రెండు ఆకాశాల మధ్య-43

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“మీ[/dropcap] ఇష్టం జనాబ్. కానీ ఓ విషయం ఆలోచించారా? చేతిలో సందూక్ బరువు మోస్తూ ఎన్ని ఇళ్ళని తిరుగుతారు? ఎన్ని ఇలాకాలని తిరుగుతారు? నా టాంగా ఎక్కితే మీకు అద్దె యిల్లు దొరికేవరకు నేనూ నా గుర్రం మీకు తోడుంటాం.”

టాంగావాలా చెప్పేదాంట్లో నిజముందనిపించింది. ఐనా ముందు జాగ్రత్త మంచిదని “మొదటే చెప్పు ఎంత తీసుకుంటావో.. నాకు అద్దె యిల్లు దొరికేవరకు ఎన్ని ఇలాకాలు తిరగాల్సి వచ్చినా తిప్పుతూనే ఉండాలి” అన్నాడు.

“అలాగే జనాబ్. మీకో అద్దె గది దొరికితే నాకా తృప్తి చాలు. యిక టాంగా సవారీకి ఇంతిమ్మని అడగను జనాబ్. మీ ఇష్టం. మీకు తోచినంత ఇవ్వండి.”

మీఇష్టమని చెప్పి తీరా డబ్బులిచ్చే సమయానికి పేచీ పెడ్తాడేమో అన్పించింది. కానీ ఎందుకో అతని మాటల్ని బట్టి మనిషి మంచివాడనే అన్పించింది.

“నేనిచ్చినంతే తీసుకోవాలి. ఎక్కువ కావాలని గొడవ పెట్టుకోకూడదు” షరీఫ్ తన ట్రంకు పెట్టెని టాంగాలో పెట్టి ఎక్కి కూచుంటూ అన్నాడు.

“మీరు సంతోషంగా ఎంతిచ్చినా తీసుకుంటాను జనాబ్” అన్నాడు టాంగావాలా.

దారిలో అతని పేరు ఇస్మాయిల్ అని చెప్పాడు. నలుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలనీ అందరికీ పెళ్ళిళ్ళయి పిల్లలు కూడా ఉన్నారని, ప్రస్తుతం యింట్లో తనూ తన భార్య మాత్రమే ఉంటామని చెప్పాడు.

మొదట ఓ ఇలాకాకెళ్ళారు. అద్దెకివ్వడానికి గదులున్నాయి కానీ కుటుంబం ఐతేనే ఇస్తామని, ఒంటరిగా ఉండేవాళ్ళకు ఇవ్వమని అన్నారు. ఒక్కరుండటానికి సరిపడా అద్దె గదులున్నాయి. కానీ ముక్కూ మొహం తెలియని వాళ్ళకు ఇవ్వమనీ, ఎవరైనా సిఫారసు చేస్తే ఇవ్వడానికి అభ్యంతరం లేదని అన్నారు.

మరో ఇలాకాలో తిరిగినా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. “ఏం చేయాలో తెలియడం లేదు” అన్నాడు నిస్పృహగా షరీఫ్.

“మనిషి సాటి మనిషిని నమ్మలేని రోజులొచ్చాయి జనాబ్. ఎదుటివ్యక్తి దొంగేమో అని అనుమానంగా చూసేవాళ్ళే తప్ప మనిషిలోని మంచితనాన్ని గుర్తించని పాడు జమానా నడుస్తోంది” అన్నాడు ఇస్మాయిల్.

“పోనీ మీ యింటి చుట్టుపక్కల ఏదైనా గది దొరుకుతుందేమో చూడకూడదూ?” అన్నాడు షరీఫ్.

ఇస్మాయిల్ కొద్దిసేపు ఆలోచించాక చెప్పాడు. “మేముండే చోట హోటళ్ళు దొరకవు. మీరు వంట చేసుకుంటారా?”

“లేదు. భోజనం బైట చేయాల్సిందే. నాకు వంట రాదు.”

“అందుకే ఆలోచిస్తున్నాను జనాబ్. నేను ఐదుగురు పిల్లల్ని స్కూల్‌కి పిల్చుకెళ్తుంటాను. అందులో ఇద్దరు పిల్లల వాలిద్ ప్రభుత్వ ఉద్యోగి. వాళ్ళింటికి ఆనుకుని చిన్న గది ఉంది. అది అద్దెకిస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.”

“వాళ్ళకు తెలిసినవాళ్ళెవరైనా నేను మంచివాడ్నేనని సిఫారసు చేస్తే తప్ప వాళ్ళయినా గదిని అద్దెకెందుకిస్తారు?”

