[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]
అభినుతి
ఆంధ్రుని సన్మానమత్యుదాత్తముగ
ఆంధ్ర దేశములోన ఆచరింపగను
అభిలషించిరి నేటికాంధ్రులేయన్న
శుభవార్త విన మాకు శ్రుతిపర్వ మాయె.
అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి కలిగె
అభినందనార్హమౌ అభివృద్ధి కలిగె
అభినవతిక్కనా ! అభినుతు లివిగొ
అభిషేక వేళ నీ వందుకోవోయి.
పండిత సభలోన వైభవమ్మలర
గండ పెండేరమ్ము కాలికిన్ దొడిగి
ఇభరాజుపై నెక్కి ఏతెంచువేళ
అభినవతిక్కనా ! అభినుతు లివిగొ
సమతత్వమ్మును రూపుమాపు మతపాషండత్వమున్ జూచి యా
కమనీయమ్మగు భారతీముఖము దుఃఖచ్చన్న మౌటన్ గ్రహిం
చు మహాత్మున్ వధియించె నొక్కడన సంక్షోభించి వెల్లించితీ
వమరజ్యోతిని గాంధికై హృదయమందారాత్రి కమ్మట్లుగాన్.
విజ్ఞాన బీజముల్ బీళ్లలో వెదజల్లి, కష్టించి పండించు కర్షకుండు,
కవితలో కమ్మని కస్తూరికాగురు, గంధమ్ము కల్పించు కవివరుండు,
తీయని తెనుఁగులో తెలుగుల వెలుగులన్, గానమ్ము సేసిన గాయకుండు
దోషమ్ము చూపించి దోషిని క్షమియించు, భాషలో పేర్వడ పండితుండు
ఇన్ని దినములనుండియు మిన్నకుండి
సాటివార లెఱింగి రీ నాటికైన
కలిగె కనకాభిషేక మీకవి కటంచు
సంతసమ్మంది రాంధ్రు లత్యంతముగను.
– శ్రీ వారణాసి వెంకటసుబ్బారావు
~
సోదరి కానుక
పండిన మేడిపండ్లవలె బైకి గనంబడి దోషజాలమున్
నిండుగ మోయు పండితులనేకులు కల్గగ వచ్చుగాక యా
పాండితి యేటికో సుగుణపాలన ! నీవలె నీతిబద్ధులై
యుండెడు పండిత ప్రవరు లుండరు నేడిల నూటికొక్కరున్
ధర్మజ్యోతి ముఖంబున
ధర్మాత్ముండైన తండ్రితత్వము తెలిపెన్
ధార్మిక గుణబీజంబుల
నిర్మాణంబయ్యె దొలుత నే నీలోనన్
శీలసంరక్షణ చిత్తంబుననె కాదు, కవితాగమనమందు దవిలియుండు
వేషమే సాంకర్యదోషశూన్యముకాదు, బాసలోనన్ గానబడుచునుండు
కలముతో నీతులు గఱపబూనుటె కాదు, మనములోగూడ నేమరక యుండు
విద్దెనేర్పుటయందె పెద్దపంతులు కాదు, సౌజన్యమందు నొజ్జనము వెలయు
ధాన్యరాసులగాంచు చౌదరియెకాదు
కావ్యరాసులు పెంచు సత్కవివరుండు
కర్షక కులంబునన్ బుట్టి కవికులమున
వన్నె కెక్కిన మేటిమా యన్న గారు.
పొలము పంటకు దోడుగా గలము పంట
కలము పంటకు దోడుగా గడుపు పంట
కలిసివచ్చిన నీ పెద్ద కాపుదనము
లెల్ల వారికి గల్గుట కల్లమాట.
