[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]30[/dropcap] నవంబర్ 2021… మరో దురదృష్టమైన రోజు. చెంబోలు సీతారామశాస్త్రి గారు అసలు పేరు అయినా, సిరివెన్నెలగా పిలవబడే మా సిరివెన్నెలన్నయ్య ఆ రోజు దేవ దర్బారులో ఆస్థాన కవిగా నియమించబడి దేవలోకంకి హుటాహుటీగా, మనందరినీ శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయారు. 1955లో పుట్టి 2021లో మరణించారు, చిన్న వయసనే చెప్పాలి!
సిరివెన్నెలన్నయ్య ఏ మనిషితో తనకి కాంటాక్ట్ ఏర్పడినా ఆత్మీయ సంబంధం వెంటనే పెట్టుకుంటారు – తనకన్నా వయసులో పెద్దవారు అయితే అన్నగారూ, అక్కగారూ అనీ; చిన్న అయితే చెల్లాయ్, తమ్ముడూ అనీ; ఇంకా చిన్న అయితే మా పిల్లలు లాగా “నేను మీ మావయ్యనిరా! నే చెప్తున్నాను, ఈ గడ్డం తీసెయ్‌రా బాబూ, బూచాడు లాగా” – అని చూసిన మొదటి క్షణంలోనే! అందరిని అక్కున చేర్చుకుని ఆదరణ పంచడం, ముఖ్యంగా తనని కలవడానికొచ్చిన వాళ్ళు సినిమా కవి అని వస్తే, జస్ట్ తన సినిమా పాటల గురించి మాట్లాడి పంపేయడం కాకుండా, రామాయణ, భారత భాగవతాల గురించి విడమర్చి, అర్థం అయ్యేట్లు చెప్పి వారి జ్ఞానాన్ని పెంచేవారు! ఆయనని ఇండస్ట్రీ వారు సిరివెన్నెల సీతారామ’రాత్రి’ అని చమత్కరించేవారు! ఆయన రాత్రి అంతా మేలుకొని రాసి, పగలు పడుకునేవారు.
మొట్టమొదటి సారి ఏదో ఫంక్షన్‌లో మా గురువుగారు వీరేంద్రనాథ్ గారు నన్ను పరిచయం చేసారు. అప్పుడే, “కాదురా తల్లీ… నన్ను అన్నయ్య అని పిలు” అన్నారు. అంతే, ఆ తర్వాత ఏ సందర్భంలో ఎక్కడ కలిసినా అదే ప్రేమ! వందేళ్ళ సినిమా పండగకి చెన్నై వెళ్ళాం. మొదటి రోజు లాబీలో నేను నా పూర్వజన్మ సుకృతం కొద్దీ దిగ్గజాలతో కూర్చుని వారి చతురోక్తులు ఆనందించే అవకాశం దొరికింది. దిగ్గజాలు అంటే ఆషామాషీగా కాదు – కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు, రావి కొండల రావు గారు, మురారి గారు, గణేశ్ పాత్రో గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, తోటపల్లి సాయినాథ్ గారు, సత్యానంద్ గారు… ఇలా. రెండవ రోజు సభా ప్రాంగణానికి వెళ్ళడానికి నేను బయట నిలబడి, లీ మెరీడియన్ హోటల్ లాంజ్‍లో, మేనేజర్‍లు కారు వచ్చాకా పిలుస్తారని, వెయిట్ చేస్తుంటే – “చెల్లాయ్ రా! ఎవరి కోసం వెయిటింగ్?” అంటూ సిరివెన్నెలన్నయ్య వచ్చారు. కార్లో వాళ్ళతో బాటు ఎక్కించుకుని తీసుకెళ్తుంటే, “రేపటి నీ ప్రోగ్రాం ఏంటి చెల్లాయ్?” అంటే, “భువనచంద్ర గారిని చూడాలి అన్నయ్యా, అల్లు అరవింద్ గారు కారు పంపిస్తానన్నారు” అన్నాను. “నాకు సహోదరుడమ్మా, ఎలా ఉన్నాడు భువనన్నయ్య?” అని అడిగారు. ఆయనకొచ్చిన అనారోగ్యం గురించి కొద్దిగా మాత్రం చెప్పి, “ఇప్పుడు కోలుకుంటున్నారు” అన్నాను. “అయితే రేపు నా అన్ని ప్రోగ్రామ్‌లు కాన్సిల్.. మేమూ వస్తున్నాం, అని వదిన గారితో చెప్పమ్మా, బాపూ రమణ గార్లని కలిసి అటుగా వచ్చేస్తాం” అన్నారు.
