రెండు ఆకాశాల మధ్య-45

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“మీ[/dropcap]రేమనుకోనంటే ఓ మాటడుగుతాను జనాబ్. అమ్మాయికి చిన్నప్పటినుంచే ఈ జబ్బుందా?” అన్నాడు షరీఫ్.

“లేదు. నా కూతురు చాల చలాకీగా ఉండేది. చాలా తెలివిగలది. చదువులో ఎప్పుడూ ఫస్టుండేది.”

“మరి…” షరీఫ్ తన ప్రశ్నను పూర్తిచేయకుండానే అతని వైపు చూశాడు.

“మా జీవితాల్లో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన అది.. అందమైన పూలతోటలో నవ్వుతూ తుళ్ళుతూ విహారం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పిడుగుపడి అంతా బూడిద చేసినట్టు.. మా బతుకుల్లో కూడా ఒక రోజు పెను విషాదం చోటుచేసుకుంది.”

ఉస్మాన్‌ఖాన్ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంలోకి జారిపోయాడు. గతాన్ని నెమరేసుకుంటున్నాడేమో అనుకున్నాడు షరీఫ్. అతను కళ్ళు తెరిచి షరీఫ్ వైపు చూశాడు. కానీ అతని చూపు ఎక్కడో దిగంతాల్లో ఉందన్న విషయం షరీఫ్ గమనించాడు. తెల్లగా పండిపోయిన కనుబొమలకింద ముడతలు పడి అలసినట్టు కన్పిస్తున్న కనురెప్పల మీద విషాదవర్ణమేదో చిక్కగా పులిమేసినట్టు ఉండటాన్ని కూడా గమనించాడు.

ఉస్మాన్‌ఖాన్ గొంతు సవరించుకున్నాడు. “దేశ విభజన సమయంలో నేను ఢిల్లీలోని సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. నా వయసప్పుడు దాదాపు నలభై యేళ్ళు. సచివాలయంలోని ఉద్యోగుల్ని, అధికారుల్ని రెండు దేశాల మధ్య పంచడం పూర్తయింది. ఎక్కువమంది విషయంలో వాళ్ళు కోరుకున్న ప్రకారమే విభజన జరిగింది. నాతోపాటు మరికొంతమంది ముస్లిం ఉద్యోగులు, అధికార్లు ఢిల్లీలో ఉండిపోవడానికే నిశ్చయించుకున్నాం.

పంజాబ్‍ని రెండుగా చీల్చి ఓ భాగం పాకిస్తాన్‌కి, మరోభాగం హిందూస్తాన్‌కి పంచడంతో రగులుకున్న నిప్పు ఆగష్ట్ నెలంతా మారణహోమం సృష్టిస్తూనే ఉంది. పశ్చిమ పంజాబ్ నుంచి తూర్పు పంజాబ్‌కి వలస వచ్చే హిందువుల్ని, సిక్కుల్ని ముస్లింలు వూచకోత కోస్తున్నారు. తూర్పు పంజాబ్ నుంచి పాకిస్తాన్‍కి పారిపోతున్న ముస్లింలని సిక్కులు విచక్షణారహితంగా మట్టుపెడ్తున్నారు.

సెప్టెంబర్ ఆరు.. శనివారం.. ఢిల్లీలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ పాత ఢిల్లీ నగరంలో ఉన్న ముస్లిం నివాసాలన్నీ అగ్నికి ఆహుతి కాసాగాయి. ఢిల్లీకి ఉత్తరం వైపు ఆకాశమంతా నారింజ రంగు పులుముకుని అంటుకున్న అడవిలా కన్పించసాగింది. కర్ఫ్యూ ఉన్నప్పటికీ విశాలమైన ఢిల్లీ రోడ్ల మీద విచ్చుకత్తులో సిక్కులు, ఖాకీ నిక్కర్లు ధరించిన హిందువులు చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి తిరుగుతున్నారనీ, ముస్లింలు కన్పిస్తే చాలు నరికి పడేస్తున్నారని వార్తలు రాసాగాయి.

వాళ్ళు ముస్లిం గుమాస్తాలు, ప్యూన్లు నివసించే ప్రభుత్వ వసతి గృహాల్ని గుర్తించి దాడులు చేస్తున్నారు. ముస్లింలు నివసించే యిళ్ళమీద, ముస్లిం పనివాళ్ళున్న యిళ్ళమీద పడి, ముస్లింలని బైటికి లాగి చంపేస్తున్నారు. సిక్కుల గుంపొకటి బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ యింటి ముందు గుమికూడింది. దానిక్కారణం పాకిస్తానీ ప్రభుత్యోద్యోగుల్ని ఢిల్లీ నుంచి కరాచీకి బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో తరలించడమే.