– శ్రీమతి దొప్పలపూడి అనసూయాదేవి
~
నవరత్నాలు
ఎన్నడొ రెడ్డిరాజుల కవీశ్వరునిన్ గనకాభిషేక సం
పన్నునిగా నొనర్చె నొక పార్థివసత్తముడంచు మున్ను మా
విన్నదె కాని, కన్నులకు విందొనరింపదు; కంటి మిప్పుడే
పున్నియ మేమొ? రెడ్డికులభూషణుఁ డిచ్చు సువర్ణ పూజలన్
ఆంధ్రాళి సమ్మోదమందగాఁ బల్కిన, కుండలీంద్ర కవి యకుంఠితోక్తి
స్వర్ణాభిషేక సంపద గాంచి మించిన, శ్రీనాథ సుకవి విశిష్ట శైలి
గండ పెండేరంపు గాన్క గాంచిన యట్టి, పెద్దన్నగారి కవిత్వ మహిమ
ఏనుంగు నెక్కి పృథ్యీశులు మొక్క ని, క్కిన తిరృతికవుల తెనుగుసౌరు
అన్నియును నేకరూపమై యలరుకతన
నందఱును నన్ని విధముల నందినట్టి
నిరుపమాన సమ్మానముల్ నీకె దక్కె
కమ్రగుణగణ్య! తుమ్మల కవివరేణ్య !
రాజుల దేమిలెక్క ? కవిరాజులె ప్రీతిపురస్సరంబు నీ
రాజన మిచ్చినారలు; స్వరాష్ట్ర పవిత్ర చరిత్రయందు నీ
రాజితనామరాజ మపరంజి మెఱుంగుల శాశ్వతంబుగా
రాజిలునోయి మిత్రకవిరాజ ! విరాజిత కాంతు లీనుచున్
ఆత్మార్పణంబున నాతిథ్యమహిమంబు, కొండాడితివి బుధుల్ కొసరి మెచ్చ
సానలుదీరిన జాతిరత్నంబుల, గురియింపఁ జాలితి పరిగపంట
సమలోష్ట హేమమన్ సదమలధర్మంబు, నిలిపి ధర్మజ్యోతి పలుకగంటి
నీ గాంగనిర్ఘరధార గాంధేయచరితంబు, వెలయింపఁ జేసితి తెలుగునాట
పెద్దరికమిచ్చె నీకు నీ పెద్దకాపు
ఆఱునే యమరజ్యోతి యాక్షయంబు
పిక్కిలె రాష్ట్రగానాన దిక్కు లెల్ల
ధన్యుఁడవు నీవు తుమ్మల మాన్యసుకవి !
ఆఱుగాలము పోతన్న యరక దున్ని
విడిచె నెద్దుల, దుమ్మల బీడు మేయ
బాదరాయణసంబంధ మేదొలేక
కవనమాధుర్యసామ్యంబు కలుగు టెట్లు ?
పులకండంబుల నేఱి తెచ్చి; సుధతో బొర్లించి, పూదేనె వా
కలలో ముంచియు, ద్రాక్షపానకము లందుంగల్సి గ్రుచ్చెత్తి, వె
న్నెలలోఁజేరిచి యాహరింతువట; అంతేకాని లేకున్న నీ
లలితాటోప కవిత్వశైలి యెటులల్లన్ జాలెదో చౌదరీ !
ఆంధ్రమానస చోరత్వమనెడి నేర
మీవు సల్పితి పాత కేడీవి గావె ?
పొన్నుసంకెల పొన్నూరు పురము చెంత
వేసినారన్న నిందులో వింతయేమి ?
ఇంటిపేరు కస్తురి వారు ఇల్లు గబ్బి
లాలకంపను లోకోక్తి లాతియయ్యె
ఇంటిపేరు వగరె కాని హృదయ మధిక
మధురము కవిత యంతకున్ మధురతరము.
ఆమయమొండులేక యిటు లామెత లందుచు నాంధ్రజాతికిన్
గోమలకావ్యకన్యకల గోరినరీతి సృజించుచుండి నా
నామహిమోన్నతు ల్వడసి నాటికి నాటికి జియ్యపట్టి, శ్రీ
రాము కటాక్షవీక్షణపరంపరచే విలసిల్లు మగ్రజా !
