[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
‘సహృదయ’ సంస్థ పరిచయం చేసిన సాహిత్య – సాంస్కృతిక రంగాల పెద్దలు..!!
[dropcap]మ[/dropcap]నం పుట్టిన ప్రదేశం, అక్కడి వాతావరణం, రక్తసంబంధీకుల, బంధువుల నేపథ్యం, పరిసరాల ప్రభావం మొదలైన అంశాలకు భిన్నంగా మనం పెద్దయిన తర్వాత ఊహించని విషయాలు మనల్ని అల్లుకుపోతాయి. అలా కావడానికి చాలా విషయాలు మనపై ప్రభావం చూపించవచ్చు. చాలామటుకు, మన చుట్టుతా వున్న వాతావరణం, స్నేహితులు, సమకాలికులు, ఆయా అంశాలపైనా ఎక్కువగా మక్కువ ఏర్పడడం వంటివి మన మీద ప్రభావం చూపించవచ్చు. బాల్యంలో వున్నపరిస్థితులకు, జీవితంలో స్థిరపడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండడం వల్లనే ఎన్నో ఊహించని మార్పులు మనలో కనిపిస్తాయి. మనకు ఈ విషయంలో ఏమీ అనిపించదు.
కానీ, మన చిన్నతనం నుండీ మనల్ని గమనిస్తున్నవారు మాత్రం తప్పక మనలో ప్రత్యేకంగా చేరిన కొత్త అంశాలకు లేదా విషయాలకు ఆశ్చర్యపోక తప్పదు. ఇందులో మంచీ – చెడ్డా, సమాన స్థాయిలోనే ఉంటాయి. అలా చిన్నప్పుడు అనుకున్నవి పెద్దయ్యాక జరగకపోవచ్చును. అదేవిధంగా చిన్నప్పుడు అనుకోనివి, వూహించనివి, పెద్దయ్యాక జరిగి ఆశ్చర్యపరచవచ్చు. అయితే ద్యేయం, పట్టుదల గట్టిగావుంటే జరగక పోనివంటూ ఏమీ వుండవు.
కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతోపాటు కాలం కలిసి వస్తే, అనుకున్నవి తప్పక సాధించే అవకాశం కలుగుతుంది. ఒక విషయానికి గురిపెట్టి, దానిని సాధించడానికి అహర్నిశలూ శ్రమిస్తూ, ఓపిక పట్టుదల ఆయుధాలుగా చేసుకుని, ముందుకు సాగినవారికి ఫలితాలు లభించడంలో పెద్దగా గొప్ప అనిపించదు కానీ, ఇవేమీ లేకుండగానే ఊహించని జీవితం మనలో ప్రవేశిస్తే, అందులోని ప్రత్యేకతను తప్పక అందరూ ప్రత్యేకంగా అభినందిస్తారు. అలాంటి మార్పు తప్పక ఆ వ్యక్తిని గర్వపడేలా చేస్తుంది.
అలాంటిదేదో మన జీవితంలోనే జరిగినప్పుడు మనకూ ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఇంచుమించు అలాంటి జీవితాన్ని పొంది సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పొందిన, పొందుతున్న నా జీవితం ఒక ప్రత్యేక ఉదాహరణ గానే చెప్పడం అతిశయోక్తి కాదని నా నమ్మకం.
నా బాల్యంలో నన్నెరిగినవారు, నా బాల్య జీవితాన్ని గమనించిన వారు, ఇప్పటి నా జీవితాన్ని గమనిస్తున్నవారూ, నా జీవన మార్గంలో ఎదురొచ్చిన గోతులు -గొప్పులు గమనించినవారూ నా ప్రస్తుత పరిస్థితిని చూసి ఆశ్చర్య పోవలసిందే! అందుకు కారణం నేను బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలే! చాలామందికి నా చిన్నతనంలో అనారోగ్య కారణంగా ఎనిమిదవ తరగతిలోనే నా చదువుకు బ్రేక్ పడిందని తెలియదు, అలాగే సుమారు మూడు సంవత్సరాల పాటు హైదరాబాద్ లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరిగినట్టు తెలియదు. అలాంటి దురదృష్టకర సన్నివేశాలను ఎదుర్కొని, భవిష్యత్ జీవితం గురించిన నిరాశా నిస్పృహలు మదినిండా అల్లుకుంటున్న సమయంలో అంటే 1970-71లో ప్రైవేటుగా మెట్రికులేషన్ పరీక్ష పాసై తర్వాత నాగార్జున సాగర్‌లో అక్క దగ్గరవుండి, ఇంటర్మీడియెట్ (1972-74) చదువుకున్న తర్వాత, హైదరాబాద్ లోని (చింతల్ బస్తి)ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక సంవత్సరం బి.ఎస్.సి చదివిన తర్వాత, దంతవైద్యంలో డిగ్రీ పూర్తి చేయడం, ఆ తర్వాత ఉద్యోగం! వీటితోపాటు సాహిత్యాభిలాష, రచనా వ్యాసంగం నాతో కలిసి ప్రయాణం చేశాయి. మహబూబాబాద్ నుండి 1994లో హన్మకొండకు వచ్చిన తరువాత దంతవైద్యుడిగానూ, రచయితగానూ నాకు కొంత గుర్తింపు రావడం మొదలైంది. దానికి ప్రధానకారణం దంతవైదుడిని మాత్రమే కాకుండా వరంగల్ సాహిత్య/సాంస్కృతిక రంగాలకు నేను పరిచయం కావడమే కాక ఎందరో ఆయా రంగాలకు చెందిన మహానుభావులతో పరిచయం ఏర్పడడం, వారితో ఎన్నోసార్లు సభావేదికలను పంచుకునే అవకాశం రావడం కావచ్చు!
