జ్ఞాపకాల తరంగిణి-24

1
3

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]మా[/dropcap] మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణ తిరుపతి వార్త పత్రిక స్థానిక సంపాదకులుగా ఉండేవారు. వారు, వారి మిత్రులు భూమన్, సాకం నాగరాజ, త్రిపురనేని మధుసూధనరావు మరికొందరు తిరుపతిలో నూరేళ్ళ కన్యాశుల్కం పండుగ ఏడాది పొడవునా చేశారు.

తిరుపతి నూరేళ్ళ కన్యాశుల్కం సభలో త్రిపురనేని, భూమన్, సాకం నాగరాజ, మొదటి వ్యక్తిపెన్నేపల్లి

వారం వారం ఏదో ఒక విద్యాసంస్థకు వెళ్ళి విద్యార్థులకు కన్యాశుల్కం ఒక ఘట్టం చదివి వినిపించేవారు. ఊరేగింపులు సభలు జరిపేవారు. ఆ ఏడాది చివర్లో ఎస్.వి. యూనివర్సిటీ ఆడిటోరియంలో రెండు రోజులు కాబోలు గురజాడ మీద సెమినార్ నిర్వహించారు. ఒక సెషన్‌కు నేను అధ్యక్షుణ్ణి. కేవిఆర్ ప్రోత్సాహం, వారి మహోదయం నన్ను గురజాడ పిచ్చి అభిమానినిగా మార్చింది.

నెల్లూరులో ఎనిమిది గంటల కన్యాశుల్కం పూర్తి నాటక ప్రదర్శన:

2013-ఫిబ్రవరిలో కాబోలు విశాఖపట్నం పోర్టు ట్రస్టు థియేటర్‌లో కన్యాశుల్కం సమగ్రంగా, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఎనిమిది గంటల ప్రదర్శన మరొక పర్యాయం ఏర్పాటయింది. ఆ ప్రదర్శన ఏర్పాటు చేసిన మిత్రులు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి, విశాఖలో నాకు ఏర్పాట్లన్నీ చేశారు. నాటక ప్రదర్శన మధ్యాహ్నం రెండు గంటలకు ఆరంభమై రాత్రి పదిగంటలకు ముగిసింది. నిర్వాహకులు నన్ను స్టేజి మీదకు ఆహ్వానించి ప్రత్యేకంగా గౌరవించారు కూడా. ఈ ప్రదర్శన మళ్ళీ ఏప్రిల్‌లో హైదరాబాదు రవీంద్ర భారతిలో జరిగింది. నా మిత్రులు, సింహపురి రైతు మాసపత్రిక సంపాదకులు నిరంజన్ రెడ్డిగారు ప్రదర్శన చూచి వచ్చి మనం కూడా నెల్లూరులో కన్యాశుల్కం ప్రదర్శన ఏర్పాటు చేద్దామని పట్టుపట్టారు. ఎం.ఎల్.సి విఠపు బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని విరాళాలు సేకరించాలనుకొన్నాము. ఆచార్య ఆదిత్య మా కమిటీ అధ్యక్షులు. కోటిరెడ్డి కోశాధికారి. చలంచర్ల భాస్కరరెడ్డి కార్యదర్శిగా, నేను సహాయకార్యదర్శిగా వ్యవహరించాము. మా కమిటీ సభ్యులు ఒక్కొక్కరు పదివేలు డొనేట్ చేయడంతో రెండు లక్షలు తేలికగా సమకూడింది. రైస్  మిల్లర్సు అసోసియేషన్ 50 వేలు డొనేషన్ ఇచ్చింది. కమిటీ సభ్యుల పలుకుబడితో భోజనాలు, హోటల్ వగైరాలన్నీ ఏర్పాటయ్యాయి. 2014 సెప్టెంబరు 21న గురజాడ 152వ జయంతి రోజు ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకున్నాము. విజయనగరం నుంచి నాటక దర్శకుడు కిషోర్ బృందం ముందుగా వచ్చి నెల్లూరులో నాటక ప్రదర్శనకు అనువైన ప్రదేశాలన్నీ పరిశీలించి దర్గామిట్టలోని ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కస్తూర్బా నాటకశాల అనుకూలంగా ఉన్నదని ఎంచుకొన్నారు. జిల్లా కలెక్టర్ హాలు బాడుగ, కరెంటు ఛార్జీలు వగైరా సుమారు 70 వేల రూపాయలు మావద్ద వసూలు చేయకుండా ఆర్డరు వేశారు.