– శ్రీ చింతలపూడి శేషగిరిరావు
~
సత్కవీశ్వరా!
శ్రవణానందకరంబుగ
దవిలెన్ కమ్మకులవార్థి దనరు కవీంద్రుం
డవిరళ కాంతిసుధాంశుడు
భువి దుర్లభ గౌరవంబు పొందె ననంగన్
తుమ్మలవంశవారినిధి తోయజవైరి విధానదోచి లో
కమ్మున సత్కవిత్వకళ కమ్రముగా వెదజల్లి యెందు బా
రమ్మును లేనిశక్తి దనరారిన యిట్టి, సీతరామనా
మమ్మును దాల్చు పండితుడు మాన్యుడు మాకిట నన్ని భంగులన్.
నీ కవి తారసంబు ధరణీధవపూజితమై తనర్చి య
స్తోకకళాజితామృతము శోభనమున్ సకలైకరమ్యమున్
ప్రాకటమైనకీర్తి రుచి రాజిలె, ధన్యము నీదుజన్మ నీ
వేకడనైన భాగ్యనిధివే కద ! ఎంచగ సత్కవీశ్వరా !
దివ్యంబు నీదు గాంధీమహాత్ముని కృతి, దానికి సాటియీ ధరణి లేదు
రాష్ట్రగానము, సుధారమ్యంబు, తత్కీర్తి, నిఖల దిక్కుల యందు నిండిపోయె
గంధగజారోహ గౌరవంబును గన, కాభిషేకంబు నీ కయ్యె నేడు
గండరగండని ఘనతతో గండపెం, డేరంబు దాల్చితి చారుభంగి
కవిత కెంతటి పూజ్యత భువిని గలదొ
యంతపూజ్యత గొంటి వీ వఖిలగతుల
రవివి నీవు నిన్ గూరిచి భువిని నేను
వేఱె పల్కంగనేల! యో విబుధవర్య !
అభినవ తిక్కనా! సదమలామృత సత్కవితామృతాంశ ! నీ
విభవము నీ యశంబు జనవిశ్రుతశక్తియు నాడు నాటికిన్
ప్రభలను దెల్గు దేశమున బ్రాంచితలీలను వృద్ధి బొందగా
ప్రభుతను నీదు వాగ్గరిమ రాజిలు గావుత మెల్లకాలమున్
– శ్రీ పల్లెకొండ రంగయ్య
~
నానృషిః కురుతేకావ్యమ్
నెచ్చెలియగు తుమ్మల సీతారామమూర్తి కవీశ్వరుని సన్మానవార్త ఆనందము కలిగించినది. ఆకులచాటు పిందె చందమున; సాధుపద్దతి నవలంబించి, సత్త్వభావసంపదచే బొంపిరివోపు సరసవచనరచనాచతు రిమఁ జెలువొంది, సాహిత్యోపాసన మొనర్చుచున్న యీ ఋషికల్పుని జిరకాలమునకు సమకాలిక భాషాభిమానులు గురుతించి సత్కరింప బద్దకంకణూ లగుట స్తవనీయమగు సంగతి. ఈ కార్యసన్నాహ మాంధ్రభారతికి జయభేరి మోయించుటగా మఱి యొకటి యగునా? మన యిలువేలుపగు సీతారాముడు శాంత గుణాభిరాముఁడు. నే డాంధ్ర పండితకవి మండల మధ్యమున నలంకార శోభితమగు ”శారదా పీఠము” నధిష్ఠించి కనకాభిషేకము గాంచుచుండిన యీ సీతారామమూర్తి కవిభూషణుఁడును శాంత స్వభావముద్రితుఁడు. కావున నీ సత్కారకల్పనమున మనము ధన్యులము. యథార్థ కవిశబ్దవాచ్యుఁడగు సీతారామచౌదరి (కవీశ్వరు)ని యధాశక్తి సంభావించి సుకృతుల మైతిమి. సమానాధిక రహితముగు కవి పట్టము గొన్న యీ యనఘుని నామమునకు ”చౌదరి” శబ్దము జేర్చుట యిఁకమీద భారకారణము. కావునఁ గవియనియే పిలుతము,
