[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
‘‘అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా
యఃస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః’’
1964
[dropcap]అ[/dropcap]లంపురం క్షేత్రం తుంగభద్రా నదిలో ఎనిమిదేళ్ల కొడుకుతో సంధ్య వార్పిస్తున్నాడు మృత్యుంజయశర్మ. సంధ్యావందనంలోని మొట్టమొదటి శ్లోకం. అబ్బాయి పతంజలి శ్రద్ధగా ప్రతి మంత్రమూ పలుకుతున్నాడు. అతని నున్నని తలపై పంచశిఖలు, ఉదయపు కాంతిలో మెరుస్తున్నాయి.
సంధ్య పూర్తి చేసుకొని ఒడ్డెక్కారు తండ్రీకొడుకులు. సత్రంలో ఎదురు చూస్తున్నది వర్ధనమ్మ. పతంజలి తల్లి. భర్తకూ, కొడుక్కూ కాఫీ కలిపి యిచ్చింది. అంతకు ముందు ఐదురోజులు వైభవంగా జరిగింది పతంజలి ఉపనయనం. బంధువులందరూ వెళ్లిపోయారు. వీరి కుటుంబం మాత్రం మిగిలింది.
పతంజలికి ఒక అక్క ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. మధ్యాహ్నం భోజనాలు చేసి, అందరూ నాటు పడవల్లో కర్నూలు బయలుదేరారు. పడవలో అయితే ఇరవై నిమిషాల్లో నదిని దాటి కర్నూలు చేరుకోవచ్చు. కాని రోడ్డు మార్గం చుట్టూ తిరిగి వెళుతుంది. అలంపూరు నుండి పది పన్నెండు కిలోమీటర్లు వెళితే హైదరాబాదు – బెంగుళూరు జాతీయ రహదారిపై ‘అలంపూరు చౌరస్తా’ చేరుకొని, అక్కడి నుండి హైవే మీద మరో 10 కి.మీ పైగా ప్రయాణించాలి.
అందుకే నదిలో నీరు బాగా ఉన్నపుడు పడవల మీదే వెళతారు జనం. మనిషికి పావలా. ఎండాకాలంలో నడిచి వెళతారు. అవతలి వడ్డునే షిరిడీ సాయిబాబా దేవస్థానం. కొంచెం ముందుకు వెళితే సాయిబాబా టాకీసు. పావు కి.మీ దూరంలోనే కర్నూలు బస్టాండు.
పతంజలి చిన్న తమ్ముడు ‘పాణిని’ రెండేళ్లవాడు. సాయిబాబా గుడివద్ద జట్కాలు చూసి దాంట్లో వెళదామని మారాం చేయసాగాడు. వాడి ముచ్చట తీర్చడానికని అందరూ ఒక జట్కాలో బయలుదేరి బస్టాండుకు చేరుకున్నారు. గుర్రం పరుగెత్తుతూంటే పాణినితో సహా పిల్లలందరూ సంబరపడ్డారు.
అప్పటికింకా ఆర్.టి.సి బస్సులు రాలేదు. ప్రయివేటు బస్సులే కర్నూలు నుండి అనంతపురం వెళ్లే బస్సులో వెళితే ముప్ఫై కి.మీ దూరంలో ఉంటుంది. వాళ్ల ఊరు వెల్దుర్తి. జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది. పెద్ద ఊరే. మేజర్ పంచాయితీ. రైల్వేస్టేషన్ కూడ ఉంది. లోకల్ రైళ్లు (కర్నూలు – ద్రోణాచలం), ప్యాసింజరు రైళ్లు (ద్రోణాచలం – సికింద్రాబాదు) కాకుండా సికింద్రాబాదు – బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఆ ఊర్లో ఆగుతుంది.
అనంతపురం బస్సులు గంటకొకటి మాత్రమే ఉంటాయి. కర్నూలు బస్టాండ్ చాలా రద్దీగా ఉంది. అంతకుముందే ఒక బస్సు వెళ్లిపోయిందట. దాదాపు నలభై నిమిషాలు వేచి ఉన్న తర్వాత బస్సు వచ్చి నిలబడిరది.
‘‘డోన్ – గుత్తీ – అనంతాపూర్’’ అంటూ ‘ఏజంటు’ (టిక్కెట్లిచ్చేవాడు) అరుస్తున్నాడు. ముందుగా అనంతపురం ప్రయాణీకులకు, తర్వాత గుత్తి, తర్వాత ప్యాపిలి, తర్వాత డోన్, వీళ్లందరికీ ఇచ్చింతర్వాత సీట్లు మిగిలితే వెల్దుర్తి వాళ్లకిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఓవర్‌లోడ్ చేయరు.
శర్మగారి కుటుంబానికి ఎట్టకేలకు టికెట్లు దొరికినాయి. వాళ్లు ఇల్లు చేరుకునేసరికి దీపాలు పెట్టారు. వర్ధనమ్మ మడికట్టుకొని పెసరపప్పు మామిడికాయ, అన్నం చేసింది. శర్మ ప్రదోషపూజ చేసుకొని, పతంజలితో సాయం సంధ్య చేయించాడు. ‘అపవిత్రః పవిత్రోవా’ అన్న తొలిమంత్రం పలికించిన వెంటనే
‘‘నాన్నా! దీనికర్థమేమి?’’ అని అడిగినాడు పతంజలి.
