[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]బ[/dropcap]జారులో స్కూలు యూనిఫారం కొనడం అయింది. సంహిత ఒక డజను కర్ఛీపులు కొని తనతో పాటు వచ్చిన ఫాతిమాకు ఇచ్చింది.
“అయ్యయ్యో నాకొద్దు” ఫాతిమా మొహమాటపడింది.
“ఫర్వాలేదు తీసుకో, కర్ఛీఫ్‍లేగా. ఏదో కారు కొన్నట్టు కంగారు పడతావేం.”
“మా అమ్మ చూస్తే ఎక్కడివి? ఏమిటీ అని అడుగుతుంది.”
“ఆమెకు చూపించకు. లేదూ ఆవిడకూ కొన్ని ఇచ్చేయ్” అంది సంహిత నవ్వుతూ.
ఫాతిమా కర్ఛీఫ్‍ల ప్యాకెట్ తీసుకుంది. స్కూలు నుంచి నాలుగడుగులు వేయగానే ఫాతిమా ఒక్కతే నడుచుకుంటూ కనిపించింది సంహితకు. ఫాతిమా ఇల్లు మెయిన్‍రోడ్‍లోనే చిన్న సందులో వుంటుంది. సంహిత ఆమెతో యూనిఫారాల షాపుకి వచ్చింది. ఇద్దరూ నడుస్తున్నారు.
“ఫాతిమా మీ ఇల్లెక్కడ?” సంహిత అడిగింది.
ఫాతిమాకు ఆమె తనతో పాటు తన యింటికి వస్తానంటే భయం వేసింది. పగలే చీకటిగా వుండే సందులోనుంచే తన యింటికి దారి. తన పైన ఇద్దరూ, తన తర్వాత ముగ్గురూ మొత్తం ఆరుగురు పిల్లలతో తన మూడు గదుల ఇల్లు సంహిత చూసిందంటే పారిపోతుంది.
“ఇప్పుడు కాదులే, మా యింటికి మరోసారి తీసుకువెళ్తాను. ఇప్పుడు మా ఇంట్లో చుట్టాలున్నారు. అయినా చీకటి పడుతోంది. నువ్వు ఆలస్యంగా ఇంటికి వెళితే మీ ఇంట్లో కంగారుపడరా”
“ఆ…. నిజమే! బాగా గుర్తుచేశావు. అవునూ… మన క్లాసులో ఎవరు బాగా చదువుతారు?”
“రవళి” వెంటనే జవాబు చెప్పింది ఫాతిమా.
“అలాగా… మీరందరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారా?”
“లేదు…. రవళి, జానకి మరో ఇద్దరో, ముగ్గురో ఒకే స్కూల్లో చదివారు. మిగతా అందరం సిక్స్త్ క్లాసు నుంచి కలిసి చదివాం. అసలు నువ్వు వచ్చేవరకు స్కూల్లో అందరికంటే అందగత్తె రవళి అనుకునేవాళ్ళం. నువ్వు వచ్చాక మీరిద్దరూ అందంలో పోటీ పడుతున్నారని అనుకున్నాం. అందులో నువ్వు ఆఫీసర్ గారి అమ్మాయివి, తను గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వారి అమ్మాయి. మీ ఇద్దరికీ డబ్బుకు లోటు లేదు. అందానికి లోటు లేదు”
ఆ మాటలకు నవ్వింది సంహిత.
“నీకు మాత్రం ఏం లోటులే, మంచి స్నేహశీలివి. పాపం ఇంటికి వెళ్ళడం లేటు అవుతున్నా, నాతో షాపింగ్‍కి వచ్చావు. మీ యింట్లో ఎవరెవరు ఉంటారు?”
చెప్పింది ఫాతిమా. ఆ సంఖ్య విని మనసులోనే ఆశ్చర్యపోయింది సంహిత. పిల్లలు ఆరుగురు, తల్లి తండ్రి, నాయనమ్మ కలిసి తొమ్మండుగురు. తమ యింట్లో ఎప్పుడైనా నలుగురు చుట్టాలు వస్తేనే చిరాకు తనకి. కానీ తన ఆలోచనలని బయటపడకుండా జాగ్రత్తపడింది సంహిత.
