కైంకర్యము-12

1
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]ఐ[/dropcap]దవ ఏట వెంకటాచారికి శాస్త్రోక్తంగా ఉపనయనం చేసారు. వేదపాఠశాలకు పంపాలని వరదాచారి అనుకున్నాడు కాని, సూర్యప్రభ పడనియ్యలేదు.

“వల్లకాదంటే వల్లకాదు. ఈ నలుసన్నా చక్కగా ఆంగ్లవిద్య అభ్యసించాల్సిందే…” అన్నది మొండిగా.

“ఆంగ్ల విద్యేంటి? మన ఇంటా వంటా ఉన్నాయా? ఏమిటి నీ మొండితనం?” అన్నాడు వరదాచారి.

“నాకదంతా తెలియదు. నాకొక్క కొడుకన్నా నా కళ్ళ ముందు ఉండాలని, నన్ను చూసుకోవాలని నా కోరిక. ఆడపిల్ల పుడుతుందని ఆశపడ్డాను. పెరుమాళ్ళు నా మీద కరుణ చూపలేదు. పోనీ వీడినన్నా నా ముందు నుంచి తీసుకుపోకండి…” కన్నీరుతో వేడుకోలుగా అంది సూర్యప్రభ.

ఆమెను ఇక అట్టే కష్టపెట్టలేకపోయాడు వరదాచారి. దానితో ఆయన వెంకటాచారినే అక్కడ ధవళేశ్వరంలో ఉన్న ఆంగ్ల బడికి పంపటము మొదలెట్టారు. అది మిషినరీలు నడిపే బడి. వాళ్ళు చదువుతో పాటూ బైబిల్‌ నేర్పుతారు. అలా వెంకటాచారి చిన్నతనములో బైబిల్‌ కూడా చదివేసాడు. చక్కటి ఉచ్చారణ వల్ల బైబిల్‌ చదవమని వెంకటాచరినే అడిగేవారు టీచర్లు. ఆంగ్లంతో పాటూ ఆ బడిలో ఫ్రెంచ్‌ కూడా నేర్పుతారు టీచర్లు. అలా వెంకటాచారికి చిన్నతనాన్నే ఆంగ్లం, ఫ్రెంచ్ తెలిసాయి.

సూర్యప్రభ కళ్ళనిండా వాడే. ఆ బాలుని ముద్దు మురిపాలు ఆమె జీవితమైయింది. బాలకృష్ణుడిలా తన ఆటపాటలతో అందరినీ మురిపించేవాడు వెంకటాచారి. సూర్యప్రభ తనే యశోద అన్నంత ఆనందపడేది.

***.

వెంకటాచారి ఏకసంధాగ్రాహి. అతను బడిలో ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థి. అతను అలా అందరిలో మిన్నగా ఎదుగుతున్నాడు. అతని అన్నలు, సూర్యప్రభ అప్పగారి కుమారుడైన లక్ష్మీకాంతుడు అప్పుడప్పుడూ ఇంటికి వచ్చినప్పుడు, వారు వల్లెవేసే ఋక్కులను విని తిరిగి చిలకపలుకుగా పలుకుతుండేవాడు ఏకసంధాగ్రాహి అయిన వెంకటాచారి.

తల్లి సూర్యప్రభ వద్ద సంగీతం నేర్చుకునేవాడు. తండ్రితో కలసి ద్రవిడవేదం పాడేవాడు. ఎన్ని నేర్చుకుంటున్నా, అతని జ్ఞాన తృష్ణ తీరేది కాదు. ఇలా దినదిన ప్రవర్ధమానంగా వెంకటాచారి పెరుగుతున్నాడు అందరికీ ఆహ్లాదం పంచుతూ.

***

అప్పన్నపల్లె శ్రీపీఠంలో వేదంలోని అన్నీ శాఖాలు నేర్పేవారు ద్రవిడవేదంతో పాటు. చుట్టు ప్రక్కల చాలా ప్రాంతాలకు పీఠం మీద గౌరవం, ఆ పీఠ ఆచార్యుల మీద అచంచలమైన భక్తి ఉంది. ఆ ప్రజలకు సేవ చెయ్యటానికి ఆ పీఠం ఎన్నడూ వెనకడుగు వెయ్యదు కూడా. శ్రీ. మాధవతీర్థులు ఆ పీఠానికి పరివ్రాజకులుగా ఉండేవారు ఆ సమయంలో. తీరం వెంట ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆశ్రమం తలుపులు తెరిచేవారు ప్రజల కోసము. దివిసీమ ఉప్పెనప్పుడు ఆ ఆశ్రమం నెల రోజులు వచ్చిన ప్రజలను కాచుకుందని కథలు మనకు వినపడతాయి ఆ ప్రాంతం వెడితే.

లక్ష్మీకాంతుడు మాధవతీర్థ యతివరేణ్యుల వద్ద వేదాధ్యాయి అయి, ఆయనకు సేవలు చేస్తూ అంతేవాసిగా ఉండేవాడు. పదిహేడు సంవత్సరాల లక్ష్మీకాంతుడంటే మాధవతీర్థ యతికి ఎంతో అభిమానము. ఒకనాడు ఆయన వరదాచారిని శ్రీపీఠానికి పిలిపించారు ఆయన.

