కరనాగభూతం కథలు -4 మూర్ఖత్వం-నమ్మకం

0
3

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! పాలకులు శాసనాలు చేస్తారు. పెద్దలు ఆచారాలు విధిస్తారు. పాటించేవారవి నమ్మితే, ఒకోసారి మూర్ఖంగా కూడా అనుసరిస్తారు. వారి మూర్ఖత్వాన్ని నిరసించాలా, నమ్మకాన్ని గౌరవించాలా – అన్నది పాలకులకూ, పెద్దలకూ తరచుగా ఏర్పడే సందిగ్ధం. మహేశుడనే రాజు విషయంలోనూ అదే జరిగింది. నీకా కథ చెబుతాను” అంటూ కథ చెప్పసాగింది.

అనగనగా విశాల రాజ్యం. సుభిక్షమైన ఆ దేశానికి రాజు మహేశుడు. ఆయన మంత్రి విదురుడు బుద్ధికి బృహస్పతి, తెలివికి యుగంధరుడు. పౌరుల సమస్యలు తెలుసుకుందుకు, వాళ్లిద్దరూ మారువేషాల్లో నగర సంచారం చేస్తుంటారు.

ఆ రాజ్యంలో జనపురమనే సుభిక్షమైన గ్రామం. గ్రామానికి అటు జీవనది. ఇటు గలగల పారే సెలయేరు. ఊరిచుట్టూ కళకళలాడే పచ్చని చేలు. ఊరినిండా సంపన్నులు.

మాకేం లోటని విర్రవీగే ఆ గ్రామస్థుల్ని సవాలు చేయడానికన్నట్లు – ఓ ఏడాది గాలివానొచ్చి పంట నాశనమైంది. గ్రామస్థులు తట్టుకున్నారు. తర్వాతి సంవత్సరం మిడతల దండొచ్చి పంటంతా తినేసింది. గ్రామస్థులు తట్టుకున్నారు. మరుసటేడు వరదలొచ్చి పంటంతా నీళ్ల పాలైంది. గ్రామస్థులు తట్టుకున్నారు. నాలుగోఏడు చీడపట్టి పంట నాశనమైంది. అప్పటికి ఊళ్లో కలవరం పుట్టింది. జనపురం గ్రామాధికారి రాజీవుడు రాజుని సాయమడగడానికి రాజధానికి ప్రయాణమయ్యాడు.

వీధిలో అడుగెట్టాడోలేదో ఆయనకో తాంత్రికుడు ఎదురయ్యాడు. పాదాలనంటే పొడవాటి అంగీ. భుజాలు దిగిన పొడవాటి జుత్తు. నొసట విభూదిరేఖలు. మెడలో రుద్రాక్షమాల. రాజీవుడు వాణ్ణి చూసి, ఇదేం శకునమని మనసులో కలవరపడ్డాడు.

తాంత్రికుడు రాజీవుడితో, “రాజు దగ్గరికెడుతున్నావ్. ఆయన డబ్బుసాయం చేస్తాడు కానీ ప్రకృతి బీభత్సాల్ని ఆపలేడు. వచ్చేఏడు భూకంపమొచ్చి పంటలేకాదు, ఊరే నాశన మౌతుంది. అది ఆపగలిగింది మీ గ్రామదేవత జనప్రియ మాత్రమే. ఆమె కంటికి రెప్పలా కాపాడ్డంవల్లే ఊరు సుభిక్షంగా ఉంది. తెలిసోతెలియకో ఊళ్లో ఎవరో ఆమె పట్ల అపచారం చేసారు. దాంతో అలిగి నాలుగేళ్లక్రితం ఊరొదిలి పెట్టింది. అప్పట్నించీ ఇక్కడ అరిష్టాలు మొదలయ్యాయి. ఆమెను శాంతింపజేసి మళ్లీ ఊరికి రప్పించేదాకా, రాజైనా మీకు సాయపడలేడు. ఊళ్లో ఇంటికో వరహా చొప్పున నాకిస్తే ఆమెను వెనక్కి రప్పించే ఉపాయం చెబుతాను” అన్నాడు.