“అయితే నీకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి అన్నమాట మరి చెప్పలేదేం” అంటూ ఎదురుగా ఉన్న షాపులో చాక్లెట్లు, బిస్కెట్లు కొని ఫాతిమాకిచ్చి “సంహితక్క ఇచ్చిందని చెప్పు” అంది నవ్వుతూ.
“సరే నేను ఇంటికి పోతున్నా. నడిచే ఓపిక లేదు, ఒక రిక్షా మాట్లాడతావా”
ఫాతిమా రిక్షా మాట్లాడి సంహితను పంపించింది. ఎంత మంచిది సంహిత. ఆఫీసర్ కూతురిననే గర్వం లేదు. తనకి కర్ఛీఫ్‍లు, చిన్నవాళ్ళకి బిస్కెట్స్, చాక్సెట్స్ కొన్నది. అలా ప్రతి రూపాయి చూసుకోకుండా ఖర్చుపెట్టడం కూడా అదృష్టమే.
***
ఆగష్టు పదిహేను హడావిడిలో వుంది స్కూలు. ఆ స్కూల్లో కేవలం చదువుకే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి కూడా అవకాశం ఇస్తుంటారు. అయితే ఈ ఏడు 10వ తరగతి రెండు సెక్షన్స్ వాళ్ళని వీటికి దూరంగా ఉంచారు. ఆటల పోటీలలో, వ్యాసరచన పోటీలలో ప్రతి ఏడాది ఉండే పిల్లలు తమకు అవకాశం యివ్వనందుకు తిట్టుకున్నారు.
“ఈ ఏడాది నీ పాట వినే ఛాన్స్ మిస్సయ్యాము రవళి” అంది మాధవి.
“పోనీలే ఈ ఏడాది అయినా మిమ్మల్ని బాధపెట్టకూడదు అనుకున్నారన్న మాట” అంది రవళి నవ్వుతూ.
“అసలు ఈ పద్ధతి బాగోలేదు. మనం ప్రాక్టీసులో వున్నంత మాత్రాన చదువులు ఎప్పుడైనా మానేశామా” అంది కృపామణి.
“అసలు ఇప్పుడే మనకు ఎక్కువ ఛాన్స్ లివ్వాలి. వచ్చే ఏడు మనందరం ఎక్కడో ఏమో” అంది జానకి.
ఈ మాటతో అందరి మనసులు బరువెక్కాయి. అప్పుడే స్కూలు వదిలిపోతున్న బాధ కలిగింది.
“ఏం సంహిత నువ్వేం మాట్లడవేం” అడిగింది ఫాతిమా.
“తను ఈ ఏడాదేగా మన స్కూల్లో చేరింది. మనకున్నంత అనుబంధం తనకెందుకుంటుంది” అంది సుందరి.
సంహిత ఏమైనా అనుకుంటుందేమో అనుకుంది రవళి.
“మనిషికి అనుబంధం ఏర్పడడానికి సంవత్సరాలు కావాలా. మనం ఎప్పుడైనా పొరబాటున ఏ సినిమాహాల్లో నైనా కర్ఛీఫ్ మరిచిపోయాం అనుకోండి, అది తీసిచ్చిన మనిషిని ఆ కర్చీఫ్ వాడిన ప్రతిసారి గుర్తుచేసుకుంటామే, అలాంటిది ఏడాది చదివిన స్కూలు మీద నాకు బెంగ వుండదా” అంది సంహిత.
అందరూ సుందరిని కాస్త కోపంగా చూశారు.
“అయితే ప్రతిసారీ మన రవళి పాటలను రవళిస్తుందన్న మాట. నాకే వినే భాగ్యం లేదన్న మాట” అంది సంహిత.