“మీరు నాకు తెల్సినవాళ్ళేనని, చాలా మంచివారని నేను సిఫారసు చేస్తాను జనాబ్.”

“నువ్వా.. నీకు నా గురించి తెలియదుగా. నేను మంచివాడ్నని ఎలా అనుకుంటున్నావు?”

“నాకు మనుషులమీద నమ్మకముంది జనాబ్. మంచితనం బతికే ఉందన్న నమ్మకం కూడా ఉంది.”

షరీఫ్ అతని వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. కొన్ని గంటల క్రితం అతని గురించి తప్పుగా అనుకున్నందుకు సిగ్గుపడ్డాడు.

“నాకా గదిని ఇప్పించు ఇస్మాయిల్. నీ మేలు మర్చిపోను” అన్నాడు షరీఫ్.

“నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత అల్లా దయ” అన్నాడు ఇస్మాయిల్.

టాంగా ఓ అందమైన గల్లీలోకి తిరిగింది. రోడ్లు శుభ్రంగా విశాలంగా ఉన్నాయి. రోడ్డుకిరువైపులా చల్లటి నీడనిస్తూ చెట్లు.. కొన్ని యిళ్ళ బయట మోటారు కార్లు కన్పించాయి. అది ధనవంతులుండే ఇలాకా అని చూసిన వెంటనే తెలిసిపోతుంది.

టాంగా ఓ యింటి ముందు ఆగింది. ప్రహరీ లోపల అందమైన యిల్లు.. దానిముందు విశాలమైన ఖాళీ స్థలం.. గేట్ తీసుకుని యింట్లో పలికెళ్ళే దారికిరువైపులా లోపలికొచ్చేవాళ్ళని స్వాగతిస్తున్నాయా అనేలా తలలూపుతున్న రకరకాల పూల మొక్కలు.. ఓ వైపు నిలబెట్టి ఉన్న మోటార్ కారు..

ఇద్దరూ గేట్ తీసుకుని లోపలికెళ్ళారు. వసారాలో వేసి ఉన్న పడక్కుర్చీలో ఓ ముసలతను సేదతీరుతూ కన్పించాడు. ఇస్మాయిల్‌ని చూడగానే నవ్వుతూ “ఏంటి ఇస్మాయిల్ ఇలా వచ్చావు? నీ పక్కన ఉన్నతనెవరు?” అని అడిగాడు.

“ఇతని పేరు షరీఫ్ హుజూర్. స్కర్దూ నుంచి బతుకు తెరువుని వెతుక్కుంటూ మన వూరొచ్చాడు. అద్దె యింటి కోసం వెతుక్కుంటుంటే నేనే ఇక్కడికి పిల్చుకొచ్చాను. మీ యింటిపక్కనున్న చిన్న గది ఖాళీగా ఉంది కదా హుజూర్. దాన్ని అద్దెకిస్తారేమోనని…”

అతని మాట పూర్తి కాకముందే “ఆ గదిని అద్దెకివ్వాలన్న ఉద్దేశమైతే ఉంది. ఇంతకూ ఇతను నీ బంధువా?” అని అడిగాడు.

“బాగా తెలిసిన వ్యక్తి హుజూర్. చాలా మంచివాడు. మీకు ఏ రకమైన అసౌకర్యం కలిగించడని నేను నమ్మకంగా చెప్పగలను” అన్నాడు ఇస్మాయిల్.

“తెల్సినవాడేనా? బంధువు కాదా?”

“బంధువే హుజూర్. మనిషికీ మనిషికి మధ్య ఉండే బంధుత్వం” అన్నాడు ఇస్మాయిల్.

ముసలతను అతని వైపు మెచ్చుకోలుగా చూశాడు. “చాలా బాగా చెప్పావు ఇస్మాయిల్.. నిజమే. మంచితనం ఉన్నవాళ్ళందరూ మనకు బంధువులే” అంటూ షరీఫ్ వైపు తిరిగి “నా పేరు ఉస్మాన్‌ఖాన్. కేంద్ర సచివాలయంలో ఉద్యోగిగా పని చేసి రిటైరయ్యాను. నా కొడుక్కూడా ప్రభుత్యోద్యోగే” అంటూ పరిచయం చేసుకున్నాడు.

“ఇంతకూ మీరు స్కర్దూలో ఏం చేసేవారు?” అని అడిగాడు.

“పూలవ్యాపారం చేసేవాడ్ని జనాబ్” వినయంగా జవాబిచ్చాడు షరీఫ్.

“మంచి లాభసాటి వ్యాపారం. మరి దాన్నొదిలి ఇక్కడికెందుకొచ్చారు?”