నాటకంలో నటులు, టెక్నీషియన్లు అందరూ కలిపి 61 మంది వస్తున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు. నాటక నిర్వాహకులకు అనుకున్న ప్రకారం రెండు లక్షలా ఏభై వేలు ముందుగా చెల్లించాము. అందరికీ ఉండడానికి అవసరమైన హోటళ్ళు ఏర్పాటు చేశాము. నాటక ప్రదర్శనకు ఒకరోజు ముందు అందరూ నెల్లూరు చేరారు. తమకు రిహార్సల్స్‌కు అనుకూలంగా ఉంటుందని తెల్లవారి బృందం మొత్తం ప్రదర్శన శాలలోనే ఉండడానికి తీర్మానించుకొని బిచాణా ఎత్తివేశారు. ఫలహారాలు, తిండి అన్నీ నాటకశాల వద్దకే పంపే ఏర్పాట్లు జరిగాయి. మా కమిటీ సభ్యులు డాక్టర్ పులిగండ్ల చంద్రశేఖర్ తమ క్లైంట్ చేత భోజనాల ఏర్పాట్లు చేయించారు.

సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు అసలు నాటకానికి వస్తారా, ఎనిమిది గంటల ప్రదర్శన చూస్తారా అనే సందేహం మా అందరిలోనూ వుంది. మా కమిటీలో కొందరు నాటక ప్రదర్శన గురించి సినిమాలకు మాదిరే పోస్టర్లు, హొర్డింగులతో జిల్లా అంతా ప్రచారం చేశారు. ఆఫీసులకు, విద్యాలయాలకు కరపత్రాలు వెళ్ళాయి. ఇంత ప్రచారం ఏ నాటకానికి ఇటీవల కాలంలో జరిగివుండదు.

కన్యాశుల్కం హోర్డింగ్

మధ్యాహ్నం 12గంటలకు కూడా జనం వస్తారా రారా అని కార్యకర్తలం వితర్కించుకొంటూ సందేహంతో కొట్టుమిట్టాడుతున్నాము. మెల్లమెల్లగా జనం రావడం మొదలయింది. కొందరు పెద్దవాళ్ళు ఫ్లాస్కులు, మంచినీళ్ళు, ఫలహారాలు వెంట తెచ్చుకొన్నారు. మద్రాసు, బెంగుళూరు వంటి దూరప్రాంతాలనుంచి కూడా ప్రేక్షకులు వచ్చారు. ప్రొఫెసర్ మొదలి నాగభూషణశర్మ కంటి ఆపరేషన్ చేసుకున్న పదిహేనో రోజు ప్రదర్శన కోసం బెంగుళూరునుంచి వచ్చారు. వారి కోసం ఏర్పాట్లు చేశాము. మద్రాసు రేడియోలో పనిచేస్తున్న నాగసూరి వేణుగోపాల్ దంపతులు వచ్చారు.

8 గంటల కన్యాశుల్కం ప్రదర్శనలో దీపం వెలిగించడం

మధ్యాహ్నం 2 గంటలకల్లా హాలు నిండిపోయింది. సరిగ్గా రెండుగంటలకే నాటకం ఆరంభమైనా, కాసేపటికే నాటకంవాళ్ళు ఏర్పాటు చేసుకున్న మైకులు సరిపోక వెనుక వైపు కూర్చొన్నవారికి డైలాగులు వినిపించక అల్లరి మొదలైంది. మావాళ్ళు ఏంచేశారోగాని అరగంట లోపలే చాలా శక్తివంతమైన మైకులు తెప్పించి రంగస్థలంలో, పెట్టించారు. హాల్ నిండిపోతోంది కాబట్టి ముందుచూపుతో అప్పటికప్పుడు పెద్ద టి.వి. స్క్రీన్ కారిడార్‌లో ఏర్పాటు చేసి, కేంటీన్ పెట్టించారు కనక సీట్లు దొరకని ప్రేక్షకులు హాయిగా కాఫీలు, టీలు, ఫలహారాలు సేవిస్తూ టివి ముందు వేసిన ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చొని నాటకం చూశారు. ముఖ్య అతిథులు జిల్లా కలెక్టరు దంపతులు నాటకం కొసదాకా ఉండి నటుల కోరికను మన్నించి రంగస్థలం మీద నటీనటులతో ఫొటోలకు నిలబడ్డారుకూడా!