గొప్పవాళ్ళు అంతా ఇంతే సింపుల్‌గా వుంటారు. పెద్ద కాంప్లికేట్ చేసుకోరు జీవితాలు! కలిసిన ప్రతివారి జీవితంలో ‘ఓ మధుర స్మృతి’గా మార్తారు! నాకు చాలా ఆత్మీయ, సన్నిహిత సంబంధాలున్న అక్కినేని నాగేశ్వరరావు గారూ, రామానాయుడు గారూ, అల్లు అరవింద్ గారూ, ఇటీవల నన్ను ఇంటర్నేషనల్ జ్యూరీలో కలిసి ‘బేటీ’ అనే స్థానం ఇచ్చి గౌరవించిన చంద్రా నార్వేకర్ గారూ – తేజాబ్, అంకుష్ డైరక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ గారూ; నా మొట్టమొదటి సినిమా ‘అనగనగా ఓ అమ్మాయి’కి ఓ ప్రొడ్యూసర్‍గా వ్యవహరించిన ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారూ (రెండవ సినిమా ‘రేపల్లెలో రాధ’ ప్రొడ్యూసర్ హీరో బాలకృష్ణ గారు, అదేం అదృష్టమో!) – అందరూ నాతో ఎంతో ప్రేమానురాగాలతో వుండేవారు.
మర్నాడు నేను భువన్‍జీ ఇంటికి వెళ్ళి, ఆలస్యం అయితే వుండలేనని ఒంటిగంటకి సామ్రాజ్యలక్ష్మి గారు వండిన వంటని భోం చేసి ముచ్చట్లాడుతుంటే – మా తమ్ముడు వి.ఎన్. ఆదిత్యనీ, వదిననీ వెంటపెట్టుకుని సిరివెన్నెలన్నయ్య వచ్చి భువన్‍జీని సతీసమేతంగా నిలబడమని, వదిన గారితో కలిసి పాద నమస్కారం చేసి – ఆ దంపతుల ఆశీర్వాదాలు తీసుకుని, “రమణి చెప్తే కానీ ఇంత జబ్బు చేసిందని తెలీనే లేదు అన్నయ్యా, నాకెందుకు చెప్పలేదు, అంత కానివాడినా?” అని దెబ్బలాడి, “కోట్ల కోట్ల తెలుగువారి ఆశీస్సులు నీకు వుండగా ఆ దేవుడికి అంత ధైర్యమా నిన్ను మా నుండి లాక్కోవడానికి!” అన్నారు. ఆ మాట నాకు మొన్నటి నుండీ తెగ గుర్తుకొచ్చి దుఃఖం ఆగడం లేదు! తీసుకుపోవటానికి ఈ అద్భుత కవే కనిపించాడా భగవాన్? మమ్మల్ని చీకటిలో ముంచి ఈ వెన్నెలని దూరం చేసావ్? రాత్రి వేళలో సైతం వెలుగులు చిమ్మే అన్నయ్య నవ్వు నాకింకా కళ్ళల్లో కదలాడుతోంది!
