కశ్మీర రాజతరంగిణి-61

1
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

మూఢా చరణహీనా సా శృతి వాహ్యాతయా తయా।
వైధేయ విప్ర ప్రకృతి రివ ప్రయాద్ది గర్హ్యాతామ్॥
(కల్హణ రాజతరంగిణి 6, 276)

[dropcap]చ[/dropcap]రణహీన అయిన మూర్ఖ రాణి నైతిక విలువలకు దూరమై, ప్రజల దూషణలు ఎలా అందుకుంటోందంటే, వేద విజ్ఞాన శూన్యుడయిన మూర్ఖ బ్రాహ్మణుడు ఎలా ప్రజల హేళనకు గురవుతాడో, అలా!

రాణి దిద్దాదేవి తన వ్యతిరేకులను అణచివేసిన తరువాత తనకు తానే ప్రథమ శత్రువు అయింది. ఆమెలో అభద్రతా భావం జనించింది. ప్రతి వారూ రాజ్యాన్ని అపహరించాలన్న దుర్బుద్ధితో ఉన్నట్టు ఆమె నమ్మింది. దాంతో ఎవరు తనవారో, ఎవరు తన వ్యతిరేకులో గుర్తించలేని పరిస్థితి వచ్చింది. తన మేలు కోరేవారు శత్రువులనీ, తన నాశనం కోరేవారు మిత్రులనీ నమ్మింది. రాణి అయోమయ మనస్తత్వాన్ని దుష్టులు చక్కగా ఉపయోగించుకున్నారు. వారు తమకు నచ్చని వారిపై రాణికి చాడీలు చెప్పేవారు. నమ్మించేవారు. ఎవరు శక్తిమంతులయి రాణి పట్ల విధేయత చూపించినా, రాణి ఎవరి పట్ల కాస్త ఔదార్యం, ఆత్మీయత చూపినా వారు వెంటనే చాడీలు ఆరంభించేవారు. రాణికి విధేయులుగా ఉన్నవారు, రాణి ఆగ్రహానికి గురయ్యేవారు. రాణికి మద్దతునిచ్చేవారు దూరం అయ్యేవారు.  రాణిలో అభద్రతా భావం పెరిగిపోయేది. ఆమె నిలకడగా పాలనపై దృష్టి పెట్టలేకపోయేది. ఇది ఆ కాలంలో రాజులు మాత్రమే కాదు, ఈ కాలంలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ, నిర్ణయాత్మక స్థానంలో ఉన్న ప్రతీ వారు గుర్తించి, అర్థం చేసుకుని జాగ్రత్త పడాల్సిన విషయం.

బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, అధికారం ఉన్నవాడి చుట్టూ అవకాశవాదులు చేరుతారు. అధికారి విశ్వాసాన్ని చూరగొనటం ద్వారా, అతడి మెదడుపై పట్టు బిగిస్తారు. ఇతరుల గురించి చెడుగా చెప్పటం ద్వారా తమ దోషాల పైనుంచి అధికారి దృష్టిని తప్పిస్తారు. దాంతో, తనకు విధేయులని, నిజాయితీపరులను అధికారి దూరం చేసుకుంటారు. దుష్టులు, స్వార్థపరుల మాయలో పడతాడు. ఇది నిత్యం మనం గమనిస్తున్నదే. దిద్దాదేవి జీవితం ద్వారా కల్హణుడు మరింత స్పష్టం చేస్తున్నాడీ విషయాన్ని. నైతిక విలువలు విడిచినవాడు, బలహీనుడు, మూర్ఖుడు అయినవాడు వేద పరిజ్ఞానం లేని బ్రాహ్మణుడి లాంటి వాడని పోల్చటంలోనే ఆ కాలంలో బ్రాహ్మణుడన్న వాడికి విలువ, గౌరవం   విజ్ఞానాన్ని బట్టి తప్ప ఇతర ఏ అంశం ఆధారంగా కాదని కల్హణుడు భావితరాలకు ప్రదర్శించాడు.

