వేట

2
3

[dropcap]చి[/dropcap]రుత ఒకటి ఆకలితో
నను నిలవనీదు
కూచోనీదు
ముఖాన పంజా వేసి
వూపిరి సలపనీదు

ఉన్నట్టుండి
నా టేబిల్ మీద
నోరు తెరిచి
అమాంతంగా నా తలను
నోట కరుచుకుంటుంది

కేలండర్ లోని తేదీలను
అడవి పొదలను చేసి
వాటిమీద నన్ను
ఎడాపెడా ఈడ్చుకెళ్తుంది

నా మెదడును గడ్డకట్టించి
ఆలోచనలనన్నీ
కబేళాకు తరలిస్తున్న బాతుల్లా చేసి
నిస్సహాయంగా నిలబెడుతుంది

నేను
అటూఇటూ పరుగెత్తి
వందస్తుల పాముపటపు
మెలికల మేడలోంచీ
తప్పించుకు పోయేందుకు
గాలిపటాలని రెక్కలుగా
చేతులకు కట్టుకుని
అసహనంగా తిరుగుతుంటే
తన పచ్చటి కళ్ళతో
గాలిలా నా చుట్టూ
గాండ్రిస్తూ తిరుగుతుంది

పెద్ద ఊసరవెల్లిలా
రంగులు మారుస్తూ
నా కదలికలు గమనిస్తూ
నా గదిలో
వెచ్చని శ్వాసతో
వెనుకనే మసలుతుంటుంది

అవును
ఒక కల
పదేపదిగా
కోరలు చూపుతూ
చిరుతలా గర్జిస్తూ
నన్ను తరుముతూ
అసహనంగా
కదలనీకుండా
ఊపిరి సలపనీకుండా
నిరంతరంగా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here