‘‘పవిత్రుడయినా, అపవిత్రుడైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎవరయితే ఆ భగవంతుని చిత్తశుద్ధితో స్మరిస్తారో, వారు బయట లోపల కూడా పరిశుద్ధులే’’ అని వివరించాడు తండ్రి.
‘‘అంటే స్నానం చేయకపోయినా పూజ చేసుకోవచ్చా’’ అన్నాడు నూతన వటుడు.
‘‘దాన్నే వితండవాదమంటారు. అలాంటి ప్రశ్నలు వేయకూడదు’’ అని కోపగించుకొన్నాడు తండ్రి.
***
మృత్యుంజయశర్మది పెద్ద కుటుంబమే. పిత్రార్జితం ఒక పదెకరాలు, చెరువు కింద వరిమడి ఒక ఎకరా, నాలుగెకరాల వర్షాధారమయిన మెట్టపొలం ఆయనకు సంక్రమించినాయి. పదెకరాల పొలంలో నుయ్యి తవ్వించి, మోటారుపంపు వేసుకున్నారు. మూడు వందల నిమ్మచెట్లు ఐదెకరాల్లో కాపు కాస్తున్నాయి. మిగతా ఐదెకరాల్లో మిరప, కూరగాయలు లాంటివి పండిస్తారు. బావిలో నీరు సమృద్ధిగా ఉంటుంది.
చెరువు క్రింద వరిమడి వల్ల సంవత్సరానికి సరిపడా వడ్లు పండుతాయి. చెరువులో నీరు సరిపోతే రెండో కారు పంట కూడ పండుతుంది. మెట్ట పొలంలో వేరుశనగ వేస్తారు. వర్షాలు బాగాపడితే మంచి పంటే వస్తుంది. కంది పంట అక్కిళ్లు (వరసలు)గా వేస్తారు. పండితే కందిపప్పుకు కూడ లోటుండదు.
***
శర్మ పౌరోహిత్యం చేయడు. సొంతంగా వ్యవసాయమే. ఒక కాడి ఎద్దులు, రెండు ఆవులు ఉన్నాయి. వారి యిల్లు మట్టిమిద్దె. పైకప్పుకు టేకు దూలాలు వేసి, వాటిమీద వెదురు చాపలు పరిచి, వాటి మీద చవుడు మన్ను ఒకటిన్నర అడుగు మందాన పోస్తారు. అలాంటి నిర్మాణం కిటికీలుండవు. ‘గవాక్షాలు’ అని పై కప్పుకు ప్రతి గదికీ ఒక మూల ఉంటాయి. వాటి ద్వారా గాలి, వెలుతురు బాగా వస్తాయి. క్రింద బేతంచర్ల నాపబండలు పరచి ఉంటారు. ఇంటిముందు భాగాన్ని ‘పడసాల’ అంటారు. ఇంటి వెనుక వసారా దింపి పశువులను కట్టేస్తారు. ఒక మూలన గడ్డివాము.
ఇంటి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మంచి రోజులు చెప్పించుకుంటారు. లగ్న పత్రికలు కట్టించుకుంటారు. జాతకాలు, వాస్తు కూడ ఆయన చెబుతాడు. వారు తాంబూలంలో పెట్టి చిల్లర నాణేలు దక్షిణగా యిస్తారు. పదిపైసలు, పావలా, మహా అయితే అర్ధరూపాయి. ఏదో కనీసావసరాలకు లోటు లేకుండా నెట్టుకొస్తున్నాడాయన.
***
మరుసటి రోజు నుండీ ‘అగ్నికార్యం’ చేయించసాగాడు ఆయన పతంజలితో. వర్ధనమ్మ పశువుల వసారాలో ఒక మూల, గడ్డివామికి దూరంగా, ఆవు పేడతో రెండు చదరపు అడుగుల మేర అలికి ముగ్గు వేస్తుంది. ఒక కంచు ప్లేటులో బొగ్గులపొయ్యిలోని నిప్పులు తీసి ఇస్తే, సమిధలు (మేది, మోదుగ, కానుగ కర్రముక్కలు) దగ్గరుంచుకొని అగ్నితో సమిధలు వేస్తూ మంత్రాలు చదవాలి. చివర్లో అగ్నికి మూడు ప్రదక్షిణలు చేయాలి. అలా అగ్నిని ఆరాధించడం వలన తేజస్సు, యశస్సు, బుద్ధి, ప్రజ్ఞ, సంపదలు కలుగుతాయని పతంజలి తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. ఎర్రని పంచె కట్టుకొని, విభూతి కుంకుమ ధరించి, మోదుగ దండం ధరించి, పంచశిఖలతో అగ్నికి ప్రదక్షిణం చేసే పతంజలి సాక్షాత్తు వామనుడిలా ఉండేవాడు.
పతంజలి ఐదో తరగతికి వచ్చాడు. ఊరి బయట పాడుపడిన సత్రంలో ఎలిమెంటరీ స్కూలు నడిచేది. అందరికీ అదే బడి. సర్పంచ్ రామకృష్ణారెడ్డి కొడుకు దశరధరెడ్డి, ఆయిలు మిల్లు షావుకారు రామలింగ శెట్టి కొడుకు మధు, శశికళ, అల్లాబక్ష్, దస్తుమియ, అగస్టీను, వీళ్లంతా పతజంలి సహాధ్యాయులే.
