[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! మనిషికి సౌకర్యాన్నిచ్చే యంత్రాలు సక్రమంగా పనిచెయ్యాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అలాగే తన శారీరక, మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండడానికి మనిషి కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఐతే నియమపాలనలో మనిషికీ, యంత్రానికీ భేదముందని – మనిషిలాగే విద్యలు నేర్చిన మరబొమ్మ కథ చెబుతుంది. నీకా కథ చెబుతాను” అంటూ కథ చెప్పసాగింది.
అనగనగా విసర్ప దేశం. ఒకప్పుడక్కడి పౌరులు పేదరికంలో మగ్గేవారు. శివాంగుడు రాజయ్యేక, ఆ దేశంలో పౌరులకు – దేశసంపద పెంచడానికి కృషి చెయ్యడం మినహా మరో వ్యాపకం ఉండరాదని శాసనం చేశాడు. అప్పట్నించీ, అక్కడి పౌరులు ఒకరితో ఒకరు కలవరు. ఎవరికీ స్వంతంగా ఆస్తి లేదు. కూడు, గూడు, గుడ్డ అన్నీ రాజే ఇస్తాడు. కష్టమొస్తే రాజే ఆదుకుంటాడు. పిల్లలకు చదువు, రోగానికి వైద్యం ఉచితం. అలా పదేళ్లలో ఆ దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోయి, ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటైంది.
విసర్ప దేశం పక్కనే నవనీత దేశం ఉంది. మొదట్లో ఆ దేశం పరిస్థితి విసర్పకంటే మెరుగ్గా ఉండేది. కానీ నాలుగేళ్లుగా అక్కడ ఓ ఏడాది అతివృష్టి, ఓ ఏడాది అనావృష్టి. దాంతో గడిచిన ఏడాది ఆ దేశపు రాజు సుదీపుడు, ఏడాదిలో తిరిగిచ్చే షరతుమీద విసర్పనుంచి ఋణం తీసుకున్నాడు. ఇంకా ఆ ఋణం తీర్చలేదు. కానీ విచిత్ర మేంటంటే – సందు దొరికితే చాలు విసర్ప పౌరులు నవనీతకు పారిపోతున్నారు. అక్కడి పౌరుల్లో ఒక్కరు కూడా ఇటు రాలేదు.
శివాంగుడీ విషయం మంత్రితో చర్చించాడు. మంత్రి ఆయనతో, నవనీత పౌరులు విలాస జీవితానికి అలవాటు పడ్డారు. అందుకే వారి దేశసంపద పెరగడంలేదు. కానీ అక్కడ వారికి స్వేచ్ఛా వినోదాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే పేదరికంలో ఉన్నా వారు చాలా సంతోషంగా ఉన్నారు. మన దేశంలో వినోదం, స్వేచ్ఛ లేవు. వాటికోసమే మన పౌరులు నవనీత పట్ల ఆసక్తి చూపుతున్నారు” అన్నాడు.
శివాంగుడు ఓ క్షణం ఆలోచించి, “వినోదం మానుకుని కూడబెట్టిన మన ధనాన్ని, వాళ్ల వినోదాని కెందుకు వెచ్చించాలి? మన విధానాలనుసరిస్తే, ఋణం తీర్చడానికి గడువిద్దాం. లేకుంటే, తక్షణం ఋణం చెల్లించమని సుదీపుడికి తాఖీదు పంపండి” అన్నాడు.
