అన్నింట అంతరాత్మ-16: ‘ఘన’మైన దాన్ని.. రాయిని నేను!

9
3

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం రాయి అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]స[/dropcap]ముద్రం ఒడ్డున కాస్తంత దూరంగానే నేనూ, మా మిత్రులూ ఉన్నాం. ఈ సముద్రుడు ఉండీ ఉండీ ఉవ్వెత్తున లేస్తూ.. ముందుకు ఉరుకుతూ వచ్చి మా మీద జలదాడి చేస్తుంటాడు. అలా తడిసి పోతూ, మళ్లీ ఎండకు, గాలికి ఆరుతూ.. మళ్లీ తడుస్తూ.. నిరంతరం ఇంతే.. ఎప్పటికో సముద్రుడు అలసటతో ఒకింత సేపు విశ్రాంతి తీసుకుంటే తప్ప. రాయినయినా నా సౌందర్యానికేం కొదువ లేదు. అలల తాకిడికి నా మేను మరింత నునుపు తేలింది. నా చుట్టూరా ఎంతోమంది మిత్రులున్నారు. ఒక్కక్కరిదీ ఒక్కో రూపు, ఒక్కో రంగు, ఒక్కో పరిమాణం. వాళ్లంతా నన్ను చూసి, నువ్వు మాకన్నా ఎంతో అందంగా ఉన్నావంటుంటారు. అన్నట్లు ఎంతో మంది జనం రోజూ ఇక్కడికొస్తుటారు. సముద్రాన్ని చూస్తూ ఆనందిస్తారు. ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. కొంతమంది అలా కబుర్లు చెప్పుకుంటూ మా చిన్నారి మిత్రులను.. అదే చిన్న చిన్నరాళ్లను మళ్లీ సముద్రంలోకి విసిరేస్తుంటారు. మాకు బాధేస్తుంది, కోపం వస్తుంది. నేను ఇలా అనుకుంటుండగానే చిన్నా పెద్దలతో కూడిన ఓ కుటుంబం మా సమీపానికి వచ్చింది.

నీళ్లతో ఆడి వచ్చినట్లున్నారు.. దుస్తులు తడిసిపోయాయి.. “తాతయ్యా! ఈ రాళ్లు చూడు.. ఎంత బాగున్నాయో..” అంటూ నన్ను పట్టుకుంది ఓ పాప. “అవునమ్మా.. ఇక్కడ మీకు కావలసినన్ని రాళ్లు ఏరుకోవచ్చు” అన్నారు తాతయ్య. “ఇంతకూ ఈ రాయితో ఏం చేస్తావు శిల్పా?” అడిగాడు ఆయన. “రాక్ పెయింటింగ్ వేస్తా, మొన్న మా ఫ్రెండ్ చెప్పింది. రాళ్ల మీద చక్కని బొమ్మలు వేయొచ్చని. ఈ రాయిని నా బొమ్మతో మరింత అందంగా చేస్తా” చెప్పింది శిల్ప. అంతే.. వెంటనే తను తెచ్చుకున్న సంచీలో నన్ను వేసేసింది. ‘అయ్యో! మా మిత్రులకు దూరం అవుతున్నా’ అనుకున్నా. ఇంతలో మా స్నేహితులు కూడా సంచీలో చేరడం చూసి ‘హమ్మయ్య’ అనుకున్నా. ‘మనం ఈ సముద్రం ఒడ్డు వదిలి, ఇప్పుడు ఈ పాపా వాళ్లింటికి వెళ్తామన్న మాట’ అందరం అనుకున్నాం. “పిల్లలూ! మీక్కావలసిన రాళ్లన్నీ ఏరుకోండి. తర్వాత కాస్త దూరంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు” అంది ఓ పెద్దావిడ. “అలాగే నానమ్మా” అన్నారు వాళ్లు. మా వాళ్లు మరికొందరు వాళ్ల సంచుల్లో చేరుతున్నారని అర్థమైంది. కొద్ది సేపటికి అంతా కలిసి దూరంగా ఒక చోట కూర్చున్నారు. పిల్లలు సంచుల్లోంచి మమ్మల్ని బయటికి తీసి చూసుకుంటూ మురిసిపోతున్నారు. నాకు భలే గర్వంగా అనిపించింది.

