[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[dropcap]శ్రీ[/dropcap]పీఠములో మాధవతీర్థ యతివరేణ్యులకు విషజర్వం వచ్చి, అది అంటు జ్వరంగా మారింది. వరదాచారికి ఈ విషయం తెలిసింది. ఆయన అప్పన్నపల్లె వెడుతూ సూర్యప్రభను, ఆమె అక్కగారినీ తరువాత రమ్మని చెప్పి, వారు రావటానికి ఎడ్లబండి ఏర్పాటు చేసి, తను గుర్రం బండిలో వెళ్ళిపోయాడు. సూర్యప్రభ, ఆమె అక్కగారు, పదేళ్ళ వెంకటాచారి బండిలో అప్పనపల్లెకు బయలుదేరారు.
వరదాచారి అప్పన్నపల్లె చేరేసరికే యతివరేణ్యుల పరిస్థితి విషమించింది. మాధవతీర్థ యతివరుల ఆజ్ఞపై ఆశ్రమములోని పెద్దలు హుటాహుటీ శిష్యస్వీకార కార్యక్రమం పూర్తి చేశారు. దానికి సూర్యప్రభ, ఆమె అక్క రాక పూర్వమే. విషజర్వముతో మాధవతీర్థ యతి పరమపదించటం కూడా జరిగిపోయింది.
లక్ష్మీకాంతుడు ఇలా సన్యసించిన వెంటనే మాధవతీర్థ యతివరులకు వీడ్కోలు చెప్పవలసి వచ్చింది.
మాధవతీర్థ యతి విషజ్వరంలో ఉన్నప్పుడు, ఆయనకు వెంట ఉండి సేవ చేసాడు లక్ష్మీకాంతుడు. అందుచేత అతనికీ విషజ్వరం వచ్చింది. ఒక్క రోజులో అతనూ కన్నుమూసాడు.
పీఠంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. అలాంటి స్థితి ఎన్నడూ రాదు. ఆ శ్రీపీఠం నిర్మించి రెండువందల సంవత్సరాలయింది. ఏనాడు ఎదురవని ఆ విచిత్ర స్థితికి ఆశ్రమంలోని పెద్దలు ఆందోళన చెందారు. వారికి వెంటనే ఒక పరివ్రాజకుడు, పీఠాన్ని నడిపేవాని అవసరమయింది.
ఆశ్రమ వేద పాఠశాల ప్రధాన ఆచార్యులైన ముకుందాచారి, వరదాచారికి స్వయంగా అన్న. ఆయన వరదాచారిని పిలిచి, “తమ్ముడూ ఆశ్రమానికి, శ్రీపీఠానికి మనం ఎంతో ఋణపడి ఉన్నాం. మన పారమార్థిక అవసరాలు తీర్చటమే కాదు, ఈ ఆశ్రమంలో మన పెద్దలు వేదం నేర్చుకొని, ఘనాపాఠిలైనారు. మనం ఈ ఆశ్రమానికి అనుసంధానంగా జీవిస్తున్నాం. మనం ఋణం తీర్చుకోవాలి…” అన్నాడు.
“అవును అన్నయ్యా! నీవు చెప్పినది నిజం. మనం చేతనైనది చెయ్యాలి…” ఒప్పుకుంటూ అన్నాడు వరదాచారి.
“ఇదే సమయము. శ్రీపీఠానికి మన ఋణం తీర్చుకోవచ్చు. నీ కొడుకును ఆశ్రమవాసిని చేయి…”
వరదాచారి ఆశ్చర్యపోయాడు.
“నా కొడుకా…”
“అవును. నీ మూడో కొడుకు మహర్జాతకుడు. వాడి జాతకంలో సన్యాసం ఉంది కూడా…”
వరదాచారి ఏమీ మాట్లాడలేకపోయాడు. అతనికి సూర్యప్రభ కళ్ళ ముందు కదిలింది. ఆశ్రమ పరిస్థితి చూస్తే క్లిష్ఠపరిస్థితే. ఏకసంధాగ్రాహి, చురుకైనవాడు మహర్జాతకుడైన అయిన కొడుకు కళ్ళ ముందు కదిలాడు. ‘వాడు అంత గొప్పజాతకంతో జన్మించినదిందుకా… నారాయణా… నాకు పరీక్షనా? లేక నీవు ఈ పీఠం కోసం ఈ జన్మ తీసుకున్నావా?’ అనుకున్నాడు. అన్నకు సమాధానమేమి ఇవ్వక మౌనంగా తల ఊపాడు.
అలా అనుకోని నాటకీయమైన పరిస్థితులలో వెంకటాచారి శ్రీపీఠానికి ఉత్తరాధికారిగా నియమించటానికి రంగం సిద్ధమైయింది.
***
ఇవేమీ తెలియని సూర్యప్రభ, ఆమె అప్పగారు వెంకటాచారిని తీసుకొని ఎడ్లబండిలో అప్పన్నపల్లె చేరారు. వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు ఆశ్రమంలో అంతా.
సూర్యప్రభకు అప్పగారికి జరిగినది చెప్పగానే, అప్పగారు తట్టుకోలేకపోయింది. సన్యసించిన పుత్రుని హఠాత్మరణం ఆమెకు తీరని దెబ్బ.
తన ప్రియ పుత్రుడు సన్యసించాలని తెలిసాక సూర్యప్రభా తట్టుకోలేకపోయింది.
వెంకటాచారితో తండ్రి వరదాచారి “నాయనా! నీ అన్న లక్ష్మీకాంతం సన్యసించిన వెంటనే పరమపదించినాడు. పీఠం వారు నిన్ను పీఠానికి శిష్యునిగా స్వీకరించారు. మేము అంగీకరించాం…” అన్నాడు.
