[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న కథ ఇది. రచన మణి వడ్లమాని. [/box]
[dropcap]మౌ[/dropcap]నిక ఈ రోజు ఉదయాన్నే ఊరు నుండి తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఆమె భరించలేని ఒంటరితనాన్ని అనుభవిస్తోంది.
కారణం ఆమె తల్లితండ్రులు ఇద్దరూ కూడా కరోనాతో మరణించారు. ఒకేసారి తల్లి తండ్రి చనిపోవడం అత్యంత దురదృష్టం.
ఆమెకు సొంతవాళ్ళు ఎవరూ లేరిప్పుడు. ఉన్న ఒకే ఒక బంధం యొక్క జాడ వారం రోజులయినా తెలియలేదు. ఇలా ఆలోచనలన్నీ చిన్నారి గోపాల్ చుట్టూ తిరుగుతున్నాయి
ఆ బంధం పేరు గోపాల్, పదేళ్ల పసివాడు. తను పనిచేసే డయాగ్నొస్టిక్ సెంటర్‌కి వెళ్ళడానికి అక్కడే నించునేది. రోజు వాళ్ళ అమ్మమ్మతో కూడా వస్తుండేవాడు.
అసలు వాడిని చూసిన మొదటి రోజు నుండే అతని పట్ల కరుణ, అభిమానం కలిగాయి.. ఆ రోజున వాడు మొదటిసారి సిటీకి రావడం కొత్త, భయం భయంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ కొద్ది సేపు కనిపించకపోయేసరికి ఆ జనసమూహంలో ఉక్కిరిబిక్కిరి అయి గిజగిజలాడిపోయాడు.
అక్కడే ఉండి చూస్తున్న మౌనిక అతడిని ఒక పక్కకు తీసుకెళ్లి మంచినీళ్ళు తాగించింది. అంతలో వాళ్ళ అమ్మమ్మ గబగబా వచ్చి వాడిని దగ్గరగా తీసుకుని వెన్ను నిమురుతూ మౌనికతో “అమ్మా నా మనవడిని జాగ్రత్తగా చూసావు, అసలే వాడు తల్లి తండ్రులని వదిలి నా దగ్గర ఉన్నాడు. ఆ బెంగ వాడికి ఉంది” అంది.
ఎందుకో ఆ మొదటి రోజు వాడిన కలిసిన క్షణాల నుంచి వాడి మీద అభిమానం పెంచుకుంది.
తల్లి తండ్రులను వదిలి ఆదిలాబాదు నుండి ఇక్కడకి వచ్చాడు. తల్లి తండ్రి బిల్డింగ్ వలస కూలీలుగా బొంబాయిలో ఉండేవారు.
ఇక్కడ తన అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటూ ఆమె కూరల వ్యాపారం చూస్తూ ఉండేవాడు. చదువు అంటే మహా ఇష్టం. బస్సు కోసం చూస్తున్నప్పుడు, చెప్పేవాడు తనకి బాగా చదువుకోవాలని ఉందని, పెద్ద ఉద్యోగం చేయాలనీ తన ఆశ అని చెబుతూ ఉండేవాడు. అందుకే ఎప్పుడు వాడికి చదువే ధ్యాస.
అనుకోని అవాంతరం కరోనా రూపంలో వచ్చింది. అందరూ దాని కబంధ హస్తాలలో నలిగిపోయారు. ఎక్కడి వాళ్ళక్కడ ఉండిపోయారు. మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలో తను కూడా ఊరు వెళ్ళిపోయింది.
ఆరు నెలలు గడిచాకా ఊరు నుంచి తిరిగి వచ్చిన మౌనికకు ఇదంతా కళ్ళ ముందు తిరిగింది.
ఈ రోజు అవన్నీ గుర్తుకు వచ్చి పాపం ఎలా ఉన్నాడో. ఏమయ్యాడో? కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు దగ్గర అనుకోసాగింది మౌనిక.
కనీసం గోపాల్ అమ్మమ్మ కూడా కూడా కనిపించటం లేదు. ఒకవేళ కరోనా కాటుకి వాళ్ళు కూడా బలి అయి ఉంటారా? అనే ఆలోచనతో ఆమె గుండెలు బరువెక్కి పోయాయి.. అంతలో మౌనిక ఎక్కవలసిన బస్ వచ్చింది.
***
ఇంకొక వారం గడిచింది ఎప్పటిలాగే బస్సు స్టాప్‌కి వచ్చిన మౌనికకు, గోపాల్ పరిగెత్తుకుంటూ తన వైపుకు రావడాన్ని గమనించింది.