అలాంటి వాతావరణాన్ని నాకు పనిగట్టుకుని కల్పించిన ఆత్మీయులు, మహానుభావులు శ్రీ దర్భశయనం శేషాచార్య, ఆకాశవాణి మిత్రులు శ్రీ ఎం. దక్షిణామూర్తి గార్లు. ఆ మార్గంలో కవిత్వం వైపు కథలవైపు నన్ను ప్రోత్సహించిన వ్యక్తులు శ్రీ డా. శ్రీరంగ స్వామి, పాక్షికంగా శ్రీ నమిలికొండ బాలకిషన్ రావు (ప్రసారిక). సంస్థల పరంగా, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ప్రముఖంగా చెప్పాలి.
సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థలో కొద్దిరోజులు మాత్రమే సాధారణ సభ్యుడిగా కొనసాగినా, తర్వాత ఒకేసారి నన్ను ఆ సంస్థకి అధ్యక్షుడిని చేశారు. అలా వరుసగా పదమూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం నాకు దక్కింది. అలా ‘సహృదయ’ వల్ల చాలామంది గొప్పవారితో పరిచయాలు అయ్యాయి.
నేను సహృదయ సంస్థకు అధ్యక్షుడిగా వున్నంతకాలం ప్రధాన కార్యదర్శిగా సాహితీవేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ గారు ఉండేవారు. నిజగానే సంస్థకు ఆయన ప్రధాన వ్యక్తి (ప్రస్తుతం అధ్యక్షులు). ప్రతి కార్యక్రమానికి ఆయన కీలక పాత్ర వహించేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆయనకు తెలియని సాహిత్య కారుడుగానీ, పండితులుగానీ లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. అందుచేతనే సహృదయ సంస్థ నిర్వహించే ప్రతికార్యక్రమమూ వైవిధ్యంగా గొప్పగా, ప్రత్యేకంగా ఉండేవి. భేషజాలు లేని మహాపండితుడు ఆయన. ఆయన పరిచయము, ఆయనతో స్నేహమూ నా అదృష్టంగా భావిస్తాను. నేను అధ్యక్షుడిగా ఉన్నంతకాలము ఆయన అందించిన ప్రోత్సాహమూ, సహకారమూ మరువలేనివి, వెలకట్టలేనివీను. ఆయన నాకు స్నేహితుడు మాత్రమే కాదు, గురుతుల్యులు కూడా. నా మూడు పుస్తకాలకు ఆయన ముందుమాట రాయడం నా అదృష్టంగా భావిస్తాను. అప్పుడప్పుడు పలకరించి నాలో మరింత సాహిత్య పిపాసను ప్రేరేపించే సహృదయ మిత్రుడు శ్రీ గిరిజామనోహర్ బాబు.
సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ రూపకల్పన లోను, దాని ‘చిహ్నం’ (Emblem) రూపకల్పనలోనూ ప్రధాన పాత్రధారి, ప్రముఖ సాహిత్యకారుడు, అవధాని, నాటి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (తర్వాత తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా పనిచేశారు) స్వర్గీయ డా. కవితా ప్రసాద్ గారు. వీరు సహృదయ సంస్థ ద్వారానే నాకు పరిచితులు. అంతటి గొప్ప వ్యక్తి నాకు పరిచయం కావడం, ఆయన వరంగల్‌లో ఉన్నంత కాలం ఆ కుటుంబానికి నేను దంతవైద్యుడిని కావడం నా అదృష్టంగానే భావిస్తాను. ఒక గణితశాస్త్ర పట్టభద్రుడు, తెలుగులో అత్యున్నత స్థానానికి చేరుకోవడం వెనుక ఆయన చేసిన కృషి అసామాన్యమైనది. తెలుగు పండితులను మించిన జ్ఞానం ఆయన అవలీలగా పొందగలిగినారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు, అవధానాలు ఎందరో పండితులచే కొనియాడబడ్డాయి. అవధాన ప్రక్రియలోనే శ్రీ కవితా ప్రసాద్ పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందడం తెలుగువారి అదృష్టమే! ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
ఒక నవల రచయిత పేరును జనరల్ నాలెడ్జి అంశంగా వల్లెవేసిన నేను, ఆయన నివసిస్తున్న హన్మకొండలోనే స్థిరనివాసం ఏర్పరచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అంతమాత్రమే కాకుండా, ఆయనతో స్నేహం ఏర్పడుతుందని అప్పుడప్పుడు ఆయనతో వేదికలు పంచుకుంటానని, ఆయన కార్యక్రమాలలో ఉపన్యసిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆ అదృష్టం కలిగించింది మరి సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థనే! ఆయన ఎవరో కాదు. ఆయనే మన ‘అంపశయ్య’ నవీన్ గారు. ఎన్నోనవలలు, కథలు రాసి, మంచి ఉపన్యాసకుడిగా పేరుతెచ్చుకుని, కేంద్రసాహిత్య అకాడెమీ తదితర అవార్డులు పొందిన సాహిత్య కారుడు ఆయన.
తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి (ఈయన హాయాంలోనే మా పెద్దన్నయ్య కె కె మీనన్‌కు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందించింది) తెలుగు పండితుడు రచయిత, సహృదయమూర్తి శ్రీ పేర్వారం జగన్నాథం గారి పరిచయం కూడా సహృదయ ద్వారా జరిగినప్పటికీ, ఆయన పెద్దల్లుడు డా. రామ నర్సయ్య గారు జనగాం ఆసుపత్రిలో నా సహోద్యోగి కావడం మూలాన మా మైత్రి మరింతగా బలపడింది. నన్ను కథలు రాయమని ప్రోత్సహించిన సాహితీ పెద్దలలో జగన్నాదం గారు అతిముఖ్యులు. నన్ను ఎంతగానో అభిమానించిన సహృదయ సాహితీ మూర్తి స్వర్గీయ పేర్వారం జగన్నాథం గారు.
తెలుగు సాహితీ చరిత్రలో రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాని పండితోత్తములు, విశ్వనాథ వారి శిష్యగణంలో ముఖ్యులు వరంగల్ వాస్తవ్యులు శ్రీ కోవెల సంపత్ కుమారాచార్య, శ్రీ కోవెల సుప్రసన్నాచార్య. వీరిద్దరూ సహృదయ సంస్థతో పరిచయం అయినప్పటికీ, శ్రీ దర్భశయనం శేషాచార్య, మడిపెల్లి దక్షిణామూర్తి గార్ల చొరవతో, ఈ సాహితీ పండితులు ఇద్దరికీ దంతవైద్య సేవలు అందించే అదృష్టం నాకు కలిగింది. ఈ విషయంలో సంపత్కుమారాచార్య గారు బ్రతికినంత కాలం నన్ను గుర్తు చేసుకుంటూనే ఉండేవారు. పెద్దలు సుప్రసన్న గారు ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.
ఎప్పుడో బాల్యంలో హైదరాబాద్‌లో వున్నప్పుడు, పెద్దన్నయ్య ద్వారా రవీంద్ర భారతిలో, ధ్వన్యనుకరణ కార్యక్రమం చూసి (అదే మొదటి సారి) అప్పట్లో, ఆశ్చర్యము ఆనందమూ పొందాను. ఇలాంటి కళాకారులు కూడా కూడా వుంటారా? అనుకునేవాడిని. అలంటి విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారు సంచరించిన నేల మీద నా అడుగులు కూడా పడతాయని నేనెన్నడూ ఊహించలేదు. వారి స్నేహం, అభిమానం, ప్రేమ నాకు దక్కుతాయని నేను అనుకోలేదు. ఆయనతో సభావేదికలు పంచుకుంటాననుకోలేదు. ఇదంతా సహృదయ పుణ్యమే! నా శ్రీమతికి స్టేట్ బ్యాంక్‌లో (మహబూబాబాద్ మొదటి పోస్టింగ్) అనుకున్నచోట పోస్టింగ్ ఇప్పించే విషయంలో వేణుమాధవ్ గారి సహాయం ఎన్నటికీ మరువలేను. సహృదయ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్న జ్ఞాపకాలు నా మదిలో మిగిలివున్నాయి.
