[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]నా[/dropcap] పిహెచ్.డి సబ్జెక్టు గోపీనాథ వేంకటకవి, వేంకటగిరి సంస్థానం ఇతర కవులు. అయిష్టంగానే పరిశోధనకు పూనుకోన్నా, క్రమంగా అందులో ఆసక్తి నెలకొన్నది. 1892లో వెంకటకవి మరణించారు. దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం జీవించిన కవి ఆనవాళ్ల కోసం ఎంతో అన్వేషణ చేయవలసి వచ్చింది. మనకు మన పూర్వీకుల పట్ల శ్రద్ధ కాని, ఆసక్తి కానీ ఉండదు, ఆస్తుల విషయం తప్ప. 1873లో ప్రింట్ అయిన నెల్లూరు జిల్లా manual లో ఈయన స్వగ్రామం కావలి సమీపంలో లక్ష్మీపురం అని వుంది. 1967లో వేంకటగిరి వెళ్ళినపుడు కాశీవిశ్వనాథస్వామి గుడి వీధిలో వారి నివాసమని చెప్పారు, కానీ ఆ యిల్లు చూపించలేకపోయారు. వెంకటకవి మనుమని భార్య, చాలా వృద్ధురాలిగా ఉంటూ, తన మనుమలను పెట్టుకొని కరణకమ్మ వీధిలో ఉండేవారని ఓక చిన్న ఇల్లు చూపించారు. ఈ అన్వేషణలో వేంకటకవి మనుమని మనుమలు ఒకరు విశాఖపట్నం, గాజువాకలో విద్యుత్ శాఖ లో జె.ఇ.గా ఉన్నట్లు పోవిడి తెలిసింది.
1967 వేసవిలో వెంకటకవి సొంతవూరు లక్ష్మీపురం, ఆ చుట్టుపక్క వూళ్ళు కండ్రిగ, సిద్ధనకొండూరు, గుడ్లదోన మొదలైనవూళ్ళన్నీ పిచ్చిగా తిరిగాను. లక్ష్మీపురం పెద్ద వూరు. గ్రామకరణం గోపీనాథం నరసయ్య, మునుసుబు గోపీనాథం సుదర్శనం. ఇద్దరి పూర్వీకులకు వేంకటకవి పూర్వీకులతో ఏదో చుట్టరికం వుంది. తమ తాతగారు మాలకొండయ్య కవి 1961లో చనిపోయినట్లు, ఆయనకు వెంకటకవితో బంధుత్వం ఉన్నట్లు చెప్పాడు. ఈ మాలకొండయ్య యక్షగానాలు, పద్యకావ్యాలు, రాసినట్లు నెల్లూరు మండల సర్వస్వంలో గ్రంథస్తం అయినా తమ వద్ద ఏమీ మిగలలేదని నరసయ్య చెప్పాడు. 1921లో మాలకొండయ్య కవి గోపినాథుని వెంకయ్య శాస్త్రి జయంతి జరిపాడు. తిరిగి 1937లో ఈయనే మరొకసారి వెంకయ్యశాస్త్రి జయంతి కావలిలో నిర్వహించినపుడు చేసిన ఉపన్యాసంలో వెంకయ్య శాస్త్రిని గురించి అనేక విషయాలు తెలియజేశారు. లక్ష్మీపురంలో వయోవృద్దులను కలిసి విచారించాను. ఆయన గొప్ప కవీశ్వరులు అని తడుముకోకుండా చెప్పారుగాని అంతకన్నా ఏమీ చెప్పలేకపోయారు. వెంకటకవి ఆవూరు సమీపంలో చెరువు బాగు చేయించారట! దాన్ని వెంకయ్యశాస్తుర్లు గుంట అని వ్యవహరిస్తున్నారు. మొదటి సారి వెంకటకవిని వెంకయ్య అని గ్రామీణులు వ్యవహరించడం విని ఆశ్చర్యం వేసింది. ఒక రైతు ఇంటికి తీసుకొనివెళ్ళి పూజామందిరంలో గోపీనాథ రామాయణాన్ని చూపించాడు. ఒక ముదివగ్గు, గొట్టిపాటి సుబ్బమ్మ గారట, తాను బాల్యంలో ఆయనను చూసినట్టు, ఆయన కుటుంబంవాళ్ళు వెంకటటగిరి వారిచ్చిన మేనా తమకు అమ్మినట్లు, ఇటీవల అగ్నిప్రమాదంలో మేనా కాలిపోయినట్లు చెప్పారు.
