తిరుగుతూ ఉన్నాను అనే అనుమానం కలిగింది. అతను నాతో పాటుగా కాలేజీ వరకూ వచ్చాడు. ఆ రోజుల్లో ఒక అమ్మాయి – అబ్బాయి అంతగా కలసి మెలసి తిరిగేవారుకారు. రోడ్డుపై అలాంటి దృశ్యాలు కనిపించేవికావు.
నా కజిన్ నా వెంబడి వస్తూ ఉండటం చూసి నేను వేగంగా నడవటం మొదలు పెట్టాను. ఆ అబ్బాయి మాత్రం తనదైన లోకంలో ఉన్నాడు. నోటికి వచ్చింది చెబుతూ వస్తూ ఉన్నాడు. ఇంతలో కాలేజీ గేట్ రానే వచ్చింది. నేను ఇంకా కాలేజీ లోనికి వెళ్ళే ముందు నా కజిన్ నా దగ్గరికి వచ్చి అడిగాడు, “ఎవరు ఈ అబ్బాయి?” అని. నేను చెప్పాను. “మా మేనత్త కొడుకు స్నేహితుడు” . అంతే ఒక నిమిషం కూడా వృథా చేయకుండా కాలేజీ లోకి వెళ్లిపోయాను…
నా కజిన్ కూడా “సరే” అని వెళ్ళిపోయాడు. కాలేజీ లోపల నుంచి కూడా రెండు కళ్ళు నన్ను, ఆ అబ్బాయిని గమనించాయని తెలుసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. ఇంకా నేను కాలేజీ ప్రాంగణం లోకి అడుగు పెట్టీ పెట్టంగానే మాస్టర్ గారు నా వద్దకు వచ్చి నన్ను అడిగారు “ఆ అబ్బాయి ఎవరు?” అని. మాస్టారు గారు నన్ను తన స్వంత కూతురు కన్నా ఎక్కువ ప్రేమించేవారు కూడా. నేను కూడా ఏదీ దాచుకోకుండా మొత్తం అంతా చెప్పాను.
నా ముగ్ధత్వం చూసి ఆయన నా తల నిమురుతూ “ఇలా ఆడపిల్లలు రోడ్దు మీద అబ్బాయిలతో మాట్లాడుతూ వెళితే తప్పు ఉన్నా, లేకున్నా ఆడపిల్లను లోకం తప్పు పడుతుంది. అతనికి ఏదైనా మాట్లాడాలి అని ఉంటే ఇంటికి వచ్చి చెప్పమని చెప్పు. ఇక మీదట ఇలా రోడ్డు మీద నన్ను కలువవద్దు అని అతనితో చెప్పు” అని చెప్పారు.
అటు కజిన్, ఇటు మాస్టర్ ఇద్దరూ అబ్బాయిని గురించి ఇంతలా ప్రశ్నలు వేస్తూ ఉండటంతో కొంత ఇబ్బందిగానూ, కొంచెం కోపం గానూ అనిపించింది. నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి కూడా నేను జవాబు చెప్పాల్సివచ్చింది. పైగా ఆ అబ్బాయి అంటే నాకు ఏ మాత్రం ప్రత్యేక భావన లేక పోవటం వల్ల కూడా నాకు ఆ ప్రశ్నలు ఇబ్బందికరంగా అనిపించాయి.
కజిన్ ద్వారానో లేక మాస్టర్ ద్వారానో అమ్మకు తెలిస్తే అది ఒక పెద్ద విషయం అవుతుందని ఊహించి నేను ఇంటికి రాంగానే అమ్మకు విషయం చెప్పేసా. అమ్మ గురించి నాకు బాగా తెలుసు, ఆమెకు అలాగే నా పట్ల భయం, ఆందోళన ఉండేవి, అవి ఈ రోజు మరింత ఎక్కువ అయ్యాయి. ఆ రోజు అమ్మ మరింత తీవ్రంగా ఈ సమస్య నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తూ నాన్నతో అంది – “ఇప్పుడు మన గుడియా పెద్దది అయింది, దానికి పెళ్ళీడు కూడా వచ్చేసింది. ఇటువంటి సమయంలో ఇలా అబ్బాయిలతో కనబడుతూ ఉంటే మంచి సంబంధాలు రావు. చెడ్డపేరు రావటానికి ఎంతో సమయం పట్టదు కదా. మీరు ఒకసారి మీ అక్క దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని కావ్యతో కలవవద్దు అని గట్టిగా చెప్పమని చెప్పండి.”