సుదీపుడికి తాఖీదు అందింది. దాని విషయమై తీవ్రంగా ఆలోచించేక, ఆయన చమక్కుడనేవాణ్ణి రాయబారానికి పంపాలనుకున్నాడు. ఓ మరబొమ్మను అతడికిచ్చి ఏంచెప్పాలో చెప్పాడు. అతడా మరబొమ్మతో విసర్ప దేశానికెళ్లి శివాంగుణ్ణి కలుసుకుని, “ప్రభూ! మీ విధానాల అమలుకి మా రాజుగారు సుముఖమే! అందుకే ఈ మరబొమ్మని తయారు చేయించారు. ఇది ‘మరబొమ్మా మరబొమ్మా, పాట పాడు’ అంటే అచ్చం మనిషిలాగే పాటలు పాడుతుంది. ‘మరబొమ్మా మరబొమ్మా కథ చెప్పు’ అంటే అచ్చం మనిషిలాగే కథలు చెబుతుంది. దీన్ని మా పౌరులకివ్వాలని ఆయన అభిప్రాయం. ఇదుంటే ప్రతి మనిషీ విడిగానే ఒక్కడూ బోలెడు వినోదాన్ని పొందొచ్చు. అప్పుడు వారికి స్వేచ్ఛ లేకున్నా సంతోషంగా ఉంటారు. తమరు కొన్నాళ్లు దీన్ని శ్రద్ధగా పరీక్షించి, తగిన మార్పులు సూచించగలరని మా రాజుగారు ఆశ పడుతున్నారు” అన్నాడు.
శివాంగుడతడికి అతిథిగృహంలో బస ఏర్పాటు చేసి, తనా బొమ్మను తీసుకుని ఏకాంత మందిరానికెళ్లి, ‘మరబొమ్మా మరబొమ్మా పాట పాడు’ అన్నాడు. బొమ్మ శ్రావ్యంగా ఓ పాట పాడింది. ‘మరబొమ్మా మరబొమ్మా కథ చెప్పు’ అంటే అద్భుతమైన ఓ కథ చెప్పింది.
శివాంగుడికా పాటలు, కథలు నచ్చాయి. ఇలాంటి బొమ్మని తన పౌరులకూ ఇస్తే వారు కూడా స్వేచ్ఛ లేకున్నా సంతోషంగా ఉంటారనుకున్నాడు. తర్వాత బొమ్మని పదేపదే అడిగి – పాటలు, కథలు మళ్లీమళ్లీ విని మురిసిపోయాడు. కానీ ఒక్కడూ ఎంతసేపని అలా?
శివాంగుడు అంతఃపురానికి వెళ్లి రాణిముందా మరబొమ్మ విద్యలు ప్రదర్శించాడు. రాణి పక్కనుంటే అంతకుముందుకంటే ఎక్కువ సంతోషం కలిగిందని అనిపించడంతో, ఆ వినోదాన్ని పంచుకుందుకు రాజకుమారులిద్దర్నీ పిలిచాడు. అప్పుడా ప్రదర్శన మరింత ఉత్సాహాన్నిచ్చింది. దాంతో మనుషులెక్కువైతే మజా పెరుగుతోందని శివాంగుడికర్థమైంది. క్రమంగా అంతఃపురంలో ఉండే పరివారం కూడా, మరబొమ్మ ప్రదర్శనకు వినోదించారు.
అలా రెండ్రోజులు రాజమందిరమంతా మరబొమ్మ మైకంలో ఉంది. ఐతే మరబొమ్మ కొచ్చినవి నాలుగే పాటలు, నాలుగే కథలు. అవే మళ్లీమళ్లీ వినడానికి, క్రమంగా ఒకొక్కరికే విసుగు పుట్టింది. అప్పటికా వినోదానికి అలవాటుపడ్డ రాజు, “ఈ బొమ్మకి మరిన్ని కథలు, పాటలు వచ్చుంటే ఎంత బాగుండేది?” అని వాపోయాడు. అప్పుడు రాణి, “ప్రభూ! బొమ్మ పాట విన్నాక, నాకో కొత్త పాట తట్టింది. వినిపించనా?” అంది.
ఆ దేశంలో ఎవరికీ పాటలు రావు. అందుకని రాణి పాడతానంటే రాజు ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె గొంతు సవరించుకుని పాడేసరికి, ఆ పాట మరబొమ్మ పాటకంటే శ్రావ్యంగా, మనోహరంగా అనిపించింది. అప్పుడక్కడున్న పరివారంలో ఒకడు, “బొమ్మ చెప్పే కథ విన్నాక, నాకో కొత్త కథ స్ఫురించింది. తమరి సెలవైతే వినిపిస్తాను” అన్నాడు.