సీతారామమూర్తికవి ఉభయకవిమిత్రుఁడు. అంతియ కాదు. ఉభయ కులోద్ధారకుడు. తుమ్మలవారి వంశ మాయనఘుని జనికారణమున నజరామరమగు యశస్సంపద నార్జించినది. కవిజనకల్పిత కావ్యసంతానము నిరుపాధికముగదా! అందుచేత సప్తసంతానములఁ గావ్యసంతానము పేరెన్నికఁగన్నది.శాశ్వతస్థాయిగొనుచున్నది. కవిని చిరంజీవినిఁ జేయు చున్నది. ఆయా కారణముల చేత నస్మన్మిత్ర వరేణ్యుఁడు సీతారామమూర్తి కవిచంద్రుఁడు చిరంజీవియై నిరాడంబర సహజ వాగ్విలాసవిన్యాసముల సొంపునింపు కావ్యకుసుమముల తెలుగు బలుకుల వెలఁది నలరించుచుఁ దన కీర్తిచంద్రికలచే ద్రిలింగసీమ నలుదెసల గైసేయు గావుత.
ఋష్యంశ సంభూతులు మహాకవులు ‘కావున ఋషి కానివాడు కావ్యకర్త కాలేడన్నారు లాక్షణికులు, అనగా గవితాలక్షణముతోడ ఋషి జనసహజములగు శాంతశమదమాదిక సాత్వికలక్షణములుగూడ గవికి అమరి యుండిననాడు మాత్రమే అతఁడు కవినామ వాచ్యుఁ డగుచున్నాడు. ఇట్టి యోగ్యలక్షణ లక్షితుడగు వాని రచనలు నిత్యములు. తక్కురచనలఁగూర్చి చెప్పఁబని లేదుగదా! కవులని పిలిపించుకొనవచ్చును. చెప్పుకొనవచ్చును. పద్యములల్లవచ్చును. అవియన్నియు నస్థిరములు. నీటిబుడగలు. చిరస్థాయి గాంచజాలవు. మన సీతారామ మూర్తికవితోడ సన్నిహితమైత్రిగల వారు ఆయన అనూయామత్సరాదిక హేయగుణమలీ మసహృదయుడు కాడని నిస్సంశయముగ జాటంగలరు. ఆ వేసము, ఆ భాష, ఆ నమ్ర భావముతోడి సామాన్య వస్త్రాద్యలంకరణము, ఆ చిఱునగవు సోయగము బ్రకటించు ప్రసన్న ముఖము ఆ యాజానుబాహు శరీరముతోడి నిరాడంబరవర్తనము ఆ సర్వసులభ మధుర సంభాషణము,కల్ల యెఱుగని జీవనము, కపటమెఱుంగని కవనము ఇవి సీతారామమూర్తి కవివరునకు బెట్టని సొమ్ములు.ఈ కవీశ్వరుని రచనల యందంతట నట్టి యుత్తమ భావ తరంగములు తుఱంగలించు చుండును. కావ్య వస్తువును స్వీకరించుట యందే సీతారామమూర్తి కవీంద్రుని యొక్క పరిశుద్ధ భావౌన్నత్యము తేటతెల్లముగ దెలియనగును. దైవభక్తి, దేశభక్తి స్వస్థాన వేషభాషాభిమానము లీ కైసరి కబ్బముల దీయనగుమాటలలో దొణికిసలాడుచుండును.