రాజీవుడిది చెబితే ఊరివాళ్లు సరేనన్నారు. అలా నాలుగువేల వరహాలు పోగయ్యాయి. తాంత్రికుడా డబ్బు తీసుకుని, “మన రాజధానికి చివర్లో పెద్ద మఱ్ఱిచెట్టుంది. జనప్రియ ఇప్పుడా చెట్టుమీదే ఉంటోంది. ఆమె ప్రసన్నం కావాలంటే నలబైరోజులపాటు అర్ధరాత్రి నుంచి తెల్లారేదాకా, రోజుకొక జనపురం యువకుడు చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడుతూ ఆమెనే స్మరిస్తూ తపస్సు చేయాలి. తపోభంగం కాకుండా గ్రామాధికారి కాపలా ఉండాలి. అప్పుడక్కడ వారిద్దరూ తప్ప వేరెవరూ ఉండరాదు” అనిచెప్పి తనదారిన వెళ్లాడు.

తపస్సుకని ఊళ్లో యువకులంతా ముందుకొచ్చారు. రాజీవుడు వారిలోంచి నలబైమందిని ఎంచుకున్నాడు. వాళ్లంతా రాజధాని చేరుకుని ఓ సత్రంలో బస చేసారు. తొలినాటి రాత్రి రాజీవుడు, యువకుడు ఊరిచివర్లో మఱ్ఱిచెట్టు వద్దకెళ్లారు. యువకుడు చెట్టుకొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతూ, జనప్రియని స్మరిస్తూ తపస్సు చేస్తుంటే, రాజీవుడు చెట్టు చాటున దాగి, అతడికి తపోభంగమవకుండా కాపలా కాస్తున్నాడు.

ఆ సమయానికి మారువేషాల్లో ఊళ్లో తిరుగుతూ అక్కడికొచ్చిన మహేశుడు, విదురుడు చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడే యువకుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. రాజు వాళ్లని పలకరించే లోగా, రాజీవుడు చెట్టు చాటునుంచి వచ్చాడు. యువకుణ్ణి మాట్లాడించొద్దని సైగచేసి వాళ్లను కాస్త దూరంగా తీసుకెళ్లి తన కథ చెప్పాడు. మహేశుడు చిరాకుపడి, “ఊరివాళ్ల సంగతిసరే – గ్రామాధికారివి, నీ వివేకమేమైందీ? మంత్రాలకు చింతకాయలు రాలవని తెలియదా? ఇకనైనా ఈ కఠోరతపస్సు నాపించి- రాజుని కలుసుకో. ఊరికి మేలు జరుగుతుంది” అని మందలించాడు.

రాజీవుడందుకు నొచ్చుకుని, “అయ్యా! తమరెవరో తెలియదు. కానీ దైవశక్తిని నమ్మడం అవివేకమైతే, మన దేశంలో వందలాది ఆలయాల్లో రోజూ భక్తులు దైవదర్శనం చేసుకుని కోరికలు విన్నవించుకుంటారా? మన రాజు మహేశుడు కూడా రాజ్యక్షేమం కోసం ఏటా అన్ని దేవాలయాల్లోనూ అర్చనలు చేయిస్తాడని మీకు తెలియదా?” అన్నాడు.

అప్పుడు విదురుడు కలగజేసుకుని, “ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన మన రాజు మహేశుడు. నేనాయన మంత్రిని. మూర్ఖత్వం వదిలి ఏంకావాలో అడుగు” అన్నాడు.

రాజీవుడు తెల్లబోయి, క్షమించమంటూ రాజు కాళ్లమీద పడ్డాడు. మహేశుడాయన్ను లేవనెత్తి, తననుంచి ఏం సాయం కావాలో చెప్పమని ప్రోత్సహించాడు. రాజీవుడు వెంటనే, “ప్రభూ! ఇక్కడ తపోభంగం కాకుండా ఆపడం నా ఒక్కడివల్లా కాదని భయంగా ఉంది. అందుకని నలబైరోజులపాటు రాత్రిపూట ఇతరులు ఇటువైపు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించండి” అన్నాడు.

విదురుడు చిరాకుపడి, “ఈ తపస్సే గ్రామం బాగుకోసం. ఆ బాగు చేయగల రాజు నీ ఎదుట ఉంటే, నువ్వడగాల్సిందిదా?” అని మందలించాడు. ఐనా రాజీవుడు మొండిగా, “ఇలా తపస్సు ప్రారంభించామోలేదో సాక్షాత్తూ మహారాజే తనకు తానుగా వచ్చి సాయం చేస్తానన్నారు. అది జనప్రియ మహిమేకదా! మరి నలబైరోజుల తపస్సూ నిర్విఘ్నమైతే ఇక మా గ్రామసంక్షేమానికి తిరుగే ఉండదు” అన్నాడు మొండిగా.