ఆమె సుందరి మాటల్ని తేలికగా తీసుకోవడం అందరికీ నచ్చింది. ముఖ్యంగా రవళి క్లాసులో ఉన్న ముఫ్ఫై అయిదుమందిలో సంహిత వేరుగా, తన ఆలోచనా ధోరణి మెచ్యూర్డ్‌గా వుంటుంది. అందుకే కోపం తెచ్చుకోలేదు. రవళి ఆలోచనల్లో మునిగిపోయి సంహిత బయటకు వెళ్ళడం గమనించలేదు. దొరక్క దొరక్క దొరికిన ఖాళీ పిరియడ్‍ను అందరూ కబుర్లతో సద్వినియోగం చేసుకుంటున్నారు.
రెండురోజులు గడిచిపోయాయి. ఫిజిక్స్ బుక్ తీసి చదువుకుంటున్న రవళిని సంగీతం టీచర్ పిలుస్తున్నారంటూ సముద్రాలు పిలుచుకు వెళ్ళాడు. వెంటనే సంగీతం క్లాసులోకి వెళ్ళిన రవళి
“గుడ్ మార్నింగ్ టీచర్” అంది కాస్త జంకుగా.
సంగీతం రూమ్ స్టాఫ్ రూంకి వెనుకగా ఉంటుంది. నిజానికి ఆ స్కూల్లో వీణ, వయోలిన్ లాంటి మంచి వాయిద్యాలు వున్నాయి. కానీ వారానికి ఒక క్లాస్ జరిగే ఆ టైం టేబుల్‍లో సంగీతం ఎలా వస్తుంది. తల వంచి ఏదో నోట్స్ చూస్తున్న టీచర్ తల ఎత్తి కాస్త సీరియస్‍గా
“ఏమిటమ్మాయ్, పాట పాడాలని నీకు వుంటే నువ్వే వచ్చి చెప్పొచ్చుగా? ఆ కొత్త పిల్ల చెప్పడం ఏమిటి?”
రవళికి ఆమె అనేది అర్థం కాలేదు.
“ఏమిటలా చూస్తావ్? మీ క్లాస్‌లో కొత్తగా చేరిందే ఆ అమ్మాయి పేరేమిటి?”
“సంహిత”
“ఆ…. ఆ పిల్లే నీ చేత ఎలాగైనా ఈ ఏడాది పాట పాడించాలని ఒకటే గొడవ.”
రవళి నిర్ఘాంతపోయింది. తనకీ విషయం తెలియదు. ఎలాగో గొంతు సవరించుకుని ఆ మాటే చెప్పింది. కానీ ఆవిడ నమ్మినట్టు కనపడలేదు.
“సరేలే… ఆ పిల్ల రిక్వెస్టు మీద, ఈ స్కూల్లో ఇది నువ్వు చదివే ఆఖరి ఏడాది అని ఒప్పుకుంటున్నాను” ఆవిడ జాలి తలుస్తున్నట్టు.
రవళికి చెప్పలేని ఆనందం కలిగింది. కానీ బయటపడకూడదు. “టీచర్ మరి పాట” అంది.
“మీ క్లాస్ వాళ్ళకి ఈ ఏడాది నేను నేర్పకూడదు, హెడ్ మిస్ట్రెస్ అలా చెప్పారు. ఏదైనా పాట ప్రిపేర్ అవ్వు చూద్దాం. మేడమ్ ఒప్పుకోవాలి.”
“సరే టీచర్”
“ఆఁ, రెండు రోజుల్లో ఆ పాట తీసుకురా, నేను చూడాలి. సినిమా పాటలు పాడకూడదు.”
“అలాగే టీచర్” ఆమెకు వెళ్ళాలో వద్దో తెలియలేదు. అక్కడే నిలబడి వుంది.
“ఇంకా ఇక్కడే నిలబడ్డావ్ క్లాసు లేదూ”
రవళి రిలీఫ్‍గా ఫీలై రూంలోంచి బయటకొస్తుంటే హిందీ టీచర్ ఎదురయ్యారు. ఆమెకు విష్ చేసి గడపదాటింది.
“ఈ పిల్ల ఎందుకొచ్చినట్టు” అడుగుతోంది సంగీతం టీచర్‍ను.
“ఏముంది, పాట పాడుతుందట. ఈమెకు మరో పిల్ల రికమండేషను.”
“బాగుంది, పిల్లలకు బాగా ధైర్యం ఎక్కువైంది.”
