జీవన రమణీయం-191

5
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]స[/dropcap]రే… ఈ సాహిత్యకారులకి డబ్బులు సంపాదించే రచయితల మీద కినుక సహజం! వారి సాహిత్యం మాకు ఇష్టం! మా సాహిత్యం అంటే వారికి చిన్న చూపు! “నువ్వు ఎంత గింజుకున్నా… నువ్వు చెప్పే వాళ్ళకి సాహిత్యంలో స్థానం లేదు” అన్న నా ఆప్తమిత్రుడికి మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమం కనువిప్పు అయింది! నేనూ, చంద్రబోస్, వి.ఎన్.ఆదిత్యా, హరీష్ శంకర్, మేర్లపాక గాంధీ పాల్గొన్న ‘సినిమా సాహిత్యం’ అనే కార్యక్రమానికి హాలు కిటకిటలాడిపోయింది! పొద్దుట జరిగిన అసలైన సాహిత్య కార్యక్రమాలకి (వాళ్ళ దృష్టిలో) అరకొరగా మనుషులొచ్చారు! చంద్రబోస్ సమన్వయకర్తగా జరిగిన ఆ కార్యక్రమంలో జోకులు పేలాయి… మైకులు అదిరాయి… ‘ఆకాశం అమ్మాయైతే నీలా వుంటుందా? నీలా వుంటుందా?’ అన్న పాటలతో గలగల ఫెళఫెళమంది. ప్రశ్నోత్తరాల టైమ్ ఇంకా పొడిగించమని ఆడియెన్స్ డిమాండ్! ఇంతకీ నేను చెప్పేదేమిటంటే, సినిమా లేకపోతే జీవితం నిశ్శబ్దంగా వుంటుంది! మన స్థాయి భావాలని బట్టి కనీసం ‘అగాధం అవు జలనిధిలోనా ఆణిముత్యం వున్నట్లే… శోకాల మరుగున దాగీ సుఖమున్నదిలే…’ అన్న పాట అయినా వేసుకుంటాం!

వరండాలో చంద్రబోసో, వీరేంద్రనాథో ఎదురుపడితే ఆటోగ్రాఫ్‍లు అడిగినట్లు, మామూలుగా అద్భుత సాహిత్యం రాసిన రచయిత ఎదురుపడినా, జనం పెద్దగా పట్టించుకోరు! నమస్కారం పెట్టి వూర్కుంటారు. పాండిత్యానికి ఎదురేగి ప్రశ్నలడగం… అదే కమర్శియల్ రైటర్స్‌కీ, సినిమా పాట రాసేవాళ్ళకీ జనం నవ్వుతూ, ఇంట్లోవాళ్ళను చూసినట్లు చూస్తూ, రిసీవ్ చేసుకుంటారు!

‘బంగారు కోడి పెట్టా… వచ్చెనండి’ కూడా రచనే! ఎంతోమంది పామరులని ఆనందింప చేసింది! మా భువన్‍జీ మాటల్లోనే వినాలి అది… నేనూ, సిరివెన్నెలన్నయ్య, ఆయనా వున్నప్పుడు – “అద్భుతంగా ‘పచ్చని చిలకలు వెంటుంటే’, ‘ఇదేలే… తర తరాల చరితం’ రాయగలడు అన్నయ్య… మళ్ళీ ‘మొన్నా కుట్టేసినాది… నిన్నా కుట్టేసినాది’ అంటాడెందుకో” అని సిరివెన్నెలన్నయ్య ఆటపట్టిస్తే, మా భువనచంద్ర గారు వెన్నెలలా నవ్వి, “మరి పగలంతా రిక్షా తొక్కినవాడూ, కాయకష్టం చేసినవాడూ, రాత్రి మన తెలుగు సమాసాలతో, చమత్కారాలతో రాసిన పాటలు ఏం అర్థం చేసుకుంటారు చిన్నబ్బాయ్? ‘బంగారు కోడిపెట్టా’ అంటే శ్రమ మరిచిపోయి చిందులేస్తాడు” అన్నారు. ఆయనని సిరివెన్నెలన్నయ్య ‘బూచాడు’ అని ముద్దుగా పిలుచుకునేవారు! ఆయన సిరివెన్నెలన్నయ్యని ‘చిన్నబ్బాయ్’ అనీ, వెన్నెలకంటి గారిని ‘బుల్లెబ్బాయ్’ అనీ పిలుచుకునేవారు! ఇద్దరూ వెళ్ళిపోయారని నిన్న నాతో మాట్లాడ్తూ కంటతడి పెట్టారు!

