ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -1

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]హు[/dropcap]స్సేన్‍సాగర్ లోని నీళ్ళు సంధ్యాకిరణాలు పడి తళతళాడుతున్నాయి.  అభయహస్తంతో సాగర్‍లో నిలిచిన బుద్ధుడు తనకి కాస్త దూరంలో వున్న రోడ్డు మీద వివిధ వాహనాలతో ఉరుకులు పరుగులు పెడుతున్న జనాన్ని వింతగా చూస్తున్నాడు.

మనిషి దుఃఖానికి కారణం ‘కోరిక’ అని నేనెన్నడో చెప్పాను. అయినా ఎందుకీ మనుషులు దుఃఖాన్ని కలిగించే కోరికల వెంబడి పరుగుపెడతారు. ఒకరు చెబితే వినకపోయినా ఫర్వాలేదు. తనకు అనుభవం అయినా, మనిషి ఎందుకు మేలుకోడు?

‘కోరిక’ ఎంత గొప్పది. కోరికే లేకపోతే మానవుడు పక్వమైన ఆహారం తినడం నేర్చుకోవడం నుంచి, అంతరిక్ష యానం దాకా ఎదిగేవాడా… ఒక కోరిక స్వాతంత్ర్య సమరం, ఒక కోరిక తాజ్‍మహల్ నిర్మాణం, ఒక కోరిక రెండవ ప్రపంచ యుద్ధం, ఒక కోరిక సబర్మతి ఆశ్రమ నిర్మాణం, ఒక కోరిక మనిషి మనిషిగా మనగలగడం. ఇందులో ఎవరి కోరిక గొప్పది, ఎవరి కోరిక అభివృద్ధి వైపు వెడుతోంది అని నిర్ణయించుకోవడమే మనిషికి గల విచక్షణ.

***

నెక్లెస్ రోడ్‍లో హుస్సేన్ సాగర్ వైపు కూర్చుని అస్తమయ కిరణాల ఆఖరి తళుకులను చూస్తున్నారు మిత్రులిద్దరూ. “నువ్వు మళ్ళీ అమెరికా ఎప్పుడు వెడతావ్?” అడిగింది రవళి.

“బహుశా వెళ్ళకపోవచ్చును. దేశాలు తిరిగి తిరిగి మొహం మొత్తింది. ఇండియాలోనే వుందాం అనుకుంటున్నాను” అంది సంహిత.

“అలాగా, చెన్నైలో మీకు ఇల్లుందేమో కదూ.”

“అది ఎప్పుడో అమ్మేశారు. అయినా నాకు హైదరాబాద్‍లో స్థిరపడాలని వుంది. ఎక్కడైనా మంచి ఫ్లాట్ గాని, యిల్లు గాని కొనుక్కోవాలని వుంది, కాస్త ఖరీదైనా ఫర్వాలేదు. నువ్వు చూసిపెట్టు. ఆ….. అన్నట్టు ఈ నోట్ల రద్దు ఏమిటో అర్థం కావడం లేదు. నువ్వు బ్యాంక్ ఆఫీసర్‍వేగా, కొంచెం నా డబ్బు మార్చాలి. ఇక్కడ నువ్వు తప్ప నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు”

వింటున్న రవళి గుండెల్లో గాభరా మొదలైంది. ఈ మనిషితో మళ్ళీ సావాసమా? ఇల్లు, డబ్బు చూసి పెట్టమంటోంది. ఆ తర్వాత ఇంకేం అడుగుతుందో….

“ఏం రవళి? నేనిలా అడగడం నీకేమైనా ఇబ్బందా?”

“అహహ అది కాదు”

“నువ్వు తప్ప నాకు హెల్ప్ చేసేవారెవరూ లేరు. నీ ఫోన్ నెంబర్ కోసం నేనెంత కష్టపడ్డానో తెలుసా. అనుకోకుండా కామేశ్వరి ఒక పార్టీలో కలవడం నా అదృష్టం. తనే నీ నెంబరిచ్చింది” అంది సంహిత.

ఈశ్వరా మనసులోనే అనుకుంది రవళి. ఆమెకు అక్కడ ఉండాలని లేదు. ఎప్పుడు వచ్చినా అందంగా, సంతోషం కలిగించే ఆ పరిసరాలు అసంతృప్తిగా చిరాగ్గా వున్నాయి. వెళ్ళిపోవాలి అక్కడినుండి.