“ఆ….. నాకు కాస్త కోపం వచ్చింది గాని ఆఖరు ఏడాది అని ఒప్పుకున్నాను.”
“అవున్లే”
ఈ సంభాషణ అంతా రవళికి వినపడింది. తమ స్కూలు గురించి సంహితకు ఇంకా తెలిసినట్టు లేదు. ఇది మామూలు స్కూలుకి ఎక్కువా, మిలటరీకి స్కూలుకు తక్కువ. ఇలా టీచర్‍తో తామెప్పుడు మాట్లాడలేదు. ఈ ఏడాదితో స్కూలు వదిలేస్తున్నామని ఊరుకుని వుండవచ్చు. లంచ్ టైములో తన ఆనందాన్ని సంహిత దగ్గర వెలిబుచ్చింది.
“అబ్బా ఏమిటి ఇంత చిన్న విషయానికి ఇంతలా థాంక్స్ చెప్పాలా?” అంది సంహిత.
“అహా, అలా అనకు. ఇక్కడ చదివిన అయిదేళ్ళలో ఎప్పుడూ మేము టీచర్ల మాటకు ఎదురుచెప్పలేదు. అసలు సంగీతం టీచర్‍తో తలెత్తి మాట్లాడలేదు.”
“ఆ…. ఏం మాట్లాడితే, తల తీసేస్తారా.. ఒకటి చెబుతాను విను రవళి. మనం తప్పు చేయనప్పుడు, తప్పు కాదు అనుకున్నప్పుడు దేన్నయినా ఎదిరించాలి, లేకపోతే బతకలేము”
ఇంతలో స్నేహ వచ్చింది.
“అబ్బా రోజూ లంచ్‍కి ఇంటికెందుకోయ్, మాతో పాటు ఇక్కడ తినొచ్చుగా” అంది సంహిత.
“మీ ఇల్లు దూరం కాబట్టి రోజూ లంచ్ తెచ్చుకుంటావ్, మా యిల్లు దగ్గరేగా” అంది స్నేహ.
“అదిగో అప్పుడే మీ చెల్లెలు తింటోంది” అంది స్నేహ, దూరంగా ఉన్న నీరజను చూపిస్తూ.
రవళి, స్నేహ యింటికి బయలుదేరారు.
“అదేమిటక్కా ఇద్దరూ కలిసి తినకుండా, విడివిడిగా….” అంది స్నేహ.
“వాళ్ళ సంగతి మనకెందుకు? నేను ఆగష్టు 15కు పాట పాడాలి. మంచి పాట సెలక్ట్ చెయి” అంది రవళి.
“ఈ ఏడాది మీ క్లాసు వాళ్ళని వద్దన్నారుగా”
“అదంతా సంహిత చూసుకుందిలే. మా క్లాసు నుండి నాకు మాత్రమే ఛాన్స్ వచ్చింది. అందుకే మంచి పాట పాడాలి” స్నేహ కొన్ని పాటలు చెప్పింది కాని అవి ఇద్దరికీ సంతృప్తికరంగా లేవు.
“ఏమిటే ఈవేళ మరీ లేటుగా వచ్చారు” అంది ఆదిలక్ష్మి.
“అబ్బా ఒక్కపూటైనా నీ ప్రశ్న మార్చమ్మా” విసుగ్గా అంది స్నేహ.
తల్లిని కూడా మంచిపాట సెలక్ట్ చేయమంది. సంహిత రికమెండేషను సంగతి చెప్పలేదు. ఆదిలక్ష్మి కూడా కొన్ని పాటలు చెప్పింది. అవి ఆమెకే నచ్చలేదు. పాట పూర్తిగా తెలియాలి. స్క్రిప్టు వుండాలి, ఎలా పాడాలో ట్యూన్ తెలియాలి. పాడటానికి సులువుగా వుండాలి.
రవళి ఇంటినుంచి క్లాసులోకి అడుగుపెట్టేసరికి సంహిత క్లాసులో ఒక్కతే కూర్చుని ఏదో రాస్తోంది. మిగతా పిల్లలందరూ గ్రౌండ్‍లో చెట్లకింద కూర్చున్నట్టున్నారు.