మూకాభినయం (మైమ్) నాకు ఒకప్పుడు తెలియని కళా ప్రక్రియ. నేను మహబూబాబాద్‌లో పని చేస్తున్న సమయంలో ఒక అంతర్జాతీయ మైమ్ కళాకారుని ద్వారా తెలుసుకోగలిగాను. వరంగల్ వచ్చినతరువాత మా స్నేహం సహృదయ ద్వారా మరింత బలపడింది. వారి శ్రీమతి కళావతి కవయిత్రిగా స్థిరపడడానికి కొంతవరకూ కారణం నేనే అనుకుంటాను. ఇంతకీ ఆ మైమ్ కళాకారుడు ఎవరంటే డా. కళాధర్. (ఈయన వరంగల్ వాసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు). వీరిపై ఒక వ్యాసం రాసే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తాను.
సితార్ అనగానే, అందరికి ముందు గుర్తుకువచ్చే గొప్ప వ్యక్తి శ్రీ పండిట్ రవిశంకర్. ఆయనతో పాటు నాకు గుర్తుకు వచ్చే మిత్రులు శ్రీ గుమ్మడి జనార్దన్ గారు. ఆయన సంగీత కళాశాలలో పాఠాలు చెప్పిన మంచి సంగీత ఉపాధ్యాయుడు. ఆయన ప్రత్యేక అంశం ‘సితార’ అయినప్పటికీ హార్మోనియం వాయించడంలో కూడా మంచి దిట్ట. దీనికి తోడు మంచి గాయకుడు కూడా. వీరి పరిచయం, స్నేహం కూడా నా అదృష్టమే! వీరి పరిచయ భాగ్యం కూడా సహృదయ సంస్థ ద్వారానే మరి!
వరంగల్ అనగానే ఇద్దరు సహృదయమూర్తులు గుర్తుకు వస్తారు. వారిద్దరూ లక్ష్మణ మూర్తులే! అందులో ఒకరు డా. లక్ష్మణ మూర్తి గారు, మరొకరు ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తి గారు. డాక్టర్ లక్ష్మణ మూర్తిగారు, వైద్యరంగానికి గర్వకారణమైన సహృదయమూర్తి. అల్లోపతితో పాటూ, అవసరం అనుకుంటే, ఆయుర్వేదం, హోమియో వైద్యం కూడా సిఫారసు చేయగల అపర ధన్వంతరి ఆయన. వైద్యుడికి ఎన్ని మంచి లక్షణాలు ఉండాలో అంతకు మించిన ఉత్తమ గుణాలు కలిగిన వైద్యుడు ఆయన. ఆయన వ్యక్తిత్వం, సంస్కారం ప్రత్యేకమైనవి. ఇలాంటి గొప్పవ్యక్తితో పరిచయం ఏర్పడడం నాలాంటి మామూలు వ్యక్తికి అదృష్టమే! ఎక్కడో ఒక్కరు ఇలాంటి వైద్యులు తారస పడుతుంటారు. ఆయన నివశించిన హన్మకొండలోనే నివసించడం నా అదృష్టం.
ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తిగారు వృత్తి రీత్యా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్లోపన్యాసకులుగా పదవీవిరమణ చేసిన బహుభాషావేత్త. ఆయన ఆంగ్లంతో పాటు, తెలుగు, సంస్కృత భాషలలో నిష్ణాతులు. సాహిత్యసభలలో నాకు ఏమీ తెలీదంటూనే, చాలామందికి తెలీని ఎన్నో ముఖ్య విషయాలు హాస్య ప్రధానంగా చెప్పడం వీరి ప్రత్యేకత. సాహిత్యపరంగా అపారమైన జ్ఞాన సంపద కలిగిన ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తిగారిని పరిచయం చేసింది కూడా సహృదయ సంస్థనే.
‘నా గొడవ’ కాళోజీ గారిని కూడా సహృదయ పరిచయం చేసినప్పటికీ ఎందుచేతనో వారితో ఎక్కువ దగ్గరితనం నాకు ఏర్పడలేదు. అది నా దురదృష్టం గానే నేను భావిస్తాను. కానీ ఎవరైనా, ఎప్పుడైనా వారి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు, “నేను.. కాళోజీ నివసించిన హన్మకొండలోనే స్థిరపడ్డాను” అని చెప్పడానికి గర్వపడుతుంటాను.
ఇలా చాలామంది కళాకారుల, సాహిత్యవేత్తల, ఇతర పెద్దల పరిచయాలు సహృదయ సంస్థ ద్వారా ఏర్పడినప్పటికీ, స్థలాభావం వల్ల ఇక్కడ అందరిగురించి రాయలేకపోతున్నాను. ఒక దంతవైద్యుడిగానే కాకుండా ఒక సాహిత్యాభిమానిగా, రచయితగా నాకు గురింపు తెచ్చింది, వరంగల్లు (హన్మకొండ) ముఖ్యంగా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అని చెప్పక తప్పదు. దీని వెనుక ఎందరో మహానుహావులు వున్నారు, వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
(మళ్ళీ కలుద్దాం)