మరునాడుదయానికల్లా విధ్వంసకారులు మరింత రెచ్చిపోయారు. ఢిల్లీ నగరంలోని రోడ్లన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతున్న సిక్కులో నిండిపోయాయి. ముస్లింల రక్తంతో వీధులు తడిచిపోసాగాయి. ఓ గుంపు బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానాలు నడిచే పాలం విమానాశ్రయాన్ని చేరుకుంది. మరొక గుంపు విల్లింగ్‌టన్ ఎయిర్‌పోర్ట్ లోని రన్‌వేని దిగ్బంధించింది. న్యూఢిల్లీ లోని కెథడ్రల్ ఎదురుగా ఐదుగురు ముస్లింలని నరికేశారు. కన్నాట్ ప్లేస్ లోని ముస్లింల వ్యాపార కేంద్రాలన్నీ దోపిడీకి గురయ్యాయి. ఆ రోజు రాత్రి పదిగంటలకల్లా ఢిల్లీలోని ఆస్పతులు హిందువుల శవాలతో, వాటితో పోలిస్తే మూడురెట్లు అధికంగా ఉన్న ముస్లింల శవాలతో నిండిపోయాయి.

జవహర్‌లాల్ నెహ్రూగారు ప్రధానమంత్రి బాధ్యతలతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా వ్యవహరించేవారు. నేను సచివాలయంలో అదే మంత్రిత్వ శాఖకు సంబంధించిన సెక్షన్లో పనిచేస్తూ ఉండటంతో వారి గురించిన చాలా విషయాలు తెలుస్తూ ఉండేవి. కన్నాట్ ప్లేస్‌లో ముస్లింల వ్యాపార సంస్థల్లో లూటీ జరుగుతున్న రోజు నెహ్రూగారు సమాచారమందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్నారట. లూటీ జరుగుతున్న స్థలంలో నిలబడి తమకేమీ సంబంధం లేనట్టు నిరాసక్తంగా చూస్తున్న పోలీసుల్ని చూడగానే ఆయన కోపంతో మండిపోయారట. ఒక పోలీస్ చేతిలోంచి లాఠీని లాక్కుని గుంపుని తరిమే ప్రయత్నం చేశారట.

ఢిల్లీ పోలీసులు కూడా సిక్కులు చేస్తున్న హింసాకాండని పరోక్షంగా సమర్థిస్తున్నారని వార్తలు రావడంతో నా భార్యా పిల్లలు భయపడసాగారు. ప్రాణభయంతో ముస్లిం ఉద్యోగస్థులు ఆఫీసులకెళ్ళడం మానేశారు. బస్సులు, ట్యాక్సీలు, టాంగాలు ఎక్కువగా నడిపేది ముస్లింలే కాబట్టి అవన్నీ ఆగిపోయాయి. నలభై ఎనిమిది గంటల్లో ఆస్పత్రుల్లోని మార్చురీలన్నీ శవాల గుట్టలతో నిండిపోయాయి. పదులకొద్దీ శవాలు రోడ్ల మీద దిక్కులేకుండా పడిఉన్నా వాటిని పట్టించుకునేవాళ్ళే కరువైనారు.

“మనం ఢిల్లీలో ఉండొద్దు. పాకిస్తాన్ వెళ్ళిపోదాం. అక్కడైతేనే మనకూ మన పిల్లలకు రక్షణ దొరుకుతుంది” అంది నా భార్య.

“పాత ఢిల్లీలోని సబ్జీమండి నుంచి పాకిస్తాన్‌కు చాలామంది వలస వెళ్తున్నారట అబ్బాజాన్. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్న మిగిలిన ముస్లిం కుటుంబాల వాళ్ళని కూడా తమ యిళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మనీ, ఇక్కడే ఉంటే వాళ్ళని రక్షించడం తమవల్ల కాదనీ పోలీసులు హెచ్చరిస్తున్నారట. మీరు కూడా పాకిస్తాన్ సెక్రటేరియట్‍లో పని చేయడానికి మీ అంగీకారాన్ని తెలియచేయండి. మనకు ఢిల్లీ సురక్షితమైన ప్రదేశం కాదనిపిస్తోంది అబ్బాజాన్” అంది పదహారేళ్ళ నా కూతురు మదీహా.