“నా భార్యాబిడ్డలు హిందూస్తాన్‌లో ఉన్నారు జనాబ్. నేనిక్కడ ఇరుక్కుని పోయాను. ఎప్పటికైనా హిందూస్తాన్ వెళ్ళి నా కుటుంబాన్ని కల్సుకోవాలని నా కోరిక. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఇక్కడినుంచే బయల్దేరుతుందని పేపర్లో చదివినప్పటినుంచి లాహోర్ రావాలని ఉవ్విళ్ళూరాను. కొన్నాళ్ళు యిక్కడ పనిచేసి, సరిపడినంత డబ్బు సంపాదించాక ప్రయాణం చేద్దామన్న ఆలోచన.”

“హిందూస్తాన్లో మీది ఏ ప్రాంతం?”

“హుందర్మో అనే గ్రామం జనాబ్. అది మొదట్లో పాకిస్తాన్ భూభాగంలోనే ఉండేది. దాన్ని హిందూస్తాన్ సైనికులు ఆక్రమించుకున్న రోజు నేను పక్క వూరైన బ్రోల్మోలో ఉండిపోయాను. నేను చేయని తప్పుకి నా భార్యాబిడ్డలకు దూరమై శిక్ష అనుభవిస్తున్నాను” షరీఫ్ కళ్ళు చెమ్మగిల్లాయి.

ఉస్మాన్‌ఖాన్‌కి ఈ విషయాలన్నీ తెలుసు. హుందర్మాన్‌తో పాటు భారతదేశం హస్తగతం చేసుకున్న ఇతర గ్రామాలు, పర్యవసానంగా విడిపోయిన వేల కుటుంబాలు పడ్తున్న యాతన గురించి అతనికి తెలుసు.

అతనో నిట్టూర్పు విడిచి “భూమిని ముక్కలు చేస్తూ సరిహద్దు రేఖలు గీసినపుడల్లా ఎన్ని కుటుంబాలు హింసపడ్డాయో, ఎంతటి ఆవేదన, ఎన్ని కన్నీళ్ళు బార్డర్‌ని తడుపుతూ ప్రవహిస్తాయో నాకు తెలుసు” అన్నాడు. అతని కళ్ళముందు దుఃఖభరితమైన గతమేదో కదలాడినట్టుంది. ఎవరూ చూడకుండా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుని “రండి. మీకు గదిని చూపిస్తాను” అన్నాడు.

గది తాళం తీసి చూపించాక “మీకు నచ్చితే ఈ రోజే చేరిపోవచ్చు” అన్నాడు షరీఫ్‌తో.

“గదితో పాటు మీ ఔదార్యం కూడా నచ్చింది జనాబ్. మీవంటి ఉత్తములుంటున్న ప్రాంగణంలో నాకు చోటు దొరకడం నా అదృష్టం” మనస్ఫూర్తిగా అన్నాడు షరీఫ్.

అతను టాంగాలోంచి తన ట్రంకుపెట్టె, పరుపు చుట్ట తెచ్చుకుని లోపల పెట్టాక “ఈ షెహర్లో ఏం చేద్దామనుకుంటున్నారు? ఇక్కడ కూడా పూల వ్యాపారం చేస్తారా?” అని అడిగాడు ఉస్మాన్ ఖాన్.

“లేదు జనాబ్. నాకు మోటారు కార్లు తోలడం వచ్చు. ఎవరి దగ్గరైనా డ్రైవర్‌గా చేరదామనుకుంటున్నా. మీకు పరిచయమున్నవాళ్ళకు చెప్పి నాకు పనిప్పిస్తే మీకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటా” అన్నాడు షరీఫ్.

“అట్లా అయితే ఎక్కడో ఎందుకు? మా దగ్గరే డ్రైవర్ గా చేయండి. ప్రతినెలా మీకివ్వాల్సిన జీతంలోంచి అద్దె డబ్బులు తగ్గించి మిగిలింది ఇస్తే సరిపోతుంది” అన్నాడు ఉస్మాన్ ఖాన్.

షరీఫ్ వెంటనే ఉస్మాన్ ఖాన్ చేతుల్ని కళ్ళకు అద్దుకుంటూ “నమాజ్‌లో నేను చేసిన దువాలు వృథా పోలేదు. మీవంటి సహృదయులకు సేవ చేసుకునే అదృష్టం దొరికింది” అన్నాడు.

***

అనీస్‌కి పగలూ రాత్రీ అనే తేడాలేకుండా కళ్ళముందు చీకటే కన్పిస్తోంది.