ఎనిమిది గంటల ప్రదర్శనలో రెండు పర్యాయాలు 15 నిమిషాల విరామం ఇచ్చాము. మా అంచనాలకు మించి జనం రావడం వల్ల కార్యకర్తలం స్టేజి ముందు, మెట్లమీద అక్కడక్కడా నిలబడి ప్రదర్శన చూడవలసి వచ్చింది.

చివరి అరగంట సౌజన్యరావు, మధురవాణి సంవాదం సాగుతున్నపుడు హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండిపోయింది.

మధురవాణి
నెల్లూరులో 8 గంటల కన్యాశుల్కం పూర్తి నాటకం ప్రదర్శన. 21 సెప్టెంబర్ 2014
పూటకూళ్ళమ్మ, రామప్పపంతులు

నాటకం అనుకున్నట్లే పదిన్నరకల్లా ముగిసింది, standing ovation మధ్య. నాటకంలో వెంకటేశం పాత్ర ధరించిన బాబు అనాథాశ్రమంలో ఉంటాడట. అతని పేర పదివేలు బాండు బహూకరించాము. మేము లెక్కలు చూచుకొన్నపుడు మిగిలిన నలభైవేలు కాబోలు నాటకం ప్రదర్శించిన సంస్థకే బహూకరించాము. వాళ్ళు అప్పటికే ఐదారు ప్రదర్శనలిచ్చారు కాని, నెల్లూరులో జరిగిన ఏర్పాట్లు, నిర్వహణ ఎక్కడా జరగలేదని మమ్మల్ని అభినందించారు. చాలా కాలం నెల్లూరులో మేం కార్యకర్తలం ఎక్కడ కనపడినా మమ్మల్ని కన్యాశుల్కం బ్యాచ్ అని పిలిచేవారు. మా జీవితాల్లో మరచిపోలేని అనుభవం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం. మా కృషి వల్ల రెండేళ్ల తర్వాత గుంటూరులో మిత్రులు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, అయ్యన్ రావుగారు ఖర్చు భరించి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదే చివరి ప్రదర్శన. నెల్లూరు నుంచి మా కన్యాశుల్కం బ్యాచి గుంటూరు వెళ్ళి మరొకసారి నాటకం చూశాము. ఈ ప్రదర్శనలో నటించిన నటులా గొప్ప పేరుప్రఖ్యాతులున్నవారు కాదు, ఎనిమిది గంటల నాటకాన్ని ప్రేక్షకులు ఎట్లా చూడగలిగారు? అని ప్రశ్నించుకొన్నపుడు మహాకవి గురజాడ అప్పారావు గారి నాటకంలోని జీవశక్తే ప్రేక్షకులను కట్టిపడేసిందని అనుకోక తప్పిందికాదు.