యాగంటయ్యసారు, కొత్త మల్లయ్యసారు, పాత మల్లయ్య సారు టీచర్లు. ఒకటి నుండి ఐదు తరగతులన్నింటికీ వీళ్లే పాఠాలు చెప్పాలి. యాగంటయ్యసారు క్లాసుకు వస్తూనే షర్టు విప్పి కొక్కేనికి తగిలించి, కుర్చీ పక్కకు జరిపి, నేలమీద పడుకునేవాడు.
‘‘ఒరేయ్! ఎవరయినా ఇద్దరు మగవెధవలు ఇలా రండి!’’ అని ఆయన అన్నదే తడవుగా పతంజలి అల్లాబక్ష్ వెళ్లేవారు.
‘‘ఎక్కి తొక్కండ్రా’’ అన్న వెంటనే గోడ పట్టుకొని జాగ్రత్తగా, ఒడుపుగా ఆయన పాదాలు, పిక్కలు, తొడలు, నడుము, వీపు తొక్కుతుంటే, యాగంటయ్యసారు
‘‘ఆహా! దివ్యహ! అదీ! అట్లా!’’ అంటూ అరమోడ్పు కళ్లతో సుఖాన్ని అనుభవిస్తూనే, తెలుగు వాచకంలోని సుమతీ, వేమన శతకం పద్యాలు, భాస్కర శతకం పద్యాలు, ఇంకా పుస్తకంలో లేని పద్యాలు బిగ్గరగా పలికించేవాడు. 20వ ఎక్కం వరకు చెప్పించేవాడు.
పిల్లలు బిగ్గరగా అవన్నీ పలుకుతూ ఉంటే పరిసరాలు ప్రతిధ్వనించేవి. పొలాలకు వెళ్లేవాళ్లు ‘‘సారంటే యాగంటయ్య సారే! పిల్లలకు పజ్యాలు నేర్పినాడంటే తిరుగుండదు’’ అని మెచ్చుకొనేవాళ్లు. ఆయన చలువవల్లే పతంజలికి ఆ వయసులోనే దాదాపు వంద తెలుగు పద్యాలు కంఠతా వచ్చినాయి.
పాత మల్లయ్యసారు సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం చెప్పేవారు. ఎవరికీ నోటు బుక్కులుండేవి కావు. ఆ వూరి కరణం సుబ్బారావు దగ్గరికి వెళ్ళి 10(1), అడంగల్ ఫారాలు ఒక వైపు వ్రాసినవి, ఒకవైపు ఖాళీగా ఉండేవి, కరణానికి పనికిరానివి తెచ్చుకొని దబ్బనంతో బుక్కులా కుట్టుకునేవారు. అన్ని సబ్జెక్టులకూ అదే నోట్సు, పాత మల్లయ్యసారు సాత్వికుడు. పిల్లల్నేమీ అనేవాడు కాదు.
ఇక కొత్త మల్లయ్యసారు. చండశాసనుడు. ఆయనంటే పిల్లలకు చాలా భయం. లెక్కలు చెప్పేవాడు. అప్పుడు ఐదో తరగతి వరకు ఇంగ్లీషుండేది కాదు. అదేమిటో గాని పతంజలికి లెక్కలు సరిగ్గా వచ్చేవికాదు. కొత్త మల్లయ్యసారుకు చింత బెత్తాలు, ఈత బెత్తాలు మస్తాన్ అనే పిల్లవాడు తెచ్చిచ్చేవాడు. వాడు సరిగ్గా లెక్కలు చేయకపోతే వాడిని కూడ బాదేవాడాయన. అరచేయి వెనక్కు తిప్పమని, బెత్తంతో కొడితే వేళ్ల కణుపులు వాచిపోయేవి. వెల్దుర్తి ప్రజలు ఆయన్ను ఎక్కువగా గౌరవించేవారు.
‘‘కొట్టకపోతే, చదువెట్లావస్తాది’’ అని వాళ్ల నమ్మకం.
వీరాచారి అని కంసాలిపిల్లవాడొకడు నాల్గవ తరగతిలో ఉండేవాడు. వాడు ఎంత అల్లరివాడంటే టీచర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవాడు. పూర్తి శృతిమించిన తర్వాత వాడిని దారిలో పెట్టడానికి కొత్త మల్లయ్య సారు ఒక నిర్ణయం తీసుకొన్నాడు. వీరాచారి తండ్రి పరబ్రహ్మానికి కబురు చేశారు. ఆయన వచ్చి వినయంగా నిలబడ్డాడు.
‘‘ఏమయ్యా మీవాడు అంకెకు (కాడికి) రావడం లేదు. ‘కోదండం’ ఏపిద్దామనుకుంటాండా, ఏమంటావు?’’ అని అడిగినాడు కొత్త మల్లయ్య సారు. ‘‘నీ యిట్టం అయ్యవారు. పిల్లోని మంచి కోసమే గదూ నివు చెప్పేది’’ అని ఒప్పుకొన్నాడు కంసాలాయన.