“చిన్నప్పుడు మేం కూడా చిన్నగా, ఒకే రకంగా ఉన్న నునుపు రాళ్లను ఏరుకునే వాళ్లం, వాటితో అచ్చంగిల్లాలు ఆడుకునే వాళ్లం” చెప్పింది నానమ్మ. “అచ్చంగిల్లాలా? అంటే” అడిగింది. “గతంలో ఆడపిల్లలు ఆడే ఆట. ఐదు రాళ్లు తీసుకొని ఇంట్లో ఆడుకునే ఆట అన్నమాట. ఇంటికెళ్లాక చూపిస్తాలే” అంది నానమ్మ. “కాస్తంత పెద్దరాళ్లతో వీధుల్లో ఇళ్ల ముందు నాలుగు రాళ్ల ఆట, చదునుగా ఉన్నచిన్న రాయితో తొక్కుడు బిళ్ల కూడా ఆడేవాళ్లు” తాతయ్య చెప్పాడు. “అవునుగానీ చరిత్రలో ప్రాచీన యుగంలో రాతియుగం గురించి కూడా ఉందికదా నాన్నా” అన్నాడు శ్రీరామ్. “అవును.. ఆ యుగంలో రాళ్లతోనే చేతి గొడ్డళ్లు, గీకేందుకు ఉపయోగించే పదునైన రాతి పనిముట్లు ఎన్నో తయారు చేశారు” చెప్పాడు వాళ్ల నాన్న. “అంతే కాదు.. అసలు నిప్పు పుట్టించుకుంది కూడా రాళ్లతోనే కదా” వాళ్లమ్మ కాబోలు అంది. నా ఊహ నిజమే అని రుజువు చేస్తూ శిల్ప “అది ఎట్లా అమ్మా” అడిగిందామెను. “ఆది మానవుడు చెకుముకి రాయి రాపిడితో నిప్పు రాజేశాడు. ఆ తర్వాత దాంతో కట్టెపుల్లలను వెలిగించి చలి కాచుకోవటం, ఆ నెగడు ఉంటే జంతువులు తమ దగ్గరికి రాలేవని తెలుసుకోవటం.. ఆ తర్వాత మూడు రాళ్లు పెట్టి, వాటి మధ్య కట్టెలు ఉంచి పొయ్యిని తయారు చేసుకోవటం.. నిజంగా మనిషి మేథ ఎంత గొప్పదో” అందామె.

అంతలో తాతగారు అందుకుని “రామాయణంలో వారధి నిర్మాణానికి కూడా రాళ్ళే వాడారట.. అవి మామూలు రాళ్లు కాదు. నీళ్లలో తేలే రాళ్లు. ఇవి రామేశ్వరం ప్రాంతంలోనే కనిపిస్తాయి. బరువేమో పదినుంచి ఇరవై కిలోలుంటాయి. వీటిని పురాతన రామాలయంలో ఉంచారు” చెప్పారు. “అన్నట్లు రామాయణమంటే గుర్తొచ్చింది.. శాపవశాన రాయిగా మారిన అహల్య శ్రీరాముడి పాద స్పర్శతో శాప విముక్తురాలయింది” అంది నానమ్మ. “అవును. ఇది దృష్టిలో ఉంచుకునే కదా వదినా, ఆరుద్రగారు ‘రాయినైనా కాక పోతిని రామపాదము సోకగా’ పాట రాశారు” అంది. “నీకు సమయానికి భలే పాట గుర్తొచ్చింది గౌతమీ” అంది ఆమె. మా గురించిన సంగతులు వింటుంటే మాకు ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