రాజీవుడి మూర్ఖత్వానికి రాజుకి మరింత కోపమొచ్చింది. కానీ మంత్రి ఆయన్ను శాంతపర్చి, “సరే! నువ్వు కోరిన ఏర్పాట్లు చేస్తాం. మీ తపస్సులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని వెనక్కెళ్లండి. మమ్మల్ని సాయమడగొద్దు. అన్నీ జనప్రియే చూసుకుంటుందిలే” అన్నాడు రాజీవుడితో.

వాళ్లలాగే చేసి జనపురానికి తిరిగి వెళ్లిపోయేక, “నా పౌరులింత మూర్ఖంగా ఉండడం బాధగా ఉంది. వాళ్లకి సాయం చేసే ఉపాయం లేదా?” అని బాధపడ్డాడు మహేశుడు.

అప్పుడు విదురుడు, “ప్రభూ! అది మూర్ఖత్వం కాదు. నమ్మకం. ఆ నమ్మకాన్ని గౌరవిస్తేనే, మనం వారికి సాయపడగలం. తమరు గ్రామదేవతకి ప్రతినిధి అని చెబుదాం. ఆమె కలలో కనబడి ఆదేశిస్తేనే, రాజధానిలో వాళ్లని కలుసుకుని, తపోభంగమవకుండా ఏర్పాట్లు చేసినట్లు చెబుదాం. ఆమె చెప్పిందనే ఇప్పుడా ఊరెళ్లి సాయం చేస్తున్నామందాం. కాదంటే జనప్రియకు మళ్లీ కోపమొస్తుందని అంటే, వాళ్లే ఒప్పుకుంటారు” అన్నాడు.

మహేశుడలాగే చేశాడు. జనపురం గ్రామస్థులు ఎంతో సంతోషించి రాజునుంచి సాయం అందుకోవడానికి ఒప్పుకున్నారు. చేసిందంతా గ్రామదేవత పేరిట చెయ్యడంవల్ల, రాజు తను అనుకున్న విధంగా జనపురం గ్రామస్థులకు సాయపడగలిగాడు. తర్వాత ఆయన మంత్రితో, “ఇకమీదట ప్రతి ఊరికీ ఒక గ్రామదేవత ఉండేలా ప్రచారం చేద్దాం. అప్పుడా దేవతల పేరిట మంచి మంచి విధానాల్ని అమలు పర్చడం సుకరమౌతుంది” అన్నాడు.

దానికి విదురుడు వెంటనే, “వద్దు ప్రభూ! ఇకమీదట ప్రజల్లో ఉన్న మూర్ఖత్వం తొలగించే ప్రయత్నం చేద్దాం. కొత్త మూర్ఖత్వాల్ని ప్రోత్సహించొద్దు” అన్నాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “జనపురం పౌరులు గ్రామదేవతని గుడ్డిగా నమ్మడాన్ని మెచ్చాడు విదురుడు. మళ్లీ ఆయనే, మున్ముందు అలాంటి మూర్ఖత్వాల్ని తొలగించాలే తప్ప ప్రోత్సహించరాదన్నాడు. ఆయన ఆలోచనల్లో స్థిరత్వం లేదా? ఉందనుకుంటే రెంటినీ ఎలా సమర్థించాలి? తెలిస్తే నా ఈ సందేహానికి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “జనపురం యువకులు గ్రామం బాగుకోరి కఠోరతపస్సు చేసారు. అలా ఇతరుల్ని హింసించకుండా- నిస్వార్థంగా సమాజశ్రేయస్సుకై చేసే కృషి మూర్ఖత్వమే ఐనా గౌరవించతగింది. అందుకే విదురుడు దాన్ని నమ్మకమని గౌరవించాడు. కానీ ఫలితమెంత గొప్పగా ఉన్నా, మూర్ఖత్వం వాంఛనీయం కాదు. ఆ మూర్ఖత్వమే నాలుగువేల వరహాల గ్రామసంపదని తాంత్రికుడి పరం చేసింది. అలాంటి మూర్ఖత్వం క్షణాలమీద తొలగిపోయేది కాదు కాబట్టి, దాన్ని తాత్కాలికంగా గౌరవించినా, కాలక్రమేణా తొలగించి తీరాలి. సందర్భానుసారంగా ఇవ్వడం వల్ల పరస్పర వ్యతిరేకమనిపించినా విదురుడి సలహాలు ప్రయోజనకరమైనవి” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం ఐదవ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here