నాన్నగారు కూడా ఈ విషయం విని కొంచెం కంగారు పడ్డారు అనే చెప్పాలి. అమ్మతో అన్నారు – “ఈ రోజు ఇద్దరు చూశారు, రేపు నలుగురు చూస్తారు, మనం ఎంతమంది నోళ్ళను అని మూయించగలము. అప్పుడు అక్కయ్యను కలిసి తీరవలసిందే. లేకుంటే మన పరువు గంగ పాలు అవ్వక తప్పదు మరి.” అని అంటూ ఉంటే నాన్న గొంతులోని జీరను నేను అర్థం చేసుకున్నాను.
నాన్నగారు తెల్లవారుజాముననే లేచి తయారు అయ్యారు. వేడి వేడి కాఫీ తాగి, తెల్లని జూబ్బా పైజామా వేసుకొని తయారు అయ్యారు. నల్ల లెదరు బ్యాగును నాన్న రోజూ ఆఫీసుకు తీసుకొని పోతారు, ఒక చిన్న పుస్తకంలో అందరి ఫోను నెంబర్స్ వారి అడ్రెస్సులు ఇలా అన్నీ అందులో ఉంటాయి. మా నాన్నగారు చాలా క్రమశిక్షణ కలిగిన మనిషి. ఆన్నిటి లోనూ పర్పెక్ట్‌గా ఉండాలి అని నాన్న అభిప్రాయం. వారు నన్ను ఒక ఆడపిల్ల లాగా కాకుండా ఒక మగ పిల్లావాడిలాగా పెంచాలి అని ఆశపడ్డారు.. నేను బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాలి అన్నది నాన్న తపన. కానీ సమాజపు కట్టుబాట్లకు అనుగుణంగా నా పేరు చెడిపోకుండా చూడాలి అనే తపన కూడా నాన్నలో అధికంగా ఉండేది.
నాన్న మా మేనత్త ఇంటికి వెళ్ళి తన మనసు లోని మాటను అక్కయ్యకు చెప్పారు. కానీ మేనత్త ఆ మాటలను సీరియస్‌గా తీసుకోలేదు, పైపెచ్చు ఆమె ఇంక పెద్ద ప్లాన్‌లో ఉంది అని తెలిసింది. నాన్న ఆ అబ్బాయి గురించి చెబుతూనే ఉన్నారు, అంతలో నాన్న మాటలకు ఆమె అడ్డు పడి అంది – “ఒక పని చేద్దాం, వారిద్దరికీ పెళ్లి చేద్దాం, వారి జాతి, కులం కూడా మనకు సరిపోతాయి. వారి వంశ మర్యాదల గురించి కూడా మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఆ ఆబ్బాయి మన గుడియాను ప్రేమిస్తున్నాడు. దానికి అంతకన్నా మంచి సంబంధం మనము కూడా తీసుకొని రాలేము. దాన్ని వాడు కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు.”
నాన్నకు నా మీద ఉన్న ప్రేమ వల్లనేమో, ఆయన నా పెళ్లి గురించి ఇంకా ఆలోచన కూడా చేసి ఉండలేదు. నన్ను పెళ్లి పేరుతో అత్తగారింటికి సాగనంపే మానసిక స్థితికి అప్పటికింకా రాలేదు ఆయన అని అనిపిస్తుంది. ఇంకా నా చదువు కూడా పూర్తి కూడా కాలేదు. నాన్న అత్తయ్యతో అన్నారు- “లేదు, దాని చదువు ఇంకా పూర్తి కూడా కాలేదు, ఇంకా అది చిన్న పిల్ల, దాని పెళ్ళికి ఇప్పుడే ఏమి అవసరం వచ్చింది?”
మేనత్తకు నాన్న మాటలు రుచించక పోయినా నాన్న దృఢమైన నిర్ణయానికి ఎదురు చెప్పలేక పోయింది. నాన్న ఇంటికి వచ్చి ఈ విషయాన్ని చెప్పినపుడు నాకు మొదటిసారిగా మేనత్త మీద బాగా కోపం వచ్చింది. మొదట్లో ఆమె మీద ఉన్న ప్రేమ మెల్లిగా కోపంగా మారసాగింది. నాన్నతో ఇలా అన్నాను- “ఆ అబ్బాయి అంత మంచివాడు అయితే మేనత్త గారే తన కూతురినిచ్చి పెళ్లి చేసుంటే బాగుండు కదా. అనవసరంగా నా ప్రాణం ఎందుకు తీస్తూ ఉంది?” నాన్న నా కోపాన్ని చూసి మూసిముసిగా నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోయారు.
మొదటిసారిగా నా కోపాన్ని చూసి అమ్మ నిర్ఘాంతపోయింది. ఆ మాట అక్కడితో ముగిసింది.
