ఆలోచింపజేసే ‘మనసైన కథలు’

0
3

[dropcap]శ్రీ [/dropcap]జి.వి. శ్రీనివాస్ రచించిన 16 కథల సంపుటి ‘మనసైన కథలు’.

“మారుతున్న సమాజంలో నిరంతరం వస్తున్న మార్పులను మనసుతో, మానవీయ కోణాల అంతఃసూత్రంతో చిన్న చిన్న కథలుగా కూర్చి, బంధాల విలువలను, అవసరాలను కథలుగా మలిచి, అందుకు సరితూగే పాత్రలను ఎంపిక చేసిన పుస్తకం ఈ ‘మనసైన కథలు’ సంపుటి” అన్నారు వై. భవానీ శేఖర్ తమ ముందుమాటలో.

***

చివరి రోజుల్లో చాలామంది తమ సొంతూళ్ళలో ఉండాలనుకుంటారు. కానీ ఆమె మాత్రం వలస వచ్చిన ఆ పట్నంలోనే తన ప్రాణం పోవాలనుకుంది. ఎందుకో ‘అస్తిత్వం’ కథ చెబుతుంది. ఓ మనిషి చనిపోయే సమయం వచ్చింది అని తెలిస్తే – చుట్టూ ఉండే వారి ఆలోచనలకు ఈ కథ అద్దం పట్టింది. పట్నవాసపు మరో పార్శ్వాన్ని చూపిన కథ.

ఒకరినొకరు మోసం చేసుకోవలనుకున్న అక్కా తమ్ముళ్ళ కథ ‘బంధం’.

ఇతరులు అసూయ పడేలా జీవించిన వ్యక్తి కథ ‘బోనస్’. అందంగా, ఆరోగ్యంగా జీవించే పద్ధతులను పాటించిన వ్యక్తిని పరిచయం చేసే కథ ఇది. తాను ప్రశాంతంగా ఉండగలిగే వ్యక్తి, తోటివారిని ఎంతలా ప్రభావితం చేయగలడో వెల్లడించే కథ ఇది.

చిన్న ఇల్లు కట్టుకున్నా, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించలేని ఓ మధ్యతరగతి వ్యక్తి అశక్తత ఆ ఇంటివాళ్ళకి ఏ సమస్యలు తెచ్చిపెట్టిందో చెప్పే కథ ‘కాంపౌండ్ వాల్’. అసలైన ధనం అంటే ఏమిటో ఈ కథ చెబుతుంది. ఇంటికి కాంపౌండ్ వాల్ ఎలా రక్షణనిస్తుందో, కుటుంబాలలో పెద్దవాళ్ళు అలా అని చెబుతుంది ఈ కథ.

ఆమె వయసుకి, తన హుషారుకి ఏ మాత్రం సంబంధం లేని ఓ స్త్రీ కథ ‘ధన్య జీవులు’. కథని నడిపే ఈ పాత్ర కథలోని ధన్య జీవులను పరిచయం చేస్తుంది.

నగరంలోని తమ స్థలాన్ని వేరే వ్యక్తి ఆక్రమంచి, తనదంటే – అసలు హక్కుదారు మనోవేదనని తెలిపిన కథ ‘కిడ్నాప్’. మధ్యతరగతి జీవుల నిస్సహాయతనీ, స్వార్థపరుల కుట్రలనీ మరోసారి చాటిన కథ ఇది.

భార్యని హింసించి, అవహేళన చేసే భర్తకి బుద్ధెలా వచ్చిందో చెప్పిన కథ ‘క్షమయా ధరిత్రి’. ఆ కాలనీలోని ఆడవాళ్ళంతా ఒకేసారి ఎందుకు మాయమైపోయారో ఈ కథ చెబుతుంది. దురుసు వ్యక్తుల ప్రవర్తనను మార్చాల్సి వచ్చినప్పుడు నిజంగా ఇలా జరిగితే బాగుండు అనిపిస్తుంది.

తప్పుదారి పట్టిన ఇద్దరు విద్యార్థులని తెలివిగా సక్రమ మార్గం పట్టించిన లెక్చరర్ కథ ‘పరిష్కారం’. సమస్యను సరిగ్గా గుర్తిస్తే చాలు, పరిష్కారం దానంతట అదే దొరుకుతుందని చెప్పిన కథ.

కులాంతర వివాహం చేసుకున్న కొడుకుని తండ్రి వెలివేస్తే – పట్టుదలతో తండ్రికి దూరంగా వెళ్ళాడు కొడుకు. వాళ్ళు తిరిగి కలవడానికి కారణమేంటో ‘రెండు మనసుల వ్యథ’ కథ చెబుతుంది.

తిమ్మిని బమ్మి చేసి ఎదుటివారి సానుభూతి పొందాలనుకున్న తల్లీ కొడుకుల ఆట ఎలా కట్టయిందో ‘స్వేచ్ఛ’ కథ చెబుతుంది. డబ్బు కోసం చిరుద్యోగం చేసే భార్యని వేధించడమే కాకుండా, ఆమెను మానసికంగా హింస పెడితే, ఆమె ఏం నిర్ణయం తీసుకుందో ఈ కథ చెబుతుంది.

దుర్మార్గుడైన భర్త గతించిన ఓ మహిళ, బొట్టు పెట్టుకోవాలని ఎందుకు నిశ్చయించుకుందో ‘తప్పు చేశానా’ కథ వెల్లడిస్తుంది. కుటుంబాలలో ఆరళ్ళకు లోనయ్యే ఎందరో స్త్రీల మౌనవేదనను అక్షరీకరించింది ఈ కథ.

ఓ న్యాయమూర్తి ఇచ్చిన ఆ తీర్పు సమాజంలో మేలైన మార్పు తేగలదా? కనీకం మార్పుకి బీజం అయినా వేయాలనిపించేలా వ్రాసిన కథ ‘మనమూ దోషులమే’.

ఆ ఊర్లో శుక్రవారం రాత్రి ఆ వీధిలో వెళ్ళాలంటే వాహనదారులకు ఎంతో భయం. ఎందుకా భయం? ఎంటా సమస్య? దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నమేమిటో ‘ఆ వీధిలో’ కథ చెబుతుంది.

***

చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషులని బాగా పరిశీలించి, వ్రాసిన కథలు ఇవి. ఆయా కథల్లోని ఘటనలు మనకి నిత్యం మన సమాజంలో ఎదురయ్యేవే. కొన్ని సమస్యలకు రచయిత చూపిన పరిష్కారాలు ప్రయత్నిస్తే సాధ్యమేననిపిస్తాయి. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే, సమాజం మారుతుంది అన్న ఉద్దేశంతో అల్లిన కథల సమాహారం ‘మనసైన కథలు’. హాయిగా చదివించే ఈ కథలు ఆలోచింపజేస్తాయి కూడా.

***

మనసైన కథలు

రచన: జి. వి. శ్రీనివాస్

పేజీలు: 120

వెల: ₹ 150/-

ప్రచురణ: ప్రియమైన రచయితలు, సింహాచలం.

ప్రతులకు:

1.విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 0866-2430302

2.నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు 040-24224454/453

3.జి.వి.శ్రీనివాస్,

శ్రీ సాయి శ్రీనివాసా నిలయం,

8-18/1-1/3, శివాజీ కాలని,

ప్రదీప్ నగర్, విజయనగరం 535004,

ఫోన్ 7702455559

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here