“నేనింక బయలుదేరుతాను సంహితా, చీకటిపడింది.”

“సరే నేనీ హోటల్లో దిగాను. ఏదైనా ఇల్లు దొరికితే ఫోన్ చెయ్యి. అయినా నువ్వే ఒకపూట గెస్ట్‌గా వస్తే మరీ మంచిది. రేపు డిన్నర్‍కి రాకూడదు” అంది హోటల్ కార్డు ఇస్తూ.

“లేదు… లేదు. రేపటి విషయం యిప్పుడే చెప్పలేను. మావారి నడగాలి.”

“చూశావా, మనిద్దరం మాటల్లో పడి మీవారి విషయమే మర్చిపోయాం. రేపు… లేదూ మీ ఇద్దరికీ వీలైనప్పుడు లంచ్, డిన్నర్ ఏదైనా ఫర్వాలేదు. నా తరుపున మీవారిని నువ్వే పిలిచి తీసుకురావాలి, సరేనా” అంది సంహిత.

“ఇంకా ఎన్ని రోజులుంటావ్ యిక్కడ” అడిగింది రవళి.

“నెల వుంటాను. ఈలోగా ఇల్లు చూసిపెట్టు. ఈ విషయంలో మీవారు బెటరేమో కదూ! తనకి ఎక్కువమంది తెలుస్తారు.”

“అలాగే చెప్తాను, ఇంక నేను బయలుదేరుతాను.”

“ఆ…. నీ కారేది? ఎలా వెడతావ్ ఇంటికి?”

“కారు నాది కాదు, మావారిది. నాకు డ్రైవింగ్ రాదు, ఆటోలో వెళ్ళిపోతాను.”

“పెద్ద బ్యాంక్ మానేజరువి, కారు లేకపోతే ఎలాగోయ్. మంచిరోజు చూసి కారు కొనేయ్.”

“మరి నువ్వెలా వెడతావ్ హోటల్‍కి? ఇక్కడ ఆడవాళ్ళు ఒక్కరే ఉండటం అంత సేఫ్ కాదు” అంది రవళి.

“క్యాబ్ బుక్ చేశాను, వస్తుంది. రూమ్‍కి వెళ్ళి చేసే పని కూడా లేదు.”

ఎదురుగా వచ్చిన ఆటోను ఆపి రవళి ఎక్కింది. సంహితను మొహమాటానికి కూడా తన ఇంటికి పిలవలేదు.

***

“మీ ఫ్రెండ్‍ను కలిశావా”

రవళి ఇంటికి వచ్చి చాలాసేపైనా ఆమె ఏం మాట్లాడకపోవడంతో తనే అడిగాడు వెంకట్.

“ఆ…. కలిశాను.”

“మనింటికి తీసుకువస్తావనుకున్నాను.”

“లేదు తను హోటల్లో దిగింది”

కావాలనే రవళి ముక్తసరిగా మాట్లాడుతోంది. వెంకట్ అది గ్రహించాడేమో ఇంకేమీ మాట్లాడలేదు. అతను భోజనం చేసి తొందరగానే నిద్రపోయాడు. రవళికి నిద్ర రావడం లేదు. ఆమె మెల్లిగా తలుపు తీసుకుని బాల్కని వైపుకి వచ్చింది. అయిదో అంతస్తు నుండి హైదరాబాద్ మహానగరం చాలా మటుకు మెరిసిపోతోంది దీపాలతో. ఆకాశంలో పడమరకి వాలిపోతూ చంద్రుడు.

చాలా చిన్నగా ఒకే ఒక నక్షత్రం కన్పిస్తోంది. ఒకప్పుడు తను ఆ నక్షత్రంలాగే ఎవరికీ తెలియకుండా బతికేస్తూ వుండేది. ఇప్పుడు తన మనసు నగరంలోని దీపాల్లాగే ఆలోచనలతో నిండిపోయింది. ‘నీ స్నేహితులు ఎలాంటివారో చెప్పు నీవెలాటివాడవో చెబుతాను’ అనే సూక్తి అన్ని సందర్భాలలో నిజం కాదు. రవళి మనసు పడమరవైపు దిగుతున్న చంద్రునితో పాటు గతంలోకి…. యవ్వనం తొలిదశలోకి వెడుతోంది.