“ఏమిటి సంహితా అంత శ్రద్ధగా రాస్తున్నావ్.”
“ఏమిటా, లవ్ లెటర్.”
“ఏయ్ నిజంగానా, స్కూల్లో ఇటువంటివి రాయకూడదు.”
సంహిత నవ్వేసింది. “ఇంత అమాయకురాలివేమిటోయ్? ఎవరైనా ఇంత పబ్లిక్‍గా ప్రేమలేఖ రాస్తారా? రాసినా చెబుతారా.”
“ఏమోనోయ్, మా ఇంటిలో సరాదాకైనా అబద్ధం చెప్పకూడదు.”
“వెరీగుడ్, మంచి అలవాటు. ఇదిగో నువ్వు పాడవలసిన పాట. నీ రైటింగ్ అంత బాగుండదు నాది. అర్థమవుతుందో లేదో చూసుకో”
ఆ పాట చూసింది రవళి. అది కృష్ణశాస్త్రి గారి సాహిత్యం. ‘జయజయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి’.
“అమ్మో! ఇంత మంచిపాట, పెద్ద పాట నేను పాడగలనా”
“ఆహా బ్రహ్మాండంగా పాడగలవు.”
“ఎప్పుడో రేడియోలో వచ్చినప్పుడు విన్నాను, గుర్తులేదు.”
“పోనీ కేసెట్ వింటే”
“దానికి కేసెట్, టేప్ రికార్డర్ రెండూ ఉండాలి” అంది రవళి.
సంహిత ఏదో అనేలోపే హిందీ టీచర్ రావడంతో మాటలు ఆపేశారు.
***
ఎవరైనా మన మీద ఒక పని నువ్వు సాధించగలవు చేయగలవు అనే నమ్మకం పెడితే, అందుకు ఆ వ్యక్తి తనకు సాధ్యం కాని పని అయినా చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం రవళి అదే పరిస్థితిలో వుంది. ఆమె పాట పాఠశాల అంతా విన్నారు. బాగుందన్నారు. కానీ సంహిత వినలేదు. తనచేత గుర్తింపు పొందాలి. అవకాశం రాని ఈ సంవత్సరం కూడా తనకీ అవకాశం వచ్చేట్టు చేసింది సంహిత. ఆమె మెప్పుపొందాలి. అందుకని రోజూ ప్రాక్టీసు చేస్తోంది. అయినా ఏదో లోటు కనిపిస్తోంది. ఆ మాటే సంహితతో అంది. దానికి పరిష్కారం సూచించింది సంహిత.
“అదేమిటే, నువ్వొక్క దానివే వచ్చావ్? అక్కేది” అడిగింది ఆదిలక్ష్మి మొక్కలకు నీళ్ళు పోస్తూ.
“అక్క సంహితతో వాళ్ళింటికి వెళ్ళిందమ్మా. బుక్స్ నన్ను పట్టుకుపొమ్మంది.”
“వాళ్ళింటికెందుకు వెళ్ళింది? ఎక్కడ వాళ్ళ యిల్లు? బుక్స్ లేకుండా వాళ్ళిద్దరూ ఏం చేస్తారు?”
“అక్క స్కూల్లో పాట పాడుతోందిగా, అది నేర్చుకుందుకు వెళ్ళింది, వాళ్ళ యిల్లు ఎక్కడో నాకు తెలియదు. పార్క్ పక్క సందులో అనుకుంటా.”
“ఆ… అంతదూరమా? నువ్వెలా వెళ్ళనిచ్చావే, అమ్మ తిడుతుంది అని చెప్పొద్దా”
స్నేహకు విసుగొచ్చేసింది. “అబ్బా ఏమిటమ్మా ఈ ప్రశ్నలు? వెళ్ళక, వెళ్ళక అక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. వచ్చేస్తుందిలే.”
“అది కాదే అంత దూరం వచ్చేటప్పుడు ఒక్కత్తీ రావద్దూ.”
“మన ఇల్లు పార్కుకి రెండు వీధుల ఇవతల వుంటే, వాళ్ళ ఇల్లు పార్కుకి రెండు వీధుల అవతల వుంది. రాత్రి పదిగంటల దాకా జనం తిరుగుతూనే వుంటారు. ఏం భయం.”