“ఇక్కడి ప్రభుత్వం ఢిల్లీలోని ముస్లింలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది అబ్బాజాన్. మనం వెళ్ళి పోవడమే మంచిది” అన్నాడు నా కొడుకు ఖాలిద్. వాడికి రెణ్ణెల్ల క్రితమే ఇరవై యేళ్ళు నిండాయి.

వాడు ప్రభుత్వాన్ని నిందించినందుకు నాకు బాధేసింది. ఢిల్లీలో ముస్లింల రక్షణ కోసం నెహ్రూ పడ్తున్న ఆరాటం తెల్సినవాడ్ని కాబట్టి వాడి అభిప్రాయంతో ఏకీభవించలేకపోయాను. కొన్ని లక్షలమంది స్వాతంత్ర్యయోధుల ప్రాణత్యాగాల తర్వాత, ఎన్నో అహింసాపోరాటాల తర్వాత సాధించుకున్న స్వతంత్ర భారతంలో ముస్లింలు హిందువులు కలిసిమెలసి ఉండాలనేది నెహ్రూగారి కోరిక.. కళలకు, కవిత్వానికి, సంగీతానికి, శిల్పకళానైపుణ్యానికి, గొప్ప సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఢిల్లీ ముస్లింలను పాకిస్తాన్‌కి ధారాదత్తం చేయడం వారికి సుతరామూ ఇష్టం లేదు. యిళ్ళలోంచి పారిపోయి, శిబిరాల్లో తలదాచుకుంటున్న దాదాపు రెండు లక్షల మంది ముస్లిం శరణార్థుల్ని పాకిస్తాన్‌కి తరలించకుండా నచ్చచెప్పి, నమ్మకం కలిగించి, వాళ్ళని వాళ్ళ యిళ్ళకు తిరిగి రప్పించాల్సిన అవసరం ఉందని నెహ్రూగారు తన మంత్రివర్గ సహచరులతో వాదించిన విషయం కూడా నాకు తెలుసు.

ఢిల్లీలో నివసించే సిక్కులు, హిందువుల్తో పాటు పాకిస్తాన్ నుంచి పారిపోయి శరణార్థులుగా ఢిల్లీలో తలదాచుకున్న రెండు లక్షలకు పైగా హిందువులు కూడా ప్రతీకార జ్వాలల్లో రగిలిపోవటం.. పోలీసులూ మిలట్రీ జవాన్లలో కూడా చెదపురుగులా చేరిన మత విద్వేషం.. పాత ఢిల్లీలోని సబ్జీమండిలో ముస్లింలు మారణాయుధాల్ని యిళ్ళల్లో పోగేసి హిందువుల పైనా పోలీసులపైనా ప్రతిదాడికి దిగడం.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని నీరు కార్చటంలో ముఖ్య భూమిక పోషించాయి. ఒక సమయంలో నెహ్రూ గారు సిక్కులు ధరించే క్రిపాణాన్ని నిషేధించాలని ప్రయత్నించి విఫలమైనారు.

ప్రస్తుతం నగరంలో నెలకొని ఉన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్‌కి వెళ్ళాలనే నిర్ణయానికొచ్చాను. మా మొహల్లాలో ఉన్న ముస్లిం కుటుంబాలతో పాటు నేను కూడా నా భార్యాపిల్లల్ని తీసుకుని పురానా ఖిలాలో ఏర్పాటు చేసిన శరణార్థ శిబిరానికి చేరుకున్నాను. దాన్ని శరణార్థ శిబిరం అనటం కన్నా పందుల దొడ్డి అనటం భావ్యంగా ఉంటుంది. నేను చేరే సమయానికే అక్కడ దాదాపు యాభై వేల మంది ముస్లింలు ఉన్నారు. ఒకర్నొకరు తాకుతున్నంతగా క్రిక్కిరిసిపోయి.. నేలంతా బురద.. లైట్లు లేవు.. టాయిలెట్లు లేవు.. తాగడానికి నీళ్ళు లేవు.. తినడానికి తిండి లేదు… గేటు దగ్గర రక్షణగా కొంతమంది పోలీసుల్ని మాత్రం ఉంచారు. అంతే..