నెల్లూరు వర్ధమాన సమాజంలో పాత వార్తాపత్రికలు చూస్తంంటే 1921లో వెంకయ్య శాస్త్రి జయంతిని గోపీనాథం మాలకొండయ్య లక్ష్మీపురంలో జరిపినట్లు తెలిసింది.1937లో కావలిలో జరిగిన జయంతి సభలో మాలకొండయ్య గారు వెంకయ్య శాస్త్రి జీవిత విశేషాలను గూర్చి చాలా వివరంగా ఉపన్యసించారు. అదృష్టవశాత్తూ ఆ ఉపన్యాసపాఠం నెల్లూరు వారపత్రిక సుబోధిని రిపోర్ట్ చేసింది. నేను లక్ష్మీపురం నుంచి పక్కనే వున్న గుడ్లదొన గ్రామానికి వెళ్ళాను. ఆ వేసవి మండుటెండలో అంతా కాలినడకనే. గుడ్లదొనలో ఎవరో ఒక గృహస్థు త్వరకవి మాలకొండరాయుడి సిద్ధేశ్వరస్తోత్రం అచ్చుప్రతి ఇచ్చారు. పుస్తకం తిరగేస్తుంటే ‘శ్రీనాథసముడు గోపినాథవెంకట సత్కవినాథుని జన్మభూమి’ అని ఆరంభించి లక్ష్మీపురాన్ని ప్రశంసిస్తూ రాసిన పద్యం కంటపడింది. లక్ష్మీపురం, ఆపరిసరగ్రామాల్లో వెంకయ్య శాస్త్రి స్మృతులు ఏదో రూపంలో ఇంతకాలమైనా మిగిలాయనే సంతృప్తితో వెనుదిరిగాను.
మొదటిసారి ఆరుద్ర గారి ద్వారా గోపీనాథం వెంకటకవి కాదు వెంకయ్యశాస్త్రి అని విన్నాను. లక్ష్మీపురం గ్రామీణులు వెంకయ్య శాస్తుర్లు అన్నారు. ఆయన పుస్తకాల మీద వెంకటకవి అనే అచ్చులో ఉంది. రాజాగారు ‘మా ఆస్థాన కవీశ్వరులు వెంకయ్యశాస్త్రి’ అనే మనస్సాక్ష్యం పుస్తకంలో వ్యవహరించారు. కవి రాజాగారికి రాసిన లేఖల్లో గోపినాథుని వెంకయ్యశాస్త్రి అని చేవ్రాలు చేశారు. నేను వెంకయ్యశాస్త్రినే ప్రమాణంగా తీసుకొన్నా.