“ఇంకో విషయం గుర్తుకొస్తోంది. ఆ మధ్య చదివాను. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో ఓ ప్రాచీన ఆలయ సముదాయం ఉంది. దాన్ని స్థానికులు ‘బాథూ కీ లడీ’ అని పిలుస్తారు. బాథూ అంటే ఓ రకం రాళ్లు. వీటిని పాండవులు నిర్మించారని చెపుతారు. దానికి సంబంధించి ఓ కథ కూడా ఉంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా, ఓ రాత్రి అనేక ప్రాంతాలలో శివాలయాలు నిర్మించి శివుణ్ని పూజించారు. అయితే ఇక్కడ స్వర్గానికి మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాలనుకుని శ్రీకృష్ణుణ్ని సాయం కోరారు. పరమాత్మ వారికి స్వర్గమెట్ల నిర్మాణానికి ఆరునెలల కాలాన్ని ఒక రాత్రిగా చేస్తానని, దాని వల్ల వారు ఎటువంటి వెలుగును, సూర్యుణ్ని చూడరని, ఒకవేళ వెలుగును చూడటం జరిగితే మాత్రం నిర్మాణం ఆపేయాలని, అలాగే ఆరునెలల కాలం గడువుముగిసే లోపల నిర్మాణం పూర్తి కాకపోయినా ఆపేయవలసి ఉంటుందని చెప్పాడు. పాండవులు అందుకు అంగీకరించి తమ పనిలో నిమగ్నమయ్యా రు. అయితే ఆ ఊళ్ళో పనిచేసే ఒక మహిళ తెల్లవారుజామునే లేచి దీపం వెలిగించడంతో పాండవులు సూర్యోదయం అవుతోందని భ్రమించి నిర్మాణం ఆపేయడంతో స్వర్గమెట్ల మార్గం మధ్యలోనే ఆగిపోయిందట. ఇప్పటికీ అక్కడ నిలువెత్తు స్తంభం, అందులో మెట్లు ఉన్నాయి. ఆసక్తి ఉన్న సందర్శకులు ఆ మెట్లు ఎక్కి అంతెత్తునుంచి ఆ ప్రాంతాన్ని వీక్షించి ఆనందిస్తారు. అక్కడ ఆరు ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శివలింగం, చిన్న ఆలయాలలో విష్ణు, తదితర దేవతా మూర్తులున్నాయి. దూరం నుంచి చూస్తే ఈ ఆలయాలు ఓ దండలా ఉంటాయి. అందుకే ‘బాథూ కీ లడీ’ అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో మహారాణా ప్రతాప సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా ఈ ఆలయం ఏడాదిలో ఎనివిది నెలల పాటు జలసమాధిలో ఉంటుంది. మిగిలిన నాలుగు నెలలు మాత్రమే సందర్శకులు దీన్ని చూడగలుగుతారు..” గౌతమి ఆపింది. “స్వర్గ మార్గ నిర్మాణం భలే ఉంది” అన్నారు పిల్లలు.

“అన్నట్లు కేరళలోని కుడక్కుల్లులో గొడుగు ఆకారంలో రాళ్లున్నాయట. చిత్రంగా అనిపిస్తుంది కదూ. దాదాపు అరవై వరకు అలా ఉన్నాయట. పరిశోధకులు ఏమన్నారంటే ఒకప్పుడు అది శ్మశానవాటికని, అక్కడ శవాలను పాతి పెట్టాక ఆ చోటులో నిలువుగా ఓ రాతిని, దాని పైన మరో గుండ్రని రాయిని బోర్లించినట్లుగా ఉంచడం వల్ల అవి గొడుగు ఆకారంగా ఏర్పడ్డాయని వివరించారు” చెప్పింది శిల్ప అమ్మ. తాతగారు అందుకుని “ప్రసూనా. నాకూ ఓ విషయం గుర్తిస్తోంది.. నేనిదివరకు అమరకంటక్ సందర్శించాను, అప్పుడు జ్వాలేశ్వర్ వద్ద నర్మదాతీరంలో లెక్కలేనన్ని రాళ్లను చూశాను. అవి స్థూపాకారంలో శివలింగాకృతిలో ఉంటాయి. అక్కడివారు వాటిని శివలింగాలుగా భావించి, పూజిస్తారు. వాటిని వారు ‘బణలింగాలు’ అంటారు” చెప్పారు. మా వాళ్లు చాలాచోట్ల ఉన్నారన్నమాట. మా జాతి గురించి వింటుంటే ఆనందమే ఆనందం.