జమీల్ దూరమైనప్పటి నుంచి కన్నీళ్ళ కెరటాలతో పోటెత్తుతున్న దుఃఖ సముద్రంలా ఉందామె. పెళ్ళయి పట్టుమని పది నెలలు కూడా కాకముందే యుద్ధం మహమ్మారిలా మారి తన సుఖసంతోషాల్ని మింగేసింది. వియోగం ఎంత బాధాకరమో యుద్ధాలకేం తెలుస్తుంది? యుద్ధంలో మరణించిన సైనికుల భార్యాబిడ్డల, తల్లిదండ్రుల విషాదాల గురించే సమాజం ఆలోచిస్తుంది.. కన్నీరు పెట్టుకుంటుంది. యుద్ధం కారణంగా బలవంతంగా విడదీయబడిన తమలాంటి జంటల మనోవ్యథ గురించి ఎవ్వరూ పట్టించుకోరు.

ఆరేళ్ళు దాటిపోయాయి. ఇక జమీల్ తిరిగిరాడేమోనన్న బాధ తనని లోపల్లోపల తినేస్తోంది. తన బాధని నిశ్శబ్దంగా భరిస్తూనే తన అత్తామామల దుఃఖాన్ని చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది. తన అత్తా మామలు చాలా మంచివారు. సంస్కారవంతులు.. చుట్టుపక్కల అమ్మలక్కలు “కొత్త కోడలు మీ యింట్లో కాలు పెట్టిందో లేదో కొడుకు దూరమైనాడు. ఆ అమ్మాయి తనతో పాటు దురదృష్టాన్ని వెంట తెచ్చుకొచ్చింది” అంటూ ఎన్ని మాటలంటున్నా తన అత్తామామలు పల్లెత్తుమాట అనడం లేదు. “యుద్ధం ముంచుకొచ్చి మనుషుల్ని విడదీస్తే మా కోడల్ని ఎందుకు తప్పుపడ్డారు? యుద్ధాలే మన దురదృష్టానికి కారణం. యుద్ధాలే మన జీవితాలకు తగిలిన శాపాలు” అంటూ తనని వెనకేసుకొస్తున్నారు.

ఈ వూళ్ళో తనలా భర్తకు దూరమైన భార్యలు, తల్లిదండ్రులకు దూరమైన కొడుకులూ కూతుళ్ళు, పిల్లలకు దూరమైన తల్లులూ తండ్రులూ చాలామందే ఉన్నారు. అసలు వూరు వూరంతా విషాదంలో మునిగి ఉంది. తమ పక్క వూరు బ్రోల్మో రెండు మైళ్ళ దూరంలోనే ఉంది. స్కర్దూ పట్టణం తమ వూరికి ఎనిమిది మైళ్ళ దూరంలోనే ఉంది. కానీ అక్కడ చిక్కుకుపోయిన ఆత్మీయులు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నట్టు.. ఇక్కడికి రాలేని పరిస్థితి. కూతవేటు దూరంలో ఉండికూడా కల్సుకోలేని దురవస్థ ఎంతటి దుర్భరమో తనకు అనుభవపూర్వకంగా తెలుస్తోంది.

ఉదయం లేచినప్పటినుంచి యాంత్రికంగా పనులు చేస్తున్న అనీస్ జావేద్ పిలుపుతో తలయెత్తి చూసింది.

“మంచినీళ్ళివ్వు తల్లీ” అన్నాడు జావేద్.

అనీస్ గ్లాస్‌తో కుండలోంచి నీళ్ళు ముంచుకొచ్చి జావేద్ చేతికిచ్చి, అతను నీళ్ళు తాగాక గ్లాస్‌ని తీసుకెళ్దామని అక్కడే నిలబడింది.

నీళ్ళు మెల్లగా తాగుతూ జావేద్ ఆ అమ్మాయి వైపు పరిశీలనగా చూశాడు. పెళ్ళయిన కొత్తలో ఎలా ఉండేదో.. మంచు బిందువుల్తో తడిసిన ముద్ద బంతిపూవులా మనోహరంగా ఉండేది.. అప్పుడే విరిసిన గుల్‌ మొహర్.. విచ్చుకున్న వెల్తురు పూవులా ఉండేది మొహం. కళ్ళు నక్షతాల్లా మెరుస్తూ కన్పించేవి. పెదవుల మీద అద్భుతమైన నవ్వు నాట్యం చేస్తో ఉండేది. ఇప్పుడవన్నీ అదృశ్యమైపోయాయి. అమావాస్యనాటి ఆకాశంలా మ్లానమైన మొహం.. భోరున కురిసే మేఘాల్లా నిస్తేజమైన కళ్ళు.. అతనికి దుఃఖంతో పాటు ఆ అమ్మాయి మీద వాత్సల్యం పొంగుకొచ్చింది.

