[box type=’note’ fontsize=’16’] అటవీ పునరుద్ధరణ ప్రక్రియలు ఎలా సాగాలో ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]
అటవీ పునరుద్ధరణ ప్రక్రియలు:
[dropcap]2[/dropcap]015-2018 నడుమ జరిగిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో 2,35,000 హెక్టార్లను లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్దేశిత లక్ష్యం సాధించే దిశగా సాగిన కార్యక్రమాలలో 5 లేక 6 రకాల వృక్ష జాతులు మాత్రమే వినియోగించబడ్డాయి. అవి కూడా పెద్దగా ఊరూ పేరూ లేని జాతులే. వ్యయం మాత్రం 28 లక్షల రూపాయలు. లక్షల సొమ్ము ఖర్చు చేయడం జరుగుతోంది. వేల సంఖ్యలో వాలంటీర్లు సేవలందిస్తున్నారు. విలువైన సంవత్సరాల కాలం గడిచిపోతోంది. ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో రావటం లేదు. కేవలం ‘మొక్కలు నాటడం’, ‘అటవీ పునరుద్ధరణ’ కాదు, కానేరదు.
పునరుద్ధరణ చేపట్టిన ప్రాంతంలో వివిధ అంశాలకు సంబంధించి అనువైన స్థానిక జాతులను ఎంచుకోవాలి. స్థానిక సమూహాల, ప్రజల ప్రాముఖ్యతని, వారికి అడవితో ఉండే అనుబంధాన్ని గుర్తించి గౌరవించాలి. వారి హక్కులకు భంగం కలగని రీతిలో పునరుద్ధరణ కార్యక్రమాలు సాగాలి. పునరుద్ధరించ దలచుకున్న అటవీ ప్రాంతంలో గతంలో ఉండిన పలు వృక్ష జాతులను, మొక్కలను గుర్తించడానికి స్థానిక సమూహాల సహాయం తీసుకోవాలి. అప్పుడు గుర్తింపు మరింత ఖచ్చితత్వంతో జరగగలదు.
సంబంధిత అడవికి సంబంధించిన మొక్కలు గాని, విత్తనాలు గాని పరిసరాలలోని ప్రకృతి వ్యవస్థల నుండి గాని ఖచ్చితమైన విత్తన నిధుల నుండి గాని సేకరించాలి. కానీ మార్కెట్ల నుండి, నర్సరీల నుండి మొక్కలు సేకరించడం జరుగుతోంది. అరుదుగా మాత్రమే తగినంత శ్రద్ధతో స్థానిక నర్సరీల నుండి గాని, సహజ ప్రకృతి వ్యవస్థల నుండి గాని వృక్ష జాతులను, విత్తనాలను, మొక్కలను సేకరించడం జరుగుతోంది.
విధ్వంసం ఆగడం లేదు:
డెహ్రాడూన్ లోని ఒక సైన్స్ కాలేజీలో 25,000 వృక్షాలు నరికివేయబడ్డాయి. కెన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు 23 లక్షల చెట్లు బలికానున్నాయి. బుందేల్‌ఖండ్ లోని వజ్రపు గని తవ్వకాల కోసం 2.15 లక్షల చెట్లు/వృక్షాలు నరికిపారేశారు.
అభివృద్ధి పనుల కోసం అటవీ ప్రాంతాలను పణంగా పెట్టడం సర్వసాధారణమైపోయింది. బదులుగా ‘పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం కదా’ అన్న వాదనలు వినవస్తున్నాయి. 2006 నాటి (R.A) అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అటవీ పునరుద్ధరణ ప్రక్రియ నిర్మూలించబడిన అటవీ ప్రాంతపు వృక్షజాతుల, మొక్కల వైవిధ్యాన్ని తిరిగి పాదుకొల్పగలిగే రీతిలో సాగాలి.
