[dropcap]స[/dropcap]న్నగా కురుస్తున్న వాన జల్లుల్లో
తడుస్తూ నడుస్తున్నాం!
ఇద్దరమే లేనట్లు ఒక్కరమై నడుస్తున్నాం..
ఒకరికి ఒకరు అన్నట్లుగా నడుస్తున్నాం!
చినుకులనే పూల జల్లుల్లా
కురిపిస్తున్న నీలిమేఘాలు
దీవెనల ఆశీస్సులని అందిస్తుంటే
…సంబరానికి చిరునామాగా నడుస్తున్నాం!
దారంతా సెలయేళ్ళ గలగలల సరాగాల శభ్దాలు..
నేలంతా పరుచుకున్న పచ్చని పచ్చికల
పచ్చదనాల హంగుల సోయగాల సౌందర్యాలు..
అప్పుడప్పుడు నీలాల నింగిలో నుండి
తొంగి చూస్తున్న మెరుపుల పలకరింపుల
పులకరింతల పరిచయాలు..
నేలా నింగి ఒక్కటై ముచ్చటించుకుంటున్నట్లుగా
కాలం చకచకా గడుస్తుంటే..
ప్రకృతికి పరవశాల శుభసమయం..
హర్షించే వర్షం పంపే సందేశాల
పరంపరల నడుమ నడుస్తున్నాం!
అప్పుడు అవని అంతటా ఆనందాల సంగమం !
నువ్వు నేను అనే భావన చెరిపేస్తూ..
అడుగుల ఆనవాళ్ళు తెలియని చల్లని నీటిలో..
వర్షం సాక్షిగా.. హరివిల్లు గొడుగు జతగా..
ఒక్కటై నడుస్తున్నాం