సో… రంజుగా ఆ విధంగా సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. మా నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ మొదటిసారిగా, నాటాకి డాలస్ వస్తున్నట్లు నాగబాబు గారు నాతో చెప్పారు. మా ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ గారు, పాపం, పరిచయం చెయ్యమని చాలా అడిగారు కానీ, నేను చివరి రోజు బహుమతీ, అవార్డుల ప్రదానం దాకా వరుణ్‍ని కలిసి మాట్లాడే అవకాశం రాలేదు! మా తమ్ముడు డొక్కా ఫణి తీసిన ‘పల్లకి’ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో అవార్డు పొందిందని, హరీష్ శంకర్ ద్వారా నాకు అప్పటికే తెలుసు! తను న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్‌కి. ఫణి డొక్కా పేరు పిలిచినప్పుడు, తను రాలేదు కాబట్టి, ఆ అవార్డ్, స్టేజ్ ఎక్కి నన్ను తీసుకోమన్నాడు. అలా స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకున్నప్పుడు, వస్తూ నేను వరుణ్‍ని పలకరించాను. మా ‘సీతామాలక్ష్మి’ షూటింగ్స్‌లో, తండ్రి దగ్గరకి వచ్చినప్పుడు, ఆ సీరియల్ రైటర్‍గా నేను పరిచయమే వరుణ్‍కి! ఆ విధంగా నేను ఫణి అవార్డు అందుకున్నాను! అసలు ‘పల్లకి’ ఆలోచన రాగానే ఫణి నాతోనే ఆ ఆలోచన పంచుకున్నాడు. నేనే బడ్జెట్ వేసి ఇచ్చాను! తు.చ. తప్పకుండా అంతే బడ్జెట్ అయినందని తన ఆనందాశ్చర్యాలు ప్రకటించడమే కాకుండా, నా పేరు కూడా ఆ ఫిల్మ్ టైటిల్స్‌లో ‘ప్రత్యేక కృతజ్ఞతలు’లో వెయ్యడం అతని పెద్ద మనసు!

వరుణ్ తేజ్‌తో రచయిత్రి

వరుణ్ “నాన్న చెప్పారు ఆంటీ, మీరూ వచ్చారని ముందే తెలుసు” అని మాట్లాడాడు.

డాలస్‌లో లిటరరీ మీట్ తరువాత ‘ఎందుకీ సందె గాలి?’ అనే నా నవల ఆవిష్కరణ జరిగింది, తోటకూర ప్రసాద్ గారి చేతుల మీదుగా. వంగూరి చిట్టెన్‌రాజు మొదలైన పెద్దలు అందులో పాల్గొన్నారు.

ఎందుకీ సందె గాలి? – నవల ఆవిష్కరణ

అలా డాలస్‍లో నాటా ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకున్నాకా – మా రమక్క కానీ, మా బావ భార్య సత్య కానీ అప్పుడు అక్కడ లేని కారణంగా – ముందే పి.వి.రామారావు, సుజనా పాలూరీ ఇంటికి వెళ్ళడానికి నిశ్చయం అయింది. రామారావు గారు వచ్చి రెడీగా వుండడంతో వారింటికి వెళ్ళిపోయాను. అక్కడ సుజనా, మాధవ్ దుర్భాల తల్లి గారు కూడా వున్నారు. సీతామాలక్ష్మి సీరియల్ మాత్రం ఆవిడకి గుర్తు వుంటుందని చెప్తే నేను చాలా ఆనందపడ్డాను. నేను వస్తున్నాను అని శాంతి దేవరకొండ అనే స్నేహితురాలిని కూడా సుజన ఆ రోజు లంచ్‍కి ఆహ్వానించింది. ఆ శాంతి అల్‌రెడీ ప్రోగ్రామ్‍లో నాతో ఫోటో కూడా తీయించుకుంది. సుజనని ‘అక్కా’ అని పిలవమని నేనే అడిగాను.

కొంతమందిని చూస్తే అలా పిలవమని అనాలనిపిస్తుంది. సుజన ఇంట్లో మేథ్స్ ట్యూషన్స్ తీసుకుంటుంది. రామారావు గారు అప్పడు ఎయిర్‍లైన్స్‌లో పని చేసేవారు. తర్వాత మా ఇంటికొచ్చి నాకు ‘మార్క్ జేకబ్స్’ అనే స్మార్ట్ వాచ్ ప్రెజెంట్ చేసి, అందులో వర్క్ చేస్తున్నానని చెప్పారు. ఆయన ‘సప్లై చైన్స్’లో వుండేవారు. వారికిద్దరు ముచ్చటైన పిల్లలు, మౌనిక, ప్రబంధ్. పిల్ల మెడిసిన్ చేస్తోంది. బాబు స్కూల్‍లో చదువుతున్నాడు. సుజన కొత్త ఆవకాయ ఫస్ట్ టైమ్ పెట్టిందట, కొత్త ఘాటుతో భలే వుంది. ఇంకా చాలా ఐటమ్స్ చేసింది. మేం చాలా కబుర్లు చెప్పుకున్నాకా, గమ్మత్తుగా, వంతెనలా వున్న మార్గంలో నడుస్తూ బెడ్ రూమ్ చేరుకుని నిద్రకి ఉపక్రమించాను. నా చిన్న హేండ్ లగేజ్ ఎటాచీ చూసి సుజన, “దీన్లో మూడు రోజుల ప్రోగ్రామ్‍కి బట్టలూ, జ్యూవెల్రీ ఎలా సర్దుకొచ్చావ్ అక్కా?” అని తెగ ఆశ్చర్యపోయింది. చాలామంది నా సూట్ కేస్ చూసి “ఇన్ని ఇందులో పట్టాయా?” అని ఆశ్చర్యపోతుంటారు. పైగా ఎన్నాళ్ళున్నా, ఒక్క బట్ట బయటకి పరవను. విడిచినవి కింద పెడ్తూ, కట్టుకోవలసినవి పైకి తెస్తూ, సూట్ కేస్, నా గదీ నీట్‍గా వుంచుతాను! ఫణి డొక్కా తరఫున నేనందుకున్న ఆ అవార్డును నేను సుజన దగ్గర వదిలి వచ్చాను. తర్వాత తాను తన తమ్ముడు మాధవ్ దుర్భా దగ్గరకి అట్లాంటా వెళ్ళినప్పుడు ఫణికి అందజేసింది.