ఇలా అనుకుంటుండగానే శ్రీరామ్ వాళ్ల నాన్న ఇలా అన్నాడు… “భూమ్మీద రాళ్ల సంగతి సరే.. ఇతర గ్రహాలనుంచి కూడా అప్పు డప్పుడు రాళ్లు పడుతుంటాయి. కొద్దికాలం క్రితం బ్రెజిల్ లోని శాంటాఫిలోమెనా అనే ఊళ్లో గ్రహశకలాలు పడ్డాయి. అక్కడి రైతులు తమ పొలంలో పడ్డ రాళ్లను ఏరుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఎందుకంటే అవి లక్షల ఖరీదు చేయటమే. ఆ రాళ్లు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రిందటివి అని, సుమారు నలభై కిలోల బరువుండే రాయి ఖరీదు పందొమ్మిది లక్షల రూపాయలుంటుందని ఖగోళ పరిశోధకులు చెప్పారు. “అమ్మో! ఎన్ని డబ్బులో” శిల్ప అంది. అది విని మా జాతిలో అంత విలువైనవారున్నారని ఆశ్చర్యపోయాను.

“భలేదానివి శిల్పా! రాళ్లలో ఆభరణాలలో వాడే ఖరీదైన నవరత్నాలు కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, మరకతం, ముత్యం, పగడం, గోమేధికం, వైఢూర్యం ఉన్నాయి కదా. వీటిని నగలలో, కిరీటాలలో పొదుగుతారు. విశాఖ ఏజెన్సీలో రంగురాళ్ల కోసం కొందరు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న వార్తలు అడపా దడపా వింటూనే ఉన్నాం. ఇక ఇంటి నిర్మాణంలో ఫ్లోరింగ్ కోసం వాడేవి కూడా ఓ రకం రాళ్లే. పాలరాయి, ఎర్రరాయి, గ్రానైట్.. ఇలా ఎన్నెన్నో రకాలున్నాయి. రకాన్ని బట్టి ఖరీదులు. పాలరాయితో కట్టిన తాజ్ మహల్ అందాలు జగద్విఖ్యాతి చెందటం, ప్రపంచంలోని ఏడువింతల్లో ఒకటిగా నిలవటం తెలిసిందే. అలాగే ఎర్రరాతితో కట్టిన ఎర్రకోట.. గులాబీ రంగు రాళ్ల నిర్మాణాలతో నిండి పింక్ సిటీగా పేరొందిన జైపూర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఇళ్ల పునాదులకు రాళ్లను వాడటమేగాక, ఇంటిముందు గేటుకు అటు, ఇటు కట్టే స్తంభాలకు కూడా కొందరు రాళ్లను వాడుతుంటారు. రహదారుల నిర్మాణంలో కంకర రాళ్లు వాడటం తెలిసిందే. ఉద్యానవనాలలో, సరస్సులు ఉన్న ప్రాంతాల్లో అలంకరణగా గుండ్రటి అందమైన రాళ్లను వాడటం మామూలే” చెప్పింది జ్ఞానప్రసూన. మా జాతి ఘనత వింటుంటే ఇంకా.. ఇంకా వినాలనిపిస్తోంది నాకు.

అంతలో తాతగారు అందుకుని “ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మిన నేల. ఇప్పటికీ అప్పుడప్పుడు కర్నూలు ప్రాంతంలో వజ్రాలు బయటపడ్డ వార్తలు రావడం మామూలే.

అన్నట్లు శ్రీనాథ మహాకవి పల్నాటిసీమను వర్ణిస్తూ…

“చిన్న చిన్న రాళ్లు చిల్లర దేవుళ్లు
నాగులేటి నీళ్లు, నాపరాళ్లు
సజ్జ జొన్న కూళ్లు సర్పంబులును తేళ్లు
పల్లెనాటి సీమ పల్లెటూళ్లు..”