స్వచిత్త సంవాది వచో వదన్తో ధూర్తా వితన్వన్తి మనః ప్రవేశమే।
పృథక జనానం గణితా వధూనం విటాః ప్రభూణామపి గర్భచేటాః॥
(కల్హణ రాజతరంగిణి 6, 235)

ఎలాగయితే ధూర్తులు/పరాన్నభుక్కులు, వేశ్యలు పామరుల మనస్సులను ఏ మాటలు రంజింపజేస్తాయో అలాంటి మాటలు మాట్లాడి వారిని వశపరుచుకుంటారో, అలాగే కొందరు స్వార్థపరులు తమ రాజుల మనస్సులను తమకు అనుకూలంగా ఆకర్షించుకుంటారు.

నిత్యం స్మరిస్తూ, పాటించవలసిన management principle ఇది. Managerలే  కాదు, నిత్య జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ‘తియతీయని తేనియ మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు’ అంటున్నాడు కల్హణుడు. ప్రపంచంలో వ్యక్తులను వశపరుచుకునేందుకు శక్తివంతమైన తిరుగులేని ఆయుధం ‘తీయని మాట’. కాంతనయినా, శ్రీమంతుడినయినా వశుడిని చేసేది ‘మాట’.

ఓ సైన్యాధికారి శౌర్యం ప్రదర్శించి శత్రువులను తరిమికొట్టాడు. కానీ రాణి చుట్టూ చేరిన దుష్టులు అతనికి వ్యతిరేకంగా రాణికి చెప్పారు. దిద్దారాణి వారి మాటలు నమ్మింది. ఆ సైన్యాధ్యక్షుడిని బంధించాలని ప్రయత్నించింది. ఇది, గతంలో రాణికి వ్యతిరేకంగా పోరాడి, ఒప్పందం చేసుకున్న వారందరిలో ఆగ్రహం కలిగించింది. హిమ్మకుడు, ఎరమంతకుడు వంటి వారు రాణికి వ్యతిరేకంగా పోరాడాలని గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. కాని రాణి ఇచ్చిన దానాలకు, పదవులకు లొంగిపోయారు. ఇప్పుడు వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రాణి సైన్యాన్ని కూడా తమ వైపుకి తిప్పుకున్నారు, వారి అసంతృప్తులను రెచ్చగొట్టి. ఈ సమయంలో ‘నరవాహనుడు’ రాణికి మద్దతుగా నిలబడ్డాడు. శత్రుసైన్యం నగరంలోకి ప్రవేశించటంతో రాణి మరోసారి తన కొడుకును భట్టారక మఠానికి పంపింది.

శత్రుసైన్యం రాణి ద్వారం వరకూ వచ్చింది. ఆ సమయంలో రాజకులభట్టు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి శత్రు సైన్యాన్ని చెదరగొట్టాడు. హిమ్మకుడు మరణించాడు. యశోధరుడిని రాజభటులు బంధించారు. ఎరమంతకుడి మెడకు బండరాయి కట్టి వితస్తలో విసిరివేయించింది రాణి. తిరుగుబాటు లేవదీసిన యశోధరుడు, శశిధర లను వారి బంధువులతో సహా శిక్షించింది. గత అరవై సంవత్సరాలలో పదహారుగురు రాజులను తమ ఇష్టం వచ్చినట్టు మార్చి పబ్బం గడుపుకున్న వారందరినీ కలుపు మొక్కలను ఏరివేసినట్టు ఏరివేసింది రాణి దిద్దాదేవి. గతంలో రాజులను అవమానపరిచి, హీనంగా చూసిన వారందరూ వారి వారి పాపాలకు ఫలితాలను అనుభవించారు.

భీమ భ్రూభంగ మాత్రేణ దిద్దాదేవ్యో సకోపయా।
ఆసన్నిః శేషతాం నీతా దుర్గయేవ మహాసురాః॥
(కల్హణ రాజతరంగిణి 6, 251)

ఆ దిద్దారాణి, దుర్గాదేవిలా కోపంతో కనుబొమలు ముడివేయటంతో, ద్రోహులు, వారి వంశస్తులందరూ సమూలంగా, అసురులు నాశనమైనట్టు నాశనమయ్యారు.