మరుసటి రోజు పొద్దున వీరాచారి కాళ్లను తాళ్లతో కట్టేసి, తరగతి గది పైకప్పుకు తల కిందులుగా వేలాడదీసి, కింద చితుకులతో పొగరాజేసి, చింత బెత్తంతో అరికాళ్లమీద బాదసాగాడు సారు.
‘‘సారూ! నేను చచ్చిపోతా! నన్ను కొట్టవాకు! ఇంకెప్పుడూ అల్లరిజెయ్య. బుద్ధిగా సదువుకుంటా’’ అని వీరాచారి ఒకటే ఏడుపు. కాసేపటి తర్వాత వాడిని క్రిందకు దించినారు.
పిల్లలందర్నీ ‘కోదండం’ శిక్ష చూసేలా నిలబెట్టారు. అప్పట్నుంచి వీరాచారి దారిలోకి వచ్చాడు. దీని ప్రభావం ఇతర పిల్లల మీద కూడ పడిరది. బడికి బాగా కనపడేంత దూరంలో రైలు దారి ఉండేది. రైలు పోతున్నప్పుడు పిల్లలంతా కిటికీల దగ్గర చేరి ‘‘రై…..లు, రై…..లు’’ అని లయబద్ధంగా అరుస్తూ చూసేవారు. రైలు వెళ్లిపోయిన వెంటనే తమ స్థానాల్లో కూర్చునేవారు. సార్లు కూడ ఏమనేవారు కాదు. ఆ కాసేపు పాఠం చెప్పటం అపేసేవారు.
ఇటువంటి వాతావరణంలో జరిగింది పతంజలి ఎలిమెంటరీ స్కూలు చదువు.
***
వెల్దుర్తి ఒక అందమయిన ఊరు. ఒకవైపు పెద్ద చెరువు. దాని కింద సాగయ్యే వరి పొలాలు పచ్చగా ఉండేవి. మరోవైపు గ్రామ దేవత ఎల్లమ్మగుడి. ఊరి మధ్యలో రాములవారి దేవళం. శిల్పకళా సంపదగల గొప్ప రాతి కట్టడం ఉండేది. ఇంకా నంద్యాల రోడ్డులో శివాలయం. ఊరికి 4 మైళ్ల దూరంలో గొప్ప శైవక్షేత్రం ‘బ్రహ్మగుండం ఉండేది. చాలా పురాతన ఆలయం అది. ఊరి చుట్టూ అరటి తోటలు, మామిడితోటలు. ఊరిని ఆనుకొని ఒక ‘వంక’ (వాగు) ప్రవహించేది. అందులో అన్ని కాలాల్లో నీళ్లుండేవి. ఊరివాళ్లందరికి తాగు నీటికి ఆ వంకే ఆధారం. దానిలో చెలమలు తవ్వుకొని, ఊరిన నీటిని బిందెలతో కడవలతో తెచ్చుకునేవారు. ఊర్లో బావులుండేవిగాని వాటిల్లో ఉప్పునీరు ఉండేది. ప్రతి యింటి వారికి వంక నుండి మంచినీరు తెచ్చుకోవడం, ఉప్పునీరు తోడిపోసుకోవడం, వారి దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. చెలిమల దగ్గర ‘క్యూ’ లుండవు గాని, ఎవరు ముందొచ్చారు ఎవరు తర్వాత వచ్చారు అనే దాన్ని బట్టి, ‘వంతు’ల ప్రకారం పట్టుకొనేవారు. ఉప్పునీటి బావులకు గిలకలుంటాయి. కొబ్బరితాడు ఒక చివర చిక్కంగట్టి బిందె గొంతుకు బిగించి, దాని బావిలోకి వదిలి, నిండగానే పైకి చేదుకొంటారు. మట్టి కడవలు కూడ కంఠాల దగ్గర పగిలిపోయేవి కావు. పెద్ద పెద్ద కడవలను బుంగలంటారు. ఒక్కరితో చేదడం కష్టం కాబట్టి, ఇద్దరు పక్కపక్కన నిలబడి ఒకరి తర్వాత ఒకరు చేదేవారు. దాని చేదపట్టడం అనేవారు.
నంద్యాల వెళ్లే రోడ్డులో ఇనుప ఖనిజం గనులుండేవి. ఊర్లోని ధనవంతులు కమ్మలు, రెడ్లు, కోంటొండ్లు గనులను ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకొని, ఖనిజం కూలీలతో తవ్వించుకొని, సొంత లారీలలో వెల్దుర్తి రైల్వేస్టేషనుకు తరలించేవారు. అక్కడ వ్యాగన్లు బుక్ చేసి, కాకినాడ, బందరు ఓడ రేవులకు ఎగుమతి చేసేవారు. దాదాపు ఇరవై లారీలు, వాటి డ్రైవర్లు, క్లీనర్లు తవ్వే కూలీలు, లోడింగ్, అన్‌లోడింగ్ చేసేవారు ఇలా చాలామందికి ఉపాధి దోరికేది. ఊర్లో వ్యవసాయం పనులు కూడ ముమ్మరంగానే ఉండేవి. ఊరి చుట్టూ ఉన్న పొలాల్లో బోర్లు వేసి, బావులు తవ్వించుకొని, మోటార్ల ద్వారా సాగు చేసుకునేవారు.