“అంటే అది రాత్రి పదిగంటల దాకా ఇంటికి రాదా?” అంది ఆదిలక్ష్మి అర్థం లేకుండా.
“అమ్మా నన్ను లోపలికి వెళ్ళనిస్తావా? ఇక్కడే ప్రశ్నలు వేస్తూంటావా? నాకు నీరసంగా వుంది. టిఫినేం చేశావ్?”
స్నేహ యూనిఫాం మార్చుకుని కాఫీ, టిఫిన్ కోసం వంటయింట్లోకి వెళ్ళింది. ఆదిలక్ష్మి కాఫీ కలుపుతూ “అక్కతో నువ్వు వెళ్ళవలసిందే, పాపం ఒక్కత్తీ ఎలా వస్తుంది”
స్నేహ కోపం నషాళానికి అంటింది. “నాకు చాలా హోం వర్కు ఉందమ్మా. మా సైన్సు టీచరు బొమ్మలు వేసుకురమ్మన్నారు. మాకు సైన్సు ఎగ్జిబిషన్ వుంది”
“బాగుంది చిన్నక్లాసు చదివే నీకు చదువు, ఎగ్జిబిషను. పెద్ద క్లాసు చదివే దానికి పాటలు, పెత్తనాలు, బాగుంది”
స్నేహకి మాట్లాడాలనిపించలేదు. ఒక్కసారి ఒక్క చిన్నపని కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే స్వేచ్ఛ లేదా తమకి? తనకి ఆకలి వేస్తోందన్నా అమ్మ వినిపించుకోకుండా మాట్లాడిందే మాట్లాడుతూ వుంది. ఆమె అయిష్టంగానే బుక్స్ తీసింది. ఇక్కడ ఆదిలక్ష్మికి, రవళికి తెలియని విషయం ఒకటుంది. స్నేహ వయసు చిన్నదే కావచ్చు కానీ ఆమె ఆలోచనలు పాదరసంలా పరుగెడుతూ వుంటాయి. అందుకే అక్కగారికి రాని ఆలోచనలు ఆమెకు వస్తుంటాయి. అసలు రవళికి చదువు తప్ప వేరే ధ్యాస చాలా తక్కువ.
***
స్కూలు ఆవరణ చప్పట్లతో మారుమోగింది. రవళి పాడిన పాట జాతీయ జెండాలా వర్ణమయంగా ఉంది. గాలికి రెపరెపలాడుతూ వినువీధిని ఊరేగుతున్నట్టు అందరి మనసులని తాకింది. స్వతంత్రం శాశ్వతం కావాలన్నట్టు ఆ జ్ఞాపకం అందరి మనసుల్లో వుండిపోయింది. అందరూ రవళిని అభినందించేవాళ్ళే. రవళి చూపులు సంహిత మీద నిలిచాయి. సంహిత మాత్రం సంగీతం టీచరును చూస్తోంది. ఆవిడ కళ్ళల్లో కలిగే కోపాన్ని ఆశ్చర్యాన్ని చూస్తోంది. ఆమెకు చాలా గర్వంగా కాస్త సంతృప్తిగా ఉంది. పాట రవళి పాడినా, పేరు ఆమెకే వచ్చినా తెలియని వాళ్ళు ఈ పాట సంగీతం టీచరే నేర్పారనుకుంటారు. కానీ నిజం తనకి, స్నేహకి, రవళికీ తెలుసు. అందరూ రవళిని మెచ్చుకుంటుంటే ఆ మెప్పు తనది కాదు.
“చాలా చాలా థ్యాంక్స్ సంహిత, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. కానీ ఈ ఘనత అంతా నీదే.”
“వెరీగుడ్. మంచి తెలుగు స్టూడెంట్‍వనిపించావు. ‘సంహిత ఆమె ఘనత’ అని ఒక సినిమా తీయవచ్చు” అంది సంహిత నవ్వుతూ.