ప్రకృతి వ్యవస్థలు:
ప్రకృతి వ్యవస్థలంటే కేవలం మొక్కలు, చెట్లు మాత్రమే కాదు. వేల సంఖ్యలో జాతుల జంతువులు, ప్రాణులు, పక్షులు వంటి వాటితో సహా పరస్పరాధారితమైన వృక్షసంపదతో అలరరే వ్యవస్థలు. ఆ కారణంగానే ఎఫారెస్టేషన్‍లో ఆ ప్రాంతానికి తగిన, అనువైన జాతులు, అనుబంధ జాతులు సరైన సీజన్‍లో నాటవలసిన విధానంలో నాటాలి. అపుడే కొంతకాలానికి అక్కడ ప్రకృతిసిద్ధమైన అటవీ వ్యవస్థను కొంతవరకైనా భర్తీ చేయగలిగిన అటవీ వ్యవస్థ రూపు దిద్దుకోగలుగుతుంది.
అన్నామలైలో నాశనమైపోయిన వర్షాధారిత అరణ్యం దాదాపు 100 హెక్టార్లు. ఆ అడవిని పునరుద్ధరించడానికి ఓర్పుగా ప్రయత్నాలు సాగాయి. ప్రకృతి ప్రేమికుల బృందం ఒకటి 20 సంవత్సరాలుగా ఒక్కో ఎకరం తరువాత మరొక ఎకరంగా చేపడుతూ వచ్చిన ‘అటవీకరణ’ కార్యక్రమంలో – 70,000 మొక్కలను నాటి సంరక్షించడం జరిగింది. అరణ్యం పునర్నిర్మింపబడింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని శ్రద్ధగా అమలు చేయడంతో దాదాపుగా మునుపటి వ్యవస్థను పోలిన వ్యవస్థ రూపుదిద్దుకుంది. వీరి కృషిని ఆదర్శంగా తీసుకోవాలి.
వేల సంవత్సరాల ప్రకృతి సంపదను కొల్లగొట్టిన లేదా నాశనం చేసిన పాపానికి ఓర్పు, నేర్పుతో శ్రమించి అడవులను రూపొందించుకోవడానికి ప్రయత్నించడం ఒక్కటే సరైన పశ్చాత్తాపం కాగలదు.
వ్యవసాయేతర భూములు – వీటి ప్రాముఖ్యత వీటికీ ఉన్నది:
‘బంజర్లు’గా పిలవడబే బహిరంగ ప్రకృతి వ్యవస్థలు సైతం సమీకృత ప్రకృతి వ్యవస్థలో భాగమే. ఇవి అంతరించిపోతున్న కొన్ని జాతుల మొక్కల/జంతువులకు నెలవులు. మనుగడ ముప్పును ఎదుర్కుంటున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, జెర్డాన్స్ కోర్సర్ వంటి కొన్ని పక్షి జాతులకు ఇవి ఆవాసాలు.
పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలలో భాగంగా బంజర్లలోనూ మొక్కలు నాటడం జరుగుతోంది. ఇక్కడి స్థానిక గడ్ది జాతి రకాలు, ఇతర రకాల మొక్కలు వర్షాధారంగా మనుగడ సాగించవలసి ఉండడం కారణంగా నీటిని పొదుపుగా వినియోగించుకొంటూ మనగలిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటినీ రక్షించుకోవలసిందే.
మన దేశంలోని బహిరంగ ప్రకృతి వ్యవస్థలు చిత్తడి నేలలు, ఉష్ణప్రాంతపు పచ్చిక మైదానాలు వంటివి సైతం సహజసిద్ధంగా ఏర్పడిన వ్యవస్థలే. వివిధ కారణాలుగా వాటిలో సగానికి పైగా మనుగడ ముప్పును ఎదుర్కుంటున్నాయి. నైసర్గిక స్వభావానికి విరుద్ధంగా మొక్కలు నాటడమే లక్ష్యంగా వేరే నేలలకు అలవాటు పడిన మొక్కల జాతులను ఇక్కడ నాటితే స్థానిక నీటి వ్యవస్థలు దెబ్బతిని నీటి లభ్యత తగ్గిపోగల ప్రమాదం ఉంటుంది.
ఎడారులయినా, వర్షాధారిత అరణ్యాలైనా, చిత్తడి నేలలయినా – పరిరక్షణ మన తక్షణ కర్తవ్యం కావాలి. ప్రస్తుతం ఉన్న అరణ్యాలను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టడం మన ముందున్న అతి ముఖ్యమైన విధి.