ఇవి కాక ద్రోణాచలం – కర్నూలు లోకల్ రైలు చాలామందికి బ్రతుకు తెరువు చూపేది. దానిలో ఎవ్వరూ టికెట్ కొనేవారు కాదు. ఎవరూ అడిగేవారు కూడ కాదు. కర్నూల్లో జట్కా బండ్ల గుర్రాలకు గడ్డి మోపులు, కట్టెల మోపులు తీసుకుపోయి అమ్ముకొని వచ్చేవారు. పెట్టెల్లో వేస్తే ప్రయాణీకులకు ఇబ్బంది కాబట్టి, కొలిమిలో ఇనుప హుక్స్ లాంటివి చేయించి మోపుకు ఒకవైపు, రైలు కిటికీకి ఒక వైపు తగిలించేవారు. రైలు పొడవునా ఇవే.
ఊర్లో సాయబుల మసీదు ఉండేది. వారు కూడ అధిక సంఖ్యలోనే ఉండేవారు. ఎప్పుడైనా మేళతాళాలతో పెళ్లి ఊరేగింపులు, దేవుని ఊరేగింపులు మసీదు ముందు వెళితే, మేళతాళాలు ఆపేసి నిశ్శబ్దంగా వెళ్లేవారు. ఆ మసీదు దాటేంతవరకు. ఎందుకని ఎవరూ అడిగేవారు కాదు. పీర్ల పండుగ వస్తే హిందువు కూడ ‘సాయిసోం’ తొక్కేవారు. ఒక గుంతతీసి దాంట్లో అగ్నిగుండం చేసి చుట్టూ కర్రలు పట్టుకొని లయబద్ధంగా చేసే నృత్యమే ‘సాయిసోం’ ఇమాం, చాంద్‌పీర్, ఇలా పీర్ల పేర్లు కూడ అందరికీ తెలుసు. రంజాన్ లాంటి పండుగలొస్తే సేమ్యాఖీర్ హిందువులకు కూడ తెచ్చిచ్చేవారు. వారు ప్రీతిగా తాగేవారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణానికి ముస్లిం పెద్దలు పెద్ద ఖాజా, పకీరప్ప, ఖాదర్‌వలీ సాబ్‌లు కూడ వచ్చేవారు. వారిని కూడ సాదరంగా ఆహ్వానించి కూర్చో పెట్టేవారు. మాదిగ గేరి (వీధి) కూడ ఊరిలో భాగంగానే ఉండేది. అక్కడ హరిజనులందరూ క్రైస్తవ మతం తీసుకున్నవారే. వారి పేర్లు కూడ క్రైస్తవ పేర్లే అయినా నోరు తిరగక అవి ఇంకోరకంగా మారినాయి. ఆంబ్రోస్‌ను అవురోజు అని బెన్‌ను బెన్నిగాడని, డేవిడును దావీదని, పిలుచుకునేవారు. మాదిగ గేరిలో ఒక చర్చి, దానికొక పాస్టర్ ఉండేవారు. ఆయన పేరు ఇమాన్యుయేల్ రాజు అయితే ఆయన్ను ఇమ్మనీలు అనేవారు. ఆయన కొడుకే అగస్టీన్. పతంజలి క్లాస్‌మేట్. పాస్టరు గారు కూడ పంచాంచ శ్రవణానికి వచ్చి కూర్చొనేవారు. హరిజనులంతా రెండు సంప్రదాయాలనూ పాటించేవారు. మంచిరోజు, ముహూర్తాలు పాటించేవారు. పకీరప్ప ‘వాస్తు’ కూడ చెప్పేవాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభలకు విలేఖరిగా పనిచేసే వాడు పకీరప్ప. అన్ని మతాల వాళ్లూ, కులాల వాళ్లూ వరసులు పెట్టి ‘బావా’, ‘మామా’, ‘చిన్నాయనా’, ‘అత్తా’, ‘పిన్నమ్మా’ అని పిలుచుకునేవారు. ఎదుటివారి సంప్రదాయాలను గౌరవించేవారు. మతసామరస్యం వెల్లివిరిసిన కాలమది.
***
1966
ఐదవ తరగతి పరీక్షలయిపోయినాయి. సెలవుల్లో పతంజలికి దేవతార్చన, నమక చమకాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, మహన్యాసం నేర్పించసాగాడు తండ్రి. రోజూ తోటకు వెంట పెట్టుకొని వెళుతూ, మంత్రాలను స్వరబద్ధంగా పలికించేవాడు. ఆయన చెప్పే ప్రతి ముక్కనూ రెండుసార్లు పలికించేవాడు. అలా సెలవుల్లో అవన్నీ నేర్చుకున్నాడు పతంజలి.
చెల్లెలు మహిత అంటే ఎంతోముద్దు అన్నయ్యకు. తన కంటె రెండేళ్లు చిన్నది. తర్వాత తమ్ముడు మల్లినాథ. సంస్కృతంలో పంచ కావ్యాలకు ‘దీప శిఖావ్యాఖ్య’ వ్రాసిన మహా పండితుడు మల్లినాధ సూరి అంటే మృత్యుంజయ శర్మకు అభిమానం. ఆయన పేరు పెట్టుకున్నాడు చిన్నవాడు సరే పాణిని. సంస్కృతంలో గొప్ప వ్యాకరణవేత్త పేరది.