“ఈ శిబిరంలో ఉండటం చాలా దుర్భరంగా ఉంది అబ్బాజాన్.. మనం తొందరగా పాకిస్తాన్‌కి ఎలా వెళ్ళాలో ఆలోచించండి” అంది మదీహా.

మా యింట్లో తనకో ప్రత్యేకమైన గది ఉండేది. వయసులో ఉన్న పిల్ల.. ఏకాంతంతో పాటు గోప్యత అవసరమైన వయసు.. శిబిరంలో ఆ రెండింటికీ అవకాశం లేదు. స్నానం చేయడానికి లేదు. బట్టలు మార్చుకోడానికి లేదు. జైలుకన్నా అధ్వాన్నం.. మదీహా పరిస్థితే కాదు అక్కడున్న అందరు ఆడవాళ్ళ పరిస్థితీ అదే. గాయపడినవాళ్ళ, రోగగ్రస్థుల మూల్గులు విషాద సంగీతంలా విన్పిస్తూనే ఉన్నాయి. వాళ్ళకు అవసరమైన వైద్య సదుపాయం అందడం లేదు. కడుపుతో ఉండి నెలలు నిండిన ఆడవాళ్ళకు అక్కడే ప్రసవాలు జరుగుతున్నాయి. బయట ప్రవేశద్వారానికి కొద్ది దూరంలో సాయుధ సిక్కులు గస్తీ తిరుగుతున్నారు. ఆహారపదార్థాలు మోసుకొస్తున్న వాహనాల్ని వాళ్ళు మధ్యలోనే ఆపేస్తున్నారు.

కొన్ని పత్రికలు మా శిబిరాన్ని బెల్సన్ లోని నాజీ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌తో పోల్చినపుడు నేను భయంతో వణికిపోయాను. ఆ క్యాంప్‌లో జరిగిన ఘోరాల గురించి, దురాగతాల గురించి నేను చదివిన విషయాలు గుర్తొచ్చాయి. యుద్ధ ఖైదీల కోసం నిర్దేశించిన ఆ క్యాంప్ లోని కొంత భాగాన్ని నాజీలు కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌గా కూడా వాడటం మొదలెట్టారు. అక్కడ బంధించబడిన లక్షా ఇరవై మందిలో యాభై వేల మంది చంపబడ్డారు. కలుగుల్లా ఉన్న గదుల్లో వేలమందిని కూరటం వల్ల, తిండి లేకపోవడం వల్ల, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, క్షయ, టైఫాయిడ్, విరేచనాల వల్ల దాదాపు ముప్ఫయ్ ఐదు వేల మంది చనిపోయారు. 1945 ఏప్రిల్‍లో బ్రిటీష్ సైనికులు అందులో మిగిలిఉన్న ఖైదీలకు విమోచన కల్పించినపుడు ఆ ఖైదీల్లో ఎక్కువ మంది చావుకి దగ్గరగా ఉన్నట్టు కనుగొన్నారు. వాళ్ళతో పాటు పదమూడు వేల శవాలు క్యాంప్ పరిసరాల్లోనే చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి విస్తుపోయారు.

ఇక్కడినుంచి తొందరగా బైటపడకపోతే మేము కూడా మాయదారి రోగాలేవో సోకి చచ్చిపోవడం ఖాయమనిపించింది. పాకిస్తాన్ వెళ్ళడానికి వీలున్న మార్గాల గురించి సమాచారం సేకరించాను. పాకిస్తాన్‌కి వలస వెళ్తున్న వ్యవస్థీకృత శరణార్థుల సమూహాన్ని కాఫీలాలంటారు. కొన్ని కాఫీలాలు యాభై మైళ్ళ దూరం వరకు వ్యాపించి ఉన్నాయని విన్నాను. వాళ్ళతో కలిసి వెళ్తామని మొదట నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈ కాఫీలాలకు రక్షణగా కొంతమంది సైనికులు నియోగించబడ్డారు కాబట్టి సురక్షితంగా వెళ్ళిపోవచ్చనుకున్నాను.