మర్నాడు లిటరరీ సమావేశంలో మాట్లాడిన వాళ్ళందరినీ చంద్రా కన్నెగంటి గారు లంచ్‍కి ఇన్వైట్ చేసారు. కల్పనా రెంటాల, అఫ్సర్, ఇంద్రాణీ పాలపర్తి, ఇస్మాయిల్ సుహైల్, జంపాల చౌదరీ గారు, రవిశంకర్ విన్నకోటా… ఇంకా చాలామందిమి వెళ్ళాం. ఒక రెస్ట్ రూమ్ పాడయి వుంది. అందులోకే వాళ్ళ అమ్మాయి నన్ను పంపిందని, చంద్ర గారి మిసెస్ ఎంతో బాధపడి, సిగ్గుపడి, పదే పదే ‘సారీ’ అనడం నాకింకా గుర్తుంది! ఇంటి ఇల్లాలికి కొన్నిసార్లు అలా జరగడం పరిపాటే. టెక్నికల్ మిస్టేక్స్‌కి ఎవరం పట్టించుకోము, అంతలా బాధపడక్కర్లేదు అని చెప్పాను. అమెరికాలో వాళ్ళింట్లో కూడా రోలూ, తిరగలి లాంటివి చూసాను. ఆవిడ కూడా మంచి కుక్, హోస్ట్ కూడా! బోలెడు ఐటమ్స్ చేసారు. సాహిత్య గుబాళింపులతో ఆ మీట్ చాలా సందడిగా, బోలెడు ఫొటోలతో, ఇస్మాయిల్ గారి సెల్ఫీలతో జరిగింది! ఆయన్ని సెల్ఫీ కింగ్ అంటారని ఆయనే చెప్పుకున్నారు.

ఆ రాత్రికుండి, తెల్లారు ఝామున ఆరింటికే నా ఫ్లయిట్. సో… నాలుగింటికే రామారావు గారు తన టిఫిన్ బాక్స్‌తో సహా నన్ను తీసుకుని ఎయిర్‍పోర్ట్‌కి  బయల్దేరారు. సుజన పెట్టిన ఆ చీర నేను ఇప్పటికీ ఇంటర్వ్యూస్‌కి కట్టుకుంటాను. అంత నచ్చింది నాకు. మెరూన్‌కి ఆకుపచ్చ అంచు ఉప్పాడ చీర.

సుజన పాలూరి పెట్టిన చీరలో రచయిత్రి

అక్కడ నా కోసం ఆయన 50 డాలర్లు కట్టాల్సొచ్చింది, ఎందుకో సరిగా తెలీదు, స్పిరిట్ ఎయిర్‍లైన్స్ అది! మరి నా హేండ్ లగేజ్‍కేమో! నాకు చాలా మొహమాటంగా అనిపించింది.  ఎంత అడిగినా ఆయన నా దగ్గర తీసుకోలేదు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వడుగుకి నేనూ మా ఆయనా చెప్పకుండా వెళ్ళి వైజాగ్‍లో సర్‍ప్రైజ్ ఇచ్చాం! ఎంత ఆశ్చర్యపోయారో!

సుజన పాలూరి దంపతులతో, రచయిత్రి దంపతులు – వైజాగ్‌లో

మా అబ్బాయి పెళ్ళికి సుజన తమ్ముడు మాధవ్ దుర్భా కూడా అలాగే అనుకోకుండా వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు, పెద్ద గంటల గడియారంతో (పెండ్యూలమ్ క్లాక్‍తో). అలా నేను కాంతీ, కిరణ్ ప్రభ గార్ల ఇంటికి వెళ్ళడానికి, కేలిపోర్నియాలో డుబ్లిన్ (Dublin) ఫ్లయిట్ ఎక్కాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here