ఎండాకాలం వ్యవసాయ పనులు లేనపుడు, కుటుంబ పోషణ కోసం చుట్టు పక్కల ఊర్లలో పురాణాలు చెప్పేవాడు మృత్యుంజయ శర్మ. ఇల్లు తాళం వేసుకొని బండి కట్టించుకొని ఏ ఊరివారు పిలిస్తే ఆ వూరికి అందరూ వెళ్లేవారు. వంట పాత్రలతో సహా. అక్కడ ఏదో సత్రంలోనో, దేవాలయం చావిడిలోనో ఉంటూ సాయంత్రాలు పురాణ పఠనం చేసేవాడాయన. గొంతు శ్రావ్యంగా, కంచు మోగినట్లుండేది. సంగీతంలో కూడ కొద్దిగా ప్రవేశం ఉంది. పద్యాలకు రాగాలు కూర్చి పాడుతూ ఉంటే పల్లెజనం ముగ్ధులయ్యేవారు. మైకు కూడ లేని రోజులవి. ఐదారువందల మందికి స్పష్టంగా వినిపించేదాయన కంఠం. పిల్లలు హాయిగా ఆడుకొనేవారు. వాగ్దేవి తమ్ముళ్లకు, చెల్లెలికి చదువు చెప్పేది. స్నానాలు చేయించేది. తలలు దువ్వేది. అమ్మకు వంటలో సహాయం చేసేది. రాత్రి 8 గంటలకు ప్రారంభమై దాదాపు 11 గంటల వరకు సాగేది పురాణం. అలా ఒక నలభై రోజులు (మండలం అంటారు) చెప్పిన తర్వాత ‘పట్టీ’ పెట్టేవారు ఊరి పెద్దలు. పట్టీ అంటే పౌరాణికునికి ప్రజలు చదివించే కానుకల జాబితా. పది రూపాయల నుండి నూట పదహార్ల వరకు, వారి వారి స్తోమతను బట్టి చదివించేవారు. కొందరు బియ్యం, కందిపప్పు, పెసరపప్పు మొదలైనవి మూటలు కట్టి ఇచ్చుకునేవారు. అలా ప్రతి ఊరిలో ఏడెనిమిది వందలు పైకం, ధాన్యం వచ్చేవి.
***
ఆశువుగా ఛందోబద్ధంగా పద్యాలు, అల్లే నేర్పు కూడ మృత్యుంజయ శర్మకు ఉండేది. అడపాదడపా అష్టావధానం కూడా చేసేవాడాయన. ఆయన పురాణం చెప్పినా, అష్టావధానం చేసినా పతంజలి ఉండాల్సిందే. అలా చిన్న వయసులోనే పురాణాలు, ఇతిహాసాలు, సమస్యాపూరణ, దత్తపది, మొదలయిన వాటిపై పతంజలికి చక్కని అవగాహన వచ్చింది.
తండ్రి అంటే ఎంతో ప్రేమ ఆ పిల్లవాడికి. ఆయన గంభీరంగా ఉండేవాడు. పిల్లలను గారాబం చేసేవాడు కాదు. తల్లిదండ్రుల కులాల పట్టింపు ఆ చిన్న మనసుకు అర్థం అయ్యేది కాదు. ఊహ తెలిసినప్పటినుండి అటువంటి వాతావరణంలో పెరిగినా, ఎందుకో అది అసహజంగా అనిపించేది. జీతగాళ్లు తోటలోని ఇంజను రూము తాళాలు తెచ్చి యిస్తే వాటిమీద నీళ్లు చల్లి తీసుకునేవారు. ఆఖరికి తాంబూలాల్లో పెట్టిన దక్షిణ పైసలపై కూడ నీళ్లు చల్లుకోవలసిందే.
‘మడి’ విషయంలో కూడ పతంజలికి అనుమానాలుండేవి. తల్లీ తండ్రీ మడికట్టుకుంటే పిల్లలను కూడ ముట్టుకోనివ్వకపోవడం విచిత్రంగా తోచేది. ‘‘అపవిత్రః పవిత్రోవా’’ అనే సంధ్యావందన మంత్రం, తండ్రి దానికి చెప్పిన అర్థం గుర్తుకు వచ్చేవి.
బ్రాహ్మణేతరులు ఎంత ధనవంతులైనా పడసాలలో చాపమీద కూర్చునేవారు. వారికి గ్లాసుల్లో కాఫీ యిస్తే తాగింతర్వాత నీళ్లుపోస్తే శుభ్రంగా తొలిచి బోర్లించి పెట్టేవారు. వాటిమీద నీళ్లు చల్లి తీసుకోవాలి. ఇలాంటి కరడుకట్టిన సంప్రదాయం పతంజలి యింట్లో రాజ్యమేలేది.