“నిజమేనోయ్, అంతమంచి పాట పాడకపోయినా ఫర్వాలేదు, పాడుచేయకుండా వుంటే చాలు.”
“పాడెందుకు చేస్తావ్ రవళి, నువ్వు ఎప్పుడూ బాగా పాడతావ్” అంది కృపామణి.
***
క్వార్టర్లీ పరీక్షలు కూడా అయిపోయాయి. సంహితకు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. అంతవరకూ అందం, అలంకరణ మీద శ్రద్ధ చూపేవాళ్ళంటే కాస్త మంచి అభిప్రాయం వుండేది కాదు రవళికి. వాళ్ళు చదువుకు ప్రాధాన్యత ఇవ్వరని అనుకునేది. కానీ సంహితను చూశాక తన అభిప్రాయం మార్చుకోవలసి వచ్చింది.
ఆ రోజు సంహిత స్కూలుకి రాలేదు. రవళికి చెప్పకుండా సాధారణంగా బడి మానదు.
నలుగురు కూర్చుని మాట్లాడుకోవలసి వచ్చినప్పుడు అక్కడ లేని ఐదో మనిషి గురించి మాట్లాడుకోవడం లోక సహజం. అందుకని ఈ రోజు సంహిత గురించి మాటలు మొదలుపెట్టారు.
“ఏమిటోయ్, సంహితకి తన మేకప్‍కి అంత టైం ఎలా వుంటుందో” అంది కామేశ్వరి.
“అది మేకప్ కాదు తన ఒంట రంగే అంత, బంగారంలా వుంటుంది” అంది రవళి.
“సహజమో మేకప్పో నీకే తెలియాలి. ఏమైనా మన టీచర్‍లు కూడా తనని ఏమీ అనడం లేదు” అంది మాధవి.
ఆమె ఎనిమిదవ తరగతిలో ఉండగా వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారని వాళ్ళ దగ్గర లిప్‍స్టిక్ వుంటే వేసుకుని స్కూలుకి వచ్చింది. ఆ లిప్‍స్టిక్‍ని చూసి టీచర్లందరూ మాధవిని తిట్టారు. పైగా తను తెలివైన పిల్ల కూడా కాదు.
“మేకప్‍కి చాలా టైం పడుతుంది. అంత టైం మనలా పొద్దున్నే స్కూలుకి వచ్చేవాళ్ళకు వుంటుందా” అంది రవళి.
“తను పెద్ద ఆఫీసరు గారి అమ్మాయి. వాళ్ళకు వంటవాళ్ళు, పనివాళ్ళు వుంటారు” అంది ఫాతిమా.
వాళ్ళు సంహిత గురించి అలా మాట్లాడటం రవళికి నచ్చడం లేదు. కానీ వాళ్ళని ఎలా ఆపాలో కూడా తెలియడం లేదు. ఇంతలో తెలుగు టీచర్ క్లాసులోకి వచ్చారు. ఆమె వెనుకే సముద్రాలు నోటీసు పట్టుకు వచ్చాడు. ఆమె చదివి వినిపించారు. ఆ నోటీస్ ప్రకారం ఈనెల 15వ తేదీ నుండి రోజూ స్పెషల్ క్లాసు వుంటుంది. అంటే ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకూ ఒక క్లాసు ఆ తర్వాత అరగంట చెప్పిన సబ్జెక్టు మీద చిన్నపరీక్ష. పదిగంటలకు మామూలుగా ప్రేయర్. ఆ తర్వాత సాధారణ టైం టేబుల్. మళ్ళీ సాయంత్రం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకూ మరో క్లాస్. టెన్త్ క్లాసు పిల్లలు అలా ప్రిపేర్ అయి స్కూలుకి రావాలని నోటీసు సారాంశం.