***
కొన్ని మాటలు, పనులు, సంఘటనలు మనల్ని జీవితాంతం వెంబడిస్తూనే ఉంటాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆమ్మకు కొంచెం నా మీద నమ్మకం కుదరసాగింది. మెల్లి మెల్లిగా ఆమె మనసు కొంచెం కుదుట పడుతూ ఉంది. నాకు చదువు సంధ్యల పట్ల ఉన్న శ్రద్ధ అమ్మకు అర్థం కాసాగింది. నేను కూడా కొంచెం నిశ్చింతగా చదువు పట్ల మనసు పెట్టడానికి అవకాశం దొరకసాగింది. నేను మెల్లిగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను.
కాలేజీలో పరీక్షలు దగ్గరకు రాసాగాయి. నాకు చదువుకోవడానికి సమయం చాలడం లేదు. మందు ప్రభావం వల్ల నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. కాలేజీకు వెళ్లకుండా ఇంటి పట్టున ఉంటూ చదువుకోసాగాను.
ఒక రోజు అత్తయ్య ఇంటికి వచ్చింది, అందరం కలిసి హాయిగా భోజనం చేసి, మాట్లాడుతూ ఉన్నాము. అనుకోకుండా అత్తయ్య తన కొడుకు ఫ్రెండ్ గురించి మరలా ప్రస్తావించింది.- “పిల్ల పెద్దది ఆయింది కదా, ఇంకా దాని చదువు కూడా అయిపోయే సమయం వస్తూ ఉంది. దాని పెళ్లి మాటను నిశ్చయం చేయాలి. ఆ అబ్బాయి మంచి కుటుంబం నుంచి వచ్చాడు. మీరు ఎందుకు ఆలోచించరు?”
నాన్న ఇంకా ప్రత్యుత్తరం చెప్పక ముందే నేను అన్నాను – “అత్తయ్యా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకొను, నేను ఇంకా చాలా చదవాలి అనుకుంటూన్నాను.”
అత్తయ్యకు కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె ఆన్న మాటలు నా జీవితాన్ని పూర్తిగా మారుస్తాయని ఆ క్షణంలో నేను అనుకోలేదు. ఆ మాటలు నా పైననే పిడుగుల వలె వర్షిస్తాయని నేను అనుకోలేదు.
అత్తయ్య అంది- “నువ్వు ఈ పెళ్లి వద్దు అని ఎందుకు అంటూ ఉన్నావో నాకు బాగా తెలుసు లేవే, ఆ ఎదురింటి అబ్బాయి నీరజ్ మీద నువ్వు మనసు పడ్డావు కదా! వాడు మన జాతి, కులం వాడు కూడా కాదు. వాడిని పెళ్లి చేసుకొని మా అందరి మర్యాద తీయాలి అనేది నీ ఆలోచన కదా? నేను అలా ఎన్నటికీ జరుగనివ్వను లే, నేడు-రేపు అమ్మాయిలు ఎంతకైనా బరి తెగిస్తారు కదా, మీరు, మీ వింత ఆలోచనలు, మా కాలంలో ఇలా ఉండేది కాదు. అమ్మనాన్న ఎవడిని తీసుకొని వచ్చి ఎదురుగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకో అంటే వాడిని పెళ్లి చేసుకునే వారం.”
అత్తయ్య మాటలకు అమ్మనాన్న ఏదీ బదులు ఇవ్వలేదు. కానీ నాకు మాత్రం అత్తయ్య మీద కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలో ఏమి మాట్లాడుతూ ఉందో నాకే తెలియలేదు. అత్తయ్య చెప్పిన మాటలు నాకు చిరాకు తెప్పించి నాలో ఏదో కసిని పెంచాయి. . గట్టిగా పూనకం వచ్చిన దానిలాగా ఆరుస్తూ అన్నాను- “అవును, నేను ఆ ఎదురింటి అబ్బాయి నీరజ్‌నే పెళ్లి చేసుకుంటా. ఏమి చేసుకుంటారో చేసుకోండి. మీరు నా పెళ్లి వెనుక ఎందుకు పడ్డారు. ఆ అబ్బాయి అంత మంచివాడు అయితే మీ కూతురును ఇచ్చి ఎందుకు పెళ్లి చేయలేదు?”
నా కోపం ఆ రోజు అన్నీ ఎల్లలు దాటింది. ముఖ్యంగా మా అమ్మానాన్నలకు మేనత్త పట్ల ఉన్న భయం చూసి నా ఆవేశం మరింత పెరిగింది. అత్తయ్య ఎప్పుడూ మా అమ్మానాన్నలను తన అధీనంలో పెట్టుకోవాలనే ప్రయత్నిస్తూంటుంది. దానికి అడ్డుకట్ట వేయాలి అనిపించిది. మా అమ్మానాన్న నన్ను కంట్రోల్ చేయాలని ఎంతో ప్రయత్నించారు.. నన్ను రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకోమని పదే పదే చెప్పారు. కానీ నేను ఎవరి మాట వినే స్థితిలో లేను.