ఆ తర్వాత నేను నేషనల్ ఎవార్డ్స్ జ్యూరీ మెంబర్‍గా డ్యూటీ చేస్తూ, ఢిల్లీ అశోకా హోటల్‍లో వుండగా, పొద్దుటే బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా, “రమణి గారూ” అని వినిపించింది. చూస్తే పట్టుచీరలో పద్మావతి వదినా, వాళ్ళ అబ్బాయిలు శాస్త్రీ, రాజా. అక్కడ అలా హఠాత్తుగా చూడగానే కొంత ఆశ్చర్యపోయాను. “మీ అన్నయ్యకి రేపు ‘పద్మశ్రీ’ పురస్కారం కదా రాష్ట్రపతి భవన్‍లో… అందుకే లలిత తప్ప మిగతా కుటుంబం అంతా వచ్చాం… మీ అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు, రూం లోనే వున్నారు” అని వదిన చెప్పారు.
నేను ఆ సందర్భంలో ఢిల్లీలో వుండడం నా భాగ్యం! ఆ సాయంత్రం నా డ్యూటీ అయ్యాకా నేను వారి గదికి వెళ్ళాను. చీకటి పడిందిగా, అన్నయ్య ఫ్రెష్‍గా ఉన్నారు. “రేపు ఏ.పి. భవన్‌లో మన తెలుగు వాళ్ళు నాకు ఫెసిలిటేషన్ ఏర్పాటు చేసారమ్మా, మా చెల్లాయ్ బలభద్రపాత్రుని రమణి కూడా వస్తుందని చెప్తాను, నువ్వు తప్పకుండా రావాలి” అన్నారు. నేను ఆనందంగా ఒప్పుకుని, మా ఛైర్మన్, మణిపురీ అతను, ఇమోసింగ్‌కి, సిరివెన్నెల గారు ఎవరో చెప్పి, సాయంత్రం లాస్ట్ సినిమాకి నాకు కన్సెషన్ ఇవ్వండి, ఆ సమయంలో నేను చూసిన సినిమా పెట్టండి అని – లిస్ట్‌లో, ఆల్‌రెడీ నేను చూసిన సినిమా పేరు చెప్పి, త్వరగా ఆ రోజు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అవార్డ్స్, ఆడిటోరియం నుంచి బయటపడ్డాను.
సిరివెన్నెల గారిని కలవడానికి వుత్సాహపడ్తున్న నా అభిమానీ, సోదర సమానుడూ, సుందరం శొంఠి, కుటుంబ సమేతంగా వచ్చి కార్లో, బయట నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వారితో కలిసి ఏ.పి. భవన్‍కి వెళ్ళాను. అప్పటికే ప్రసంగిస్తున్న సిరివెన్నెలన్నయ్య “అదిగో… మా చెల్లాయ్ కూడా వచ్చేసింది” అన్నారు. పొద్దుట ‘పద్మశ్రీ’ పురస్కారం అవగానే, పద్మావతి వదిన నాకు వెంటనే ఆ అవార్డు ప్రదానం ఫొటోలు వాట్సప్ చేసేసారు. నేను ఎఫ్.బి.లో పోస్ట్ చేసేసాను. పిల్లలు కూడా ఆంటీ అంటూ నాతో చనువుగా, ఆత్మీయంగా మెసులుతారు. వదినగారైతే చెప్పనే అఖ్ఖర్లేదు! అతి తక్కువ సమయంలో, తరచూ ఫోన్‍లో మాట్లాడుకునే ఆత్మీయ స్నేహితులం అయిపోయాం మేం ఇద్దరం. ఆ తర్వాత తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎరేంజ్ చేసిన డిన్నర్‍కి రమ్మని అన్నయ్య పిలిచినా, అప్పటికే నాలుగు సినిమాలు చూసి వున్న నేను, నా బ్యాక్ పెయిన్ వల్ల, వుండకుండా హోటల్ రూమ్‍కి వెళ్ళిపోయాను.