శత్రువులందరి అడ్డు తొలగిన రాణి శౌర్యం ప్రదర్శించిన రక్కుడిని, నరవాహనుడిని మంత్రులుగా నియమించింది. ద్రోహ చింతన లేని నరవాహనుడు దిద్దారాణి ఖ్యాతిని కశ్మీరమంతా విస్తరింప చేశాడు. ఆమె పేరు మీద చక్కని పాలనని అందించాడు. రాణికి సరైన సూచనలు, సలహాలు ఇస్తూ ఆమెను ప్రజలందరికీ ప్రీతిపాత్రను చేశాడు.

దిద్దారాణి సైతం నరవాహనుడి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచింది. అతని సలహా లేకుండా ఏ పనీ చేసేది కాదు. అతని అనుమతి లేకుండా ఏ పనీ ఆరంభించేది కాదు. ఆయన భోజనం చేసిన తరువాతనే తాను భోజనం చేసేది. అతడు నిద్రించిన తరువాతనే తాను నిద్రించేది. అతనికి ఏ మాత్రం అనారోగ్యం కలిగినా రాత్రింబవళ్ళు అతడిని అంటిపెట్టుకుని ఉండేది. నిరంతరం యోగక్షేమాలు విచారించేది. అతను సంతోషిస్తే తాను సంతోషించేది. ఆయన విచారంగా ఉంటే తాను విచారాన్ని అనుభవించేది. అయితే ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదంటారు. అభద్రతా భావం కల రాణి మెప్పు – ఎవరు ఎంతగా రాణి శ్రేయోభిలాషులయినా, ఎల్లప్పుడూ పొందలేరు. ‘సింధు’ అనే వాడు రాణి ప్రాపకం సంపాదించాడు. కోశాధికారి అయ్యాడు. రాణికి సన్నిహితుడయ్యాడు. నరవాహనుడి గురించి రాణి మెదడులో విషం ఎక్కించాడు. రాణికీ, నరవాహనుడికి నడుమ ‘అనుమానం’ అనే పెనుభూతాన్ని నిలిపాడు. అన్నిటి కన్నా కఠినమైనది వజ్రం అని నిరూపించవచ్చు. అడ్డుకట్టలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని చూపవచ్చు. కానీ అబద్ధాన్ని అబద్ధం అని నమ్మించటం కష్టం అని అంటాడు కల్హణుడు. నరవాహనుడు రాణి ప్రవర్తనలోని తేడాను గ్రహించాడు. దాని పర్యవసానం కూడా అర్థం చేసుకున్నాడు. దిద్దారాణికి తన నిజాయితీ నిరూపించే అవకాశం లేదని గ్రహించిన నరవాహనుడు నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో దిద్దారాణికి అండగా నిలిచి, ఆమె లోని నైచ్యాన్ని అణచిపెట్టి, మంచితనాన్ని వెలికితెచ్చిన ఏకైక వ్యక్తి దిద్దారాణి జీవితం నుంచి నిష్క్రమించాడు. నరవాహనుడి నిష్క్రమణతో వెన్నెల లేని రాత్రిలా సత్యం విహీనమైన రాణి దిద్దాదేవి వైభవ విహీనమై పోయింది. ఆమె పాలనలోని ఉచ్చదశ సమాప్తమయిపోయింది.