కన్యాశుల్కం శతజయంతిని పురస్కరించుకుని నెల్లూరు టౌన్ హాల్లో సభ ఏర్పాటు చేసి విజయనగరం నుంచి ఉపాధ్యాయుల నరసింహమూర్తిని ఉపన్యాసకులుగా ఆహ్వానించాము. వారు చాలా చక్కగా ఉపన్యసించారు. రాజాంలో వెలుగు రామినాయుడు కన్యాశుల్కం శతజయంతిని ఏడాది పాటు నెలనెలా సభలు జరిపి నిర్వహించారు. రెండవ నెలలోనే నన్ను రాజాంకు ఆహ్వానించారు. మా దంపతులం పార్వతీపురం వెళ్ళి అక్కడ బ్యాంకు మేనేజరుగా చేస్తున్న నా శ్రీమతి మేనల్లుడి ఇంట్లో దిగాము. ఆ దంపతులు మేము రాజాం వెళ్ళి సభలో పాల్గొన్నాము. ఆరోజు ఉపాధ్యాయుల నరసింహమూర్తి గారు సభాధ్యక్షులు. గురజాడ రాత ప్రతులను అధ్యయనం చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలను గురించి, గురజాడ వాడిన మాండలిక భాషలో చిక్కులను గురించి వివరించాను. ‘ఊటగెడ్డ’ అని దినచర్యలో ఒకచోట వస్తుంది. పెన్నేపల్లి గోపాలకృష్ణ ఇంగ్లీషు దినచర్యలను ముద్రించించినపుడు ‘ఒకచిన్న గుట్ట’ అని వివరణ ఇచ్చారు. గెడ్డ అంటే విజయనగరం మాండలిక భాషలో చిన్న సెలయేరట! ఒక విమర్శకులు ఇటువంటి లోపాలను పట్టుకుని ఏకారు. ఆ సభలో నేను ఒక ప్రశ్న వేశాను. వారు పొరపాటు చేశారు. వారిది నెల్లూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం. ఐనా గురజాడ మీది భక్తితో దినచర్యలను ఎడిట్ చేసి అచ్చువేశారు. ఈ ప్రాంతం వారందరికీ గురజాడ వాడుక చేసిన మాండలిక భాషతో పరిచయమే కదా! మీరెవరైనా ఆ కార్యానికి పూనుకొని ఉండవచ్చు కదా! తప్పులు చేస్తే చెప్పండి, సరిదిద్దుకొంటామని అన్నాను. సభాసదులు కరతాళధ్వనులతో ఆమోదం తెలియజేశారు.

దురదృష్టవశాత్తు గురజాడ రికార్డు, రాతప్రతులు అన్నీ చెల్లాచెదరయ్యాయి. 1976 ప్రాంతంలో విశాలాంధ్ర ప్రచురణ సంస్థ నార్ల వెంకటేశ్వరావు, గొల్లపూడి మారుతీరావు, కె.వి.రమణారెడ్డి మరొక పండితుల పరిశీలనకు తమ వద్ద వున్న రికార్డు ఇచ్చారు. ఈ పండితుల పర్యవేక్షణలో గురజాడ ఇంగ్లీషు నోట్సు, ఉత్తరప్రత్యుత్తరాలు, వగైరా అంతా టైపు చేయించారు. ఆ తర్వాత గురజాడ రికార్డు నార్లవారి వద్ద ఉండిపోయింది. దానికోసం నార్లవారి వద్దకు విశాలాంధ్ర పెద్దలు కాళ్ళరిగిపోయేట్లు తిరగ్గా తిరగ్గా కారు షెడ్డులో వుంది తీసుకుని వెళ్ళమని అన్నారట!

నార్లవారి ప్రోత్సాహంతో పురాణం సుబ్రహ్మణ్యశర్మ దాదాపు 26 వారాలపాటు “గురజాడ రచనలు అవసరాల ఫోర్జరీలు” శీర్షిక పెట్టి అవసరాల అనువాదాన్ని ఏకిపారేశారు. 1952-56 ప్రాంతాలలో అవసరాల సూర్యారావు గురజాడ రికార్డు చదివి అనువాదం చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేశారు, నిజమే, కానీ వారు గురజాడ జిలుగురాత చదవగలిగారు. వారికున్న పరిమిత ఇంగ్లీషు పరిచయం వల్ల కొన్ని దోషాలు అనువాదంలో వచ్చాయి. విజయనగరం వారు కావడంవల్ల గురజాడ రాసినట్లే ఆ మాండలికంలో స్వేచ్ఛగా కల్పిచి రాసేశారు. సౌదామిని అనే గురజాడ అసంపూర్ణ ఇంగ్లీషు నవలకు అవసరాల చేసిన అనువాదంలో “మాలామాదిగా అయితే అసుంటాకూర్చో” అనే మాటను నాలుగైదు పర్యాయాలనిపించారు అవసరాల. “ఇది అవసరాల చేసిన అనువాదం, మూలంలో గురజాడ ఏమి రాశారో అని తెలుసుకోకుండానే” ఆయన (గురజాడ) వందేళ్ళ క్రితం వాడు. ఇటువంటి మాటలు వాడకూడదని ఆయనకు తెలిసివుండదు అని కొందరు విమర్శకులు గురజాడను సమర్థించారు. గురజాడ ఒక వ్యాసంలో “మాలవాడు ఎదురైతే కావలించుకోలేని వ్యక్తి దేశభక్తుడు కాజాలడు” అనే అర్థంలో రాశారు. కనుక వారు మాలామాదిగా అని రాసి వుండరని నా బుద్ధికి తట్టింది. సౌదామిని ఇంగ్లీషు మూలం తీసి చూస్తే ఆయన బ్లాగార్డు అని వాడినట్లు ఉంది. ఆ పదానికి అవసరాలకు అర్థం తెలీక మాలామాదిగా అని అనువదించారు. గురజాడ ఇంగ్లీషు రచనలు ఇంగ్లీషులో అచ్చువేసినపుడే ఇటువంటి పొరబాట్లను సవరించగలం అని నాకు గట్టి నమ్మకం కలిగింది.