***

బెల్ కొట్టడంతో పిల్లలందరూ క్లాస్‍లోకి వచ్చేశారు. ఉదయం ఇంటర్వెల్ తర్వాత వచ్చే పిరియడ్ తెలుగు. మొదటి యూనిట్ పేపర్లు తీసుకుని తెలుగు టీచర్ క్లాసులోకి వచ్చారు పిల్లలందరూ లేని గాంభీర్యాన్ని మొహం మీదకు తెచ్చుకున్నారు. అది టెన్త్ క్లాస్ ‘బి’ సెక్షన్. ఆమె ఒక్కో పేపరు తీసి మార్కులు చదువుతూ తక్కువ మార్కులు వచ్చినవాళ్ళను చివాట్లు పెడుతున్నారు.

“రవళి…..”

ఆమె లేచి పేపరు తీసుకోబోయింది.

“ఏమ్మా రవళి! విశేషపూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏమిటి?”

చెప్పింది రవళి.

“మరి మనసులో ఉన్నది కాగితం మీద పెట్టడానికేం, బద్ధకమా? అనవసరంగా ఒక మార్కు పోయింది. ఇదిగో పేపరు తీసుకో.”

రవళి పేపరు తీసుకుంటూ తన చోటులో కూర్చుంది.

“అమ్మా” అంటూ వచ్చాడు స్కూలు ప్యూను సముద్రాలు. అతని వెంట ఒక అమ్మాయి ఉంది.

“ఏం సముద్రాలు?”

“ఈ అమ్మాయి కొత్తగా చేరిందమ్మా. పెద్దమ్మ ఈ క్లాసులో కూర్చోబెట్టమన్నారు.”

“అలాగే”

సముద్రాలు వెళ్ళిపోయాడు. తలవంచుకుని పేపర్లు చూసుకుంటున్న ముఫ్ఫైరెండు మంది ఆడపిల్లలు తలెత్తి చూశారు. ఆమె అటూ ఇటూ తిరిగి టీచర్‍తో మాట్లాడుతుంది. వెనుక నుంచి నల్లని జడ నడుము క్రిందివరకూ… ఆమె మాటలు పూర్తిచేసి క్లాసువేపు తిరిగింది. ఆకుపచ్చని ఆకుల మధ్య సన్నజాజి, గులాబి, మల్లె లాంటి పువ్వులు కనిపించడం సహజం.

కాని ఇదేమిటి బంగారు ప్రతిమకు, ఎర్రటి ముఖమల్ వస్త్రం చుట్టినట్టు; తెల్లని సన్నజాజికి, ఎర్రని గులాబి రేకులు అమర్చినట్లు వుంది కొత్తమ్మాయి. ఎర్రని పరికిణి, ఓణి, జాకెట్‍లో వుంది. దట్టంగా నల్లగా వున్న కనుబొమలు, మధ్యలో ఎర్రని బొట్టు. మెడలో సన్నని బంగారు గొలుసు, చేతికి రెండు బంగారు గాజులు, మధ్యలో ఎర్రని గాజులు, ఒక చేతికి వాచి. ఆపాదమస్తకం ఆమెను తిలకించిన రవళికి ‘విశేషణపూర్వపద కర్మధారయ సమాసం’ అంటే ఏమిటో అర్థం అయింది.

“సంహితా…”

టీచరు పిలవడంతో ఆమె టీచరు వైపు తిరిగింది. అబ్బా ఎంతమంచి పేరు. క్లాసు మొత్తం ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చేశారు.

“తెలుగు నోట్సు కావాలంటే రవళి దగ్గర తీసుకో.”

“అలాగే మేడమ్”

“టీచర్ అంటే చాలు”

ఈలోగా బెల్ కొట్టడంతో టీచర్ వెళ్ళిపోయారు.

సంహిత వచ్చి రవళి పక్కన కూర్చుంది. అమ్మాయిలందరికీ ఆమెతో మాట్లాడాలని వున్నా తర్వాత పిరియడ్ ఫిజిక్స్. ఆ మాష్టారు రాగానే అందరినీ నిన్నటి పాఠంలోని ప్రశ్నలు అడుగుతారు. అందుకని అందరూ పుస్తకాలు తీసి నిన్నటి పాఠం చదవడం మొదలుపెట్టారు. ఇంతలో నైన్త్ క్లాసు లీడర్ వచ్చి ఫిజిక్స్ మాష్టారు తమ క్లాసు కంటిన్యూ చేస్తున్నారని, ఈ క్లాసు పిల్లలని చదువుకోమన్నారని కబురు మోసుకొచ్చింది.