నా థీసిస్ ఆధారంగా ‘గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం’ అని 1984 ప్రాంతంలో ఒక పుస్తకం తయారు చేసి టిటిడి వారికి ఆర్థికసహాయం కోసం పంపాను. టిటిడి వెంటనే 4000/మంజూరు చేసి, డిడి పంపించింది. ఆ డబ్బు ఒక ప్రెస్ వారికిచ్చి పుస్తకం అచ్చు వేసిపెట్టమన్నా. ఆ ప్రెస్ యజమాని అప్పులపాలై ప్రెస్ అమ్మేశాడు. నా పుస్తకం మాత్రం అచ్చుకాలేదు. కొన్నేళ్ళ తర్వాత టిటిడి నాఫైలు బయటికి తీసి పుస్తకం వెంటనే అచ్చువేసి పంపమని నోటీసు ఇచ్చింది. ఈమారు కాస్త జాగ్రత్త పడి మళ్ళీ పుస్తకం రాశాను. ఇది ఒక కవి జీవితం, ఆయన సాహిత్య పరిచయం కూడా ఉంది. వెనుక అట్టమీద వెకయ్యశాస్త్రి ఫొటో వెయ్యాలని తలపెట్టాను. 1929 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో కవిగారి పాస్పోర్ట్ సైజు ఫొటో వేసి దానికింద కవి మరణించడానికి ఒక్క రోజు ముందు తీసిన ఫొటో అని రాశారు. నా పరిశోధనలో వెంకయ్యశాస్త్రి 1892 జూన్ 8న జ్వరంతో మరణించినట్లు వెంకటగిరి పంచాయతి జనన మరణ రిజిస్టరులో రాసివుంది. కవిగారి పోషకప్రభువు రాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచమనాయుడు 1892 జూన్6వ తేది మద్రాసులో చనిపోతే ప్రత్యేక రైల్లో అయన భౌతికకాయాన్ని వెంకటగిరి ప్రజల సందర్శనార్థం తీసుకుని వచ్చారు. ఈ చిన్న సాహిత్య పుస్తకం మొదలు, ముగింపు ఎట్లారాయాలో అని కొన్ని రాత్రులు ఆలోచిస్తూ గడిపాను. పుస్తకం మొదలు పెట్టేటపుడు, ముగింపులోను కాస్త నాటకీయంగా, డ్రమటైజ్ చేసి రాయాలని తలపెట్టాను. మహారాజు భౌతిక కాయానికి నివాళులర్పించడానికి పౌరులు బారులు కట్టి నిలబడి వుంటారు. పుస్తకం ముగింపులో వెంకయ్య శాస్త్రి మరణాన్నికూడా ఇట్లాగే నాటకీయంగా రాశాను. ఆ కథనాలను చదవండి.
~
ఒక మనస్వి కన్నుమూశాడు
“పెదరాజాగారు పోయారట”
“పెద ఏలినవారు పోయారట”
ఎవరి నోట విన్నా ఇదేమాట.
ఎక్కడబట్టినా జనం ఇదే చెప్పుకొంటున్నారు.
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రైల్లో రాజాగారి భౌతికకాయాన్ని చెన్నపట్నం నుంచి వెంకటగిరి తీసుకొస్తారట! ఆ నోటా ఈ నోటా ఈ వార్త వెంకటగిరి ఊరంతా వ్యాపించింది. ‘నగిరి’ సేవకులు, దాసీలు హడావుడిగా పరుగులు తీస్తున్నారు. ఎవరు ఎందుకు పరుగెత్తుతున్నారో ఎవ్వరికీ తెలీదు. ఒకటే హడావుడి, ఒకటే తొందర. వెంకటగిరి బజారు వీధిలో సందుగొందుల్లో జనం గుంపులు గుంపులుగా నిలబడి పెదరాజావారి మరణవార్తను గురించే చర్చించుకొంటున్నారు. వివరాల కోసం విచారిస్తున్నారు. కన్నీళ్ళు పెట్టుకొంటున్నారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పెదఏలిన వారి పెద్ద కుమారుడు ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఎక్కడెక్కడో ఉంటున్న రాజాగారి కుమారులంతా వెంకటగిరి వస్తున్నారని అనుకొంటున్నారు. వెంకటగిరి ఊరుఊరే కన్నీరు నింపినట్లుగా అనిపించింది.
పండితుడూ, రసికుడూ, రచయితా, మేధావీ, వేదాంతి, కళా పోషకుడూ, సర్వజ్ఞకుమార బిరుదాంచితుడూ, పెదఏలినవారుగా వెంకటగిరి ప్రజల్లో వాడుక పడిన వెలుగోటి కుమారయాచమనాయడి భౌతికకాయాన్ని వెంకటగిరి తీసుకొచ్చారు. వెంకటగిరి జమీందారీ హోదాకు తగిన రీతిలోనే అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. ‘నగిరి’ నాలుగు దోవల్లో జనం బారులు దీరి నిలబడి, తమ ప్రభువు కడసారి దర్శనం చేసుకొంటున్నారు.