అన్నాడు అని చెపుతుండగానే నానమ్మ “రాళ్లంటే గుర్తొచ్చింది.. ఇది వరకు ప్రతి ఇంట్లో గుండ్రాయి ఉండేది. అలాగే రోలు, పొత్రం, విసుర్రాయి కూడా. గ్రైండర్లు వచ్చాక రోలు, పొత్రం, విసుర్రాయి అనేవి చాలావరకు కనుమరుగైపోయాయి. గుండ్రాయితో కుంకుడు కాయలు కొట్టుకొనేవారు. అంతేనా, రాతితో పాత్రలు కూడా ఉండేవి. వాటినే రాచ్చిప్పలు అనేవారు. వాటిలో పులుసు కాచుకుంటే ఎంత కమ్మగా ఉండేదో. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పెళ్లిళ్లలో కూడా గుండ్రాయికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పెళ్లి తంతులో పెళ్లికూతురు పెళ్లి పీటలపై కూర్చునే ముందు గౌరీపూజ చేస్తుంది. గౌరీపూజకు వాడేది గుండ్రాయినే. అంటే దాన్నే గౌరీదేవిగా భావించి, శుభ్రపరిచి, పసుపు పూసి, కుంకుమతో పూజిస్తారన్న మాట” చెప్పింది.

“అసలు విగ్రహాలన్నీ కూడా శిలల పైనే కదా చెక్కే ది. మన దేశంలో ఎన్నెన్ని క్షేత్రాలు అపురూపమైన శిల్పసంపదతో అలరారుతున్నాయో. శిల్పులు నిజంగా అపర బ్రహ్మలు” అంది జ్ఞానప్రసూన. “అందుకేనా చెల్లి పేరు శిల్ప అని పెట్టారు” అన్నాడు చిలిపిగా శ్రీరామ్. శిల్ప గర్వంగా ఓ భంగిమ ప్రదర్శించటం చూసి అంతా నవ్వారు. “ఆఁ అన్ని రాళ్లూ శిల్పాలు కాగలవా ఏమిటి, కొన్ని శిల్పాలయితే, కొన్ని గుడిముందు మెట్లుగానే మిగిలిపోతాయి, విగ్రహంగా మారిన రాయికేమో మొక్కుతారు, మెట్ల బండలనేమో తొక్కుతారు. అన్నట్లు ‘స్టోరీస్ ఇన్ స్టోన్’ అనే మాట విన్నారా?” అడిగింది గౌతమి. “లేదత్తా.. నువ్వే చెప్పాలి” అన్నాడు శ్రీరామ్. ‘అంటే రాళ్లమీద చెక్కిన బొమ్మల ద్వారా, అక్షరాల ద్వారా మనకు పూర్వగాథలనేకం తెలుస్తున్నాయి కదా. ఉదాహరణకు బౌద్ధ స్థూపాలు.. మీరు కూడా రాళ్లపై బొమ్మలు చిత్రిస్తూ ఓ చిన్న కథను ఆ బొమ్మలతోనే చెప్పవచ్చు. ఇదిలా ఉంచితే ఇంకో తమాషా విషయం నిప్పుకోడి గులకరాళ్లను తినడం” చెప్పింది గౌతమి. “నిప్పు కోడి గులకరాళ్లను ఎందుకు తింటుంది?” అడిగింది శిల్ప. “నిప్పు కోడికి దంతాలు ఉండవు. అందువల్ల తినే ఆహారం నలగొట్టి, అరిగేలా చేసేందుకు ఆ రాళ్లు ఉపయోగపడతాయి” చెప్పింది గౌతమి.

“కొంతమంది వ్యాపారస్థులు బియ్యంలో, పప్పులలో కూడా చిన్నచిన్న రాళ్లను కలుపుతారు కదూ” అంది శిల్ప. “అవునమ్మా! అలాంటి విషయాల్లో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి” అన్నారు తాతగారు. “మనం ప్యుమైన్ స్టోన్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇది అగ్నిపర్వతాలనుంచి వెలువడే లావాకు నీళ్లు కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఇది తేలికగా ఉంటుంది. దీన్ని పొడిబారిన, మృతకణాలతో కూడిన చర్మాన్ని తొలగించడానికి ఉపయోగిస్తుంటారు” చెప్పింది జ్ఞానప్రసూన.