“హమ్మయ్య బతికాం, ఈ ఫిజిక్స్ బోర్” అంటూ పుస్తకం డెస్క్ మీద పడేసింది అనురాధ.

పిల్లలందరూ ఆమెను అనుసరించారు.

“ఏమిటి అలా బుక్స్ పడేస్తారు. ఎలాగూ పది నిమిషాలు చదివారుగా, మరో అరగంట చదివితే బెల్ కొడతారు. మిమ్మల్ని చదివించలేదని మాష్టారు నన్ను తిడతారు” అంది క్లాస్‍ లీడర్ మాధవి.

“అబ్బా పోవోయ్ తిట్టేది నిన్నే కదా” అంది రవళి.

మాధవితో సహా అందరూ నవ్వేశారు. ఇంకా క్లాసులో ఎవరికి చదవాలనిపించలేదు. కొత్తమ్మాయిని పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు.

“నీ పేరు సంహితేనా, ఇంకేమైనా పేరు వుందా” అడిగింది కామేశ్వరి.

“సంహితే…. ఇంకే పేరు లేదు.”

“ఏ వూరు నుండి వచ్చావు”

“రాజమండ్రి”

“గవర్నమెంట్ స్కూలే కానీ ఇక్కడ బిల్డింగ్, గ్రౌండ్ అన్నీ బాగున్నాయి. ఆ… రవళి అంటే ఎవరు? టీచరు నోట్స్ తీసుకోమన్నారు తన దగ్గర.”

“తన పక్కనే కూర్చుని రవళి ఎవరూ అని అడుగుతావేం” అంది కృపామణి.

“రవళి ఎంత మంచిపేరు. మరి నాకు మీమీ పేర్లు చెప్పండి” అంది సంహిత.

“ఇదిగో ఈమె మాధవి క్లాస్ లీడర్, కృపామణి, జానకి, పద్మలత, రమణి, పద్మజ….” ఇలా అందరి పేర్లు చెప్పి “నా పేరు కామేశ్వరి” అంది.

“ఇంకా ఇద్దరు ఈరోజు రాలేదు వస్తే నీతో కలిపి ముఫ్ఫై అయిదుమంది” అంది కృపామణి.

“వాళ్ళ పేర్లు…?”

“ఫాతిమా, బాలత్రిపుర సుందరి.”

“రవళీ! మీ తెలుగు నోట్సు కావాలి” అంది సంహిత.

“మనందరం ఒకే వయసువాళ్ళం, హాయిగా ఏకవచనంలో పిలుచుకుందాం” అంది కృపామణి.

రవళి తన తెలుగు నోట్సు తీసి సంహితకు ఇచ్చింది. అది వారి స్నేహానికి మొదటిమెట్టుగా జేగంట మోగినట్టు లంచ్ బెల్ మోగింది.

గదిలో ఏదో చప్పుడు కావడంతో రవళి తన ఆలోచనల్లోంచి బయటకు వచ్చి గదిలోకి వచ్చింది. అలారం కోసం పెట్టుకున్న సెల్‍ఫోన్‍ను నిద్రలో కిందపడేశాడు వెంకట్. ఆ చప్పుడికి కూడా అతనికి మెలకువ రాలేదు. రవళి ఫోన్ తీసి పక్కకు పెట్టింది. టైము అయిదు గంటలవుతోంది. ఆదివారం కాబట్టి సరిపోయింది. వర్కింగ్‍డే అయితే బ్యాంక్‍లో కునికిపాట్లు వచ్చేవి.

***

సోమవారం బ్యాంకుకి వెళ్ళేసరికి అదొక పెద్ద గందరగోళంగా వుంది. పాతనోట్లు మార్చేవాళ్ళు, మిగతా పనుల కోసం వచ్చేవాళ్ళు. రవళి ఆ బ్రాంచ్ మేనేజర్. కాస్త తీరిక చేసుకుని లంచ్ చేద్దామనుకుంటుండగా సంహిత ఫోన్. డబ్బు కావాలని, ఎన్నిగంటలకు రావాలని.

తను బిజీగా వున్నానని మళ్ళీ ఫోన్ చేస్తానని రవళి ఫోన్ పెట్టేసింది. తను చెబుతున్నది అబద్ధమని సంహితకు తెలుస్తుందా. ఈ మాయమాటలు, అబద్ధాలు తన దగ్గర నేర్చుకున్నవే అనుకుంది రవళి.