ఇరవై రెండేళ్ళు కూడా నిండని అమ్మాయికి ఈ శిక్షేమిటి అనుకున్నాడు. స్కర్దూలో మరో అమ్మాయిని జమీల్ నిఖా చేసుకున్నట్టు ఆ అమ్మాయికి తెలియదు. తెలిస్తే బాధపడ్తుందని ఆ అమ్మాయికి చెప్పకుండా దాచారు. ఇదే తన కూతురికి జరిగితే తనేం చేసి ఉండేవాడూ అని ఆలోచించాడు. అదే క్షణంలో అతని మనసులో ఓ ఆలోచన ప్రాణం పోసుకోసాగింది.

బైటికెళ్ళినా అతని మనసులో అనీస్‌కి యుద్ధం వల్ల జరిగిన అన్యాయమే మెదుల్తోంది. మరో పదేళ్ళు ఎదురుచూసినా మనవడు తిరిగిరావడం జరిగే విషయం కాదని అతనికర్థమైంది. వూళ్లో కొంతమంది కుర్రవాళ్ళ భార్యలు పుట్టింటికనో, బంధువుల పెళ్ళనో, పేరంటానికనో పక్క వూర్లకెళ్ళి, అక్కడినుంచి తిరిగి రాలేక అక్కడే ఉండిపోయారు. ఆ కుర్రవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు రెండో పెళ్ళి చేయడానికి సిద్ధపడున్నారు. జమీల్ కూడా రెండో పెళ్ళి చేసుకున్నాడుగా. జమీల్‌కో న్యాయం అనీస్‌కో న్యాయమా? అలాంటప్పుడు తను అనీస్‌కి రెండో పెళ్ళి ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తున్నాడు.

సాయంత్రం యింటికి తిరిగొస్తున్నప్పుడు దార్లో అతనికి కుర్షీద్ కన్పించాడు. అతనికి దాదాపు యాభైయేళ్ళ వయసుంటుంది. నాలుగో కొడుక్కి ఏడేళ్ళ క్రితం పెళ్ళి చేశాడు. కోడలు బ్రోల్మో గ్రామానికి చెందిన అమ్మాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళమ్మకు జబ్బు చేసిందని చూడటానికి వెళ్ళింది. ఆమె తిరిగి రావాలనుకున్న రోజుకి ఒక రోజు ముందు హుందర్మో హిందూస్తాన్‌లో భాగమైపోయి రెండూళ్ళ మధ్య ముళ్ళ కంచె మొలిచింది.

“కుర్షీద్ మియా.. ఎలా ఉన్నాడు మీ నాలుగో కొడుకు సలార్?” అని అడిగాడు జావేద్.

“ఇప్పుడిప్పుడే తన బేగం దూరమైపోయిందన్న బాధనుంచి కోలుకుంటున్నాడు. మొదట్లో ఎప్పుడు చూసినా చాలా విచారంగా ఉండేవాడు. పెళ్ళయి ఏడాది కూడా నిండకుండానే భార్య దూరమైతే ఎవ్వరికైనా బాధ ఉండటం సహజం కదా” అన్నాడు కుర్షీద్.

“ఎప్పటికైనా ఆ అమ్మాయి తిరిగొస్తుందనీ, ఆమెకోసం ఎదురుచూస్తూ ఉంటానని అంటున్నాడా?”

“మొన్నటివరకూ అదే ఆశతో ఎదురుచూసేవాడు. ఇప్పుడు వాడికీ అర్థమైంది. ఆ దేశం నుంచి ఈ దేశానికి రావడం జరిగే పని కాదని.”

“వయసులో ఉన్న కుర్రవాడు కదా. ఆడతోడు లేకుండా ఎన్నాళ్ళని ఉంటాడు? ఈ విషయం గురించేమైనా ఆలోచించావా?”

“మరో అమ్మాయిని తెచ్చి నిఖా చేస్తామని గతేడాది నుంచి నేనూ నా బేగం పోరుతూనే ఉన్నాం. వింటేగా.. తనకు దూరంగా తన భార్య ఉండలేదనీ, తప్పకుండా తిరిగొస్తుందని పిచ్చోడిలా మాట్లాడేవాడు. ఇప్పుడు పిచ్చి కుదిరిందనుకుంటా. రెండో పెళ్ళి విషయం ఎత్తితే ఇంతకు ముందులా వద్దనడం లేదు.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here