మర్నాడు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నేను ఢిల్లీలో వుండగా, ‘ఏది నిన్నటి స్వప్నం’ నవల చదివి “బావగారితో మాట్లాడాలమ్మా, ఫోన్ నెంబర్ ఇయ్యి” అని ఫోన్ చేసి అడిగారు సిరివెన్నలన్నయ్య. నేను ఢిల్లీలో వుండగానే, మా ఆయనతో ఒక గంట సేపు ఆ నవల గురించి చెప్పి, “ఎంత అద్భుతంగా రాసిందో తెలుసా మా చెల్లాయి” అంటూ మొత్తం కథ విడమరిచి చెప్పారట. ఇది నా జీవితంలోనే అతి పెద్ద సర్టిఫికెట్‍గా నేను భావిస్తున్నాను. మావారు నాతో “మీ అన్నయ్య క్లాసు తీసుకున్నారు కదా నాకు నీ నవల చదవనందుకు” అన్నారు తరువాత.
అన్నయ్యకి ‘మహానటి’కి రాసిన ‘చివరికి మిగిలేది’ పాటకి నేషనల్ అవార్డ్ వచ్చి వుంటే ఎంతో బావుండేది. పాపం నాతో, “అదొక్కటే మిగిలిపోయిందమ్మా. నాకు నేషనల్ అవార్డ్‌కి అర్హత లేదంటావా?” అని అడిగారు. తర్వాత ‘నాతి చరామి’ అనే కన్నడ సినిమాలో పాటకి ఉత్తమ గేయ రచన అవార్డ్ రావడం, ఆ సినిమా మీద ఇంకో కన్నడ ప్రొడ్యూసర్ దావా వేయడంతో ‘స్టే’ ఇచ్చి, అసలు ఆ సంవత్సరం ఎవరికీ గీత రచనకి అవార్డు రాకపోవడం శోచనీయం! నాకు – అన్నయ్యకి అవార్డు రాలేదే అనే కొరత వుండిపోయింది.
ఒకనాడు మా ఫ్రెండ్ లలిత కూతురు సౌమ్యకి బర్త్ డే సర్‌ప్రైజ్‍గా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళాను. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో! ఇక్కడ ఆయన సతీమణి పద్మావతి గారి గురించి ప్రస్తావించకపోతే తప్పు చేసినట్లు… అన్నయ్య ఎవరొచ్చినా ఇంట్లో వుండిపోమంటారు, స్వంత కుటుంబ సభ్యుల్లా చూస్తారు. మా ‘మధుమాసం’లో ఒక హీరోయిన పార్వతీ మెల్టన్ కావచ్చు, మా కిరణ్ ప్రభ గారి అబ్బాయి సుమన్ పాతూరి కావచ్చు! వారూ పెద్దనాన్నా, పెద్దమ్మా అని పిలుస్తూ అంతే ప్రేమగా వారింట్లో మెసిలేవారు. ఆవిడకి ఎంతో ఓర్పు. అందరికీ భోజన వసతులు చూసే ఆవిడ, చాలా సంవత్సరాలుగా అన్నం మానేసారు. బియ్యం అన్నంగా తింటే పడదు అని పలహారంగా తినేవారు. రాత్రి అంతా అన్నయ్య మెలకువగా వుండి రాసుకోవడంతో ఆయన పిలుస్తారేమో అని మెలకువగా వుండడం, ఇలా ఎన్నో ఏళ్ళ సహచర్యంలో, ఆవిడ నిద్ర అనే పదం మరిచిపోయి, భర్తకి సపర్యలు చేస్తూ గడిపారు. ఎంతో స్నేహశీలి, నిగర్వి. లక్ష్మీదేవిలా కళకళలాడ్తూ వుండే వదిన ఈ వియోగం ఎలా ఓర్చుకుంటున్నారో… వూహించడానికే భయంగా వుంది. వెళ్ళి ఇప్పట్లో పలకరించాలంటే కూడా నాకు భయం వేస్తోంది.
ఆ దేవదేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్నీ, అన్నయ్య సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకి శాంతినీ ప్రసాదించాలని వేడుకుంటున్నాను.
(సశేషం)