“స్వామిగళ్ ప్రణామం…” అంటూ సాష్టంగపడిన వరదాచారితో

“ఏమీ అందరూ క్షేమమా మీ ఊరిలో?” అంటూ క్షేమ సమాచారం అడిగారు.

“తమ దయ స్వామిగళ్…”

“లక్ష్మీకాంతుడిని శిష్యునిగా స్వీకరించవలెనని సంకల్పం. వాని తల్లిగారికి మీరు చెప్పండి. ఆమె మీ వద్దనే కదా ఉంటారు…” అని యతివరేణ్యులు తమ నిర్ణయం తెలిపారు.

వరదాచారి “తప్పక తెలియజేసేద” నని చెప్పి ధవళేశ్వరము వచ్చేశాడు.

***

సూర్యప్రభను, ఆమె అప్పగారిని పిలిచి వరదాచారి “లక్ష్మీకాంతుడు బావున్నాడు. స్వామికి పరిచర్యలు చేస్తూ, వారి అనుగ్రహపాత్రుడైనాడు…” అన్నాడు.

“మన పిల్లలెలా ఉన్నారు? బాగా పన్నెలు వల్లె వేస్తున్నారా?” అడిగింది సూర్యప్రభ.

ఆమె మాటకు సమాధానము చెప్పక, “స్వామిగళ్‌ మన లక్ష్మీకాంతుని శిష్యస్వీకారం చేస్తారట…” అన్నాడు.

ముందు ఆడవారిద్దరికీ అర్థం కాలేదు. మౌనం కాసేపు వారి మధ్య వణికింది.

కాసేపటికి అప్పగారు తల్లడిల్లింది. ఆమె హృదయములో ఏదో అలజడి కలిగింది.

“ఒక్కడే నలుసు నాగన్న. వాడు కాస్తా సన్యసిస్తే ఎలా? నాకు తద్దినం ఎవరు పెడతారు?” అన్నదామె. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కాని, శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పరివ్రాజకులుగా మారి రామానుజుల జండాను స్వీకరించటం ఎంతో గౌరవమే కాక ఏడేడు తరాలు ఉద్ధరించబడుతాయి.

“భలేదానివమ్మా వదినమ్మా! నీ తద్దినము ఎవరో ఒకరు పెట్టవచ్చు. లక్ష్మీకాంతుడు సన్యసిస్తే, శ్రీ పీఠానికి ఉత్తరాధికారి అయితే, అసలు తరాలన్ని ఉద్ధరించబడి ఇక తద్దినాల గోలే ఉండదు…” అన్నాడు కాస్త చిరాకును ధ్వనింపచేస్తూ వరదాచారి.

ఆమె మౌనం వహించింది. కారణము ఆయన చెప్పిన విషయం నిజం కాబట్టి. అది చూసి వరదాచారే చెప్పాడు.

“మనం వచ్చే బుధవారం బయలుదేరి అప్పన్నపల్లె వెడదాం…”

ఆడవారిద్దరూ మాట్లాడలేదు. కాసేపటి సూర్యప్రభ అక్కను అక్కున చేర్చుకుంది.

“అక్కాయి! నేనున్నానుగా. నా పిల్లలు ఉన్నారు. మేమంతా నిను చూసుకుంటాం. నీవు కంగారు పడకు. ఆయన చెప్పినట్లుగా ఏడేడు తరాలు కడతేరుతాయి. మనమూ మన ఆచార్యులకు ఋణం తీర్చిన వారమవుతాం…” అంటూ సూర్యప్రభ అక్కని ఊరడించింది.

***.

సూర్యప్రభ అప్పగారికి ఎవరు ఊరడించినా హృదయంలో బాధగానే ఉంది.

ఆమె ఆశ్రమానికి వెళ్ళే వరకూ తిండి మాని రామాయణం పారాయణం చెయ్యటం మొదలుపెట్టింది.

ఆమె భర్త ఆస్తి ఆమెకు సంక్రమించినా, కుమారుడు సన్యసించి పీఠము తీసుకుంటే భవిష్యత్తు ఏమిటో తోచలేదు. ఆమె సూర్యప్రభ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎప్పటికో అప్పటికి సొంత ఇంట్లో కొడుకు, కోడలుతో ఉండాలనుకున్నది. ఆమె ఆశ కూడా అదే. ఇప్పుడిక తనూ ఆశ్రమములో వెళ్ళి ఉండటము నయమని తోచింది.

సూర్యప్రభతో “వాడు సన్యసిస్తే నేనూ ఆశ్రమంలో ఉండిపోతానే…” అంది.

“చూద్దాంలే అక్కాయి. తొందరపడకు. మేమున్నాం కదా. ఆందోళన పడకు…” ధైర్యం చెప్పింది సూర్యప్రభ.

ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ వెంకటాచారితో కలిసి శ్రీపీఠానికి ఎడ్లబండిలో బయలుదేరారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here