ఇంక చెప్పేదేముంది, అందరి గుండెల్లో రాయి పడింది. రవళి బాధ వేరు, ఇదంతా సంహితకి ఎలా చెప్పాలి? ఒకవేళ తను రేపు కూడా స్కూలుకు రాకపోతే, కృపామణి ఇల్లు సంహిత ఇంటికి కాస్త దగ్గర. కానీ తను వెళ్ళి చెబుతుందా? పోని తనే వెడితే…. సంహితను చూసినట్టూ ఉంటుంది. ఈ రోజు నోట్సులు ఇచ్చినట్టూ ఉంటుంది. ఈ విషయం చెప్పినట్టు ఉంటుంది. రవళికి ఉత్సాహం వచ్చింది. ఆమె స్నేహకి చెప్పి సంహిత ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి సంహిత పేముకుర్చీ చెయ్యి మీద కూర్చుని ఫోన్లో మాట్లాడుతోంది. ఒక కాలు ఊపుతూ ఒక చేత్తో ఫోను పట్టుకుంది. మరో చేత్తో పెన్సిల్‍తో కుర్చీమీద మంచి కులాసాగా వుంది. ఆమెను పిలవాలా వద్దా ఆ సందేహంలోనే మరికొంచెం దగ్గరగా వెళ్ళింది. సంహిత ఇంగ్లీషులో గడగడా మాట్లాడుతోంది. ఆమె యింత బాగా ఇంగ్లీషు మాట్లాడుతుందని రవళికి తెలియదు. అలా నిలబడి సంభాషణ వినడం పద్ధతి కాదు కాబట్టి చిన్నగా పిలిచింది. ఇటు తిరిగిన సంహిత కళ్ళల్లో రవళిని చూసిన ఆనందం, ఆశ్చర్యం. ఆమె తర్వాత మట్లాడతానని ఫోన్ పెట్టేసింది.
“రా..రా… అసలు నువ్వు వస్తావని అనుకోలేదు, ఎంత అదృష్టం.”
“ఫోన్ మాట్లాడుతున్నావ్, డిస్ట్రబ్ చేశానా”
“అహహ, అదేమీ లేదు. మా కజిన్ ఢిల్లీ నుంచి”
“అలాగా జ్వరం ఎలా వుంది”
“జ్వరం ఎవరికి? ఓ… నేను స్కూల్‍కి రాలేదనా. జ్వరం కాదు ఊరినుండి మా పిన్నీ, పిల్లలు వచ్చారు అందుకే రాలేదు” అంది నవ్వుతూ.
“హమ్మయ్యా ఒంట్లో బాగానే వుంది కదా! ఎందుకు స్కూలుకి రాలేదో అని వచ్చాను, ఇంక వెడతాను. ఆ… ఎల్లుండి నుండి మనకు ఉదయం 8.30కి స్కూలు. సాయంత్రం 5.30 గంటలదాకా వుంటుంది. ఆ మాట చెబుదామని వచ్చాను. ఇంక వెడతాను.”
“ఉండు కాస్త కాఫీ తాగి వెడుదువుగాని.”
“ఆలస్యమైతే అమ్మ కంగారు పడుతుంది.”
“ఫర్వాలేదు”
ఆమె లోపలికి వెళ్ళి పనిపిల్లను వెంటబెట్టుకుని వచ్చింది. ఆమె తెచ్చిన ట్రేలో రెండు ప్లేట్లతో ఉప్మా, గాజు గ్లాసులతో మంచినీళ్ళు, అది టీపాయ్ మీద పెట్టి పనిపిల్ల వెళ్ళిపోయింది.
“నాకు వద్దు సంహితా, ఇంటికి వెళ్ళాలి.”
“నీకు ప్రత్యేకంగా చెయ్యలేదు, మాతోపాటే” ఒక ప్లేటు తీసి రవళి చేతుల్లో పెట్టింది.
నిజానికి రవళికి ఆకలిగానే వుంది. ఆ ఉప్మా చూస్తూనే తినాలనిపించేట్టు వుంది. జీడిపప్పు, నెయ్యి, సన్నగా అల్లం కొత్తిమీర పక్కనే కొబ్బరి చట్నీ. సంహిత మరోసారి చెప్పడంతో తినసాగింది. తినడం పూర్తయ్యింది ఇద్దరూ. ప్లేటు, గ్లాసు టీపాయ్‍పై మీద పెట్టారు. తమ యింట్లో లాగ వీళ్ళింట్లో మడి, అంటూ అనే బాధ లేనట్టుంది.
(ఇంకా ఉంది)