ఆ రోజు నా జీవితంలో పెద్ద మలుపు తెస్తుంది అని తెలిసి ఉంటే నేను అలా మాట్లాడి ఉండేదాన్ని కాదేమో! ఆ రోజు నా జీవితాన్ని ఆకాశం నుంచి పాతాళంలో పడేసిందనే చెప్పాలి.
***
తన కోపమే తన శత్రువు అని పెద్దవారు ఊరకే చెప్పలేదు. కోపంలో నేను అన్న మాటలు నా జీవితాన్నే మారుస్తాయని ఆనాడు నాకు అర్థం కాలేదు.
కోపంలో అన్న మాటలు ఎంత అనర్థానికి దారి తీస్తాయో ఇప్పుడు తెలిసింది. కోపం మనలోని పశువును నిద్ర లేపుతుంది అని మన పెద్దలు ఊరకే చెప్పలేదు కదా. కోపంలో మన విచక్షణ పూర్తిగా నశిస్తుంది. బుద్ది, నాలుక రెండూ మన కంట్రోల్‌లో ఉండవు. ఎదుటివారి మీద మనం చూపించే కోపం మొదటగా మనల్ని నాశనం చేసి, తరువాత వారిపైన ప్రభావం చూపుతుంది. ఇది అక్షరాలా నా జీవితంలో నిజమైంది.
మన పెద్దలు ఇంట్లో చిన్నతనం నుంచి తప్పుడు మాటలు మాట్లాడద్దనేవారు. . ముఖ్యంగా నకారాత్మకమైన మాటలు మాట్లాడితే తిట్టేవారు, పైన తథాస్తు దేవతలు ఉంటారు, అలా మాట్లాడుతే అవి నిజము చేస్తారు అని. బహుశా ఆ రోజు నేను అన్న మాటలు తథాస్తు దేవతలు విన్నట్టున్నారు, వెంటనే వారు దాన్ని నా జీవితంలో జరిగేలా వెంబడే ఆశీర్వదించారు. అందుకు నా జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ.
నాకు ఆ రోజు అంతా కోపం యెందుకు వచ్చింది అనేది నాకు అర్థం కానీ విషయం. మా మేనత్త కోపంతో భోజనం సగంలోనే వదిలి వెళ్లిపోయింది. నేను ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. రెండవ రోజు అమ్మానాన్న ఇద్దరూ నన్ను బుజ్జగిస్తూ నన్ను శాంతింప చేశారు. ఇంతకు ముందు నేనెప్పుడూ అలా ప్రవర్తించి ఉండలేదు. మా నాన్నకు నా గురించి బాగా తెలుసు. అన్నయ్య కూడా నన్ను నవ్వించే ప్రయత్నం చేశాడు.
అమ్మ పైకి నవ్వుతూ నాతో మాట్లాడుతోంది కానీ నా మాటల ప్రభావం అమ్మ మీద ఇంకా పోలేదు. ఒకప్పుడు అమ్మకు నీరజ్‌తో నా పెళ్లికి ఎటువంటి సమస్య లేదు. ఎక్కడో అమ్మకు నాకు నీరజ్ అంటే ఇష్టం, ప్రేమ అని అనిపించసాగింది. నేను మాత్రం ఆ రోజు ఆన్న మాటలు గాలికి వదిలిపెట్టి నా చదువు మీద ధ్యాస పెట్టాను. నేను, అంజు హాయిగా కాలేజీకి వెళ్ళటం, నేను, నా సంగీతం, అప్పుడప్పుడూ నటన ఇలా నా లోకంలో నేను ఉండిపోయాను.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మరి. ఇన్ని రోజుల తరువాత మాకు నెమ్మది నెమ్మదిగా నీరజ్ మంచివాడు అని అనిపించసాగింది. నీరజ్‌కు కొంత రాజకీయ పరిచయాలు కూడా ఉన్నాయి అని తెలిసింది. అప్పటినుంచి నీరజ్ రాకపోకలని అమ్మ కట్టడి చేసింది.
***
కానీ, కొన్ని రోజుల అనంతరం నేను నా పాటికి హాయిగా నా రూమ్‌లో చదువుకుంటూ కూర్చొని ఉన్నాను. బయట పెద్ద సందడిగా అనిపించి రూమ్ నుంచి కిందికి దిగి వచ్చి చూశాను. వాకిలి దగర పోలీసులు నిలబడి ఉన్నారు. వారు నా గురించి అడుగుతూ ఉన్నారు. నాకు ఏమీ అంతు చిక్కలేదు. అక్కడే వాకిలి వెనుక నుంచోని వింటూ ఉన్నాను.