మర్నాడు స్కూల్లో రవళి తెలుగు నోట్సు ఇచ్చేసింది సంహిత.

“అప్పుడే రాసేశావా” అడిగింది రవళి.

“ఆ…. కొన్ని పాఠాలేగా, నోట్స్ ఇచ్చినందుకు థాంక్స్. నీ నోట్స్ కాదు గాని మా అమ్మ నన్ను ఒకటే చీవాట్లు.”

“ఏం… ఎందుకు ఏమైనా తప్పులున్నాయా” రవళి గుండె వేగంగా కొట్టుకుంటోంది, సంహిత ఏం చెబుతుందో అని.

“లేదు… లేదు నీ రైటింగ్ చాలా బాగుంది. మా అమ్మకి ఎంత నచ్చేసిందో, అంత బాగా నన్ను కూడా రాయమంది”

ఆ పొగడ్తకి సిగ్గుగా నవ్వింది రవళి.

“అదిగో నీ నవ్వు చాలా బాగుంటుంది.”

“చాలు… చాలు పొగడ్తలు”

“పొగడ్త కాదు రవళి, నిజంగా నీ నవ్వు చాలా బాగుంటుంది.”

“అబ్బో మీరిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారా బాగా నవ్వుకుంటున్నారు” అంటూ వచ్చింది కామేశ్వరి.

“ఏం నీకేమైనా అభ్యంతరమా?” ఎప్పుడు వచ్చిందో కృపామణి అంది.

రవళి కాస్త బెరుకుగా వుంది. తామందరూ అయిదు సంవత్సరాలుగా కలిసి చదువుకుంటున్నారు. మిగతా వాళ్ళందరి సంగతి ఏమోగానీ రవళి ఎవరితోనూ వాద ప్రతివాదాల్లోకి వెళ్ళదు. ఇలా నవ్వు బాగుంది రైటింగ్ బాగుంది అని మాట్లాడుకోవడం చాలా తక్కువ.

“ఆ…. టైం కొచ్చారు చూడండి రవళి నవ్వు బాగుండదూ” అడిగింది సంహిత.

చూస్తున్న ముగ్గురు, నలుగురు అమ్మాయిలకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు.

“సరే నేను చెబుతాను వినండి. రవళి నవ్వు ఆమె తెలుగు రైటింగ్ అంత బాగుంటుంది”

వింటున్నవాళ్ళు అవునన్నట్టు తలాడించారు.

“ఇదిగో కృపామణి నీ నోట్సు”

“మరి కృపామణికేం బిరుదులు లేవా” వ్యంగ్యంగా అంది కామేశ్వరి.

“అవి బిరుదులు కావు. సహజంగా వుండేవే”

“నా సంగతికేం గాని నా రైటింగ్ అర్థమయిందా”

“ఓ…. బ్రహ్మాండంగా”

“నా నోట్స్ మర్చిపోతావేమో అనుకున్నాను.”

“అయ్యో నా నోట్సు మర్చిపోయినా ఫర్వాలేదు మీ బుక్స్ అస్సలు మర్చిపోకూడదు”

ఆ మాటతో అందరికి సంహిత మీద నమ్మకం ఏర్పడింది. ఇంతలో బెల్ మోగడంతో అందరూ ప్రేయర్‍కి కదిలారు. అదయ్యాక మొదటి పిరియడే ఇంగ్లీషు.

“అబ్బా స్కూల్‍కి రాగానే ఫస్ట్ పిరియడ్ ఇంగ్లీషు ఎందుకు పెడతారో, అసలే అ ఇందిరా టీచర్‍కి కోపం ఎక్కువ.”

సుందరి విసుక్కుంటుండగానే ఇందిరా టీచర్ వచ్చారు. ఆవిడే క్లాస్ టీచరు కూడా. హాజరు తీసుకున్నారు. ఆఖరి పేరు సంహితది.

“హు ఈజ్ సంహిత”

ఆమె లేచి నిలబడింది. టీచర్ వేసిన రెండు మూడు ప్రశ్నలకు జవాబు ఇచ్చింది.

“యూనిఫారం ఏది?”

“ఇంకా తీసుకోలేదు టీచర్”

“తొందరగా తీసుకో. ఆగష్టు 15కి నువ్వొక్కదానివి వేరుగా వుంటే బాగుండదు.”

“అలాగే టీచర్.”