అవసరాల చేసిన పొరపాట్లను పురాణం సుబ్రమణ్యశర్మ బయటపెట్టిన తర్వాత, విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఈమారు సెట్టి ఈశ్వరరావు గారిచేత తెలుగులోకి అనువదింపజేశారు.

నేను దంపూరు నరసయ్య గారి మీద పరిశోధించి పుస్తకం రాస్తున్నపుడు గురజాడ ఒంగోలు మునిసుబ్రమణ్యం గారికి రాసిన ఉత్తరానికి అవసరాల చేసిన అనువాదంలో దంపూరు నరసయ్య ప్రస్తావన వస్తుంది. “వొక తెలుగు పుస్తకాన్ని ఎలా రెవ్యూ చెయ్యాలో తెలిసున్న వ్యక్తి నా ఎరుకలో ఎవరూ లేరు. అన్నట్టు శ్రీ డి.నరసయ్య అనే పండితుడు వొకాయన పీపుల్స్ ఫ్రెండ్ అనే వొక వారపత్రిక నడుపుతూ ఉండేవాడు. ఆ పత్రిక ఇప్పుడు వెలువడడం లేదు. ఆయన నెల్లూరు వాస్తవ్యుడు. ఇప్పుడు వున్నారూ? వుంటే ఆయన చిరునామా నాకు పంపించు. ఆంగ్లభాషలో ఆయన గట్టివాడు. వొకసారి ఆయన్ను కలుసుకో.” అని వుంది. సెట్టి ఈశ్వరరావు చేసిన అనువాదంలో ఈ భాగంలేదు. ఈ మాటలు అవసరాల కల్పించి రాశారా? మూలంలో ఉంటే ఈశ్వరరావు అనువాదంలో ఎందుకు లేవు? ఈ సందేహం నివృత్తి చేసుకోడానికి హైదరాబాదు స్టేట్ ఆర్కైవ్సుకు వెళ్ళి గురజాడ రికార్డులను పరిశీలించాను. There was a scholar by name D.V.Narasaiah who used to edit a bright English weekly “The People’s Friend” now defunct…” అని వుంది. అవసరాల కరెక్టు గానే అనువాదం చేశారు. ఏ కారణం చేతో ఈ వాక్యాలు సెట్టి ఈశ్వరరావు అనువదించకుండా విడిచిపెట్టారు. అప్పుడే నా మనసులో గురజాడ ఇంగ్లీషు రచనలను ఇంగ్లీషు లోనే అచ్చువెయ్యాలనే భావన మరింతగట్టి పడింది. నా మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణ గారిదీ ముందు నుంచి ఇదే అభిప్రాయం. అయితే మనసు ఫౌండేషన్ అధిపతి డాక్టర్ మన్నం రాయుడు గారు సంకల్పించాకే మేము పూనుకొని పని పూర్తి చేశాము. ఇప్పుడు గురజాడ ఇంగ్లీషు రచనలు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here