[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[dropcap]ప[/dropcap]రమాత్మకు అందరూ సమానమన్న రామానుజ సందేశాన్ని వాడవాడలా వ్యాప్తి చేసేవారు నారాయణ యతి.
ఆయనను ఎవరు పిలిచినా వెళ్ళి, వారికి పరమాత్మ తత్త్వాన్ని బోధించి వచ్చేవారు.
ప్రజలకు ఆధ్యాత్మికత జీవితంలో భాగంగా కావాలని భాగవత, రామాయణ సప్తాహాలు నిర్వహించారు.
యతివరేణ్యులు బాలబాలికలకు వక్తృత్వ పోటీలు, హిందూ మతంపై వ్యాస రచనలను ఎంతో ప్రోత్సహిచ్చేవారు. హిందూమతం యొక్క ధార్మికత, ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యత వంటి విషయాల మీద సదా శ్రద్ధ కనపరచేవారు.
యతివరేణ్యలది నియమబద్ధమైన జీవితం. ఆయన ఆసేతుహిమాచలం పాదయాత్ర చేశారు. అలా మూడు సార్లు చేసి ఎందరెందరినో ఆధ్యాత్మికత వైపు త్రిప్పారు. ఎందరికో సమాశ్రయణం చేసి రామానుజ బోధలు పాటించమని, సమానత్వం చూపించమని బోధించేవారు.
శ్రీపీఠ ఆశ్రమములో ఒక వృద్ధ స్త్రీ ఉండేది. ఆమె పని ఆశ్రమ ప్రాంగణము శుభ్రం చెయ్యటం. ఆమె నారాయణయతి ఉన్న గది ముందర ఉదయమే శుభ్రం చేసి ముగ్గు పెట్టేది. ఎందరో భక్తులు వచ్చి యతివరేణ్యులకు దాసోహాలు సమర్పించి, వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకుపోవటం ఆమె చూసేది. ఆమెకు తానూ యతివరేణ్యులను తన ఇంటికి తీసుకుపోవాలని ఉండేది. ఆమెది చిన్న గుడిసె. పైగా ఆ ఊరికి వెలుపల ఉన్న మురికివాడ. ఆచార్యులు అక్కడికి రమ్మనటం అపచారంగా ఆమె భావించింది.
కాని, ప్రతిరోజూ ఆశగా చూడటం మాత్రం మానలేదు.
ఒకరోజు యతివరేణ్యులు ఆమెను పిలిచారు. “అవ్వా! రోజూ అలా చూస్తావు. ఏం కావాలి నీకు?”
“సామి! నాకు ఏం కావాలి?” తత్తరబడుతూ అంది అవ్వ.
యతివరేణ్యులు నవ్వారు. ఆయన నవ్వు చిన్న పిల్లల నవ్వులా స్వచ్ఛంగా ఉంది.
అవ్వ ధైర్యం చేసుకొని “సామీ! అందరితో పోతుంటావు. నా వంటి బీదవారింటికి వస్తావా?” అంది.
“నీవు పిలిస్తే రానా? పిలిచిన వారెవరైనా, ఎక్కడికైనా వస్తాను…” అన్నారు యతివరేణ్యులు నవ్వుతూ.
“అయితే మా ఇంటికి రా సామీ…”
“సరే. రేపు రానా?”
“సరే సామి” అన్నది కాని, ఆ అవ్వకు నమ్మకం లేదు.
యతివరేణ్యులు నవ్వి ఊరుకున్నారు అప్పటికి.
మరుసటి రోజు అవ్వ మాములుగా ఉదయం తన పని చేసి ఆశ్రమం నుంచి వెళ్ళిపోయింది.
ఆమె స్వామి వస్తానన్న మాట మరిచిపోయింది.
కాని పదకొండు గంటలకు ఆమె ఇంటి ముందు నారాయణ యతివరేణ్యులతో శ్రీపీఠ వాహనం వచ్చింది. అందులోంచి యతివరేణ్యులు దిగి అవ్వ ఇంటి ముందుకొచ్చి ఆమె గుడిసె తలుపు తట్టారు. ఆమె వచ్చి చూస్తే నారాయణ యతి నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఆమె తన కళ్ళతో నమ్మలేకపోయింది.
తలుపు తెరిచి తన గుడిసెలోకి నారాయణ యతిని స్వాగతించింది.
ఆయన లోనికొచ్చారు. అక్కడ పీట వేసి ఆయనను కూర్చోబెట్టిందామె.
గుడిసె బయట చుట్టు ప్రక్కల వారు వచ్చి నిలబడ్డారు. యతివరేణ్యులను దర్శించటానికి.
ఆమె తన ఇంట్లో ఉన్న ఆవు పాలు స్వామికి భక్తితో ఇచ్చింది.
“సామి నీవు నారాయణుడవే! ఆ చిన్ని కృష్ణుడివే! నా వంటి వారింటికైనా వస్తావయ్యా…” కన్నీరు కారుతుండగా అవ్వ నారాయతి యతి పాదాలకు మ్రొక్కింది.
ఆయన నవ్వారు.