ఆ సమయంలో అందరి మనస్సుల్లోనూ ఒకే ఒక వ్యక్తిని గురించిన చింత. అందరి ఆలోచనలూ ఆయన మీదే. ఈ దుఃఖాన్ని ఆ వృద్ధుడు తట్టుకోగలుగుతాడా? అసలీ చావుకబురు ఆయనకు ఎవరు అందజేస్తారు? అన్నీ సందేహాలే! ఎట్లా తెలిసిందో, ఎవరు చెప్పకుండానే ఆ వృద్ధుడికి ఏలినవారి మరణవార్త చేరింది. ఎవరో అయన రెక్కపట్టుకొని నడిపించుకొస్తున్నారు, జనం రెండుపాయలుగా విడిపోయి ఆయనకు దారి కల్పిస్తున్నారు. అదుగో! పండిన ఆకులాగా ఉన్న ఆ వృద్ధుడే పెద ఏలినవారి ఆస్థానకవి గోపీనాథుని వెంకయ్యశాస్త్రి. తన ప్రభువు – ఏలినవారి భౌతికకాయం ముందు నిలబడి మౌనంగా అశ్రుతర్పణం చేస్తున్నాడు. రాజాగారి భౌతికకాయానికి ఫోటోలు తీస్తున్నవ్యక్తికి ఎవరు చెప్పారో, ఏమి తోచిందో తెలీదుగాని, ఆ వృద్ధుడు చాలా ముఖ్యమైన వ్యక్తి మాదిరి తోచాడు. వెంటనే ఆయన ఫోటో కూడా ఒకటి తీశాడు.
***
ఒక మహామనీషి కన్ను మూశాడు
“వెంకయ్య శాస్తుర్లు పోయారట!”
“ఏమైందీ?”
ఎవరో విచారిస్తున్నారు.
“ఏమీ లేదు”
ఇంకెవరో సమాధానం చెబుతున్నారు.
“మరెట్లా పోయారు?”
“నిన్న పెద ఏలినవారి భౌతిక కాయాన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత, కాస్త జ్వరం వచ్చింది. తనకు భోజనం వద్దని, ఎవరూ పలకరించ వద్దనీ, రాత్రి పండుకొంటూ చెప్పారు…”
“అంతేనా…”
“అంతే – ఉదయం చూస్తే, ప్రాణం లేదు. రాత్రి నిద్రలో ఎప్పుడో పోయారు!”
కుమారయాచమనాయడు చనిపోయి రెండు రోజులైనా కాలేదు. పెదఏలినవారి ఆకస్మిక మరణం వల్ల కలిగిన దిగ్భ్రాంతి నుండి వెంకటగిరి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే వెంకయ్యశాస్త్రి మరణవార్త దావానలంలాగా వ్యాపించింది. ఆ మహారాజు భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చినట్లే, ఆయన ఆస్థాన కవి అంతిమ దర్శనానికి ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. ‘పెదరాజావారి’ భౌతిక కాయం పక్కన నిలబడి ఈ వృద్ధుడు కళ్ళనీళ్ళు పెట్టుకోడం అందరి మనసుల్లోనూ ఒక్కసారి మెదలింది. ఇంత లోనే చావా? ‘ఎంత అనాయసంగా పోయాడయ్యా!’ ఎవరో ఆశ్చర్యపోతున్నారు. ‘మహారాజావారి’ అంతిమయాత్ర మాదిరే ‘మహాకవి’ అంతిమయాత్ర కూడా జరిగింది. చినరాజాగారు శ్రద్ధగా అన్ని ఏర్పాట్లు చేశారు.
మహారాజుతో తన సంబంధం ఒక నాటిదా! ఆయన పరిచయం ఎంత యాదృచ్ఛికంగా జరిగింది! ఆ పరిచయం ఎంతటి అనుబంధంగా మారింది! తనను ఆస్థాన కవిని చేశాడు. ‘మా ఆస్థాన కవీశ్వరులు గోపీనాథుని వెంకయ్యశాస్త్రులు’ అని ఎంత గర్వంగా సభలో పిలిచేవారు! తన చేత ఎన్ని రచనలు చేయించారు! ఎంత ఆదరించారు! ఎంత అండగా నిలిచారు! తన బాంధవుడూ, హితుడూ, స్నేహితుడూ అన్నీ ‘ఏలినవారే.’