రాజు అనుమతితో వాడు చెప్పిన కథ బొమ్మ చెప్పిన కథకంటే రమ్యంగా, ఆసక్తికరంగా ఉంది. రాజు వాణ్ణి తెగ మెచ్చుకున్నాడు. ఆతర్వాత బొమ్మ ప్రేరణతో మరికొందరు కథకులు, గాయకులు ముందుకొచ్చి రాజుని మెప్పించారు. ‘నా అంతఃపుర పరివారంలో ఇంతమంది కళాకారులా?’ అని ఆశ్చర్యపోయిన రాజు, రెండ్రోజుల్లో తనూ ఓ కళాకారుడయ్యాడు.
వారం తిరిగేసరికి రాజాంతఃపురంలో వాతావరణం మారిపోయింది. అక్కడున్న ప్రతిఒక్కరూ పాటలు, కథలతో ఒకరినొకరు అలరిస్తూ, మునుపెరుగని కొత్త ఉత్సాహంలో ఉన్నారు. అప్పుడు రాజు చమక్కుణ్ణి పిలిపించి, “మరబొమ్మ బాగుంది. ఐతే దానికొచ్చినవి నాలుగే నాలుగు కథలు, పాటలు. అందుకని కాసేపటికే విసుగొచ్చింది” అన్నాడు.
“దాందేముంది ప్రభూ! ఇది మచ్చు మాత్రమే! బొమ్మకి వేలకొద్దీ కథలు, పాటలు నేర్పొచ్చు. మీకూ కావాలంటే అలాంటి బొమ్మలు ఎన్నైనా పంపగలం” అన్నాడు చమక్కుడు.
శివాంగుడు నవ్వి, “మరబొమ్మ వద్దులే కానీ, మీ దేశంలో ఉన్న వివిధ కళాకారుల్ని మా దేశానికి పంపే ఏర్పాటు చేయించు. ఇక్కడ ఆసక్తి ఉన్నవారు శిక్షణ తీసుకుంటారు. ఇక ఋణం విషయానికొస్తే, మీకు మరికొంత గడువిస్తున్నాను. అది తీర్చేవరకూ కొత్త ఋణం అడగొద్దు” అన్నాడు.
కొండచిలువ ఈ కథ చెప్పి, “మరిన్ని కథలు, పాటలు నేర్చినా సరే, మరబొమ్మ తనకొద్దని శివాంగుడు ఎందుకన్నాడు? పైగా తన దేశానికి కళాకారుల్ని పంపమన్నాడు కదా – అందువల్ల దేశంలో తను నిషేధించిన స్వేచ్ఛా వినోదాలు మళ్లీ పౌరులకు లభిస్తాయనీ, అందువల్ల దేశసంపద తరిగిపోతుందనీ తెలియదా? ఈ సందేహాలకి సరైన సమాధానం తెలిస్తే చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నేను నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.
దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “మనిషికి వినోదం కావాలి. ఆ వినోదాన్నిచ్చేది యంత్రమే ఐతే, దానికా విద్యలూ మనిషే నేర్పాలి. అంటే మనిషిలా మసిలే యంత్రం కూడా మనిషిమీదే ఆధారపడుతుంది. ఇక మనిషిలా మసిలే యంత్రమే మనిషికంత ఆనందాన్నిస్తే, ఆ అనందాన్నిచ్చేది మనిషే ఐతే ఆ అనుభూతి ఇంకా గొప్పది కదా! అందుకే రాజాంతఃపురంలో మరబొమ్మకంటే, సాటి మనుషులతో కలవడమే అందర్నీ ఎక్కువ సంతోషపెట్టింది. సుదీపుడు మరని మనిషిలా మార్చితే, తన విధానాలు మనిషిని మరగా మార్చాయనీ, మనిషికి సంపదకంటే సంతోషమే ముఖ్యమనీ గ్రహించడం వల్లనే శివాంగుడు, తన దేశంలోకి కళాకారుల్ని ఆహ్వానించాలనుకున్నాడు”
అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.
(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం నాల్గవ కథ)