దగ్గరకు వచ్చిన అతన్ని ఆప్యాయంగా పలకరించింది. మౌనికను చూడగానే “అక్కా ఇన్ని రోజులు ఏమయిపోయావు? అమ్మావాళ్ళు సంగతి తెలియదు, అమ్మమ్మకు ఒంట్లో బాగులేదు” అంటూ పొగిలి పొగిలి ఏడ్చాడు.
దగ్గరకు తీసుకుని, “ఎందుకు ఏడుస్తావు? నీ అమ్మమ్మ బాగానే ఉంటుంది” అని ధైర్యం చెప్పింది.
“ఏమి జరుగుతుందో భయమేస్తోంది. అమ్మా నాన్నా చనిపోయారని అంటున్నారు అందరూ. నువ్వు కూడా లేవు, ఇప్పుడేమో అమ్మమ్మని హాస్పిటల్ చేర్చారు, నాకు భయమేస్తోంది” అని బావురుమన్నాడు.
మౌనిక తన పర్సు తీసి వాడి చేతిలో కొంత డబ్బు పెట్టింది. వాడు “వద్దు వద్దు” అంటున్నాడు.
“నన్ను నీ అక్కగా భావించి తీసుకో, ఈ డబ్బు మన అమ్మమ్మ కోసం అని అనుకో, సరేనా” అంటూ నచ్చచెప్పింది.
కన్నీళ్లతో ఎర్రబడ్డ మొహాన్ని తుడుచుకున్నాడు. అంత డబ్బు తన జీవితంలో చూడలేదు.
“నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను. జాగ్రత్తగా ఈ బస్సు ఎక్కి వెళ్ళు. ఇదిగో నా ఫోన్ నెంబర్ నీ దగ్గర పెట్టుకో” అని దగ్గరుండి బస్సు ఎక్కేలా చేసింది..
బస్సు బయలుదేరినప్పుడు, మళ్ళీ చెప్పింది “మీ అమ్మమ్మకి ఏమీ అవదు, నమ్మకం ఉంచు.”
***
వారం గడిచింది.
ఒక రోజు సాయంత్రం మౌనిక బస్ స్టాప్‌లో ఉండగా మొబైల్‌కి కాల్ వచ్చింది. అది గోపాల్ నుంచి.
“అక్కా, ఇప్పుడు అమ్మమ్మ చాలా బాగుంది. నువ్వు ఇచ్చిన డబ్బు ఆమెను దాదాపు కాపాడింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను.” అని అతను చెప్పాడు.
హాయిగా ఊపిరి పీల్చుకుని, ఫోన్ పక్కన పెట్టి చుట్టూచూసింది.
దూరంగా సూర్యుడు కిందకి దిగిపోతున్నాడు చీకట్లు ముసురుకుంటున్నాయి. తల్లి తండ్రి గుర్తుకు వచ్చారు. ఎంతో సంతోషకరమైన సమయంలో అమ్మానాన్న ఇద్దరూ పోవడం; ‘ప్చ్…’ అని తల విదిలించుకుంది. ‘నేను పిరికి దాన్ని కాను. ఎలాంటి కష్టమైన ఎదుర్కుంటాను. పదిమందికి ధైర్యాన్నిచ్చే ఆలంబన అవుతాను’ అనుకుంది.
ఆ బస్ స్టాప్‌లో ప్రతి బెంచికి బోలెడు కథలు ఉన్నాయి. ఎందరో తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఈ బస్ స్టాప్ లాగే జీవితంలో కూడా ఎంతోమంది కలుస్తుంటారు, విడిపోతుంటారు. మళ్ళీ కొత్తవాళ్ళు వస్తారు. అనుకోకుండా తనకి మరో కొత్త బంధం ముడిపడింది.
తల్లి తండ్రులు లేని దుఃఖాన్ని పోగొట్టి మరో ఇద్దరినీ కలిపాడు. ఇక నుంచి వాళ్ళకి నేను, నాకు వాళ్ళు అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చింది. గోపాల్ నుంచి వచ్చిన నెంబర్‌కి ఫోన్ చేసి తను అక్కడికి వస్తున్నానని, వివరాలు కావాలని అడిగింది..
ఇప్పుడు ఆమె అడుగులు హాస్పిటల్‌కి వెళ్ళే బస్సు వైపుకి వెళుతున్నాయి.