***
ఎండాకాలం సెలవుల తర్వాత బళ్లు తెరిచినారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో చేరాడు పతంజలి. హైస్కూలు ఒక వేరుశనగ నూనెమిల్లు. వినియోగంలో లేని దాంట్లో నడిచేది. దాన్ని ‘జిన్ను’ అనేవారు. పెద్దపెద్ద వరండాలను తడికలతో విభజించి తరగతి గదులేర్పాటు చేశారు. పిల్లలు కూర్చోవడానికి బెంచీలు, బల్లలు ఉంటాయి. ప్రతి సబ్టెక్టుకు ఒక టీచరు. పీరియడ్ల ప్రకారం బోధన. మధ్యాహ్నం భోజన విరామంలో యింటికి వెళ్లి అన్నం తిని వచ్చేవాడు పతంజలి. ఉదయం వచ్చేటప్పుడు సద్దన్నం మజ్జిగతో తిని వచ్చేవాడు. టిఫిన్లనేవి అసలు తెలియవు.
హైస్కూల్లో 6వ తరగతి నుండి ఇంగ్లీషు నేర్పేవారు. అక్షరాలు, పదాలు, చిన్న చిన్న వాక్యాలు నేర్చుకునేవారు పిల్లలు. ఇంగ్లీషు చెప్పడానికి ‘డేనియల్’ అనే సారుండేవాడు. ఆయన్ను ‘ధనియాలసారు’ అని పిలిచేవారు. టెక్స్ట్ బుక్కులు నోటు బుక్కులు వచ్చాయి! పెన్ను కూడ. ఇంకుపెన్ను వాడేవారు. స్క్రూ తీసి పిల్లరుతో ఇంకు పొసుకోవాలి. ‘నిబ్’తో వ్రాయాలి అది కాగితాన్ని అప్పుడపుడు కరుస్తుంటుంది. నిబ్బు విరిగిపోతే ఐదుపైసలిస్తే కొత్తది దొరుకుతుంది. ఒక్కోసారి యింకు లీకై పై జేబుకు నీలంగా పెద్ద మరకపడేది. ఆరు ఏడు తరగతులకు సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులు, 8, 9, 10 తరగతులకు బి.యిడి టీచర్లు చెప్పేవారు.
ఒకరోజు లీజరు పిరియడ్లో పతంజలి చదివే ఆరవతరగతి ‘బి’ సెక్షన్‌లో సారు ఎవరూ లేక పిల్లలంతా గోలగోలగా అరుచుకుంటున్నారు. వరండాలో తిరుగుతున్న పెద్దసారు (హెడ్‌మాస్టర్) లోపలికొచ్చి, డస్టరుతో బల్లమీద కొడుతూ ‘సైలెన్స్’ అని అరిచేసరికి పిల్లలంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు.
ఇంగ్లీషు వాచకం అడిగి తీసుకున్నారు ఆయన. బోర్డుమీద కొన్ని పదాలు వ్రాసి కొందర్ని లేపి చదవమన్నారు. పతంజలి ఉత్సాహంగా చదివాడు కొన్నింటికి స్పెల్లింగులడిగాడు. పతంజలి కరెక్ట్‌గా చెప్పాడు.
‘‘వెరీగుడ్! ఎవరబ్బాయివి నువ్వు?’’ అనడిగాడాయన.
‘‘మృత్యుంజయ శర్మగారబ్బాయిని సార్’’ అని వినయంగా జవాబిచ్చాడు పతంజలి.
‘‘ఇంగ్లీషులో బాగా కృషి చేయవోయ్! బాగా చెబుతున్నావు’’ అని చెప్పాడు పెద్దసారు. ఆయన పేరు రామ కోటేశ్వరరావు. బ్రాహ్మడు. ఆయన ప్రశంస, సూచన మనసులో నాటుకు పోయాయి పతంజలికి. ఇంగ్లీషుపై అభిరుచి ఏర్పడిరది.
***
బడి వదలగానే ఇంటికి పరిగెత్తుకొని వెళ్లి, బడి బట్టలు విప్పి, వేరే బట్టలు కట్టుకొన్నాడు పతంజలి. పడసాలలోనే దూరదూరంగా రెండు కొక్కేలు ఉంటాయి. ఒకటి ‘మైల’ బట్టలకు ఒకటి ‘మంచి’ బట్టలకు నిక్కరు అంగీ వేసుకొనేవాడు. స్కూలుకు మాత్రం యూనిఫాం ఉండేది. ఖాకీ నిక్కరు తెల్లంగీ.
‘‘అమ్మా! ఆకలేస్తుంది! ఏమయినా పెట్టవే!’’ అంటూ లోపలికి వెళుతూనే మేనత్త, పిల్లలు ఉండటం చూశాడు. పరమానందపడ్డాడు.
‘‘అత్తా! ఎప్పుడొచ్చినారు?’’ అని అడిగాడు.
‘‘రారా అల్లుడా!’’ అని ఒళ్లో కూర్చోబెట్టుకుంది మేనత్త. మృత్యుంజయ శర్మ చెల్లెలు. ఆమె వెంట తొమ్మిదేళ్ల వసుధ, ఐదేళ్ల భరత్ కూడ వచ్చారు. వీళ్లు కాక ఆమెకు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు, పెద్దవాళ్లున్నారు అందరికంటే పెద్ద పిల్ల వసుంధర. ఆమెకు పద్నాలుగేళ్లకే పెళ్లి చేశారు. తర్వాతది అఖిల. 7వ తరగతి. వాళ్లు రాలేదు. మేనత్త పేరు లక్ష్మి అయితే ‘లక్షమ్మ’గా మారింది. ‘లక్షమ్మత్త’గా ఆమెను పతంజలి వాళ్లు పిలుస్తారు. భరత్ పుట్టిన కొన్ని నెలలకే ‘మామ’ చనిపోయాడని తెలుసు పతంజలికి. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. వాళ్లు ప్రొద్దుటూరులో ఉంటారు. వాళ్లు పతంజలి వాళ్లలాగా దిగువ మధ్య తరగతి వారు కాదు. ఆస్తి పాస్తులున్నవారు.
