అలనాటి అపురూపాలు-93

0
3

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

కరుణానిధి గురించి నిర్మాత ఎ.ఎల్.శ్రీనివాసన్ అభిప్రాయాలు:

[dropcap]క[/dropcap]రుణానిధి గారి గురించి ఆయన స్నేహితుడు, నిర్మాత ఎ.ఎల్.శ్రీనివాసన్ వెల్లడించిన అభిప్రాయాలు ఈ రచనలో ఉన్నాయి. ఇది 1969లో ఫిల్మ్‌ఫేర్‌లో ప్రచురితమయింది.

ఆయన మాటల్లోనే చదవండి:

“శ్రీ అన్నాదురై గారి లానే కరుణానిధి కూడా సినిమా అంటే వినోద మాధ్యమమే కాకుండా, రాజకీయ, సామాజిక సందేశాలను బలంగా వినిపించే సాధనం అని విశ్వసించారు. తన వయసు ఇరవైలలో ఉండగానే కరుణానిధి – సినిమానే వృత్తిగా మార్చుకున్న సినిమావాళ్ళతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు. సినిమాలకి, రంగస్థలానికి – బలమైన సంభాషణలు, స్క్రిప్టులు అందించడంలో ఆయనది అందె వేసిన చేయి. ‘అధికారంలోకి వచ్చిన వారికి, ఆ ఆధికారంతో ఏమేం చేయవచ్చో తెలుస్తుంది’ అని ఇటీవల ప్రెసిడెంట్ నిక్సన్ అన్నారని చదివాను. కరుణానిధి కూడా అలానే చేస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే సినిమా శాఖ ఆయన తన వద్దే ఉంచుకున్నారు, సినిమా రంగంలో చిరకాలంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారాలు చూపిస్తారని భావిస్తున్నాను.

మేమిద్దరం ఒకేలా సినీరంగం పట్ల ఆసక్తులయ్యాం. ఇద్దరం దానివల్ల లాభపడ్డాం. నేను నిర్మాత, పంపిణీదారుని అయ్యాను, ఆయన రచయిత, నిర్మాత అయ్యారు. నా సోదరుడు కన్నదాసన్ – అన్నా ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు, కానీ తరువాత కె. కామ్‌రాజ్ అనుచరుడై, కాంగ్రెస్‌ లోకి వెళ్ళారు. గత రెండేళ్ళుగా – రాష్ట్ర మంత్రిగా ఆయన, నేను నా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాం.

మేమిద్దరం మొదట 1947లో కోయంబత్తూరులో ఎ.ఎస్.ఎ స్వామి గారి జుపిటర్ ఫిల్మ్స్ వారి సెంట్రల్ స్టూడియోలో కలిసాం. అప్పట్లో నేను నా మొదటి సినిమా ‘పణం’ శివాజీ గణేశన్‌, పద్మినిలతో తీస్తున్నాను. ఆ సినిమాకి కరుణానిధి కథ, సంభాషణలు అందించారు. ప్రముఖ హాస్యనటులు ఎన్.ఎస్. కృష్ణన్ దర్శకత్వం వహించారు. తమిళ దేవతే స్వయంగా రాసినట్టు రాశారు కరుణానిధి.

తరువాత మేము వీలున్నప్పుడల్లా సేలంలో మోడరన్ థియేటర్స్‌లో కలుస్తుండేవాళ్ళం. ఆయన అప్పట్లో ‘మంతిరి కుమారి’, ‘తిరుంబిపార్’ అనే సినిమాలకి పనిచేస్తున్నారు. ఆయన ఎంతో సరదా మనిషి. అందరినీ ఉత్సాహంగా ఆహ్వానించేవారు. ఏ సమస్యనైనా ఇట్టే అర్థం చేసుకునేవారు, క్విజ్‍లలో రాపిడ్ రౌండ్‌లో ప్రశ్నలకి అతి తక్కువ సమయంలో జవాబులు చెప్పినట్టు, వెనువెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు. ఆయనలోని ఈ గుణం పట్ల జనాలు అబ్బురపడేవారు. నా సోదరుడు కన్నదాసన్ – అన్నా ఉద్యమంలో తిరుగుతూ, డి.ఎం.కె. ప్రతిపాదించిన ఆత్మగౌరవ పద్ధతితో వివాహం చేసుకోవాలనుకున్నాడు. మా తల్లిదండ్రులు బాధపడ్డారు. కరుణానిధి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కోరుకున్నట్టే మా సోదరుడి వివాహాన్ని సాంప్రదాయ పద్ధతిలో జరిపించారు. అదే విధంగా మా సోదరుడు కోరుకున్నట్టు ఆత్మగౌరవ పద్ధతిలో మరోసారి జరిపించారు. ఈ ఘటనతో మా తల్లిదండ్రులకి కరుణానిధి అంటే బాగా ఇష్టం పెరిగింది. ఆయన మా ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి ఆహ్వానించేవారు.

అన్నాకి, కరుణానిధికి భారతీయ పురాణాల మీద మంచి అవగాహన ఉండేది. అందువల్ల వారిద్దరూ 1950లలో తమిళ సినీరంగంలో అత్యధిక పారితోషికం అందుకునే రచయితలుగా ఉండేవారు. 1940వ దశకం మధ్యలో ఎప్పుడో కరుణానిధి ‘అభిమన్యు’ సినిమాకి కథ అందించారు. ఒక నిర్మాత ఆయన వద్దకు వచ్చి, ఆ టైటిల్‍ని వాడుకుంటానని అన్నాడు. అప్పుడు కరుణానిధి నాకేసి చూపిస్తూ, “ఆయన నాకు డబ్బు చెల్లించారు, కాబట్టి ఆ కథ ఆయనది” అన్నారు. ఇటువంటి అంశాలలో ఎంతో హుందాగా నడుచుకుంటారు. వీలైనంత తక్కువ సమయంలో సినిమాకి కథ/సంభాషణలు అందించేవారు. ఏవైనా సందేహాలుంటే నిర్మాత/దర్శకులను సంప్రదించి – వీలైనంత త్వరగా వారికి కథ/సంభాషణలు వ్రాసిన పుస్తకాన్ని అందిచ్చేవారు.

అన్నా ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ మినిస్టర్‌గా ఆయనకి సినిమాలతో సంబంధం లేదు. అయినా ఒకసారి ప్రభుత్వ స్థలంలో షూటింగ్ జరపడంలో మాకు సాయం చేశారు. షూటింగ్ చేసుకునేందుకు రోజుకు వెయ్యి రూపాయలు ఫీజుగా అధికారులు చెప్తే, దాన్ని రోజుకు మూడువందల రూపాయలకి తగ్గించారు.

మా సమస్యలను ఆయన పరిష్కరించగలరనే గట్టి నమ్మకం కలిగింది.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here