ఆ రోజు నా జీవితంలో అతి పెద్ద దురదృష్టకరమైన రోజు అనే చెప్పాలి. తరువాత తెలిసింది నీరజ్ మా అమ్మానాన్నలకి విరుద్దంగా పోలీసుస్టేషన్‌లో కేస్ పెట్టాడట. అలా ఎందుకు చేశాడు అనేది అర్థం కాలేదు.
నేను ఆ రోజు కోపంలో అన్న మాట ఎలాగో నీరజ్‌కు తెలిసి పోయింది. అతను నన్ను ఇష్టపడటం ప్రారంభించాడు. పరీక్షల కొరకు చదవటానికి నేను కాలేజీ వెళ్ళటం లేదు కదా, అది చూసి నీరజ్ కేవలం అతడిని తప్పించడానికి నన్ను కాలేజీకి అమ్మానాన్న వెళ్ళనివ్వడం లేదు అని అనుకున్నాడు. నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అని అతను అనుకోసాగాడు. ఇది ఎవరూ ఊహించని స్థితి. ఇలాంటి స్థితిలో నేను సాలె పురుగు తన గూటిలో తాను చిక్కుకున్నట్టు నేను కూడా నేను నిర్మించిన కోపకూపంలో చిక్కుకొని పోయాను.
నీరజ్ నేను తనను కలువలేక పోతున్నాను అని అనుకుంటూ, మా అమ్మానాన్నల మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. మా ఇంటికి మొదటిసారిగా పోలీసులు రావటం జరిగింది. అమ్మానాన్నలతో పాటుగా నన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్లారు.
నీరజ్‌కు ఉన్న రాజకీయ పరిచయాల వల్ల మా మాటలను ఎవరూ నమ్మలేదు. వారు నీరజ్ ఫిర్యాదుకే ఎక్కువ వత్తాసు పలికారు. మా మాటలు గాలిలో కలిసి పోయాయి. మా అమ్మానాన్నలు నెత్తి నోరు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు జడ్జి నన్ను పిలిచారు, ఈ సంఘటనలతో నేను దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. పదహేడు సంవత్సరాల ముగ్ధత్వం, సహజమైన అమాయకమైన నా మొహం ఏడ్చి-ఏడ్చి వాడిపోయిన తామర పువ్వు లాగా తయారైంది,
కోర్ట్‌లో జడ్జ్ నన్ను ఏమి అడిగాడు, అన్నది నాకు సరిగా గుర్తు లేదు, నేను ఏడుస్తూ ఉన్నాను. అమ్మానాన్నల దుఃఖంతో నాకు మాట్లాడేందుకు గొంతు పెగలటం లేదు. భయంతో నా నరనరాలు వణుకుతూ ఉన్నాయి..
నా భయాన్ని, వణుకు చూసి జడ్జ్ నన్ను మాత్రమే కలిసి మాట్లాడే ఏర్పాటు చేశాడు. ఎవరో నన్ను పట్టుకొని జడ్జ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళారు. ఆయన నన్ను అడిగారు- “నువ్వు నీరజ్‌ను నిజంగా ప్రేమిస్తున్నావా? నాకు చెప్పు, నేను ఎవరికీ ఏమీ చెప్పను. అతనితోనే నీ పెళ్లి కూడా జరిగేలా చేస్తాను.”
నేను అప్పటి వరకు ప్రేమ గురించి ఆలోచన కూడా చేసి ఉండలేదు. ప్రతి ఆడపిల్లకు పెళ్లి చేసుకోవాలని మాత్రమే తెలుసు, పెళ్లికి సంబంధించిన నియమాలు – నిబంధనలు ఏవీ తెలియని వయసు, మనసు నాది. ఇక నీరజ్? మా ఇంటిల్లిపాదికీ అనిపించే అభిప్రాయం నీరజ్ మంచివాడు కాదు అని. నా అభిప్రాయం కూడా అప్పటికే అదే.
మరి ఎందుకు ఈ జడ్జ్ నన్ను మాటి మాటికి అడిగిన ప్రశ్ననే మరలా మరలా అడుగుతూ ఉన్నాడు అన్నది అర్థం కాలేదు. తల గిర్రున తిరుగుతున్నట్టు అవుతూ ఉంది. ఎలాగో ఏడుస్తూ – ఏడుస్తూ లేదు అంటూ తల అడ్డంగా ఊపసాగాను.
నా ముగ్ధత్వం చూసిన్ జడ్జ్ గారు ఇలా అన్నారు- “చూడమ్మ, మీ ఇంటి వారి క్షేమం కోరేదానివి అయితే ఈ పెళ్ళికి ఒప్పుకో. నేను నీరజ్ వాళ్ళ కుటుంబాన్ని దగ్గర నుంచి చూశాను. వారు చాలా మంచివారు. ఆ అబ్బాయి చాలా మొండివాడు. అతను నిన్ను ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకోక మానడు. వీళ్ళకు చాలా పలుకుబడి కూడా ఉంది. అనవసరంగా నువ్వు నీ తమ్ముళ్ళ- చెళ్ళెళ్ళ జీవితాలను కూడా పాడు చేయవద్దు. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకొని మీ కుటుంబాన్ని కాపాడుకో. నీ మీద నీ ఇంటి భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది.”