నేనలా నిర్ణయానికి వచ్చిన రోజే ఓ వార్త తెల్సింది. దాదాపు రెండున్నర లక్షల మందితో ఓ కాఫిలా ఈస్ట్ పంజాబ్ నుంచి లాహోర్‌కి ప్రయాణమైంది. వాళ్ళు లాహోర్ చేరుకోవాలంటే సిక్కులకు కోటలాంటి అమృతసర్‌ని దాటాలి. అప్పటికే అమృతసర్ అంతా పశ్చిమ పంజాబ్ నుంచి వలస వచ్చిన, ప్రతీకారంతో రగిలిపోతున్న హిందువుల్తో, సిక్కుల్తో నిండి ఉంది. ‘ఒక్క ముసల్మాన్ని కూడా ప్రాణాలతో బార్డర్ దాటనివ్వం’ అని అందరూ ప్రతిన బూని, చేతుల్లో ఆయుధాలు ధరించి, దాదాపు పదివేల మంది సిక్కులు, హిందువులు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.. కాన్వాయ్‌కి రక్షణగా ఉన్న అరవై మంది సైనికులు వాళ్ళని నిలువరించలేక పోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే పంజాబ్ లోని మట్టి రోడ్లు శరణార్థుల రక్తంతో ఎర్రబడ్డాయి. సైనికులందరూ హతమైనారు. చెల్లాచెదురుగా పడి ఉన్న తెగిపడిన కాళ్ళూ చేతులు, తలలేని మొండాలతో ఆ ప్రాంత మంతా భీతావహంగా కన్పిస్తోందని వార్త..

ఏదైనా కాఫిలాతో కలిసి వెళ్ళాలనుకున్న నా నిర్ణయాన్ని మార్చుకున్నాను.

పాత ఢిల్లీ నుంచి మేముంటున్న శిబిరానికి రావాలంటే మింటో బ్రిడ్జ్ దాటాలి. ఆ బ్రిడ్జ్‌కి యిరువైపులా సిక్కులు విచ్చుకత్తుల్తో వేచి ఉన్నారట. యిళ్ళనీ, ఆస్తిపాస్తుల్ని వదిలేసి, శరణార్థుల శిబిరానికి వలస వస్తున్న ముసల్మాన్లు బ్రిడ్జి దగ్గరకు రాగానే ఆకస్మికంగా దాడి చేసి చంపేస్తున్నారని కూడా తెలియవచ్చింది. శిబిరం దాటి బైటికెళ్తే ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం సన్నగిల్లింది. మరికొన్ని రోజులు ప్రాణాలు ఉగ్గబట్టుకుని గడిపాం.

ఓ వారం లోపల ప్రభుత్వం గూర్ఖా మరియు దక్షిణ రాష్ట్రాలకు చెందిన సైనికుల సాయంతో ఢిల్లీలో చెలరేగిన మారణహోమాన్ని అదుపు చేయగలిగింది. వాలంటీర్ల సాయంతో రోడ్లన్నీ శుభ్రం చేయబడ్డాయి. రేషన్ దుకాణాలు తెర్చుకున్నాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఢిల్లీలో నివసిస్తోన్న ముస్లింలకు ప్రభుత్వం పైన నమ్మకం పోయింది. భారత రాజధానిలో వాళ్ళకూ వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయానికొచ్చారు. ముసల్మాన్లు ఎవరైనా బైటికొస్తే వాళ్ళ ప్రాణానికి భరోసా ఇవ్వలేని స్థితి నెలకొని ఉందనీ, పోలీసులు కానీ సైనికులు కానీ వాళ్ళపైన జరుగుతున్న దాడిని అడ్డుకుంటారన్న నమ్మకమేదీ లేదన్న నిశ్చయానికొచ్చారు.

ఢిల్లీ వదిలి పాకిస్తాన్ వెళ్ళాలనుకునే ముస్లిం ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన రైళ్ళను ఏర్పాటు చేసింది. ఆ రైళ్ళలో రక్షణ కోసం సాయుధులైన జవాన్లు కూడా ప్రయాణిస్తారు. అవి బయల్దేరే వేళలు కానీ, అవి ప్రయాణించే దారులు కానీ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వాటిల్లో ప్రయాణించడమే అన్ని విధాలుగా మంచిదనిపించింది.

కానీ సిక్కులు వాటి సమాచారాన్ని ఎలాగో తెలుసుకుని, తమ మారణకాండను నిరాటంకంగా సాగించారు. చివరికి అమృతసర్ స్టేషన్లోకి మరికొద్ది నిమిషాల్లో రైలు రాబోతోందన్న సమాచారాన్ని లౌడ్ స్పీకర్ల మీద ప్రకటించేంతగా వాళ్ళు సమాచార వ్యవస్థని ఏర్పాటుచేసుకున్నారు.