పది దాటి పదకొండు సంవత్సరాల వెంకటాచారి “రామా…” అని మాత్రం అన్నాడు, అన్నను తలుచుకొని.
తల్లికీ, తండ్రికి నమస్కరించి, ఆశ్రమ పెద్దలతో కలిసి వెళ్ళిపోయాడు.
సూర్యప్రభ ఏమీ అనలేక, అక్కగారి పరిస్థితికి ఓదార్చ లేక తనను తను సమాధానపర్చుకోవటం ఎలాగో తెలియక తికమకపడింది, కన్నీళ్ళపర్యంతమైయింది. కొడుకును ఆంగ్లవిద్య నేర్పి, ఏ జడ్జిగానో చూడాలనుకున్న ఆమె ఆశ కళ్ళముందు కూలిపోయింది. ఆమె, వరదాచారి శ్రీపీఠం నుంచి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ శ్రీపీఠానికి రాలేదు. పుత్రుడు ఎక్కడ మనసు చెదిరిపోతాడో అనో, లేక తాము భరించలేమనో మనకు తెలియదు.
ముక్కపచ్చలారని వెంకటాచారి, తన పదకొండవయేట, సన్యాసం, శ్రీపీఠ అధిపత్యాన్ని, నారాయణతీర్థుడన్న నామాన్ని స్వీకరించాడు. అలా శ్రీపీఠానికి నారాయణతీర్థ యతివరేణ్యులు ఉత్తరాధికారిగా నియమించబడ్డాడు.
నారాయణతీర్థులకు మొదట ఉన్న బాధ్యత, పరమపదించిన తన ముందు పెద్దలకు చెయ్యవలసిన కర్మలు చెయ్యటం.
సన్యాసి మరణిస్తే వారి పేరున మామూలు వారికి చేసిన కర్మలు చెయ్యరు.
కాని వారి పట్ల నిర్దేశించబడిన కొన్ని క్రియలు ఉంటాయి. అవి పీఠ పరంపరలో వచ్చిన తదుపరి వారు చెయ్యాలి. అలా తన ముందర పెద్దలైన ఇరువురికి చెయ్యవలసినవి చేసాడు నారాయణతీర్థులు.
అటు పైన ముందు వేదవిద్య నేర్చుకోవటానికి, శిక్షణకు ఏర్పాట్లు జరిగాయి. శ్రీపీఠములో ఉంటే నారాయణతీర్థుల విద్య సాగదని, శ్రీరంగంలో ఉన్న ఆశ్రమములో ఉంచి విద్య నేర్పారు గురువులైన మహామహోపాధ్యాయ కృష్ణమాచార్యులు, గోవిందాచార్యులు.
ఆయనకు చతుర్వేదాలతో పాటూ, ద్రవిడ వేదంలో కూడా ప్రవేశపెట్టారు. చిత్రలేఖనంలో ఆసక్తి కనపరిచినందుకు చిత్రలేఖనం కూడా నేర్పారు. ఏకసంధాగ్రాహి అయిన నారాయణతీర్థులు వేదాలతో పాటూ, యోగం, ఆయుర్వేదం, వ్యాకరణం, తర్కం నేర్చాడు. బడిలో చదివిన ఆంగ్లం, ఫ్రెంచ్ కాక భారతీయ భాషలు కన్నడ, తమిళం, మరాఠీ, హిందీ నేర్చుకున్నాడు. హిస్టరీ, కావ్యాలంకారం చదివాడు. నారాయణతీర్థులు సంగీతంలో కూడా ఎంతో మక్కువ చూపేవారు. సంగీతంతో పాటూ వీణను అభ్యసించాడు.
మూడు సంవత్సరాలు ఏకధాటిగా అన్నీ విద్యలను సాంగోపాంగముగా నేర్చిన నారాయణతీర్థులు, శ్రీపీఠము బాధ్యతను పరిపూర్ణంగా స్వీకరించటానికి సన్నద్ధుడైనాడు. అలా అతి చిన్న వయస్సులో శ్రీపీఠమెక్కిన పరమహంస పరివ్రాజకులు శ్రీ నారాయణతీర్థులే.
పీఠానికి వచ్చిన నారాయణతీర్థులకు శ్రీపీఠ పెద్దలు స్వాగతమిచ్చారు. ఆ చుట్టు ప్రక్కల గ్రామాలలో ప్రజలకు వరుసుగా పదిరోజులు అన్నదానం జరిగింది. వచ్చిన భక్తులకు దర్శనమిచ్చాడు నారయణయతివర్యేణులు.
ఆయన పీఠానికి వచ్చాక, ప్రజలలో ఆధ్యాత్మిక ఉన్నతి కలిగించటమే తన ముఖ్యమైన కార్యక్రమంగా పీఠ కార్యాలను నడిపాడు.
ఆశ్రమానికి అనుసంధానముగా ఉన్న వేదపాఠశాలలతో పాటూ, ప్రభుత్వ విద్యనేర్పే పాఠశాలలను కూడా ఏర్పరిచారు యతివరేణ్యులు.
ప్రజలలో విద్య మీద అవగాహన కలిగిస్తూ, అవిద్యే అజ్ఞానమని చెప్పి ‘అక్షరయజ్ఞం’ అన్న పేర అందరికీ ఉచిత విద్యను ప్రవేశపెట్టారు. శ్రీపీఠ ఆశ్రమాలు ఉన్నచోట వేద పాఠశాలలతో పాటూ ప్రభుత్వ విద్య కూడా బోధించటం మొదలయింది.
పెద్దలకు వయోజనవిద్యను కూడా నారాయణ యతివరేణ్యులు ప్రోత్సహించాడు.
(సశేషం)