ఇంకా వారు ఏదేదో చెబుతూనే ఉన్నారు, నేను మాత్రం ఏడుస్తూ వింటూ ఉన్నాను. ఇంతలో నన్ను బలవంతంగా ఎత్తుకొని పోయి ఏదో వెహికల్‌లో కూర్చోబెట్టారు. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు, జడ్జ్ సాహబ్, పోలీసులు, రక్షణ వ్యవస్థ, న్యాయాలయం ఏదీ నా గోడు వినిపించుకోలేదు. అమ్మానాన్నలు ఒక వైపు నేను రూమ్ లోపల జడ్జ్ దగ్గర ఏమి చెప్పానో తెలియక సతమతమవుతూ ఉన్నారు.
ఆ రోజు అమ్మానాన్నల మానసిక స్థితి నేడు నాకు పూర్తిగా అర్థం ఆవుతూ ఉంది. ఆ రోజుని తలచుకుంటే నేటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అది ఒక భయంకరమైన పీడకల అయినా బాగుండేది, కానీ అది వాస్తవం కదా…
***
నన్ను ఎక్కడికి తీసుకొని పోయారో నాకు ఆ సమయంలో తెలియలేదు. అది ఒక స్త్రీ సంరక్షణా గృహము అని తరువాత తెలిసింది. నన్ను అక్కడికి ఎందుకు పిలుచుకొని వచ్చారు? ఎవరి కోరిక మేరకు అలా చేస్తున్నారు? నేను ఎందుకు అక్కడ ఉండాలి? ఇంతకూ నేను చేసిన తప్పు ఏమిటి? ఎన్ని రోజులు నేను అక్కడ ఉండాలి? ఎందుకు నన్ను మా ఇంటికి వెళ్ళనీయటం లేదు? మా అమ్మానాన్నలు నాతో ఎందుకు మాట్లాడటానికి రావటం లేదు? ఇలా ఎన్నో ప్రశ్నలు నా మనసును వేధించ సాగాయి.
ఇంటి నుంచి కాలేజీ అయితే మహా ఐదు నిమిషాలు పట్టేది. నేను కొంచెం ఆలస్యంగా వచ్చినా, అంతకే అమ్మ నా కోసం ఇంటి కిటికీ దగ్గరే వేచి ఉండేది. నా గురించి ఆందోళన పడేది. మా నాన్న నేను లేకుండా భోజనం కూడా చేసేవారు కారు. ఇక అన్నయ్య సరే సారి నాకు రాత్రి ఒక లోటా నిండా వేడి పాలు ఇచ్చి గానీ తాను నిద్ర పోడు.
అమ్మకు ఎంత నా మీద కోపం కలిగినా కూడా సాయంకాలం టీ నేను కాలేజీ నుంచి వచ్చిన తరువాతనే తాగేది. అమ్మకు నేను ఇంట్లో ఉంటే అదొక రకమైన శాంతి. నేను కూడా అమ్మను అవి ఇవి తయారుచేయమని సతాయించేదాన్ని. చిరుతిండ్లు అడిగి చేయించుకునేదాన్ని. ఇపుడు అమ్మను ఎవరు సతాయిస్తారు ఇంట్లో? అమ్మ రకరకాలైన వంటలు ఎవరికొరకు చేస్తుంది?
ఇంతలో నా మనసు పరి పరి విధాలుగా కీడును శంకిస్తోంది.. కొంపదీసి ఈ నీరజ్ అమ్మానాన్నలను కూడా నాలాగే ఏదైనా గృహంలో బంధించేశాడా?
అప్పుడు ఏంటి గతి దేవుడా? ఏమి జరుగుతూ ఉంది? నేను కానీ మా ఇంటి వారు కానీ ఆ నీరజ్‌కు ఏమి ద్రోహం చేశాము? మా నాన్న చాలా నెమ్మదస్తుడు. నాన్నకి కూడా నేడు నీరజ్ కారణంగా తిప్పలు తప్పలేదు. నీరజ్ మంచివాడు అవునో కాదో మేము ఇంకా ఒక నిర్ణయానికి రాక ముందే అతని స్నేహాలు, రాజకీయ పరిచయాలు, పలుకుబడులు చూసి మేము అతనికి దూరంగా ఉండటం మంచిది అనుకున్నాము. అందుకు నేడు ఇంత పెద్ద శిక్ష మాకు పడింది. ఇదెక్కడి న్యాయం అని నా మనస్సు పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంది.