దిద్దారాణిలోని క్రౌర్యం, రాక్షసత్వాలు వెలికి వచ్చాయి. తనకు నచ్చని వారిని హింసించటం ప్రారంభించింది. తనకు వ్యతిరేకులు అనిపించిన వారిని సంహరించసాగింది. ఆమె సంగ్రాముడనే దామరుడిని శిక్షించాలని ప్రయత్నించింది. అతడికి మద్దతుగా ఇతరులు రావటంతో ఆమె మళ్ళీ తిరుగుబాటు చేస్తారని భయపడింది. ఇప్పుడు ఆమెని రక్షించటానికి నరవాహనుడు లేడు. రక్కుడు మరణించాడు. దాంతో రాణి బెదిరి, తనకు వ్యతిరేకంగా జతకట్టిన వారందరినీ తనకలవాటయిన రీతిలో తనవైపు తిపుకున్నది. అయితే ఇలా ధనం, అధికారాల ఆశతో తనవైపు వచ్చిన వారెవరూ తనకు విధేయులు కారని రాణికి తెలుసు. అందుకని అస్త్ర సన్యాసం చేసిన ఫల్గుణుడిని బ్రతిమిలాడి మళ్ళీ నిత్యజీవన స్రవంతి లోకి లాక్కువచ్చింది. అయితే, అధికారంలో ఉన్నవారు, అధికారం నిలుపుకునేందుకు, శక్తిమంతులైన దుష్టులతో రాజీ పడితే అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రాణితో ఒప్పందం కుదిరిన తరువాత వారందరూ కశ్మీరాన్ని ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టటం ఆరంభించారు. ఇంతలో సింహాసనంపై బొమ్మలా కూర్చున్న అభిమన్యుడు మరణించాడు. నందిగుప్తుడు రాజయ్యాడు. కానీ తన కొడుకు మరణ దుఃఖం రాణి హృదయంలో ప్రవేశించింది. ఆమెలో ఉన్న క్రౌర్యాన్ని, దౌష్ట్యాన్ని, రాక్షసత్వాన్ని – ఆమె మనసులో నిండిన విషాదం కప్పిపెట్టింది. అంతవరకూ చేసిన పాపాలకు, అక్రమంగా ధనాన్ని ఆర్జించిన పాపానికి ప్రక్షాళనగా ఆమె అనూహ్యమైన రీతిలో పుణ్యకార్యాలను చేపట్టింది. ఆమె దౌష్ట్యాన్ని వదిలి, తన కోల్పోయిన బిడ్డను ప్రజలలో చూసుకుంటూ, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించింది. పుణ్యకార్యాలు చేయటంలో సింధు సోదరుడు భుయ్యుడు ఆమెను ప్రోత్సహించాడు. ఎండలోని ఆనందాన్ని అనుభవించటానికి చలి ఎలా దోహదపడుతుందో, అలా రాణి మంచితనాన్ని ప్రజలు అనుభవించటంలో భుయ్యుడు తోడ్పడ్డాడు అంటాడు కల్హణుడు. ఆమె మందిరాలు నిర్మించింది. మఠాలు నిర్మించింది. భర్త జ్ఞాపకార్థం ప్రజలపై బంగారం జల్లు కురిపించింది. భర్త పేరు మీద మందిరాలు నిర్మించింది. విహారాలు నిర్మించింది. వితస్త, సింధు నదుల సంగమంలో ఆమె మఠాలను, వైకుంఠాల వంటి విష్ణు మందిరాలను, విహారాలను నిర్మించింది. కశ్మీరులో జీర్ణించిపోయిన మందిరాలు, విహారాలను పునర్నిర్మించింది.

ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే, భారతీయ ధర్మం ఔన్నత్యం, గొప్పతనం స్పష్టంగా తెలుస్తుంది. చరిత్ర రచయితలు, వ్యాఖ్యాతలు, భారతీయులను ఉన్నత స్థానంపై నుంచి దింపి ప్రపంచంలోని ఇతర మ్లేచ్ఛమూకలతో భారతీయులు సమానం, వారి కన్నా ఏ మాత్రం భిన్నం కాదు అని నిరూపించాలని తహతహలాడతారు. కానీ మేఘాలు అడ్డుపడి సూర్య తేజాన్ని నిలువరించలేనట్టే, ఎవరెన్ని వికృత వ్యాఖ్యలు చేసినా, ఎన్నెన్ని అబద్ధ ప్రచారాలు నిరంతరం చేస్తూ మభ్య పెట్టాలని ప్రయత్నించినా నిజం మారదు. దిద్దారాణి శత్రువులందరినీ ఓడించి తన రాజ్యం సురక్షితం చేసింది. ఇంతలో ఆమె కొడుకు మరణించాడు. దాంతో విరక్తి చెందిన రాణి తాగుడులో పడి నాశనం కాలేదు. తన కొడుకు మరణించాడన్న కసితో, రాజ్యంతో ప్రజలను హింసించలేదు. తనకు వాటిల్లిన నష్టం తన దుష్కర్మల ఫలితంగా భావించి, సత్కర్మలు నెరవేర్చటం వైపు దృష్టిని సారించింది. ప్రజల బాగోగులు చూడటం, వారిని కన్నబిడ్డల్లా ప్రేమించటం రాణిగా ఆమె బాధ్యత. ఇన్నాళ్ళకు ఆమె దాన్ని సక్రమంగా నిర్వర్తించింది. తలపెట్టిన పుణ్యకార్యాలు గమనిస్తే, మందిరాలు, మఠాలు, ఆరామాలు నిర్మించటమే కాదు, పురాతన పవిత్ర కట్టడాలను పునర్నిర్మించింది.   ప్రధానంగా దిద్దారాణి విష్ణుభక్తురాలు. విష్ణు మందిరాలతో పాటు విహారాలను నిర్మించింది. పాడుపడిన వాటిని బాగు చేయిందింది. ఓ శత్రువు ఆరామంలో దాక్కున్నాడని, అతడిని పట్టుకోవడం కుదరక, ఆరామాన్ని కాల్చి, ఆ శకలాలతో మరో చోట మందిరాన్ని నిర్మిస్తే, భారతదేశంలో ఆరామాలు కూలగొట్టి మందిరాలు నిర్మించే అలవాటు ఎప్పటి నుంచో ఉందని వ్యాఖ్యానిస్తారు. ఏదో ఓ సంఘటన చూపించి అసహనం, అణచివేత భారతీయులకు అలవాటే అని వ్యాఖ్యానిస్తారు. కానీ భారతీయుల చరిత్ర గమనిస్తే అసహనం, అణచివేతలు కనబడవు. పరమత సహనం, ‘వసుధైక కుటుంబం’ అన్న దృక్పథం అడుగడుగునా గోచరిస్తాయి. దిద్దాదేవి వైష్ణవ మందిరాలనే కాదు, మఠాలను నిర్మించింది. ఆరామాలను నిర్మించింది. గతంలోనూ పలువురు కశ్మీర రాజులు ఇదే సంప్రదాయాన్ని పాటించారు. వారు మందిరాలను, ఆరామాలను సమానంగా ఆదరించారు. జలౌకసుడు ఆరామాలను కూలగొట్టి, తరువాత వాటిని బంగారు పూతతో పునర్నిర్మించాడు. అంటే భారతీయ రాజులు, విదేశీ మూకల్లా తమ ఆధిపత్యం చలాయించేందుకో, తమ ఆధిపత్యమే చలామణీ కావాలన్న లక్ష్యంతోటో ఎన్నడూ వ్యవహరించలేదు. ధర్మ సంబంధిత వ్యవహారాల్లో సంకుచితమన్నది భారతీయ జీవన విధానంలోనే లేదు. కానీ చరిత్ర రచయితలు, వ్యాఖ్యాతలు exception ని rule గా చూపించి భారతీయ ధర్మంపై, జీవన విధానంపై, భారతీయుల మనస్తత్వంపై బురద చల్లాలనీ ఈనాటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే కనిపిస్తున్నదానికీ, నమ్మిస్తున్న దానికీ నడుమ ఎంతో తేడా కనిపిస్తుంది.

అయితే ఒక సంవత్సరం పాటు పుణ్యకార్యాలు నెరవేర్చిన రాణి మనసులోంచి దుఃఖం తొలగిపోయింది. ఓ సంవత్సరం తరువాత దిద్దారాణి మళ్ళీ తన పూర్వ ప్రవర్తనను ఆరంభించింది. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, లైంగికతకు ప్రాధాన్యత ఇవ్వటం, క్రౌర్యం, దౌష్ట్యం వంటివి ప్రదర్శించడంలో విజృంభించింది. ఈ సందర్భంగా కల్హణుడు గమ్మత్తయిన శ్లోకం రాశాడు. పవిత్ర జలాల్లో మునిలా మౌనంగా ఉండే ‘తిమి’ అనే చేప తన వారినే భక్షిస్తుంది. వర్షపు నీటి చుక్కలను ఆహారంగా తీసుకునే నెమలి పామును చంపి తింటుంది. జపం చేసే కొంగ నమ్మిన చేపలను భోంచేస్తుంది. కాబట్టి దుష్టుల సత్కర్మలను నమ్మకూడదు. వారు ఎప్పుడు  దౌష్ట్యాన్ని ఆరంభిస్తారో ఎవరో చెప్పలేరు. ఇందుకు నిదర్శనమే దిద్దారాణి ప్రవర్తన.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here