సెప్టెంబర్ ఇరవై, ఇరవై ఒకటి శనాదివారాల్లో నాలుగు రైళ్ళు ఢిల్లీ నుంచి లాహోర్‌కి బయల్దేరాయి. వాటిని సిక్కులు మధ్య దారిలో ఆపి, ప్రయాణీకుల్ని వూచకోత కోశారు. కొన్ని రైళ్ళమీద ఒకసారి కాకుండా పలుసార్లు దాడి జరిగింది. రైలు బోగీలు రక్తపు మడుగుల్లా మారిపోయాయి. మరో రైల్లో ప్రయాణిస్తున్న రక్షణ సిబ్బందికీ, సిక్కులకూ మధ్య దాదాపు గంట సేపు హోరాహోరి పోరాటం జరిగాక, చివరికి ఆధిపత్యం సిక్కుల వశమైంది. ఆ రైల్లో ప్రయాణిస్తున్న పదిహేను వందలమంది వధించబడ్డారు. అందులో ఎనిమిదేళ్ళు పైబడిన అరవై రెండు మంది పసిపిల్లలు కూడా ఉన్నారు.

శవాల గుట్టల్ని, రక్తపు మడుగుల్ని మోసుకుంటూ నాలుగు రైళ్ళు ఒకదాని తర్వాత ఒకటి లాహోర్ స్టేషన్ చేరుకోవటంతో ముసల్మాన్లు ఆగ్రహోదగ్రులైనారు. ప్రతీకారం కోసం రగిలిపోయారు. అదే రోజు రాత్రి లాహోర్ నుంచి అమృతసర్ బయల్దేరిన రైలు హిందూ ప్రయాణీకుల శవాల్ని, కాళ్ళూ చేతులు తెగి రక్తమోడుతున్న క్షతగాత్రుల్ని మోసుకుంటూ అమృతసర్ స్టేషన్ చేరుకుంది.

ఈ సమాచారమంతా తెలియడంతో నాకేం చేయాలో తోచలేదు. ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలా ఉంది మా పరిస్థితి. ఢిల్లీలో ఉండిపోయినా చావు తప్పదనిపిస్తోంది. పాకిస్తాన్‌కి వెళ్ళే ప్రయత్నం చేసినా మధ్య దారిలోనే ముక్కలుగా తెగిపడటం తధ్యమనిపిస్తోంది.

“దీని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం అబ్బాజాన్. మనం పాకిస్తాన్‌కు వెళ్దాం. ఒకవేళ మధ్యలోనే చావొస్తే రానివ్వండి. ఇక్కడే ఉండి చావుని కొనితెచ్చుకునే బదులు మన గమ్యం చేరుకునే ప్రయత్నంలో చనిపోయామన్న తృప్తయినా ఉంటుందిగా. ఐనా అలానే జరుగుతుందని ఎందుకనుకోవాలి? అంతా సవ్యంగా జరగొచ్చుగా. ఒకవేళ ప్రాణాల్లో పాకిస్తాన్ చేరామనుకోండి. అంతకన్నా కావాల్సిందేముంది?” అంది మదీహా.

“నాక్కూడా అదే మంచిదనిపిస్తోంది అబ్బాజాన్” అన్నాడు ఖాలిద్.

అల్లా మీద భారమేసి సెప్టెంబర్ ఇరవై రెండున ఢిల్లీ నుంచి లాహోర్‌కి బయల్దేరిన స్పెషల్ ట్రెయిన్లో నా కుటుంబంతో పాటు ఎక్కి కూచున్నాను. అదే లాహోర్‌కు వెళ్ళే చివరి ట్రెయిన్ అనీ, కొన్ని రోజులవరకు మరో రైలుని నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనీ ఎవరో ప్రచారం చేయడంతో రైలు మనుషుల్లో క్రిక్కిరిసిపోయింది. ఏ బోగీలో చూసినా కాలు పెట్టడానికి కూడా అంగుళం స్థలం లేనంతగా మనుషులు.. రైలు పైభాగంలో కూడా మనుషులు గుంపులు గుంపులుగా ఎక్కి కూర్చున్నారు. ఓ బోగీలో టాయిలెట్ దగ్గర కొద్దిగా స్థలం దొరికితే నేనూ నా భార్యా ఇద్దరు పిల్లలు ఆ స్థలంలోనే ఒకర్నొకరం ఆనుకుని ముడుచుకుని కూచున్నాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here