ఏంటి? మనం మనకు ఇస్టమైన వారితో స్నేహం చేయకూడడా? ఒకరితో నవ్వుతూ మాట్లాడితే అది ప్రేమ మాత్రమేనా? జడ్జ్ సాహెబ్ నాతో ఎందుకు అలాంటి ప్రశ్నలు అడిగారో పాలు పోవటం లేదు. అతను నాకు మిత్రుడు కాడు, పైగా మా మా అమ్మకు కూడా అతను అంటే అంతంత మాత్రమే.
ప్రశ్నలు మాత్రం ఎన్నో నా మనసును కలిచి వేస్తున్నాయి, కానీ నా ముగ్ధ మనసుకు మాత్రం జవాబులు దొరకటం లేదు. దీనికి తోడు స్త్రీ సంరక్షణా గృహము అని పేరులో మాత్రమే సంరక్షణ ఉంది కానీ అక్కడి పరిస్థితులు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇంట్లో కూడా నేను ఒంటరిగా ఎన్నడూ లేను. ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉంటే నేను ఏదో ఎడారిలో తప్పిపోయినట్టు నాకు అనిపిస్తుంది. కళ్ల వెంట కన్నీళ్ళు ఆగటం లేదు. లంకలో సీతాదేవి గురించి నేను చదివిన కథ గుర్తుకు రాసాగింది. అంతటి సీతామాతకు కష్టాలు తప్పలేదు, సీత అంత కాలం ఎలా అక్కడ ఉండగలిగిందో ? ఏమో? ఇక నేను ఏ పాటిదాన్ని, నన్ను ఇక్కడి నుంచి ఎవరు బయటకు తీసుకొని పోతారు? నాకు హనుమంతుడిలా సహాయం ఎవరు చేస్తారు? ఇలా ఏవో ఆలోచనలు నన్ను చుట్టూ ముట్టేవి.
అమ్మానాన్నలు, అన్నయ్య గుర్తుకు రాసాగారు. వారు లేని లోటు నా దుఃఖాన్ని ఇంకా పెంచసాగింది. తక్షణమే అమ్మ ఒడిలో వాలిపోవాలి అని అనిపించసాగింది. నిన్నటి వరకూ అమ్మానాన్నల ముద్దుబిడ్డగా అల్లరిగా ఉన్న చిన్నతనపు ఛాయలు పూర్తిగా మసక బారినాయి. ఒక్కసారిగా నేను పెద్దదాన్ని అయిన భావన నాకు కలిగింది. ఇలాంటి రోజొకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.
రెండు రోజుల తరువాత ఒక ఆమె వచ్చి నన్ను కలవటానికి ఎవరో వచ్చారు, విజిటర్స్ రూమ్ దగ్గరకు రమ్మని చెప్పింది. నేను వెంటనే పరుగు పరుగున వెళ్ళాను. అమ్మానాన్నలు నా కోసం వేచి ఉన్నారు. వారిని చూస్తూనే మనస్ఫూర్తిగా ఏడవాలి అనిపించిది. అమ్మతో జరిగింది అంతా చెప్పాలి, నాన్నతో కలిసి ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్న నాకు నాన్న ప్రశ్న నిరాశ కలిగించింది.
నాన్నగారు అన్నారు- “గుడియా నువ్వు బాగున్నావు కదా?”
నేను ఏడుస్తూ అన్నాను- “నాన్నా, నేను ఇక్కడ ఉండను, నన్ను కూడా ఇంటికి తీసుకొని పొండి.” నాన్నగారితో పాటు సంగీతం మాస్టారు గారు కూడా వచ్చారు. ఆయన ఏమి అనలేదు కానీ దగ్గరికి వచ్చి నా తల మీద ప్రేమగా నిమిరాడు.
నాన్న నోటి వెంట మాట పెగలడం లేదు. అమ్మ మాత్రం ఏడుస్తూ గట్టిగా నన్ను కౌగిలించుకొంది. నాన్న నా తల మీద చేతితో నిమురుతూ వెంటనే తల తిప్పుకున్నాడు. ఏ విధంగానూ తన కూతురును ఇంటికి తీసుకురాలేని పరిస్థితికి వివశుడు అయ్యారు, తన కంటి నీరు కనబడకుండా మొహాన్ని తిప్పుకున్నారు. నా ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక నాన్న వెనుదిరిగి పోయారు.
అక్కడే నిస్సతువగా చతికిలబడి పోయాను. నేను వారి కూతుర్ని, నా మీద వారికి సంపూర్ణమైన హక్కు ఉంది. వారు ఎందుకు నన్ను ఇంటికి తీసుకొని వెళ్లలేదు. ఏదో బలమైన శక్తి వారిని నిలుపుతోంది. అది ఎవరు? నీరజ్ వీటికన్నిటికీ మూలమేమో అనిపిస్తుంది. నా చిన్న మెదడులో లెక్కలేన్నన్ని ప్రశ్నలు. ప్రశ్నలు మాత్రం ప్రశ్నల లాగానే ఉండిపోయాయి.