“అవ్వా! చెప్పాను కదా. నన్ను పిలిచిన వారింటికి వస్తాను తప్ప, నాకు మరో భేదం లేదు అని…” అన్నారు యతి.
ఆమె హృదయము కరిగి నీరై యతివరేణ్యుల పాదాలను కడిగిందా రోజున.
తనకు భక్తి, ప్రేమ తప్ప మరో విషయం ఆకర్షించదని నారాయణ యతి ఎల్లప్పుడూ చెబుతారు. గీతలో కృష్ణభగవానుడు బోధించినది కూడా అదే కదా…
“పత్రం పుష్పం ఫలం తోయం యే మే భక్త్యా ప్రయచ్ఛతి।
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః॥” (అ.9 -26)
“నాకు ఎవరైనా భక్తితో ఆకుకానీ, పువ్వుకానీ, పండు గానీ, లేదా నీరైనా సమర్పిస్తే, స్వచ్ఛమైన మనస్సుగల ఆ భక్తునిచే ప్రేమగా ఇవ్వబడినదానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను”.
ఆ ఆశ్రమములో యతివరేణ్యుల దయ నేటికీ గాలిలో కలిసి వ్యాపించి ఉంటుంది.
***
నారాయణ యతి ఆశ్రమ స్వీకారము చేశాక భారతదేశమంతా పాదయాత్ర చేశారు. అలా ఆయన మూడు సార్లు బదిరి నుంచి కన్యాకుమారి వరకు పర్యటించారు.
ప్రతి రోజూ పాతిక మైళ్ళు నడిచేవారు. పాతిక మైళ్ళ దూరములో ఉన్న గ్రామములో విడిది చేసి ఆ గ్రామ ప్రజలకు మంచిని బోధించేవారు. వారు పూర్ణ వైరాగ్యులు. ఎక్కడికెళ్ళినా ఆ ఊరి గుడిలో ఉండేవారు.
ఎక్కడ ఉన్నా ఆయన దినచర్యలో తేడా ఉండేది కాదు.
ఉదయము లేచి తిరువారాధన చెయ్యటం, తిరుప్పావైలతో శ్రీకృష్ణ స్వామిని ఆరాధించటం. తదనంతరం తీర్థగోష్టి చెయ్యటం. అనంతరం వచ్చిన భక్తుల క్షేమ సమాచారం విచారించటం. భక్తులను విచారించి వారికి ప్రసాదం పంచి పంపటం. నారాయణ యతి రోజుకొక్కసారి మాత్రమే భుజిస్తారు. అదీ ఆయన తన చేతిలో పట్టినంత మూడు ముద్దలు మాత్రమే భుజిస్తారు.
ఆ విషయంలో ఆయన కరపత్రస్వామిని తలపిస్తారు (కరపత్రస్వామి అన్న యోగి కేవలము తన చేతులలో పట్టినంత మాత్రమే భుజిస్తారు. అందుకే ఆయనకు కరపత్రస్వామి అన్న పేరు వచ్చింది.).
రుచులను పట్టించుకోరు. ఎక్కడ ఉన్నా కటిక నేల మీద కాషాయ వస్త్రం పరచుకు పడుకుంటారు.
ఎంత దూరము నడిచినా పాముకోళ్ళతో తప్ప మాములు చెప్పులు ధరించరు.
ఒక కాషాయ వస్త్రం, పైన మరో కాషాయం అంగోస్త్రముతో ఎంత చలి, గాలిలో సైతం ఉంటారు తప్ప దుప్పటి వాడరు.
ఉత్తమ సన్యాసిగా పేరుపొందిన నారాయణ యతివరేణ్యులను జనులంతా భూమి మీద నడిచే నారాయణుడే అని నమ్ముతారు.
ద్వారక, మధుర, బృందావనము, బదిరి, తిరుపతి, ఉడిపి, శ్రీరంగం, గురువాయూరులలో ఆయన తమ మఠానికి అనుబంధ మఠాలను ఏర్పరిచారు. ప్రతి ఏడు తిరుపతి స్వామి దర్శనము తప్పక చేసేవారు.
ఆయన దివ్యక్షేత్రాలలో తన చాతుర్మ్మాసము గడిపేవారు.
శ్రీవైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో (చాలా వరకు ఇవి తమిళనాడులో వ్యాపించి ఉన్నాయి. మన తెలుగునాట అహోబిలం, తిరుపతి), 1 నేపాల్ లోని ముక్తినాథ్, మిగతా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల (పాల సముద్రము, పరమాత్మ పాదపద్మములు) ఉన్నాయి.
సన్యసించిన వారు ఎప్పుడూ ఒక్క చోటే ఉండకూడదు. వారు ఎప్పుడూ తిరుగుతూ పరమాత్మ గురించి ప్రజలకు వివరిస్తూ ఉండాలి. అలా ఎప్పుడూ తిరుగుతూ ఉంటే వారికి జ్ఞానం పెంచుకోవటానికీ, చదువుకోవటానికి సమయం ఉండదు కాబట్టి చాతుర్మాసం చేస్తారు. చాతుర్మాసమంటే నాలుగు నెలలు. వారు నాలుగు నెలలు ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోతారు.
(సశేషం)