“నిత్య జీవితంలో రాళ్లను గురించిన సామెతలెన్నో వాడుతుంటాం. సంపాదించే కాలంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకో మంటారు పెద్దవాళ్లు” అనగానే శ్రీరామ్ కొంటెగా “ఇప్పుడు అందరి వెనుకా రాళ్లే ఉన్నాయి” అన్నాడు. “రాళ్లంటే ఇక్కడ డబ్బని అర్థం. పొదుపు చేయమని చెప్పటం” అంది నానమ్మ. “ఆఁ ఇంకా ఏమేం సామెతలున్నాయి రాళ్లతో” అడిగింది శిల్ప. “చాలానే ఉంటాయి కానీ కొన్ని మాత్రమే గుర్తొస్తున్నాయి. ‘ఏ రాయి అయితేనేం పళ్లూడగొట్టు కోవడానికి’ అని ఓ సామెత. ఏ విధంగా చేసినా నష్టం, కీడు తప్ప ని సందర్భంలో ఈ సామెత వాడుతుంటారు. కఠిన హృదయం గలవాళ్ల గురించి చెప్పేటపుడు ‘వాడిది మనసు కాదు పాషాణం’ అంటారు. పాషాణం అంటే రాయి అన్నమాట. అలాగే మొరటుగా ఉండే మనిషిని.. వాడో బండమనిషి అంటుంటారు” వివరించింది నానమ్మ.

“అన్నట్లు రాళ్లతో హింస గురించి మరిచిపోయాం. రౌడీ మూకలు రాళ్లతో కొట్టుకోవడం, రాజకీయాల్లో ప్రత్యర్థులు రాళ్ల దాడులకు దిగడం రోజూ వినే వార్తలే” శ్రీరామ్ వాళ్ల నాన్న అన్నాడు.

“ఇంకో ముఖ్యవిషయం.. జాతీయ రహదారుల్లో దూరాన్ని తెలిపే మైలు రాళ్లుంటాయి. అలాగే చరిత్రలో ప్రధాన సంఘటనలను మైలు రాళ్లుగా నిలిచాయంటారు.. వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికి మూలమైన దాన్ని అది అతడి జీవితంలో మైలురాయి అని వాడుతుంటారు” చెప్పారు తాతగారు.

“మాటల్లో సమయమే తెలియలేదు. చీకటి పడుతోంది. ఇక పదండి వెళదాం” అన్నాడు శ్రీరామ్ వాళ్ల నాన్న లేస్తూ.. ఇసుక దులుపుకుంటూ. “అవును.. రాళ్లలో పడి..” గౌతమి నవ్వుతూ అనడంతో, మిగిలినవారు కూడా నవ్వుతూ లేచారు.. ఆ తర్వాత అంతా వాహనం ఎక్కారు. పిల్లల ఒడిలో సంచుల్లో పదిలంగా మేం. ‘మనిషికి ఎన్నో రకాలుగా మా జాతి ఉపయోగపడటం ఆనందంగా ఉన్నా.. హింసకు మమ్మల్ని వాడటం బాధించింది. అంతేకాదు కఠిన హృదయులను పాషాణం అంటారట. ఎంత ఘోరంగా మమ్మల్ని అవమానపరుస్తున్నారు! మేం ఎంత కఠినంగా కనిపించినా నీటి తాకిడికి అరిగిపోతున్నాం. ముక్కలవుతున్నాం.. శిల్పి ఉలితో చెక్కితే ఇట్టే రూపు మారుతున్నాం’ ఇలా అనుకుంటుంటే ఆమధ్య సముద్రపు ఒడ్డుకు వచ్చిన ఒకాయన పాడిన పాట గుర్తుకొచ్చింది.

‘ఈ నల్లని రాలలో.. ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో.. ఓ..
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు..
ఉలి అలికిడి విన్నంతనే.
ఉలి అలికిడి విన్నంతనే గలగలమని పొంగిపొరలు.. ॥ఈ నల్లని ॥
పైన కఠినమనిపించును, లోన వెన్న కనిపించును…
జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును’ ॥ఈ నల్లని॥

‘కవి ఎంత బాగా మమ్మల్ని అర్థం చేసుకున్నాడో.. అలాగే అందరూ అర్థం చేసుకుంటే, మమ్మల్ని హింసకు కాకుండా మంచికే వినియోగించుకుంటే ఎంత బాగుండు’ అనుకుంటుండగానే ఇల్లు వచ్చేసింది. ఇంట్లో అడుగు పెట్టగానే ఎంచక్కని అందాల మార్బుల్ నేల మాకు స్వాగతం పలకటంతో మేం ఖుషీ.. ఖుషీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here