అమ్మానాన్నలను అంతగా భయపెట్టేవారు ఎవరు? ఏమి జరుగుతూ ఉంది? ఇది ఏమి సమాజం? సమాజం లోని వారు ఇలాంటి స్థితికి స్పందించక పోవటం నాకు వింతగా అనిపించిది. ప్రపంచం పట్ల ఉన్న అందమైన ఊహలు అన్నీ మారిపోయాయి. ఎవరిని చూసినా అనుమానించేలాగా మనసు తయారు అయింది.
అమ్మానాన్నలు వెళ్ళిన వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఇంతలో రెండు బలమైన చేతులు నన్ను అడ్డుకున్నాయి. అంటే నన్ను బలవంతంగా తీసుకొని పోయి ఒక ఖాళీ రూమ్ లో పడవేశారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న నాకు చీకటి మాత్రం తోడుగా నిలిచింది.
అమ్మానాన్న, మాస్టర్‌ల మొహం లోని అసహాయకత గుర్తుకు రాసాగింది. నాలో పొంగుతున్న ఆలోచనల తరంగాలకు కేవలం ఆ రూమ్ లోని నాలుగు గోడలు మాత్రం సాక్షీభూతం అయ్యాయి.
***
నాకు స్త్రీ సంరక్షణ గృహంలో ఉండటం కష్టంగా ఉంటే, అక్కడి పరిస్థితులు మరింతగా నాలో వణుకు పుట్టిస్తున్నాయి. అక్కడ ఉన్న ఆడవారు ఒకొక్కరూ ఒక్కొక్క మాదిరిగా ఉన్నారు. వారిలో ఒక చిన్న పిల్ల, వయసులో నా కన్నా చిన్నదే అనుకుంటా, ఆ అమ్మాయి స్థితి వింటే ఎట్టివారికైనా కన్నీరు ఆగవు. ఆ అమ్మాయి తన స్వంత తండ్రి కామానికి బలి అయి, బ్రతకలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది అని తెలిసింది.
ఇంకో మధ్యవయస్కురాలు ఆమె మొహం చూస్తేనే భయం అవుతుంది. ఆమె ఆరు హత్యలు చేసి వచ్చింది అని చెప్పారు. ఇంకొక ఆమె విధవ, అయినా విధవను కూడా వదిలి పెట్టని సమాజంలో కేవలం రక్షణ కొరకు ఇక్కడికి వచ్చింది. వీరితో పాటు ఒక పెళ్లి కాని కన్నెపిల్ల కూడా ఉంది. ఆ అమ్మాయి పుడుతూనే ఆమెను ఆమె తల్లి విడిచి పెట్టింది ఆట.
ఇలా అక్కడ ఉన్న ఒక్కొక్కరిది ఒక కథ. ఎంతమంది ఉంటే అక్కడ అన్ని కథలు. ఇలాంటి ప్రపంచం గురించి నేను ఊహించి ఉండలేదు. జైలులో ఖైదీల కన్నా హీనమైన జీవితం ఇక్కడ నేను అనుభవించాను. నేనే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడది నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంది. పురుగు-పుట్ర కన్నా హీనమైన బతుకు. కేవలం ప్రాణాలు ఉన్నాయి కాబట్టి, ఊపిరి ఆడుతున్నత కాలం ఇక్కడ ఉండాలి, ఉన్నారు.
జీవచ్ఛవాలు అని చదివి ఉంటి, కానీ నేడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. ఈ ఇంటిని స్త్రీ సంరక్షణ గృహం అని పిలిచేది ఎంత వరకు సబబు అనిపించింది. ఇది స్త్రీకి సంరక్షణ ఇవ్వటం లేదు పైపెచ్చు వారిని మరింత మానసికంగా క్రుంగదీస్తోంది అని అనుకున్నా.
రాత్రి చాలా సేపటి వరకు ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున ఎపుడో నిద్ర పట్టింది. పొద్దున్నే కళ్ళు తెరచి చూసే సరికి పెద్దపెద్దగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చి చూసా. ఆక్కడ అదే ఆరు హత్యలు చేసిన ఆమె పెద్దగా అరుస్తూ ఏదో విరగగొడుతూ ఉంది. అందరూ ఆమె గొంతు విని చేష్టలుడిగి చూస్తున్నారు. ఆమెను చూస్తేనే భయంకరంగా ఉంది. రాక్షసి లాగా ఉన్న ఆమె గొంతు విని నేను వణకసాగాను.
(సశేషం)