కవులు తృణీకృతబ్రహ్మపురందరులు. మానవజీవితమునకు సూర్యచంద్రుల ప్రకాశమును బోలి కవిజన సుభాషితము లత్యవసరములు. అవి లేనినాడు సూర్యచంద్ర తేజస్సంపదయు నక్కరకు రాదు. ప్రపంచ వ్యవస్థయంతయు నజ్ఞానాంధకారమున మునిగిపోవును. కవి జ్ఞానప్రదాత. బ్రహ్మదేవుని యంతటివాడు దివ్యవాణీ చోదితుఁడై గాని సృష్టి క్రమము నారంభింప జాలఁడయ్యెను. వాణీ పరావతారమూర్తులగు నుకవివరులు ప్రపంచమున నత్యున్నత స్థానము నాక్రమించి యున్నారు. నిర్మత్సరులు, నిరహంకారులు, నిత్యతృప్తులు, విశ్వశ్రేయః ప్రదాతలునగు మహాకవులఁ బూజించుట పరమధర్మము. వారు అజాత శత్రువులు చూడండి.
చం.. మనమున గొన్న నెవ్వగల మాన్పి ఘటింతురకాండ సమ్ముదం
బనఘ కథాముఖంబున హితాహిత బోధమొనర్తు రింపుగా
గనుగొను కన్న నద్భుతముగా నెఱిగింతు రతీంద్రియార్థముల్
గనుగొన నెల్లవారల కకారణ మిత్రులుగారె సత్కవుల్” – సంకుసోల నరసింహకవి
కవిధర్మము నీ పై పద్యము దెల్పుచున్నది. కవి బాధ్యతను మనము గుర్తింప నీ పద్యము తోడ్పడుచున్నది. ఈ యోగ్యత సంపాదించిన మహాకవులు పలచ పలచగానున్నారు నేడు. ఇట్టి వర్గమునకు జెందిన ”ఎల్లవారల కకారణమిత్రుడు” మన సీతారామమూర్తి కవీశ్వరుడు. సాహిత్యోపాసన, రచనము, ఇవి యీ యనఘుని కృత్యములు. ఆత్మస్తుతి, పరదూషణలీ మహనీయునికి దెలియనే తెలియవు. కవిత్వయోగ పట్టభద్రుడగు దిట్ట, హేయప్రత్యాఖ్యాతములగు విషయములకు దన రచనలయందు దావు నొసంగునా! అవి సామాన్యుల గుణములు మిన్ను విఱిగి మీద బడవచ్చినను సీతారామమూర్తి కవితిలకుఁడు నిజధర్మము నుజ్జగించు పజ్జం జన నొల్లడు. దీని కాయన రచనలే నిదర్శనములు,
పరమేశ్వరుఁడు దనలీలా నాటకము నభివర్ణించి యజ్ఞుల బోధించుటకుఁ గవీశ్వరులను సృజించును. అందుచేత బరమాత్ముని యనంతశక్తి వైభవముల సంస్తుతించి వివిధార్ధముల మానవధర్మమును నిర్వచించి లోక సంగ్రహమునకు మార్గము జూపుట నిజమగు కవికి విధి. మానవజీవితయాత్రకు కవీశ్వరుడు మార్గదర్శకుడు. దైవభక్తిని, నీతియావశ్యకతను, సత్యవ్రత మును, పురుషార్ధములను, మానవునియందు నిగూఢమైయున్న శక్తులను, జక్కగ వ్యక్తపరుచు రచనల రుచిగొల్పు చందమున రచించుచు బ్రకృతి నిదర్శనముల జూపుచు, సర్వజన జేగీయమానకవిత్వపటుత్వమహత్వమును జూపి, వంశపావనుడై, చిరకాల జీవియై కవీశ్వరుడు రాణించుట పరమధర్మము. పరమేశ్వర మహిమావిశేషముల గొలిచి చూచుటకు గవి కొలగాడట. ఈ క్రింది పద్యభాగమును చిత్తగింపుడు.