కుమారయాచమనాయడి మరణం వెంకయ్యశాస్త్రిని ఎంత కుంగదీసిందో! ఆయన ఎంత బాధపడ్డాడో! తన జీవననౌక భగ్నమైనట్లు, తన ధ్రువతార రాలిపోయినట్లు అనిపించింది. తన ప్రభువు పోయాక తాను జీవచ్ఛవం మాదిరి బ్రతకడం అసంభవం. ఆ ‘ప్రభువు’ వెంట ఈ కవీ మౌనంగా తలవంచుక వెళిపోయాడు.
~
నా పుస్తకం విజయవాడ రోడ్డు పక్క పాతపుస్తకాలు అమ్మేచోట దొరికితే కొని చదివినట్లు ప్రజాసాహితి సంపాదకులు శ్రీ కొత్తపల్లి రవిబాబు గారు ఫోన్ చేసి చెబుతూ పుస్తకం ఆరంభం, ముగింపులో చేసిన డ్రమటైజెషన్‌ను మెచ్చుకొన్నారు. ఆంధ్రపత్రిక కవి మరణించడానికి ముందురోజు తీసిన ఫొటో అని రాసిన విషయాన్ని ఇట్లా నా కల్పనలో వాడుకొన్నాను.
అప్పటికి పుస్తకాలకు ముఖపత్రం ఎట్లా తయారుచేస్తారో నాకు అవగాహన లేదు. బి.వి. ప్రసాద్ అనే మిత్రులు, బ్యాంకు ఉద్యోగి, నా మాదిరే కాస్త సినిమాలు, ఫొటోగ్రఫీ పిచ్చి తనకు. తను పుస్తకం శీర్షిక రాసిచ్చాడు. తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు. నెల్లూరులో రాజి అనే కమర్షియల్ చిత్రకారుడికి నేనంటే చాలా గౌరవం. వెంకయ్యశాస్త్రి స్వహస్తాలతో రాజాగారికి రాసిన లేఖను ముఖపత్రంగా అలంకరించి ఇచ్చాడు. ఎలాగో కవర్ పేజి తయారయింది. Back cover ను వెంకయ్యశాస్త్రి ఫొటో, వారి జీవిత వివరాలతో నింపాను.
అట్లా నాలుగైదేళ్ళు ఆలస్యంగా పుస్తకం అచ్చయి వెలుగులోకి వచ్చింది. వెంకటగిరిలో ‘నటసమాఖ్య’ నాటకసంస్థ 27/01/1989న నా పుస్తకావిష్కరణ నిరాడంబరంగా నిర్వహించింది.
వెంటగిరిలో కె.ఎల్.నారాయణరావు గారనే సీనియర్ న్యాయవాది, పురప్రముఖులు, జాతీయోద్యమంలో జైలుశిక్ష అనుభవించిన త్యాగధనుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. మా కళాశాలలో సహ అధ్యాపకులు శ్రీ ఎం.శివరామప్రసాద్, మా బావగారు (అక్క భర్త) ఎస్.ఎల్.నరసింహంగారు, మా బావగారి తమ్మడు సీతారమణయ్యగారు ఉపన్యసించి నన్నభినందించారు. ఎలాగో పదేళ్ళ తర్వాత పుస్తకం అచ్చువేసి టిటిడి వారికి కాపీలు పంపించాను. నెల్లూరు జమీన్ రైతులో ‘శివారెడ్డి పద్యాలు’ పేరుతో వారం వారం పద్యాలు రాసే ఆత్మీయ కవి శివారెడ్డి ఆవిష్కరణ మీద రాసిన పద్యాలలో ఒకటి.
తాము గోపినాథ రామాయణములోని
నీతినిష్ఠ లోతుపాతులెన్నొ
బయటపెట్టినారు భాగ్యమింతకుమించి
కలదె పాఠకులకు కాళిదాసు!
నా పరిశోధనలో వెంకయ్య శాస్త్రి గురించి ప్రచారంలో ఉన్న అనేక అపప్రథలను, కల్పనలను గురించి రాశాను. ఈ పుస్తకంలో వెంకయ్యశాస్త్రి గురించి ప్రచారంలో ఉన్న అనేక అపోహలను, ఆసత్యాలను సవరించాను.
(ఇంకా ఉంది)