సాయంత్రం లాంగ్‍బెల్ అయ్యాక ఇంటికి బయలుదేరేముందు “ఏ షాప్‍లో యూనిఫారం క్లాత్ దొరుకుతుంది” అడిగింది సంహిత రవళిని. ఆమె చెప్పింది.

“అయితే మనిద్దరం వెడదాం పద.”

“అమ్మో టైంకి ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ వూరుకోదు. అయినా బట్టల నాణ్యత మనకేం తెలుస్తుంది. నువ్వు మీ అమ్మగారిని తీసుకువెళ్ళు”

సంహిత ఏదో అనే లోపు స్నేహ వచ్చింది.

“మా చెల్లెలు స్నేహ” పరిచయం చేసింది రవళి.

“ఏ క్లాస్”

“సిక్త్ క్లాస్ సి సెక్షన్” జవాబు చెప్పింది స్నేహ.

“అలాగా మా చెల్లెలు నీరజ నైన్త్ క్లాసు”

“మరి నిన్ను కలవడానికి తను రాలేదేం” అడిగింది స్నేహ.

“ఇంటికి వెళ్ళిపోయుంటుంది” తేలిగ్గా అంది సంహిత.

“అక్కా వెడదామా” అంది స్నేహ.

ఇద్దరూ ఇంటివైపు నడుస్తున్నారు.

“ఆ సంహిత ఏంటక్కా అంత అందంగా వుంది” అంది స్నేహ.

“నీకూ అనిపించిందా. నిజమే,  చాలా అందమైన అమ్మాయి. కానీ కొంచెం కూడా గర్వం లేదు.”

“మీ క్లాసులో వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను కానీ ఎవరూ ఇలా నవ్వుతూ మాట్లాడరు. టెన్త్ క్లాసు చదువుతున్నంత మాత్రాన అంత సీరియస్‍గా వుండాలా.”

“పోనిద్దూ, అని వాళ్ళ పద్ధతి.”

“అవునూ సంహిత బజారుకి వెడతానంది కదా! తను మరి డబ్బు తెచ్చుకుందా?” అడిగింది స్నేహ.

“నిజమే! నాకా డౌట్ రాలేదు నీకు వచ్చింది, తెచ్చుకుందేమో”

ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి ముందుగదిలో కూర్చుని నవల చదువుకుంటున్న ఆదిలక్ష్మి “ఇవేళ మీరు రావడం లేట్ అయినట్టుందే” అని అడిగింది.

“అబ్బా నువ్వు సెకండ్స్‌తో సహా లెక్కకడతావమ్మా. అక్క క్లాసులో కొత్తమ్మాయి చేరింది. మాట్లాడి వచ్చాం. లాంగ్ బెల్ అయ్యిందే 4.30కి. నడుచుకుంటూ రావడానికి పావుగంట పట్టదా.”

“సరే రండి టిఫిన్ పెడతాను”

వీళ్ళిద్దరు టిఫిన్ తింటుంటే వాళ్ళ అన్న రవి వచ్చాడు.

“కొత్తమ్మాయి చేరిందంటున్నారు. ఏ వూరేమిటి వాళ్ళది?” అడిగింది ఆదిలక్ష్మి రవికి టిఫిన్ పెడుతూ.

“రాజమండ్రి నుంచి వచ్చారు. వాళ్ల నాన్నగారు అగ్రికల్చర్ ఆఫీసరు” చెప్పింది రవళి.

“అలాగా”

“అమ్మా! ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా… ఆమెను చూడటానికి స్కూల్ మొత్తం అక్క క్లాస్ దగ్గరే వుంది” అంది స్నేహ.

“ఆ… ఇప్పుడు మా కాలేజి మొత్తం తననే చూస్తున్నారు బజారులోకి వస్తే”. రవి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన కాలేజి మెయిన్ రోడ్‍లో వుంది. అప్పుడే తను షాపుకి వెళ్ళిపోయిందా? రవళికి కాస్త బాధనిపించింది. పాపం తను వూరికి కొత్త. తనూ ఆమెకు సహాయంగా వెళ్ళవలసింది.

“ఏమిటే ఆ పిల్లా… ఆ డ్రెస్….. ఛ….” అన్నాడు రవి.

“తనేం ఎబ్బెట్టుగా తయారైంది? మా అందరిలాగే పరికిణీ, ఓణీ వేసుకుంది.”