చ. కవి కొలగాడు, కావ్యములు గాదెలు కుంచము వాని బుద్ధి యీ
భువనము పంటకళ్ళమట బ్రోవగు రాసులు నీ విలాసముల్ ………”
అనవసరాందోళనల పొంత బోవక అరిషడ్వర్గములచే మేధస్సును బాధించక మనశ్సాంతిని వీడక పై నుడివిన కవిధర్మముల బాటించి యీ కాలమున కావ్యకల్పన మొనర్చుచున్న పుణ్య మూర్తులయందీ సీతారామమూర్తి కవిగారును సెన్నికగన్న వారు. ‘ బోద్ధారో మత్సరగ్రస్తాః’ అను భర్తృహరి వాక్యమీ సత్యకవియందు జెల్లుబడి కానేరదు. ఇతడు నిర్వికారుడు కావున ఋషి, కావ్యరచనమున కర్హుడు. అట్టి వానిని సన్మానించుట ప్రాజ్ఞులకు విధి గదా! ప్రభుత్వ ఆస్థాన కవీశ్వరస్థానమున కీ సుకవి పుంగవుడెంతేని తగినవాడు. ఇతడు వ్రతి. ఏ ఎండ కాగొడుగు వేయు చపలులలో జేర్పదగడు, అహమహమికలతో బరపాండిత్యాదికముల దిట్టి దిగ పాఱబోయు స్వభావము నెఱుంగని యీ సాధుపుంగవుని బ్రభుత్వమువారు ఆస్థాన కవీశ్వర స్థానప్రదానమున సంభావించి, సత్పాత్రసత్కార ఫలవిశేషము నార్జింతురు గావుత, దేశీయులీ సన్మానముతో దనిసి మిన్నకుండక యేకగ్రీవముగ సీతారామమూర్తి కవి గారిని ప్రభుత్వమువారు ఆస్థానకవీశ్వరునిగ స్వీకరింపదగు విధానము నవలంబించి కార్యాచరణమున కుపక్రమింతురుగాత.
మహాకవులదృష్టియందు త్రిభువన సామ్రాజ్యము గూడ దృణప్రాయము. అట్టిచో నిట్టి సామాన్య సన్మానము లాత్మీయులమగు మనము సంతృప్తి చెందుటకే యగుగాక ”సుకవితా యద్యస్తి రాజ్యే నకి” మ్మను నూక్తికి లక్ష్యభూతులైన మహాకవులు అనాప్త సమస్తకాములుగదా! వారి యంతరువుకు దగిన సన్మానము వారి కావ్యరసాస్వాదన మొనర్చి ఆ యుపదేశముల బాటించి సజ్జనులమై నడచుటయగు గాక మఱియొకటి యగునా?
శ్రీ సీతారామచంద్రస్వామియనుగ్రహము సీతారామమూర్తి కవీశ్వరున కాయురారోగ్యై శ్వర్యముల బ్రసాదించి యనవరతము రక్షించుచుండు గావుత. మంగళప్రదమగు నీ సన్మాన మహోత్సవము కవిగారి భవిష్యదభ్యుదయమంగళ ద్వారమై సీతారామమూర్తి కవిసత్తముని గృహము నిత్యమంగళభాసితమై వెలయు గారణమగుగాత. ఇతోధిక సరళచమత్కారభావ బంధురరస సమంచితవాక్సంపదల బ్రసాదించి సర్వ జనస్తుతిపాత్రమగు కావ్యసృష్టి యొనర్చు ప్రతిభావిశేషముల దయచేసి వాణీ హిరణ్యగర్భులీ కవీశ్వరుని గాక్షించుచుందురు గావుత. సమధికోత్సాహాదిక దివ్యశక్తియుక్తునిఁ గావించి సకలసంపదలను సత్సంతతినిఁ గూర్చి సర్వమంగళాశర్వు లీ సుకృతిని సర్వదా కాపాడుచుందురు గావుత.
– శ్రీ కొణిదెన బాలకృష్ణయ్య
(సశేషం)