వసుధ సన్నగా ఉంది. లంగా జాకెట్టు కనకాంబరం రంగులో మెరుస్తున్నాయి. మెడలో సన్నని బంగారు గొలుసు. పెద్ద కళ్లు, చక్కని జుట్టు రెండు జడలు వేసుకొని అందంగా ఉంది.
‘‘ఏమే! వసుధా! బావను మరిచిపోయావా? ఎప్పుడో మీ పెద్దక్క పెళ్లిలో చూసి ఉంటావు’’ అన్నది అత్త.
‘‘ఏం మర్చిపోలేదు లే. పతంజలి బావ కదూ.’’ అన్నదాపిల్ల పతంజలిని అభిమానంగా చూస్తూ. ఎందుకో ఆ పిల్లను చూస్తుంటే యింకా చూడాలనిపిస్తుంది పతంజలికి.
‘‘రాండి! ఆడుకుందాం!’’ అని పిలిచాడు మరదలినీ, బావమరిదినీ. ముగ్గురూ మిద్దెమీదికి వెళ్లి ఆడుకున్నారు. వాళ్ల మిద్దెమీది నుండి వచ్చేపోయే రైళ్లు కనిపిస్తాయి.
‘‘అమ్మో! బావా! ఎన్ని రైళ్లో! మా ఊర్లో అయితే రైలే లేదు. ఎక్కడికెళ్లినా బస్సుల్లోనే’’ అంది వసుధ.
‘‘అవును. మా ఊరికి రైళ్లెక్కువ’’ అన్నాడు పతంజలి.
అత్త ఉన్న వారం పదిరోజులూ పది క్షణాల్లా గడిచాయి పతంజలికి. వర్ధనమ్మ పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకొని, పెద్ద కంచంలో అవకాయ, పప్పు ముద్దలు కలిపి చేతుల్లో పెడుతుంటే చక్కగా తినేవారు. ప్రొద్దుటూరు విశేషాలు వసుధ చెపుతుంటే ఆశ్చర్యంగా వినేవాడు పతంజలి అది పెద్దటవును, సినిమా హాళ్లు, కొళాయిల్లో నీళ్లు రావడం, ఎక్కడికయినా వెళ్లాలంటే రిక్షాలు, పెద్ద పెద్ద బంగారం, బట్టల అంగళ్లు, అబ్బో! ప్రొద్దుటూరు అంటే ఒక భూతల స్వర్గంలా అనిపించేదా పిల్లవానికి. మేనత్త వెళ్లిపోయింతర్వాత యిల్లంతా బోసిపోయినట్లయింది. ముఖ్యంగా వసుధ ముఖం మాటిమాటికి గుర్తుకు రాసాగింది.
ఆరవ, ఏడవ తరగతులు ఉత్తీర్ణుడై ఎనిమిదో తరగతిలోకి వచ్చాడు పతంజలి. అప్పటికి SSLC ఉండేది. స్కూలు ఫైనల్ అన్నమాట. తర్వాత ఒక సంవత్సరం P.U.C. తర్వాత మూడేళ్లు డిగ్రీ. 11+1+3 విధానం. డిటెన్షన్ విధానంలో ప్రతి తరగతి పాస్ అవ్వాల్సిందే. పతంజలి ఎనిమిదికి వచ్చినా కొందరు అతని క్లాస్‌మేట్స్ ఆరులోనే ఉండిపోయారు. విద్యా విధానం ఎంత పారదర్శకంగా ఉండేదంటే చివరి పరీక్షల పేపర్లు ఆ స్కూలు టీచర్లే దిద్ది పిల్లలకిచ్చేవారు. పాస్ కానివాళ్లు మళ్లీ ఆ తరగతి ఇంకో సంవత్సరం చదవవలసిందే. ఊర్లో పలుకుబడిగల పెద్దలయినా, టీచర్లను ప్రలోభపెట్టిగానీ, ఒత్తిడి తెచ్చిగానీ మార్కులు తమ పిల్లలకు వేయించుకొనేవారు కాదు. క్లాసు రూంలో టీచర్లు అందర్నీ సమానంగా చూసేవారు. తిట్టేవారు, కొట్టేవారు. అది పిల్లల బాగుకోసమే అని తల్లిదండ్రులు నమ్మేవారు.
ఎనిమిదిలో పతంజలికి నిక్కరు పోయి ప్యాంటు వచ్చింది. సంధ్యా వందనం రోజూ చేసుకునేవాడు. అగ్ని కార్యం మాత్రం ఆగిపోయింది. మొత్తానికి అగ్నికార్యం నాలుగేళ్లు చేసుకున్నాడు. ఆదివారాలు సెలవురోజుల్లో దేవతార్చన చేసేవాడు.
ఎనిమిదో తరగతికి క్లాసు టీచరు శంకరయ్యసారు. ఆయన ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ చెప్పేవాడు.
(సశేషం)