“అయితే మాత్రం తల నుండి కాలి దాకా మేచింగ్. ఏదో సినిమా వాళ్ళలాగా”

“నిజమే అమ్మా ఇవేళ తన డ్రెస్ ఎంత బాగుందో! సిమెంట్ రంగు ఆకుపచ్చ రంగు కలిసిన బట్టలు వేసుకుంది. నా బర్త్‌డేకి ఈసారి అలాంటి డ్రెస్ కొనాలి” అంది స్నేహ.

“అప్పుడు నిన్ను కూడా అందరూ అలా చూస్తారు వింతగా” అన్నాడు రవి.

“అందుకని మా ఆడపిల్లలను ఎక్కడికీ వెళ్ళకుండా ముసుగేసుకుని ఇంట్లో కూర్చోమంటావా?” అంది రవళి.

“ఆ…. లేకపోతే బజార్లో ఏం పని? బడి అయ్యాక ఇంటికి పోకుండా” అన్నాడు రవి.

“తనకి స్కూలు యూనిఫారం లేదు, కొనడానికి వెళ్ళింది. నిజానికి నన్నూ షాపింగ్‍కి రమ్మంది. అమ్మకు చెప్పకుండా వెడితే తిడుతుందని వెళ్ళలేదు” అంది రవళి.

“ఆ… మంచిపని చేశావు. ఆమెతో పాటు నిన్నూ అలాగే చూసేవారు.”

“అబ్బా ఏమిటన్నయ్యా ఇందకట్నుంచి చూశారు… చూశారు అంటావు. అలా అమ్మాయిలను చూడొద్దని మీ అబ్బాయిలకు చెప్పు” అంది రవళి టిఫిన్ ముగించి కాఫీ గ్లాసు చేతిలోకి తీసుకుంటూ.

“చూశావా అమ్మా! నీ కూతురి విప్లవ భావాలు” అన్నాడు రవి.

“అబ్బా ఊరుకోరా ఎవరో పిల్ల గురించి మీరిద్దరూ వాదించుకోవడం బాగోలేదు” అంది ఆదిలక్ష్మి.

టిఫిన్‍లు ముగిశాక రవి మళ్ళీ బయటకు వెళ్ళాడు. స్నేహ స్కిప్పింగ్ రోప్ తీసి పెరట్లో ఉసిరిచెట్టు దగ్గర ఆడుకుంటుంది. రవళి కొత్తగా వచ్చిన మేగజిన్ చూడసాగింది, పెరటివైపున్న అరుగుమీద కూర్చుని. స్నేహ ఆట ఆపేసి అక్క దగ్గరికి వచ్చింది.

“ఏమిటే టిఫిన్ తినగానే ఆ గెంతడం? చూడు ఎలా రొప్పుతున్నావో?” అంది రవళి నవ్వుతూ.

“టిఫిన్ తినకపోతే నాకు నీరసం వస్తుంది. అక్కా నాకో డౌటు.”

“ఏమిటి?”

“సంహితను అన్నయ్య చూడలేదుగా, మరి తనే మీ క్లాసులో కొత్తమ్మాయి అని ఎలా తెలిసింది?”

“నిజమే! అడుగుదాములే”

స్నేహ మళ్ళీ ఆడుకోసాగింది. రవళికి చెల్లెల్లి మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఇందాక డబ్బు సంగతి, ఇప్పుడు సంహిత సంగతి రవికి ఎలా తెలుసు అన్నది తనకి రాని సందేహాలు. రాత్రికి వంట చేస్తున్న ఆదిలక్ష్మికి పిల్లల మాటలు గుర్తుకొచ్చాయి. తను ఎక్కువ చదువుకోలేదు, అందుకే పిల్లలని బాగా చదివించాలని ఆశ. కానీ ఆడపిల్లలు ఆ వయసులో ఏ ఆకర్షణకు లొంగిపోతారో అనే చిన్నభయం.

అందులోనూ రవళికి తండ్రి రంగు, తన ముఖ కవళికలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగుపెడుతున్న రవళి మీద మరింత శ్రద్ధ. తమ బంధువుల్లో అందరూ రవళిని అందగత్తెని తీర్మానించారు. అటువంటి ఈవేళ ఎవరో అమ్మాయి అందం గురించి పిల్లలు వాదులాడుకోవడం ఆశ్చర్యంగా వుంది. కానీ అది అంత తీసిపారేసే విషయం కాదని ఆమెకు ఆ క్షణం తెలియదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here